మా జీవితమంతా అప్పులు తీసుకోవడం, దాన్ని తిరిగి చెల్లించడంతోనే సరిపోతోంది -సంస్కృతి తల్వార్‌

అనువాదం: రవికృష్ణ
అప్పులు, అవమానాల ఊబిలో కూరుకుపోయిన హవేలియాఁ గ్రామ దళిత మహిళలు జాట్‌ సిక్కుల ఇళ్ళల్లో పశువుల శాలలను శుభ్రం చేసి, పేడను ఎత్తిపోస్తుంటారు. ముందస్తుగా డబ్బు అప్పు తీసుకోవడం వలన వారు తమ వేతనంలో కొంత భాగాన్ని కోల్పోతారు. పశువుల కొట్టంలోని ఇటుకలు పరిచిన మట్టి నేల మీద నున్న గేదె పేడను మంజీత్‌ కౌర్‌ (48) రెండు

చేతులతో ఎత్తి తీశారు. ముడుకులపై కూర్చున్న ఆమె నేలపై ఇంకా పచ్చిగా ఉన్న పేడనంతా గీరి, ఒక బాల్టా (గోలెం)లోకి ఎత్తి, దాన్ని తల మీదకు ఎత్తుకున్నారు. తలపై ఉన్న బరువు కింద పడకుండా జాగ్రత్తగా నడుస్తూ, ఆ పశువుల పాకకున్న చెక్క గేట్లను దాటి 50 మీటర్ల దూరంలో ఉన్న పేడ కుప్ప వద్దకు వెళ్ళారు. ఆమె నెలల తరబడి పడిన శ్రమకు గుర్తుగా, ఆ పేడకుప్ప ఆమె ఛాతీ అంత ఎత్తులో ఉంది.
అది ఏప్రిల్‌ నెలలో ఎండలు మండిపోతున్న ఓ మధ్యాహ్నం. అరగంటలో మంజీత్‌, ఈ చిన్న దూరాన్ని నెత్తిపై పేడ గోలెంను మోసుకుంటూ పేడదిబ్బ దగ్గరదాకా ఎనిమిదిసార్లు తిరిగారు. చివరగా, ఒట్టి చేతులతో ఆ గోలేన్ని నీటితో కడిగారు. రోజూ అక్కడినుంచి ఇంటికి బయల్దేరేముందు, ఆమె తన చిట్టి మనవడి కోసం ఒక గేదె నుండి అర లీటరు పాలను తీసి, ఒక చిన్న స్టీలు పాల డబ్బాలో నింపుకుంటారు. ఇలా ఉదయం ఏడు గంటల నుండి మొదలుపెట్టి ఆమె పనిచేసే ఇళ్ళల్లో ఇది ఆరవ ఇల్లు. ఈ ఇళ్ళన్నీ హవేలియాఁ గ్రామంలోని పెత్తందారీ కులాలకు చెందిన భూస్వాములైన జాట్‌ సిక్కులకు చెందినవి. ఈ గ్రామం పంజాబ్‌లోని తరన్‌ తారన్‌ జిల్లాలో
ఉంది. ‘‘మజ్‌బూరీ హై (చాలా కష్టం)’’ అంటారామె. నిస్సహాయతే ఆమెను బతుకుదెరువు కోసం పశువుల పాకలను
శుభ్రం చేయడానికి పురిగొల్పుతోంది. ఒక్క రోజులో ఆమె తన తలపై ఎంత పేడ మోస్తుందో ఆమెకే ఖచ్చితంగా తెలియదు, కానీ ‘‘బడ్డా సిర్‌ దుఖ్దా హై, భార్‌ చుక్దే చుక్దే (తలపై బరువు మోసీ మోసీ నా తల చాలా నొప్పిగా ఉంటుంది)’’ అని చెప్పారామె.
ఆమె ఇంటికి తిరిగివెళ్ళే దారి పొడుగునా, బంగారుపసుపు వన్నె గోధుమ పొలాలు దిగంతాల దాకా విస్తరించి
ఉన్నాయి. అవి త్వరలోనే, పంజాబ్‌లో పంట కాలం ప్రారంభమయ్యే ఏప్రిల్‌ నెలలో జరిగే బైసాఖి పండగ తర్వాత, కోతకు వస్తాయి. గండీవిండ్‌ బ్లాక్‌లో ఉన్న వ్యవసాయ భూమిలో చాలా భాగం హవేలియాఁ జాట్‌ సిక్కులకు చెందినదే. అందులో ఎక్కువగా వరి, గోధుమ పండుతాయి. కానీ, మంజీత్‌కి ఒక చల్లటి చపాతీ, టీ మాత్రమే మధ్యాహ్న భోజనం. ఆ తర్వాత ఒక గంట విశ్రాంతి. ఆమెకిప్పుడు దాహంగా ఉంది. ‘‘ఇంత ఎండలో కూడా వాళ్ళు తాగడానికి నీళ్ళివ్వరు’’, మంజీత్‌ అగ్రవర్ణాలకు చెందిన తన యజమానుల గురించి చెప్పారు. మంజీత్‌ మజహబీ సిక్కులలో దళిత వర్గానికి చెందినవారు. దాదాపు రెండు దశాబ్దాల క్రితం నుంచి ఆమె, ఆమె కుటుంబం క్రైస్తవ మతాన్ని ఆచరించడం ప్రారంభించారు. హిందుస్థాన్‌ టైమ్స్‌ పత్రిక 2019లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, హవేలియాఁ జనాభాలో వ్యవసాయ కూలీలుగానో లేదా రోజువారీ కూలీలుగానో పనిచేసేవారిలో మూడిరట ఒక వంతు మంది షెడ్యూల్డ్‌ కులాలు, వెనుకబడిన తరగతులకు చెందినవాళ్ళు. మిగిలినవాళ్ళు జాట్‌ సిక్కులు. జాట్‌ సిక్కుల వ్యవసాయ భూముల్లో దాదాపు 150 ఎకరాల సరిహద్దు కంచెకు ఆవల, పాకిస్థాన్‌ సరిహద్దుకు కేవలం 200 మీటర్ల దూరంలో ఉన్నాయని కూడా ఈ నివేదికలో పేర్కొన్నారు.
హవేలియాఁలోని దళిత మహిళలు పేడను ఎత్తిపోసి, పశువుల పాకలను శుభ్రం చేస్తారు, లేదా జాట్‌ సిక్కుల ఇళ్ళల్లో ఇంటి పని చేస్తారు. ‘‘గరీబాఁ బారే సర్కార్‌ నహీ సోచదీ తాహీ తే గోహా చుక్దే హాఁ అసిఁ (ప్రభుత్వం పేద ప్రజల గురించి ఆలోచించదు, అందుకే మేం పశువుల పేడను ఎత్తిపోసి, పాకలను శుభ్రం చేస్తాం)’’ అని మంజీత్‌ అన్నారు. ఈ పని చేసినందుకు వాళ్ళకేం ఇస్తారు?
‘‘ఒక ఆవు లేదా గేదెకు బదులుగా, మాకు ప్రతి ఆరు నెలలకు ఒక మన్‌ (లేదా మాండ్‌`దాదాపు 37 కిలోలతో సమానం) గోధుమలు లేదా బియ్యం ఇస్తారు. ఇది పంట సీజన్‌పై ఆధారపడి ఉంటుంది’’ అని మంజీత్‌ చెప్పారు. మంజీత్‌ మొత్తం 50 డంగర్లు (పశువులు)న్న ఏడు ఇళ్ళల్లో పనిచేస్తారు. ‘‘ఒక ఇంటిలో 15, మరొక దానిలో ఏడు, మూడో దానిలో ఐదు, నాలుగో ఇంటిలో ఆరు…’’ అంటూ మంజీత్‌ లెక్కపెట్టడం మొదలుపెట్టారు. 15 జంతువులున్న ఒక్క కుటుంబం మినహా మిగిలినవాళ్ళంతా గోధుమలు లేదా బియ్యం వాటాను సరిగ్గా చెల్లిస్తారని ఆమె చెప్పారు. ‘‘వాళ్ళు 15 జంతువులకు 10 మన్‌ (370) కిలోలు మాత్రమే ఇస్తారు. నేను వాళ్ళ దగ్గర పని మానేయాలనుకుంటున్నా’’ అని ఆమె చెప్పారు.
ఈ మధ్యనే పుట్టిన మనవడికి బట్టలు కొనడానికి, ఇంటి ఖర్చుల కోసం ఏడు గేదెలు ఉన్న ఇంటివాళ్ళ నుంచి మంజీత్‌ రూ.4,000 అప్పు తీసుకున్నారు. అక్కడ ఆరు నెలలు పనిని పూర్తి చేశాక, మే నెలలో ఆమెకు గోధుమల బకాయి చెల్లించారు. మార్కెట్‌ ధర ప్రకారం గోధుమ ధరను చెల్లించి, ఆమె చెల్లించాల్సిన బకాయిలకు బదులుగా గోధుమలను మినహాయించుకున్నారు. ఏడు గేదెలకు గాను ఆమె జీతం ఏడు మన్‌లు, అంటే దాదాపు 260 కిలోలు.
ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రకారం, ఈ ఏడాది క్వింటాల్‌ (100 కిలోలు) గోధుమలు కనీస మద్దతు ధర రూ.2,015. ఆ ప్రకారం ఆమెకు వచ్చిన 260 కిలోల గోధుమల విలువ దాదాపు రూ.5,240. అప్పు చెల్లించిన తర్వాత, మంజీత్‌కు రూ.1,240 విలువైన గోధుమలు మాత్రమే మిగులుతాయి. ఇంకా నగదు రూపంలో చెల్లించాల్సిన వడ్డీ కూడా ఉంది. ‘‘ప్రతి 100 రూపాయల (అప్పు) మీద వాళ్ళకు నెలకు రూ.5 ఇవ్వాలి’’ అని ఆమె చెప్పారు. అంటే వార్షిక వడ్డీ రేటు 60 శాతం అవుతుంది. ఏప్రిల్‌ మధ్య నాటికి ఆమె రూ.700 వడ్డీ చెల్లించారు. మంజీత్‌ తన ఏడుగురు కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నారు. 50 ఏళ్ళ ఆమె భర్త, 24 ఏళ్ళ కుమారుడు కూడా వ్యవసాయ కూలీలే. ఇంకా కోడలు, ఇద్దరు మనవలు, 22, 17 ఏళ్ళ వయసున్న ఇద్దరు పెళ్ళికాని కుమార్తెలు. కుమార్తెలిద్దరూ జాట్‌ సిక్కుల ఇళ్ళల్లో ఇంటిపని చేస్తారు. ఒక్కొక్కరూ నెలకు రూ.500 సంపాదిస్తారు.
ఆమె ఇంకో యజమాని నుండి ఎలాంటి వడ్డీ లేకుండా రూ.2,500 అప్పు కూడా తీసుకున్నారు. కిరాణా సరుకులు కొనడానికి, వైద్యం ఖర్చులు, కుటుంబంలో జరిగే వివాహాలు, ఇతర సందర్భాల కోసం ఉన్నత కులాల వాళ్ళ నుంచి చిన్న చిన్న అప్పులు తీసుకోవడం తప్పనిసరి అనీÑ పశువుల్ని కొనుక్కోవడానికో, లేదా మరే ఇతర ఖర్చుల కోసమో మహిళలకు నగదు సహాయాన్ని చేసే చిన్న మొత్తం పొదుపు సంఘాల నుంచి నెలవారీ వాయిదాలు తీసుకోవాల్సిందేనని ఆమె చెప్పారు.
పటియాలాలోని పంజాబీ విశ్వవిద్యాలయం (మాజీ) ఎకనామిక్స్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ గియాన్‌ సింగ్‌ మార్చి 2020లో ‘దళిత్‌
ఉమెన్‌ లేబరర్స్‌ ఇన్‌ రూరల్‌ పంజాబ్‌ : ఇన్‌సైట్‌ ఫ్యాక్ట్స్‌’ అనే అధ్యయనాన్ని వెలువరించారు. గ్రామీణ పంజాబ్‌లోని దళిత మహిళా కార్మికుల కుటుంబాలలో 96.3 శాతం అప్పుల్లో ఉన్నాయని ఆయన బృందం చేసిన సర్వేలో తేలిందని ఈ అధ్యయనం చెబుతోంది. ఆ కుటుంబాల సగటు అప్పు రూ.54,300. ఈ అప్పు మొత్తంలో 80.40 శాతం సంస్థాగతేతర వనరుల నుండి వచ్చింది. చాలా సంవత్సరాల పాటు యజమానులుగా ఉన్నవారు వెయాజ్‌ (వడ్డీ) వసూలు చేయరనీ, కొత్త యజమానులు మాత్రమే ఆ పని చేస్తారనీ హవేలియాఁలోని మరో దళిత మహిళ సుఖ్‌బీర్‌ కౌర్‌ (49) వివరించారు.
మంజీత్‌ ఇంటి పక్కనే ఆమె కుటుంబ బంధువు సుఖ్‌బీర్‌ తన భర్త, ఇంకా ఇరవైల వయసులో ఉన్న ఇద్దరు కుమారులతో కలిసి రెండు గదుల ఇంటిలో నివసిస్తున్నారు. వారంతా వ్యవసాయ కూలీలుగా, లేదా రోజువారీ కూలీలుగా రోజుకు రూ.300 జీతానికి పని చేస్తున్నారు, అది కూడా పని దొరికినప్పుడే. సుఖ్‌బీర్‌ గత 15 ఏళ్ళుగా జాట్‌ సిక్కుల ఇళ్ళల్లో పేడ ఎత్తిపోస్తూ, పశువుల పాకలను శుభ్రం చేస్తున్నారు. ఆమె మొత్తం పది జంతువులున్న అలాంటి రెండు ఇళ్ళల్లో పనిచేస్తున్నారు. మూడో ఇంట్లో నెలకు రూ.500 జీతానికి ఇంటి పని చేస్తారు. ఆమె ఉదయం 9 గంటలకన్నా ముందే పనికి బయలుదేరినా, తిరిగి రావడానికి మాత్రం నిర్ణీత సమయమంటూ ఉండదు. ‘‘కొన్ని రోజులు మధ్యాహ్నానికి, కొన్నిసార్లు మూడు గంటలకు తిరిగి వస్తాను. ఒక్కోసారి సాయంత్రం ఆరు గంటలు కూడా కావచ్చు’’ అని సుఖ్‌బీర్‌ చెప్పారు. ‘‘ఇంటికి తిరిగి వచ్చాక నేను భోజనం సిద్ధం చేయాలి, మిగిలి ఉన్న ఇంటి పనిని పూర్తి చేయాలి. నేను పడుకునే సరికి రాత్రి పది గంటలవుతుంది.’’
మంజీత్‌ ఇంకాస్త మెరుగని సుఖ్‌బీర్‌ చెప్పారు. ఎందుకంటే, చాలావరకు ఇంటి పనులన్నీ ఆమె కోడలే చేస్తుంది.
మంజీత్‌ లాగే సుఖ్‌బీర్‌ తన యజమానుల వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోయారు. దాదాపు ఐదేళ్ళ క్రితం ఆమె తన కుమార్తె పెళ్ళి కోసమని ఒక యజమాని నుంచి రూ.40,000 అప్పుగా తీసుకున్నారు. ప్రతి ఆరు నెలలకు చెల్లిస్తున్న ఆరు మన్‌ల (సుమారు 220 కిలోలు) గోధుమలు లేదా బియ్యం నుండి ఆమె అప్పు కింద కొంత భాగాన్ని మినహాయించినా, ఆమె అప్పు ఇంకా తీరలేదు.
ప్రతి ఆరు నెలలకు ఒకసారి మొత్తం అప్పును లెక్కిస్తారు. కానీ కుటుంబ వేడుకలు లేదా ఇతర అవసరాల కోసం ఆమె ఇంకొంచెం అప్పు తీసుకుంటారు. ‘‘తే చల్దా హీ రెహందా హై (ఇది ఇలాగే జరిగిపోతూ ఉంటుంది). అందుకే మేం ఈ రుణ చక్రం నుండి బయటపడలేం’’ అని సుఖ్‌బీర్‌ అన్నారు.
అప్పు ఇచ్చిన కుటుంబంలోని వాళ్ళు అప్పుడప్పుడూ ఆమెను కొన్ని అదనపు పనులు చేయమని ఆదేశిస్తుంటారు. ‘‘వాళ్ళ దగ్గర నుండి అప్పు తీసుకున్నాం కాబట్టి దేన్నీ కాదని చెప్పలేం. మేం ఒక్కరోజు పనికి వెళ్ళకపోతే, వాళ్ళు మమ్మల్ని తిడతారు. మా డబ్బులు మాకిచ్చేసి, పోయి ఇంట్లో కూర్చోండి అంటారు’’ అని సుఖ్‌బీర్‌ చెప్పారు.
పంజాబ్‌లో వెట్టిచాకిరీ, కుల వివక్ష నిర్మూలనకు 1985 నుండి కృషి చేస్తున్న దళిత్‌ దాస్తాన్‌ విరోధి ఆందోళన్‌ సంస్థ అధ్యక్షురాలు, న్యాయవాది, కార్యకర్త అయిన గగన్‌దీప్‌, ఈ పనిలో ఉన్న చాలామంది దళిత మహిళలకు పెద్దగా చదువు లేదని చెప్పారు. ‘‘వాళ్ళకు చెల్లించే ధాన్యం నుండి అప్పు కింద ఎంత ధాన్యాన్ని మినహాయించుకుంటున్నారో అన్న లెక్కలు వాళ్ళకు తెలీవు. దాంతో వాళ్ళు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.’’
మాల్వా (దక్షిణ పంజాబ్‌), మారaా (తరన్‌ తారన్‌ ఉన్న పంజాబ్‌ సరిహద్దు ప్రాంతాలు) ప్రాంతాలలో ఇలా మహిళలపై దోపిడీ సర్వసాధారణమని తన మొదటి పేరు మాత్రమే చెప్పుకునే గగన్‌దీప్‌ అన్నారు. దోఆబా ప్రాంతంలో (పంజాబ్‌లోని బియాస్‌, సట్లెజ్‌ నదుల మధ్య ఉంది) చాలామంది విదేశాలలో స్థిరపడినందున అక్కడ పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది.’’
సర్వేలో పాల్గొన్న దళిత మహిళా కార్మికుల్లో ఎవరికీ కూడా కనీస వేతనాల చట్టం, 1948 గురించి ఏమీ తెలీదని పంజాబీ విశ్వవిద్యాలయ బృందం చేసిన అధ్యయనం కూడా తెలిపింది.
పశువుల పేడను ఎత్తిపోసే మహిళలను కనీస వేతనాల చట్టం కింద నోటిఫై చేసిన షెడ్యూల్‌లో చేర్చకపోవడం వల్ల వారికి కూలీల హోదా ఇవ్వడం లేదని గగన్‌దీప్‌ చెప్పారు. ప్రభుత్వం గృహ కార్మికులను ఈ షెడ్యూల్‌లో చేర్చినా, ఇళ్ళ వెలుపల ఉండే పశువుల పాకలను శుభ్రం చేసేవాళ్ళను మాత్రం చేర్చలేదు. ‘‘ఈ మహిళలకు కూడా గంటల లెక్కన కనీస వేతనం చెల్లించాలి. ఎందుకంటే, వీళ్ళు ఒక్క రోజులో ఒకటి కంటే ఎక్కువ ఇళ్ళల్లో పేడను ఎత్తిపోసి, శుభ్రం చేస్తున్నారు’’ అని గగన్‌దీప్‌ చెప్పారు. సుఖ్‌బీర్‌ తన కూతురి అత్తమామలకు తాను చేసే పని గురించి ఎప్పటికీ చెప్పలేరు. ‘‘వాళ్ళకి తెలిస్తే మమ్మల్ని అసహ్యించుకుంటారు. తమ కొడుకు ఒక పేదింటి సంబంధం చేసుకున్నాడని వాళ్ళనుకుంటారు’’ అని ఆమె అన్నారు. ఆమె అల్లుడు తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు, కానీ అతని కుటుంబం చదువుకున్నది. తాను కొన్నిసార్లు రోజువారీ కూలీగా పనిచేస్తానని మాత్రం సుఖ్‌బీర్‌ వాళ్ళకు చెప్పారు.
17 సంవత్సరాల వయసులో నూతన వధువుగా హవేలియాఁకు రాకముందు మంజీత్‌ ఎన్నడూ పనిచేసి ఎరుగరు. ఇక్కడి ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆమె ఏదో ఒక ఉపాధిని చూసుకోవాల్సి వచ్చింది. ఆమె కూతుళ్ళు ఇళ్ళల్లో పని చేస్తున్నారు. అయితే జీవనోపాధి కోసం వాళ్ళకెప్పుడూ పశువుల పేడను ఎత్తే పరిస్థితి రానివ్వకూడదని ఆమె కృతనిశ్చయంతో ఉన్నారు.
తమ భర్తలు వాళ్ళ సంపాదననంతా తాగుడు మీద ఖర్చు చేస్తున్నారని మంజీత్‌, సుఖ్‌బీర్‌లిద్దరూ చెప్పారు. ‘‘వాళ్ళకొచ్చే రోజు కూలీ రూ.300లో వాళ్ళు రూ.200 తాగుడు కోసమే ఖర్చు చేస్తారు. కాబట్టి (మిగిలిన దాని మీద) జీవించడం కష్టమవుతోంది’’ అని సుఖ్‌బీర్‌ చెప్పారు. వాళ్ళకు పని దొరకనప్పుడు భార్యల సంపాదనలో కొంత భాగాన్ని కూడా లాక్కుంటారు. ‘‘మేం వాళ్ళను అడ్డుకుంటే మమ్మల్ని కొడతారు, తోసేస్తారు, మాపై పాత్రలు విసిరేస్తారు’’ అని సుఖ్‌బీర్‌ వివరించారు.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019`20 (చీఖీనూ-5) ప్రకారం, పంజాబ్‌లో 18`49 సంవత్సరాల వయసున్న వివాహిత మహిళల్లో 11 శాతం మంది భర్తలు పెట్టే శారీరక హింసను అనుభవిస్తున్నారు. దాదాపు 5 శాతం మంది భర్త తమను తోసేయడమో, బలంగా ఊపడమో, తమ మీద ఏదో ఒకటి విసిరేయడమో చేసినట్లు చెప్పారు. 10 శాతం మంది భార్యలు భర్తల చేతిలో చెంప దెబ్బలు తిన్నారు. 3 శాతం మంది పిడికిలితో లేదా హాని కలిగించే ఏదైనా వస్తువుతో దెబ్బలు తిన్నారు. ఇంకో 3 శాతం మందిని తన్నడం, లాగడం లేదా కొట్టడం చేశారు. 38 శాతం మంది మహిళలు తమ భర్తలు తరచుగా మద్యం సేవిస్తుంటారని చెప్పారు.
సుఖ్వీందర్‌ కౌర్‌ (35) ఒక దళిత మజహబీ సిక్కు. ఆమె తన 15 ఏళ్ళ కొడుకు, 12 ఏళ్ళ కుమార్తె, అరవయ్యవ వడిలో పడిన తన మామగారితో కలిసి అదే పరిసరాల్లో నివసిస్తున్నారు. పేడను ఎత్తిపోసే పని చేస్తానని నేనెప్పుడూ నా చిన్నతనంలో కూడా ఊహించలేదని ఆమె చెప్పారు. అయితే, భర్త వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నా కూడా, కొడుకు పుట్టాక తమ కుటుంబ ఖర్చులను తామే స్వయంగా చూసుకోవాలని ఆమె అత్తగారు (ఐదేళ్ళ క్రితం మరణించారు) ఆమెకు చెప్పారు.
పెళ్ళయిన ఐదు సంవత్సరాలకు, ఆమె పేడను ఎత్తడం, పశువుల పాకలను శుభ్రం చేయడం, అగ్రవర్ణాలవారి ఇళ్ళల్లో నేలను ఊడ్చి, తుడవడం వంటి పనులను ప్రారంభించారు. ప్రస్తుతం ఆమె ఐదు ఇళ్ళల్లో చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె రెండిళ్ళల్లో పని మనిషిగా నెలకు రూ.500 జీతానికి పని చేస్తున్నారు. మిగిలిన మూడు ఇళ్ళల్లో ఉన్న 31 పశువుల పేడను ఎత్తిపోసి, శుభ్రం చేస్తారు.
అంతకుముందు ఆమె ఈ పనిని అసహ్యించుకునేవారు. ఒకేసారి తాను మోసే 10 కిలోల పేడ గోలెం బరువు గురించి ఆలోచిస్తూ, ‘‘అది నాకు మోయలేని భారంగా తోచేది.’’ ఇక దాని ఘాటైన కంపు గుర్తుకు రాగానే దుఃఖం, అసహ్యం కలగలిసిన స్వరంతో ‘‘ఓ దిమాగ్‌ దా కిద్దా మార్‌ గయా (నా బుర్ర మొద్దుబారిపోతుంది)’’ అన్నారామె. వ్యవసాయ కూలీగా పనిచేసే ఆమె భర్త 2021 అక్టోబర్‌లో అనారోగ్యం పాలయ్యారు. చివరికి అతని మూత్రపిండం పనిచేయడం లేదని నిర్ధారణ అయింది.
వాళ్ళు అతడ్ని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకువెళ్ళారు, కానీ మర్నాడు ఉదయం అతను మరణించారు. ‘‘వైద్య నివేదికలను బట్టి, అతనికి ఎయిడ్స్‌ ఉందని మాకు తెలిసింది’’ అని సుఖ్వీందర్‌ చెప్పారు.
అప్పుడే ఆమె వైద్య పరీక్షల కోసం ఒక యజమాని నుండి రూ.5,000 అప్పు తీసుకున్నారు. అంత్యక్రియలు, ఇతర కర్మకాండల కోసం మొదట రూ.10,000, ఆ తర్వాత మరో రూ.5,000 తీసుకోక తప్పలేదు. తన భర్త మరణానికి ముందు నెలకు నూటికి రూ.10 ల వడ్డీకి ఆమె అప్పు తీసుకున్నారు. అంటే సంవత్సరానికి 120 వడ్డీ రేటు. ఆమె అప్పు తీసుకున్న కుటుంబ సభ్యులే ఆమె తమ ఇంట్లో నగలు దొంగిలించిందని ఆరోపించారు. ‘‘అందుకే నేను వాళ్ళ ఇంట్లో పని వదిలేశాను. మరొకరి దగ్గర మరో రూ.15,000 అప్పు తీసుకుని, వాళ్ళ డబ్బును వడ్డీతో సహా తిరిగి చెల్లించా. చివరికి వాళ్ళ నగలు వాళ్ళ ఇంట్లోనే దొరికాయి’’ అని సుఖ్వీందర్‌ చెప్పారు.
ఆమె తీసుకున్న ఆ రూ.15,000 ఇంకా తీరనేలేదు.
దళిత దాస్తాన్‌ విరోధి ఆందోళన్‌, తరన్‌ తారన్‌ జిల్లా అధ్యక్షుడు రంజిత్‌ సింగ్‌ మాట్లాడుతూ, అధిక వడ్డీ రేట్ల వల్ల ఈ మహిళలు ఎప్పటికీ ఆ అప్పులను పూర్తిగా తీర్చలేరన్నారు. ‘‘వడ్డీ ఎంత ఎక్కువగా ఉంటుందంటే, ఒక మహిళ తన అప్పును ఎన్నటికీ తీర్చలేదు. చివరికి ఆమె బందువా మజ్దూరీ (వెట్టిచాకిరీ) వైపునకు నెట్టబడుతుంది’’ అని చెప్పారు. ఉదాహరణకు సుఖ్వీందర్‌ రూ.10,000 అప్పు మీద నెలకు రూ.1,000 వడ్డీ కడతారు.
నలభై ఐదు సంవత్సరాల క్రితం, భారతదేశం వెట్టిచాకిరీ వ్యవస్థ (నిర్మూలన) చట్టం, 1976 ని ప్రకటించింది. ఈ చట్టం ప్రకారం ఏదైనా ఉల్లంఘన జరిగితే మూడేళ్ళ వరకు జైలు శిక్ష, రూ.2,000 జరిమానా విధిస్తారు. షెడ్యూల్డ్‌ కులాలు మరియు షెడ్యూల్డ్‌ తెగల (అత్యాచార నిరోధక) చట్టం, 1989 ప్రకారం షెడ్యూల్డ్‌ కులానికి చెందిన వ్యక్తిని వెట్టిచాకిరీ చేయమని ఒత్తిడి చేస్తే అది శిక్షార్హమైన నేరం. అయితే, జిల్లా యంత్రాంగం ఈ కేసుల విచారణపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని రంజిత్‌ అన్నారు.
‘‘అతను (ఆమె భర్త) బతికి ఉంటే ఇంటిని నడపడం చాలా తేలికగా ఉండేది’’ అని సుఖ్వీందర్‌ తన నిస్సహాయతను వెల్లడిరచారు. ‘‘మా జీవితమంతా అప్పులు తీసుకోవడం, దాన్ని తిరిగి చెల్లించడంతోనే సరిపోతోంది’’ అన్నారు.
(https://ruralindiaonline.org/en/articles/my-head-aches-from-carrying-all-the-weight/ పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా (ruralindiaonline.org) ఆగష్టు 26, 2022 లో మొదట ప్రచురితమైనది.)

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.