సత్యభామ శ్రీకృష్ణుని ఎనిమిది మంది రాణులలో ఒకతె. ఈ ఎనిమిది మందినీ కవులు అష్టవిధ శృంగార నాయికలకు ప్రతీకలుగా తీర్చిదిద్దారు. పండితులూ, కవులూ, లక్షణకారులూ దిద్దిన పాత్రలు అవి. స్త్రీల సహజాతాలను ఈ సమాజం పట్టించుకున్నదెక్కడ? అయినప్పటికీ వారి సహజమైన భావావేశాలనూ కవులు దృష్టిలో ఉంచుకున్నారు. యుగ ధర్మం అంటూ మానవుల కార్యకలాపాలను… ముఖ్యంగా స్త్రీల వేషభాషలను, నడవడికను
నియంత్రించిన సందర్భాలే సాహిత్యంలో ఎక్కువ. ఎంత విద్వత్తు కలిగి ఉన్నా అనాది నుంచీ స్త్రీలు పురుషాహంకారానికి లోబడుతూనే ఉండవలసి వచ్చింది. ఇప్పటికీ స్త్రీలను వంటకూ, పక్కలోకీ అవసరపడే పరికరంగా చూస్తూ వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారంటే అది పురుషాహంకారానికి నిదర్శనం. ఈ సందర్భంలో మహాకవి బమ్మెర పోతన సృష్టించిన, చిత్రించిన సత్యభామను ఒకసారి గుర్తు చేసుకుందాం.
పోతన భాగవతం ప్రకారం, శ్రీకృష్ణుడు నరకాసురునిపై యుద్ధానికి వెళ్ళినపుడు సత్యభామ కూడా అతనితో పాటు వెళ్ళింది. రథం మీద (గరుడుని మీద) అతని పక్కనే కూర్చుంది. కాసేపు నరకాసురునితో యుద్ధం చేసింది. ఈ కథలు అప్పటికి ప్రచారంలో ఉన్నవే. కొందరయితే నరకాసురుడిని సత్యభామే సంహరించిందని నమ్ముతున్నారు. ఈ ఘట్టాన్ని రాసేటప్పుడు పోతన, సత్యభామను తెలుగు ఆడపడుచులకు (కోడళ్ళకు కూడా) ఆదర్శంగా చిత్రించాడనిపిస్తుంది. ఆడపిల్లల సహజ సౌకుమార్యాన్నీ, వారు ముందు ముందు అలవరచుకోవలసిన ధీరత్వాన్నీ పోతన సత్యభామ పాత్రలో రంగరించాడు. భార్యను కూడ తనతో పాటు తీసుకెళ్ళడంలో, భార్య మాట మన్నించడంలో, ఆమెకూ యుద్ధం చేసే అవకాశం ఇవ్వడంలో, వారిని ఎదగనివ్వటంలో పురుషుల పాత్ర ఎలా ఉండాలో కృష్ణుని పాత్ర చిత్రణ ద్వారా స్పష్టం చేశారు.
దేశంలో ప్రసిద్ధమైన కళారూపాలలోనూ, యక్షగానాలలోనూ, వీథి నాటకాలలోనూ సత్యభామ పాత్ర పేరు పొందింది. ‘‘భామనే`సత్యభామనే’’ అంటూ ఆ పాత్ర ప్రవేశించటం ‘‘పదియారువేల మంది రమణులందరిలోనూ వన్నెకెక్కిన దానిని’’ అంటూ అభిజాత్యం ప్రదర్శించటం మనకు తెలుసు. ఆమెకు తనపై తనకున్న నమ్మకం అలాంటిది. అందుకు ధీటుగానే పోతన ఆమెను చిత్రించాడు. సత్యభామ యుద్ధం చేసిన విషయం సంస్కృత భాగవతంలో లేదు, తెలుగు భాగవతంలో ఉంది. పోతన ఆ ఘట్టాన్ని వేరే గ్రంథాల నుండి తీసుకున్నాడట. పోతన 15వ శతాబ్దానికి చెందిన కవి. ఇతని కాలం 1400`1470 అనీ, 1450`1510 అనీ, 1410`1470 అనీ రకరకాల అభిప్రాయాలున్నాయి. (సత్యభామ నరకాసురునితో యుద్ధం చేసినట్లు నాచన సోమనాధుని (1340 ప్రాంతం) ఉత్తర హరివంశంలోనూ, విష్ణు పురాణంలోనూ ఉన్నదట. ఆ ఆధారాలతో పోతన ఆ ఘట్టాన్ని చిత్రించాడని పండితులు చెబుతున్నారు.) నరకాసురుడు దేవగణాల విరోధి. గొప్ప పరాక్రమశాలి. అతని పట్టణం ప్రాగ్ జ్యోతిషపురం. దాన్ని మురాసురుడు రక్షిస్తూ ఉంటాడట. కృష్ణుడు మురాసురుడినీ, నరకాసురుడినీ చంపటం ఇక్కడ ఇతివృత్తం.
నరకుడు అపహరించిన దితి కుండలాలు, వరుణుని గొడుగు, మణి పర్వతం అనే దేవతల స్థానమూ తిరిగి తీసుకోవటానికి కృష్ణుడు నరకాసురునిపైకి దండెత్తి వెళ్ళాడని సంస్కృత భాగవతంలో ఒకే శ్లోకం (10`59, 2, 3) నాలుగు పాదాలతో ఉండగా పోతన ఆ విషయాన్ని తెలుగులో చాలా పెంచి రాశాడు. సంస్కృత భాగవతంలో ‘సభార్యా గరుడారూఢ’’అని ఉండగా పోతన అక్కడ సత్యభామను పెట్టాడు. ‘‘మీరు యుద్ధం చేస్తుంటే చూడాలని ముచ్చటగా ఉంది’’ అంటూ సత్యభామ కృష్ణుడ్ని ప్రార్ధించి ఒప్పించి వెంట వెళ్ళిందని చెప్పాడు. భర్తతో పాటు భార్య బయటకు వెళ్ళటం అనేది పోతన ఆకాంక్ష. దాన్నే సమాజానికి సూచించదలచుకున్నాడు. ఎలాగోలా భర్తను ఒప్పించటం, అతనితో పాటు ఒకే వాహనంపై వెళ్ళటం ఇక్కడ గమనించాలి. పూర్వపు యుద్ధ యాత్రల వర్ణనలలో స్త్రీలు వెళ్ళటమనేది కనిపిస్తుంది గాని సాధారణంగా వారు వేరే వాహనాలలో రథాలలో, పల్లకీలలో వెళ్ళేవారని చెప్పేవారు.
రామాయణ కాలంలో దశరధుడు ఇంద్రునికి సహాయంగా వెళ్ళిన ఒక యుద్ధం సందర్భంలో కైకేయిని అదే రథంలో తీసుకువెళ్ళాడని ఉంది. రథ చక్రం సీటు ఊడిపోతున్న దశలో ఆమె తన చేతి వేలు అడ్డంపెట్టి రథం పడిపోకుండా కాపాడిరదట. అప్పుడు ఆ సందర్భంలోనే ఆయన ఆమెకు రెండు వరాలు ఇచ్చాడు. ఆ వరాలు రామాయణ కథకు కీలకమయ్యాయి.
ప్రస్తుత విషయానికి వస్తే పోతన గారికి సత్యభామ చేత యుద్ధం చేయించాలని ఎందుకు అనిపించిందో ఏమో. స్త్రీలు శృంగార నాయికలుగానే ఉండకుండా శౌర్యమూర్తులుగా ఎదగాలని ఆయన ఆశించారేమో అనిపిస్తుంది. యుద్ధ రంగంలో కృష్ణుడు మొదట మురాసురునితోనూ, నరకాసురుని ఇతర సేనా నాయకులతోనూ యుద్ధం చేశాడు. వాళ్ళను కృష్ణుడు చంపేశాక నరకాసురుడు స్వయంగా యుద్ధరంగంలోకి వచ్చాడు. అతడ్ని చూడగానే సత్యభామ కొప్పు బిగించుకొని కొంగు నడుముకు చుట్టుకొని యుద్ధానికి సిద్ధపడిరదనీ, ఆ సంరంభం చూసి కృష్ణుడు, ‘‘వేమా దనుజుల గెలువగ లేమా నీవేల గణగి లేచితి విటురా. లే’ మాను మానవేనిన్ లే మా విల్లందు కొనుము లీలం గేలన్’’ అన్నాడట. (దనుజులను గెలవలేకపోతామా ఏమిటి, కంగారుపడకు, ఇటురా, లేకపోతే నీ చేత్తో ఆ విల్లు అందుకో) ‘‘లేమ’’ అంటే స్త్రీ అని అర్థం. పోతన పద్యాలు అనుప్రాసలతో నిండి ఉంటాయి. కృష్ణుడు ఇలా అంటూ ఆమె చేతికి విల్లు అందించాడట. ఆ విల్లు అందుకోగానే ఆమెకు బలం వచ్చింది. బాణాలు వేయాలనే ఉత్సాహం కలిగింది. అప్పుడు ఆమెను చూస్తే వీర శృంగార భయ రౌద్ర విస్మయాలు కలిసి రూపం దాల్చినట్లు ఉందట. ఆవిడ కృష్ణుని వైపూ, నరకుని వైపూ చూపులు ప్రసరిస్తూ యుద్ధం చేసింది. ఆ చూపులను పోతన చాలా హృద్యంగా వర్ణించాడు (10 పద్యాలు). బొమ్మ పెళ్ళిళ్ళకు వెళ్ళడానికి బద్ధకించే ‘బాల’ రణరంగానికి ఎలా వెళ్ళింది! మగవాళ్ళను చూసి వెనక్కు తగ్గే ‘ఇంతి’ పగవారిని ఎలా గెలవాలనుకుంది? బంగారు ఊయల ఎక్కడానికి భయపడే ఆమె గరుడుని పైకి ఎలా ఎక్కింది? చెలికత్తెలు పెద్దగా మాట్లాడితే విసుగుకొనే ‘కన్య’ యుద్ద భేరీలు ఎలా సహించింది? (‘‘కన్య’’ అనే పోతన వాడాడు) నెమళ్ళకు నృత్యం నేర్పుతూ అలసిపోయే అతివ యుద్ధంలో ఎలా నిలబడిరది? అంటూ కవి ఆశ్చర్యపోయాడు.
సత్యభామ ముఖం కృష్ణుడికి చంద్రబింబంలాగానూ, నరకునికి సూర్యబింబంలాగానూ కనిపించిందట. ఇలాంటి వర్ణనలతోనే సత్యభామ చేసిన యుద్ధాన్ని వర్ణించాడు. కాసేపయ్యాక ‘‘బాగా యుద్ధం చేశావు, నరకుని సైన్యం బలహీనపడిరదిలే’’ ‘‘నీవు కోరిన నగలన్నీ చేయిస్తాను గాని ఇక ఆ విల్లు నాకు ఇచ్చేసెయ్యి’’ అంటూ కృష్ణుడు ఆమె నుండి విల్లు అందుకున్నాడు. ‘‘ఆడది యుద్ధం చేస్తుంటే చూస్తూ ఉండటం మగతనమా? దనుజులు శౌర్యవంతులు కాబట్టి ఆడవాళ్ళతో యుద్ధం చెయ్యరు’’ అంటూ నరకాసురుడు కృష్ణునితో పరిహాసాలాడాడు. తర్వాత యుద్ధం జరిగింది. అదంతా వేరే కథ.
పోతన వర్ణనల ఆధారంగా ఇక్కడ తెలియవచ్చేదేమిటంటే స్త్రీలు కొన్ని రంగాలకే పరిమితం కాకుండా ఉండాలనీ అవసరమైతే యుద్ధాలకూ వారు సన్నద్ధంగా ఉండాలనీ ఒక హెచ్చరిక లాంటిది చేశాడు. నగలు చేయిస్తానంటూ స్త్రీలను మభ్యపెట్టడాన్ని కూడా ఒకవైపు చెప్పాడు. పోతన సమకాలిక కవులకు భిన్నంగా ఆలోచించాడనే విషయం ఈ ఘట్టంలో స్పష్టమవుతోంది. అప్పటికి కాకతీయ రుద్రమదేవి శౌర్యాన్ని గురించిన కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆ స్ఫూర్తి పోతనపై ఉంది. అదే ఈ కల్పనకు మూలం. పోతన సహజ కవి. నారాయణుని అవతార గాథలను భక్తితో స్తుతిస్తూ చెప్పినా వారి శత్రువులైన అసురులను కూడా గౌరవంగానే చూశాడు. ‘‘దనుజులు (అసురులు) శౌర్యవంతులు కాబట్టి ఆడవాళ్ళతో యుద్ధాలు చెయ్యరు’’ అని నరకుని చేత పలికించాడు. అసుర చక్రవర్తులైన శిబి, హిరణ్యకశ్యపుడు, బలి మొదలైన వారి గొప్పతనాన్ని, పాలనారీతులనూ ఏ మాత్రం పక్షపాతం లేకుండా వర్ణించి చెప్పాడు. అలాగే స్త్రీలు అన్ని రంగాలలోనూ పురుషులతో సమానంగా సాగవలసిన అవసరాన్ని చెప్పాడు.
తన కాలానికి ప్రచారంలో ఉన్న గాథలను ఒకచోట కూర్చి భావి తరాలకు అందజేయడంతో పాటు సమాజ పురోగమనానికి అవసరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. పరిశోధకులు వాటిపై దృష్టి సారించాలి.
సత్యభామ, నరకాసురుల యుద్ధం గురించి ముక్కు తిమ్మన తన ‘‘పారిజాతాపహరణం’’ ప్రబంధంలో రాశాడు. అది 1518 ప్రాంతాల నాటిది. ఆ ఎత్తుగడ వేరు. అక్కడ పారిజాత పుష్పం, సత్యభామ కృష్ణునిపై అలగడం వంటి సంఘటనలున్నాయి. దానికి సంస్కృత హరివంశం మూలం. ఆ కథ ప్రకారం, నరకాసురుని చంపాక అతని దగ్గర ఉన్న అదితి కర్ణాభరణాలు తిరిగి అదితికి ఇవ్వటానికి శ్రీ కృష్ణుడు, సత్యభామ ఇంద్రుని నగరానికి వెళ్ళారు. తిరిగి వచ్చేటప్పుడు (దౌర్జన్యంగా) పారిజాతపు చెట్టును వాళ్ళ అనుమతి లేకుండానే తెచ్చేసుకున్నారు. నందనోద్యాన వనపు తోటమాలులతో యుద్ధం… ఇంకా అనేకానేక అంశాలు అక్కడ ఉన్నాయి. ఇది శ్రీ కృష్ణదేవరాయల కాలంలో రాసిన ప్రబంధం. అక్కడ వర్ణనా వైచిత్రికి ప్రాధాన్యం. పోతన రచనలోనూ వర్ణనా వైచిత్రి ఉన్నా… మానవ సహజమైన భయ, సందేహాలు, ఉద్వేగాలు స్వాభావికంగా పాఠకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా స్త్రీ పాత్రల చిత్రణలో ఉదాత్తత, గాంభీర్యమూ, సౌకుమార్యమూ కలగలిసి ఉన్నాయి. వర్తమాన సమాజానికి పోతన సత్యభామ లాంటి మూర్తిమత్వం అవసరం.