భూమికతో ఆత్మీయ అనుబంధం
మన భూమిక మూడు దశాబ్దాల ప్రయాణం ముగించుకొని నాలుగవ దశాబ్దంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా శుభాభినందనలు. భూమిక పత్రిక నాకు మొట్టమొదట తెలిసింది 2008లో, మహిళా సమత ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు చదివాను. అప్పటినుండి ఫాలో
అవుతున్నాను. ప్రతినెలా 10వ తేదీలోపు రాకపోతే ఏదో తెలియని దిగులు. మన ఆత్మీయులు ఎవరో రాలేదు అని. వచ్చాక మనవాళ్ళు వచ్చారు అన్న సంతోషం.
భూమికలో నేను మొదట చదివేది సంపాదకీయం, కాలమ్స్, పుస్తక సమీక్షలు, రిపోర్టులు, పిల్లల భూమిక, వ్యాసాలు… తరువాత మిగిలినవి. సత్యవతి మేడం సంపాదకీయం మన ప్రస్తుత సమాజంలో విషయాలను చాలా సమగ్రంగా, వివరంగా రాస్తారు. చదివేవాళ్ళకు సమాచారంతో పాటు చాలా ప్రశ్నలు, ఆలోచనలు కలిగిస్తారు. భూమిక పత్రిక ద్వారా స్త్రీవాద ఉద్యమాలతో పాటు, కొత్త విషయాలను ఎలా అర్థం చేసుకోవాలి, దృక్పథం, ఆలోచనలు ఎలా ఉండాలి, ఎలా స్పందించాలి అనేది బాగా తెలుసుకున్నాను. భూమికలోని ఏ ఆర్టికల్ చదివినా నా జీవితంలో జరిగిన ఏదో ఒక సంఘటన గుర్తొస్తుంది. ఆ సమయంలో నేను అలా చేసి ఉంటే బాగుండేది కదా అని అనిపిస్తుంది.
భూమిక ద్వారా అందించే సమాచారం చాలా విలువైనదని నేను నమ్ముతాను. దీనిద్వారా నా జీవితంలో నేను చాలా మార్పులు చేసుకోగలిగాను. నా ఆలోచనా విధానంలో కానీ, నా ప్రవర్తన, నడవడిక, నమ్మకాలలో చాలా మార్పు వచ్చింది. మహిళా అంశాల పట్ల కొత్త సమాచారాన్ని అందించడానికి భూమిక ఎప్పుడూ ముందుంటుంది. ప్రతి సంచికలో లోపలి కవర్ పేజీలలో మహిళలు, పిల్లలకు సంబంధించిన చట్టాలు, హక్కుల గురించిన పోస్టర్స్, సమాచారం ప్రచురించడం చాలా ఉపయోగకరంగా ఉంది.
భూమిక పత్రిక ద్వారా స్త్రీ వాదానికి జర్నలిజం జతచేస్తూ కొన్ని కాలేజీలు, యూనివర్శిటీలు, ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ కార్యాలయాల్లో ముఖాముఖి, క్విజ్, డిబేట్‌లు, చర్చాగోష్టిలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయగలిగితే బాగుంటుందని అనిపిస్తుంది. పితృస్వామ్య భావజాలం నాటుకుపోయిన మన వ్యవస్థల్లో వ్యక్తిత్వం, మానవ విలువలు, స్త్రీ దృక్పథం, జెండర్ సున్నితత్వం, హక్కులు, చట్టాలు, జీవితంపై ఒక అవగాహన, సమస్యలను ఎలా ధైర్యంగా ఎదుర్కొని గెలవాలి అన్న విషయాలను అర్థం చేయించడం చాలా ముఖ్యం. ప్రస్తుతం మన సమాజంలో ఉన్న జెండర్ అసమానతలను తగ్గించడానికి, హింసను రూపుమాపడానికి ఇలాంటి కార్యక్రమాలు మంచి వేదికలవుతాయని భావిస్తున్నాను. అది భూమిక పత్రిక ద్వారా సాధ్యమవుతుందని నా విశ్వాసం.
ఈ 30 సంవత్సరాల భూమిక ప్రయాణం చాలా గొప్ప విషయం. నాలాంటి మహిళలు, అమ్మాయిలకు ఎంతో స్ఫూర్తిదాయకం. భూమిక ఇలాగే కొనసాగాలి, ఎంతోమందికి చేరువ కావాలి అని మనసారా కోరుకుంటూ… భూమిక టీం అందరికీ అభినందనలు.
` సరితాంజలి