సహోదరిత్వం ఇప్పటికీ శక్తివంతమయిందే
‘‘సహోదరిత్వం శక్తివంతమైంది’’ అన్న నినాదం మొట్టమొదట వాడినప్పుడు విన్నవాళ్ళకి ఒళ్ళు గగుర్పొడిచింది. నేను డిగ్రీ కాలేజీలో మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు నేను స్త్రీ వాద ఉద్యమంలో పూర్తి స్థాయిలో పాల్గొనటం ప్రారంభించాను. మొదటి సంవత్సరం
అమ్మాయిల కాలేజీలో చదువుకుని స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీకి వెళ్ళగానే అమ్మాయిలు మాత్రమే ఉన్న తరగతి గదుల్లో వారు కనబరిచే ఆత్మ విశ్వాసానికి, అబ్బాయిలు ఉన్న తరగతి గదుల్లో వారు కనబరిచే ఆత్మ విశ్వాసానికి మధ్య తేడా కొట్టొచ్చినట్టు కనిపించేది. స్టాన్‌ఫర్డ్‌లో ప్రతి తరగతి గదిలో మగవాళ్ళదే రాజ్యం. ఆడవాళ్ళు మాట్లాడటం తక్కువ, ఆసక్తి కూడా పెద్దగా చూపించేవాళ్ళు కాదు. అసలు వాళ్ళేం మాట్లాడుతున్నారో ఎవరికీ వినిపించనంత తక్కువ గొంతులో మాట్లాడేవాళ్ళు. వాళ్ళ గొంతుల్లో ఎక్కడా శక్తి, ఆత్మవిశ్వాసం, ధైర్యం ఇసుమంతయినా కనిపించేవి కావు. ఇది చాలదన్నట్టు మగ ప్రొఫెసర్లు మాకు ప్రతి క్షణం ‘మీరు అబ్బాయిలంత తెలివయిన వాళ్ళు కాదు, మీరు గొప్ప మేధావులు, రచయితలు కాలేరు’ అని చెప్తుండేవాళ్ళు. అమ్మాయిల కాలేజీలో చదివొచ్చిన నాకు ఈ ధోరణులు దిగ్భ్రాంతులు కలిగించాయి. నేను అంతకు ముందు చదివిన అమ్మాయిల కాలేజీలో వాతావరణం భిన్నంగా ఉండేది. మహిళా ప్రొఫెసర్లు తమకోసం ఏర్పరచుకున్న మేధోపరమయిన ప్రమాణాల ప్రకారం మమ్మల్ని కూడా కొలిచేవాళ్ళు. వాటి ప్రకారమే మా మేధని, విలువని ఎప్పుడూ సమర్ధిస్తూ, ధృవీకరిస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడూ మగవాళ్ళ కంటే మేము మేధలో, తెలివిలో తక్కువనే భావన మాకు కలగలేదు.
ఇంకా చెప్పాలంటే అక్కడి మా తెల్లజాతి ఇంగ్లీష్ ప్రొఫెసర్ నన్ను స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీకి వెళ్ళడానికి ప్రోత్సహించింది. మా కాలేజీలో రాయటం నేర్పించటానికి మంచి కోర్సులు లేవని, అందువల్ల నాకు సరైన గైడెన్స్ దొరకట్లేదని నన్ను స్టాన్‌ఫర్డ్‌లో చేరమని పురమాయించింది. ఆమెకి నేనెప్పుడూ రుణపడి ఉంటాను. భవిష్యత్తులో నేనొక ముఖ్యమైన మేధావిని, రచయితని అవుతానని ఆమె నమ్మింది. కానీ స్టాన్‌ఫర్డ్‌లో మాత్రం ప్రతి క్షణం నా సామర్ధ్యాన్ని శంకించారు. నా మీద నాకే అనుమానం కలిగించేలా చేశారు. సరిగ్గా అప్పుడే మొదలయిన స్త్రీవాద ఉద్యమం క్యాంపస్‌ని కుదిపేసింది. మహిళా ప్రొఫెసర్లు, విద్యార్థులు తరగతి గదుల లోపల, బయటా కూడా జెండర్ పరమయిన వివక్షని అంతం చెయ్యాలని పోరాడారు. అదొక సంభ్రమాన్ని కలిగించిన శక్తివంతమయిన సమయం. ఆ సమయంలోనే నేను స్త్రీవాద అధ్యయనాలలో నా మొదటి కోర్సును తీసుకున్నాను. దాన్ని టిల్లీ ఓల్సన్ బోధించారు. ఆ కోర్సులో చేరిన విద్యార్థులందరినీ ప్రధానంగా శ్రామిక వర్గ స్త్రీల గురించి ఆలోచించేటట్లు ప్రోత్సహించారు. అక్కడే ఆన్ సెక్ట్సన్ జీవిత చరిత్ర రాసిన డయానా మిడిల్ బ్రూక్ సమకాలీన కవిత్వంపై జరుగుతున్న క్లాసులో నేను రాసిన కవితని, పేరు లేకుండా అందరికీ ఇచ్చి రచయిత ఆడో, మగో కనుక్కోమని చెప్పారు. రచయిత జెండర్ ఆధారంగా రచనల విలువ కట్టే ఆలోచనా తీరుని విమర్శనాత్మకంగా చూడటం అలా ఆ తరగతిలో నేర్చుకున్నాం. అక్కడే 19 ఏళ్ళ వయసులో నేను నా మొదటి పుస్తకం ‘ఐన్ట్ ఐ ఏ ఉమన్‌ః బ్లాక్ ఉమెన్ అండ్ ఫెమినిజం’ రాయటం మొదలుపెట్టాను. ఈ అనూహ్యమయిన మార్పులలో ఏవీ కూడా స్త్రీల మధ్య సంఫీుభావానికి పునాదులు వేసిన స్త్రీ వాద ఉద్యమం లేకుండా సాధ్యమయ్యేవి కావు.
ఆ పునాది అప్పటికి మేము ‘అంతర్గత శత్రువు’ అని పిలుచుకున్న అంతర్గత సెక్సిజాన్ని విమర్శించటంపై ఏర్పడిరది. పితృస్వామ్య దృక్పథంతో రూపుదిద్దుకున్న సాంఘికీకరణ వల్లే మమ్మల్ని మేము పురుషుల కంటే తక్కువగా భావించుకుంటున్నామని, అందుకే ఒకరంటే ఒకరు అసూయ, భయం, శతృత్వం ఏర్పరచుకుని పితృస్వామ్య వ్యవస్థ ఆమోదం కోసం పోటీ పడుతున్నామని మాకు అర్థమయింది. సెక్సిస్టు ఆలోచనా రీతులే మనల్ని ఒకరిపై మరొకరు నిర్దయగా తీర్పులిచ్చుకునేటట్లు, కఠినంగా శిక్షించుకునేటట్లు చేస్తుంటాయి. స్త్రీ వాద ఆలోచన స్త్రీలలో ఉండే ఆత్మ ద్వేషాన్ని తొలగించుకునేటట్లు చేస్తుంది. మన చైతన్యం పైన పితృస్వామ్య ఆలోచనకుండే పట్టుని తొలగిస్తుంది.
ఇంకోవైపు నుండి చూస్తే, పురుషుల మధ్య అనుబంధాలు పితృస్వామ్య సంస్కృతిలో ఆమోదించబడతాయి, ధృవీకరించబడతాయి. వారిని ఏ బృందంలో పెట్టినా సహజంగానే ఒకరితో ఒకరు కలిసి మెలిసి, సహకరించుకుంటారని, టీమ్‌గా పనిచేస్తారని, వ్యక్తిగత ప్రయోజనాలు, గుర్తింపు పక్కన పెట్టి సమూహ ప్రయోజనాల కోసం పని చేస్తారని మన సంస్కృతిలో భావిస్తారు. స్త్రీల మధ్య అనుబంధాలను మాత్రం పితృస్వామ్యంలో అసహజం, అసాధ్యంగా పరిగణిస్తారు. అలాంటి అనుబంధం ఏర్పరచుకోవటాన్ని ద్రోహపూరిత చర్యగా భావిస్తుంటారు. స్త్రీ వాద ఉద్యమం స్త్రీల మధ్య అనుబంధాలను ఏర్పరిచే సందర్భాన్ని సృష్టించింది. మనం పురుషులకి వ్యతిరేకంగా కలవలేదు, మన ప్రయోజనాల కోసం కలిశాము. ఆడవాళ్ళు రాసిన పుస్తకాలను మాకు బోధించనందుకు మేము మా ప్రొఫెసర్లను సవాలు చేశాం. వాళ్ళంటే మాకు ఇష్టం లేక కాదు (వాళ్ళలో చాలామంది మాకు ఇష్టమయిన ప్రొఫెసర్లు). బోధనాంశాల్లో, తరగతి గదుల్లో ఉండే జెండర్ పక్షపాతాన్ని అంతం చెయ్యాలని అనుకున్నాం.
1970లలో ఆడ`మగ కలిసి చదివే కాలేజీల్లో జరిగిన ఇటువంటి స్త్రీ వాద పరివర్తన ఇళ్ళల్లో, పనిస్థలాల్లో కూడా జరిగింది. మొట్టమొదటిగా స్త్రీవాద ఉద్యమం మనల్ని, మన శరీరాల్ని మగవాళ్ళ ఆస్తిగా భావించొద్దని చెప్పింది. మన లైంగికతపై నియంత్రణ, పిల్లలు పుట్టకుండా అవసరమయిన పద్ధతులు, పునరుత్పత్తి హక్కులు, లైంగిక వేధింపులు, అత్యాచారాలకు ముగింపు ఉండాలంటే స్త్రీలుగా ఒక తాటిపై నిల్చోవడం అవసరమనిÑ ఉద్యోగాల్లో వివక్షని ఆపాలంటే ప్రభుత్వ విధానాలను మార్చమని అడగటానికి కలిసి పోరాడటం అవసరమని అందరికీ నేర్పింది. ఆడవాళ్ళలో ఉండే సెక్సిస్టు ఆలోచనల్ని ఎదుర్కొని మార్చటం, శక్తివంతమయిన సహోదరిత్వాన్ని ఏర్పర్చటానికి మొదటి మెట్టుగా పనిచేసింది. ఈ సహోదరిత్వమే జాతిని కుదిపేసింది. పౌర హక్కుల ఉద్యమం తర్వాత 1970లు, 1980లలో వచ్చిన స్త్రీ వాద ఉద్యమం మన జాతి రూపాన్నే మార్చేసింది. ఈ మార్పులను తెచ్చిన స్త్రీ వాద కార్యకర్తలు అందరి స్త్రీల శ్రేయస్సు గురించి ఆలోచించారు. స్త్రీల మధ్య ఉండే రాజకీయ సంఫీుభావాన్ని వ్యక్తీకరించే సహోదరిత్వం స్త్రీల అనుభవాలకి అనుకూలమయిన గుర్తింపు ఇవ్వటం లేదా అందరు స్త్రీలు అనుభవించే బాధల గురించి సహానుభూతి ఏర్పర్చుకోవటంపై మాత్రమే కాదు, దాని పునాది స్త్రీలపై జరిగే ఏ రకమైన పితృస్వామిక అన్యాయాన్నయినా సరే ఎదిరించి పోరాడాలనే నిబద్ధతపై ఆధారపడి ఉంది. స్త్రీల మధ్య ఏర్పడే సంఫీుభావం సెక్సిజాన్ని బలహీనపరచి పితృస్వామ్యాన్ని కూలదోయటానికి అవసరమయ్యే వేదికలని ఏర్పరుస్తుంది. వ్యక్తిగతంగా స్త్రీలు తమ వర్గపరమయిన, జాతి పరమయిన అధికారాన్ని వదులుకుని అణగారిన వర్గాలకి చెందిన స్త్రీలని దోపిడీ చెయ్యకూడదని నిశ్చయించుకోకపోతే వర్గం, జాతుల కతీతంగా సహోదరిత్వం సాధ్యపడి ఉండేది కాదు. స్త్రీలు వర్గ, కుల అధికారాన్ని వాడుకున్నంత వరకూ స్త్రీ వాద సహోదరిత్వం వాస్తవ రూపం తీసుకోలేదు.
1980లలో చాలామంది స్త్రీలు అవకాశవాదంతో, తమలోని సెక్సిజాన్ని వదిలించుకోగలిగే చైతన్యం పెంచుకోకుండానే స్త్రీవాదం జెండా ఎత్తుకోవటంతో, అధికారం ఉన్నవాళ్ళు బలహీనులపై ఆధిపత్యం చెలాయించాలనే పితృస్వామ్య భావనే ఇతర స్త్రీలతో వారి సంబంధాలకు రూపిచ్చింది. అప్పటివరకూ ఏ హక్కులు లేని తెల్లజాతి స్త్రీలు, సెక్సిజాన్ని వదులుకోకుండా, వర్గపరమయిన ఆధిపత్యాన్ని పొందటంతో స్త్రీల మధ్య ఉండే విభజనలు తీవ్రమయ్యాయి. నల్లజాతి స్త్రీలు సమాజం మొత్తంలో ఉండే జాత్యహంకారాన్ని విమర్శించి, స్త్రీ వాద సిద్ధాంతం, ఆచరణలో జాత్యహంకార పాత్ర గురించి మాట్లాడినప్పుడు తెల్లజాతి స్త్రీలు తమ మెదళ్ళు, హృదయాలు మూసేసుకుని మొత్తం సహోదరిత్వాన్నే వదిలేశారు. స్త్రీల మధ్య వర్గపరమయిన విభేదాల గురించి మాట్లాడినప్పుడు కూడా ఇదే పరిస్థితి ఏర్పడిరది.
కానీ నాకిప్పటికీ ఒకటి గుర్తుంది. స్త్రీవాద మహిళలు, ముఖ్యంగా వర్గపరంగా పై మెట్టులో ఉన్న తెల్లజాతి స్త్రీలు ఇంట్లో పనికోసం శ్రామికులను పెట్టుకోవటం గురించి, ఆ శ్రామికుల అణచివేతలో పాలుపంచుకోకుండా, వారిని అమానవీయంగా పరిగణించకుండా ఎలా ఉండటం అని చర్చించుకున్నారు. కొంతమంది తమ ఇంటి శ్రామికులతో అనుకూలమయిన అనుబంధం ఏర్పరచుకుని, అసమాన సమాజంలో ఇద్దరికీ ముందుకెళ్ళే అవకాశం ఉండే ఏర్పాట్లు చేసుకున్నారు. సహోదరిత్వాన్ని కేవలం అసాధ్యమయిన కలగా వదిలేయకుండా, అందరి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఒక వాస్తవిక సహోదరిత్వాన్ని ఏర్పరచుకున్నారు. ఇది స్త్రీల మధ్య స్త్రీ వాద సంఫీుభావం కోసం పడిన కఠోర శ్రమ ఫలితం. దురదృష్టవశాత్తూ, స్త్రీవాదంలో అవకాశవాదం తీవ్రమయ్యే కొద్దీ, స్త్రీవాద ఫలితాలు పెద్దగా కనపడకుండా అందరికీ అందేసరికి, చాలామంది స్త్రీల మధ్య సంఫీుభావం కోసం పెద్దగా కష్టపడటానికి సిద్ధపడట్లేదు.
స్త్రీలలో చాలామంది అసలు సహోదరిత్వం అనే భావననే గాలికొదిలేశారు. వ్యక్తులుగా పితృస్వామ్యాన్ని విమర్శించి ఎదిరించిన స్త్రీలు కూడా తర్వాత సెక్సిస్టు పురుషులతో కలిసిపోయారు. స్త్రీల మధ్య చెలరేగే భీకరమయిన ప్రతికూలమయిన పోటీని చూసి నిరాశ చెందిన రాడికల్ స్త్రీలు పూర్తిగా వెనక్కెళ్ళిపోయారు. ఈ సందర్భంలోనే స్త్రీలందరి జీవితాలను మార్చడానికి వచ్చిన స్త్రీ వాద ఉద్యమంలో హెచ్చుతగ్గులు ఏర్పడ్డాయి. ఉద్యమానికి ప్రధాన నినాదమయిన సహోదరిత్వం చాలామంది స్త్రీలకు పనికిరానిదయిపోయింది. స్త్రీల పరిస్థితుల్లో అనుకూల మార్పులకి దారితీసిన స్త్రీవాద సంఫీుభావం ఇప్పుడు బలహీన పడి, ప్రమాదంలో పడిరది. స్త్రీల మధ్య రాజకీయ సంఫీుభావం కోసం, సమకాలీన స్త్రీ వాద ఉద్యమం మొదట్లో పనిచేసినట్లు మనం మళ్ళీ గట్టిగా పని చెయ్యాల్సిన సందర్భం వచ్చింది.
సంఫీుభావం ఏర్పడడానికి అవసరమయిన పని గురించి వాస్తవిక అవగాహన లేనప్పుడు మనం సహోదరిత్వం అనే కలని కన్నాం. అనుభవం, కఠోర శ్రమ, వైఫల్యాలు, తప్పుల నుంచి నేర్చుకున్న పాఠాల ఫలితంగా, స్త్రీ వాద రాజకీయాలకి ఇప్పుడే మళ్ళుతున్న వారికి స్త్రీల మధ్య సంఫీుభావం ఏర్పరచి, కొనసాగించి, కాపాడటం ఎలాగో నేర్పటానికి అవసరమయిన ఉమ్మడి సిద్ధాంతం, ఆచరణ ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. స్త్రీ వాదం గురించి ఏమీ తెలియని అనేకమంది యువతులు సెక్సిజంతో ఏ సమస్యా లేదనే నిరాధారమయిన ఆలోచనలో ఉన్నారు కనుక విమర్శనాత్మక చైతన్యం ఏర్పరచటానికి అవసరమయ్యే విద్యని మనం అందిస్తూనే ఉండాలి. ఈ తరం యువతులు పెద్దవాళ్ళయ్యే క్రమంలో స్త్రీ వాదం గురించిన జ్ఞానాన్ని తమంతట తామే సంపాదిస్తారని సీనియర్ స్త్రీ వాదులు అనుకోకూడదు. వారికి దిశా నిర్దేశం అవసరం. మొత్తంగా చూస్తే మన సమాజంలో ఆడవాళ్ళు స్త్రీల మధ్య సంఫీుభావానికున్న శక్తి, విలువ గురించి మర్చిపోతున్నారు. కొత్తగా వచ్చే స్త్రీవాద ఉద్యమం ‘సహోదరిత్వం శక్తివంతమైనది’ అనే నినాదాన్ని మళ్ళీ ఎలుగెత్తి చాటాలి.
సహోదరిత్వానికీ, స్త్రీల మధ్య సంఫీుభావానికి వాస్తవ రూపమివ్వటానికి రాడికల్ స్త్రీవాద బృందాలు ఇప్పటికీ నిబద్ధులయ్యే
ఉన్నాయి. వర్గాలు, జాతులకు అతీతంగా బంధాలు నిర్మించే పనిని మేము చేస్తూనే ఉన్నాం. ఒకరిపై మరొకరు ఆధిపత్యం చెలాయించకుండా స్త్రీలు తమని తాము ఆవిష్కరించుకోవచ్చనే సెక్సిస్టు వ్యతిరేక ఆలోచన, ఆచరణలకి వాస్తవ రూపమివ్వటానికి పనిచేస్తూనే ఉన్నాం. అంతేకాదు, అదృష్టం కొద్దీ, సహోదరిత్వం సాధ్యమేనని, చాలా శక్తివంతమైందని మనకి ప్రతి రోజూ అర్థమవుతూనే ఉంది.