బాధ్యత – శాంతి ప్రబోధ

‘‘అమ్మా… అమ్మా…
నాకంత పరేషాన్‌ పరేషాన్‌ అయితాంది. ఏమ్‌ సమజ్‌గాకోచ్చింది. మొన్న వనస్థలిపురం కాడ ఆడకూతురు రేపయింది కద… అది చేసినోళ్ళది తప్పుకాదట కద. అది ఆమెకు దేవుడు రాసిన రాత అట కదమ్మా…’’ అంది యాదమ్మ వచ్చీ రావడంతోనే. ‘కర్మనా… అట్లా అని ఎవరన్నారు?’ నా ప్రశ్న.

‘మొన్న నా కొడుకు వాని దోస్త్‌ అదే ముచ్చట చేస్తుంటే వింటి. తప్పుడు ఆలోచనలు చేయొద్దని చెడామడా తిడితినా… అప్పటికెల్లి సుతరాయిస్తలే అనుకుంటి. ఇగో గిప్పుడు, రాంగ రాంగా మళ్ళ అదే ముచ్చట కాలేజీ పోరగాళ్ళు అనుకోంగ నా చెవులబడే’ గబగబా చెప్పి, నిజమేనా అన్నట్లుగా నా మొహంలోకి చూస్తూ నిలుచుంది యాదమ్మ.
‘అట్లా ఏమీ కాదు. తప్పు ఎవరు చేసినా తప్పే. వాళ్ళకి శిక్ష తప్పదు’ గట్టిగా చెప్పాను. ‘ఎవరో చెప్తే నమ్మకపోదును. నా కొడుకు చెప్తే నమ్మలే. పోరగాళ్ళను రెచ్చగొట్టే ముచ్చట అమ్మవారు అట్ల ఎట్ల చెప్తదని. కానీ అది నిజమేనట. టీవీల కల్కి శివజ్యోతి అమ్మవారు చెప్పిందట’ అంటూ లోనికి వెళ్ళింది. ‘ఏంటీ… టీవీలో చెప్పారా… ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు చెప్పేవాళ్ళని పిచ్చాసుపత్రిలో పడెయ్యాలి’ అన్నానే కానీ మనసంతా చేదుగా అయిపోయింది. ఈ మధ్య తరచుగా వాట్సాప్‌ గ్రూప్స్‌లో గిరికీలు కొట్టిన మెసేజ్‌ ఒకటి గుర్తొచ్చింది. మంచి విషయానికి లేని సర్క్యులేషన్‌ ఇలాంటి విషయాలకు మాత్రం కావలసినంత.
ఆ చెప్పినావిడ విధిరాత ప్రకారం జరుగుతుం దంటూ చాలా సులభంగా చెప్పేసింది కానీ పర్యవ సానాలు ఆలోచించినట్లు లేదు. అభం శుభం ఎరుగని యువతపై ఆ మాటల ప్రభావం పడుతు న్నదని యాదమ్మ చెప్పిన విషయాల ద్వారా స్పష్టమవుతున్నది. ‘నాకయితే, నీ రాత ఇట్లనే ఉన్నదని చీపురుతో సన్మానం… చెయ్యాలనిపిస్తున్నది’ అంటూ చేట, చీపురుతో వచ్చింది యాదమ్మ.
నిజమే ఇట్లా చీపురు తిప్పేవాళ్ళు లేకపోవడం వల్లనే, కసువు ఊడ్చినట్లు ఊడ్చి పడెయ్యక పోవడం వల్లనే గల్లీకొకళ్ళు కలుపుమొక్కల్లా పుట్టుకొస్తున్నారని ఆలోచిస్తున్నా.
‘మేమంటే సదువు లేనోళ్ళం… దిమాక్‌ లేనోల్లం… ఆ టీవీ వాళ్ళకేం రోగమొచ్చిందమ్మా. ఆమె రోగం గిన వాల్లకింత అంటిందా. ఇసొం టోళ్ళను తీస్కపొయి టీవీల కుసుండపెడ్తరు?’ అంటూ చేట, చీపురుతో వాకిట్లోకి నడిచిందల్లా వెనక్కి వచ్చి నా మొహంలోకి సూటిగా చూస్తూ ‘‘రేపటి సంది పని బంద్‌ వెట్టి అమ్మవారి నయితే మంచిగుంటదేమో. కొత్త దేవుడమ్మ వచ్చింది అని నాకు మొక్కులు మొక్కరా… నేను చెప్పింది నమ్మరా… నన్ను సుత టీవీలకు కొండబోరా…’ అని ముసిముసి నవ్వులతో వెళ్ళిపోయింది.
యాదమ్మ తానో దేవుడి అవతారం ఎత్తాలని కోరుకుంటున్నదా… లేక దేవుళ్ళ పేరుతో జరిగే దందాని విమర్శిస్తున్నదా?
కష్టాలు, కన్నీళ్ళ బతుకులో మెతుకు కోసం, బతికే చోటు కోసం వెతుకుతున్న బడుగులే కాదు అన్ని వర్గాల వారూ కొత్త అవతారాలకు దాసోహం అవుతున్నారు. తినడానికి తిండి పుట్టడం కష్టం కానీ వీథికొక దేవుడో, దేవతో పుట్టకురావడం చాలా సులభం ఈ దేశంలో. చెప్పేవాడికి వినేవాడు లోకువ అంటారు కదా. వాళ్ళేమో పనికిమాలిన చెత్త జనం మీదకు విసర్జిస్తున్నారు. అసలు అటు వంటి వాళ్ళు ఈ మీడియాకు ఎక్కడ దొరుకు తారో…? టీఆర్పీ రేట్ల కోసం ఎంతకైనా దిగజారిపో తున్నది. సమాజ చైతన్యానికి దోహదం కావలసిన మీడియా ఎటుపోతున్నది? మనిషిని ఏ వైపునకు లాక్కుపోతున్నది?
ఆఫ్ట్రాల్‌ కరోనా… ఎప్పటికప్పుడు దేశ, కాలమాన పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు మారిపోతూ వస్తున్నది. మరి మనిషి ఎందుకు మారడం లేదు. ఉహు… మారకపోవడం కాదు మనిషిని మనిషి మోసం చేస్తున్నారు. చదువు సంధ్యలతో పనిలేకుండా మనిషిని మోసం చేస్తున్నారు. యాదమ్మకి అక్షర జ్ఞానం లేదేమో కానీ ఆమె ఆలోచనలో చైతన్యం ఉన్నది. అది చదువుకున్న వాళ్ళకు కొరవడుతున్నది. కర్రనో, రాయినో చెక్కి రూపమిచ్చే మనిషే, మట్టి ముద్దకు రూపమిచ్చి దేవుడని పూజించే మనిషే అనేకానేక భ్రమలను తన చుట్టూ వలయాలు వలయాలుగా ఏర్పరచుకుని భ్రమల్లో బతుకుతున్నాడు.
కనపడని మరొకదాన్ని సృష్టించుకుని భ్రమలు కల్పించుకోవలసిన అవసరం మనిషికి ఎందుకు వచ్చినట్లు? వాస్తవంలో ఎందుకు ఉండడు? భ్రమల్లో బతకడంలో కంఫర్ట్‌ ఫీలవుతున్నాడా? రకరకాల ఆలోచనల కందిరీగ చుట్టుముడు తుండగా టీవీ పెట్టాను.
ఓ పెద్దాయన హిందూ మహిళ నుదుట కుంకుమ బొట్టు, మెడలో తాళి, చేతులకి గాజులు, కాళ్ళకు మెట్టెలు, పట్టీలు, తలలో పువ్వులు ఈ ఐదు అలంకారాలు ఉంటేనే పునిస్త్రీ అని అర్థం అంటూ ఉపదేశం చేస్తున్నాడు. అవి లేనివాళ్ళని తమ మాటలతో, చేష్టలతో చీల్చి చెండాడే విధంగా ఆడవాళ్ళ మెదళ్ళను సమాయత్తం చేస్తున్నాడు.
మనిషి చుట్టూ, ముఖ్యంగా ఆడవాళ్ళ చుట్టూ అనేక సమస్యలు ముళ్ళపొదల్లా చుట్టేసి కుదిపేస్తున్నాయి. అవేమీ కనిపించకుండా కళ్ళు, చెవులు మూసుకుని, తెలివిని, జ్ఞానాన్ని ఆలోచన వివేచన ఇచ్చే మెదడును మొద్దుబార్చేసి పునిస్త్రీగా గుర్తించబడడం కోసం పోటీలు పడుతూ చేసుకునే అలంకారాల వెంట, పూజా పునస్కారాల వెంట పరిగెత్తిస్తున్నాడు. అర్థం పర్థం లేని ఆచారాల్ని, మూఢనమ్మకాల జాఢ్యాన్ని కుమ్మరిస్తున్న ప్రచారకులు, అదే ధర్మం అంటూ ధర్మ రక్షకుల అవతారం ఎత్తిన వారి ప్రచారాలు, ఉపదేశాలు…
ఒకరి వ్యక్తిగత అభిప్రాయాల్ని మత సాంప్రదాయ, సామాజిక అభిప్రాయంగా మార్చే యత్నం అడ్డు అదుపు లేకుండా సాగిపోతున్నది.
వారి మంత్రదండాలకు అనుగుణంగా తలాడిరచే మరబొమ్మల్లా మనిషిని మార్చేస్తున్నామని విర్రవీగుతూ కర్మ ఫలం అంటూ కర్మ సిద్ధాంతాన్ని వల్లెవేస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నారు. చైతన్యం కావాల్సిన మెదళ్ళలో ఆలోచనను మొద్దు బార్చడంలో క్షణం తీరిక లేకుండా పనిచేస్తున్నారు.
మహిళల సమస్యలకు కారణమైన సామాజిక, సాంస్కృతిక, మత, రాజకీయ వ్యవస్థను ప్రశ్నించ కుండా, ఐక్యం కాకుండా జనాన్ని వెర్రివాళ్ళను చేస్తూ చేస్తున్న బోధనలు… ఎన్నాళ్ళిలా…? మరో ఛానెల్‌ మార్చాను. అక్కడా ఇదే గోల. మతం పాచికగా సాగుతున్న రాజకీయానికి గొడుగు పడుతూ, మౌఢ్యపు విషబీజాలు నాటుతూ, నాటిన విషవృక్షానికి నీరు పోసి పెంచుతూ…
చెట్టుకొకరు పుట్టకొకరుగా పుట్టుకొస్తున్న కుక్కమూతి పిందెలు… వారి వ్యాపారాన్ని పనికి మాలిన విషయాల్ని ప్రమోట్‌ చేస్తున్న టీవీ
ఛానెళ్ళు… ఒళ్ళంతా నిస్పృహ, నిస్సత్తువ ఆవరించాయి. ఏళ్ళ తరబడి పోరాడి సాధించుకున్న పరిష్కారాలను, ఆ శక్తిని కాలరాస్తూ బోధనల సారం… ఎదుర్కోవడం ఎలా?
ధర్మాన్ని, దేశాన్ని భ్రష్టు పట్టించే, దేశ ప్రతిష్టను దిగజార్చే వాళ్ళ ముసుగు తీసి ఆట కట్టించేదెలా?
సిగ్గు, లజ్జ వదిలేసి క్యాన్సర్‌ కణాల్లా విజృంభిస్తున్న శత్రువుని, మెలకువలోనే అచేతనుల్ని చేస్తూ శత్రువుని ప్రమోట్‌ చేస్తున్న వాళ్ళ పిచ్చి వదిలించేదెలా? నేటి తరంతో పాటు రాబోయే తరాల మెదళ్ళు వట్టిపోకుండా కాపాడుకోవడం ఎలా? ఆడపిల్ల జీవితంలో చీకటిని, నిరాశను పారద్రోలి, నిర్భయంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో తిరిగే ధైర్యం, భరోసా ఇచ్చే వ్యవస్థ కలగనడం నేరం కాదు కదా…
కర్మ సిద్ధాంతాన్ని అటకెక్కించేసి, వ్యవస్థని రిపేరు చేసే బాధ్యత మీడియా తీసుకుంటే పని సులభం కదా…

Share
This entry was posted in కిటికి. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.