మొత్తం 113 కవితలు… వీటినిండా ఎంతమంది, ఎన్ని రకాల మనుషులో… మనసులో
గాయపడిన వారు, గాయం చేసేవారు, ఆకాంక్షలు, ఆంక్షల మధ్య నలిగిపోయిన వారు, మనం నడిచే దారుల మీద ముళ్ళు పరిచేవారు, మిణుగురులై దారి చూపించిన వారు… ఇలా చాలామంది. వాటిల్లో నాకు నచ్చిన కొన్ని కొన్ని వాక్యాలు… ఇంతకన్నా విశ్లేషించలేను.
దాచిన నక్షత్రాలు
ఎన్ని చావు బతుకుల చక్రభ్రమణాలైతే
ఒక్క జీవితం ముగుస్తుందో ఎవరికీ తెలియదు
నవ్విపోయే కన్నీళ్ళు
కొన్ని ఋణానుబంధాలు ఎంతకీ తీరవు
అన్ని దుఃఖాలు కన్నీళ్ళలో ఇమడవు
నదుల్ని కొండల్ని రెండుగా చీల్చి నడిచొచ్చే మనుషులకు
ముక్కలు ముక్కలైన మనసులను
అతికించుకోవడం చేతగాకనా
అని కన్నీళ్ళు నవ్విపోతాయి
మూసిన కిటికీలు
కిటికీలు మూసుకుని శాంతి రాలేదని తిట్టుకునే మనుషులకు
తన వారి కోసం
తనని కోల్పోవడంలో తీయదనం ఎలా తెలుస్తుంది
’ఆసరా’ అనే కవితలో మనుషుల గురించి చెప్తూ…
నీ రెక్కలు అలసి సేద తీరాలనుకున్నప్పుడు నీ కోసమే కాచుకుని ఉండి ఆసరా ఇచ్చే కొమ్మలు అంధకారం లోకమంతా పరుచుకుని నీ కోసం నువ్వు తడుముకుంటున్నప్పుడు
నిన్ను నీకు పట్టించేందుకు మెరిసే మిణుగురులు
హృదయం లేని మనుషులు ఎదురైతే భయపడొద్దని చెప్తూ ‘మాయ’ అనే కవితలో…
హృదయం లేని మనిషి
మరోసారి ఎదురైతే
దుర్మార్గుడని భయపడకు
ఆ హృదయాన్ని అక్కడి నుండి
మాయం చేసిన మనుషులను
తలుచుకుని భయపడు.
విషాద మోహనం
నవ్వుతూ బతకడం
తప్పనిసరి విషాదమైపోతుంది
బాధ తీరా ఏడవగలగడం
సంతోషకరమైన సందర్భమవుతుంది
అంతా తెలిసీ అన్నీ తెలుసుకునీ కూడా
ఆకు చెట్టునే నమ్ముకున్నట్టు
మనుషులలోనే జీవితాన్ని వెతుక్కుంటావు
కరకు ముళ్ళ మధ్య కూడా సున్నితంగా వికసించే గులాబీది కదా అందం
కఠిన శిలల మధ్య మొలకెత్తే
విత్తనానిది కదా ధైర్యం
ఒక మనసు చాలదు
ఆంక్షలు ఆకాంక్షలకు మధ్య
కొట్టుమిట్టాడడానికి ఒక్క జీవితం
ఏమి సరిపోతుంది
చింతలు చింతనలు మోసుకుంటూ తిరిగే మనుషులకు
ఒక్క హృదయం ఉంటే ఎలా కుదురుతుంది
అపరిచిత సంకేతం
వేల మంది పరిచయస్తుల మధ్య
ఒంటరితనం ముంచెత్తడమే అసలైన దుఃఖం
ఒకే ముఖం వేల ముసుగులు
ఒక్క ముఖం దాచడానికి
ఎన్ని ముసుగులు కావాలో
శీతల సమాధి
ఎవరు విడిచిన శ్వాస మనకు ఊపిరి అయిందో
ఎవరి ఋణానుబంధాలు ఎప్పటికి తీరతాయో
బాహుబలం
వర్షాన్ని వద్దనుకుంటే
సముద్రం అంత విశాలమెలా అవుతుంది
సంఘర్షణని నిషేధిస్తే
జీవితమెలా రాటుదేలుతుంది
భూమిలోలకం
ఒకరిని ఒకరు బాధపెట్టుకునేందుకో
ఒకరి బాధను ఒకరితో పంచుకునేందుకో
కాకుంటే ఇంత మంది మనుషులు ఎందుకు
స్వీయ హననం
ముళ్ళ మధ్య గులాబీలు విచ్చుకుంటున్నప్పుడు
బురదలో కలువలు వికసిస్తున్నప్పుడు
కల్లోలంలో శాంతి సహజం కాదని ఎలా అంటావు
చుక్కలని కలపాలిక
ఒక చిరునవ్వు వెనుక కన్నీటి మరకలను దాచుకోవడం మనుషులకి తెలిసినట్లే చీకటినంతటినీ వెన్నెల చారికలతో కప్పి కప్పిపెట్టడం ఆకాశమూ నేర్చుకుంది.
మృత లోకం
నీకు తెలియదు కానీ
నీకున్నవి రెండు హృదయాలు
ఆశల్ని సమాధి చేసి
ఒకటి నిర్జీవమైంది
శ్వాస నిలుపుకునేందుకు మరొకటి కొట్టుకుంటున్నట్లు నటిస్తుంది
మనుషులెన్నడూ కవిత్వం కాలేరు
జ్ఞాపకాలన్నిటినీ మర్చిపోవాల్సి రావడం
ప్రశ్నలకు సమాధానం వెతక్కుండా
సరిపెట్టుకోవడం
అలవాటైనాకైనా నీకు తెలిసి ఉండాలి
మనసుల్లో ఎప్పుడూ ఇళ్ళు కట్టలేము
మూసిన తలుపుల వెనక
ఉన్న చోటునే నిలిచిపోవడంలో
సౌందర్యం లేదన్నది ఎవరు?
ప్రవహించడమే జీవితమని
నది అంటుంది సరే
ఒరుసుకుపోతున్న ఒడ్డు దుఃఖాన్ని
వింటున్నది ఎవరు?