సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం ‘లతా మంగేష్కర్‌’ -కస్తూరి మురళీకృష్ణ

తండ్రి వద్ద సంగీతం నేర్చుకుంటున్న లత, తండ్రితో పాటు నాట్య వేదికను ఎక్కటం అత్యంత స్వాభావికంగా జరిగిపోయింది.
లతా మంగేష్కర్‌ తన సోదర సోదరీమణులతో కలిసి తండ్రి లేని సమయంలో ఇంట్లో నాటకాలు వేస్తుండేది. అంతేకాదు, అప్పుడప్పుడూ తండ్రి అనుమతితో భక్తి సినిమాలూ

ఆడుతుండేది. ‘తుకారాం’ సినిమా చూసి ‘తుకారాం’ బొందితో స్వర్గం వెళ్ళే దృశ్యాలను నకలు చేస్తుండేది. దిళ్ళను కొండలా పెట్టి దానిపై ఎక్కి తుకారాంలా పాటలు పాడేది. పక్క గదిలోంచి ఆమె చెల్లెళ్ళు మమ్మల్నీ వెంట తీసుకెళ్ళు అని సినిమాలోలానే పాడేవారు. వీళ్ళ సినిమా ఆటలన్నీ తండ్రి ఇంట్లో లేనప్పుడే. దీనానాథ్‌కు సినిమాలంటే ఇష్టం లేదు. దీనికి కారణం ఉంది.
ఆ కాలంలో సినిమాల పట్ల దురభిప్రాయం ఉండేది. మహాత్మాగాంధీ సైతం సినిమాలను ఇష్టపడేవారు కాదు. పైగా సినిమా వాళ్ళు మంచి కుటుంబాల నుంచి రారని, వారి నడవడి మంచిది కాదన్న అభిప్రాయం ప్రచారంలో ఉండేది. దీనికి తోడు దీనానాథ్‌ నాటక రంగానికి చెందిన వాడు కావటం వల్ల కూడా ఆయనకు సినిమాలంటే వ్యతిరేకత ఉండేది. ఎందుకంటే సినిమాలు ప్రధానంగా నాటకాల మనుగడను ప్రమాదంలోకి నెట్టాయి. అంతవరకు నాటకాలను ఆదరించిన ప్రజలు సినిమాలను పెద్ద ఎత్తున ఆదరించటంతో నాటకాల ఆదరణ సన్నగిల్లటం ఆరంభమయింది. ఇది తిన్నగా దీనానాథ్‌ జీవితంపై ప్రభావం చూపించింది. ఇది కూడా ఆయనకు సినిమాలంటే విముఖతను పెంచింది. ఇంట్లో సినిమా పాటలు పాడటాన్ని, సినిమాలు చూడటాన్ని ఆయన నిషేధించాడు. పిల్లలందరికీ శాస్త్రీయ సంగీతంలో స్వయంగా శిక్షణనివ్వటం ఆరంభించాడు.
అందుకే తన తండ్రి అకాలమరణం చెందకుండా ఉంటే ఆమె జీవితం ఎలా ఉండేదన్న ప్రశ్నకు లత సమాధానం ఆసక్తి కలిగిస్తుంది. ‘‘మా తండ్రి దీర్ఘకాలం బ్రతికి ఉంటే నేను సినిమాల్లోకి వచ్చేదాన్ని కాదు. నాన్నకు సినిమాలు చూడటం, పాటలు పాడటం ఇష్టం ఉండేది కాదు. కాబట్టి నాకు శాస్త్రీయ సంగీతం నేర్పేవారు. తరువాత పెళ్ళి చేసేసేవారు’’ అంటుంది లత.
కానీ భారతరత్నగా ఎదిగి, తన గానంతో తరతరాల ప్రజలకు సాంత్వనను, ఆనందాన్ని ఇవ్వగల లత మామూలు గృహిణిగా మిగలటం విధి ఒప్పుకోదు. అందుకే బాల్యం నుంచీ విధి ‘లత’ను వేదికపైకే నెడుతోంది.
లత ప్రథమంగా షోలాపూర్‌కు చెందిన నూతన్‌ థియేటర్‌ ఆధ్వర్యంలో తండ్రి సమక్షంలో స్టేజిపై పాడిరది. నిజానికి తానూ పాడతానని పేచీ పెట్టింది. అంతకు ముందు తండ్రి సభలలో పాడుతుంటే శ్రోతలు ‘వన్స్‌ మోర్‌’ అనటం చూసింది. తానూ ‘వన్స్‌ మోర్‌’ సంపాదించాలని ఆమె కోరిక. అందుకని పేచీపెట్టి మరీ వేదిక ఎక్కింది. ఆ రోజు ఆమె తల్లి తెల్లటి ఫ్రాక్‌ వేసి తలలో పూలు పెట్టి లతను తయారుచేసింది. తండ్రి చూస్తుండగా ‘ఖంభావతీ’ రాగంలో పాటలు పాడిరది. వన్స్‌ మోర్‌లు, కరతాళ ధ్వనులు సాధించింది. తరువాత స్టేజీమీదనే తండ్రి ఒళ్ళో పడుకొని నిద్రపోయింది. దీనానాథ్‌ ఆ రాత్రంతా తన గానంతో శ్రోతలను పరవశింప చేశాడు.
తరువాత తండ్రితో నాటకాలలో వేషాలు వేసింది, పాటలు పాడిరది, అందరి ప్రశంసలూ అందుకుంది. 1940`41 ప్రాంతాలలో తండ్రి చేయి పట్టుకుని తొలిసారిగా రికార్డింగ్‌ కోసం ఆలిండియా రేడియోలో అడుగుపెట్టింది. రేడియోలో ఖంభావతి, యవన్‌ రాగాలలో పాటలు పాడి మెప్పించింది. ఆమె ప్రతిభను గుర్తించిన ఆమె తండ్రి ‘లతా’ను ‘తతాబాబా’ అని ముద్దుగా పిలిచి ఏడిపించేవాడు. ఆమె జాతకాన్ని పరిశీలించిన దీనానాథ్‌ ‘లత’ గొప్ప గాయని అయి ఉన్నత శిఖరాలు అధిరోహిస్తుందని, కానీ వివాహం చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోతుంద’ని చెప్పాడు. తనతో పాటు నాటకాలకు తీసుకు వెళ్ళటం, నాటకాలలో పాత్రలు వేయించటం, పాటలు పాడిరచటం చేశాడు. దీనానాథ్‌ ఆ రకంగా లతకు ప్రాథమిక శిక్షణను ఇచ్చాడు.
బల్వంత్‌ సంగీత మండలి ప్రదర్శించిన ‘సౌభద్ర’ నాటకంలో దీనానాథ్‌ అర్జునుడిగా, తొమ్మిదేళ్ళ లత నారదుడిగా వేశారు. అందుకోసం వాళ్ళమ్మ లత చేతికి చిన్న తంబుర ఇచ్చి పీతాంబరాలు ధరింపచేయటం పలు ఇంటర్వ్యూలలో లత గుర్తు చేసుకుంది. తన కూతురి గానానికి ప్రేక్షకులు ‘వన్స్‌ మోర్‌’లు కురిపించటం చూసిన దీనానాథ్‌ ఆమె కోసం పాటలు అధికంగా గల ‘గురుకుల్‌’ అనే నాటకం రాయించాడు. ఇది కృష్ణ, సుధామల కథ. ఈ నాటకంలో లత కృష్ణుడి వేషం వేయగా, మీనా సుధామ వేషం వేసింది.
ఇలా అంచెలంచెలుగా లతకు గుర్తింపు వస్తున్న సమయంలో దీనానాథ్‌కు కష్టాలు మొదలయ్యాయి. ప్రజలకు నాటకాలపై ఆసక్తి తగ్గింది. రెండవ ప్రపంచ యుద్ధ వాతావరణం అలుముకుంది. ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని కుదిపివేసింది. దాంతో దీనానాథ్‌ తాగుడుకు అలవాటు పడ్డాడు. కుటుంబానికి గడ్డుదినాలు ఆరంభమయ్యాయి. ఇదంతా లత మనస్సుపై, ఆలోచనలపై ప్రభావం చూపింది.
ఒక వ్యక్తి ఎంత విజయం సాధిస్తే అంత గౌరవం పొందుతాడు. ప్రజలు నీరాజనాలు పడతారు. అతడ్ని ఒక్క క్షణం సేపయినా చూడాలని తహతహలాడతారు. కానీ అదే వ్యక్తికి దుర్దశ వస్తే ఎవ్వరూ పట్టించుకోరు. ఎక్కడ సహాయం చేయాల్సి వస్తుందోనని ముఖం చాటేస్తారు. ఆ వ్యక్తి సైతం మానసికంగా దిగజారతాడు, పతనమౌతాడు. ఇది ఆ వ్యక్తికే కాదు అతడిపై ఆధారపడిన వారికీ కష్టం కలుగజేస్తుంది. అయితే లతామంగేష్కర్‌కు తండ్రిపైన అమితమైన గౌరవం ఉంది, అమితమైన ప్రేమ ఉంది. ఇది కూడా ఆమె వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్ది ప్రవర్తనను నిర్దేశించిన అంశం.
ఏదోరకంగా రోజులు గడుస్తున్న సమయంలో అనుకోని రూపంలో దీనానాథ్‌ను మృత్యువు కబళించింది. 1942, ఏప్రిల్‌ 24న దీనానాథ్‌ మరణించాడు.
‘సునో చోటీసీ గుడియా’ పాటలోలాగా వెన్నెల పల్లకి, మెరుపుల వాయిద్యాలు, చక్కటి బంగళా, వెండి కిటికీలు, ఆటలాంటి జీవితం… అని ఊహిస్తూ కలలు గంటున్న తరుణంలో ‘గయా బచ్‌పన్‌ తో ఆసు భరీ ఆయి జవానీ’ అన్నట్టు బాల్యం కనుమరుగు కాగానే దుఃఖంతో కూడిన యవ్వనం వచ్చింది. తండ్రి మరణించినప్పుడు లతకు పదమూడేళ్ళు. అప్పుడప్పుడే బాల్యం వీడి యవ్వనంలోకి అడుగుపెడుతోంది.
అంతవరకూ ఆటలు, పాటలు, సంగీత సాధనం, నాటకాలలో వేషాలతో సాగిన లత జీవితం కళ్ళుమూసి తెరిచేలోగా అనూహ్యమైన రీతిలో మారిపోయింది. తల్లికి ఇది అనుకోని దెబ్బ. ఆమె మానసికంగా కృంగిపోయింది. ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేని నిస్తేజ స్థితిలోకి జారిపోయింది. బంధువులు ముఖాలు చాటేశారు. నలుగురు ఆడపిల్లలు మరి! కళ్ళుమూసి తెరిచేలోగా కలలు, ఊహలు, ఆశలు అన్నీ కాలి బూడిదైపోయాయి. ఆనంద నౌక పయనించు వేళ శోకాల సంద్రాల ముంచేవులే అన్నట్టు లత జీవితం శోకాల సంద్రాలలోనే కాదు కడగండ్ల తుఫానులలోనూ చిక్కుకుంది. ఇల్లు గడవడం కోసం ఒకటొకటిగా విలువైన వస్తువులు తాకట్టు కొట్టుకి తాత్కాలికంగా చేరి అక్కడే స్థిరపడిపోతున్నాయి. ఇంట్లోని విలువైన వస్తువులన్నీ అయిపోతున్న కొద్దీ లతకు ఒక విషయం స్పష్టమయింది. ఇల్లు గడవాలంటే తానే పూసుకుని ఏదో ఒకటి చేయాలి, తల్లికి ఏమీ తెలియదు, అమాయకురాలు. మీనా, ఆశా, ఉష, హృదయనాథ్‌ ఇంకా చిన్నవారు. ఇంటికి పెద్దగా ఇల్లు నడిపే బాధ్యత లతదే! కానీ లతకు చదువు సరిగ్గా లేదు. ఏదైనా ఉద్యోగం చేసే వయసూ కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి పోషణ భారం భుజస్కంధాల మీద వేసుకుంది లత. భవిష్యత్తు ఏమవుతుందో, ఎలా ఉంటుందో ఏ మాత్రం తెలియకుండా అడుగు ముందుకు వేసింది.
టూటే పల్‌ భర్‌ మే సప్నోంకి మోతీ భీ, లూట్‌ గయి జ్యోతీ భీ
రహగయే అంధేరే, ఉజ్‌ డే హువే సవేరే
బాత్‌ యే పూరీ థీ ఔర్‌ ఫిర్‌ భీ, అధూరీ థీ
హోగా అంజామ్‌ క్యా, ఖబర్‌ ఖుద్‌ భీ న జానీ
సునో ఛోటీసీ గుడియా కీ లంబీ కహానీ…
క్షణంలో స్వప్నాలు ముక్కలయిపోయాయి. జ్యోతినెవరో దోచుకున్నారు, చీకటి మిగిలింది. ఉదయం కూడా నాశనం అయిపోయింది. కథ పూర్తయినట్టుంది కానీ పూర్తి కాలేదు. ఇక దీని ఫలితం, ముగింపు ఎలా ఉంటుందో తనకు కూడా తెలియదు.
‘చాందీ కీ దీవార్‌’ సినిమాలో సాహిర్‌ రాసిన ‘‘అష్కోన్‌ నె జొ పాయా హై’’ పాటకు బాణీని కూర్చింది ఎన్‌.దత్త. పాటలోని ఈ పంక్తులు తనకు చాలా ఇష్టమైనవని పలు సందర్భాలలో లత స్పష్టం చేసింది. తీగ నుంచి వెలువడిన బాణీని/గానాన్ని వింటారు. కానీ ఆ బాణీ సృజనలో తీగ కానీ, తీగ నుంచి వెలువడుతున్నపుడు బాణీ కానీ ఎలాంటి కష్టాలననుభవించాయో, వాటి అనుభవాలేమిటో ఎవరి హృదయానికి తెలుసు? ఎవరికి తెలుసు? సృజన ఏదైనా బాధతో, తపనతో కూడుకున్నది. ప్రపంచం సృజనను చూస్తుంది. కానీ ఆ సృజన వెనుక ఉన్న కష్టాన్ని పట్టించుకోదు. ఒక అందమైన రూపం ధరించేముందు శిల అనుభవించిన ఉలి దెబ్బలు ప్రపంచం గమనించదు. అందమైన రూపాన్నే గమనిస్తుంది. ప్రపంచం లత స్వరం విని పరవశిస్తుంది. ఆ స్వరాన్ని పలుకుతున్న హృదయవేదన ప్రపంచానికి అనవసరం.
1998లో లత చివరిసారి అమెరికాలో పాటలు పాడినప్పుడు ‘‘నేను ఎప్పుడూ మీరు కోరిన పాటలు పాడుతుంటాను. ఇప్పుడు మీరు నాకు ఇష్టమైన పాటను వినండి. నచ్చితే కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియజేయండి. నచ్చకపోతే నిశ్శబ్దంగా ఉండండి’’ అంది. ఆ సందర్భంలో ఆమె పాడిన పాట…
‘కుచ్‌ దిల్‌ నె కహా, కుచ్‌ భీ నహీ….
కుచ్‌ దిల్‌ నే సునా, కుచ్‌ భీ నహీ
ఐసే భీ బాతే హోతీ హై, ఐసే భీ బాతే హోతీ హై’
ఈ పాటలోని ఓ పంక్తిని ఆమె ప్రత్యేకంగా పాడారు.
‘జీవన్‌ తో సూనా హీ రహా, సబ్‌ సంరేa ఆయీ మై బహార్‌
కలియోంసే కోయీ పూఛ్‌ తే, హస్తీ హై వో నా రోతీ హై’
‘‘అందరూ జీవితంలోకి వసంతం వచ్చిందనుకున్నారు. కానీ, జీవితం శూన్యంగానే వుంది. పూల అందాన్ని చూస్తాం. ఆనందిస్తాం. కానీ ఎవరూ పూల మానసిక స్థితిని అడగరు. వాటి మనోభావాల గురించిన ఆలోచన కూడా రాదు. అందమైన వస్తువుల గతి అంతే…’’
లతకు ఈ రెండు పాటల్లో ఇష్టమైన ఈ రెండు భావాలకు, ఓ ఇంటర్వ్యూలో లత అన్న మాటలను జతపరిచి విశ్లేషిస్తే లత మనస్సును గ్రహించే వీలవుతుంది. తీగ నుండి వెలువడే స్వరం వేదన, అందమైన పూల మనస్సులోని ఆవేదనను అర్థం చేసుకునే అవకాశం చిక్కుతుంది.
జావేద్‌ అఖ్తర్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘మరో జన్మంటూ ఉంటే ఏమవుతారు?’ అన్న ప్రశ్నకు సమాధానంగా ‘నా హి జనం మిలే తో అచ్చా హై, ఔర్‌ అగర్‌ వాకాయి మిలా మురేa తో మై లతా మంగేష్కర్‌ బన్‌ నా నహీ చాహూంగి’’ (మరో జన్మ లేకపోతేనే మంచిది. ఒకవేళ మరో జన్మంటూ ఉంటే మాత్రం లతా మంగేష్కర్‌గా మాత్రం కావాలనుకోను) అంది. ఆశ్యర్యపోయిన జావేద్‌ అఖ్తర్‌ ‘‘అదేంటి?’’ అనడిగాడు. దానికి సమాధానంగా ‘‘లతా మంగేష్కర్‌ కీ జో తక్లీఫే హై వో ఉస్‌కో హీ పతా హై’’ (లతా మంగేష్కర్‌కు ఏం కష్టాలుంటాయో అవి ఆమెకు మాత్రమే తెలుసు) అంది.
‘దూరపు కొండలు నునుపు’ అంటారు. దూరం నుంచి చూస్తే హిందీ సినీ ప్రపంచంలో మకుటం లేని మహారాణి లతా మంగేష్కర్‌. మహమ్మద్‌ రఫీ ఆమెను ‘మహారాణీ’ అనేవాడు. సంపూర్ణంగా పురుషాధిక్య ప్రపంచమైన సినీ రంగంలో లత మహారాణిలా రాజ్యం చేసింది. ఆమె కరుణ ఎవరిపై ప్రసరిస్తే వారు శిఖరారోహణం చేరారు. ఎవరిపై కినుక వహిస్తే వారు శిఖరం నుంచి అథఃపాతాళానికి దిగజారారు. ఆమె గదిలో అడుగుపెడితే చాలు ప్రధానులు, రాష్ట్రపతులు కూడా గౌరవంతో లేచి నిలబడేవారు. ఆమె గదిలో ఉంటే చైన్‌ స్మోకర్లు కూడా చేతులు కట్టుకొని నిలబడేవారు. బడా బడా నిర్మాతలు, నటులు, షోమెన్లు కూడా ఆమె ముందు మంచినీళ్ళు కూడా ఆమె అనుమతితోనే తాగేవారు. దేశంలోని పలు గాయనిలు లత స్థాయికి ఎదగాలని తపనపడుతున్నారు. ప్రతి గాయని లక్ష్యం లత స్థాయికి చేరటమే. అలాంటి లతా మంగేష్కర్‌ ‘తనకు మరో జన్మంటూ ఉంటే, లతలా మాత్రం వదు’్ద అనటం ఆశ్చర్యంతో పాటు ఆలోచనను కలుగజేస్తుంది. లత ఈ వ్యాఖ్య వెనుక మనసును గ్రహించాలంటే ఆమె తండ్రి దీనానాథ్‌ మంగేష్కర్‌ మరణం తరువాత నుంచి లత హిందీ సినీ ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగేంతవరకూ జరిగిన సంఘటనలను విశ్లేషించాల్సి ఉంటుంది.
ఒక సంఘటనకు ఒక వ్యక్తి ప్రతిస్పందన ఎలా ఉంటుందనేది అతని వ్యక్తిత్వం అంతిమంగా నిర్ణయిస్తుంది. కానీ మౌలికంగా అందరి ప్రతిస్పందనలు ఒకే రకంగా ఉంటాయి. అపనమ్మకం, మరణం అంటే అర్థమయీ కాకపోవటం, అర్థమయిన తరువాత భవిష్యత్తు గురించి భయం కలగటం, అభద్రతా భావం కలగటం, న్యూనతాభావం పెరగటం ఇలాంటి పలు భావాలు ప్రధానంగా కలుగుతాయి. ముందుగా అసలు తండ్రి మరణాన్ని ఆమోదించటం కష్టం. ఏదో సాయంత్రం బయటనుంచి ఇంటికి వస్తాడని, అంతా మామూలుగా ఉంటుందన్న భ్రమ కలుగుతుంది. నిజం గ్రహించేసరికి సమయం పడుతుంది. నిజం గ్రహింపుకు రాగానే అభద్రతాభావం తీవ్రమవుతుంది. న్యూనతా భావం కలుగుతుంది. తాను తండ్రి లేకపోవటం వల్ల ఇతరులకన్నా తక్కువ అన్న భావన కలుగుతుంది. అంతేకాదు, తండ్రి తనవెంటే ఉంటూ తనని కాపాడుతున్నట్టు ఒక భ్రమను సృష్టించుకుని, ప్రతి క్షణం తండ్రిని తలచుకుంటూ, అతడ్ని రక్షించమని వేడుకుంటూ జీవితం సాగదీస్తారు. ముఖ్యంగా ఇంకా తండ్రిపై ఆధారపడిన పిల్లలైతే ఆ కుటుంబానికి ప్రధాన ఆధారం తండ్రి ఒక్కడే అయితే అలాంటి పిల్లల్లో అభద్రతాభావం తీవ్రమవుతుంది. ఈ అభద్రతా భావాన్ని అదుపులో ఉంచుకోలేని వారు మానసిక సమతౌల్యం కోల్పోతారు. కొందరు ఆత్మహత్యలకు పాల్పడతారు. మరికొందరు జీవితం మీద విరక్తితో పలు దుర్వ్యసనాలకు బానిసలై జీవితం వ్యర్థం చేసుకుంటారు. ఏది ఏమైనా ఇంకా స్వంత కాళ్ళమీద నిలబడకముందే, స్వంత వ్యక్తిత్వం ఎదగకముందే తండ్రిని కోల్పోవటం అన్నది ఒక తీవ్రమైన మానసిక అవ్యవస్థకు దారితీసేటటువంటి పరిణామం అనటంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఇలా తండ్రిని కోల్పోయింది ఆడపిల్ల అయితే, ఆ ఆడపిల్లకు తండ్రితో అనుబంధం, ఆప్యాయత, గౌరవాలతో పాటు అతని గొప్పతనం పట్ల గర్వం కూడా ఉంటే, అలాంటి అమ్మాయి తీవ్రమైన మానసిక వేదనకు గురవుతుంది. లతా మంగేష్కర్‌ అలాంటి మానసిక వేదనకు గురై ఉంటుంది.
లతా మంగేష్కర్‌కు తండ్రితో ఆత్మీయమైన అనుబంధం ఉన్నదనటంలో ఎలాంటి సందేహం లేదు. తండ్రి పట్ల గౌరవాభిమానాలు ఉండటంలోనూ ఎలాంటి వివాదం లేదు. తండ్రి ఆమె ప్రథమ గురువు. ఆమె తండ్రిని ఆరాధించటంలోనూ ఎలాంటి అనుమానం లేదు. ఆమెకు తండ్రి గొప్పతనం తెలుసనటంలోనూ ఎలాంటి వివాదం లేదు. తన తండ్రి నుంచి తనకు స్వాభిమానంతో జీవించే ప్రేరణ లభించిందని లత పలు ఇంటర్వ్యూల్లో స్పష్టం చేసింది. తండ్రి నేర్చిన సంస్కారం వల్ల జీవితంలో నిజం కోసం నిలబడి పోరాడే స్ఫూర్తి లభించిందని చెప్పింది. తన తండ్రి నుంచి జీవితంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా సమన్యయంతో ఎలా ఉండాలో నేర్చుకున్నానని చెప్పింది. ఎవరిముందూ తలవంచకూడదనీ నేర్చుకుంది. తన తల్లి కూడా ఎంత కష్టం వచ్చినా ఎవరి ముందూ చేయిచాపని స్వాభిమానం కలదని చెప్పింది. కాబట్టి తండ్రి మరణం, తరువాత దిగజారిన ఆర్థిక పరిస్థితులు ఆమెను మానసికంగా ఎంతటి వేదనకు, ఉద్విగ్నతలకూ గురిచేశాయో ఊహించవచ్చు. 1947`48 ప్రాంతంలో చీరలు రేషన్‌లో దొరికేవని, తాను సంపాదించిన డబ్బుతో ఆ తెల్లటి కాటన్‌ చీరలు కొని అవే ఇంటిల్లపాదీ ధరించేవారనీ, వాటిని తానే ఉతికి, ఇస్త్రీ చేసినట్టుండేందుకు తలకింద దిండులా పెట్టుకుని పడుకునేదాన్నని, తెల్లారి అవే కట్టుకుని స్టూడియోకి వెళ్ళేదాన్నని లతా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. అప్పుడీ మాటలు నవ్వుతూ చెప్పింది కానీ, నిజంగా అనుభవించేటప్పుడు ఎలాంటి మానసిక వేదనకు, గురై ఉంటుందో అనుభవించిన ఆమెకే అర్థమవుతుంది.
‘ఖజాంచి’ సినిమా విడుదలైన తర్వాత సినీ నిర్మాతలు ఓ పోటీ పెట్టారు. ‘ఖజాంచి’ సినిమాలోని ఏవైనా రెండు పాటలు ఎంచుకుని చక్కగా పాడిన వారికి బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఆ సమయంలో లత తండ్రి బొంబాయి వెళ్ళారు. పోటీ పూనాలో జరుగుతోంది. ఆ పోటీలో లత తన పేరు కూడా ఇచ్చింది. ‘లౌట్‌ గయీ పాపన్‌ అంధియారీ’, ‘నైనోంకే బాన్‌ కీ రీత్‌ అనోఖీ’ అన్న రెండు పాటలు బాగా సాధన చేసింది. ఈ రెండు పాటలు ఆ సినిమాలో పాడిరది శంషాద్‌ బేగం.
పోటీలో 114 మంది అమ్మాయిలు పాల్గొన్నారు. పోటీ రోజు ఒక్కో అమ్మాయిని స్టేజి పైకి పిలిచినప్పుడు, ఆ అమ్మాయి స్టేజీ ఎక్కి తన పరిచయం చేసుకోవాలి. లత వంతు వచ్చినపుడు ఆమె స్టేజీ ఎక్కి ‘లతా! దీనానాథ్‌ మంగేష్కర్‌’ అని పెద్దగా మైకులో చెప్పింది. ఆ తరువాత జరిగింది లత జీవితాంతం మర్చిపోలేదు. ప్రేక్షకులంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. ‘వారు నా ఆత్మవిశ్వాసానికి చప్పట్లు కొట్టారో, నా తండ్రి పేరు విని హర్షాతిరేకంతో చప్పట్లు కొట్టారో, ఆ మహానుభావుడి కూతురు పోటీలో పాల్గొంటున్నదని చప్పట్లు కొట్టారో నాకు తెలియదు’ అంది ఓ ఇంటర్వ్యూలో లతా మంగేష్కర్‌. ఆ పోటీలో లత ప్రథమ బహుమతి గెలుచుకుంది. కానీ ఇక్కడ గమనించాల్సిందేమిటంటే ఆమె తండ్రి పేరు చెప్పగానే ప్రేక్షకులు కరతాళ ధ్వనులు చేయడం మాత్రం ఆమె జీవితాంతం మర్చిపోలేదు. ఇంటికి తిరిగివచ్చిన దీనానాథ్‌ లత బహుమతిని చూసి ఆనందించాడో లేదో కానీ ఆగ్రహం మాత్రం ప్రదర్శించాడు. సినిమా పాటల పోటీలో లత పాల్గొనటం పట్ల తీవ్ర నిరసనను వ్యక్తపరిచాడు. ఒకవేళ పోటీలో ప్రథమ బహుమతి రాకపోతే తన పరువు పోయేదని బాధపడ్డాడు. ఈ సంఘటన చెప్తూ లత చేసిన వ్యాఖ్య గమనార్హం. ‘బాల్యం నుంచీ నాకు నేను పండిత దీనానాథ్‌ మంగేష్కర్‌ కూతురిని అవ్వటం వల్ల ఇతరులకన్నా భిన్నం అన్న భావన కలిగింది.’
దీనానాథ్‌ మంగేష్కర్‌ కూతురు అవ్వటం వల్ల తాను ప్రత్యేకం అన్న భావన కలిగిన లతా మంగేష్కర్‌ అతని మరణంతో ఎంత తీవ్ర దిగ్భ్రాంతికి లోనై ఉంటుందో ఊహించటం కష్టం కాదు.
తండ్రి మరణం తర్వాత 1943లో లత కొల్హాపూర్‌ వదిలి బొంబాయి వచ్చింది. వాళ్ళ బాబాయి కమలానాథ్‌ మంగేష్కర్‌ ఇంట్లో ఉంది కొన్నాళ్ళు. తండ్రి పేరును నిలిపి, ఆయన ఖ్యాతిని సజీవంగా
ఉంచాలన్న తపనతో సంగీతం, నృత్యం నేర్చుకుంటుండేది. అది ఇంట్లో పెద్దలకు నచ్చలేదు. ‘తండ్రి పేరు నిలపటం కాదు, పాడు చేస్తావ్‌’ అని దూషించేవారు. ‘పండిత దీనానాథ్‌ మంగేష్కర్‌ ఎక్కడ, ఈ పిల్ల ఎక్కడ, సరిగ్గా పాడటమే రాదు, ఆయన పేరు ఈమె ఏం నిలబెడుతుంద’ని అనేవారు. మరో బంధువు కృష్ణారావు కొల్హాపూరి (నటి పద్మినీ కొల్హాపురి తండ్రి) కూడా లత సరిగ్గా పాడలేదని భావించాడు. ఆయన బరోడా రాజ దర్బారులో పండితుడు, గాయకుడు, వీణా విద్వాంసుడు. సరిగ్గా పాడలేక ఆమె తన తండ్రి పేరును పాడు చేస్తోందన్న విమర్శ లతను తీవ్రంగా బాధించింది. ఆమె బాధపడుతుంటే ఆమె పిన్ని లతను ఓదార్చింది. ‘తండ్రి పేరు స్మరించు, ఆయనే నీ సంగీతానికి దిశను చూపిస్తాడు’ అని ధైర్యం చెప్పింది. ఏ రోజు సాయంత్రం ఆమె ‘నాట్య సమారోహం’లో పాడాలో, ఆ రోజు మధ్యాహ్నం ఆమెకు ఒక కల వచ్చింది. కలలో తండ్రి దీనానాథ్‌ మంగేష్కర్‌ ఆమెకు మానాపమాన్‌ నాటకంలోని ‘శూరా మీ మదీలే’ అనే పాట పాడుతూ కనపడ్డాడు. ఇది లతకు తండ్రి తన వెంట ఉన్నాడన్న ధైర్యాన్నిచ్చింది. నాట్య సమారోహంలో ఆమె మాల్కౌస్‌, భైరవి రాగాల నడుమ నడయాడే ‘దివ్య స్వతంత్ర రవి ఆత్మ తేజోబలే’ అన్న తండ్రి పాటను పాడి మెప్పించింది. ఆ సభలో ఉన్న అప్పటి గొప్ప నటి లలితా పవార్‌ పధ్నాలుగేళ్ళ లతను దగ్గరకు తీసుకుని, మెచ్చుకుని ఆశీర్వదించింది. అప్పటినుంచీ తండ్రి తన వెంట ఉండి రక్షిస్తాడన్న భావన లతలో స్థిరపడిరది. అందుకే ఎంత పేరొచ్చినా లత ప్రతి పాటను అదే తన ప్రథమ పాట అన్నట్లుగా జాగ్రత్తగా, బహు సాధన చేసి పాడేది. ఎందుకంటే పాట బాగా పాడలేదనో, పాటలో తప్పులొచ్చాయనో ఎవరైనా అంటే ఆ అవమానం లతది కాదు, ఆమె తండ్రిది. ఎట్టి పరిస్థితుల్లోనూ తండ్రికి చెడ్డపేరు రానీయదు లత. అందుకే ఈనాటికీ, తన పాటలో ఎవరు ఏ తప్పు పడతారో అన్న భయం తనను వేధిస్తుందనీ, అందుకే ఎలాంటి పొరపాటు చేయటం తనకు ఇష్టం ఉండదనీ లత పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది.
ఇప్పుడు లత మానసిక స్థితిని అంచనా వేసి, ఆమె ప్రవర్తనని అర్థం చేసుకునే వీలు కలుగుతుంది. దీనానాథ్‌ లత దృష్టిలో దైవంతో సమానం. తన ప్రతి పని ప్రభావం ఆయనపై ఉంటుందని తెలుసు. కాబట్టి ఆయన స్థాయికి తగని పని చేయకూడదని తెలుసు. ఆత్మగౌరవానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. తండ్రి మరణాన్ని అర్థం చేసుకుని, దానికి తగ్గట్టు ప్రతిస్పందించేలోగా ఇంటి బాధ్యతను స్వీకరించాల్సి వచ్చింది లతకు. ఇంట్లో పెద్ద కూతురు కావటం వల్ల ఎవరు చెప్పినా చెప్పకున్నా బాధ్యత తనదే అని లత గ్రహించింది. దీనానాథ్‌ మరణించిన రెండు మూడు నెలలకల్లా తాను ధన సంపాదన గురించి ఆలోచించకపోతే తాము వీథిన పడక తప్పదని గ్రహించింది. ప్రస్తుతం ఇంట్లో తాను తప్ప సంపాదించాలన్న ఆలోచన గలవారు, సంపాదించేవారు కూడా ఎవ్వరూ లేరని అర్థం చేసుకుంది. తండ్రిని తలచుకుని అడుగు ముందుకు వేసింది.
అంతవరకూ ఎవరినీ, దేనికీ అభ్యర్థించిన వ్యక్తి కాదు. ఎవరిముందు తలవంచిన వ్యక్తి కాదు. తండ్రి మరణంతో ఇప్పుడు తలపై నుండి నీడ తొలగిన పరిస్థితిని ఎదుర్కోవాల్సి రావటమే కాదు, తాను తన కుటుంబానికి నీడను అందించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో పదమూడేళ్ళ పసిపిల్లల మనసులో ఎలాంటి భయాలు, ఎలాంటి సంశయాలు, ఎలాంటి నిరాశలు చెలరేగుతాయో అర్థం చేసుకోవచ్చు.
అయితే డబ్బు సంపాదనకు లతకు తెలిసిన మార్గం ఒక్కటే. అదీ తండ్రి చూపించినదే. నాటకాలలో నటించటం, పాటలు పాడటం. లత వాళ్ళకు సహాయం చేయటానికి బంధువులెవరూ ముందుకు రాలేదు. దీనానాథ్‌ మిత్రుడు, శ్రీపాద్‌ జోషి లత కుటుంబానికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. పూనాలో ఉన్న ‘మాస్టర్‌ వినాయక్‌’ (నటి నంద తండ్రిర) పేరుతో ప్రసిద్ధుడైన వినాయక్‌ దామోదర్‌ కర్ణాటకీ వద్దకు లతను సిఫారసు చేసి పంపాడు. మాస్టర్‌ వినాయక్‌ దీనానాథ్‌కు మంచి మిత్రుడు. కుటుంబానికి శ్రేయోభిలాషి. అలా లత ‘నవయుగ్‌ చిత్రపట్‌ ఫిల్మ్‌ కంపెనీ’లో మూడు నెలల ఒప్పందంపై మూడు వందల రూపాయలకు అడుగుపెట్టింది.
ఇక్కడ ఒక్క క్షణం ఆగి ఆలోచించాల్సి ఉంటుంది. దీనానాథ్‌కు సినిమాలంటే ఇష్టం లేదు. కానీ లత తప్పనిసరి పరిస్థితుల్లో మూడు నెలల కాంట్రాక్టుతో దీనానాథ్‌ మరణించిన మూడు నెలలకు చేరాల్సి వచ్చింది. తండ్రికి ఇష్టంలేని పని చేయటం లతకు ఇష్టం లేదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో, కుటుంబ పోషణ కోసం లత సినిమాల్లో నటించేందుకు సిద్ధపడాల్సి వచ్చింది. ఇది లతను జీవితాంతం బాధించింది. తండ్రికి అస్సలు ఇష్టంలేని పని చేయాల్సి వచ్చింది అనేది ఆమె నేరభావన. నాటకాలను అప్పటికి సినిమాలు మింగేస్తున్నాయి. కాబట్టి తండ్రితో కలిసి పని చేసినట్లు నాటకాల్లో పనిచేయలేదు కాబట్టి సినిమాలలో నటించటం తప్పనిసరి. కానీ అది నేరభావనను కలిగిస్తోంది. ఆ నేర భావనను అధిగమించేందుకు దాన్ని అణచి ముందుకు సాగేందుకు ఇదంతా ‘కుటుంబం కోసం’ అని సర్ది చెప్పుకుంది. తానీ పనికి సిద్ధపడకపోతే ఆ దీనానాథ్‌ కుటుంబమే రోడ్డుమీద పడాల్సి వస్తుంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో లత సినిమా కంపెనీలో చేరింది. కానీ నేరభావనను మాత్రం సంపూర్ణంగా అధిగమించలేకపోయింది. ఆ సమయంలో లత తన జీవితాన్ని సమాజసేవకు అంకితం చేయాలనుకుంది. ఆమె తండ్రితో సహా ఆ కాలంలో మహారాష్ట్రీయులు అనేకులు స్వతంత్ర వీర సావర్కార్‌ భక్తులు. ఇప్పుడంటే సావర్కార్‌ పేరు చెప్తే కొందరికి ఆవేశాలూ, పూనకాలూ వస్తాయి. ఆ కాలంలో కూడా దేశభక్తి ఆవేశాలూ, భక్తి పూనకాలూ వచ్చేవి. ఆయన ప్రభావంలో పడని మహారాష్ట్రీయులు లేరు. ఆయన స్వాతంత్య్ర పోరాటవీరుడు, సమాజ సేవకుడు, రాజకీయ వేత్త. సమాజ సేవ చేస్తూ రాజకీయాల్లోకి రావాలా? రాజకీయాల్లో ఉంటూ సమాజసేవ చేయాలా? అన్న సందేహం లతకు వచ్చింది. ఆమె తన సందేహానికి సమాధానాన్ని సావర్కార్‌ను అడిగింది. దానికి సమాధానంగా సావర్కార్‌ ‘‘మీ తండ్రి గొప్ప సంగీత విద్వాంసుడు. సంగీతంలో అత్యంత శిఖరాలను అధిరోహించినవాడు. అలాంటి పండితుడి కూతురిగా నువ్వూ సంగీతం ద్వారా సమాజసేవ చేయాలి’’ అని బోధించి ఆమెన సంగీతం వైపు మరల్చాడు. అందుకే లత సావర్కార్‌ను తన గురువులా, పితృ సమానుడిలా అభిమానించి, గౌరవించింది. ఆయన సలహాను పాటించింది, సంగీత శిఖరాలను అధిరోహించింది, సమాజసేవనూ కొనసాగించింది. ఇలా కూడా ఆమె తండ్రికి ఇష్టంలేని సినిమాల్లో పనిచేయటాన్ని మనసుకు సర్దిచెప్పుకుంది.

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.