జెండర్ ట్రైనింగ్ తీసుకున్న ఒక కళాజాత టీమ్ ఆ రోజు దగ్గర్లోని గ్రామంలో సామాజిక అంశాలపై అవగాహనా కార్యక్రమాల్లో భాగంగా కళారూపాలు ప్రదర్శిస్తున్నామని రమ్మని పిలిస్తే వెళ్ళింది శాంతి. రాత్రి సుమారు 8 గంటల సమయం. గ్రామం చేరుకునేసరికి కరెంటు పోయి కళారూపాల ప్రదర్శన ప్రారంభంలోనే ఆపాల్సి వచ్చిందట. అక్కడికొచ్చిన గ్రామస్థు లందరూ గుంపులు
గుంపులుగా నిలబడి కోలాహలంగా మాట్లాడుకుంటున్నారు. కానీ వాళ్ళందరూ మగవారే. మహిళలెవ్వరూ రాలేదా అని అడిగితే కరెంటు పోడంతో ఇళ్ళకెళ్ళారు, మళ్ళీ వస్తారని చెప్పారు కళాజాత బృందం. పిల్లలంతా మూకుమ్మడిగా ఆటలు, కేరింతలు, దెబ్బలాటలు, అరుపులు… అల్లరల్లరి చేస్తున్నారు.
శాంతి ఒక ప్రక్కగా కుర్చీలో కూర్చుని అంతా గమనిస్తోంది. అక్కడి వాతావరణం అటు పల్లె కాదు, ఇటు పట్నం కానట్లుంది. ఆటోలు, బైకులు విరామం లేకుండా ఆ రోడ్డెమ్మట వస్తూ పోతూనే ఉన్నాయి. తను కూర్చున్న పక్కగా చిన్న దర్గా ఉంది. ఎదురుగా అల్లంత దూరంలో వేపచెట్టు క్రింద పోచమ్మ గుడి ఉంది. రోడ్డుకి ఆ పక్క ఒక వంద గజాల దూరంలో చర్చి కూడా ఉంది. మతసామరస్యంతో అలరారు తోంది గ్రామం అనుకుంటున్నంతలో ముగ్గురు అబ్బాయిలొచ్చి ఒకర్నొకరు తోసుకుంటూ నువ్వంటే నువ్వనుకుంటూ ఉన్నారు. నవ్వుతూ వాళ్ళని చూసి ‘హాయ్’ అంది శాంతి. వెంటనే ఒక పిల్లాడు ‘టీచర్ మీరెక్కడ్నుంచి వచ్చారు’ అని అడిగాడు. ‘నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మీరేం చదువుతున్నారు’ అంటూ మాటలు కలిపేసరికి ఇంకో ఐదారుగురు అబ్బాయిలొచ్చి చేరారు. అందరూ దాదాపు 5, 6, 7 తరగతులు చదువుతున్నారు. ‘హైదరాబా ద్‌లో చార్మినార్ ఉంది కదా ఇంకేమున్నాయి’ అని మొదలుపెట్టి ఒకరితో ఒకరు పోటీ పడుతూ అంతరిక్షం, గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశక లాలు భూమిని ఢీకొనే ప్రమాదందాకా అన్నీ మాట్లాడేశారు. ఎన్నెన్ని ప్రశ్నలో, ఎంతెంత
ఉత్సుకతో ఇదంతా అరగంటలోపే. ఆ పిల్లల్ని చూస్తే ముచ్చటేసింది శాంతికి.
ఆ కబుర్ల ప్రవాహాన్ని సడెన్‌గా ఆపి ‘అవునూ, మీ ఊర్లో అమ్మాయిలు బైటికి రారా…’ అని అడిగింది శాంతి. అంతే ఒక చిచ్చరపిడుగు ఇంత గొంతేసుకుని ‘అయ్యో టీచర్, ఆళ్ళు కనపడ్లేదని మీరు మోసపోకండి. ఆ వ్యాన్ వెనక చూడండి’ అంటూ శాంతి భుజాలు పట్టుకుని పక్కకి బాగా ఒంచి మరీ చూపించాడు. సుమారు పదిహేను మంది ఇదే వయసు అమ్మాయిలు దగ్గర దగ్గరగా కుర్చీ లేసుకుని మాట్లాడేసుకుంటున్నారు. ఎవ్వర్నీ పట్టించుకోవట్లేదు. ‘వాళ్ళేం మాట్లాడుకుంటు న్నారు? మీతో కలవరా? లేక మీరు వాళ్ళని రానివ్వరా?’ కుతూహలంగా, ఒకింత ప్రోబింగ్ గా అడిగింది శాంతి. ‘టీచర్ వాళ్ళతో గెలవలేం’ అని ఒకరు, ‘వాళ్ళు అమ్మాయిలా, రౌడీ మూక’ అని ఒకరు, ‘ఆళ్ళు మమ్మల్నే కొడతారు తెల్సా’ అని ఒకరు… ఎవరికి తోచింది వాళ్ళు గొడవగొడవగా చెప్పారు. ‘ఔనా! ఏమయ్యింది? మీరు వాళ్ళనేమన్నా అన్నారా? అల్లరి పెట్టుంటారు, అందుకే కొట్టారేమో’ అంది శాంతి. ఒక పిల్లోడు అందుకుని ‘ఆళ్ళు మాట్లాడే అన్ని బూతు మాటలు మగాళ్ళు కూడా మాట్లాడరు. నోటినిండా తిట్లే. కంపు’ అంటూ ముక్కుమూసుకుంటూ తమాషాగా అన్నాడు.
ఇలా చర్చలు జరుగుతుండగానే కరెంట్ వచ్చి వెంటనే పోయింది. అది పోయేలోపే ఆ అమ్మాయిలంతా వాళ్ళు కూర్చున్న కుర్చీలు పట్టుకుని స్టేజి ముందుకి పరుగున వచ్చేసి గుంపుగా వేసుకుని కూర్చున్నారు. అంతలోనే కరెంటు పోడంతో ఒకమ్మాయి గట్టిగా ‘దీనెమ్మ, బుగ్గిలో కరెంటు…’ అంటూ వెనక్కి తిరిగి గుంపుగా ఉన్న అబ్బాయిల మధ్యలో శాంతిని చూసి మాటలు మింగేసి మిగతా అమ్మాయిల్ని అడ్డం చేసుకుంటూ కిందికి ఒంగిపోయి దాక్కుంది. అప్పుడే అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చిన ఇంకో అమ్మాయి ‘చూడండే, ఆ మాద చ్చేద్ నన్ను చూసి ఈలేస్తున్నాడే…’ అంటూ మగపిల్లల గుంపు వైపు చూసి ఆగిపోయింది. ఈ మగపిల్లల్లోంచి ఒక పోకిరీ లేచి గట్టిగా ‘ఆఁ నువ్వు ఆడ్ని చూసి కన్నుగొడ్తే లేదు గాని, ఆడు ఈలేస్తే నీకు కోపమొచ్చిందా పాపా’ అంటూ సాగదీశాడు.
వాడి నెత్తిమీద మెల్లగా ఒక్కటిచ్చి ‘ఏంట్రా ఆ ఎకసెక్కాలు’ అని కోప్పడిరది శాంతి. ‘మీకు తెలీదు టీచర్, అది ఈడ్ని ఎన్ని బూతులు తిట్టిందో! మా బాయ్స్ అందరం ఉండగా పచ్చిపచ్చి బూతులు తిట్టింది. ఆడికి ఏడుపొక్కటే తక్కువ. అది ఆడదేనా! అసలు ఆ మూకంతా రౌడీ మూక, ఆడపిల్లలు కానేకాదు’ అక్కసుగా అన్నాడు. ‘అవేం మాటల్రా. అసలేమైంది?
ఉండండి వాళ్ళని కూడా పిలుద్దాం…’ శాంతి మాట ఇంకా పూర్తవ్వలేదు భుజాలు పట్టుకుని, చేతులు పట్టుకుని ‘ఒద్దొద్దు టీచర్’ అంటూ లేవనివ్వకుండా చేశారు. ఈ గుంపులో మొదట్నుంచి కొంచెం సౌమ్యంగా ఉన్న పిల్లోడు శాంతికి దగ్గరగా ఒంగి ‘ఏంలేదు టీచర్, ఈ భాస్కర్ ఎల్లి ఆ పిల్లకి ఐ లవ్యూ చెప్పాడు. మొదట పట్టించుకోలేదు. వీడు వెంటపడి లవ్ సాంగ్స్ పాడుతూ మళ్ళీ ఐ లవ్యూ చెప్పాడు. అప్పుడొచ్చింది దానికి కోపం. మొన్నటిదాకా రాణి కావాల్సొచ్చింది. ఇప్పుడది బడికి రాడం మానేస్తే బ్రేకప్ చెప్తావా? ఇప్పుడు నేను కావాల్సొచ్చానా…’ ఇంకా చెప్పబోతుంటే పక్కనున్న పిల్లోడు గబుక్కుని వాడి నోరు నొక్కి ‘ఇంక ఆపరా. ఆ తిట్లన్నీ ఇప్పుడు చెప్పావనుకో, టీచర్ వాంతులు చేసుకుంటుంది’ అంటూ హాస్యమాడాడు. మిగతా పిల్లలంతా జత కలిపారు. ఈ భాస్కర్, ఆ అమ్మాయి ఏం చదువుతున్నార్రా అంటే ఏడో తరగతంట.
ఇంతలో కరెంట్ రావడం, కళాజాత టీమ్ స్టేజ్ సెట్ చేసుకుని పాట మొదలుపెట్టడంతో మైక్‌సౌండ్‌లో మాటలు వినబడక ఆ సంభాషణ ఆగిపోయింది. శాంతికి మాత్రం బుర్ర నిండా ఎన్నో ఆలోచనలు. ఆడపిల్లలు బూతులు మాట్లాడడం పెద్ద తప్పు ఆ మగపిల్లల దృష్టిలో. వాళ్ళు మాత్రం మాట్లాడొచ్చు, అది నార్మల్. ఏడో తరగతికే ప్రేమ, బ్రేకప్, లవ్ లెటర్లు… ఇవన్నీ మగపిల్లల వైపునుండి మొదలైతే ఒకేనట, అది నార్మల్! ఆడపిల్లలు చెప్తే రౌడీ మూకలు!
ఈ పిల్లలకి ఈ ఆలోచనలు, భేదభావాలు, ఆధిపత్యాలు, తేడాలు ఎక్కడ్నుంచి వస్తున్నాయి? ఇల్లు, బడికన్నా మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా… ఇందుకు దోహదం చేస్తుంటే చదువులు అటకెక్కించేసి, మనో భావాలు దెబ్బతిని, ఆత్మహత్యలకో, హత్యలకో, పురుషత్వ ధోరణితో అమ్మాయిల్ని పబ్లిక్‌లో కించపరచడం, అవమానించడం, హింసించడం… ఇది హీరో యిజం కాదని, మగతనానికి ఇది ప్రామాణికం కాదని ఎలా తెలియాలి? ఎవరు చెప్పాలి? ఆరోగ్యకరమైన సమసమాజం కావాలంటే సరైన మార్గం వెతకక తప్పదు.