భూమిక పుట్టి ముఫ్పై సంవత్సరాలు అయిందా! అప్పుడే! అనిపిస్తుంది. అప్పుడు భూమికలో ఎక్కువ మంది లేరు. సత్యవతి ఈ విషయం చెప్పినప్పుడు రజిత నేను చాలా సంతోషించాం. ఢల్లీి నుండి వచ్చే మధుకిష్వర్ నడిపే మానుషి మ్యాగ్‌జైన్ లాంటిది ఇక్కడ తెలుగుదేశంలో
తెలుగులో ప్రచురించాలని ఆమె ఉద్దేశ్యం. కానీ ఒక పత్రిక అందులోనూ స్త్రీవాద పత్రిక నడపడం అంటే మాటలు కాదు. దానికి డిమాండ్ వుండదు. కానీ సత్యవతి సాహసవంతురాలు. ఉడుము పట్టు పట్టే మనిషి. ఈ పత్రిక కోసం ఆఫీసర్ ఉద్యోగానికి కూడా రిజైన్ చేసేసింది. పత్రిక నడుస్తుంది కానీ ఆర్థిక ఇబ్బందులు. అప్పుడు సత్యవతిలాంటి భావజాలం కలిగిన వారే ఒక్కొక్కరూ వచ్చి చేరారు. భూమిక స్త్రీలపై జరిగే అనేక సమస్యలను గురించి గృహహింస, పనిప్రదేశాలలో లైంగిక హింస వ్యవసాయ క్షేత్రాలలో మహిళలపై హింస ఇలాగా మహిళలు సమాజంలో ఎదుర్కొనే ప్రతి సమస్యను గురించి చెప్పటమే కాకుండా వాటి పరిష్కార మార్గాలను తెలియచెప్పేలాగా పత్రికను తయారు చేసింది సత్యవతి. ఇంత అద్భుతంగా తయారు చేయాలంటే ఎంత దీక్ష వుండాలి! అదీ సత్యవతి అంటే! నేను విడిగా భూమికను గురించి రాయలేదు. ఎందుకంటే భూమిక అంటే సత్యవతి. సత్యవతి అంటే భూమిక.
` శారదా శ్రీనివాస