గమనమే గమ్యం -ఓల్గా

మెల్లీ మౌనంగా విని కాసేపు ఆలోచించి ‘‘కామేశ్వరరావు విషయం నువ్వు మూర్తితో మాట్లాడలేదు కదా. అతనికి కోపం వస్తే అది నీ నిర్ణయమన్నావు కదా. అప్పుడు అతని గురించి నువ్వు ఆలోచించలేదు. అతని దానికి బదులు తీర్చుకున్నాడు. మీరిద్దరూ అనేక విషయాలు కలిసి నిర్ణయించుకోవాల్సి వస్తుంది. ఇవాళ ఏం కూర వండమంటారు అని మాత్రమే

అడిగే మామూలు గృహిణివి కాదు నువ్వు. నీకో కొత్త చీరె కొని నగలు చేయించి లోబరుచుకునే మామూలు భర్త కాదు అతను. మీరు మీ హద్దులు స్పష్టంగా గుర్తించాలి. ఎవరి ప్రాంతం ఏది, ఎక్కడికి ఎవరు చొచ్చుకురాకూడదు, ఎక్కడికి ఇతరులను రానీయకూడదు, ఈ విషయాల్లో గందరగోళపడితే చాలా బాధలొచ్చి పడతాయి. మీరు కూచుని శాంతంగా మాట్లాడుకోండి’’.
శారద మౌనంగా ఉండిపోయింది.
‘‘శారదా! నీకు రాజకీయాలు, ఇల్లు, ఆస్పత్రి చాలా బాధ్యతలు. అంత బాధ్యతతో మూడిరటినీ నడపాలి, నడుపుతున్నావు. ఆ నీ సామర్ధ్యం చూసి మూర్తి భరించలేకపోతున్నాడు. మగవాళ్ళకు చాలా అహం ఉంటుంది. కమ్యూనిస్టులైనంత మాత్రాన అది పోదు. వాళ్ళు మగ కమ్యూనిస్టులుగానే ఉంటారు. భార్యలను భార్యలుగానే చూస్తుంటారు. వాళ్ళను మనం మార్చాలి. దానికి చాలా ఓపిక కావాలి. మీ ఇద్దరి మధ్యా ఉన్న ప్రేమ నీకు ఆ ఓపికను ఇవ్వాలి. ఇస్తుంది.’’
మెల్లీ మాటలకు శారదాంబ మనసు కొంత మెత్తబడిరది.
‘‘మీతో మూర్తి ఈ విషయాలు మాట్లాడాడా?’’
‘‘మాట్లాడాడు. ఒక మగవాడిలాగే మాట్లాడాడు. నేను చెప్పినది విన్నాడు గానీ ఎంతవరకు అర్థం చేసుకున్నాడో అనుమానమే. ఎందుకంటే అతన్ని మార్చే శక్తి నీ దగ్గర తప్ప మరెవరి దగ్గరా
ఉండదు. మా అందరితో పని చేస్తున్నప్పుడు అడ్డం రాని అహం నీ దగ్గరే వస్తుంది. నువ్వు భార్యవి కాబట్టి, అది చాలా సంప్రదాయ సంబంధం. దాన్ని మార్చాలి మనం. ఆలోచిస్తే నీకే తెలుస్తుంది. రాజీ పడొద్దు, కానీ మాట్లాడు. అదొక్కటే మార్గం’’.
మెల్లీ మాటలు మననం చేసుకుంటూ అంది శారద ‘‘నేను అతని భార్యను కాను. సంప్రదాయం ప్రకారం అసలు కాను. నన్నతను భార్యలా చూడటం నేనూ భరించలేకపోతున్నాను’’.
‘‘సంప్రదాయం ప్రకారం భార్యవు కావు, నిజమే. కానీ మూర్తి నిన్నలాగే చూస్తున్నాడు. నీ చుట్టూ ఉన్నవాళ్ళూ అలాగే చూస్తున్నారు. దాన్ని నువ్వర్ధం చేసుకోవాలి. నువ్వు కోటిమందిలో ఒకతివి. కోటిమంది నిన్నర్థం చేసుకోవటం మాటలు కాదు. నువ్వు కత్తి మీద సాము చెయ్యాలని నాకు తెలుసు. కానీ తప్పదు’’.
మెల్లీ మెల్లిగా శారదను అనునయిస్తూ మాట్లాడిరది. శారద తనలోకి తను చూసుకుంటున్నట్లు మెల్లీకి చెప్పింది. ‘‘నేను మా ఇద్దరి సంబంధాన్ని చాలా ఉన్నతంగా అనుకున్నాను. ‘భార్య’గా ఉండాలని నాకు లేకపోయినా లోకమంతా నన్ను మూర్తి భార్యగానే చూస్తోంది. భార్యగా కొందరూ, ఇంకో విధంగా కొందరూ మొత్తానికి మూర్తికి నా మీద మరెవరికీ లేని అధికారం ఉందని చెప్తున్నారు. నేను దానికి అంగీకరించటానికి సిద్ధంగా లేను. మూర్తితో ఆ విషయం స్పష్టంగా చెప్పాను. మేం ప్రేమికులం, కలిసి బతుకుతున్నాం. ఇద్దరు మనుషులు కలిసి బతుకుతున్నప్పుడు ఏవో గొడవలు, అహంకారాలు, అభిప్రాయ భేదాలు వస్తాయి. వాటి గురించి మాట్లాడి ఒకరినొకరు అర్థం చేసుకోగల పరిణితి మా మధ్యలో ఉంటేనే మా సంబంధం నిలబడుతుంది. అలా కాకుండా తరతరాలుగా భార్యాభర్తల మధ్య ఉన్న అధికార సంబంధాన్ని మా మధ్యకు మూర్తి తెచ్చాడా, ఒక్క క్షణం ఆ బంధం నిలనదు. ఆ విషయంలో రాజీ ప్రసక్తే లేదు. నన్ను నేను పోగొట్టుకోను’’.
శారద చేతిని తన చేతిలోకి తీసుకుని ప్రేమగా నొక్కింది మెల్లీ.
‘‘ముందు నువ్వు ఏమిటో అది తెలుసుకో’’.
శారద గలగలా నవ్వేసింది.
‘‘నేనేమిటో నాకు తెలుసు మెల్లీ. నేను ఆధునిక స్త్రీని. అనుక్షణం సమాజంతో తలపడుతూ, దానిని మార్చాలని తపన పడే ఆధునిక స్త్రీని. సమాజంలోని సకల సంబంధాలనూ మార్చే గొప్ప పూనికతో పెరిగిన ఆధునిక స్త్రీని. నాకు సంకెళ్ళు లేవని కాదు, నిరంతరం ఆ సంకెళ్ళు తెంచే పనే నాది. ఒక సంకెల తెగితే మరొకటి వచ్చి పడుతోంది. నేను పోరాడుతున్నాను, జీవిస్తున్నాను. స్త్రీగా, కమ్యూనిస్టుగా, డాక్టర్‌గా, కూతురిగా, తల్లిగా, ఒక పౌరురాలిగా జీవిస్తున్నాను. ఎంత ఘర్షణ మెల్లీ, ఎన్ని పరీక్షలు, ఎన్ని విజయాలు, ఎన్ని అపజయాలు. ఐనా ఆనందంగా ఉంది. నేను నేనైనందుకు ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది. జీవితం అంటే ఇట్లా ఉండాలనిపిస్తోంది. సవాళ్ళతో, సందిగ్ధతలతో, ప్రశ్నలతో, సమాధానాలతో, ఎలాంటి సమయంలో జీవిస్తున్నాం కదా మనమందరం’’.
వెలుగుతున్న శారద ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది మెల్లీ.
‘‘శారదాంబకు ఈ ఉత్తరం ఇచ్చి రావాలమ్మా’’ అంటూ పార్టీ ఆఫీసుకు వచ్చిన కార్యకర్త ఒకాయన సత్యవతి చేతిలో ఒక కాగితాల కట్ట పెట్టాడు. ‘‘ఇది ఉత్తరమా’’ అనుకుని నవ్వుకుంటూ హుషారుగా బయల్దేరింది సత్యవతి. శారదాంబ ఇంటికి వెళ్ళటం అంటే సత్యవతికి చాలా ఇష్టం. శారదాంబ కనపడినంతసేపూ నవ్వుతూ మాట్లాడుతుంది. ఆ కాసేపట్లోనే మనకు అండగా డాక్టరుగారున్నారనే భావన కలిగిస్తుంది. సుబ్బమ్మ గారు తినటానికి ఏదో ఒకటి పెడతారు. సుబ్బమ్మ కోడలు పద్మ సరదాగా మాట్లాడుతుంది. మహిళా సంఘం ముచ్చట్లు చెప్పుకుంటారు. ఆ సంతోషం తొందరపెడుతుంటే వేగంగా నడుస్తూ వచ్చిన సత్యవతి ఇంటి ముందు ఆవరణలోనే ఆగిపోయింది. సెప్టెంబరు నెలలో గులాబీలు ఇంత విరగబూస్తాయా అనుకుని కళ్ళు విప్పార్చుకుని చూస్తోంది. ఇంటి ముందు తోటంతా ఎర్రని, తెల్లని గులాబీల పంట పండినట్లుంది. గాలికి తలలు ఊపుతూ మనోహరంగా ఉన్నాయి. సత్యవతికి ఆ పూలన్నిటికీ రాణుల్లా అరచేయి వెడల్పులో, ఎర్రని ఎరుపు రంగులో ఉన్న రెండు గులాబీలను చూస్తే మనసాగలేదు, చేయి ఊరుకోలేదు. గబగబా వెళ్ళి వాటిని కోసింది. మహా అమూల్యమైన కానుక తీసు కెళ్తున్న భక్తురాలిలా లోపలికి వెళ్ళింది. శారద హాస్పిటల్‌కు వెళ్ళటానికి తయారై బయటకు వస్తూ సత్యవతిని చూస్తూ ‘‘ఏంటోయ్‌, పొద్దున్నే ఇలా వచ్చావు’’ అంటూ నవ్వుతూ భుజం మీద చెయ్యి వేసి తట్టింది. సత్యవతి భగవంతుడికి సమర్పిస్తున్నట్లుగా ఆ గులాబీలను శారదాంబ కళ్ళముందుంచింది గర్వంగా. శారదాంబ ముఖంలో నవ్వు పోయి గంభీరమై ‘‘ఎక్కడివివి?’’ అంది. ‘‘మీ తోటలోవే’’ పెద్ద రహస్యం కనుక్కున్నట్లు చెప్పింది.
‘‘ఎందుకు కోసావు?’’
‘‘మీ కోసమే’’ ప్రేమగా చెప్పింది. ‘‘తల్లో పెట్టుకుంటే అందంగా ఉంటుందని.’’
శారద కోపాన్ని కంట్రోల్‌ చేసుకుంటూ ‘‘నా తల్లో ఎన్నడైనా ఈ పూలు చూసావా? నేను పూలు పెట్టుకోవటం చూసావా? హాయిగా అందంగా చెట్టుమీద ఉండే పూలని కోసెయ్యటానికి నీకు మనసెట్లా ఒప్పింది? కొంచెం ఆలోచిస్తే తెలిసేదే… చెట్టున ఉంటే నాలుగురోజులు అందరి కళ్ళకూ పండగలాగా ఉంటుంది. నా తల్లోనో నీ తల్లోనో సాయంత్రానికి వాడిపోతాయి. ఇంకెప్పుడూ గులాబీలు కోయవద్దు’’ ఎంత పొరపాటు చేసినా నవ్వుతూ సరిదిద్దే డాక్టర్‌ గారికి ఇంత కోపం వచ్చిందంటే అది చెయ్యకూడని పనే అని సత్యవతికి రూఢీ అయింది.
‘‘ఇలా తిరుగు’’ అని సత్యవతిని వెనక్కి తిప్పి ఒక పువ్వు ఆమె జడలో పెట్టి, ‘‘ఇది మా అమ్మకివ్వు. చిన్న గిన్నెలో నీళ్ళు పోసి పెడుతుంది. రెండు రోజులు అలాగే ఉంటుంది. ఇంతకూ నువ్వు వచ్చిన పనేంటి?’’ శారద చేతిలో తను తెచ్చిన కాగితాల కట్ట పెట్టింది సత్యవతి. అది తీసుకుని బైటికి వెళ్తున్న శారదకు ఇద్దరు కార్యకర్తలు ఎదురొచ్చారు. సత్యవతి వాళ్ళనెప్పుడూ చూడలేదు. ఖద్దరు పంచెలు కట్టుకుని, అరచేతుల చొక్కాలతో నవ్వుతూ మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఇద్దరి చేతుల్లో పచ్చని విచ్చీ విచ్చని పత్తి కాయలున్నాయి.
శారదాంబ కళ్ళు వాటిమీద పడ్డాయి. వాటినీ, వాళ్ళ ముఖాలనూ మార్చి మార్చి చూస్తున్న శారదను చూస్తుంటే సత్యవతికి ఏదో అర్థమైంది. ఇప్పుడేం జరుగుతుందో చూద్దాం అని కుతూహలంతో నాలుగడుగులు బైటికి వేసింది.
‘‘ఏంటా కాయలు?’’ అనుమానంగా అడిగింది శారద.
‘‘పత్తి కాయలు డాక్టరు గారూ. పత్తి చేలకడ్డంబడి వచ్చాం లెండి. ఈ సంవత్సరం పత్తి బాగా అవుతుంది. చెట్టు నిండా కాయలే’’
‘‘ఏం లాభం రైతుకి రూపాయి రాదు’’ శారద కఠినంగా అంది.
‘‘ఏం? ఎందుకు రాదు?’’ ఆశ్చర్యంగా తమ చేతుల్లో బలంగా, ఆరోగ్యంగా ఉన్న పత్తి కాయలను మార్చి మార్చి చూశారిద్దరూ.
‘‘పత్తి చేల మీదుగా వచ్చిన ప్రతివాడి చేతులూ దురద పెట్టి ఒక్కోడూ ఐదారు కాయలు కోస్తే ఇంకా పగిలి పత్తి ఇవ్వటానికి కాయలెక్కడుంటాయి. అమ్ముకోటానికి రైతుకి పత్తెక్కడుంటుంది? ఆ కాయలు ఎందుకైనా పనికొస్తాయా? మీరు సరదాకా పట్టుకోటానికి తప్ప. కనీసం బాగా పగిలి పత్తి వస్తున్న కాయలు కోసినా మీ ఇంట్లో వాళ్ళు ఆ పత్తిని దేనికైనా ఉపయోగించుకుందురు. ఈ కాయలు ఎందుకు కోసినట్టూ’’ పాలిపోతున్న ఆ ఇద్దరు యువకుల ముఖాలు చూసి సత్యవతి ముఖంలో ‘‘బాగా అయ్యింది’’ అన్న తృప్తి, చిన్న నవ్వు. తన బాధను మర్చిపోయి ఎగురుతున్నట్టే లోపలికి పోయింది. పద్మతో ఈ సంగతి చెప్పి నవ్వీ నవ్వీ ఆయాసపడిరది.
… … …
రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లరు ఓడిపోవడం వల్ల బ్రిటిష్‌ వాళ్ళకు కలిగింది తాత్కాలిక ఉపశమనమే అయింది. యుద్ధం పేరుతో ఏదో ఒక రకంగా వలస దేశాలలో ఉద్యమాల ఉధృతిని ఆపుకొంటూ వస్తున్న సామ్రాజ్యానికి అది ఇక కుదరని పని అయింది. ముఖ్యంగా భారతదేశంలో వారి పరిస్థితి రోజురోజుకీ క్షీణిస్తోంది. తిరగబడని వర్గమంటూ ఏదీ మిగలలేదు. దేశంలో ఎక్కడ చూసినా కార్మికులు, ప్రభుత్వోద్యోగులూ తిరగబడుతున్నారు. సమ్మెలు ముమ్మరమయ్యాయి.
సైనికులు, నావికులు కూడా తిరగబడితే ఏ సామ్రాజ్యం తట్టుకు నిలబడగలుగుతుంది?
కానీ చివరి క్షణందాకా సామ్రాజ్యాన్ని రక్షించుకోవాలి, భారతదేశాన్ని సర్వనాశనం చేసి గాని వదలకూడదనే పట్టుదలతో బ్రిటిష్‌ ప్రభుత్వం అన్ని రకాల ఉపాయాలను, వ్యూహాలను ఆశ్రయించి రోజులు పొడిగించుకోవాలని చూస్తున్నది.
ఆ వ్యూహాలలో ఒక భాగంగా ఎన్నికలను ప్రకటించింది. దేశం వదిలి వెళ్ళాక ఎన్నికలు మీరు పెట్టేదేమిటని భారతీయులు అడగరనీ, కొత్తగా నేర్చుకున్న ఈ ఎన్నికల ప్రక్రియ మీద వారికి వల్లమాలిన మోజనీ ప్రభుత్వానికి తెలుసు. ప్రొవొన్షియల్‌ ఎన్నికలకు అన్ని పార్టీలూ సిద్ధమయ్యాయి.
బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా జరగాల్సిన సభలలో, స్వతంత్య్రానంతర దేశ పునర్నిర్మాణం కోసం భిన్న రాజకీయాలలో
ఉన్నవారి మధ్య జరగాల్సిన సభలలో కొన్నిటినైనా భారతీయులు తమకు తామే వ్యతిరేకంగా మాట్లాడుకోవటానికీ, కొట్లాడుకోవటానికీ మళ్ళించడం ప్రభుత్వ ఉద్దేశమైతే అది నెరవేరింది. అన్ని పార్టీలూ ఎన్నికలకు సిద్ధమయ్యాయి. కమ్యూనిస్టు పార్టీ తన అభ్యర్ధులను ప్రకటించింది. పూనా ఒడంబడిక ప్రకారం హరిజన అభ్యర్ధులకు ముందు ప్యానల్‌ ఎన్నికలు జరిగాయి. రామకృష్ణయ్య, శారద, ఈశ్వరరావు వంటి అగ్రశ్రేణి నాయకులు పనిచేసి లక్ష మందితో బహిరంగ సభ జరిపారు. ప్యానల్‌ ఎన్నికలలో గెలుస్తామనే గట్టి ఆశ కృష్ణాజిల్లా రిజర్వుడు స్ధానం మీద, క్రైస్తవ రిజర్వుడు స్థానంలోనూ కమ్యూనిస్టులకు ఉంది. అలాంటి ఆశతోనే ఏలూరు నియోజకవర్గంలో శారదాంబను నిలబెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా, గోదావరి జిల్లాలలో శారదంటే ప్రజలకు అభిమానం ఉంది. సమర్ధురాలు. తప్పక గెలుస్తుందని అందరికీ నమ్మకం ఉంది.
అందరూ ఉత్సాహంగా శారదను అభినందిస్తుంటే మూర్తి ముఖమే కొంచెం కళావిహీనమైంది.
శారద అది గమనించింది.
‘‘మూర్తీ! నువ్వు ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే నాకు సీటు వచ్చినట్టుంది గదోయ్‌’’ అంది నవ్వుతూనే.
‘‘నాకెందుకు సీటిస్తారు శారదా, నేనెవరిని? శారద భర్తను. ఆ కారణంగానే బెజవాడ వచ్చాను, వచ్చినవాడిని ఊరికే కూర్చోబెట్టడమెందుకని బాధ్యతలప్పగించారు. అంతేగాని ఎన్నికల్లో సీటెందుకిస్తారు?’’ అన్నాడు పరిహాసంగానే, నవ్వుతూనే.
‘‘నవ్వుతూ అంటున్నావా? నిజంగా నీ మనసులో ఏముంది మూర్తీ’’ శారదకు మనసులో ఏదో శంక మొదలైంది.
‘‘నా మనసులో ఏముందో గ్రహించలేనంతగా నాకు దూరమయ్యావా?’’ అంటూ అక్కడినుండి వెళ్ళిపోయాడు మూర్తి.
శారదకు మూర్తి భావం అర్థం కాలేదు. అపార్ధం చేసుకోబుద్ధి కాలేదు.
మూర్తిది అంత చిన్న మనసు అనుకోవటం అసాధ్యంగా ఉంది. కానీ కామేశ్వరరావుని ఇంట్లో ఉంచినపుడు అతని మానసిక స్థితి, అతను చేసిన పని గుర్తొస్తే ఇప్పుడు కూడా అతని పురుషాహంకారం వేధిస్తున్నదా అనే అనుమానమూ కలుగుతోంది. అహంకారం తలెత్తితే అంకురంలోనే తుంచివేయటం తప్ప మార్గం లేదు. తలెత్తకుండా ఉండేంతటి మహాత్ముడు కాదు మూర్తి. మగవాళ్ళను మహాత్ములుగా కాదు ముందు మగబుద్ధి వదిలించి మనుషులుగా మార్చుకోవాల్సిన పని కూడా ఆడవాళ్ళదే. అబ్బా… ఆలోచిస్తేనే విసుగ్గా, అలసటగా ఉంది. కానీ తప్పదు, ఇది ముఖ్యమైన పని అనుకుంది శారద. ఆ పనికంటే ముందు ఎన్నికల పనులు వచ్చి మీద పడ్డాయి. మరి దేని గురించీ ఆలోచించే, పని చేసే వ్యవధానం లేదు.
ఎన్నికలంటే కోలాహలమే. ఏలూరు ఎన్నికలలో నిలబడుతోంది ఇద్దరూ స్త్రీలే అవటం వల్ల మహిళా సంఘం అంతా ఏలూరుకి వచ్చేసింది. రెండు పెద్ద ఇళ్ళల్లో అందరికీ వసతి, భోజనం ఏర్పాటు చేయడంతో ప్రచార కార్యక్రమంలో అందరూ తలమునకలుగా ఉన్నారు. ఇంటింటికీ తిరిగి ప్రచారం. పేటల్లో మీటింగులు. పదిరోజులకొకసారి చొప్పున నెల రోజుల్లో మూడు బహిరంగ సభలు. శారదాంబ బృందమే పకడ్బందీగా ఎన్నికల ప్రచారం జరిగే పద్ధతంతా ప్లాన్‌ చేసుకున్నారు. శారద అంటే మహిళా సంఘం వాళ్ళందరికీ గౌరవం, ప్రేమ. అందరినీ ‘ఏమోయ్‌’ అంటూ చనువుగా కలుపుకుపోయే శారదలో నాయకురాలు, స్నేహితురాలు కూడా వాళ్ళకు కనిపించి ఆమెకు అతుక్కుపోయారు. పాటలు, నినాదాలూ తయారై పోతున్నాయి అప్పటికప్పుడు. కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్ధికి మహిళా సంఘం అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. పెద్ద నాయకులు, మగవాళ్ళే ప్రచారం కనిపిస్తున్నారు. ఆడవాళ్ళు చనువుగా ఇళ్ళల్లోకి వెళ్ళడం, మంచీ చెడ్డా మాట్లాడటం, పోషకాహారం గురించి చెప్పడం, శారద వెళ్ళిన చోట తల్లీ, పిల్లల ఆరోగ్యం గురించి విచారించి సూచనలివ్వటం వీటన్నిటితో శారదాంబ గెలుపు ఖాయమని అందరికీ అనిపించింది. మొదట్నుంచీ కమ్యూనిస్టులంటే పడని ‘ములుకోల’ పత్రికకు ఇది కంటగింపయింది. వెంటనే ‘శారదాంబ కాంట్రాక్టు పెళ్ళి’ అంటూ ప్రత్యేక కథనమొకటి ప్రచురించింది. కాంగ్రెస్‌ పార్టీ వాళ్ళు దానిని కరపత్రాలుగా మార్చి ఇంటింటికీ పంచి పెట్టారు.
రాజమ్మ, రాజేశ్వరి, ఉమ, విమల, మరో ఆరుగురు కలిసి ఇంటింటి ప్రచారం చేస్తుండగా ఒక ఇంట్లో వాళ్ళు ఈ కరపత్రాలు చూపించి దీని సంగతేంటని అడిగేసరికి రెండు నిమిషాలు అందరూ నిశ్శబ్దమైపోయారు. వెంటనే తేరుకుని ‘‘ఇలాంటి రాతలు డాక్టరు గారి గురించి రాసిన వాళ్ళకు మీరు ఓట్లెయ్యాలనుకుంటే వెయ్యండి. స్త్రీలను గౌరవించటం తెలియని పార్టీని ఎన్నుకోవాలనుకుంటే ఎన్నుకోండి. పుకార్లను నమ్మోద్ద’’ని చెబుతుంటే ఆ ఇంటావిడ రాజమ్మను ఆపేసింది.
‘‘అదంతా తరువాత సంగతమ్మాయ్‌. పుకార్లని మీరంటున్నారు. నిజాలని కాంగ్రెస్‌ వాళ్ళు ఈ కరపత్రాలు పంచిపెట్టి వెళ్ళారు. నాకొక్కటే సమాధానం సూటిగా చెప్పండి. డాక్టరమ్మగారి భర్తకు అంతకు ముందే పెళ్ళయిందా లేదా? పిల్లలున్నారా లేదా?’’
నలుగురూ ముఖాముఖాలు చూసుకున్నారు.
‘‘అంతవరకూ నిజమేనండి. డాక్టరు గారి భర్తకు అంతకుముందే పెళ్ళయింది. అది చిన్నతనంలో జరిగిన పెళ్ళి…’’
రాజమ్మ మాటలని మధ్యలో ఆపేస్తూ ఇంటి యజమాని కాబోలు అడ్డు వచ్చాడు.
‘‘మేమందరం చిన్నతనంలో పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళమే. ఇప్పుడు నదురుగా ఇంకో మనిషి కనిపిస్తే పెళ్ళి చేసుకుంటే ఇదిగో ఈవిడేమైపోతుంది? అదట్లా ఉంచండి, కొందరు మగవాళ్ళు రెండు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఎవర్నయినా ఉంచుకుంటారు. అది వాళ్ళిష్టం. మీ డాక్టరమ్మ ఆ ప్లీడరు గారిని సంప్రదాయ ప్రకారం సప్తపది, మంగళసూత్ర ధారణతో వివాహం చేసుకుందా? అట్లా జరిగి ఉంటే అందులో విడ్డూరం లేదనుకునేవాళ్ళం. ఈ కాంట్రాక్టు పెళ్ళేమిటి? కాగితాలు రాసుకుంటే సరిపోతుందా? అది మాకు అర్థం కావట్లేదు. అంతకంటే డాక్టరమ్మ గారిని మద్రాసు ప్లీడరొకాయన ఉంచుకున్నాడంటే బాగా అర్థమవుతుంది…’’
మహిళా సంఘం వాళ్ళ రక్తం ఉడికిపోయింది. ఉమ తన చేతిలో ఉన్న కాగితాల కట్టతో ఆ మగమనిషి భుజం మీద ఒక్కటి వేసి ‘‘రండే పోదాం. వీళ్ళతో మనకు మాటలేంటి’’ అని గిరుక్కున వెనక్కు తిరిగింది. మిగిలిన వాళ్ళూ ‘‘ఛీ! ఛీ! ఏం మనుషులు’’ అంటూ బైటికి నడిచారు.
‘‘మీ అఘాయిత్యం గూలా! ఆడవాళ్ళేనా మీరు. చెట్టంత మగాడి మీద చెయ్యి చేసుకుంటారా’’ అంటూ ఇంట్లో వాళ్ళు చేస్తున్న గోల వెనక నుంచీ వినపడుతూనే ఉంది.
ఇది తెలిసి శారద ఆలోచనలో పడిరది. ఇంటింటికీ వెళ్ళి ఈ ప్రచారం నీచమైనదని చెప్పటం వల్ల సమయం వృథా తప్ప ప్రయోజనం ఉండదు. అందరికీ ఒకేసారి సమాధానం ఇవ్వాలి. ముఖ్యంగా కాంగ్రెస్‌ పెద్దలకు. ఎలా? ఎక్కడ? ఎప్పుడు? శారద ఆలోచనల తీవ్రత గుర్తించినట్లు ఆ సమయం రానే వచ్చింది. ఆ రోజు కాంగ్రెస్‌ వాళ్ళు బహిరంగ సభ పెట్టారు. పెద్ద, చిన్న నాయకులంతా వేదిక ఎక్కుతారని వాళ్ళు వేసిన కరపత్రం చూస్తే తెలిసింది. శారదకు తన కర్తవ్యమేంటో కూడా అర్థమైంది. హుషారుగా లేచింది. నవ్వుతూ వస్తున్న శారదను చూసి ప్రచారం చేయడానికి బయల్దేరుతున్న ఆడవాళ్ళంతా ఆమె చుట్టూ చేరారు.
‘‘ఇవాళ సాయంత్రం మనం ఇంటింటి ప్రచారానికి వెళ్ళటం లేదోయ్‌. ప్రోగ్రాం మారింది.’’
‘‘ఎందుకు? ఏం మారింది? ఎక్కడికి వెళ్తాం? ఏం చేద్దాం?’’ అంటూ కుతూహలంగా ఆత్రంగా అడిగారు.
‘‘కాంగ్రెస్‌ మీటింగుకోయ్‌’’ శారద ఉత్సాహంగా చెప్పిన మాటలకు అందరూ విస్తుపోయారు.
‘‘కాంగ్రెస్‌ మీటింగుకా? మనమా?’’
‘‘ఔను. మనమే. వెళ్దాం. చూద్దాం ఏం జరుగుతుందో. మీరేం కంగారు పడకండి. అంతా నేను చూసుకుంటాను. మీరు సభకు వస్తే చాలు’’ శారద ఏదో మంచి ఆలోచనే చేసి ఉంటుందని అందరూ నమ్మారు. ధీమాగా తమ పనులకు తాము వెళ్ళిపోయారు. సాయంత్రం ఎంత తొందరగా వెళ్దామన్నా అందరూ తెమిలేసరికి అలస్యం అవనే అయింది.
‘‘అవతల మీటింగు మొదలయిందోయ్‌. రండి’’ అంటూ శారద ముందు నడిస్తే వెనకాల అందరూ గుంపుగా నడిచారు. వీళ్ళు వెళ్ళేసరికి కాంగ్రెస్‌ నాయకుడొకడు గొంతు చించుకుంటున్నాడు.
‘‘ఆ శారదాంబ డాక్టరు కావొచ్చు. కానీ ఆమె చేసిన పనేమిటి? కాంట్రాక్టు పెళ్ళి చేసుకుంది. మనం ఎప్పుడైనా విన్నామా? మన సంప్రదాయమేనా? అసలామెకు ఏ పెళ్ళయినా ఎందుకు? బెజవాడలో ఆవిడ ఇంటికి రాని మొగాడున్నాడా వాళ్ళ పార్టీలో? అది ఇల్లా? సానికొంపా? బెజవాడలో ఎవరినైనా అడగండి చెబుతారు. బెడవాడ వదిలి ఇప్పుడు ఏలూరుని ఉద్ధరిస్తానంటోంది. ఏలూరులో కూడా ఒక సానికొంప నడపాలనుకుంటుందా?’’
వింటున్న మహిళా సంఘం వాళ్ళ రక్తాలు మరిగిపోయాయి. శారద వాళ్ళను ఒట్టి చేతులతో రావాలని ఆజ్ఞాపించింది. లేకపోతే చేతిలో కర్రలుంటే వాళ్ళు ఆ కాంగ్రెస్‌ నాయకుడి తల పగలగొట్టేవారే. శారద వాళ్ళ ఆగ్రహాన్ని గ్రహించినట్లు వెనక్కు తిరిగి నవ్వుతూ ‘‘వాళ్ళ మాటలకు కోపం తెచ్చుకుంటే వాళ్ళ బలం పెరుగుతుంది. నవ్వుతూ నవ్వుతూ సమాధానం చెప్పాలి. ఆ పని నే చేస్తాను. చూస్తూ ఉండండి’’.
అంటూ వడివడిగా నడుస్తూ వేదిక మీదికి ఎక్కేసింది. వేదిక మీది వాళ్ళంతా విస్తుపోయి, వాళ్ళేం చేస్తున్నారో వాళ్ళకే తెలియనితనంలో అందరూ లేచి నిలబడ్డారు. సభలో జనమూ నివ్వెరపోయి ఎక్కడివాళ్ళక్కడ నిశ్శబ్దమైపోయారు.
శారద వేదిక మీది వాళ్ళను ఆజ్ఞాపిస్తున్నట్లు ‘కూచోండి’ అంది గర్జించినట్లే.
అందరూ టక్కున కుర్చీల్లో కూర్చున్నారు ఆ ఆజ్ఞ కోసమే ఎదరు చూస్తున్ననవాళ్ళలా.
మైకు దగ్గరి నాయకుడి ముఖంలో నెత్తురు చుక్క లేదు.
‘‘జరగండి. వెళ్ళి మీరూ కూచోండి’’ ఆజ్ఞాపించింది శారద.
ఆయన అమ్మయ్య అనుకున్నట్లు పరుగు పరుగున వేదిక చివరనున్న తన కుర్చీలో పోయి పడ్డాడు.
‘‘కాంగ్రెస్‌ నాయకులను నేనొకటే ప్రశ్న అడుగుతున్నాను. మీరు ఎన్నికల ప్రచారం కోసం సభ పెట్టారా? శారదాంబ జీవితాన్ని గురించి ఇష్టమొచ్చినట్లు ప్రచారం చేయటానికి సభ పెట్టారా? మనవి వేరు వేరు పార్టీలు. వేరు వేరు ప్రణాళికలు. ఎన్నికలలో గెలిచి మనం ప్రజలకు ఏం చేస్తామో చెప్పడానికి సభలు పెట్టుకోవాలి. ప్రజల సమస్యలేమిటి, మన రాజకీయాలేమిటి అన్నది ప్రజలకు వివరించాలి. కమ్యూనిస్టులతో మీకు విభేదాలెక్కడ ఉన్నాయో చెప్పండి. మీకు తప్పనిపించిన విధానాలను ఎంతైనా విమర్శించండి. ఎన్నికల ప్రచారమంటే అది. ఆ కనీస జ్ఞానం కూడా లేకుండా మీరు రేపు ప్రజలకు ఏం చేస్తారు? ఎవరెవరి వ్యక్తిగత జీవితాలు ఎలా ఉన్నాయో చూసి ప్రజలకు చెప్పుకుంటూ పోతారా? ఒక స్త్రీని గౌరవించే సంస్కారం లేదు మీకు. రాజకీయాలలోకి వచ్చిన స్త్రీలను గురించి ఇట్లా మాట్లాడి వాళ్ళను వెనక్కు నెట్టడమా మీ ఉద్దేశం. మీ పార్టీ తరపున ఒక స్త్రీ పోటీ చేస్తోంది. ఆవిడంటే గిట్టని వారు నా ఎదురుగా ఆమెను కించపరిచే మాట ఒక్కటి మాట్లాడినా నేను సహించను. వాళ్ళనోరు మూయిస్తాను. ఆమెను నా సోదరిగా ఆలింగనం చేసుకుంటాను. కర్ణుడిని సూతపుత్రుడని అవమానించినట్లు నన్ను నా ‘పెళ్ళి’ పేరుతో అవమానించదల్చుకున్న వాళ్ళకు నేను ఒక్కటే చెప్పదలచుకున్నాను. కొత్తగా ఆవిర్భవిస్తున్న భారతదేశంలో కులాన్ని అణగదొక్కుతాం. శీలం, నీతి, అవినీతి, పెళ్ళి అయింది, కాలేదు అంటూ స్త్రీలను అవమానించేవారిని ఇంకెంతమాత్రం సహించం. మీ పాత నీతులు పనికిరావు. స్త్రీలు తమ గురించి, దేశం గురించి బాధ్యత తీసుకుంటారు. బెజవాడలో మా ఇల్లు ఆపదలో ఉన్నవారికి ఆశ్రయమిచ్చే చోటు. అది నా ఇల్లు కాదు. మీ అందరిదీ. మీరందరూ రావచ్చు. మా అమ్మ అన్నం పెడుతుంది. బెజవాడలో నా ఇల్లంటున్నారే ఆ ఇంట్లోనే కాదు, మద్రాసులో మా నాన్న రామారావు గారిల్లు ఉండేది. భారతేశంలో పండితులందరూ వచ్చి మా అమ్మ చేతి భోజనం చేసి మా నాన్నతో సంప్రదించి వెళ్ళేవారు. వీరేశలింగం గారు మా ఇంట్లో ఉండేవారు. ఔను… జీవితాన్నంతా సమాజం కోసం ధారపోసిన ఆయననూ అవినీతిపరుడన్నారు. వయసు మీదబడి భార్యా వియోగంతో కుంగిపోతున్న ఆయన మీద అవినీతి ఆరోపణలు చేసింది మీ వాళ్ళే. మీ టంగుటూరి ప్రకాశం గారే ప్లీడరుగా తమ చమత్కారమంతా చూపించి ఆయనను ముద్దాయిగా నిలబెట్టి దోషిగా నిరూపించారు. మీరు ఆ సంస్కారాన్ని వదలండి. స్త్రీలను గౌరవించటమంటే ఏంటో నేర్చుకోండి. ఆధునిక స్త్రీ, ఆధునిక మహిళ మీ కళ్ళు మిరుమిట్లు గొలిపి, మీరు కన్నెత్తి చూడలేనంతగా ఎదుగుతోంది. చరిత్ర నిర్మిస్తుంది. చరిత్ర తిరగ రాస్తుంది. సిద్ధంగా ఉండండి ఆమెతో తలపడటానికి. ఎన్నికల్లో ఎవరైనా గెలవొచ్చు, కానీ నైతికంగా ఇవాళ మీరు ఘోరంగా ఓడిపోయారు. చరిత్రలో తల ఎత్తుకోలేనంత ఘోరంగా ఓడిపోయారు. నేను ఘన విజయం సాధించాను. ప్రజలారా… నేను నైతికంగా గెలిచి మీ ముందు ధీమాగా నిలబడ్డాను. వేదిక మీది ఈ పెద్దలు ఓడిపోయి తలలు దించుకున్నారు. నమస్కారం. శలవు’’
ఒక నిర్మల గంభీర ప్రవాహంలా సాగిన శారద ఉపన్యాసం తర్వాత అంతా నిశ్శబ్దమై పోయింది. శారద వేదిక దిగి జనం మధ్యలో నుండి నడుచుకుంటూ వచ్చింది. జనం గౌరవంగా ఆమెకు దారి ఇచ్చారు. ఆ రోజుకి ఇక సభ జరిపే ధైర్యం కాంగ్రెస్‌ నాయకులకూ, వినే మానసిక స్థితి ప్రజలకూ లేదు.
… … …
ఎన్నికలు దగ్గరబడుతున్న కొద్దీ మహిళా సంఘ ప్రచారానికి ప్రజలు ఆకర్షితులవుతున్నారు. అది అవతలి పక్షం వారిని చాలా కలవరపెడుతోంది. ఏమైనా సరే ఇక్కడ కమ్యూనిస్టులను గెలవనివ్వకూడదనే పంతం పెరిగి అది వారి విచక్షణా జ్ఞానాన్ని తినేసింది. మహిళా సంఘం వారిని భయపెట్టి ఏలూరు నుంచి తరిమేస్తే సగం పీడా ఒదులుతుందన్నారెవరో.
‘‘ఎట్లా? వాళ్ళు రాక్షసులు. వాళ్ళను భయపెట్టడం కల్లో మాట. మనల్ని భయపెడతాయి ఆ దెయ్యాలు’’ కసి తప్ప మరొకటి లేదా మాటల్లో. చివరికి మతిలేని, గతిలేని వీథి రౌడీలను ఆశ్రయించటం తప్ప మరో మార్గం కనిపించలేదు స్థానిక పెద్దలకు. వారికి కాస్త నోరూ, చేతులూ తడిపి మహిళా సంఘం వాళ్ళు బస చేసిన ఇళ్ళమీదికి దాడిచేయమని అర్థరాత్రి పూట పంపారు.
వీథి రౌడీలు ఆడవాళ్ళని బెదిరించి యాగీ చేద్దామని హంగామాతో బయల్దేరారు.
ముందు ఇళ్ళమీద రాళ్ళు వేశారు. పగలంతా తిరిగీ తిరిగీ వచ్చి ఇంత తిని పడుకున్న ఆడవాళ్ళు అలజడిగా మేల్కొన్నారు. వాళ్ళకు అర్థమైంది. ఒకరివంక ఒకరు అర్థవంతంగా చూసుకున్నారు. చీరెలు బిగించి కట్టారు. కొంగులు నడుముల్లో దోపుకున్నారు. తలుపులు దబదబ బాదగానే అవి తెరుచుకుని తమ నెత్తిన కర్రలు విరుచుకుపడతాయని తెలియని రౌడీలు లబోదిబోమన్నారు. తామూ నిలబడి కర్రలు తిప్పారు. అరగంటపాటు ఆ స్త్రీల కర్రసాము చూస్తూ చుట్టుపక్కల ఇళ్ళవాళ్ళు స్తబ్దులై నిలబడిపోయారు. రౌడీలు ఎటు పోయారో కూడా చూసే అవకాశం లేకుండా పారిపోయారు. ఫాసిస్టు వ్యతిరేక దళాలుగా ఏర్పడినప్పుడు నేర్చుకున్న కర్రసాము ఇప్పటికి సార్దకమయిందని సంతోషపడుతూ ఆ రాత్రి మరి నిద్రపోలేదు ఆ స్త్రీలు. జోరుగా పాటలు, ఆటలతో సందడి చేశారు.
శారద మర్నాడు బెజవాడ నుండి వచ్చేసరికి అందరూ ఒకేసారి మాట్లాడి రాత్రి జరిగిన యుద్ధాన్ని సచిత్ర ప్రదర్శనలాగా చెప్పారు. తనను ఓడిరచటానికి కాంగ్రెస్‌ వాళ్ళు ఎలాంటి పనికైనా తెగబడతారని అర్థమైంది శారదకు. అందరూ కలిసి ఒకటి లేదా రెండు జట్లుగా తిరగాలనీ, ఒకరిద్దరుగా ఎవరూ ఎక్కడికీ వెళ్లవద్దని గట్టిగా చెప్పింది. ప్రచారాన్ని ఎంత పద్ధతిగా సాగించాలో వారందరినీ కూర్చోబెట్టి వివరించింది. ఎన్నికల ప్రణాళిక అందరికీ కరతలామలకమే. ఐతే ప్రతిచోటా శారదాంబ గారిది కాంట్రాక్టు పెళ్ళట… అదేంటి అన్న ప్రశ్న ఎదురవుతూనే ఉంది. చైతన్యంతో సమాధానం చెప్పగలిగిన వాళ్ళు అవతలి వాళ్ళకు అర్థమయ్యేలా చెబుతున్నారు. కానీ మహిళా సంఘంలోకి అప్పుడప్పుడే వచ్చినవాళ్ళు, రాజకీయ ప్రచారాల సంగతి తెలియని వాళ్ళూ ఇచ్చే సమాధానాలు సంజాయిషీలలాగా ఉండేవి. ‘డాక్టరుగారు చాలా గొప్ప మనిషి. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అదంత పట్టించుకోవాల్సింది కాదు’. ఇట్లా మాట్లాడేవాళ్ళను ఉమ, రాజమ్మ రాత్రిపూట సరిదిద్దేవారు. అదంతా శారద చెవిన పడుతూనే ఉంది.
సంజాయిషీల్లాంటి ఆ వివరణలు విన్న శారదకు నవ్వాలో, ఏడవాలో తెలిసేది కాదు. జీవితమంతా ఇలాంటి సంజాయిషీలు, తనో, తన తరపున మాట్లాడేవాళ్ళో ఇవ్వాల్సిందేనా? ఇవ్వాల్సిందే. సమాజంలో ఉన్న భావాలు వేరు. ప్రేమ గురించి చలం గారు ఎంత రాసినా, ప్రేమకు సంఘనీతి అడ్డం వస్తుందన్నా సంఘనీతి మనుధర్మాల మీద ఆధారపడి స్త్రీలకు తీరని అపకారం చేసేదనీ, దానిని కూకటివేళ్ళతో పెకిలించి కొత్త పద్ధతులను జీవితంలోకి తెచ్చుకోవాలని ఎంత చెప్పినా దాని అర్థం చేసుకోవటం కష్టం. చాలా సంవత్సరాలే పట్టవచ్చు ఆడవాళ్ళ ప్రేమను నీతి, అవినీతి అనే చట్రం నుంచి విడదీసి చూడటానికి.
ఆడవాళ్ళు చిన్న గీటు దాటినా దానిని సమాజం సహించలేదు. ప్రేమ అనేది తెలియక ముందే పెళ్ళిళ్ళయ్యే పరిస్థితి. తర్వాత ప్రేమ విలువ తెలిసి కావాలనుకుంటే తెంచుకోలేని బంధాలు. సరైన విడాకుల చట్టం లేనపుడు, పెళ్ళయిన వ్యక్తికి ప్రేమించే హక్కు లేదు. హక్కు కోసం సమాజానికి విరుద్ధంగా పోయే వ్యక్తులున్నప్పుడే హక్కుల అవసరం సమాజానికి అర్థమవుతుంది.
రావు కమిటీ హిందూ కోడ్‌ బిల్లు తయారు చేస్తోంది గానీ దానిలో ప్రేమకు ఏం చోటుంటుంది?
విడిపోవటానికి ప్రేమ లేకపోవడం అనే కారణం కాకుండా పరమ నికృష్టమైన కారణాలు ఉంటాయి. ఆస్తి, భరణం, వారసత్వం ఇవి ప్రధానమవుతాయి. కానీ ఆడవాళ్ళకు అది కూడా చాలా అవసరం. అంతకు మించి ఇప్పుడే ఎక్కువ ఆశించలేం.

Share
This entry was posted in ధారావాహికలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.