కారా కథల్లో స్త్రీ పాత్రలు -డా.బి.నాగశేషు

కథకు ఒక ప్రాంతం లేదు, కథకు కులం లేదు, కథకు మతం లేదు, కథ ఫలానా వాళ్ళే రాయాలనే వాదం కూడా లేదు. సాహిత్యాకాశంలో కథల వర్షం ఎక్కడ కురిసినా కథానిలయం చేరాల్సిందే. నేడు మనం ఏదైనా ఒక విషయాన్ని కానీ, విషయాంశాన్ని కానీ, స్థలం కానీ, స్థలమహాత్యం కానీ, వ్యక్తులు గానీ, వ్యక్తుల గురించి కానీ, వస్తువుని,

వస్తువాంశాన్ని కానీ, పద్యం కానీ, పాట కానీ, కవిత్వం, పని, సమస్తం అవసరాల కోసం మనం వెతికేది, ముందు తీసే తలుపు ఇంటర్‌నెట్‌. డిజిటల్‌ యుగంలో నివసిస్తున్న మనం, డిజిటల్‌ తనాన్ని ఇరవై ఏడేళ్ళ క్రితం ఆలోచించే అంత సామర్ధ్యం కారా మాస్టారుగారికి అబ్బిందంటే అది చాలా అరుదైన వ్యక్తిత్వంగా చెప్పుకోవాలి. ఒక ప్రక్రియ మొత్తం ఒక చోటుకు చేర్చాలనే ఆలోచన, తపన రెండూ ఆయన్ని సాహిత్యాకాశంలో చిరస్థాయిగా నిలబెట్టాయి. అంతేకాకుండా పాఠకుడ్ని, రచయితను ఇద్దరినీ ఒక చోటుకు చేర్చింది కథా నిలయం అని చెప్పవచ్చు. సాహిత్యాభిలాష ఉండి కథ చదవాలనే ఆశ ఉంటే చాలు కూర్చున్నచోటే కంప్యూటర్‌ తలుపు తెరిచి కథాలోకంలోకి ప్రయాణిస్తే, ఎన్ని కథలు కావాలి, ఏ కథ కావాలి, ఎవరి కథ కావాలి… అన్నీ మన చేతిలో దర్శనమిస్తాయి.
ఇటీవలి కాలంలో అనేక ప్రక్రియల్లో కొంతమంది సంఖ్య వేసి మరీ దాడి చేస్తున్నారు. అవి నిలుస్తాయా, కాలంలో కొట్టుకుపోతాయా అనే నిజాన్ని మాత్రం కాలమే నిర్ణయించాలి. రచయిత ఏది రాసినా అది మనతో మాట్లాడుతున్నట్లుండాలి, మనల్ని మాట్లాడిరచేలా ఉండాలి, గట్టిగా అరిచేలా చేయాలి, ఒక్కోసారి స్మశాన నిశ్శబ్దం అలముకోవాలి. అందరితో ఆ రచన గురించి చెప్పుకునేలా ఉండాలి, ఇంతేనా ఇలా మనం ఎందుకు రాయకూడదు అని అనిపించాలి. ఏవైనా రచనలోని తాలూకు సంఘటనలు మన జీవితంలో జరిగి ఉంటే ఒక్కసారి అవి గుండెను కలుక్కుమని ముల్లులా కెలకాలి, మంటలా రగల్చాలి, ప్రియురాలి ఆఖరి కౌగిలిలా మిగిలిపోవాలి. అన్నీ ఇలా ఉండాలని, ఉంటాయని అనుకోవడానికి లేదు.
రావిశాస్త్రిగారు విశాఖ భాషకు వన్నె తెచ్చినట్లే, శ్రీకాకుళం భాషకు గౌరవాన్ని సంపాదించి పెట్టిన ఘనత కారా మాస్టర్‌కు చెందుతుంది. కాళీపట్నం రామారావు గారు కథలు రాశిలో తక్కువగా రాసినా, వాసిలో చాలా నాణ్యత గలిగినవిగా సాహిత్యాన్ని సృజించగలిగారు. కథలు రాసినా, కథలు సేకరించినా ఒక యజ్ఞంలా చేశారు. కథలకూ, ఆయనకూ విడదీయరాని స్నేహబంధం ఉంది. ప్రజల ఆర్తిని పసిగట్టిన మనిషి. ఆయన పట్టుదలను చూసి కథలే మహదాశీర్వాదం చేశాయేమో. కుట్రలు, కుతంత్రాలు లేకుండా కథలకు జీవధారగా నిలిచారు.
మరి వీరి కథల్లో స్త్రీ పాత్రల మహత్వం, లోతుపాతులు, ఆదర్శాలు, అనుబంధాలు అన్నీ ఆత్మీయతలు తెలుసుకోవాలని, తెలియజేయాలనే చిన్న ఆలోచనే ఈ వ్యాసం.
‘అదృశ్యం’ అనే కథలో లలిత అనే పాత్ర స్త్రీ పురుషుల సంబంధాల పట్ల, వివాహ వ్యవస్థ పట్ల ఉండాల్సిన, చేయాల్సిన కర్తవ్యాన్ని గుర్తుచేసే పాత్ర. దీన్ని ఈ కథలో లలిత పాత్ర ద్వారా తెలియజేశారు.
లలితకు, ఒక యువకుడికి వివాహం ఖచ్చితమౌతుంది. అబ్బాయి కూడా తెలిసిన వాడే, ముందే గమనించినవాడే అనే విషయాన్ని లలిత తెలుసుకుంటుంది.
ప్రభుత్వ కార్యాలయంలో గుమస్తాగా పనిచేస్తూ తన పక్కింట్లో ఉండేవాడు. ఇతనికి ఎదురుగా ఉండే అనురాధ అనే వివాహితను రోజూ తన చూపులతో పలకరిస్తూ ఉంటాడు. ఈ విషయంలో అనూరాధకూ, లలితకూ వాదన జరగడం, ఆఖరికి భిన్నాభిప్రాయాలొచ్చి లలిత వివాహాన్ని తిరస్కరించడం ఇందులోని కథాంశం.
పేరులేని పాత్ర, ఉత్తమ పురుషలో సాగిన కథ. ఈ కథలో తాను పెళ్ళి చేసుకోబోయే వాడికి ఎలాంటి లక్షణాలుండాలో కలగంటూ వివరిస్తుంది. వివాహం విషయంలో స్త్రీలు ఎలా ఆలోచిస్తారో, ఆలోచించాలో ఈమె వివరిస్తుంది. ఆత్మాభిమానం, పరోపకారం, సామాజిక దృష్టి కలిగిన అమ్మాయిగా తనకు కావాల్సిన వరుడి గురించి ఎన్నో కలలను వివరిస్తుంది.
రేవతి, లేఖా కథన పద్ధతిలో సాగిన ఈ కథలో దూరదృష్టి, నవచైతన్యం, తల్లుల ప్రేమ కనిపిస్తుంది. రేవతి అనే యువతి సీత అనే యువతికి రాసిన ఉత్తరాల సారాంశమే ఈ కథ. ఆ ఉత్తరాల్లో వారి కుటుంబ విషయాలు, ఆదర్శాలు, పురాణాలు, సైన్స్‌, యుద్ధాలు అన్నీ వివరించుకుంటారు. సీత రాసిన ఉత్తరం కనిపించదు కానీ అందులోని విషయాలు మాత్రం అన్నీ చెప్తుంటారు. అందుకు రేవతి ప్రతిస్పందిస్తూ రాసిన ప్రత్యుత్తరాలే ఈ కథాంశాలు. ఒకరకంగా సంఘ సంస్కరణా భావాలు ఈ కథలోని పాత్రధారులు అని చెప్పవచ్చు. కారా మాస్టర్‌ కథల్లోని వస్తువులు కూడా అలాగే ఉంటాయి. గ్రామాలపై అభిమానం, పట్టణాలపై వ్యతిరేకత, ఆంగ్లభాషపై మోజు, వరకట్న దురాచారం, పెళ్ళిచూపుల పేరుతో యువతులు ఎదుర్కొనే కష్టాలు, ఆ తంతుతో జరిగే హింసలన్నీ రేవతి పాత్రద్వారా చెప్పించారు. ఒకరకంగా ఆదర్శవంతమైన జీవితానికి నిదర్శనం రేవతి పాత్ర.
‘మహదాశీర్వచనం’ అనే కథలోని సత్యవతమ్మ అనే పాత్ర ఇంట్లో అనారోగ్యంతో ఉంటుంది. భర్తకు వచ్చిన జబ్బును నయం చేయలేక నరకం అనుభవిస్తుంటుంది. పల్లెలో స్థిరపడడం వల్ల పట్నం తాలూకు వ్యవహారాలు తెలుసుకోలేకపోతారు. క్రమంగా తమ దగ్గరున్న కాస్తో, కూస్తో సంపద తగ్గిపోవడం, చివరికి చేతిలో చిల్లిగవ్వ లేకపోవడం, మెడలోని పసుపుతాడు ముత్తయిదువుతనాన్ని వెక్కిరించడం, తను వేసిన ఓటు తనకు ఏ మాత్రం మేలుచేయలేని తనాన్ని చూసి ఉస్సూరుమనడం కథలోని వస్తువు.
‘నారమ్మ చావు’ కథలోని నారమ్మ చనిపోతే ఇంట్లోని జనం కూలికి వెళ్ళుంటారు. చిన్నపిల్లలు మాత్రమే ఇంటి దగ్గరుంటారు. ముసలమ్మ చనిపోయిందని తెలుసు, కానీ ఎవరికి చెప్పాలో తెలియని స్థితి. చనిపోయిన వార్త కంటే శవాన్ని రేపటిదాకా అలా ఉంచితే వరికోతల కూలీ దొరకదని కుటుంబ సభ్యులు బాధపడతారు. చివరికి ఇంటికొచ్చి శవాన్ని అదే రోజు సాయంత్రమే దహనం చేయడమో, పూడ్చడమో చేయాలని ఆరాటపడతారు. శవాన్ని దహనం చేయడానికి కట్టెల కోసం ఇల్లిల్లూ తిరుగుతారు. చివరికి ఊర్లోని యువకులు కట్టెలు తీసుకొచ్చి ఇస్తే, వాళ్ళడిగిన ప్రశ్నలకు కుటుంబ సభ్యులందరూ తలదించుకొని చితికి నిప్పంటిస్తారు. కూలీ ముందు ఇంట్లో పడే శవాలు కూడా లెక్కలేదు, కారణం పేదరికం. పేదరికం అంతగా తరుముతుంటే బంధాలు, బంధుత్వాలు ఎక్కడ మిగులుతాయి.
సన్నెమ్మ, ఆర్తి అనే కథలోని పాత్రధారి ఎర్రెమ్మ, బంగారమ్మల బాధలు, సన్నెమ్మ చావు, ఆర్థిక పరిస్థితులు మారకపోతే జీవితాలు మారవని ఈ సన్నెమ్మ కథ తెలియజేస్తుంది.
‘సత్యవతి’ కథలో ఉన్నోడిరట్లోని వృథా, లేనివాడిరట్లోని వ్యథ రెండూ కనిపిస్తాయి. ఈ కథలో తిన్నది అరగనితనం కొందరిది, తినడానికి తిండి లేని తనం కొందరిది. షావుకారి పెరట్లో అయ్యే వృథా నీరు, పూరిపాకల్లో నీళ్ళు లేక గొంతెండిపోయి అలమటించే ప్రాణాలు… ఇవన్నీ తట్టుకుని నిలబడే జీవితాలకు ప్రతినిధి సత్యవతి పాత్ర. మిగిలిన అన్ని పాత్రలు ఇలానే ఉంటాయి.
ఆయన కథల మధ్య ఇతర విమర్శకులు చేసిన రెండు, మూడు దశల విభజనను అంగీకరిస్తూనే, అన్ని కథల్లోనూ మానవ సంబంధాల జీవధార అవిచ్ఛిన్నంగా ప్రవహించడం కనబడుతుంది. ఆయన కథలు రాయక ముందున్న పరిస్థితులు, ఆయన కథలు రాసిన కాలానికి సంబంధించిన పరిస్థితులు… అన్నీ ఆయన కథల్లో దర్శనమిస్తాయి. కారా కథల్లో కుటుంబం, గ్రామం, కులం, వర్గం, స్త్రీ పురుష సంబంధాలు, వయోభేదాలు, రాజ్యానికీ ప్రజలకూ మధ్య ఘర్షణ వంటి వేర్వేరు రూపాల్లో, వేర్వేరు స్థాయిల్లో వ్యక్తీకరణ పొందవచ్చు, వేర్వేరు పాత్రల ద్వారా పలికించి ఉండొచ్చు, వేర్వేరు సన్నివేశాల్లో మనకు దర్శనమూ కావచ్చు. కానీ మౌలికమైనది ప్రజాస్వామిక అన్వేషణ. ఇవాల్టికీ కొనసాగుతున్న, నేటికీ పరిష్కారం కాని ఆ అన్వేషణ వల్లే ఆయన రచనలు నేటికీ నిత్యనూతనంగా, పరిశోధనాత్మకంగా ఉంటున్నాయి.
ఈ మానవ సంబంధాల ప్రజాస్వామికీకరణ అన్వేషణ కారాను సహజంగా, అనివార్యంగా వర్గపోరాటం దగ్గరకు చేర్చింది. ఆయన కథలన్నీ వర్గపోరాటానికి వేర్వేరు వ్యక్తీకరణల చిత్రణలే. అయితే రచయితగా ఆయన విశిష్టత ఏంటంటే ఆయన వర్గ పోరాటాన్ని సమాజవ్యాప్తంగా వేర్వేరు తలాల్లో జరిగే నిరంతర ప్రక్రియగా, విశాలంగా, లోతుగా, సృజనాత్మకంగా అర్థం చేసుకున్నారు. వర్గపోరాటపు సుదూర, సూక్ష్మ ప్రకంపనలను కూడా ఆయన పట్టుకున్నారు. వర్గపోరాటాన్ని, దాని వ్యక్తీకరణలను నేరుగా, సూటిగా, మొరటుగా చిత్రించడం కాల్పనిక సాహిత్యం పని కాదనీ, అది విశ్వసనీయం కావాలంటే, పాఠకుల ఆలోచనల మీద ప్రభావం వేయాలంటే దాని చిత్రణ విభిన్నంగా, విశిష్టంగా, అపురూపంగా ఉండక తప్పదని ఆయన గుర్తించారు.
అందువల్లనే ఆయన ఈ వర్గపోరాట నిత్యజీవిత ప్రతిఫలనాలను మానవ సంబంధాల ద్వారా, సామాజిక చరిత్ర ద్వారా, సాధారణ జీవన సంఘటనల ద్వారా, జీవన పరిణామాల ద్వారా చిత్రించాలని పూనుకున్నారు. అందుకే కారా కథలు చదువుతున్నప్పుడు పైపొరలో ఎవరికైనా కనబడేవి మానవ సంబంధాలు, సామాజిక చరిత్ర, సాధారణ జీవన సంఘటనలు, సాధారణ జీవన పరిణామాలు. అక్కడి నుంచి కింది పొరల్లోకి వెళ్తున్నకొద్దీ వర్గపోరాట అనివార్యత, పీడిత వర్గ పక్షపాతం, వ్యవస్థ పరివర్తన ఆవశ్యకత కనబడతాయి. వర్గపోరాటాన్ని అంగీకరించని వాళ్ళయినా, గుర్తించని వాళ్ళయినా, దాని పట్ల అపోహలు ఉన్నవాళ్ళయినా కారా కథలు చదివి ఆకర్షితులయ్యేది వారికి ఈ నాలుగు అంశాల్లో ఏ ఒక్కదాని మీదనైనా ఉండే ఆసక్తి, అభిరుచి వల్లనే. ఆ కథల్లోని నిర్మాణం వల్ల, పొరలు పొరలుగా సూచించిన అనేక అంశాలు మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తాయి. అంతిమంగా అవి పాఠకుల ఆలోచనా సరళిని ఉన్నతీకరిస్తాయి. పాఠకుల అవగాహనల ఉన్నతీకరణే కారా రచనలను ప్రాసంగికంగా ఉంచుతుంది.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.