ఆదివాసీలు ` అటవి హక్కులు -ఆశాలత, సీతాలక్ష్మీ, రుక్మిణిరావు

అటవీ హక్కుల చట్టం, 2006 ప్రకారం షెడ్యూల్డ్‌ తెగలు, ఇతర అటవీ ఆధారిత కుటుంబాలకు సంబంధించిన పోడు భూములు మరియు ఇతర అటవీ హక్కుల విషయంలో తీసుకోవాల్సిన తక్షణ చర్యలు.

పోడు భూముల సమస్యల గురించి అధ్యయనం చేసి, ఆ సమస్యలని త్వరితగతిన పరిష్కరించడానికి తెలంగాణా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తెలంగాణలో షెడ్యూల్డ్‌ తెగలు, ఇతర అటవీ ఆధారిత కుటుంబాల హక్కుల కోసం పనిచేస్తున్న పౌర సంస్థలు సభ్యులుగా మేము అభినందిస్తున్నాము. ఈ నేపథ్యంలో పోడు భూములకి సంబంధించిన ముఖ్య సమస్యలతో పాటు తెలంగాణా రాష్ట్రంలో అటవీ హక్కుల చట్టం అమలు గురించిన విషయాలని మీ దృష్టికి తీసుకురాదలిచాము. అలాగే షెడ్యూల్డ్‌ తెగలు, ఇతర అటవీ ఆధారిత కుటుంబాల అటవీ హక్కుల విషయంలో తీసుకోవలసిన తక్షణ చర్యలని మీ దృష్టికి తీసుకురాదలిచాము.
ముఖ్యమైన విషయాలు:
అటవీ హక్కుల చట్టం విస్తృత పరిధిని గుర్తించటం: పోడు భూములలో వ్యవసాయం అనేది అటవీ హక్కుల చట్టం షెడ్యూల్డ్‌ తెగలు, ఇతర అటవీ ఆధారిత కుటుంబాల హక్కులు గుర్తించే కార్యక్రమంలో ఒక భాగం మాత్రమేనని మనం గుర్తించాలి. 2006లో వచ్చిన అటవీ హక్కుల చట్టం షెడ్యూల్డ్‌ తెగలు, ఇతర అటవీ ఆధారిత కుటుంబాలకి అప్పటికే తరతరాలుగా అడవి మీద ఉన్న హక్కులని గుర్తించింది. అందులో భాగంగా వ్యక్తిగత అటవీ హక్కులు, సాముదాయక అటవీ హక్కులు, నివాస, ఆవాస హక్కులతో పాటు అటవీ ప్రాంతంలో పర్యావరణాన్ని, వన్యప్రాణులని పరిరక్షించే, సంరక్షించే హక్కులని దఖలుపరిచింది. ఈ విస్తృత పరిధిని గుర్తిస్తూ అటవీ ప్రాంతంలో పోడు భూములలో వ్యక్తిగతంగా వ్యవసాయం చేసుకుంటున్న అర్హుల అటవీ హక్కుల గురించి పరిశీలిస్తున్నప్పుడు ప్రభుత్వం దానితో పాటు పైన పేర్కొన్న అంశాల మీద కూడా దృష్టి పెట్టాలని మేము ఆశిస్తున్నాము.
అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006, నియమాలు 2007 ప్రకారం దరఖాస్తులను సమీక్షించి ప్రక్రియ మొదలుపెట్టాలి: పోడు సాగులో ఉన్న భూములకు పెట్టుకున్న దరఖాస్తులను పరిష్కరించటానికి, వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని ఏర్పరచటానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జిల్లా స్థాయి సమన్వయ కమిటీలను నియమిస్తూ ఒక జి.ఓ.(G.O Rt.1 No. 140, dated 11/09/22)ను జారీ చేసింది. ఆ కమిటీలో ఇతర సభ్యులతో పాటు జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి ఛైర్‌పర్సన్‌గానూ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్లు ప్రత్యేక ఆహ్వానితులుగానూ ఉంటారు. పోడు సాగు హక్కులను నిర్ణయించటంలో ఈ జి.ఓ. అటవీ హక్కుల చట్టం గురించి ఎటువంటి ప్రస్తావన కూడా చేయలేదు. ఈ జి.ఓ. ఒక వ్యవస్థీకృత చట్రంగా (దరఖాస్తులను స్వీకరించాల్సిన గ్రామ సభలు, సబ్‌ డివిజనల్‌ స్థాయి కమిటీలు, జిల్లా స్థాయి కమిటీలు) గల అటవీ హక్కుల చట్ట ఉల్లంఘన అవుతుంది. చట్టంలో పోడు భూముల దరఖాస్తులను పరిష్కరించాల్సిన ఏకైక నియమాన్ని ఈ జీఓ ప్రస్తావించకుండా వదిలేసింది.
వ్యక్తిగత అటవీ హక్కుల అస్తవ్యస్థ అమలు: రాష్ట్రంలో అటవీ హక్కుల అమలు అస్తవ్యస్తంగా ఉందన్న విషయం, క్రింద పేర్కొన్న సంఖ్యల ద్వారా మనకు తెలుస్తుంది. గిరిజన Noసంక్షేమ శాఖ వారి (జులై, 2021 నాటి వరకు) సమాచారం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 6,96,016 ఎకరాలకి సంబంధించి 2,04,176 వ్యక్తిగత అటవీ హక్కుల పట్టా దరఖాస్తులు రాగా, అందులో 3,08,614 ఎకరాలకి సంబంధించిన 96,676 దరఖాస్తులను మాత్రమే ఆమోదించి పట్టా పత్రాలు అందచేశారు. 91,942 దరఖాస్తులను తిరస్కరించారు. 15,588 దరఖాస్తులను వివిధ స్థాయిలలో పెండిరగ్‌లో ఉంచారు. అంటే మొత్తం దరఖాస్తులలో కేవలం 47 శాతం వాటినే ఆమోదించారు. మిగతా 53 శాతం దరఖాస్తులను తిరస్కరించారు లేదా పెండిరగ్‌లో ఉంచారు. అంతేకాక హక్కులకి సంబంధించి కొత్త దరఖాస్తులని సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటిడిఎ)లలో తీసుకోవటం లేదు.
సామూహిక అటవీ హక్కుల పట్టాలని చట్టవ్యతిరేకంగా వన సంరక్షణ సమితి పేరు మీద ఇవ్వటం: అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 4,54,055 ఎకరాల అటవీ భూమికి 721 సామూహిక అటవీ పట్టాలు ఇచ్చారు. అయితే ఈ పట్టాలని అటవీ విభాగం అధీనంలో ఉండే వన సంరక్షణ సమితి (వి.ఎస్‌.ఎస్‌.)లకి ఇచ్చారు. అటవీ హక్కుల చట్టంలో సెక్షన్‌ 2 (ష), 2 (శీ)లలో పేర్కొన్న ‘షెడ్యూల్డ్‌ తెగలు, ఇతర అటవీ ఆధారిత కుటుంబాలు’ అనే పద అర్థంలో ఈ వి.ఎస్‌.ఎస్‌.లు రావు. అందువలన ఈ వి.ఎస్‌.ఎస్‌.లకి సామూహిక పట్టా పుచ్చుకునే హక్కు లేదు. వాటి పేరు మీద ఇచ్చిన పట్టాలు చెల్లవు.
అధిక స్థాయిలో దరఖాస్తుల తిరస్కరణ, తిరస్కరణకి కారణాలు తెలపకపోవటం: పైన ఇచ్చిన సమాచారం బట్టి మనకు తెలుస్తుంది ఏమిటంటే అధిక స్థాయిలో వ్యక్తిగత అటవీ హక్కుల దరఖాస్తులని తిరస్కరిస్తున్నారు. దరఖాస్తుదారులకి పద్దెనిమిది సంవత్సరాలు నిండలేదు అని, హక్కు గుర్తించమని అడుగుతున్న భూములు వి.ఎస్‌.ఎస్‌. పరిధిలోకి వస్తాయి అని, హక్కు గుర్తించమని అడుగుతున్న పోడు భూములు శాటిలైట్‌ చిత్రాల నుండి కనపడటం లేదు అని (శాటిలైట్‌ చిత్రాలని క్షేత్రస్థాయి వాస్తవంతో పోల్చి చూడకుండానే ఇలా చెబుతున్నారు) ఇలా అనేక కారణాలు చెప్పి తిరస్కరిస్తున్నారు. కొన్ని కొన్ని సందర్భాలలో కట్‌ ఆఫ్‌ తారీఖు తర్వాత పోడు వ్యవసాయం కోం అడవిని నరికారు అని చెప్పి తిరస్కరిస్తున్నారు. అయితే అత్యధిక సందర్భాలలో ఎందుకు తిరస్కరిస్తున్నారో కారణాలు తెలపటం లేదు. దాని కారణంగా దరఖాస్తుదారులకి చట్టంలో పేర్కొన్న ప్రకారం అప్పీల్‌కి వెళ్ళటం కుదరటం లేదు.
గ్రామ సభలు, అటవీ హక్కుల కమిటీలు లేకపోవటం: పెసా చట్టం ప్రకారం, అటవీ హక్కుల చట్టం ప్రకారం గ్రామ సభలు, అటవీ హక్కుల కమిటీలు ఏర్పాటు చెయ్యాలని స్పష్టంగా పేర్కొన్నా కూడా ఏర్పాటు చెయ్యలేదు. దీని కారణంగా వీటి అమలు చట్టంలో పేర్కొన్న విధంగా కాకుండా దరఖాస్తులు స్వీకరించడం, వాటిని పరిశీలించటం అనే ఒక యాంత్రిక విధానంలో సాగుతున్నది, అది కూడా అటవీ శాఖ వారి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి. మా స్వతంత్ర అధ్యయనంలో తేలిందేమిటంటే షెడ్యూల్డ్‌ తెగల ప్రజలకి అటవీ హక్కుల చట్టం క్రింద ఉన్న హక్కుల గురించి పెద్దగా అవగాహన లేదని. షెడ్యూల్డ్‌ తెగల హక్కుల కోసం, అభ్యున్నతి కోసం పని చెయ్యవలసిన ఐ.టి.డి.ఎ.లు దురదృష్టవశాత్తు షెడ్యూల్డ్‌ తెగల ప్రజలు అటవీ హక్కులు సాధించుకోవటంలో క్రియాశీలక పాత్ర పోషించడం లేదు.
ఉమ్మడి పట్టా నియమాల అస్తవ్యస్త అమలు: అటవీ హక్కుల చట్టం ప్రకారం భార్య, భర్త ఇద్దరి పేరు మీద ఉమ్మడిగా పట్టా ఇవ్వవలసి ఉన్నా కూడా అటువంటి ప్రయత్నాలు జరగటం లేదు. అదే కాక షెడ్యూల్డ్‌ తెగలు, ఇతర అటవీ ఆధారిత కుటుంబాలలో మహిళలకి వీటి గురించి అవగాహనే లేదు. ఎన్ని ఎకరాలలో ఎంతమంది మహిళలకి ఉమ్మడి పట్టాలు ఇచ్చారు అని తెలియజేసే లింగ ఆధారిత సమాచారం లేదు.
ఆవాస హక్కులని నిరాకరించటం: తెలంగాణలో అటవీ హక్కుల చట్టం ప్రకారం పివిటిజి తెగలకు సంబంధించిన ఆవాస హక్కులని నేటి వరకు గుర్తించలేదు. ఆదిలాబాద్‌, కొమరం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లాలలో పివిటిజి మరియు ఇతర తెగలకి సంబంధించిన ప్రజలు గత ఇరవై సంవత్సరాలకి పైగా అవే అటవీ భూములలో వ్యవసాయం చేసుకుంటున్నా కూడా నేటికీ వారి అటవీ హక్కులని గుర్తించలేదు. దీని కారణంగా వారికి అటవీ శాఖ నుండి విస్థాపన ముంపు పొంచి ఉంది. 2012లో సవరించిన అటవీ హక్కుల నియమాల ప్రకారం జిల్లా కలెక్టర్‌ అధ్యక్షునిగా ఉన్న జిల్లా స్థాయి కమిటీ (డి.ఎల్‌.సి.)కి ఆవాస హక్కులు దఖలు పరచవలసిన బాధ్యత ఉంది. అలాగే కవ్వాల్‌, ఆమ్రాబాద్‌ ప్రాంతాలలో పులుల సంరక్షణ ప్రాజెక్టుల కారణంగా పివిటిజి తెగలకి విస్థాపన ముప్పు పొంచి ఉంది.
అటవీ/సర్వే చెయ్యని గ్రామాలని రెవిన్యూ గ్రామాలుగా మార్చకపోవటం: అటవీ హక్కుల చట్టం సెక్షన్‌ 3(1)(h) ప్రకారం సర్వే చెయ్యని అటవీ గ్రామాలని రెవెన్యూ గ్రామాలుగా మార్చాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 3568 స్క్వేర్‌ కిలోమీటర్ల విస్తీర్ణంలో 49,232 (2011 లెక్కల ప్రకారం) మంది జనాభా కలిగిన 290 చెంచు గూడేలు ఉన్నాయి. అలాగే ఖమ్మం, వరంగల్‌ జిల్లాలలో గొత్తికోయల గూడేలు ఉన్నాయి. నాన్‌`షెడ్యూల్డ్‌ ప్రాంతంలో ఉన్న షెడ్యూల్డ్‌ తెగల గ్రామాలని రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్‌లో ఇంకా భాగం చెయ్యలేదు. దాని కారణంగా అక్కడ నివసిస్తున్న షెడ్యూల్డ్‌ తెగల అటవీ హక్కుల గురించి ఏమీ జరగటం లేదు.
అటవీ హక్కుల చట్టానికి విరుద్ధంగా జరుగుతున్న అడవుల పెంపకం పథకాలు: హరిత హారం లాంటి అడవుల పెంపకం కార్యక్రమాలు, ఆదివాసీ గ్రామాల చుట్టూ మొక్కలు నాటడం, గుంటలు తవ్వడం కారణంగా ఆదివాసీలకి తాము తమ వ్యవసాయం కోసం కానీ, పశువుల మేత కోసం కానీ అడవిని చేరుకోవటం అసాధ్యంగా తయారయింది. అంతేకాక ఇది అటవీ హక్కుల చట్టానికి విరుద్ధం కూడా. హరిత హారం కార్యక్రమం కోసం ఖర్చు పెడుతున్న డబ్బులో అధిక భాగం కేమ్పా పథకం నుండి వస్తున్నది. భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్‌, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌ జిల్లాలలోని వివిధ ప్రాంతాలలో అటవీ శాఖ వారు పోడు వ్యవసాయం చేస్తున్న కుటుంబాలని అక్కడి నుంచి బలవంతంగా తొలగిస్తున్నారు. అలాగే అటవీ హక్కుల చట్టం క్రింద ఆ భూములకి పట్టాలు లేవని కేసులు పెడుతున్నారు.
అటవీ హక్కుల చట్టాన్ని బలోపేతం చేయడానికి సలహాలు`సూచనలు:
పైన పేర్కొన్న సమస్యలు, సవాళ్ళ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రింది విషయాల మీద తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మేము మిమ్మల్ని కోరుతున్నాము.
అటవీ హక్కుల చట్టాన్ని ఒక నిరంతర ప్రక్రియగా అమలు చేయాలి: అటవీ హక్కుల గుర్తింపు చట్టంలోని అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, అటవీ భూములపై షెడ్యూల్డు తెగలు, ఇతర అటవీ ఆధారిత కుటుంబాల హక్కులను గుర్తించటం ఒక నిరంతర ప్రక్రియ. తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించటానికి, పరిష్కరించటానికి ఒక చివరి తేదీని పెట్టి అటవీ హక్కుల చట్టం యొక్క ఈ స్ఫూర్తిని నీరుగార్చటానికి ప్రయత్నిం చేయదని మేము ఆశిస్తున్నాము.
జి.ఓ.ఆర్‌.టి. నెం.140 ని వెంటనే ఉపసంహరించాలి: అటవీ హక్కుల గుర్తింపు చట్టం, దాని నియమాలలో స్పష్టంగా పేర్కొన్న దరఖాస్తుల పరిశీలన, ప్రక్రియ వ్యవస్థీకృత చట్టాన్ని ఈ జి.ఓ. ఉల్లంఘిస్తుంది కనుక దాన్ని వెంటనే ఉపసంహరించాలి.
తిరస్కరణకి గురయిన దరఖాస్తులను సుమోటో అప్పీళ్ళుగా స్వీకరించి త్వరితగతిన సమీక్షించాలి: ఫిబ్రవరి 28, 2019 నాడు సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలని తిరస్కరించబడిన లేదా పెండిరగ్‌లో ఉన్న దరఖాస్తుల సమీక్ష గురించి అఫిడవిట్‌ సమర్పించమన్న నేపథ్యంలో తెలంగాణలో ‘‘తిరస్కరించబడిన దరఖాస్తులని’’ సుమోటో అప్పీళ్ళుగా స్వీకరించి గ్రామసభ, సబ్‌ డివిజనల్‌ స్థాయి కమిటీ, జిల్లా స్థాయి కమిటీలలో క్షుణ్ణంగా, జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ కార్యక్రమమంతా అయ్యేవరకు కూడా ఆదివాసీలను తమ ఆవాసాల నుండి తొలగించకూడదు. ట్రైబల్‌ సంక్షేమ శాఖ దీనికి సంబంధించి అన్ని జిల్లాలలో ఈ వ్యవహారాలతో సంబంధమున్న అధికారులకి ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు జారీ చెయ్యాలి.
తిరస్కరించబడిన దరఖాస్తుల గురించి స్పష్టమైన సమాచారం అందచేయటం, కొత్త దరఖాస్తులను స్వీకరించటం: దరఖాస్తులు పెండిరగ్‌లో ఉన్నా లేదా తిరస్కరించబడినా కూడా దరఖాస్తు చేసుకున్న వారికి ఎందుకు తిరస్కరించారో తెలుపుతూ స్పష్టమైన సమాచారం అందించాలి. అలాగే ఈ నిర్ణయాన్ని అప్పీల్‌ చేసుకోవడానికి వారికి అవకాశం కల్పించాలి. దీంతోపాటే ఈ చట్టం క్రింద హక్కులు దఖలు పడటానికి అర్హులైన వారి చేత దరఖాస్తు చేయిస్తుండాలి.
వి.ఎస్‌.ఎస్‌.లకి ఇచ్చిన సామూహిక పట్టాలను వెనక్కి తీసుకోవాలి: ట్రైబల్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 06.08.2013 నాడు వెలువరించిన మార్గదర్శకాల ప్రకారం (No..23011/11/2013-FRA(pt)) ఎక్కడైతే వి.ఎస్‌.ఎస్‌. కమిటీల పేరు మీద పట్టాలు ఇచ్చారో వాటిని వెనక్కి తీసుకుని గ్రామసభలకి వాటిని దఖలు పరిచేలా చర్యలు తీసుకోవాలి. అలాగే అటువంటి భూములని గుర్తించి అటవీ హక్కుల చట్టం సెక్షన్‌ 2 (c) ప్రకారం ఆ భూములను వ్యక్తిగత పట్టా, సామూహిక పట్టా దరఖాస్తుదారులకి ఇచ్చేలా చూడాలి.
గ్రామసభలకి ఆవాస ప్రాంతాలను నోటిఫై చేయటం: పెసా చట్టం ప్రకారం గ్రామ సభలు ఏర్పాటు చేయడానికి, వాటిని బలోపేతం చేయడానికి అనుగుణంగా ఆవాసాలని నోటిఫై చేయాలి. అలాగే అటవీ హక్కుల చట్టం ప్రకారం ఆయా గ్రామాలలో అటవీ హక్కుల కమిటీలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలి.
ఉమ్మడి పట్టాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి: మహిళలు వ్యక్తిగత, ఉమ్మడి పట్టాల కోసం దరఖాస్తు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. అలాగే గ్రామ సభలో వారి భాగస్వామ్యం పూర్తి స్థాయిలో ఉండేలా చర్యలు చేపట్టాలి. అలాగే లింగ ఆధారిత అటవీ హక్కుల సమాచారాన్ని సేకరిస్తూ, అప్‌డేట్‌ చేస్తూ గ్రామ స్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు చేయాలి. ఆ సమాచారాన్ని ట్రైబల్‌ వ్యవహారాల శాఖ వెబ్‌సైట్‌లో పొందుపరచాలి. మహిళలు కొత్తగా దరఖాస్తులు చేయడానికి, ఒకవేళ తమ దరఖాస్తులు తిరస్కరణకి గురయితే అప్పీల్‌ చేసుకోవటానికి మహిళలకి ప్రత్యేక మద్దతు అందించాలి. ఉదాహరణకి వారంలో ఒక రోజు కేవలం మహిళలు దరఖాస్తు చేసుకోవడం కోసం కేటాయించటం.
రెవెన్యూ రికార్డులతో అటవీ హక్కుల పట్టాల రికార్డులని సమన్వయపరచడం: రెవెన్యూ రికార్డులతో అటవీ హక్కుల చట్టం కింద ఇచ్చిన పట్టాలని సమన్వయపరచాలి. అలా చేయడం ద్వారా అటవీ హక్కుల చట్టం కింద పట్టాలు పొందిన వారికి కూడా రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి.
హరిత హారం పథకాన్ని సమీక్షించాలి: అటవీ హక్కుల క్రింద వచ్చిన దరఖాస్తులని పూర్తిగా సమీక్షించేవరకు ఆ దరఖాస్తుల తాలూకా భూములలో ఈ చట్టానికి విరుద్ధంగా ఉన్న పథకాలు లేదా కార్యక్రమాలని (గ్రామ సభల అనుమతి లేకుండా అటవీ భూమిని ‘ప్రజా ప్రయోజనాల’ పేరు మీద సేకరించడం, హరిత హారం లాంటివి) తాత్కాలికంగా రద్దు చేయాలి. కేమ్పా నిధులతో నడుస్తున్న హరిత హారం కార్యక్రమ విధానాన్ని, లక్ష్యాలని మదింపు చేయాలి. షెడ్యూల్డ్‌ ప్రాంతాలలో అడవుల పెంపకం కార్యక్రమం పెసా, అటవీ హక్కుల చట్టం నియమాలకి లోబడి గ్రామ సభల ఆధ్వర్యంలో నడవాలి.
ఐ.టి.డి.ఎ.లు క్రియాశీలక పాత్ర పోషించాలి: షెడ్యూల్డ్‌ తెగలు, ఇతర అటవీ ఆధారిత కుటుంబాలు అటవీ హక్కుల చట్టం కింద తమ హక్కుల కోసం దరఖాస్తు చేయడానికి ఐ.టి.డి.ఎ.లు క్రియాశీలక పాత్ర పోషిస్తూ అవసరమైన మద్దతు అందచేయాలి. ఐ.టి.డి.ఎ.లకు ఈ విషయం గురించి సరైన తర్ఫీదు ఇచ్చి, సమయరీతిన (టైం బౌండ్‌) ప్రణాళిక తయారు చేసేలాగా ఆదేశాలు జారీ చేయాలి.
గిరిజన సలహా మండలిని సంప్రదించాలి: ప్రభుత్వం గిరిజన సలహా మండలి సమావేశం నిర్వహించి పోడు భూముల సమస్య, ఇతర అటవీ హక్కుల పరిష్కారానికి సంబంధించిన ప్రతిపాదనలు, ప్రణాళికలను దాని ముందు ఉంచి సంప్రదింపులు జరపాలి.
షెడ్యూల్డ్‌ తెగల సంఘాలను, ప్రజా సంఘాలను ఈ ప్రక్రియలో భాగం చేయాలి: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆదివాసీ ప్రజా సంఘాలు, అటవీ హక్కుల సమస్యలపై పని చేస్తున్న ఇతర పౌర సంస్థలు, సంఘాలతో ప్రభుత్వం పోడు భూముల సమస్య, ఎస్టీలు, ఇతర అటవీ నివాసుల అటవీ హక్కులకు సంబంధించిన సమస్యలపై ఒక రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించి చర్చించాలి.

Share
This entry was posted in సమాచారం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.