గమనమే గమ్యం -ఓల్గా

ఇదంతా సుబ్బమ్మ లేకపోతే జరగదు. సుబ్బమ్మకు ఓపిక తగ్గుతున్న సమయంలో ఆమెను ఆదుకోటానికి పద్మ వచ్చింది. కోడలైనా కూతురిలా చూసుకుంటుంది. ఆమె పిల్లలు లావణ్య, రవి ఎంతో నటాషా అంతకంటే ఎక్కువ. సూర్యం సంగతి చెప్పే పనిలేదు. శారద ఏం చెప్తే అది ఆజ్ఞ వాళ్ళకు. ఇంటి పనులు, పార్టీ పనులూ అన్నీ బాధ్యతగా చేస్తుంటారు. శారదకు

తీరిక దొరికిన రోజున అందరూ కలిసి సంగీత, సాహిత్యాలతో ఇంటినంతా వెలిగిస్తారు.
అన్నపూర్ణ ఆ హడావుడినంతటినీ చూసి, దానికి మూలస్తంభమైన శారదను మనసులో మరీ మరీ మెచ్చుకుని వెళ్ళిపోయింది.
1948 జనవరి 30. మామూలుగానే తెల్లవారింది. శారదను, మూర్తిని కలవటానికి రైతు సంఘం నాయకులొచ్చారు. చల్లపల్లి జమీందారు మీద జరిపే పోరాటంలో విజయాలు ఇచ్చే ఆనందం కంటే కార్యకర్తల ప్రాణాలు పోవటం ఎక్కువ బాధ కలిగిస్తోంది. పోలీసులు జమీందారు వైపు, ప్రభుత్వం జమీందారు పక్షం. ఎలాంటి వ్యూహాలతో ముందుకు పోవాలనే చర్చలు జరుగుతున్నాయి. ‘‘మనం అనుకున్న లక్ష్యం ఆలస్యమైనా ఫరవాలేదు. కార్యకర్తల ప్రాణాలు చాలా ముఖ్యం. త్వరలో ప్రభుత్వం మనమీద నిర్బంధం పెంచుతుంది. దాన్ని తట్టుకోవాలి. ఒక కార్యకర్తను కోల్పోయామంటే పదేళ్ళు వెనక్కి వెళ్ళినట్టే అనుకోండి. తెలంగాణలో పోరాటం ఒకవైపు విజయాల వైపు వెళ్తున్నట్టు కనిపించినా యూనియన్‌ సైన్యాలు వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేము. ఆయుధాలు సేకరించటం కంటే ప్రజలను సమీకరించటం చాలా అవసరం. ఒకరిద్దరు సాయుధ కార్యకర్తలను చూసి తాత్కాలికంగా భయపడతారేమో కానీ వేలమంది ప్రజలను సమీకరిస్తే అది శాశ్వత విజయాలను ఇస్తుంది.’’
‘‘మన రైతు మహాసభలకు లక్షమంది రైతులు వచ్చారు గదండీ’’ అన్నాడో యువకుడు. అతనికి శారద మాటలు బొత్తిగా నచ్చలేదని తెలుస్తోంది.
‘‘అది స్వతంత్రానికి పూర్వం. ఇప్పుడు ప్రజల్లో మార్పు రాలేదా?’’
‘‘మన కృష్ణా జిల్లా ప్రజల్లో మార్పు రాలేదు. స్వతంత్రం వచ్చినా కాంగ్రెస్‌ అంటే మండిపడుతున్నారు. మనం స్వతంత్ర పోరాటానికి భిన్నంగా యుద్ధానికి సహకరించినప్పుడే రైతులు మనతో ఉండి మహాసభలకు బళ్ళు కట్టుకుని, నడిచి వచ్చారు. ఇప్పుడు కూడా రైతులు మనతోనే ఉన్నారు.’’
శారదకు పరిస్థితి అర్థమైంది. యువకులంతా తెలంగాణా పోరాటంతో ఉత్తేజితులై ఉన్నారు. వారితో వాదించి లాభం లేదు. అనుభవమే వారికి నేర్పాలి.
రైతులు పెట్టవలసిన జమిందారీ వ్యతిరేక డిమాండ్ల గురించి చర్చలు మళ్ళించి సాయంత్రానికి వాటికొక రూపం తెచ్చారు. సాయంత్రం అందరికీ కాఫీలు వచ్చాయి. సమావేశం ముగిసింది గనుక అందరూ విడిపోయి ఇద్దరు, ముగ్గురు కలిసి ముచ్చట్లాడుతున్నారు. కొందరు సిగరెట్‌ తాగేందుకు బైటికి వెళ్ళారు. శారద హాస్పిటల్‌కి వెళ్ళడానికి తయారవుతోంది.
మూర్తి హడావుడిగా లోపలికి వచ్చి
‘‘శారదా గాంధీ… గాంధీజీని హత్య చేశారు’’ అరిచినట్టే చెప్పాడు. శారదకొక క్షణం ఏమీ అర్థం కాలేదు.
‘‘గాంధీజీ మరణించారు. ఆయన్ని చంపేశారు’’.
‘‘ఎవరు’’ శారద కళ్ళనుంచి కన్నీళ్ళు కురుస్తున్నాయి.
‘‘ఇంకా తెలియదు’’. రేడియో పెడుతున్నాడు.
శారద కుర్చీలో కూలబడిరది. గుండెలు దడదడ కొట్టుకుంటున్నాయి. ఒళ్ళంతా నీరసం కమ్మేసింది. ఎన్నడూ ఇలా జరగలేదు శారదకు. రేడియోలో చెబుతున్నదేమిటో వినబడటం లేదు. సూర్యం శారదను పట్టుకుని నిలబడ్డాడు.
గాంధీ లేరు. చనిపోయారు. సహజ మరణం కాదు. హత్య. చంపేశారు. ఎవరు? జాతిపితను కాల్చేసిందెవరు? ఎవరికంత కోపం ఆయన మీద. హిందూ ముస్లిం కలహాలను ఆపే క్రమంలో ఆయన చేసిన కృషికి ఎవరు కోపగించారు. హిందువులా? ముస్లిములా? ఉన్మాదానికి మతమేమిటి? కానీ గాంధీ హిందువు. ఒక ముస్లిం ఆయనను చంపాడంటే దాని పర్యవసానాలు ఊహించలేం. మళ్ళీ మారణకాండ. శారదకు గాంధీ గురంచీ, ముస్లిం గురించీ కూడా గుండెల్లోంచి దుఃఖం తన్నుకొచ్చింది. శారద దుఃఖం చూసి సూర్యానికీ కన్నీళ్ళు ఆగలేదు.
‘‘శారదా… గాంధీని చంపింది ఆరెస్సెస్‌ వాళ్ళు. నాధూరాం గాడ్సే అట. తెలిసింది’’.
శారదకు కొంచెం తెరిపనిపించింది.
‘‘ఆరెస్సెస్‌ వాళ్ళ క్రూరత్వానికి అంతే లేదా? హత్యా రాజకీయాలా? ఎవరిని వాళ్ళు చంపింది… ఇడియట్స్‌. జాతి ద్రోహులు. మారణకాండకు నాయకులై ఏం సాధిస్తారు’’.
శారద కోపంతో ఊగిపోయింది. విజయం తెలిసి జనం గుంపులుగా కూడుతున్నారు.
రామకృష్ణయ్య వచ్చాడు.
‘‘మనం ఈ రాత్రికే గాంధీజీ హత్యను ఖండిస్తూ సభ జరపాలి’’
‘‘ఈ రాత్రికా?’’
‘‘ఔను. కార్యకర్తలు చాలామంది ఊళ్ళోనే ఉన్నారు. ఆరెస్సెస్‌ రాజకీయాలను ఎండగట్టాలి. కాస్త పొద్దుపోయిన తర్వాతే పెడదాం. ఇవాళ ఎవరికీ తిండి సహించదు. నిద్ర రాదు.’’
శారద దుఃఖం పట్టలేకపోతోంది.
‘‘సూర్యం గుర్తుందా నీకు ఉప్పు సత్యాగ్రహానికి ముందు గాంధీ మద్రాసు వచ్చారు. ఎట్లా పని చేశాం ఆ సభల కోసం. గాంధీ మనల్ని చూడాలని, నవ్వాలని, ఒక మాట మాట్లాడాలని తపించాను నేను. ఉప్పు సత్యాగ్రహం గుర్తుందా… అదంతా కాదు. గాంధీ 1920లో కోర్టులో చెప్పిన మాటలు గుర్తున్నాయా నీకు. నువ్వింకా చిన్నవాడివి అప్పుడు. నాకు పదిహేనేళ్ళు. చదువు మానేసి సహాయనిరాకరణలోకి వెళ్ళిపోదామని అంతా సిద్ధమయ్యా. గాంధీ మాటలు నిరంతరం నా దేహంలో ప్రతిధ్వనిస్తుండేవి. గొప్ప ఆవేశంతో ఊగిపోయేదాన్ని. చదువు, ఇల్లు, తల్లిదండ్రులు అన్నీ వదిలి గాంధీ దగ్గరకు వెళ్ళిపోదామనుకున్నా. కానీ వెళ్ళలేకపొయ్యా, వెళ్ళలేకపొయ్యా’’.
శారద దుఃఖాన్ని తగ్గించటం రామకృష్ణయ్య, సూర్యం, ఎవరి వల్లా కాలేదు.
‘‘శారదా… ఆనాడు వెళ్ళలేదు గనుకనే నువ్విప్పుడు కమ్యూనిస్టువైనావు. కమ్యూనిస్టు కావటం కంటే గొప్ప సంగతేమీ లేదు’’ రామకృష్ణయ్య మందలించాడు కాస్త తీవ్రంగానే.
‘‘నువ్వు మహిళా సంఘ సభ్యులకు కబురు పంపు. రాత్రి తొమ్మిది గంటలకు మీటింగు. ఆరెస్సెస్‌ హత్యా రాజకీయాన్ని ఉతికి ఆరెయ్యాలి’’ శారద శక్తిని కూడగట్టుకొని లేచింది.
సుబ్బమ్మ శోకాన్ని ఎవరూ ఆపలేకపోయారు. ఒక్క ఇల్లేమిటి, ఊరేమిటి, దేశం దేశమంతా ఏడుస్తోంది.
తొమ్మిదిన్నరకంతా మీటింగు మొదలైంది. నాయకులంతా మాట్లాడారు. ఆరెస్సెస్‌ వాళ్ళను కడిగి వదిలారు. మీటింగు పూర్తవుతుందనగా వార్త వచ్చింది. ఆరెస్సెస్‌ వాళ్ళు గాంధీ మరణాన్ని ఒక విజయంగా భావించి ప్రదర్శన చేస్తున్నారని. ప్రజలకు, గాంధీని జాతిపితగా భావించే ప్రజలకు, దేశ స్వాతంత్ర ప్రదాత అని నమ్మిన ప్రజలకు, ఆయన చెప్పిన మాట కోసం, ఆయన చూపిన బాటలో నడవటం కోసం ఆస్తులను, ఆప్తులను, ప్రాణాలను లెక్కచెయ్యక స్వాతంత్రాగ్నిలో దూకిన ప్రజలకు ఈ ఆరెస్సెస్‌ ప్రదర్శన సహించరానిదయింది. గాంధీ మరణంతో శోక సంద్రాలైన వారి మనసులలో కోప కెరటాలు లేచాయి. ప్రదర్శన మీద రాళ్ళు రువ్వారు. పోలీసులు వచ్చి కొందరిని అరెస్టు చేశారు. ఆరెస్సెస్‌ చేస్తున్న ఈ హీనమైన పనికి సహజంగానే కమ్యూనిస్టు యువకులకు కోపం వచ్చింది. తమ మీటింగుకి వచ్చిన వారిని కొట్టబోయారు. నాయకులు వచ్చి ఆపారు. అంతా కాస్త గందరగోళమైంది. ప్రతివాళ్ళూ ఉద్రిక్తంగానే ఉన్నారు. ఆ గలభాలోకి పోలీసులు ఎప్పుడొచ్చారో గమనించేలోగా పోలీసులు లాఠీలతో కమ్యూనిస్టులపై పడ్డారు. ఆరెస్సెస్‌ కార్యకర్తలు పదిమంది ఎటు పోయారో తెలియదు. పోలీసులు మాత్రం కమ్యూనిస్టులను కొట్టటం, అరెస్టు చేయటం మొదలెట్టారు. గాంధీ హత్యను ఖండిచేవారిని అరెస్టు చేసి, గాంధీని చంపిన వారిని సమర్థించి వారిని రక్షించే పనికి వచ్చారా అన్నట్లుంది పరిస్థితి. అప్పటికే ప్రకాశం ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ ఒకటుంది కమ్యూనిస్టుల అరెస్టుకి. ముఖ్యమైన నాయకులు అక్కడినుంచి పరిగెట్టారు. మొగల్రాజపురం గుండా పారిపోయి రహస్య స్థావరాలకు చేరుకున్నారు. మర్నాడు ‘ప్రజాశక్తి’లో ఆరెస్సెస్‌ వారి పట్ల చూసీచూడనట్లు మెతకగా ప్రవర్తిస్తున్న పోలీసులను విమర్శిస్తూ వార్తలూ, వ్యాసాలూ వచ్చాయి. అవి చదివి కూడా చేయవలసిన పని చేయకుండా పోలీసులు పత్రిక మీద దాడి చేశారు. పత్రికలో పనిచేస్తున్న కొందరిని అరెస్టు చేశారు.
ఫిబ్రవరిలో కలకత్తా కమ్యూనిస్టు మహాసభలు జరగబోతున్నాయి. ఫిబ్రవరిలోనే ఆంధ్రలో ఈ నిర్బంధం. శారదాంబ, మూర్తి కలకత్తా మహాసభలకు వెళ్ళటానికి సన్నద్ధమవుతున్నారు. అనేకమంది నాయకులు రహస్య జీవితంలోకి వెళ్ళటంతో బహిరంగంగా పనిచేసే ముఖ్యమైన వాళ్ళు మహాసభలలో పాల్గొని తమ అభిప్రాయాలు చెప్పవలసిన అవసరం ఉంది. తెలంగాణా పోరాటం ముమ్మరంగా జరుగుతోంది. ఆ పోరాటం గురించి మాట్లాడి ఆ పోరాట దిశా నిర్దేశం చెయ్యాలి.
మహాసభలలో జరిగిన చర్చలతో పార్టీలో ఉన్న రెండు భిన్న ధోరణులను ముఖ్య నాయకులందరూ చర్చించక తప్పని పరిస్థితి.
శారదాంబ తను పాల్గొన్న సమావేశంలో ఆంధ్ర ప్రాంత పరిస్థితిని స్పష్టంగా వివరించింది. ‘‘1939 నుండి గడిచిన పదేళ్ళలో ఆంధ్ర ప్రాంతంలో కమ్యూనిస్టులు గ్రామీణ ప్రాంత ప్రజలలోకి చొచ్చుకుపోయారు. యుద్ధంలో బ్రిటన్‌కి మద్దతిచ్చినా ప్రజలు అర్థం చేసుకున్నారు. సోవియట్‌ సాహిత్యాన్ని, సోవియట్‌ విప్లవ క్రమాన్నీ కమ్యూనిస్టు పార్టీ ప్రజలకు సన్నిహితంగా తీసుకెళ్ళింది. రైతు యువకులు పెద్ద సంఖ్యలో కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలై అంకితభావంతో పనిచేస్తున్నారు. మహిళా సంఘం, యువజన సంఘం, విద్యార్థి సంఘం, ట్రేడ్‌ యూనియన్లు అన్నీ చాపకింద నీరులా కమ్యూనిస్టు పార్టీని ప్రజలకు దగ్గరగా తీసుకెళ్తున్నాయి. దీన్ని స్థిరపరచుకొని దీర్ఘకాలం ప్రజల పక్షాన, ప్రజలకు మేలు చేసే చట్టాల కోసం, పరిపాలనా పద్ధతుల కోసం పార్టీ ప్రయత్నించాలి. కాంగ్రెస్‌ పార్టీ కమ్యూనిస్టులకు ప్రజలలో లభ్యమవుతున్న ఆదరణను చూసి భరించలేకపోతోంది. బ్రిటిష్‌ వారి నిర్బంధాన్ని మించిన హింసాకాండ జరపటానికి దారులు వెతుకుతోంది. జమీందార్ల పక్షాన నిలబడుతోంది. ఈ పరిస్థితులలో మన వ్యూహాలలో కొత్తదనం ఉండాలి. ప్రజలు మరింతగా మనతో రావాలి. నిర్బంధాన్ని ఎదిరించటానికి మొరటు పద్ధతులు కాకుండా సృజనాత్మక పద్ధతులేమిటని ఆలోచించాలి. లేకపోతే కార్యకర్తలను కోల్పోతాం. కార్యకర్తలు అలాంటి, ఇలాంటి వారు కాదు, సాహసం, త్యాగం, అంకితభావం ఉన్నవాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్ళను నిలబెట్టుకోగలిగితే రెండు మూడేళ్ళలో కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రలో అతి బలమైన శక్తిగా మారుతుంది. ఆ వైపుగా పార్టీ తీర్మానాలు, కార్యక్రమాలు ఉండాలి’’ అని వాదించింది. కానీ ఈ వాదనను వ్యతిరేకించే రణదివే వర్గం సభలో అధిక సంఖ్యలో ఉన్నారు. ఆయననే ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకొన్నారు. పొలిట్‌ బ్యూరోలో ఈసారి కూడా స్త్రీలను తీసుకోలేదు. ఈసారి ఆ విషయాన్ని చర్చకు చేపట్టాలనుకున్న శారదాంబ అది ముఖ్య విషయమని మర్చిపోయేలా చేశాయి పరిస్థితులు. మహాసభ తీర్మానాల్లో ఒక తీర్మానంగా ‘‘నెహ్రు ప్రభుత్వాన్ని సాయుధ పోరాటం ద్వారా కూలదోయాలి’’ అనేది ప్రవేశపెట్టారు. నెగ్గించుకున్నారు. శారదాంబకది మింగుడు పడలేదు. అది అసాధ్యం, ఆచరణీయం కాదు అని ఆమె మనసు ఘోషిస్తున్నా పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి తీర్మానాన్ని ఆమోదించి వచ్చారు శారద, మూర్తి.
శారద, మూర్తి, రామస్వామి వంటి కొందరికి ఈ మొత్తం పరిణామాల మీద ఆందోళనగా ఉంది. ఎక్కడో ఏదో లోపం జరుగుతోంది. కాంగ్రెస్‌ ఆంధ్ర ప్రాంతంలో కమ్యూనిస్టుల ప్రాబల్యాన్ని తగ్గించాలని విచక్షణా రహితంగా ప్రవర్తిస్తోంది. ఆ విచక్షణ లేనితనంతో అంతే మూర్ఖంగా తలపడుతున్నామా? వేరే దారిలో మరింతగా ప్రజల్లోకి చొచ్చుకుపోవాల్సిన సమయంలో కార్యకర్తల ప్రాణాలను ఫణంగా పెడితే భయభ్రాంతులైన ప్రజలను సమీకరించేవారెవరు?
శారద మనసు వ్యాకులపడుతోంది. రామకృష్ణయ్య దొరకటం అసంభవంగా ఉంది. శారద ఇల్లు, ఆస్పత్రి పోలీసు పహరాలో ఉన్నట్లున్నాయి. ఎవరో తెలియని వ్యక్తులు అప్పుడప్పుడూ తెచ్చే ఉత్తరాలు తప్ప తన ఆలోచనలు పంచుకునే దారి లేదు.
ఒకరోజు ప్రసవానికని వచ్చిన స్త్రీని పరీక్ష చేస్తుంటే ఆమె పొట్ట దగ్గర కట్టుకు వచ్చిన డాక్యుమెంట్లు కనిపించాయి. నర్సుని కూడా రానివ్వకుండా గబగబా ఆ డాక్యుమెంట్లను దాచేసి ఇంత దూది, గాజు గుడ్డలతో మళ్ళీ పెద్ద పొట్ట తయారుచేసి పంపింది.
ప్రాణాలకు తెగించి చేస్తున్నారు స్త్రీ పురుషులు ఈ పనిని. వారి ప్రాణాలను రక్షించాల్సిన పని ముఖ్యమైనది కాదా?
ఆ డాక్యుమెంట్లన్నీ మూర్తి, శారద కలిసి రెండు రోజులు చదివారు. డాంగే మితవాది… అంటే తెలంగాణా పోరాట విరమణ చేయమంటున్నాడు. రణదివే తెలంగాణా పోరాటం కొనసాగించాల్సిందేనంటున్నాడు.
నిజాం పాలన అంతమయ్యాక సాయుధ పోరాటం అవసరం లేదని తెలంగాణా నాయకుడైన రావి నారాయణ రెడ్డి అంటున్నారు. అనటమే కాదు, తెలంగాణా వదిలి ఆయన బొంబాయి వెళ్ళిపోయాడు.
పోరాటం విరమించాలా వద్దా అనే విషయమై పై స్థాయి నాయకులందరిలో విబేధాలున్నాయని ఆ డాక్యుమెంట్లు స్పష్టం చేశాయి. శారదకు ఆ విషయాలు తెలియనివి కావు గానీ ఇప్పుడు డాక్యుమెంట్ల వల్ల స్పష్టంగా ఎవరి వైఖరి ఏమిటనేది సాక్ష్యాధారాలతో తెలిసినట్లయింది.
గ్రామాల పరిస్థితి దారుణంగా ఉంది. మలబారు పోలీసులు భయంకరంగా హింసాకాండను కొనసాగిస్తున్నారు. ఎలమర్రు, కాటూరులలో ప్రజలను దిగంబరంగా చేసి గాంధీ విగ్రహం చుట్టూ నిలబెట్టటం గురించిన వార్తలతో ప్రజలందరిలో కాంగ్రెస్‌ అంటే కోపం, అసహ్యం కలిగాయి. ఇళ్ళు తగలబెట్టటం, అనుమానించిన వారిని కాల్చి చంపటం, మలబారు పోలీసు అధికారి పళనియప్పన్‌ పేరంటేనే కొందరిలో భయం, మరి కొందరిలో అసహ్యం. ఒక్క మహిళా సంఘాన్ని తప్ప కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన ప్రజా సంఘాలను, ట్రేడ్‌ యూనియన్లను నిషేధించారు.
శారద మనసు ఆగ్రహంతో రగులుతోంది. ఈ హింసాకాండను ఎదుర్కోవటానికి కొత్త పోరాట వ్యూహాలు రచించాలని, ప్రజలలో ఉన్న సానుభూతికి ఒక రూపం ఇచ్చి వారి ఆగ్రహంతోనే ఈ బీభత్సానికి తెరదించాలనీ ఆమె అనుకుంది. మూర్తి కూడా శారద ఆలోచనను బలపరిచాడు. రామస్వామి మరికొందరు శారద ఆలోచనలు సరైనవన్నారు.
ఇంతలో పార్టీ నుంచి ఆదేశం వచ్చింది ‘‘కంటికి కన్ను ` పంటికి పన్ను’’ అనేదే మన మార్గమని. ఇది శారదకస్సలు మింగుడు పడలేదు. ఈ సమయంలో ఆవేశంతో కార్యకర్తలు ప్రాణాలు పోగొట్టుకుంటారనే ఆందోళనతో కుంగిపోయింది. దీనిని ఆపేదెలా? తానేమన్నా చేయగలదా అనే ఆలోచనతో రగిలిపోయింది.
చివరకు మద్రాసు వెళ్ళాలని నిర్ణయించుకుంది. దుర్గాబాయితో మాట్లాడి నెహ్రుతో ఇంటర్వ్యూ అడిగి చూడాలనుకుంది. ప్రకాశం గారితో మాట్లాడి ప్రయోజనం లేదు. ఆయన తను చెప్పినదానికి అంగీకరించి, మర్నాడు ఇంకెవరో తనకు వ్యతిరేకంగా చెబితే మనసు మార్చుకుంటాడు. ఎంత స్థిరమో, అంత అస్థిరం, ఎంత బలమో, అంత బలహీనత… ఆయన మనసులో గట్టిగా ఏదైనా అనుకుంటే మార్చటం ఎవరితరం కాదు. వీరేశలింగం తాతయ్యకు వ్యతిరేకంగా వాదించి ఆయనను ఓడిరచటం సరికాదని ఆయన అంతరాత్మకు తెలియదూ? తెలిసినా వట్టి తర్కానికి, తన సామర్ధ్యాన్ని నిరూపించుకోటానికే ఆ పని చేశాడు. నాన్నకు, హరి బాబాయికి ఎంతో కోపం వచ్చింది. ప్రకాశం గారు నవ్వేసి మరి నేను ప్లీడర్ని, నా వాదనా పటిమ నిరూపించుకోవద్దా అన్నారు. హరి బాబాయి చెప్పేవాడు… కాంగ్రెస్‌ సభలలో ఒకసారి బ్రాహ్మణులకు వేరుగా భోజనాలు ఏర్పాటు చేయించాడనీ, హరి బాబాయి మరికొందరూ వెళ్ళి అడిగితే ‘‘అది తప్పంటారా? సరే తీసేద్దాం’’ అని అదో ప్రిన్సిపల్‌కి సంబంధించిన విషయం కాకుండా ఏర్పాట్లకు సంబంధించిన విషయమన్నట్లు మాట్లాడారట. అందువల్ల ప్రకాశం గారితో మాట్లాడటం వృధా. దుర్గ అర్థం చేసుకోగలదు. అర్థం చేసుకోకపోయినా ఒక్కసారి నెహ్రు గారితో ఇంటర్వ్యూ ఇప్పించగలిగితే చాలు. సరోజినీదేవి ఆరోగ్యం బాగోలేదు, లేకుంటే హరీన్‌తో వెళ్ళి ఆమె ద్వారా నెహ్రుని కలిసినా బాగుంటుంది. ఇంత ఆలోచించి మద్రాసు ప్రయాణం పెట్టుకుంది.
దుర్గ ఆప్యాయంగా శారదను దగ్గరకు తీసుకుంది.
ఆమె ఒకవైపు లాయర్‌గా పనిచేస్తోంది. మరోవైపు రాజ్యాంగ సభ సభ్యురాలిగా నెలకు ఒకటి, రెండు సార్లు ఢల్లీి ప్రయాణాలు తప్పటం లేదు. ఆంధ్రమహిళా సభ నిర్మాణం జరిగింది. దాన్ని విస్తరించే ప్రణాళికలు, దానికి కావలసిన విరాళాల సేకరణ వల్ల దుర్గాబాయికి ఒక్క నిమిషం తీరిక దొరకదు. ఆమెకు ఆ తీరిక అవసరం లేదు కూడా. పని, పని, పని. ‘‘వందమంది మనుషుల పని చేస్తున్నావోయ్‌’’ అంది శారద.
‘‘నువ్వు? వెయ్యి చేతులతో పని చేస్తున్నావు. అసలు సంగతి చెప్పనా? మనం ఇలా పని చెయ్యకుండా బతకలేం’’.
‘‘సరిగ్గా చెప్పావు’’ శారద గలగలా నవ్వింది.
‘‘కాకినాడ కాంగ్రెస్‌ సభలకొచ్చావు గుర్తుందా? ఇంటర్‌ చదువుతున్నావు. డాక్టర్‌నవుతానన్నావు. అప్పటికి నేనింకా చదువులో ప్రవేశించలేదు. ప్రవేశిస్తానో లేదో తెలియదు. నిన్ను చూసి ఆనందించాను. నువ్వు మెడిసిన్‌ చదివి డాక్టరవటం ఊహించుకుని నేను గాంధీ గారిలా, నెహ్రు గారిలా, ప్రకాశం గారిలా లాయర్‌ నవ్వాలనుకున్నాను. ప్రాక్టీస్‌ చేయాలనుకున్నా.’’
‘‘సాధించావుగా. మనిద్దరి ప్రాక్టీసులూ జనానికి మేలు చేస్తున్నాయి’’.
‘‘నేను ప్రాక్టీసు వదిలెయ్యాల్సి వచ్చేలా ఉంది’’ అంది దుర్గ నిరుత్సాహంగా.
‘‘ఎందుకు?’’
‘‘రాజ్యాంగ సభ చాలా సమయాన్ని తీసుకుంటోంది. ఢల్లీికి వెళ్ళిపోవాలి. అక్కడ ఫెడరల్‌ కోర్టులో చెయ్యొచ్చనుకో. వచ్చే ఏడాది ఎన్నికలొస్తున్నాయిగా. నేను పార్లమెంటుకు రావాలని నెహ్రు గారు పట్టుదలగా ఉన్నారు. వీటన్నిటితో ఇంకొ ప్రాక్టీసెక్కడ కుదురుతుంది?’’
‘‘పార్లమెంటులో నీలాంటి వాళ్ళుండాలోయ్‌. ముఖ్యంగా హిందూ కోడ్‌ బిల్లు వంటివి చట్టాలై రావాలంటే నీలాంటి వాళ్ళుండాలి. ప్రాక్టీసుతో కొందరికే మేలు చెయ్యగలం. పాలసీలు దేశాన్నంతా ప్రభావితం చేస్తాయి గదా. నువ్వు పార్లమెంటుకి వెళ్ళి తీరాలి. రాజ్యాంగ సభ ఎలా జరుగుతోందోయ్‌’’.
‘‘అబ్బా… చాలా తీవ్రమైన చర్చలు. ఒక్క పదం గురించి గంటలు గంటలు వాదనలు. అంబేద్కర్‌ ఎంత గొప్పవాడనుకున్నావు? ఆయనకున్న చట్ట పరిజ్ఞానం ప్రపంచంలోనే ఎవరికైనా ఉందా అనిపిస్తోంది. ఆయన ఆధ్వర్యంలో ఆడవాళ్ళకి, హరిజనులకు మేలు చేసే అంశాలతోనే తయారవుతోంది.’’
‘‘అది జరిగితే చాలు. హరిజనుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అంటరాని తనాన్ని నిషేధించాలి’’.
‘‘నిషేధిస్తాం చూడు. అన్నట్టు మా రాజ్యాంగ సభలో దాక్షాయణీ వేలాయుధన్‌ అని ఒక హరిజన స్త్రీ కేరళ నుంచి వచ్చింది. భలే గట్టి మనిషిలే. నువ్వూ నేనూ ఎందుకూ పనికిరాం ఆమె ముందు.’’
‘‘మనం భద్ర జీవితాల నుంచి వచ్చాం. ఆమె ముళ్ళూ రాళ్ళూ గుచ్చుకున్నా లెక్కచెయ్యకుండా ఎదిగి ఉంటుంది. రాటుదేలి ఉంటుంది.’’
వాళ్ళ కబుర్లకు అంతులేదు. ఆంధ్రమహిళా సభ చూసి శారద చాలా సంతోషించింది. ‘‘ఇలాంటివి చాలా కావాలోయ్‌’’ అంది ఆలోచనగా. ‘‘ఇంతకూ వచ్చిన పని చెప్పలేదు’’ ఆ రాత్రి శారద కోసం దుర్గాబాయి తల్లి వండినవన్నీ తిని భుక్తాయాసంలో కూర్చున్నప్పుడు అడిగింది దుర్గ.
‘‘దుర్గా, ఒక్కసారి నెహ్రుగారిని కలవాలోయ్‌. నువ్వెలాగైనా నాకు ఆయనతో ఇంటర్వ్యూ ఇప్పించాలి. నిజాం నుంచి తెలంగాణాన్ని విముక్తం చేశామని ఆయన సంతోషిస్తుండవచ్చు. కానీ తెలంగాణాలో, ఆంధ్రాలోని కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో జరుగుతున్న మారణకాండ ఆయనకు తెలుసా? తెలిసినా సరే నేను ఆయనకు చెప్పాలి. ఒక్కసారి ఇంటర్వ్యూ ఇప్పించాలోయ్‌’’.
దుర్గ నవ్వింది.
‘‘నెహ్రు ఇప్పుడు హిందూ ముస్లిం కలహాలు, శరణార్ధుల సమస్యలతో సతమతమవుతున్నారు. ఒకవైపు రాజ్యాంగ సభ. అందులో అంబేద్కర్‌ని వ్యతిరేకించే కాంగ్రెస్‌ వాదులను సముదాయించలేక తలపట్టుకుంటున్నారు. ఒక్క సమస్య కాదు. అందుకే ఇలాంటి విషయాలన్నీ పటేల్‌కి అప్పగించారు’’.
‘‘నెహ్రు చెబితే పటేల్‌ పంతాలు కొంత తగ్గుతాయేమోనోయ్‌’’.
‘‘సరే ప్రయత్నిస్తా’’ అంది దుర్గాబాయి.
ఇద్దరూ కలిసి ఢల్లీి ప్రయాణం ఖరారు చేసుకున్నారు.
‘‘అమ్మాయ్‌, శారదా చాలా కాలానికి వచ్చావు. కాకినాడలో పాడినట్లు ఒక పాట పాడమ్మా. దుర్గ వీణ వాయిస్తుంది.’’
‘‘త్యాగరాజ కృతులు పాడి చాలా రోజులయిందమ్మా. గొంతూ పాడయింది ఉపన్యాసాలిచ్చీ, ఇచ్చీ’’.
‘‘ఫరవాలేదులే… ఏదో ఒకటి పాడు’’.
దుర్గ లోపలికి వెళ్ళి వీణ తెచ్చింది. తీగలు సరిచేస్తూ ‘‘ఈ మధ్య బెంగుళూరు నాగరత్నమ్మ కచేరీ చేసింది. ఏమీ తగ్గలేదు ఆమె గొంతులో మాధుర్యం ఏమీ తగ్గలేదు. తిరువాన్మయూర్‌లోనే
ఉంటోంది. త్యాగరాజ స్వామికి ఆలయం కట్టిస్తోంది. సమాధి కూడా. తన మొత్తం ఆస్తి ఇచ్చేస్తోంది. కచేరీలు చేసి సంపాదిస్తున్నది ఆ పని కోసం.’’
‘‘ఔను విన్నాను. ఎంత అందమైన పని, ఒక జీవితకాలంలో చేయగల పని, తన హృదయాన్నంతా అర్పించి చేయగల పని లక్ష్యంగా పె ట్టుకుంటే ఎంత ఆనందం దొరుకుతుందో కదా. మన జీవితాలు చూడు ఎక్కడ బయల్దేరాం? ఎక్కడికి వెళ్తున్నాం?ఎక్కడికి వెళ్ళాలి? ప్రశ్నలే… అంతంత పనులు. దుర్గా నేనీ మధ్య ఒక చిన్నపని పెట్టుకున్నానోయ్‌. అదైతే ఫలితం నా జీవితకాలంలో చూడగలను, అనుభవించగలను.’’
‘‘ఏంటది?’’ ఆశ్చర్యంగా అడిగింది దుర్గ.
‘‘ఒక మంచి బత్తాయి అంటు తెప్పించి ప్రేమగా పెంచుతున్నా. అది నవనవలాడుతూ పెరుగుతోంది. రోజూ ఉదయాన్నే దానికి నీళ్ళు పోసి ఆ ఆకుల నిగనిగలు, కొమ్మల నేవళం చూస్తుంటే కడుపు, మనసు నిండిపోతుంది. ఈ చెట్టు పెద్దదవుతుంది, తియ్యని పళ్ళు కాస్తుంది. అవి నేనూ తింటాను. అందరికీ పంచుతాను. ఆ రసం ఎంత మధురంగానో ఉండాలి అనుకుంటూ నీళ్ళు పోస్తాను. ఆ క్షణాన కలిగే ఆనందానికి సాటివచ్చేది లేదనుకో’’ దుర్గ నవ్వింది చిన్నగా.
‘‘సరే కబుర్లతోనే సరిపెడతారా? పాట ఎత్తుకుంటారా?’’
శారద ‘‘ఎందరో మహానుభావులు అందరికీ వందనములు’’ అని మధురంగా పాడుతుంటే, దుర్గ వీణ వాయిస్తూ తనూ గొంతు కలిపితే, ఇంట్లో వారంతా వింటూంటే ఆ సంగీత సంధ్య క్రమంగా సంగీత పూర్ణ పౌర్ణమి అయింది. ‘‘ఈ పాటలు పాడి ఎన్నాళ్ళయిందో. అమ్మా, దుర్గా… మీరిద్దరూ మా పాటలు కూడా వినాలి’’. శారద మారాం చేస్తున్నట్లు అడిగింది.
‘‘వినకపోతే ఊరుకుంటావా. పాడు’’ అంది దుర్గ.
‘‘ఆకలి మంటల మలమల మాడే అనాథలందరూ లేవండోయ్‌’’ అని శారద గొంతెత్తి పాడుతుంటే దుర్గ కళ్ళు, మనసు ఆర్ద్రమయ్యాయి. శారద అంతటితో ఆగకుండా ‘‘అరుణ పతాకమా’’ అని పాడి వీరరసం ఉప్పొంగించింది. ‘‘ఇక జనగణమన’’ పాడకపోతే నువ్వు నన్ను కమ్యూనిస్టుని చేస్తావు. పదండి పడుకుందాం’’ అంటూ లేచింది దుర్గ.

‘‘దుర్గా నేను కాస్త మద్రాసు తిరిగొస్తానోయ్‌. ఏదో మమకారం మద్రాసంటే. స్నేహితుల్ని చూడాలి. మా కాలేజీకి, స్కూలుకి వెళ్ళాలి’’ అంటూనే సంచీ భుజాన తగిలించుకుని బైటికి నడిచింది శారద. ఎక్కడినుంచి మొదలుపెట్టాలి అనుకుంటూ బస్సు కోసం చూస్తుంటే ట్రిప్లికేన్‌ బస్సొచ్చింది. మరింకేం ముందు స్కూలుకు వెళ్దాం అనుకుంటూ బస్సెక్కి ఈ పదేళ్ళలో మారిపోయిన మద్రాసు మహానగరాన్ని ఆస్వాదిస్తూ కూచుంది.
స్కూలు గేటు దాటి లోపలికి వెళ్తే అంతా ఖాళీగా ఉంది. విశాలమైన అసెంబ్లీ స్థలం, దూరంగా ఆట స్థలాలు. అంతా ఖాళీ. పిల్లలందరూ క్లాసుల్లో ఉన్నారు. ఒక్కతే కాసేపు ఆ నిశ్శబ్దాన్ని ఆలకించి స్టాఫ్‌ రూంలోకి వెళ్ళింది శారద.
ఇద్దరు టీచర్లు మాత్రమే చదువుకుంటూ ఉన్నారు. శారదను ఎవరన్నట్టు చూశారు.
‘‘నా పేరు శారదాంబ. ఇక్కడి పూర్వ విద్యార్థిని. చూసి వెళ్దామని వచ్చాను’’ అంది. వాళ్ళిద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకుని ‘‘హెడ్‌ మిస్ట్రెస్‌ను కలుస్తారా’’ అని అడిగారు కూడబలుక్కున్నట్టు.
‘‘అలాగే… మేడం రూము’’
ఒక టీచర్‌ లేచి శారదకు ప్రిన్సిపల్‌ గదికి దారి చూపుతూ నడిచింది. ఆ కారిడార్లు, ఆ గదులూ, ఆ ప్రదేశం ఏమీ మారలేదు.
మధ్యలో రెండు వైపులా ఆటస్థలాల్లోకి తెరుచుకుని మంచి వెలుతురులో ఉన్న పెద్ద హాలు. ఆ హాలు క్లాసుగా
ఉపయోగపడేది. రెండు సెక్షన్లను కలిపి కూర్చోబెట్టి ఒకే టీచర్‌ పాఠం చెప్పాలంటే ఇదే అనువైన చోటు. కానీ రోజూ మధ్యాహ్నం పిల్లలందరూ కూర్చుని భోజనం చేసే చోటు కూడా ఇదే.
అందరూ డబ్బాలలో తెచ్చుకునేవారు. ఒకరిదొకరు తినేవారు కాదు. శారద అందరినీ కావాలా అని అడిగి మరీ తింటుంటే బడాయి అనుకునేవాళ్ళు. ఇంకో పదిహేను నిమిషాల్లో బెల్లు ముగుస్తుందనగా వెరోనికా, థెరిసా, ఇంకో నలుగురు పిల్లలూ పెద్ద పెద్ద బక్కెట్లు పట్టుకొచ్చేవారు. పిల్లలు తినగా మిగిలిన అన్నం, కూరల్ని, కిందపడ్డ ఎంగిలి మెతుకుల్ని అందులో వేసేవారు. పిల్లలు తమ డబ్బాలు కడుక్కోవడానికి బావి దగ్గరున్న నీళ్ళతొట్ల దగ్గరకు పరిగెత్తుకెళ్ళేవాళ్ళు. వచ్చేసరికి ఆ ప్రదేశమంతా పరిశుభ్రంగా మళ్ళీ తరగతి గదిలా మారిపోయేది.
అదంతా గుర్తొచ్చింది శారదకు.
ఆ అమ్మాయి పేరేమిటి? పేరిందేవా? మొదటిసారి రహస్యంగా చిన్న కోడిముక్క పెట్టింది. ఎంత రుచిగా ఉందో.
‘‘ఏంటండి అలా నిలబడిపోయారు. మళ్ళీ బెల్‌ కొడితే హెడ్‌ మిస్ట్రెస్‌ గారి క్లాసు ఇక్కడే. ఆవిడతో మాట్లాడటం కుదరదు.’’
శారద గబగబా నడిచింది.
‘‘సిస్టర్‌ థెరిస్సా. మిమ్మల్ని చూడాలని ఈ స్కూలు పూర్వ విద్యార్థిని శారదాంబ గారట వచ్చారు.’’
థెరిసాకు శారదాంబను చూస్తూనే ముఖం విప్పారింది.
‘‘శారదా… నువ్వా. నేనూ…థెరిస్సాను. గుర్తుపట్టలేదా?’’
క్రైస్తవ దుస్తుల్లో ఉన్న థెరిసాను నిజంగానే శారద గుర్తుపట్టలేదు. గుర్తుపట్టాక వెళ్ళి రెండు చేతులూ పట్టుకుని ఊపేసి కౌగిలించుకుంది.
‘‘ఏమేజింగ్‌. నువ్వు మన స్కూల్‌ హెడ్‌మిస్ట్రెస్‌… వండర్‌ఫుల్‌.’’
ఇద్దరి కళ్ళవెంటా కన్నీళ్ళు ధారకట్టాయి. అయిదు నిమిషాలు ఆనందంగా దుఃఖించి ఇద్దరూ మంచినీళ్ళు తాగి స్థిమిత పడ్డారు.
‘‘స్కూలు చదువయ్యాక మీరేమయ్యారో తెలియలేదు. నేను రెండు, మూడుసార్లు వచ్చానిక్కడికి. ఎవరూ చెప్పలేదు. మీ అడ్రస్‌కి ఉత్తరాలు రాశా. సమాధానం రాలేదు.’’
‘‘నేనూ, వెరోనికా ఈ దీక్ష తీసుకుని, దాని శిక్షణ ఒకవైపు, చదువు ఇంకోవైపు. వెల్లూరు దగ్గర్లోకి వెళ్ళి అక్కడే
ఏడేళ్ళున్నాం. తర్వాత మళ్ళీ ఇక్కడికే వచ్చాం.’’

Share
This entry was posted in ధారావాహికలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.