లతా మంగేష్కర్ నటనను ఇష్టపడలేదు. తెరపై నటించడం కన్నా తెరవెనుక పాడడం మంచిది. ఒక రకంగా తండ్రి నేర్పిన పాటను సజీవంగా నిలుపుకున్నట్టవుతుంది. అందుకే, అవకాశం దొరకగానే నటన నుంచి విరమించుకుంది. తరువాత పలు ఇంటర్వ్యూలలో నటన పట్ల తన విముఖతను స్పష్టం చేసింది. మేకప్ వేసుకోవటం ఇష్టం లేదని, పెదవులకు లిప్‌స్టిక్
వేసుకోవటమంటే అసహ్యమని చెప్పింది. ఇదంతా తండ్రికి ఇష్టం లేని పనయినా తప్పనిసరిగా, అయిష్టంగా చేయాల్సి రావటం పట్ల లత మనస్సు ప్రతిస్పందన. అందుకే లత జీవితాంతం తెల్లటి చీరలే కట్టింది. ఎలాంటి మేకప్పులు, అలంకరణల జోలికి పోలేదు. వీలైనంత నిరాడంబరంగా ఉంది. సినీ రంగంలో ఉన్నది కానీ దాదాపుగా సినీరంగం బయట ఉన్నదానిలానే ఉంది. ఎవ్వరితోనూ సన్నిహితంగా లేదు, కానీ అందరితో స్నేహంగా ఉంది. తన చుట్టూ ఒక గిరిగీసుకుంది. ఎవ్వరినీ ఆ గీత దాటి లోనికి రానివ్వలేదు. ఎవరైనా గీత దాటే ప్రయత్నాలు చేస్తున్నారనిపిస్తే వారిని నిర్దాక్షిణ్యంగా తన జీవితం నుంచి పంపేసింది. వారెంతటివారైనా లెక్కచేయలేదు. దీనానాథ్ మంగేష్కర్ తలదించుకునే పని లత చేయలేదు, అతనికి చెడ్డపేరు వచ్చే చర్యకు లత తలపెట్టలేదు. కాబట్టి ఒక పని చేసేముందు తన తండ్రి ఈ పనికి గర్విస్తాడా? బాధపడతాడా? అని ముందు ఆలోచించేది లత. అందుకే ఇతరుల దృష్టిలో లత ఎన్ని శిఖరాలు అధిరోహించినా ఆమె తనని తాను ‘గొప్ప’ అనుకోలేదు. ఏదో సాధించిన దానిలా భావించుకోలేదు, తనను తాను పొగుడుకోలేదు, అహంకారం ప్రదర్శించలేదు. అహంకారం ఎప్పుడు ప్రదర్శించిందంటే, ఎవరైనా ఆమె గీసుకున్న గీతను దాటాలని ప్రయత్నించినపుడు. అందుకే లతా మంగేష్కర్ ప్రదర్శించే వినయంలోనూ, ఇతరులకు ఇచ్చే గౌరవంలోనూ న్యూనతా భావం, ‘నేను ఇంత గౌరవానికి అనర్హురాలను’ అన్న భావన లీలగా తొంగి చూస్తుంటాయి. సినీ నేపథ్య గాయనిగా ఎంత పేరు సంపాదించినా తనని తాను శాస్త్రీయ సంగీత విద్వాంసుల కన్నా ఎంతో తక్కువగా భావించుకుంది. అవకాశం దొరికినప్పుడల్లా తాను శాస్త్రీయ సంగీతాన్ని వదిలి సినిమా నేపథ్య గాయని అయినందుకు విచారం వెలిబుచ్చింది. వీలైనప్పుడల్లా తాను పాడిన పాటలు తాను విననని చెప్తూ వచ్చింది.
లత తొంభై ఏళ్ళ జన్మ దినం సందర్భంగా ‘క్వింట్’ పత్రిక జరిపిన ఇంటర్వ్యూలో తనకు శాస్త్రీయ సంగీతం పాడాలని ఉందని, కానీ పాడలేకపోతున్నానని చెప్పింది. ‘‘ఎందుకని?’’ అన్న ప్రశ్నకు సమాధానంగా”Circumstances. My father was a Natya Sangeet musician, a Hindustani classical vocalist and a Marathi theatre actor. Following a heart ailment, he passed away when I was 13. I used to act in his plays ever since I was four or five years old. Left fatherless, I was the family’s eldest child who had to take the lead in making ends meet at home. Our close family friend, film producer Master Vinayak helped me to get film roles. I would end up playing the sister of the hero or the heroine. Pahili Mangalagaur (1942), Subhadra (1946) and Mandir (1948) were some of the films I acted in, but my heart wasn’t into acting at all” అని చెప్పింది. అసలు ప్రశ్నకు సమాధానమివ్వకుండా పరోక్షంగా, తండ్రి మరణం, కుటుంబ పోషణ భారం వల్ల తాను శాస్త్రీయ సంగీత గాయనిగా కాక సినీ నేపథ్య గాయనిగా స్థిరపడాల్సి వచ్చిందని చెప్పకనే చెప్పింది. జీవితాంతం లత మనస్సులో తండ్రి ఇష్టానికి వ్యతిరేకమైన పని చేస్తున్నానన్న భావన, శాస్త్రీయ సంగీత గాయనిగా స్థిరపడలేకపోయానన్న వేదన ప్రకటితమవుతూనే ఉంది. అందుకే ఆమె సినిమాల్లో శాస్త్రీయ సంగీత ఆధారిత పాటలను మక్కువతో పాడిరది. అలాంటి సంగీత దర్శకులను ఆదరించింది, గౌరవించింది.
‘మాస్టర్ వినాయక్’ వల్ల సినిమాల్లోకి వచ్చానంటూ తాను నటించిన మూడు సినిమాల పేర్లు చెప్పింది లత. కానీ, ఆమె సినీరంగ ప్రవేశం అంత సులభంగా కాలేదు. మూడు నెలల కాంట్రాక్ట్ కుదుర్చుకున్న తర్వాత ‘పహలీ మంగళగౌర్’ సినిమాలో నాయిక సోదరి వేషం వేసింది లత. నాయికగా అప్పటి హిట్ నటి ‘స్నేహ ప్రభ’ నటించింది. నాయికకు లభిస్తున్న ప్రాధాన్యం, తనని ఎవరూ పట్టించుకోకపోవడం మౌనంగా భరించింది. సినిమా పూర్తికాకమునుపే ‘నవయుగ’ ఫిల్మ్ కంపెనీకీ, మాస్టర్ వినాయక్‌కూ నడుమ భేదాభిప్రాయాలు వచ్చాయి. దాంతో మాస్టర్ వినాయక్ కంపెనీని వదిలి వెళ్ళిపోయాడు. లత కాంట్రాక్టు సమయంలో ఉంది కనుక అతని వెంట వెళ్ళలేకపోయింది. కాంట్రాక్టు పూర్తికాగానే మాస్టర్ వినాయక్ దగ్గరికి కొల్హాపూర్ వెళ్ళిపోయింది. అక్కడ మాస్టర్ వినాయక్ నెలకొల్పిన ‘ప్రపుల్ పిక్చర్స్’ అనే సినిమా సంస్థలో నెలకు అరవై రూపాయల వేతనంతో చేరింది. 1945లో మాస్టర్ వినాయక్ కొల్హాపూర్ వదలి బొంబాయి వచ్చేసరికి లత జీతం రెండువందల రూపాయిలైంది. అతనితో పాటు లత కూడా బొంబాయి వచ్చేసింది. ప్రపుల్ పిక్చర్స్‌లో ఆమె మారేa బాల్ (1943), గజబాహు (1944), బడీ మా (1945), జీవన్ యాత్ర (1946), సుభద్ర (1946), మందిర్ (1948) వంటి సినిమాలలో నటించింది.
‘బడీ మా’ సినిమాలో లత నూర్జహాన్‌తో కలిసి నటించింది. ఈ సినిమాలో నటించడానికి నూర్జహాన్ కొల్హాపూర్ వచ్చినపుడు ‘ఈమె మా కంపెనీలో పనిచేస్తోంది, పాటలు పాడుతుంది’ అంటూ లతను పరిచయం చేశారు. లతతో పాటలు పాడిరచుకుని ఆనందించిన నూర్జహాన్ ‘జీవితంలో పాటను ఎప్పుడూ వదలకు, ఎంతో పైకి వస్తావు’ అని ఆశీర్వదించింది. ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ లత ఒక అద్భుతమైన సంఘటనను చెప్పింది.
ఆ కాలంలో నూర్జహాన్ దేవతతో సమానం. అందుకే పధ్నాలుగేళ్ళ లత నూర్జహాన్‌ను కన్నార్పకుండా చూస్తుండేది. ఆమె ప్రతి కదలికను గమనిస్తుండేది. ఒకరోజు నూర్జహాన్ నమాజ్ చేస్తూ కన్నీరు కార్చడం చూసిన లత ఎందుకని అడిగింది. దానికి నూర్జహాన్ అందమైన సమాధానమిస్తూ ‘‘నాకు కష్టమేమీ లేదు. నాకు భగవంతుడు అన్నీ ఇచ్చాడు. ఇక ఆయనను ప్రత్యేకంగా అడిగేందుకు ఏమీ లేదు. నేను నా నేరాలను మన్నించమని వేడుకున్నాను. ఎందుకంటే, మనం మనుషులం. తెలిసో, తెలియకో ఏవేవో పొరపాట్లు చేస్తుంటాం. మన ప్రమేయం లేకుండా ఎవరికో దుఃఖాన్ని కలిగించవచ్చు. అలాంటి తెలిసీ, తెలియక చేసిన పొరపాట్లను క్షమించమని కన్నీటితో వేడుకుంటున్నాను. నువ్వు కూడా నీ భగవంతుడిని నీ తప్పిదాలను మన్నించమని ప్రార్థించు. మనకోసం మనకేమీ అవసరం లేదు. మనవల్ల ఇతరులకు కష్టం కలగకూడదు’’ అని చెప్పింది. ఈ సంఘటన తనపై అమితంగా ప్రభావం చూపించిందని చెప్పింది లత.
‘బడీ మా’లో లత ఒక పాట పాడిరది. ‘మాతా తేరీ చరణోం’ అనే పాట ఆమెపైనే చిత్రితమైంది. ఇప్పుడు వింటే ఆ పాట పాడిరది లత అని నమ్మటం కష్టం. నూర్జహాన్, శంషాద్ బేగంల కలగలుపు గొంతులా ఉంటుంది. ఈ సినిమాలో నూర్జహాన్ పాడిన పాట ‘దియా జలాకర్ ఆఫ్ బురaాయే’ను నూర్జహాన్‌లాగే పాడేందుకు సాధన చేసింది లత.
‘గజబాహు’ సినిమాలో లత తన జీవితంలో తొలి హిందీ పాట ‘హిందుస్తానీ లోగోం అబ్ తో మురేa పెహచానో’ (హిందుస్తానీ ప్రజలారా, ఇకనైనా నన్ను గుర్తించండి) పాడిరది. 1947లో ‘ఆష్‌కీ సేవామే’ అనే సినిమాలో ‘పా లాగూ కర్ జోరీ రే’ అనే పాటతో లత నేపథ్య గానం ఆరంభించింది. అయితే, ఈ విషయాల వల్ల లత తాను ఎందుకని ‘మరోసారి లతగా పుట్టకూడద’ని కోరుకుందో అంతగా స్పష్టం కాదు. లత జీవితం మూడు వేర్వేరు అంశాలుగా పరిశీలించాల్సి ఉంది. ఒకటి బహిరంగంగా కనిపిస్తున్న సినీ జీవితం. రెండవది అంతగా అందరికీ పరిచయం లేని ఆమె కుటుంబ జీవితం, సాధన. మూడవది పై రెండిరటి ఆధారంగా ఊహించే ఆమె అంతరంగిక ప్రపంచం. ఈ మూడు అంశాల వారీగా తెలుసుకుని విశ్లేషిస్తూనే ‘లతా మంగేష్కర్’ అనే ‘వ్యక్తి’ని ఓ మోస్తరుగానైనా అర్థం చేసుకోగలుగుతాం.
కొల్హాపూర్ నుంచి మాస్టర్ వినాయక్‌తో కలిసి బొంబాయి వచ్చిన లత, ఆమె కుటుంబం కొన్నాళ్ళపాటు బంధువుల ఇళ్ళల్లో ఉన్న తర్వాత తమకంటూ ఒక ఇల్లు చూసుకోవాల్సి వచ్చింది. బొంబాయిలో తన తొలి జీతంతో ఇంటికి అడ్వాన్స్ ఇచ్చింది లత. రోజూ సాధన చేసేందుకు ఇంట్లో వీలు కుదరక మందిరంలో సాధన చేసేది. ఈ సమయంలో వారు ‘నానా చౌక్’లో ఉండేవారు. వీరితో పాటు వారి బంధువులు కూడా ఉండేవారు. వారి ఇంట్లో రెండు గదులుండేవి. దీనానాథ్ బ్రతికి ఉన్నప్పుడు సాంగ్లిలోని వారి ఇంట్లో 13 గదులుండేవి. అక్కడికి దగ్గర్లో మహాదేవుడి మందిరం ఉండేది. ‘మహాదేవుడు’ లత వాళ్ళ ఇంటి దైవం. 1945 నుంచి 1951 వరకు ఆ ధర్మశాలలోనే, ఆ రెండు గదుల ఇంట్లోనే ఉన్నారు. అవకాశం చిక్కినప్పుడల్లా మందిరంలోనే సాధన చేస్తుండేది లత. మరోవైపు ఆమె చదువు ఆరంభించింది. తండ్రి దగ్గర మానేసిన శాస్త్రీయ సంగీతం ఒకవైపు, పాఠశాలకు వెళ్ళలేకపోవటం వల్ల ఆగిపోయిన చదువు మరోవైపు, సినిమాల్లో నటన ఇంకోవైపు. పరిస్థితి కాస్త కుదుట పడుతోందన్న తరుణంలో మాస్టర్ వినాయక్ మరణించాడు. దాంతో బొంబాయిలో ఆధారం లేక మళ్ళీ లత ఒంటరిదైపోయింది.
దునియామే హమ్ ఆయే హైతో జీనా హీ పడేగా
జీవన్ హై అగర్ జెహర్ తో పీనా హీ పడేగా
‘మదర్ ఇండియా’లోని అత్యద్భుతమైన, స్ఫూర్తివంతమైన, అర్థవంతమైన పాటలలో అగ్రస్థానం వహిస్తుందీ పాట. మామూలు పదాలతో అత్యంత లోతుగా, భారతీయ సామాజిక మనస్తత్వాలలో ఇమిడి ఉన్న తాత్వికతను ప్రదర్శించిన అత్యద్భుతమైన గేయం ఇది. షకీల్ బదాయుని రచించగా నౌషద్ ఈ పాటకు బాణీని రూపొందించాడు. ఈ పాటలో నర్గీస్ నాగలి పట్టుకుని పొలం దున్నుతుంటే, ఇద్దరు చిన్న పిల్లలు ఆమెకు సహాయంగా నాగలి దిశను నిర్దేశిస్తుంటారు. పాట పాడుతూ, పాట ద్వారా తమకు తామే ధైర్యం చెప్పుకుంటూ…
మాలిక్ హై తేరే సాథ్ న డర్ గమ్ సే తూ ఏ దిల్
మెహనత్ కరె ఇన్సాన్ తో క్యా కామ్ హై ముష్కిల్
భగవంతుడిపై భారం వేసి ముందుకు సాగుతారు. ఈ పాటను లతా మంగేష్కర్‌తో పాటు ఉషా మంగేష్కర్, మీనా మంగేష్కర్‌లు పాడారు. ఈ పాట వింటుంటే దీనానాథ్ మరణం తర్వాత, కుటుంబంతో లత బొంబాయి చేరి, అక్కడి సినీ ప్రపంచంలో నిలదొక్కుకునే సమయంలో బహుశా ఇలాంటి ఆలోచనలే ఆమెకు ధైర్యం ఇచ్చి ఉంటాయేమో అనిపిస్తుంది. ఇలాంటి ఆలోచనలే ఈ పాటను పాడుతున్నప్పుడు ఆమె మదిలో జ్ఞాపకానికి వచ్చి ఆమె స్వరంలో పలుకుతున్న భావాలకు ఆర్ద్రతను ఆపాదించి ఉంటాయేమో. దేవుడు తన వెంట ఉన్నాడన్న నమ్మకంతో, కష్టపడిన వాడికి ఫలితం లభిస్తుందన్న విశ్వాసంతో, ప్రతి తిరస్కారాన్ని, ప్రతిబంధకాన్ని మరింత సాధనతో మరింత పట్టుదలతో ఎదుర్కొనే ధైర్యాన్ని సాధించిందేమో అనిపిస్తుంది. ఆమెను చులకన చేసినా, చదువు రాదని హేళన చేసినా, గొంతు పనికి రాదని తిరస్కరించినా, పాటలు పాడడం రాదని ఈసడిరచినా, ప్రతి తిరస్కారాన్ని భవిష్యత్తులో ఆమోదంగా రూపాంతరం చెందించగలనన్న ధైర్యంతో సాగేందుకు ప్రేరణ, దైవంపై విశ్వాసం, విధిపై నమ్మకం కలిగించాయేమో!
గిర్ గిర్ కె ముసీబత్ మె సంభల్ తేహీ రహేంగే
జల్ జాయె మగర్ ఆగ్‌పె చల్‌తే హీ రహేంగే
గమ్ జిస్ నే దియే హై వహీ గమ్ దూర్ కరేగా!
లతా మంగేష్కర్ బొంబాయిలో అడుగుపెట్టే సమయానికి ఆమె వయస్సు కేవలం పదమూడు! ఇంటి బాధ్యత మొత్తం ఆమెదే. ఆమెతో పాటు మొత్తం ఎనిమిది మంది కుటుంబ సభ్యులు. వారిలో ఆమె తల్లి, పిన్ని తప్ప మిగతావారందరూ చిన్నపిల్లలే. కానీ ఇంటికి పెద్ద లతా మంగేష్కర్. ఆమెకు చదువు లేదు. ఒకరోజు పాఠశాలకు వెళ్ళి ‘శ్రీ గణేశాయ నమః’ అని రాసిన తర్వాత రోజు నుంచీ పాఠశాల మొహం చూడలేదు. చెల్లెలు ఆశాను స్కూలుకు రావద్దన్నందుకు మళ్ళీ స్కూలు మొహం చూడలేదు. అంత ఆత్మగౌరవం ఆ వయసులోనే ప్రదర్శించింది. అది నిర్మాణాత్మకమైన ఆత్మగౌరవమా, స్వీయ విధ్వంసకారిణి అయిన అహంకారమా? అన్నది ఆలోచించదగ్గ విషయం. కానీ జీవితాంతం లత పలు సందర్భాలలో ఇలాంటి ఆత్మగౌరవం ప్రదర్శించింది! ఎలాగైతే ‘దునియామె హమ్ ఆయాహై తో’ పాటలో లతతో గొంతు కలిపి, లత అన్న మాటలను తాము బుద్ధిగా అన్నారో, అలాగే నిజ జీవితంలో కూడా లతా మంగేష్కర్ అడుగుతో అడుగు కలిపి నీడలా వెన్నంటి ఉన్నారు మీనా, ఉషా మంగేష్కర్‌లు.
‘మా అక్కలో ఏదో ప్రత్యేకత ఉందని మాకు చిన్నప్పుడు మేమంతా సంగీత సాధన చేసే సమయంలో తెలిసేది. అక్క స్వరంలో, పాట పాడే విధానంలో అందరికన్నా భిన్నత్వం గోచరించేది’ అంటాడు హృదయనాథ్ మంగేష్కర్ బాల్యాన్ని గుర్తుచేసుకుంటూ. అయితే తండ్రి మరణంతో లత ప్రత్యేకత పోయింది. విశాలమైన ప్రపంచంలో తనకన్నా శక్తివంతమైన స్వరాలతో, తనకన్నా అందమైన వ్యక్తులతో, అధిక విద్యావంతులతో, పెద్దపెద్ద వారితో సంబంధం, అనుబంధం ఉన్నవారితో, తనను ప్రత్యేకంగా కాక మామూలు మనిషిలా చూసే వారితో, పైకి కనబడే ఆకారం, దుస్తుల ఆధారంగా అభిప్రాయాన్ని ఏర్పరచుకునేవారితో వ్యవహరిస్తూ, పోటీపడి, తన ప్రత్యేకతను నిరూపించుకోవాల్సిన అవసరం లతకు వచ్చింది. ఈ ప్రత్యేకత నిరూపించుకోవటం కూడా జీవిక కోసం పోరాటంలో భాగమవటం అత్యంత దురదృష్టం. ఎవరినైనా నిరాశా పాతాళంలోకి నెట్టివేసే పరిస్థితి ఇది.
లతకు మాస్టర్ వినాయక్ రావు కేవలం తన సినిమా కంపెనీలో ఉద్యోగం ఇవ్వటమే కాదు, దీనానాథ్ మంగేష్కర్‌తో ఉన్న అనుబంధం వల్ల ఆమె బాగోగులు చూసే సన్నిహిత బంధువుగా వ్యవహరించాడు. ఆమెను సంగీత సాధన కొనసాగించమన్నాడు. గురువును చూపించటమే కాదు, గురువుకు చెల్లించాల్సిన ఫీజును కూడా ఆమెకిచ్చే జీతంలో భాగం చేశాడు. ఆమెను చదువుకోమన్నాడు. ముఖ్యంగా హిందీ భాషను నేర్చుకోమన్నాడు. మహారాష్ట్రలో భాగం అయినా, బొంబాయి హిందీ సినిమాకు కేంద్రం. కాబట్టి బొంబాయిలో నెగ్గుకు రావాలంటే ‘హిందీ’ తప్పనిసరి అని ఆయన గ్రహించాడు. అయితే స్కూలుకు వెళ్ళి చదువుకునే వీలులేదు కాబట్టి లత ప్రైవేటుగానే హిందీ నేర్చుకుంది. అది లత జీవితంలో నిర్ణయాత్మకమైన సమయం. 1942 నుండి 1948 వరకు లత పడిన కష్టాలు, చేసిన సాధన ఆమె భవిష్యత్తుకు మార్గాన్ని ఏర్పరిచాయి. ‘కష్టాన్నిచ్చినవాడే కష్టాన్ని తొలగిస్తాడన్నట్టు’ ఒకటొకటిగా కష్టాలు తొలగిపోయాయి. లత పాడిన ‘ఏక్ ప్యార్ కా నగ్‌మా హై’ పాటలోని ఓ చరణం పంక్తిలో అన్నట్టు…
తూఫాన్ కొ ఆనా హై
ఆకర్ చలే జానా హై
బాదల్ హై యే కుఛ్ పల్ కా
ఛాకర్ ఢల్ జానా హై
పర్ఛాయియాన్ రెహజాతీ
రెహజాతీ నిషానీ హై…
తుఫాను రావాలి. వస్తుంది, వచ్చి వెళ్ళిపోతుంది. ఆకాశంలో అలముకున్న నల్లటి మేఘాలు కాసేపటి తరువాత తొలగిపోతాయి. కానీ ఆ తుఫాను తాలూకు అనుభవాలు, జ్ఞాపకాలు మిగిలిపోతాయి. అది మనసులో చేసిన గాయం తాలూకు అనుభూతుల చిహ్నాలు మిగిలిపోతాయి. ఈ ఆరేళ్ళ కాలంలో లత ఎదుర్కొన్న తుఫానులు, దట్టమైన నల్లటి మేఘాలు కలిగించిన భయాలు, వేదనలు ఆమె వ్యక్తిత్వాన్ని నిర్దేశించాయి. ఇది ఆ కాలంలో ఆమె అనుభవాలను తెలుసుకుంటే స్పష్టమవుతుంది.
దీనానాథ్ మరణంతో లత శాస్త్రీయ సంగీతం నేర్చుకోవటం ఆగిపోయింది. తండ్రి నేర్పించిన రాగాలనే ఆమె అధ్యయనం చేస్తుండేది. చదువు లేకపోవడంతో ‘పాట’ తప్ప మరో ఆధారం లేని పరిస్థితి. నటన ఇష్టం లేదు, తప్పనిసరి పరిస్థితిలో తెరపై కనిపించింది తప్ప ఆమెకు తెరపై కనబడడం కష్టంగా ఉండేది. పైగా, నటించేటప్పుడు పదిమంది దృష్టి తనపై ఉండటం కూడా ఆమెకు ఇబ్బందిగా ఉండేది. ఇది మాస్టర్ వినాయక్‌కు కూడా తెలుసు. అందుకని ఆయన లతను సంగీత సాధన కొనసాగించమని ‘ఉస్తాద్ అమాన్ అలీఖాన్ భేండీ బజార్ వాలే’ దగ్గర శిష్యురాలిగా పంపించాడు. ఆగస్టు 11, 1945న ఆమెను ఉస్తాద్ శిష్యురాలిగా స్వీకరించాడు. ఒక గురువు వద్ద శిష్యురాలిగా చేరటం అంటే గురువును సంపూర్ణంగా స్వీకరించటం, గురువు మాటను దైవాజ్ఞలా భావించటం. ముఖ్యంగా, ‘సంగీత దీక్ష’ స్వీకరించటం అంటే గురువు నేర్పిన గాన పద్ధతిని అనుసరించి మాత్రమే గానం చేయటం. దీన్ని ‘గండా బంధన దీక్ష’ అంటారు. 1945లో లత ఉస్తాద్ అమాన్ అలీఖాన్ భేండీ బజార్ వాలా నుంచి ‘గండా బంధన దీక్ష’ను స్వీకరించింది. ఆయన ‘హంసధ్వని రాగం’తో శిక్షణ ఆరంభించాడు. అయితే లత అంతకు ముందే ఈ రాగం తండ్రి దగ్గర నేర్చుకుంది. సాధన చేసింది. దాంతో ఆమె త్వరగానే గురువు అభిమానం పొందింది. లత అతి త్వరగా విషయాన్ని గ్రహించటంతో ఉస్తాద్ ఆమెకు ఎంతో శ్రద్ధగా, ఆప్యాయంగా, తన్మయత్వంతో పాఠాలు చెప్పడం ప్రారంభించాడు.
ఆయన అప్పుడు చెప్పిన పాఠాలు లత మనసులో ఎంత లోతుగా నాటుకున్నాయంటే, ఇప్పటికీ ఆ పాఠాలు మరిచిపోలేదు. ఆ రాగాలు విన్నప్పుడల్లా ఆయన స్వరం తన చెవుల్లో ప్రతిధ్వనిస్తుందని లత ఇంటర్వ్యూలో చెప్పింది.
‘‘ఆయన విలంబిత లయలో ‘పతిదేవన్ మహాదేవన్’, ద్రుత్ లయలో ‘లాగీ లగన్ పతి సఖీ సంగ్’ అన్న ‘బందిష్’లు నేర్పారు’’ అని చెప్పి పాడి చూపించింది లత. ఆ తర్వాత ఆయన యమన్, తోడీ వంటి రాగాలను నేర్పించాడు. లతను తన కూతురిలా చూసుకున్నాడు. ఆ కాలంలో లత సన్నగా, బలహీనంగా ఉండేది. భవిష్యత్తు పట్ల బెంగ ఒకవైపు బాధిస్తుంటే మరోవైపు ఆ చిన్న వయసులోనే
ఉద్యోగం చేసి డబ్బు సంపాదించాల్సి రావటంతో ఆమె శారీరకంగా, మానసికంగా అలసిపోయేది. అది గమనించిన ఉస్తాద్ ఆమె కోసం రొట్టెలు, ఆమ్లెట్‌లు తెచ్చేవాడు. ‘ఇవి తిన్న తర్వాత పాఠం చెప్తాను. పాట పాడాలంటే బలం కావాలి’ అనేవాడు. దగ్గరుండి తినిపించేవాడు. రోజుకు కనీసం రెండు గంటలు పాఠం నడిచేది. ఉస్తాద్ అమాన్ ఆలీ ఖాన్ భేండీ బజార్ వాలా, బొంబాయి విడిచి తన స్వంత ఊరు వెళ్ళిపోయాడు. మళ్ళీ మాస్టర్ వినాయక్ ఉస్తాద్ అమానత్ ఖాన్ దేవాసవాలే అనే మరో గురువును కుదిర్చాడు. ఈయన సినిమా వాళ్ళందరికీ సంగీతం నేర్పించాడు. ఈయన దగ్గర సంగీతం నేర్చుకున్న వారిలో నర్గీస్ తల్లి జడ్డన్ బాయి, నర్గీస్ కూడా ఉన్నారు. అయితే ఏదో పనిమీద ఇండోర్ వెళ్ళిన అమానత్ ఖాన్ మళ్ళీ బొంబాయి రాలేదు. దాంతో మళ్ళీ లత సంగీత అధ్యయనంలో విఘాతం ఏర్పడిరది. వీరిద్దరూ అంటే, ఉస్తాద్ అమాన్ అలీ ఖాన్ భేండీ బజార్ వాలా, ఉస్తాద్ అమానత్ ఖాన్ దేవా సవాలే లిద్దరూ బొంబాయిలో లతకు సంగీతం నేర్పిన గురువులు.
అమాన్ అలీఖాన్ స్వంత ఊరు వెళ్ళిపోవడంతో లత సంగీత విద్య మళ్ళీ వెనుకబడిరది.