సంస్కారం -రమాదేవి చేలూరు

రచన: యు.ఆర్‌.అనంత మూర్తి, జ్ఞాన్‌పీఠ్‌ అవార్డు గ్రహీత
తెలుగు అనువాదం: సుజాత పట్వారీ
ఒక మూస ధోరణికి విరుద్ధమైనది, సంచలనాత్మకమైనది, ఒక సమాజాన్ని గాఢంగా విమర్శించినది, మూఢాచారాల్ని తూర్పారబట్టినది, సెన్సార్‌ కత్తెరకు బలైనది, తర్వాత జాతీయ ఉత్తమ అవార్డులందుకున్న కథాంశమిది. అందుకే పరిచయం చేస్తున్నాను. కథ రచయితది. అభిప్రాయాలు, అభినందనలు, విమర్శలు లేక ఆక్షేపణలు మనవి.

సంచలనాత్మకంగా జీవించడం, రచనల్ని సంచలనాత్మకంగా రాయటం, ఈ కాలంలో ప్రత్యేకతనిపించుకోదు కానీ, 1960వ దశకంలో అది ఎంతో గొప్ప సంగతి. ఉధృత ప్రవాహానికి ఎదురీదినంత కష్టం. అనంత మూర్తి గారి జీవనం, రచనా వ్యాసంగం అందుకు ప్రబల నిదర్శనం. ఈ కథాంశంలో కొన్ని అతిశయాలున్నాయి. ఇది నా అభిప్రాయం మాత్రమే. భయాన్ని వదులుకొని, తార్కికంగా, హేతుబద్ధంగా, స్వేచ్ఛగా ఆలోచించమని చెప్పడానికే ఇలా రాశారనిపిస్తుంది నాకు.
నవల పరిచయం: తుంగభద్రా పరివాహక ప్రాంతంలో ఒక బ్రాహ్మణ అగ్రహారముంటుంది. దానిపేరు దుర్వాస అగ్రహారం. బ్రాహ్మణ వీథిలో పది కుటుంబాలుంటాయి. ప్రానేశాచార్యులు అనే పండితుడు, ఆయన గృహ ప్రాంగణంలో ప్రతి రోజూ సాయంత్రం పురాణ ప్రవచనాలు చెబుతుంటారు. ఆయన మాటంటే అందరికీ గౌరవం. ఆయన సౌమ్ముడు, మృదు భాషణతో అందరికీ తలలో నాలుకలా ఉంటాడు. ఆయనే వాళ్ళకు పెద్ద దిక్కు. ఆయన భార్య రోగగ్రస్థురాలు. ఆమెకు ఈయన సేవలు చేస్తుంటాడు. ఆమే అతని తపోభూమిగా భావిస్తూ ఉంటాడు. ఎంతో తేజస్సు, ముఖవర్చస్సుతో వెలిగే వేదపండిత శిరోమణి ఆయన.
ఆ అగ్రహారంలో నారాయణప్ప అనే బ్రాహ్మణుడు బ్రాహ్మణికాన్ని పాటించడు. పూజాచారాలు పాటించడు. పిలక పెట్టుకోడు. క్రాఫ్‌ చేసుకునేవాడు. ఆయన భార్య చనిపోయి ఉంటుంది. ఒక శూద్ర పడతితో సహజీవనం చేస్తుంటాడు. ఆమె పేరు చంద్రిక.
ఒకరోజు ప్రానేశాచార్యుల వద్దకు చంద్రిక వచ్చి నారాయణప్ప చనిపోయాడని చెబుతుంది. ఇక అప్పుడు మొదలవుతుంది అసలు కథ. ఆయన ఆ చావు వార్తను అగ్రహారంలో బ్రాహ్మణ వీథిలో అందరికీ తెలియచేస్తాడు. అందరూ అతని ఇంటి వద్ద సమావేశమవుతారు. నారాయణప్ప అంతిమ సంస్కారం ఎవరు చేస్తారు? ఎవరు చేయాలి? ఆయనకు పిల్లలు లేరు కాబట్టి దగ్గర బంధువులు చేయాలి, లేదా ఎవరైనా చేయవచ్చునని ధర్మశాస్త్రం చెబుతోంది. ఇలా తర్జన భర్జనలు జరుగుతాయి. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో వాదన చేస్తూ చనిపోయిన నారాయణప్పను తిట్టిపోస్తుంటారు. నారాయణప్ప భార్య చనిపోతే శూద్ర పిల్లతో సహజీవనం చేశాడని, మద్యం తాగి, మాంసం తిన్నాడని, తురకలతో స్నేహం చేసి, వాళ్ళతో కలిసి విందులు చేశాడని, వాళ్ళతో కలిసి చేపలు పట్టి వండుకు తిన్నాడని, బంధువుల పిల్లాడిని ప్రోత్సహించి మిలిట్రీలో చేర్పించి భ్రష్టు పట్టించాడని, మరో ఇంటి అల్లుడ్ని నాటకాల్లో చేరేందుకు ఆసక్తి కల్గించి పంపాడని, పక్క ఊరు పారిజాతపుర ప్రజలతో స్నేహం పెంచుకున్నాడని, వాళ్ళతో విందులు వినోదాలు చేశాడని అందరూ ఆయన మీద ఆరోపణలు గుప్పించారు. ఈ కారణాల వల్ల ఆయన అంతిమ సంస్కారం చేయమని అందరూ చేతులెత్తేశారు. చేస్తే కుల భ్రష్టులవుతామని, చేసిన వాళ్ళను ఊరినుండి వెలివేస్తారని భయపడ్డారు. బ్రాహ్మణ స్త్రీలు కూడా ఆయన అంతిమ సంస్కారం చేయడానికి విముఖత వ్యక్తం చేశారు.
ప్రానేశాచార్యులను, ధర్మశాస్త్రం ఏమి చెబుతోందో తాళపత్ర గ్రంథాలను తిరగేసి చూడమని వాళ్ళు అడిగారు. అంతేకాక, పక్క ఊరివాళ్ళు నారాయణప్పకు మంచి స్నేహితులు కనుక వాళ్ళు సంస్కారం చేస్తారేమో అడగాలనుకొని ఆ ఊరికి బయలుదేరతారు. అంతలో అక్కడ ఉన్న చంద్రిక తన ఒంటిమీదున్న నగల్ని ఒలిచి వాళ్ళ ముందు పెట్టి, సంస్కార ఖర్చులకు వినియోగించమంటుంది. అప్పుడు మళ్ళీ వాళ్ళలో కొత్త ఆశలు, ఆలోచనలు కలుగుతాయి. ఆ బంగారం కాజేసే ఎత్తులు మొదలవుతాయి.
ప్రానేశాచార్యుల అరుగు మీద చంద్రిక సేద తీరుతున్నప్పుడు దిండు, దుప్పటి ఇస్తాడాయన. ఎంతో మృదువుగా పిలిచిన చంద్రి అనే పిలుపుకు ఆమె ముగ్ధురాలవుతుంది. ఇలాంటి తేజస్సు, వర్ఛస్సు కలిగిన వేదపండితులతో కలిసి సంతానం కలగడం మంచిదని తన అమ్మ తనతో చెప్పడాన్ని గుర్తు తెచ్చుకుంటుంది. సంస్కారం కావాల్సిన తన సహచరుని కార్యం మిగిలుంది. ఆమె మనసు ఆ ప్రానేశ పండితుని మీదకు పోయింది. చంద్రికి ఆకలేసి తోటలో అరటి పండ్లు తిని, నదిలో నీళ్ళు తాగి వస్తుంది.
అందరికీ ఆకలి సమస్య మొదలైంది. సంస్కారం అయ్యేదాకా తినకూడదని నియమం. దానికి తోడు ఎండనబడి పక్కూరుకు నడిచిపోయి, వాళ్ళని బతిమాలడం. నారాయణప్ప చావు, బతుకు రెండూ సమస్యల్ని తెచ్చి పెట్టిందని తిట్టుకుంటారు. వాళ్ళలో రెండు తెగలుంటాయి. మధ్యువలు, స్మార్థులు. వీళ్ళు ఒకరంటే ఇంకొకరికి పడదు. పరస్పరం దెప్పి పొడుచుకుంటారు.
నారాయణప్ప భ్రష్టుడు, నీచుడు కాబట్టి పక్కూరు స్నేహితులే సంస్కారం చేయడానికి దిక్కన వాళ్ళుప్పుడు, మెరిసే బంగారంపైన ఆశతో సంస్కారం చేయడానికి ముందడుగు వేయసాగారు. మనూరువాడే, మన వాడే. తింటే తిన్నాడు, తాగితే తాగాడు, మనం వాడ్ని వెలేయలేం కదా అంటూ ధర్మసూత్రాలు వల్లించసాగారు. అగ్రహారం పెద్దదిక్కు ప్రానేశాచార్యులకు అదే మనవి చేశారు. తాళపత్ర గ్రంథాల్ని గబగబా తిరగేయమన్నారు. ఆపద్ధర్మ సూక్షాలు తప్పక దొరుకుతాయని మధ్వులు విన్నవించారు. స్మార్థులు పక్క ఊరి స్నేహితులతో సంస్కారం చేయించాలని పట్టుబట్టారు. ఎందుకంటే, వాళ్ళు కూడా స్మార్థులే కాబట్టి. కీలకం, కేంద్ర బిందువు, ఆకర్షణ అంతా చంద్రి ఇచ్చిన బంగారమే. అగ్రహారంలో రెండిళ్ళ స్త్రీలు బంగారానికి గట్టిగా గాలం వెయ్యసాగారు. ఇదివరకు నారాయణప్ప బతికున్న రోజుల్లో ఆయన్ని తిట్టిపోసినవాళ్ళే.
అగ్రహారంలో ఆకాశం నిండా, మిద్దెలు మేడల నిండా గద్దలు, రాబందులు వాలి, ఎలుకల్ని ముక్కున కరచుకుని పోతుంటాయి. సామాండ్ల గదుల నుండి, ధాన్యపు గదుల్లోను, ప్రతి ఇంట్లోను ఎలుకలు బయటికి వచ్చి చచ్చిపోతుంటాయి. నారాయణప్పకి సంస్కారం కానందున దెయ్యాలు, భూతాలు తిరగటం వల్ల ఇలాంటి వాతావరణం ఏర్పడిరదని అగ్రహారం ప్రజలు అనుకుంటారు. అది వాళ్ళ భయం, మూఢనమ్మకం మాత్రమే. వాస్తవంగా జరిగిందేమిటంటే అప్పుడు ప్లేగు అనే వ్యాధి ఆ ఊరికి ప్రబలుతోంది. నారాయణప్ప కూడా ప్లేగుతోనే మరణించి ఉంటాడు. అది తెలీదు వాళ్ళకు. ఆ ఇంట్లో కూడా ఎలుకలు చచ్చిపోయి ఉంటాయి. ప్లేగు ముందు ఎలుకలకు వస్తుంది, తర్వాత మనుషులకు సోకుతుంది.
రోగిష్టి భార్యకు సేవలు చేస్తూ తాళపత్ర గ్రంథాలను చూడడంలో నిమగ్నమయ్యారు ప్రానేశాచార్యులు. ఆయన అరుగు మీద చంద్రి పడిగాపులు కాస్తూ వీళ్ళు నారాయణప్పకు సంస్కారం ఎప్పుడు చేస్తారోనని ఎదురు చూడసాగింది. కొందరు అగ్రహారం బ్రాహ్మణులు పక్క ఊరికి కాలినడకన ప్రయాణమయ్యారు, వాళ్ళనన్నా నారాయణప్పకి సంస్కారం చేయవలసిందిగా అడగడానికి. అందరికీ ఒకటే ఆకలి, ఆకలి. కానీ తినకూడదు కదా! ఎటూ తేల్చుకోలేక, పక్క ఊరినుండి తిరిగి ఇంటికి వచ్చేస్తారు వాళ్ళు. ఇంట్లోని భార్యా పిల్లలను పుట్టిళ్ళకు పంపి, మగవారు చుట్టుపక్కల ఊర్లలో ఉన్న స్వాముల్ని, పీఠాధిపతుల్ని అడగడానికని, కాలే కడుపులతో కాళ్ళీడ్చుకుంటూ ఊరూరా తిరుగుతారు. ఒక పగలు, ఒక రాత్రి గడిచినా సంస్కారం కాలేదు. చంద్రి బంగారాన్ని ఆమెకు తిరిగి ఇచ్చేస్తాడు ప్రానేశాచార్యులు. ఆ విషయం మిగతా వారికి తెలీదు.
ప్రానేశాచార్యులు ఊరి బయటనున్న మారుతి ఆలయానికి వెళ్తారు. పూజ చేసి ధ్యానం చేసి దేవుణ్ణి అడుగుతాడు సంస్కారం గురించి. పూలు రాలే దిశను బట్టి నిర్ణయించాలి. పూలు రాలవు. కాబట్టి దేవుడు ఏమీ చెప్పలేదని నిరాశతో ఇంటికి తిరిగివస్తాడు. అమావాస్య చీకటది. ఆకలితో కళ్ళు తిరుగుతుంటాయి. చీకట్లో ఆయన కాళ్ళమీద పడబోయి మోకాళ్ళను కౌగిలించుకుంటుంది చంద్రి. ఆమె శరీరం ఆయనకు తగలటం వల్ల ఆయన చంద్రిని వాటేసుకుని, తర్వాత ఆమెతో అక్కడే లైంగిక సంబంధం పెట్టుకుంటాడు. అది ఆయనకు అనుకోని అనుభవం, తొలి అనుభవం. కానీ అది ఆమె అభిలాష. తర్వాత ఆయన ఎంతో ఆందోళన చెందుతాడు, అయోమయంలో పడిపోతాడు. ఎందుకు అలా జరిగిందని అనుకుంటాడు. సంస్కారానికి పరిష్కారం చెప్పలేకపోయాను, ఇంతలోనే ఇలా జరిగిందేమిటని విచారిస్తూ ఇంటికి వచ్చేలోపు ఇంట్లో భార్య ప్లేగుతో చనిపోయి ఉంటుంది. అది ప్లేగని ఆయనకు తెలీదు. ఊరిలో ఎవరూ లేరు. అతి కష్టం మీద ఆమెకు దహన సంస్కారాలు చేసి విరాగై అయోమయంలో ఏదో ఒక దారిన కాళ్ళు చెప్పిన చోటికి నడుస్తూ వెళ్తాడు ఆ చీకట్లో.
అప్పటికే చాలా ఆలస్యమయిందని, చంద్రి ఒక ముస్లిం స్నేహితుని సహాయంతో బండి తెచ్చి, కట్టెలు తెచ్చి, ఊరి బయట చీకట్లో నారాయణప్పకు సంస్కారం చేస్తుంది. ఊర్లో ఎవరూ దాన్ని చూడలేదు, ఎవరికీ చెప్పలేదామె. శ్రీపతి అని అగ్రహారం అల్లుడు నాటకాల వాళ్ళ చుట్టూ తిరుగుతూ అత్తారింటికి రాకపోకలు తగ్గిస్తాడు. హరిజన బెల్లీ యువతితో సంబంధాలుంటాయి అతనికి. అర్థరాత్రి హరిజన వాడకొస్తే ఆమె చెబుతుంది, ఈ హరిజనవాడలో భార్యాభర్తలు జ్వరం తగిలి చనిపోయారని, ఆ కొట్టానికి అగ్గి పెట్టారని చెప్పినా లెక్కచేయక, బెల్లితో ఆ బ్రాహ్మణ యువకుడు కామ వాంఛ తీర్చుకుని వెళ్ళిపోతాడు. అక్కడ కూడా ఎలుకలు చచ్చిపడిపోయి ఉంటాయి. అక్కడ ప్లేగు సోకి ఉంటుంది.
శ్రీపతి ఆ రాత్రి నారాయణప్ప ఇంటికి వస్తే ఆయన చనిపోయి ఉంటాడు. ఆ విషయాన్ని పక్క ఊరి మిత్రులకు చెబుతాడు. సంస్కారానికి సంబంధించి సమస్యలున్నాయని తెలుసుకొని, ఆ ఊరి స్నేహితులు ఆయన సంస్కారాన్ని ఎవ్వరికీ చెప్పకుండా అతి రహస్యంగా చేయాలని అర్థరాత్రి వస్తారు. ఇంట్లో భౌతిక కాయముండదు. భయపడి వెళ్ళిపోతారు. కానీ, ఆ విషయం ఊర్లో ఎవ్వరికీ చెప్పకుండా రహస్యంగా వాళ్ళ ఊరికి వెళ్ళిపోతారు. సంస్కారం ఎవరు చేయాలనే ధర్మ సంకటాన్ని మోస్తూ వెళ్తున్న అగ్రహారం బ్రాహ్మలకు ఊరూరా భోజనం దొరుకుతోంది. కొన్ని ఊర్లలో స్వాములందరూ చేతెలెత్తేస్తారు తెలీదని. చివరకు ఒకచోట పీఠాధిపతులు సమస్యకు పరిష్కారం చెబుతాడు. అదేంటంటే… నారాయణప్ప బ్రాహ్మణ్యం వదిలేశాడు కానీ, బ్రాహ్మణ్యం ఆయన్ను వదలలేదు. కులంలోనే ఉన్నాడు, బహిష్కృతుడు కాదు కాబట్టి, నిశ్చింతగా మీరు సంస్కారం చేసుకోండని చెప్పి పంపుతారు. దాంతో హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంటారు వాళ్ళు. వెంటనే అగ్రహారానికి పరుగులు పెడతారు. వాళ్ళలో ఒకరు అప్పటికే జ్వరం తగిలి పరాయి ఊర్లోనే చనిపోయి ఉంటాడు. అది ప్లేగు చావని వాళ్ళకు తెలియదు.
ఊర్లోకి వచ్చి ఇక సంస్కార కార్యక్రమానికి సిద్ధమవుతూ వాళ్ళ పెద్ద దిక్కు ప్రానేశాచార్యుల కోసం వెతుకుతూ ఉంటారు. కుళ్ళిన కాయాన్ని ఎలా తీయాలనే ఆందోళన వారిలో ఉంటుంది. చంద్రి ఆ కాయాన్ని సంస్కరించిందని వాళ్ళకెవరికీ తెలీదు.
ప్రానేశాచార్యులు అలా చీకట్లో వెళ్తూ ఆలోచిస్తూ ఉంటాడు. పుట్ట అనే ఆయన దారిలో కలుస్తాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఏదో ఊరు చేరతారు. అక్కడ జాతర జరుగుతుంటుంది. అక్కడ వాళ్ళు కాఫీ తాగుతారు. కోడిపందాలు చూస్తారు. ఇలా సద్బ్రాహ్మలు చేయకూడనివి చేస్తారు. అంతేకాక పుట్ట ఒక వేశ్యను పరిచయం చేస్తాడు. మళ్లీ వస్తానని ఆమెకు చెబుతారు కానీ, వెళ్ళడు. చంద్రి ఊరు వెళ్ళాలనుకుంటాడు కానీ వెళ్ళడు. తన అగ్రహారానికి వెళ్ళి, నారాయణప్ప సంస్కారం గురించి వాళ్ళనే తేల్చుకోమని సలహా ఇవ్వాలనుకుంటాడు. తర్వాత జరిగిదంతా చెప్పేసి, ఇక తను బ్రాహ్మణికాన్ని వదిలేద్దామనుకుంటున్నట్లు చెప్పాలనుకుంటాడు. అలాగే సంస్కార కార్యక్రమాన్ని తానే చేయాలని నిశ్చయించుకున్నాడు. వాళ్ళ ఊరువైపు వెళ్ళే ఎడ్ల బండిలో ఎక్కి ఊరు బయల్దేరతాడు.
ఇక్కడితో కథ ముగుస్తుంది.
ఇది 1965 సం.లో రాశారు. అప్పటికి షిమొగ్గ ప్రాంతపు కన్నడ బ్రాహ్మణ కుటుంబంలోని సంస్కృతీ సంప్రదాయాలు, మనస్తత్వాలను, ఆందోళనల్ని, అలవాట్లను, ఆచార వ్యవహారాలను, వాటిలోని డొల్లతనాన్ని, మూఢ విశ్వాసాల్ని, సంకుచితత్వాన్ని, ముఖ్యంగా భయాల్ని నవలలో పొందుపరిచారు.
ప్రానేశాచార్యులు అగ్రహారానికి పెద్ద దిక్కు. వేద పండిత శిరోమణి. ఒక సంకట స్థితిలో,
ఉపవాసంతో ఉన్నప్పుడు, ఒక స్త్రీ స్పర్శతోనే ఆమెతో శారీరక సాంగత్యం కలుగుతుందా? ఇదివరకు ఆమె పట్ల అటువంటి ఆలోచన గానీ, వ్యామోహం గానీ లేదు. ఇదెలా సాధ్యం! అతిశయమనిపించింది నాకు. ఈ కథలో ఆయన ఎంతో శీల సంపన్నుడు.
కానీ చంద్రితో నారాయణప్ప సహజీవనం చేయడాన్ని పురస్కరించుకొని అది మంచిది కాదని, మద్యం మాంసం, వేశ్యాలోలుడైనప్పుడు ఆయన కూడా సరైన దారిలో పెట్టడానికి ప్రయత్నించి
ఉంటాడు. కాబట్టి నాకు అలా అనిపించింది.
ఆ పాత్రలో మార్పును ఆశించాడు రచయిత. అందుకే ఆయన వ్యక్తిత్వాన్ని అలా మార్పు చేసి మలచాడని అర్థమైంది చివరికి.
సంస్కారం చేయాల్సిన కాయాన్ని అలాగే ఉంచి, సలహా కోసం బ్రాహ్మలు రోజుల తరబడి ఊర్లు పట్టుకు తిరగడం కూడా అతిశయమనిపించింది నాకు. బహుశా వాళ్ళ ఛాందస స్వభావం అంత తీవ్రంగా ఉందని చెప్పడానికే రచయిత అలా రాశారని అర్థం చేసుకోవాలి.
పఠాబి,ó స్నేహలత దంపతులు ఈ కథను 1967లో సినిమాగా తీసినపుడు సెన్సార్‌ వాళ్ళు బ్యాన్‌ చేశారు. తర్వాత అది 1970లో రిలీజయింది. జాతీయ ఉత్తమ సినిమాగా అవార్డు గెలుచుకుంది.
విశ్వ మానవాళి ఒక్కటే, అందరూ సమానమే. కులం, మతం, వర్గం, జాతి పేరున మనుషుల మధ్య ఇనుప అడ్డు గోడలు నిర్మించుకున్నాము. వాటిని నిర్దాక్షిణ్యంగా కూలదోసి, అందరితో కలిసిపోయి, స్వేచ్ఛగా, హేతుబద్ధంగా ఆలోచించి, స్నేహంతో, సహకారంతో, మానవత్వంతో మెలగాలని, మూఢాచారాల్ని విడనాడాలని, తార్కికంగా ఆలోచించమని మనకు ప్రబోధ చేశారు రచయిత.
నారాయణప్ప పాత్రల ద్వారా, వాళ్ళ సంభాషణల ద్వారా, కథ నడకలో, పాత్రల తత్వంలో ఈ ప్రబోధ విశదమవుతుంది.
సుజాత పట్వారీ గారి రచన, అనువాద రచనలా లేదు. ఇదే మూలం అనిపించేలా ఉంది. ఎంతో సహజంగా, ప్రవాహాన్ని తలపించే శైలిలో సాగింది రచన. ఈ పుస్తకం విశాలాంధ్రలో దొరుకుతుంది. నేను ఎప్పుడో అక్కడే కొన్నాను.
యు.ఆర్‌.అనంతమూర్తి గారికి స్మృత్యంజలి.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.