వలసాంధ్రలో స్త్రీల పత్రికలు: సావిత్రి (1904`1917) -డాక్టర్‌ షేఖ్‌ మహబూబ్‌ బాషా

వలసాంధ్రలో స్త్రీల సంపాదకత్వంలో వెలువడిన రెండవ స్త్రీల పత్రిక ‘సావిత్రి’. జనవరి 1904లో కాకినాడ నుండి ప్రచురించబడ్డం ప్రారంభించిన ‘సావిత్రి’ మధ్యలో కొంతకాలం ఆగిపోయినా 1917 వరకూ కొనసాగినట్లు కనిపిస్తుంది. సమకాలీన మహిళోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన

పులుగుర్త లక్ష్మీ నరసమాంబ సంపాదకురాలు (చూ. ఛాయాచిత్రం). ప్రతి సంచికలో 35 నుండి 40 పుటలుండేవి. సంవత్సర చందా ఒక రూపాయి కాగా, విడి ప్రతి వెల 2 పైసలు. 1920కి ముందు ప్రచురితమైన మిగతా స్త్రీల పత్రికలతో పోలిస్తే 1500 మంది చందాదారులతో ‘సావిత్రి’ అత్యధిక సర్క్యులేషన్‌ కలిగి ఉండేది. ప్రారంభమైన సంవత్సరాంతానికే (నవంబరు 1904) 482 మంది చందాదారుల్ని కలిగివుండడం విశేషం. కోస్తాంధ్రలోనే కాకుండా రాయలసీమలోని బళ్ళారి, కడప, ధర్మవరం, చంద్రగిరి, వాయల్పాడు మొదలైన ప్రాంతాలకూÑ కనిగిరి, నెల్లూరు, బెంగుళూరు, బొంబాయి, మద్రాసు, హైదరాబాద్‌లకూ చేరేది ‘సావిత్రి’.
‘‘పురుషులు పత్రికాధిపులై యుండఁగా వ్యాసములు వ్రాయఁ దలఁపుగల సతులు దేశ ప్రకృతిని బట్టి తత్పురుషులతోఁ దరచుత్తర ప్రత్యుత్తరముల జరుపుటకియ్యకొనమిఁ గాంచి యట్టి విదుషీమణులు ధారాళ హృదయలై తమ నీతి రచనా విశేషంబులను సోదరీ లోకంబునకు వెల్లడి చేయునట్లొనర్చుటయును, మనకుఁ దెలిసిన సద్విషయంబులు తోడి సోదరీమణులకుఁ దెల్పుచు వారు దెలిపినవి తెలిసికొనుచు, నుచితమగు జాత్యభిమానంబు నూనుటయును మన విధాయకృత్యంబులని యెంచి యోపిన రీతిని మా యుద్యమముల నెఱవేర్చుకొని నీ పత్రికాధిపతిత్వ భారమును వహింప సాహసిం’’చానని పత్రికను ప్రారంభించడం వెనుకనున్న ఉద్దేశ్యాన్ని తెలియబరచారు సంపాదకురాలైన లక్ష్మీ నరసమాంబ (‘విజ్ఞాపనము’, డిసెంబరు 1904, పు. 1).
సమకాలీనంగా ప్రముఖులైన అనేకమంది స్త్రీలు ‘సావిత్రి’లో తమ రచనల్ని ప్రచురించారు. భండారు అచ్చమాంబ, బాలాంత్రపు శేషమ్మ, దామెర్ల సుందరమ్మ, బుఱ్ఱా బుచ్చి బంగారమ్మ, గుండు అచ్చమాంబ, మన్యం వెంకట సుబ్బమ్మ, దామెర్ల సీతమ్మ, ఉప్పల నరసమాంబ, ఆత్మూరి అన్నపూర్ణమ్మ, కాంచనపల్లి కనకమ్మ, కళ్ళేపళ్లె వెంకటరమణమ్మ మొదలైన వారు వీరిలో కొందరు మాత్రమే. సంపాదకురాలైన పులుగుర్త లక్ష్మీ నరసమాంబ రచనలనేకం ‘సావిత్రి’లో ప్రచురించబడ్డాయి. సుంకర రంగయ్య, పులుగుర్త వెంకటరత్నం, మంగిపూడి వెంకయ్య, అయినాపురపు సుందర రామయ్య, దేవగుప్తాపు సన్యాసిరాజు, దువ్వూరి జగన్నాథ శర్మ, వేముగంటి రామకృష్ణారావు, నందగిరి త్రయంబకరావు మొదలైన పురుషుల రచనలు కూడా ప్రచురితమయ్యాయి.
పాతివ్రత్య ప్రబోధకములైన రచనల్ని ప్రచురించడంలో ‘సావిత్రి’ మిగతా స్త్రీల పత్రికలన్నింటికన్నా ముందు వరుసలో నిల్చింది. ఈ రచనలు సాధారణంగా పద్య రూపంలో ఉండేవి. ‘నీతి పదములు’ (మార్చి, ఏప్రిల్‌ 1904), ‘సతీ ధర్మములు’ (ఫిబ్రవరి, ఏప్రిల్‌ 1904), ‘స్త్రీ నీతి దీపిక’ (ఆగష్టు 1904), ‘స్త్రీ నీతి గీతములు’ (ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ 1912), ‘స్త్రీ నీతి రత్నావళి’ (అక్టోబరు 1904), ‘నీతి పదములు’ (ఫిబ్రవరి, మార్చి ` ఏప్రిల్‌ 1912) మొదలైనవి వీటిలో కొన్ని మాత్రమే. ఈ రచనలన్నీ స్త్రీలకు పాతివ్రత్యమే పరమధర్మంగా ప్రచారం చేశాయి. పాతివ్రత్యము ‘‘స్త్రీయొక్క యుత్కృష్ట ధర్మములలో బరమోత్కృష్ట ధర్మము. అమూల్యమైన యిహ పర లాభముల నొసంగఁ జాలిన యుత్తమ గుణరాజము’’ అని పులుగుర్త లక్ష్మీ నరసమాంబ పాతివ్రత్య ప్రాశస్త్యాన్ని తెలియజేశారు (జులై 1911).
‘‘పాతివ్రత్యముఁ బూను నాతికెల్లపుడుఁ / జేతిలోనే యభీష్ట సిద్ధులుండుఁ గఁద. / …
చుక్కాను చెడు నావ ఫక్కి నుండుఁ / గంద నిక్కమీఁశుడు లేని నెలఁతుక బ్రతుకు’’ అనీ,
‘‘అర్ధాంగినాథున కతివ’’ యన్పలుకు / సార్ధక పడురీతి సతి యుండవలెను. / ఏడుగడయగు హృదీశునకింతి / యూడిగంబున దాసి జాడనుండనగు. / అతివ! నీపతికి సదాలోచనముల / మతియుతుండగు మంత్రి గతినుండవమ్మ. / నాథునకును భోజనంబిడు వేళ / నాదరింపుము తల్లి యట్ల పూఁబోఁడి. / ఓరిమి నెప్పుడు ధారిణిఁబోలి కూరిమి / హృదయేశు గొల్వుమునాతి! / పతివ్రతంబిడు పుణ్యమతుల సౌఖ్యంబు / నతివనీకిడునమ్మ? యిరత వ్రతములు. / పతిఁబ్రసన్నుని జేయు పడఁతి సౌభాగ్య / మతులితంబనియెంచు మతివ! నీమదిని / నీశక్తి కొలఁది నాత్మేశునకెపుడు / నేశ్రమ దగులంగ నీయకుమమ్మ! / సంసారభరము పాంచాలిని బోలె / హంసయాన! భరించి యలరుము జగతి’’ అనీ పాతివ్రత్య ప్రాధాన్యాన్ని బోధించింది ‘సావిత్రి’.
పాతివ్రత్య భావాలను పెంపొందించడానికి స్త్రీ విద్య అంత్యంతావశ్యకం అని ‘సావిత్రి’ నొక్కివక్కాణించింది. అంతేకాకుండా, పిల్లలు ఎక్కువ సమయం తల్లులతో గడుపుతారు కాబట్టి స్త్రీలు విద్యావంతులైతే వారి పిల్లలు కూడా నీతిమంతులవుతారనీ, స్త్రీలు గృహకార్యనిర్వహణలోని మెలకువల్ని తెలుసుకుంటారనీ, స్త్రీల కర్తవ్యం భర్తల్ని ‘దాసీ’ల్లాగా సేవచేయడం కాబట్టి, ఆ పని సక్రమంగా నెరవేర్చగలగుతారనీ, స్త్రీలు ‘సత్ప్రవర్తన’తో మెలగుతారనీ, పనికిమాలిన ఉబుసుపోక కబుర్లతో కాలం వ్యర్థపుచ్చకుండా సద్వినియోగపరచుకుంటారనీ తెలియజేశాయి స్త్రీ విద్యపై ప్రచురించబడిన పద్యాలూ, వ్యాసాలూ. (ఉదా: దేవగుప్తాపు నస్యాసి రాజు, ‘సతీమణి’, జూన్‌ 1911Ñ ర్యాలి జానకి రామాయమ్మ, ‘స్త్రీ విద్య’, అక్టోబర్‌`నవంబర్‌`డిసెంబర్‌ 1911Ñ ఉప్పల నరసమాంబ, ‘స్త్రీ విద్యా పంచరత్నములు’, సెప్టెంబర్‌ 1910). అయితే ఆత్మూరి అన్నపూర్ణమ్మ లాంటి వారు ‘స్నేహితుడును భగవత్సమానుడును అగు భర్త సుగుణవంతుడు గాక స్త్రీకెన్ని నీతుల దెల్పినను నిష్ప్రయోజనమే. … పురుషులు అట్లు సుగుణవంతులుగాక వేయి యుపన్యాసములిచ్చినను లక్ష నీతుల బోధించినను స్త్రీలను రాత్రింబవళ్ళు చదివించినను వారు సుగుణవంతులగుట … కలుగనేరదని నా అభిప్రాయము. … పురుషప్రవర్తనలే స్త్రీకి సహవాసకారణమగుచున్నవి. కాన ప్రథమమునఁ బురుషప్రపవర్తన కల్మషరహితముగానుండక స్త్రీ విద్యాభివృద్ధికై పాటుపడుట నిష్ప్రయోజనము. … ప్రథమమున నెల్లపురుషులు మనశ్శుద్ధి నొందకున్న స్త్రీల కొఱకు పాటుపడునదంతయు బూడిదెలోపోయు పన్నీరు విధంబుగ నిష్ప్రయోజనంబుగును. … (కాబట్టి) సకల సుగుణములు మీరాచరించుచు మీ స్త్రీలననుకరింపజేసి దేశమునుద్ధరింపుడు’ అన్నారు (‘విన్నపము’, సెప్టెంబరు 1910, పు. 30`31).
స్త్రీ విద్యా ప్రయోజనాన్ని దామెర్ల సీతమ్మ చర్చించారు. ‘విద్య పురుషులకెంత లాభకారియగుచున్నదో స్త్రీలకు నంతలాభకారి గాకమానదు. చిన్నతనమునుండియుఁ బురుషులవలెనే స్త్రీలును శ్రద్ధాళువులై చదివినచో గొప్ప పరీక్షలందేరి యుద్యోగములఁ జేయగలరు. రాజ్యపాలనము గూడఁ జేయఁగలరు’, అని వివరిస్తూ అహల్యాబాయి, రాణీ గౌరీ లక్ష్మీబాయిలను ఉదహరించారు. ‘ఉద్యోగములఁజేయు స్త్రీలు బొంబాయి ప్రాంతములయందిప్పుడును గలరు’ అని తెల్పుతూ రఖమాబాయి కేల్కర్‌, డాక్టర్‌ కృష్ణాబాయి, డాక్టర్‌ కమలాకర్‌లను ప్రస్తావించారు. ‘గృహిణులు సంపూర్ణవిద్యను గ్రహించినచో భర్తలకన్నివిధముల ననుకూలురాండ్రై పురుషునకు స్త్రీ అర్ధాంగియను న్యాయమును సార్థకము చేయఁగలరు. వితంతువులు విద్యగఱచినచో వారి స్వధర్మమును గుర్తెఱింగి స్వార్థత్యాగలై లోకోపకారమునకై తమ శరీరములంధారవోసి తాము పరమార్థమును బొంది యితరులకుఁ బరమార్థము బోధింతురు. … కొందఱనుకొనునట్లు స్త్రీలకు విద్య గఱపుటవలన దుష్టులగుదురనుట యెంతమాత్రమును విశ్వాసార్హము కాఁజాలదు. ఏలన! పురుషులలోఁగూడ విద్యాధికులయినవారనేకులు దుర్మార్గములను జేయుచున్నారు. అంతమాత్రమునఁ బురుషులకు విద్యకూడదని చెప్పిరా! ప్రవర్తన విషయము మానిసి యొక్క గుణమునుబట్టి యుండునుగాని విద్యను బట్టి యుండనేరదు. … ఏ స్త్రీ పరపురుషుల యందు సోదరభావము గలిగి … పతినే దైవముగనెంచి సంచరించునో, యే పురుషుడేకపత్నీవ్రతుఁడయి న్యాయముగ విత్తమార్జించుచు పరస్త్రీని దల్లివలెఁజూచుచుఁ … సంచరించుచుండునో, వారే పరిపూర్ణ విద్యాలాభమును బొందిరని చెప్పవలసియున్నది. … పూర్వకాలంబున సీత, సావిత్రి, చంద్రమతి మున్నగువారు పాతివ్రత్యము మొదలగుగాఁగల సద్గుణములఁ బొందఁ గలిగినది విద్యవలననే. గార్గి, మైత్రేయి, సులభ మున్నగువారు బ్రహ్మజ్ఞాన సంపత్తిగలిగి ఆ చంద్రార్కముగాఁ గీర్తిఁగాంచఁగలిగినది విద్యవలననే. కావున మనమందఱము సద్విద్యవలన ననేక లాభములను బొందఁగలుగుదుము’ అని స్త్రీలు ఎందుకు చదువుకోవాలో స్పష్టపరచారు (సెప్టెంబరు 1910, పు. 21`24).
బాల్య వివాహాలూ, వితంతు పునర్వివాహాల మీద ‘సావిత్రి’ మిక్కిలి ఛాందసవాద ధోరణిని ప్రదర్శించింది. ‘‘అతిబాల్య’’ వివాహాలను నిరసించినప్పటికీ, రసజ్వలానంతర వివాహాలను ఖండిరచింది. రజస్వలానంతర వివాహాలూ, స్వయంవర వివాహాల వల్ల (ప్రేమ వివాహాలు) స్త్రీల పాతివ్రత్యానికి భంగం కలుగుతుందనీ, ‘‘ప్రౌఢ వివాహముల వలన పెక్కు యిక్కట్టులు వాటిల్లుచుండినదియు మన నవీన బుద్ధిమంతులు (సంఘసంస్కర్తలు) తెలుసుకొనిన బాగుండును’’ అనీ బాల్య వివాహాలను వ్యతిరేకించి రజస్వలానంతర వివాహాలను ప్రోత్సహించిన సంఘ సంస్కర్తలతో వాదించారు ‘సావిత్రి’ సంపాదకురాలైన పులుగుర్త లక్ష్మీ నరసమాంబ. ఆమె ప్రకారం ‘‘చిత్త స్థైర్యమును, మనోనిశ్చలమును దృఢపఱచి పాతివ్రత్య ధర్మమును గాపాడుటకు మనలో బాలికలకుఁ బ్రేమోదయము కాకమునుపు చేసెడి వివాహములే యుత్తమ వివాహము’’లు (‘పాతివ్రత్యము’, జులై 1911).
‘సావిత్రి’ వితంతు పునర్వివాహాలను తీవ్రంగా వ్యతిరేకించింది. పునర్వివాహం ‘‘కులస్త్రీ’’ ధర్మము కాదనీ, పునర్వివాహాలు చేసుకున్న వితంతువులు ‘‘కులాంగనలు’’ కారనీ పులగుర్త లక్ష్మీ నరసమాంబ ప్రగాఢంగానమ్మి, భీకరంగా వాదించారు. తీవ్ర ప్రకంపనలు సృష్టించిన ఆమె వాదన స్త్రీలలో పెద్ద వివాదానికి దారితీసింది. ఒక ప్రముఖ మహిళాసంఘ సమావేశంలో ఈ వివాదం రాజుకుంది. ఆ మహిళా సంఘం గూర్చి కొంత తెలుసుకొని వివాదంలోకి వెల్దాం.
1903 జనవరి 30న కాకినాడలో ‘శ్రీ విద్యార్థినీ సమాజం’ యేర్పాటైంది. పులుగుర్త లక్ష్మీ నరసమాంబ సమాజ వ్యవస్థాపక కార్యదర్శిని. సమాజం యేర్పాటైన ‘పిమ్మట బ్రతి శుక్రవారము గ్రమముగా’ జరిగిన సభలకు ముఫ్పైకి పైగా స్త్రీలు హాజరయ్యేవారు. 1903 సంవత్సరాంతానికి 60 సమావేశాలు జరిగాయి. నర్సమాంబ ఇంట జరిగే సమావేశాలే కాకుండా మరో మూడు సమావేశ ప్రదేశాలు కూడా నిర్ణయమయ్యాయి. దుగ్గిరాల రమణమ్మ ఇంట్లో మంగళవారాల్లోనూ, బాలాంత్రపు శేషమ్మ ఇంట్లో కూడా మంగళవారాల్లోనూ, కాశీభొట్ల సూరమ్మ ఇంట్లో ఆదివారాల్లోనూ మహిళా సమావేశాలు జరిగేవి. 1904 (?) ఫిబ్రవరిలో సమాజం ప్రథమవార్షికోత్సవం జరుపుకొంది.
కొంతకాలం పనిచేసిన తర్వాత ‘శ్రీవిద్యార్థినీ సమాజం’ స్తబ్ధమైపోయి 1910 ఏప్రిల్‌ 8న పునరుద్ధరించబడిరది. పునరుద్ధరణ తర్వాత పులుగుర్త లక్ష్మీ నరసమాంబ అధ్యక్షురాలుగా కాగా, దామెర్ల సీతమ్మ, బాలాంత్రపు శేషమ్మలు కార్యదర్శులయ్యారు. సమాజం స్పష్టమైన లక్ష్యాలనూ, ‘కార్యపద్ధతి’నీ ప్రకటించింది. ‘ప్రస్తుతము మన దేశమునందు మిక్కిలి కొరబడియున్నట్టియు దేశోద్ధారణకు ముఖ్యంగా గావలసియున్నట్టియు విద్యాధనంబును దెలుగుదేశపు స్త్రీలెల్లరకు గొల్లలుగా లభింపజేయుచు వారిని నీతి, విద్యాసంపన్నులుగను, సత్కార్యాచరణ పరాయణలుగను, దేశోపకారధురీణలుగను జేయుట ఈ సమాజం యొక్క ప్రధానోద్దేశమైయున్నది’ అని స్పష్టంగా లక్ష్యాన్ని నిర్వచించింది. ‘హిందూ కులస్త్రీల నెల్లర, సభ్యురాండ్రుగ’ చేర్చుకొనుట, సమాజ నిర్వహణకు కావాల్సిన ధనాన్ని చందాల రూపంలో వసూలు చేయుట, ఒక పుస్తక భాండాగారమునేర్పరచుట, ఒక ‘స్త్రీ విద్యాలయము’ నేర్పరచి అందులో ‘విద్యార్థినిలుగ వితంతు సోదరీమణులను, గణ్యామణులను, జానానా స్త్రీలను’ చేర్చుకొనుట, ‘ఇతర గ్రామములందక్కడక్కడ స్త్రీ పాఠశాలలను, స్త్రీ సమాజములను స్థాపించుట, స్థాపింపబ్రోత్సాహపరచుట’, అనే కార్యక్రమాన్ని నిర్ణయించింది. సమాజానికి అన్నివిధాలుగా సహాయసహకారాలందించండని ప్రార్థించింది. (‘సావిత్రి’, మార్చి 1911, పు. 17`21).
పునరుద్ధరణ తర్వాత సమాజం కొంతకాలం బాగానే నడిచింది. మధ్యలో 1910 జూన్‌లో గుంటూరులోని ‘స్త్రీ సనాతన ధర్మమండలి’ ఆధ్వర్యంలో జరిగిన మొదటి ‘ఆంధ్ర మహిళా మహాసభ’ (తెలుగు స్త్రీల మొట్టమొదటి రాష్ట్రస్థాయి వేదిక) సమావేశంలో ‘విద్యార్థినీ సమాజం’ కీలక పాత్ర పోషించింది. రెండవ ‘ఆంధ్ర మహిళా మహాసభ’ సమావేశాలు ‘విద్యార్థినీ సమాజ’ ఆధ్వర్యంలో 1911 ఏప్రిల్‌లో కాకినాడలో నిర్వహించాలన్న నిర్ణయమైంది. ఆ మేరకు ‘సావిత్రి’లో (మార్చి 1911) పులుగుర్త లక్ష్మీనరసమాంబ (ఆంధ్ర మహిళా మహాసభా కార్యదర్శిని) పేరు మీద ఎనిమిది పేజీల సుదీర్ఘ ప్రకటన వెలువడిరది. అందులో ‘1910 జూన్‌ రెండవ తేదీని … కొంతవరకు ఆంధ్రదేశ స్త్రీలను సమావేశము గావించి ఇట్టి సభను జరిపితిమి … ఇంతకంటె గొంత పెద్ద ఏర్పాటుమీద నీసభ ఈ సంవత్సరము కాకినాడలో జరుపబడుటకు నిర్ణయింపబడినది. … ఈ సభకు ఆంధ్రదేశపు చాతుర్వర్ణ్యములలోని కులాంగనలగు ప్రియ సోదరీమణులెల్లరు ఆదరణపూర్వకముగా నాహ్వానము చేయబడుచున్నారు. … చాతుర్వర్ణ్యములలోని యంతఃశాఖలవారగు సోదరీమణులు తాము తమ రాకను దెలియజేయునప్పుడు తమతమ వర్ణవివక్షతను గూడ దెలియజేసినచో వారికనుకూలములగు సదుపాయము అచ్చట జరగగలవు’ అని ప్రకటించారు. సభలో చర్చించబడు విషయాలను ‘ఉపన్యాస వివరము’ అనే శీర్షికన ‘విద్యావిషయము’, ‘సంఘ విషయము’, ‘గృహవిషయము’ అనే ఉపశీర్షికల కింద విభజించి మొత్తం 22 విషయాలనిచ్చారు.
అనుకున్నట్లుగానే 1911 ఏప్రిల్‌ 28, 29 తేదీల్లో రెండవ ‘ఆంధ్ర మహిళా మహాసభ’ జయప్రదంగా జరిగిందిÑ 30వ తేదీన ‘విద్యార్థినీ సమాజ’ వార్షికోత్సవం జరిగింది. ‘ఆంధ్ర మహిళా మహాసభ’కు కళ్లేపళ్లె వెంకటరమణమ్మ, ‘విద్యార్థినీ సమాజ’ వార్షికోత్సవ సమావేశానికి బుఱ్ఱా బుచ్చి బంగారమ్మ అధ్యక్షత వహించారు. ఈ సమావేశాల్లోనే ‘విద్యార్థినీ సమాజ’ అధ్యక్షురాలికీ, కార్యదర్శినులైన దామెర్ల సీతమ్మ, బాలాంత్రపు శేషమ్మలకూ మధ్య వివాదం చెలరేగి నర్సమాంబ కార్యదర్శినులను సమాజం నుండి బహిష్కరించడం, ఇరువర్గాలకూ చెందినవారు ‘విద్యార్థినీ సమాజం’ తమదంటే తమదని వాదించుకోవడం, ఇరుపక్షాల వారికీ వత్తాసుగా యింకొందరు చేరడం ` యిలా సమకాలీన పత్రికల్లో ఒక భీకరమైన అక్షరయుద్ధం జరిగింది.
వివాదానికి మూలకారణం ‘ఆంధ్ర మహిళా మహాసభ’ సమావేశాల్లో ఒక పునర్వివాహిత ఉండడమే. సభలకు పునర్వివాహితలను ఎవరు పిల్చారన్న విషయం దగ్గర మొదలైన వివాదం, సదరు సమావేశాలకు పునర్వివాహితలను అనుమతించవచ్చా, అనుమతించకూడదా, అని కొనసాగి, అసలు పునర్వివాహితలు ‘కులాంగనలా, కాదా’ అనే చర్చతో తారాస్థాయికి చేరింది. పులుగుర్త లక్ష్మీనరసమ్మ వర్గం పునర్వివాహితలు ‘కులాంగనలు’ కాదంటే, సీతమ్మ, శేషమ్మల వర్గం ఔనంది. దీంతో వివాదం ఇంకా ముదిరిపోయింది. ప్రతి వర్గం తన వాదం సరి అంటే తనవాదం సరియనడంతో సుమారు ఒక సంవత్సరం పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. ముందుగా లక్ష్మీనరసమాంబ వాదనను చూద్దాం.
నరసమాంబ వర్గం ప్రకారం (భావరాజు మహాలక్ష్మమ్మ, కాశీభట్ల సూరమ్మ, ఉప్పులూరి సందరమ్మ, చింతలపూడి సీతాదేవమ్మ, మన్యం వెంకట సుబ్బమ్మ మొదలైనవారు) (1911 జులై, ‘సావిత్రి’, పు. 3-5) ‘ఈ సమాజము (విద్యార్థినీ సమాజం) యొక్క కార్యదర్శినులు సమాజ నిబంధనలకు వ్యతిరేక భావములనుమాచరించుచువచ్చి చివరకు మొన్నటి ఆంధ్రమహిళా మహాసభతో గలిపి 1911 సంవత్సరము ఏప్రిల్‌ 30వ తేదీని చేయబడిన ఈ సమాజ సంవత్సరోత్సవ సభయందు బునర్వివాహితలను జేర్చుట మున్నగు సభానిబంధనలకు వ్యతిరేకములగు కార్యములను సాహసముతో నాచరించి సామాజికురాండ్ర యొక్కయు పురస్త్రీల యొక్కయు నిరుత్సాహమునకు గారకురాండ్రైరి’. వారు అంతటితో ఆగకుండా ‘పిమ్మట గూడ’ సమాజ వారసభలకు ‘బట్టుదలతోడను సాహసముతోడను’ పునర్వివాహితలను తీసుకువస్తుండడంవల్ల ‘సామాజికురాండ్రనేకులు వారసభలకు బొత్తుగా రాకుండుట మున్నగునవి జరగుచు సమాజమునకు ఒక్కపెట్టున క్షీణదశ’ కలగడమారంభమైంది. ‘గార్యదర్శినుల ఐకమత్యాభావకారకములగు’ కృత్యములను ‘సహింపజాలక’ వారిని సమాజం నుండి తొలగించడం కోసం 1911 జులై రెండవ తేదీన నరసమాంబ ఇంట్లో ‘నొక పెద్ద సభగావించి’ సదరు నిర్ణయం తీసుకోవడమైంది. సీతమ్మ, శేషమ్మలు ఇకపై ‘విద్యార్థినీ సమాజ’ కార్యదర్శినులు కారని ప్రకటన కూడా వెలువడిరది. కొత్త కార్యనిర్వాహక సభ్యురాండ్రను ఎన్నుకున్నారుÑ సమాజ కార్యస్థానాన్ని కూడా మార్చారు.
దీనిపై దామెర్ల సీతమ్మ, బాలాంత్రపు శేషమ్మలు తీవ్రంగా స్పందించారు. నరసమాంబ వర్గం 1911 జులై ఏడు నాటి ‘కృష్ణాపత్రిక’లో (పు. 9) సమాజ విషయమై రాసిన రాత ‘యత్యద్భుతముగాను విచారము గలించునదిగాను’ ఉందన్నారు. నరసమాంబ ఆరోపించినట్లు తామేమీ సమాజ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించలేదనీ, ఒకవేళ అలా చేసి ఉంటే మిగిలిన సమాజ సభ్యురాండ్రే తమను తొలగించి ఉండేవారనీ, సమాజం నుండి విడిపోయిన నర్సమాంబగారే నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్నారనీ వాదించారు. అంతేకాక ‘ఆంధ్ర మహిళా మహాసభ’ అయిన తర్వాత ‘విద్యార్థినీ సమాజ’ కార్యదర్శినులూ, కొందరు సభ్యురాండ్రూ ఎంతగా కోరినా నరసమాంబ సమావేశాలకు రాలేదనీ, దాన్నిబట్టి సమాజాభివృద్ధిలో ఆమెకెంత శ్రద్ధ ఉందో తెలుస్తోందనీ, సభ్యురాండ్ర అనుమతి లేకుండా కార్యదర్శినులను మార్చే అధికారము ఆమెకెవరిచ్చారో తమకు తెలియకున్నదనీ, అలాంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం ‘నరసమాంబగారి యతిసాహస’మనీ తేల్చి చెప్పారు. విషయాన్ని యింకా విశదపరుస్తూ జులై రెండవ తేదీన జరుగులాగున నిశ్చయించబడిన ‘కార్యాలోచనసభ’కు రావాల్సిందిగా 13 మంది సంతకాలతో ఉత్తరాన్ని నరసమాంబగారి ఇంటికి తామే పంపినామనీ, కానీ ఆమె ‘జవాబు వ్రాయక తామునూ రాక రాని కారణమును’ తెలియబరచకుండా ఉండిపోయారన్నారు. పైపెచ్చు ఆమె సంతకంతో ‘ఆహ్వానపత్రికలు’ జూలై రెండున ఒంటిగంటకు తామందరికీ చేరాయనీ, వాటిలో సమాజ కార్యస్థానం మార్పును గూర్చీ, ‘పునర్వివాహితలిందుజేర్చుకోబడరు’ అని ఉండడం చూసీ ఇక ‘యామెరాదని’ నిశ్చయించుకొని నరసమాంబ స్థానంలో దుగ్గిరాల రమణమ్మను యేర్పరచి తాము సభ గావించామనీ, అందులో సమాజాధ్యక్షురాలిగా కళ్ళేపళ్ళె వెంకటరమణమ్మను ఎన్నుకున్నామనీ, నరసమాంబను తీసివేయడమైందనీ చెప్పారు. అంతేకాక నరసమాంబ ఆరోపించినట్లుగా సమాజం క్షీణించడంలేదనీ, మిగుల అభివృద్ధి చెందుతున్నదనీ, సమాజ వార సభలు ఎప్పటిలాగే అత్తోట లక్ష్మీనరసింహము గారింటనే జరుగుతాయనీ, ‘స్త్రీలు వచ్చుటలేదని నర్సమాంబగారు వ్రాసిన వ్రాత తప్పు’ అనీ, ప్రతివారము 25 మందికి పైగా వస్తున్నారనీ, అందుకే సమాజం కోసం పత్రికలూ, పుస్తకాలూ, డబ్బులూ పంపేవారు బాలాంత్రపు శేషమ్మ, దామెర్ల సీతమ్మల పేర్లమీదనే పంపాలనీ విన్నవించుకున్నారు.
ఈ విధంగా సమాజం తమదంటే తమదనీ, నిబంధనలను మీరుల్లంఘించారంటే, మీరుల్లంఘించారనీ యిరువర్గాలూ వాదులాడుకున్నాయి. తుదకు ‘విద్యార్థినీ సమాజం’ శేషమ్మ, సీతమ్మ, వెంకట రమణమ్మల పేరుతోనే కొనసాగింది. ఇది వివాదంలోని ఒక చిన్న భాగం మాత్రమే! అంతకంటే భీకరమైన అక్షరయుద్ధం ‘పునర్వివాహితలు కులాంగనలా కాదా’ అనే అంశం మీద జరిగింది. పునర్వివాహితలు ‘‘కులాంగనలు’’ కాదన్న నరసమాంబపై పలువురు విరుచుకుపడ్డారు. ఆమె కూడా సివంగిలా గర్జిస్తూ ఎదురుదాడికి దిగారు. ఈ దాడీ ప్రతిదాడులతో సమకాలిక పత్రికలు యుద్ధభూములయ్యాయి.
ప్రఖ్యాతిగాంచిన ‘ఆంధ్రపత్రిక’ ‘ఆంధ్ర మహిళా మహాసభ’ అనే పేరును అధిక్షేపిస్తూ ఆ పేరును బట్టి స్త్రీలందరూ అక్కడకు వెళ్ళవచ్చని మనం ఊహిస్తామనీ, కానీ పునర్వివాహిత స్త్రీలూ, ఆంధ్ర క్రైస్తవులూ మొదలైనవారి రాకపట్ల అభ్యంతరం చెప్పే నరసమాంబ ఆ పేరును ‘బెట్టియే యుండగూడ’దనీ, దానికి బదులుగా ‘‘పునర్వివాహిత స్త్రీ నిషేధ, ఆంధ్ర బ్రాహ్మణ స్త్రీ సభ’’ అని పెట్టిఉంటే బాగుండేదనీ వెక్కిరించింది. దీనిపై తీవ్రంగా స్పందించిన నరసమాంబ పలువురు వైశ్య, శూద్ర స్త్రీలు పాల్గొన్న సభను ‘‘బ్రాహ్మణ స్త్రీ సభ’’ అని ఎలా పిలవగలమనీ, ఈ అధిక్షేపణ ‘పండిత ప్రకాండులగు మా సోదరుల’ ‘మనస్సునందెంత ఈసు’ ఉన్నదో స్పష్టం చేస్తోందనీ, ‘ఆంధ్రులన నాంధ్రదేశమునందలి హిందువులగుదురు కాని క్రైస్తవాదులు (ముస్లింలు) కానేరర’నీ వాదించారు. తన వితండవాదాన్ని సమర్థించుకోవడానికి కొన్ని హాస్యాస్పదమైన ఉదాహరణలిచ్చారు. ‘ఆంధ్ర పత్రికా’ధిపతిపై ప్రతిదాడికి దిగుతూ ‘ఆంధ్రపత్రిక’ అనే పేరు దానికెలా తగిన పేరౌతుందని ప్రశ్నల వర్షం కురిపించారు. ఆమె ప్రకారం, ‘దేశ చరిత్రములంబట్టి చూడ బ్రాహ్మణులాంధ్రులు కారు. ఆంధ్రులు శూద్రులు …. బ్రాహ్మణులుత్తరదేశమునుండి ఈ దేశమునకు వచ్చిన పరదేశులు’. కాబట్టి శూద్రులను ధ్వనింపజేసే పేరు ‘ఆంధ్రపత్రిక’కెలా పొసగుతుందనీ, బ్రాహ్మణుడైన పత్రికాధిపతి ఆ పేరెలా పెట్టగలిగారనీ ఇంకా… ఇలా… అనేకంగా ప్రశ్నిస్తూ దాన్ని ‘‘ఆంధ్రపత్రిక’’ అనకుండా ‘‘నాంగ్లేయభాషా సంస్కార సంకలిత సంఘసంస్కార ప్రియామృతాంజన పత్రిక’’ అంటే బాగుంటుందేమో అని వెక్కిరింతతోనే సమాధానం చెప్పారు. ‘అమృతాంజనం’ అధిపతిని ‘స్ట్రాంగ్‌’గా ఢీకొట్టారు! (‘సావిత్రి’, జూన్‌ 1911, పు. 3`5).
పునర్వివాహితలు ‘కులాంగనలు’ కానేరరనేది లక్ష్మీనరసమాంబగారి ప్రగాఢ విశ్వాసం. ‘ఆంధ్ర మహిళా మహాసభ’ తాలూకు ప్రకటన పత్రికలో ‘జాతుర్వర్ణ్యములలోని కులాంగనలెల్లర’ సభకు రావచ్చునని ఉందన్న విషయం ముందుగానే చూశాం. ‘మీరు కులాంగనలనే పిల్చెదమనుచున్నారు. పునర్వివాహితులను పిలువరా?’ అని కొందరు తనకు ఉత్తరాలు రాసినారనీ, అంటే వ్యాఖ్యానం అక్కర్లేకుండానే పునర్వివాహితలు కులాంగనలు కారన్న విషయం ‘లోకులకెల్లర’ అర్థమైందనీ, కానీ సంఘసంస్కారప్రియులు రభస చేస్తుండడాన తను సమాధానమిస్తున్నాననీ చెప్పారు. తన వాదన నిరూపణార్థం తనురాసిన సుదీర్ఘ వ్యాసాల్లో స్మృతుల నుండీ, శాస్త్రాల నుండీ అడుగడుగునా ఉల్లేఖించి (కొందరు ఆంగ్ల పండితుల రచనలు సహా) అద్భుతమైన పాండిత్యాన్ని ప్రదర్శించారు.
వితంతు పునర్వివాహ సమర్థకులు దమయంతీ ద్వితీయ స్వయంవరాన్ని ఉదాహరణగా చూపుతున్నారనీ, కానీ ‘యా గ్రంథములబట్టియే పునర్వివాహము కులస్త్రీధర్మము కాదని తేలుచున్న’దంటూ నలుడు దమయంతితో చెప్పారన్న ‘… యన్యాపేక్షంబున స్వయంవరంబు రచియించుట ఇది కులస్త్రీ ధర్మంబు గాదు’ అనే శ్లోకాన్ని ఉటంకించారు. వితంతు పునర్వివాహవాదులు ‘మనుస్మృతి’ని కోట్‌ చేస్తున్నారనీ, కానీ ఆ ‘మనుస్మృతియే’ ‘‘నద్వితీయశ్చ సాధ్వీనాం క్వచిద్భర్తోపదిశ్యతే’’ అని ‘ఘోషించుచున్నద’నీ, ‘సాధ్వులకు మాత్రము పునర్వివాహములేదని దీనియర్థము’ అనీ, ‘కులాంగనకు బ్రతికియుండినను మృతినొందినను గూడ నొక్కడే పతియని, పతి మృతినొందిన మాత్రముచే నాతని పతిత్వము పోదని శాస్త్రములు మొరలిడుచున్నవ’నీ వాదించారు. వితంతు పునర్వివాహ సమర్థకులు తనపై కత్తిగట్టి ‘వెనుకముందులాలోచింపకుండా’ ‘వట్టి సాహసపు వ్రాతలు’ రాస్తున్నారనీ, వితంతు సోదరీమణులకు ‘బ్రహ్మ చర్యముత్కృష్టధర్మమని’ ఒకానొక సభలో తను ప్రసంగించినందుకు ‘కోపించి చిందులు తొక్కుతున్నార’నీ, కొంతమంది సోదరులు ‘వితంతు స్త్రీల స్థితిని గూర్చి సుమంగళలగువారేమి చెప్పగలరని’ ఆక్షేపిస్తున్నారనీ చెబుతూ ‘స్త్రీల స్థితిని గూర్చి స్త్రీలే చెప్పుటకవకాశము లేనప్పుడు’ పురుషులేవిధముగా చెప్పగలరని ప్రశ్నించారు. ‘నిరుపమాన పాతివ్రత్యమునకునికిపట్టైన హిందూదేశము యొక్క నిర్మల కీర్తికి గళంకము దెచ్చు పునర్వివాహము భూష్యము గాదని’ తాను అన్నప్పుడు ‘‘ఈమెకు బునర్వివాహితల పొడగిట్టదు’’ అని కోలాహలముతో ఘోషించిన సోదరులు తనలాంటి భావాల్నే వెలిబుచ్చిన బుఱ్ఱా బుచ్చి బంగారమ్మను ఎందుకు ప్రశ్నించడంలేదనీ నిలదీస్తూ బంగారమ్మ ప్రసంగపాఠాన్ని ఉటంకించారు. కానీ బంగారమ్మ ప్రసంగం నరసమాంబ చెప్పినట్టుగా లేదు!
తాను ‘ఈ సభలకు గులాంగనలను మాత్రమే’ ఆహ్వానించానని ఒప్పుకున్న నరసమాంబ తనాపని చేసింది పునర్వివాహితల ‘పొడ గిట్టక’ కాదనీ, ‘వారి పొడ మాకు గిట్టదనుట కల్లబొల్లిపలుకు’లనీ, తానలా చేయడానికి వేరే కారణం ఉందనీ, పునర్వివాహిత స్త్రీలపట్ల సమాజంలో వున్న చులకనభావం వల్లనే తానలా చేయాల్సి వచ్చిందనీ వివరించారు. ఆమె మాటల్లోనే: ‘… పేరంటములకు సైతము పదిమంది స్త్రీలు కూడిన యొకచోటకు నేకారణము చేతనైనను వొక పునర్వివాహిత రాదటిస్థించినపుడు పేరంటాండ్రందరు నొకరిమోమొకరుచూచుకొనుట విధవపెండ్లి వాండ్లను మనవాండ్లను (సుమంగళులను) గలుపుచున్నారని పదిమందిలో గలవెలలుపుట్టుట గొందరు వెంటనే యచటనుండి వెడలిపోవుట మరికొందరు వీరింటికెరుగకపోయి వచ్చితిమికనెప్పుడు రాగూడదని పలుకుట మున్నగు గొడవలు పునర్వివాహితలు వసించునిట్టి గ్రామములలో జరుగుచుండుట యెల్లరెరుంగుదురు. స్త్రీ విద్య నూతనముగా దలయెత్తుచున్న ఈ సమయంలో సంస్కారులమని పేరుపెట్టుకొన్న కొందరు సోదరులు చేయు విధవావివాహ పుటల్లరులవలననేక (మంది) స్త్రీల విద్యాభివృద్ధికి నిరోధములు గల్గుచున్నవి. …’
అంతేకాకుండా, అప్పట్లో ‘ఈ స్త్రీ సభలు విధవపెండ్లిండ్లు చేయుటకును వాళ్ళను మనలను గలుపునేమోగాబోలు ననుపలుకు స్త్రీ సంఘమునందేమూలజూచినను వినబడుచుండిన’దనీ, ‘సాంఘిక నిబంధనలకు విూరి సంఘముకొరకు బాటుపడుటవలన ప్రయోజనము లేదని నమ్మిన’దగుటచే మాత్రమే పునర్వివాహితలను పిలవలేదనీ, వారి పొడగిట్టకపోవడంవల్ల కాదనీ, కులాంగనలను మాత్రమే పిల్చినానని తాను ఒకవైపు ‘త్రికరణశుద్ధిగా’ ఒప్పుకుంటున్నా ‘కొందరు సోదరులు’ మాత్రం తామే పునర్వివాహితలు కొందరికి ‘దొంగ పిలుపులు పంపి’ వారిని నేనే పిల్చినాననీ, పిలిచికూడా పిలవలేదని నేనంటున్నాననీ అభాండాలు వేస్తున్నారని వాపోయారు. ‘ఇంత మాత్రముచేతనేమగును? వేడినీళ్ళకిళ్ళుగాలునా?’ అని మిక్కిలి విసుగుతో ప్రశ్నించారు.
నరసమాంబ ప్రకారం ‘ఆంధ్ర మహిళా మహాసభ’ సమావేశాలకు రావాల్సిందిగా పునర్వివాహితలకు సంఘ సంస్కారులు కొందరు ‘గల్లజాబులంపి, … విశ్వప్రయత్నము మీద’ ఒక పునర్వివాహితను పొరుగూరు నుండి రప్పించారు. తీరా ఆమె వచ్చాక పట్టించుకోకుండా అంతర్ధానమయ్యారు. అప్పుడు తనే ఆమెకు ‘యుచిత సదుపాయములుగావించి’ సాగనంపారు. దీనిని బట్టి ఎవరికి పునర్వివాహితల పొడగిట్టుతుందో, ఎవరికి గిట్టదో స్పష్టమౌతోందని ప్రకటించారు. ‘పునర్వివాహితలపై మాకప్రియముగాని ప్రియముగాని లేదు’ అని స్పష్టపరుస్తూ ‘దేశక్షేమము కొరకును సంఘోద్ధారణకొరకును’ పని చేయాలనుకొన్నప్పుడు ‘దేశీయ ధర్మములను, సాంఘిక నిబంధనలను, సదాచారమును మీరకూడ’దని ‘మా సోదర సోదరీ రత్నములకు’ హితోపదేశం చేశారు!
నరసమాంబ రాత తీవ్ర ప్రకంపనలను సృష్టించింది. దీనికి స్పందిస్తూ బుఱ్ఱా బుచ్చి బంగారమ్మ 1911 ఆగష్టు 25వ తేదీనాటి ‘‘కృష్ణాపత్రిక’’లో (పు. 4) ‘వైవాహిక ధర్మముననుసరించి యెన్నిమారులు వివాహము జేసికొనినను కులట అనిపించుకొనరు’ అని రాయగా, అది చూసిన నరసమాంబకు తిక్కరేగినట్లైంది. ‘ఆహా, కాలమా! ఏమి నీ మహిమ!! కటా పుణ్యభూమిjైున యార్యావర్తమా! నీ పూజ్యత పూజ్యతయగుట కిట్టివే గదా మార్గములు … స్వజాతిjైున స్త్రీల పాతివ్రత్యధర్మమును సమూలముగా బెల్లగింపజాలిన విపరీత ధర్మములను స్త్రీలే ముచ్చటించుచుండుట యెంతటి శోచనీయము …’ అని హతాశులయ్యారు. ఎన్నిసార్లు కావాలంటే అన్ని సార్లు పెళ్ళి చేసుకున్న స్త్రీ ‘కులాంగన’ అయ్యేటట్లయితే ‘వేశ్యాదులు తామును గులాంగనలమే యందురు గదా!’ అని తన ధర్మసందేహాన్ని లేవనెత్తారు. (‘కులాంగనలు’, ‘‘సావిత్రి’’, అక్టోబరు 1911). ‘‘దేశమాత’’ పత్రికాధిపతి మొదలైనవారు తన మీద చేసిన దాడికి విసిగిపోయి ఆగ్రహోదగ్రురాలైన నరసమాంబ ‘ఓ పునర్వివాహాభిలాషులగు సోదరీ సోదరులారా! మీ విపరీత ధర్మ స్థాపనార్థము లోకమును మోసము చేయజూడకుడు! మీ సిద్ధాంతములతో నేకీభవింపజాలనివారిని మీ యపవాదవరంపరలలో ముంచుచు వారి యెడల మీ దూషణ పాండిత్యమునుపయోగపరచుచు సంస్కరణ శబ్దమున కపశయమును దేబోకుడు!’ అని వేడుకొన్నారు. (పైదే. పు. 9).
నరసమాంబను సత్తిరాజు శ్యామలాంబ, మాడభూషి చూడమ్మ, బుఱ్ఱా బుచ్చి బంగారమ్మ లాంటి వారనేకులు విమర్శించినప్పటికీ కొటికలపూడి సీతమ్మ మాత్రం తూట్లు పొడిచారు. తన వ్యాసంలో కొటికలపూడి సీతమ్మ నరసమాంబను చీల్చిచెండాడారు. (‘హిందూసుందరి’, ఆగష్టు 1911, పు. 1`6). ‘ఆంధ్ర మహిళా మహాసభ’లో జరిగిన సంగతులను ‘ప్రత్యక్షముగా జూచి వచ్చిన’ వారినుండీ, పత్రికల ద్వారానూ గ్రహించిన సీతమ్మకు నరసమాంబగారికి గట్టిగా ‘హితోపదేశము’ చేయాలన్పించింది. సరసమాంబ భాషాజ్ఞానమునందు ఆరితేరినవారైనప్పటికీ ‘యంధపరంపరగా నాచరింపబడు పూర్వదురాచారములనెట్లయిన నిలవబెట్టవలెనని పెనుగులాడుచు విద్యాధికులగు పత్రికాధిపతులతో బ్రతిఘటించి స్వలోపములను గప్పిపుచ్చుటకు’ వ్యర్థ ప్రయత్నములు చేయుచున్నారనీ, ఆమెను గమనిస్తే ‘పాండిత్యమునకును ప్రపంచ జ్ఞానమునకును సంబంధము లేదన్న సంగతి’ తనకు స్పష్టపడుతోందనీ అన్నారు. స్త్రీ జనోద్ధరణకై తను జరుపదలపెట్టిన సభవల్లనే ఆమెకు యింతటి ‘జనదూషణ కలుగుట’ కడు శోచనీయమనీ, నరసమాంబ పరిస్థితి ‘‘అయ్యవార్లను జేయబోయిన కోతియయ్యేనన్నట్టు’న్నదనీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. నరసమాంబ తన స్వలోపములను కనుక్కోకుండా వివిధ పత్రికాధిపతులతో ‘యసహ్యకరములైన యుదాహరణములతోడను, పరుష వాక్యములతోడను’ వాదులాడడం ‘స్త్రీ జనమునకంతకు నపఖ్యాతికరమని’ సిగ్గుచెందాల్సి వస్తోందన్నారు.
నరసమాంబ చేసిన పనుల్లో ‘ఆంధ్ర మహిళా మహాసభ’ను గూర్చి ప్రకటన పత్రికలు రాయడం దగ్గర్నించీ ‘అన్నియు లోపములే’ జరిగాయని తేల్చారు కొటికలపూడి సీతమ్మ. సభకు వచ్చినవారు తమ`తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా ప్రకటించడానికి అవకాశమియ్యక ఏమోమో నిబంధనలనేర్పరచి ‘అందరి అభిప్రాయములు మీ యభిప్రాయములకు లోబడి యుండవలెనన్న నిర్బంధ’మేర్పరచడం నరసమాంబ చేసిన మొదటి తప్పన్నారు. నరసమాంబ వాదించినట్లుగా పునర్వివాహితలు ‘‘కులాంగనలు’’ కానేరరని తమంతట తాముగా జనాలూహించుకోలేదనీ, ఆమె కార్యాచరణను బట్టే వారికి అలాంటి అనుమానం కల్గిందనీ విశదపరుస్తూ ‘‘స్త్రీలకు బునర్వివాహము మంచిదికాదని’’ నరసమాంబ ‘‘నిన్నగాక మొన్న’’ బందరులో ఇచ్చిన ఉపన్యాసాన్ని గుర్తుచేశారు. పునర్వివాహితలకు తన పేరుతో ఆహ్వాన పత్రికలను పంపీ, ఈ విషయాన్ని మొదట వాళ్ళ ముందు ఒప్పుకొనీ, చివరికి సభలోనూ, పత్రికల్లోనూ తాను పంపలేదనీ, యితరులెవరో తన పేరిట పంపారనీ వాదిస్తున్న నరసమాంబ ‘‘కళంకవర్తనము’’ చూస్తే విచారము కల్గుతున్నదనీ అన్నారు. తనలో ‘తప్పుల కుప్పలను’ పేర్చుకున్న నరసమాంబ తనను విమర్శించినవారికి సమాధానమిస్తూ ‘మరికొన్ని యసత్య వచనములను జేర్చి పాపపుంజములను బలపరచుకొనుట’ ఆమెలోని విద్యకు ‘నపఖ్యాతికరమైయున్నద’నీ, అయినా ఆమెలాంటి ‘యసత్యవాదినులు లోకములో లేకపోర’నీ నిందించారు. స్త్రీ పునర్వివాహాలకు వ్యతిరేకంగా ఆమె చూపిన ఉదాహరణలు ‘మిక్కిలి పరిహాసాస్పద’ములుగా ఉండి, ఆమెను ‘అల్పజ్ఞ’గా నిరూపిస్తున్నాయని దెబ్బవేసారు. ‘నాలుగు కావ్యములను జదివితినన్న గర్వముతో’ నరసమాంబగారు ‘స్త్రీ పునర్వివాహములను దూషించినందువల్ల ఆమె ‘‘యల్పజ్ఞానము’’ వెల్లడౌతుందేగాని పునర్వివాహములు క్షీణింపబోవని’ నొక్కిచెప్పారు. వితంతు పునర్వివాహములవలన ‘మునుపున్న శిశుహత్యలు మొదలగు దుష్టచేష్టలిప్పుడు తగ్గినవని’ తెల్పుతూ ‘ఈ విషయమున ఇతర జాతియగు పురుష హృదయమే కరిగి పదునుపడుచుండగా స్వభావకోమలమగు స్త్రీహృదయము గట్టిపడి రాయిjైు స్త్రీలకు బునర్వివాహము కూడదనుట అద్భుతకరమును అపఖ్యాతికరమునునై గానబడుచున్నందున సతులందదు తలలు వంచుకొనవలసి వచ్చుచున్నది’ అని తీర్మానించారు. ‘‘గుడి పడగొట్టకున్న గుగ్గిలము వేసినంత ఫలము’’ అను సామెత ప్రకారం అనుభవం లేని విషయంలో మాట్లాడకుండా ఉండడమే మేలని నరసమాంబకు హితవు చెబుతూ ‘కాబట్టి యో సోదరీరత్నమా! వ్యర్థములైన సమాధానములిచ్చుటకిక ప్రయత్నింపక వివేకముతో వ్యవహరించు’ అని హెచ్చరించారు.
ఈ విధంగా కొటికలపూడి సీతమ్మ నరసమాంబకు చెంపపెట్టు పెట్టారు. నరసమాంబను తమ అక్షరాస్త్రాలతో క్షతగాత్రురాల్ని చేసినవారు యింకా కొందరు ఉన్నప్పటికీ స్థలాభావం కారణంగా చర్చించడంలేదు. వివాదం ఇలా కొనసాగుతూ పోవడం మంచిదికాదని భావించిన ‘హిందూసుందరి’ పత్రికాధిపతిjైున సత్తిరాజు సీతారామయ్య జోక్యం చేసుకొని ‘ఇప్పుడిప్పుడే తలయెత్తుతున్న స్త్రీవిద్యయందభిమానముగల నాసోదరీమణులందరూ ఈ చర్చనింతటితో ముగించి విద్యాభివృద్ధికై యెవరికితోచినటుల వారు పాటుబడగోరుచున్నాము’ అంటూ ‘హిందూ సుందరి’లో చర్చను ముగించారు. (‘హిందూసుందరి’, అక్టోబరు`నబంబరు 1911, పు. 38).
సుదీర్ఘమైన ఈ వివాదం వలసాంధ్రలో వితంతుసమస్యకు సంబంధించిన పలు కోణాలను వెలుగులోకి తెస్తుంది. వీరేశలింగం లాంటి పురుష సంస్కర్తలు ప్రారంభించిన వితంతు పునర్వివాహోద్యమ భావాలు సమాజంలో లోతుగా పాతుకోలేకపోయాయన్నది దీన్నిబట్టి స్పష్టమౌతుంది. ఏ స్త్రీ సమాజ ఉద్ధరణకై పురుష సంస్కర్తలూ స్త్రీ సంస్కర్తలూ పాటుపడ్డారో ఆ స్త్రీ సమాజంలోనే వితంతు సమస్యపై స్పష్టమైన విభజన ఉండిరదనీ కేవలం విద్యావంతులైనంత మాత్రం చేత ఛాందస భావాలను వదులుకొని స్త్రీలు అన్నిరకాల సంస్కరణలకు సిద్ధపడలేదనీ అర్థమౌతుంది. పునర్వివాహంతో ఒక సమస్యనధిగమించిన పునర్వివాహితలకు సామాజిక ఆమోదం లేకపోవడం, గౌరవప్రదమైన స్థానం లభించకపోవడం, సామాజిక వెలివేత లాంటి సమస్యలు చుట్టుముట్టాయన్నది విస్పష్టం. కొంతమంది వారిని ఘనమైన హిందూ పతివ్రతా ధర్మానికి మాయని మచ్చగా భావించి తిరస్కరించారు. అయినప్పటికీ పులుగుర్త లక్ష్మీ నరసమాంబ వర్గం ఈ వివాదంలో ఘోరంగా ఓడిపోవడమన్నది ఛాందసత్వభావజాలపు ఓటమిÑ గాలి సంస్కరణ వైపే బలంగా వీచిందనడానికి ప్రబల నిదర్శనం.
నరసమాంబ వితంతు పునర్వివాహవాదులతో వాదులాడ్డమంతా ఒక ఎత్తైతే, సంఘసంస్కార వటవృక్షమైన కందుకూరి వీరేశలింగాన్ని ప్రత్యక్షంగా, కడు భీకరంగా ఢీకొట్టడం మరో ఎత్తు. ‘సావిత్రి’ని వేదికగా చేసుకొని నరసమాంబ వీరేశలింగం పైకి లంఘించారు. ఈ అక్షర సంగ్రామం కూడా సుమారుగా ఒక సంవత్సరం సాగింది! ఈ సంగ్రామం 1904 – 1905లో, అంటే ఇరవయ్యవ శతాబ్ది ప్రారంభంలోనే జరగడం విశేషం.
వితంతు పునర్వివాహ వ్యతిరేకీ, నరసమాంబ అనుయాయీ అయిన మన్యం వెంకట సుబ్బమ్మ ‘సతీధర్మ ప్రకాశిక’ అనే దీర్ఘమైన వ్యాసాన్ని ‘సావిత్రి’లో ప్రచురించారు. (ఉదా: చూ. ఆగస్టు, సెప్టెంబరు 1904). మనుధర్మశాస్త్రాన్ని తలపించే రచన ఇదిÑ అడుగడుగునా మనుస్మృతి నుండి ఉల్లేఖనాలుండడం, సంఘసంస్కరణవాదుల వాదనలను పరోక్షంగా తిరగదోడ్డం అందులోని విశేషం! అది రాసింది మన్యం సుబ్బమ్మ కాదనీ, ఆమె పేరుతో ఒక పురుషుడు రాసినాడనీ, ‘యాఘను’డెవరో తనకు తెలుసుననీ, అలాంటి ‘స్త్రీ పురుషులు’ కొంతమంది తనకు తెలుసుననీ వీరేశలింగం వాదించారు. ‘సతీధర్మ ప్రకాశిక’లో వ్యక్తమైన భావజాలాన్నీ, ఛాందసవాద స్త్రీలు ప్రయోగిస్తున్న గ్రాంథిక భాషనూ తీవ్రంగా హేళన చేస్తూ ‘సావిత్రీ సత్యవతీ సంభాషణము – స్త్రీ విద్య’ అనే రచనను సంభాషణారూపంలో ప్రచురించారు వీరేశలింగం. అందులోని కొంత భాగాన్ని చూద్దాం. (‘తెలుగు జనానా’, అక్టోబరు 1904, పు. 121`126).
‘‘సత్యవతి – విదుషీమణినగు నక్కా! క్రిందటి నెల ‘సావిత్రీ సుందరీ పత్రికలను జదివితివా?
సావిత్రి ` నేనుకాను. నీవు నక్కవు. నన్ను నక్కా అంటావా?
సత్యవతి ` కోపపడబోకు, నిన్నక్కాయన్నానుగాని ‘నక్కా’ యనలేదు. నేనిపుడు వ్యాకరణము చదువుకొనుచున్నాను. ‘ఉదంత తద్ధర్మాకవిశేషణమున కచ్చుపరంబగునపుడు నుగాగరుంబగు’ నను సూత్రముచేత నక్కాయను రూపము రాదా? ….
సావిత్రి – అహహహహా నీ చదువు చట్టుబండలయినట్టే వున్నది. ఈపాటి నీ వ్యాకరణ పాండిత్యము కట్టిపెట్టి తెలిసేటట్టుగా మాటాడు. …
సత్యవతి – సావిత్రిలో వున్న ‘సతీధర్మ ప్రకాశిక’ యెంత బాగా వున్నదే? దానిలో యేమిశ్లోకాలు! యేమి వేదవాక్యాలు! యేమి ఇంగ్లీషు వచనాలు! యేమి చోద్యమే?
సావిత్రి – నాపేరిటి పత్రికలో రాసిన తరువాత బాగుండకుండా వుండేది కూడా వుంటుందా? మన్యం వెంకటసుబ్బమ్మ శాస్త్రిగారు వ్రాసిన దాని మాటా నీవు చెపుతూవున్నావు?
సత్యవతి ` శాస్త్రిగారంటావేమి? అది స్త్రీ రాసినదే.
సావిత్రి – గడ్డాలూ మీసాలూ వుండే పండిత స్త్రీలను శాస్త్రీ అని పిలువవలసినదేనే. అందులో తప్పేమీలేదు.
సత్యవతి – ఓహోహో! ఆడవాళ్ళ పేర్లు పెట్టుకొన్న పురుషులనా నీయభిప్రాయము? … వెంకటసుబ్బమ్మగారెవరో యెరుగుదువా? ఆమె వైశ్యాంగనారత్నమట. ఆమె భర్తను సెట్టిగారనవలెనుగాని శాస్త్రిగారనవచ్చునా?
సావిత్రి – అందులో ఉదాహరించిన వేదవాక్యాలూ శ్లోకాలూ చూస్తే, అది యెవడో బ్రహ్మిగాడు వ్రాసినట్టున్నదిగాని సెట్టిగారు వ్రాసినట్టు లేదు. అందుచేత శాస్త్రిగారన్నారు. క్షమించు. …’’.
ఇలా తీవ్రమైన వ్యంగ్యంతో సాగింది వీరేశలింగం రచన. దీనికి తీవ్రంగా ప్రతిస్పందించిన లక్ష్మీ నరసమాంబ ‘సావిత్రి’లో ‘కమలా – విమలా సంవాదము : (స్త్రీ విద్య)’ను (నవంబరు 1904, పు. 1-8) సంభాషణారూపంలో ప్రచురించి వీరేశలింగంపై తీవ్రంగా దాడి చేసారు: హేళనకు హేళనే సమాధానమన్నారు. నరసమాంబ భావజాలానికి ప్రతినిధిjైున కమల విమలతో ‘నా వెఱ్ఱిసోదరీ! (వీరేశలింగం పంతులు లాంటి) విద్వాంసులైనవారు స్త్రీల విద్యకు దగుప్రోత్సాహమునిచ్చుచున్నారని నీవు భ్రమపడుచున్నావు. అంతియేకాని స్త్రీవిద్యను నిరుత్సాహపరచుటలో వీరగ్రగణ్యులగుచున్నారని నీవెరుంగకున్నావు’ అనీ, ‘…. స్త్రీ విద్యాభిమానులమని పేరు పెట్టుకొని కొందరు లోకములో పుపన్యాసములిచ్చు సమయములందును బరులపై దండెత్తు సమయములందును నెంత స్త్రీ విద్యాభిమానము కనుపరచినను గ్రియలో దానికి వ్యతిరేకముగా నడచుచున్నారు ….’ అనీ, వారి అడుగులకు మడుగులెత్తకుండా ‘యబలలు తమ బుద్ధిని గూడ నుపయోగపరచుకొని తమకు మంచిదని తోచినదానిని చెప్పుచుండుటచే’ ఈ పండితులు ‘మాశ్చర్యమునుబూని నిర్దయులై స్త్రీలు వ్రాసిన వ్రాతపై విమర్శనములను వ్రాసియును బ్రకటించియును, జాల నిరుత్సాహమును గలిగించుచున్నారు’ అనీ దెప్పి పొడిచారు. స్త్రీలు రాసిన రాతలను విమర్శించినంత మాత్రంచేత అలాంటివారిని ‘మనకును మన విద్యకును శత్రువులని తలంపవచ్చునా?’ అని ప్రశ్నించిన విమలతో ‘మన బాగునకై యోగ్యములగు విమర్శనములొనర్చు’వారి గూర్చి తననడంలేదనీ, ‘మాత్సర్యమునుబూని యుక్తాయుక్తములాలోచింపక మన వ్రాతలపై దగని కువిమర్శనములొనరించు’ వారిని గూర్చి తను మాట్లాడుతున్నదని తెలిపింది. (తెలుగు) ‘జనానా పత్రిక’లో మన్యం వెంకటసుబ్బమ్మను వీరేశలింగం అవహేళన చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, స్త్రీలు చదువుకోవడానికి సరైన అవకాశాలే లేని సందర్భంలో కొందరు ఎన్నో కష్టాలనెదుర్కొంటూ చదువుకుంటున్నారనీ, వారు పత్రికల్లో వ్యాసాలు రాయడం, సభల్లో ఉపన్యాసాలివ్వడం చేస్తుంటే ఓర్చుకోలేక అధిక్షేపించే ‘శూరాగ్రగణ్యులు పూర్వనాగరికులందును నవనాగరికులందును గూడ హెచ్చుగా బయలువెడలుచున్నారు’ అనీ, అట్టి స్త్రీలకు ‘అపయశస్సు కలిగించవలెనను తలంపుతో వారిని ‘‘శాస్త్రి’’ మున్నగు నామములబెట్టి’ ప్రాజ్ఞులమనుకునేవారు పరిహసించుచున్నారనీ విమర్శించింది. వీరేశలింగం వ్యాసాన్ని ‘తెలుగు జనానా’ సంపాదకుడైన రాయసం వేంకటశివుడు ఎలా ప్రచురించారని అన్యాపదేశంగా ప్రశ్నించింది. (వీరేశలింగం రాశాక ప్రచురించకుండా వుండడమే! పైగా ఆయన ఆ కాలంలో ‘తెలుగు జనానా’కు సహసంపాదకుడుగా వున్నారాయె!!).
ఈవిధంగా లక్ష్మీ నరసమాంబ ‘బాబయ్య’గారైన వీరేశలింగాన్ని తప్పుపట్టగా, ఇంకోవైపు మన్యం సుబ్బమ్మ అతి తీవ్ర పదజాలంతో దూషిస్తూ ‘ఒక ప్రకటనము – ఒక మనవి’ అనే వ్యాసాన్ని ‘సావిత్రి’లో (డిసెంబరు 1904, పు. 1-9) ప్రచురించారు. మన్యం సుబ్బమ్మ పేరుతో వాస్తవంలో ఒక ‘‘బ్రహ్మిగాడు’’ ‘సతీధర్మప్రకాశిక’ను ప్రకటించాడన్న వీరేశలింగం ‘ఆరోపణ’ను కొట్టివేశారు. ‘….. ఈసుతో నన్నపయశస్సులో ముంప వ్రాసిన నీచ వాక్యము’ అయిన ‘సావిత్రీ ` సత్యవతీ సంభాషణము’ లాంటి ‘యనుచితపు వ్రాతల’ పట్ల తన అందమెంతో తెలిసికొనకుండా దారిన పోయేవారిని ‘వృథాగా’ వెక్కిరించే కోతిని ‘కోతిచేష్టలుగదాయని’ ఉపేక్షించునట్లుగా, రాజమార్గమున పోయేవారిని చూసి మొరిగే కుక్కను (‘‘గ్రామ సింహము’’) ‘కుక్క బుద్ధికదాయని’ వదిలేసేట్లుగా పట్టించుకోవద్దని ‘నెచ్చెలులు కొందఱు’ తనకు సలహా యిచ్చారన్నారు. కానీ తను మాత్రం వీరేశలింగం రాత ‘స్త్రీలకందరకునుగూడ’ అవమానపర్చేదిగా పరిగణించినందువల్ల సమాధానం రాస్తున్నానని తెలిపారు. ఇలాంటి స్త్రీ జనోద్ధారకులను నమ్ముకుంటే స్త్రీల పరిస్థితి ‘‘కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదడం’’లా మారుతుందనీ, ‘జనులు వేళాకోళము చేసినను, బంధువులు నిందించినను, మీరేమో తమకు సహాయమొనర్తురను పుట్టెడాశతో సతీతిలకములు పలువురు జంకు విడచి పత్రికలో వ్యాసములు వ్రాయ మొదలుపెట్టిరి. వెలుగు చేనుమేసినట్లు, తల్లి పిల్లనుదివినట్లు, మిమ్ము నమ్ముకొనినవారినే నింద్యములైన యాక్షేపణములకు మొదలుపెట్టినారు. మీ సావిత్రీ సత్యవతీ సంభాషణము నాకొక్కతికే యవమానమును దెచ్చునదిగాలేదు. చదువుకొని మంచి వ్యాసములు వ్రాయు సామర్థ్యమును సంపాదించిన సుదతీమణులకందరకును గూడ నవమానమును దెచ్చునదిjైుయున్నది చూడుడు ….’ అని వీరేశలింగాన్ని నిలదీసారు. ఆయనది ‘తెలివితక్కువ వ్రాత’ అని ఈసడిరచారు. తన వ్యాసరచనా సామర్థ్యాన్నీ, పాండిత్యాన్నీ శంకించి, కించపరచిన వీరేశలింగాన్ని ఛాలింజ్‌ చేస్తూ తను ఎలాంటి పరీక్షకైనా సిద్ధమేనని ధైర్యంగా ప్రకటించారు. ‘ఇందులకు మీకంగీకారమైనయెడల పరీక్ష జరుగవలసిన పద్ధతులు బుద్ధిమంతులు నలుగురుచితమగువారి నేర్పరచుకొందము. ఆపైన పరీక్ష కావచ్చును’ అంటూ ఎప్పుడైనా ఎక్కడైనా బస్తీమే సవాల్‌ అన్నారు మన్యం వెంకటసుబ్బమ్మ. నిజంగా గుండెలు తీసిన బంటు.
‘విదుషీమణులగు సోదరీమణుల’ను సంబోధిస్తూ తాను ‘సతీధర్మ ప్రకాశిక’ అనే వ్యాసాన్ని ‘సావిత్రి’లో ప్రచురించాననీ, దాన్ని వారు చూసే ఉంటారనీ, అందులో తానెవరినీ దూషించలేదనీ, ఒకవేళ ఎవరైనా చూడకుండా ఉంటే ఒకసారి ‘చిత్తగింపుడ’నీ విన్నవించుకున్నారు మన్యం సుబ్బమ్మ. తన వ్యాసంపై ‘సావిత్రీ సత్యవతీ సంభాషణము’ అనే ‘విమర్శనము’, ‘తెలుగు జనానా’లో ప్రచురితమైందనీ, ‘అది నాకేగాక జదువుకొనిన స్త్రీలకందరికిని నవమానము తెచ్చిపెట్టునదిగా’ ఉన్నదనీ, మీరంతా వాటిని చదివి ఏది ఉచితమో, ఏది అనుచితమో, వీరేశలింగం పంతులు అలాంటి రాతల్ని రాయడం ఎంతవరకు సబబో ‘నిష్పాక్షిక బుద్ధితో’ నిర్ణయించండనీ కోరారు. అంతేగాక, ‘ఉపేక్ష చేయకుడు, ఈవేళ నన్ను నిందించినవారు రేపు మిమ్ము నిందింపగలరు. పక్షపాతము వహింపకుడు. అనవసరమని తలంపకుడు. ఇది స్త్రీజాతిని గూర్చిన విషయముగా’ భావించి ప్రతిస్పందించమని మహిళాలోకాన్ని హెచ్చరించారు.
పులుగుర్త లక్ష్మీనరసమాంబ, మన్యం వేంకట సుబ్బమ్మల రాతల్ని ‘యపాత్రపు రాతలు’గానూ, ‘అవివేకుల దూషణములకు బదులు వ్రాయుట యుచితము’ కాదనీ భావించిన వీరేశలింగం ఉపేక్షించి ఊరుకున్నారు. ఈ ఉపేక్షను ఆయన ‘అసమర్థత’గా పరిగణించి ‘దురభిమానులైన ప్రతికక్షులు’ ‘అర్యమతబోధిని’ 1905 (?) ఏప్రిల్‌ సంచికలో ‘మన్యము వేంకట సుబ్బమ్మగారిచ్చిన ప్రత్యుత్తరమునకును వేసిన పందెమునకును మారుబలుకజాలక పంతులవారును తదనుచరులును గతించినదానికి చింతిల్లుచు నూరకుండి’రని వెటకారం చేశారు. దీన్ని అవవమానంగా భావించిన వీరేశలింగం ‘తెలుగు జనానా’ పత్రికలో ‘జనానా పత్రిక – సావిత్రి’ అనే వ్యాసాన్ని ప్రచురించారు (ఏప్రిల్‌-మే 1905). మన్యం వెంకటసుబ్బమ్మ ‘‘పేరుపెట్టి’’ ప్రకటించిన వ్యాసంలో ‘గేవల దూషణోక్తులును దోషారోపణములును తప్ప నుత్తరమీయదగిన సారాంశమందేదియు లేద’నీ, ‘ఆ తుచ్ఛపు వ్రాతలన్నియు వీధినాటకములయందు వేషము మార్చి వేరు`వేరు పేరులు పెట్టుకొనివచ్చే యేకపరిహాసకునిచే వినిపింపబడు కథలవలె పాపభీతిలేక యసత్యములకును దూషణములకును దోషారోపణములకును బిరుదందె వేసికొన్న కాకినాడపుర వాస్తవ్యుడగు నొక్క పుణ్యపురుషుని చేతనే వ్రాయబడినవనియు, వేంకట సుబ్బమ్మగారు తమ పేరు వేయుట కంగీకరించుట తప్ప వేరు దోషమెరుగరనియు’ తాను ‘నిశ్చయముగా’ చెప్పగలననీ అన్నారు.
‘మారుపేరు పెట్టుకొన్న యా ఘనుని’ పేరును పేర్కొని పత్రికను ‘అపవిత్రం’ చేయజాలనన్నారు. స్త్రీ విద్యాభిమాని అయిన తాను ‘నిజముగా స్త్రీలు కవయిత్రులయి గ్రంథ రచన చేసినప్పుడు’ ఎంతగానో సంతోషిస్తాననీ, కానీ తాము రాయని గ్రంథములకు తమ పేర్లు పెట్టుకొని ఇతరులను వంచిస్తే మాత్రం క్షమించలేననీ హెచ్చరించారు. మన్యం సుబ్బమ్మ పాండిత్యాన్ని చూసి సంతోషించాలని కుతూహలపడుతున్నాననీ, ‘ఆమెకనుకూలమయిన కాలమును స్థలమును తెలిపిన యెడల, నామె పాండిత్య ప్రకటన సమయమునందు మేముండి యామెకీర్తిని కొనియాడెదము. ఆమె తప్పక మా ప్రార్థనమునంగీకరించి తన ప్రతిజ్ఞను శీఘ్రకాలములోనే’ నెరవేర్చాలని కోరారు. తనను పలువిధాలుగా నిందించిన పులుగుర్త లక్ష్మీనరసమాంబ వాదాలను చింతతొక్కు కొట్టినట్లుగా కొడుతూ స్త్రీల అభివృద్ధికై తాను పలువిధాలుగా పాటుపడనారంభించిన నాటికి పుట్టనుగూడా పుట్టని నరసమాంబ, ‘నిరుటి సంవత్సరము క్రొత్త పత్రికనారంభించి’ పురుషుల రాతలకు స్త్రీల పేర్లు పెట్టి నిస్సిగ్గుగా ప్రచురిస్తున్న నరసమాంబ తనను నిందించడం విడ్డూరంగా ఉందన్నారు. అంతేకాక ‘సతీధర్మ ప్రకాశిక’ను వాస్తవంగా ఎవరు రాశారో ఆమె భర్త పులుగుర్త వెంకటరత్నం ద్వారా తెలుసుకున్న ‘కాకినాడ వాస్తవ్యులగు కొందరు పెద్దమనుషులు’ తనతో చెప్పారన్నారు. మన్యం సుబ్బమ్మ పరీక్షార్థమై ‘సాధ్యమయినంత శ్రీఘ్రముగా’ సభను జరపమని కోరారు.
మన్యం వేంకట సుబ్బమ్మగారి పాండితీప్రకర్షాపరీక్ష జరిగిందో లేదో తెలియట్లేదు. ముఖ్యంగా సమకాలీన స్త్రీల పత్రికలలో దీనికి సంబంధించిన ప్రస్తావన వ్యాసకర్తకు దొరకలేదు. ఈ పరీక్ష జరగలేదనే అనిపిస్తోందిÑ ఎందుకంటే, జరిగి ఉంటే సమకాలీన పత్రికలు దీన్ని విశేష ప్రాధాన్యతతో ప్రచురించి ఉండేవి. కొన్ని చిన్న`చిన్న విషయాలను కూడా తన ‘స్వీయచరిత్రము’లో చర్చించిన వీరేశలింగం, మారుపేరుతో రాసిన ‘యా ఘనుని’ గూర్చి, ఇంత గడబిడ జరిగినాక కూడా, చెప్పకపోవడం ఆశ్చర్యంగా ఉంది.
రజస్వలానంతర వివాహాలనూ, వితంతు పునర్వివాహాలనూ వ్యతిరేకించడం ద్వారా ‘సావిత్రి’ సంఘసంస్కరణ అనే
ఉధృతప్రవాహానికి వ్యతిరేకంగా ఈదడానికి ప్రయత్నించి ఘోరంగా విఫలమైంది. సంపాదకురాలీ, ఆమెకు వత్తాసుపలికిన అనేక మంది స్త్రీల ఛాందసత్వం కారణంగా సహజంగానే సంఘ సంస్కరణ పక్షం వహించిన వారితో వివిధ రకాలుగా వాదించి ఎడతెగని వివాదాల్లో చిక్కుకొంది ‘సావిత్రి’. అయినప్పటికీ స్త్రీల సంపాదకత్వంలో వెలువడిన రెండవ స్త్రీల పత్రిక కావడం మహిళా జర్నలిజం చరిత్రలో ‘సావిత్రి’కి కాస్తంత చీకటిదే అయినా చిరస్మరణీయమైన స్థానాన్ని యేర్పరుస్తుంది.
కృతజ్ఞతలు: పులుగుర్త లక్ష్మీ నరసమాంబ ఛాయాచిత్రాన్ని పి. చిరంజీవినీ కుమారిగారి సంపాదకత్వంలో వెలువడ్డ తూర్పుగోదావరి జిల్లా చరిత్ర ` సంస్కృతి, (కాకినాడ, 2008) గ్రంథం నుండి తీసుకున్నాను. ఫోన్‌ చేసిన వెంటనే అవసరమైన భాగాల్ని పంపిన
శ్రీ చింతపల్లి సుబ్బారావుగారికీ, పంపించమని పురమాయించిన డా. పులుగుర్త చిరంజీవినీ కుమారిగారికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఇంకాస్త: పులుగుర్త లక్ష్మీ నరసమాంబ ఛాందస భావజాలానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం చూడండి:‘Punarvivaham Vs. Pativratyam: Pulugurta Lakshmi Narsamamaba and the Widow Remarriage Question in Colonial Andhra’, Studies in History, Vol. 37, No. 1, February 2021, pp. 61-91.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.