‘భూమిక’ మహిళా మాస పత్రిక 30వ వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతాభినందనలతో ఓ ప్రేమలేఖ…
మై బిలవ్డ్, డియరెస్ట్ భూమికా, విష్ యూ థర్టీ ఫస్ట్ హ్యాపీ బర్త్ డే అండ్ మెనీ మోర్ అండ్ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ యువర్ స్పెషల్ డే!
స్త్రీల జీవితాలు చీకటి, మహా సంద్రాల్లో చిక్కుకొని, దారీతెన్నూ కానరాని పరిస్థితులలో నువ్వు స్త్రీల పత్రికగా ఆవిర్భవించిన నాటినుండి గొప్ప లైట్‌హౌస్‌గా వెలుగులు ప్రసరించి, వాళ్ళను క్షేమంగా గమ్యం చేర్చిన సందర్భాలెన్నెన్నో… వాటన్నింటికీ, ఈ నీ పుట్టిన రోజున ధన్యవాదాలు ప్రకటించడం మా కర్తవ్యం.
నువ్వు పుట్టినప్పుడే చిత్రంగా ప్రౌఢ యువతివి! స్త్రీత్వపు భూమికలన్నింటినీ పోషిస్తూ మాలో ఒక్కొక్కరికీ అమ్మగా, సోదరిగా, నెచ్చెలిగా ఎంతో చేదోడు వాదోడయ్యావు. నువ్వు పుట్టినప్పటి నుండే మా బ్రతుకుల్లో భాగమయ్యావు. దిగులు చెట్టు కింద వాలిపోయినప్పుడు ధైర్యపు నీడవయ్యావు. బుర్రలు పనిచేయనప్పుడు ఓదార్పు పాటవై శృతి చేశావు.
మహిళల సమస్యలు పట్టించుకోని సంస్థలకు, ప్రభుత్వాలకు, అధికారులకు తమ తమ బాధ్యతలను నిర్వహించే కరదీపికవైనావు. కోర్టులు, చట్టాలు, పోలీస్ స్టేషన్లు… లంచాల చేతులకే తలుపులు తెరుచుకునే చీకటి కాలాన్ని గతకాలపు చరిత్రగా మార్చి ‘నీ బాంచన్, కాల్మొక్తా’ అంటూ… లో లోతుల్లో మూలుగుతున్న స్వరాల స్థానంలో ‘‘ప్రశ్న’’ను నింపి గొప్ప ఆయుధ ధారులను చేస్తున్నావు. నిస్సహాయులైన అబలల జీవితాలకు ‘మేమున్నా’మంటూ అభయమిచ్చి చైతన్యమూర్తులను చేస్తున్న భూమికా, ‘అక్షరమే ఆయుధ’మన్న పెద్దల మాటను నువ్వు మోసుకొస్తున్న ‘అక్షయ అస్త్రాలు’ నిత్యమూ రుజువు చేస్తున్నాయి.
స్త్రీ పురుష, కుల మత, పేద ధనిక, కార్మిక కర్షక, అవర్ణ సవర్ణ వంటి సవాలక్ష అసమానతలతో, తోటి మానవులను జంతువులకంటే హీనంగా, అవమానాలతో అణచివేసిన భారతదేశంలో మహిళలను ‘‘న స్త్రీ స్వాతంత్య్రమర్హతి’’ అంటూ అక్షరానికి, హక్కులకు దూరం చేయడమే కాక చివరకు భర్త మరణిస్తే అతనితోపాటు ఆమెను కూడా సజీవంగా దహనం చేయాలని శాసనం చేసిన ఈ దేశంలో, మహోన్నత మానవతామూర్తి, గొప్ప మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని భారత మహిళల హస్తాల్లో పెట్టి ‘‘ఇవిగో మీ హక్కులు’’ అంటూ బాధ్యతలను కూడా తెలియజేస్తున్నావు.
‘‘మేము భారతీయులం…’’ అంటూ రాజ్యాంగాన్ని నీ మోమున హుందాగా సింగారించుకొని, మా గుండెల్ని తట్టిన భూమికా… నాటి నీ ముఖచిత్రం… మా గుండెల్లో నిత్యం పదిలం.
ఆశే లేని ఆడవారి బ్రతుకుల్లో చైతన్య దీప్తులు వెలిగించేవారిని కూడా పరిచయం చేస్తూ… కొత్త ఉత్సాహాలను ప్రోది చేస్తున్న నీ భూమిక బహు ప్రశంసనీయం.
ఈ మూడు దశాబ్దాలలో నువ్వు సాధించిన విజయాలకు సూత్రధారి, పాత్రధారి… మా అందరి ‘భూమిక సత్యవతి (కొండవీటి)’ గారికి ఎన్నెన్నో అభినందనలు! ధన్యవాదాలు!!
నీ 30వ పుట్టినరోజుకు సత్యాజీ నీకిచ్చిన బహుమానం నీకు తెలుసా భూమికా… పారిశుధ్య రంగంలో సేవలందించే మహిళా కార్మిక సోదరీమణులకు ‘అవార్డులు’ ఇస్తున్నారు.
ఇది ఇంతవరకు ఎవరైనా ఆలోచన చేశారా? చేయరు. మమతా మానవతామూర్తులు, మనకు నిజమైన సేవలు చేసేవారిని గుర్తించగలిగిన, కృతజ్ఞత నిండిన, హృదయాలున్నవారే ఇట్లాంటివి చేయగలరు.
రాబోయే ఎన్నికల్లో ఈ దేశ స్త్రీల సమస్యలపైన సంపూర్ణ అవగాహన కలిగిన మహిళా ప్రతినిధిగా, ఎంపిగా భారత పార్లమెంటులో సత్యవతిగారు కూర్చోవాలని నా ప్రగాఢమైన ఆకాంక్ష! మీరంతా నాతో ఏకీభవిస్తారని కూడా నా ప్రగాఢ విశ్వాసం! నేను ప్రతిపాదిస్తున్నాను.
ఎన్ని గడ్డు సమస్యలొచ్చినా, అడ్డుగోడలెదురైనా తన దక్షతతో, ఏకైక దీక్షతో భూమికా… నిన్ను బలంగా నిలబెట్టి, నడిపిస్తూ మహిళా జగతిని విజయగమ్యానికి చేర్చడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న సత్యాజీకి… స్త్రీ లోకం సంపూర్ణ సహకారం అందించాలి.
భూమికా… నీ పరిధి ఇంకా విస్తరించాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఈ నేలమీద ఉన్న తెలుగు మగువలందరి చేతుల్లోకి నువ్వెళ్ళాలి. వారి గుండెల్లో చైతన్యజ్వాలవవ్వాలి. ఏ ఇంతి కంట కన్నీరొలకని కాలాన్ని నువ్వు తీసుకురావాలి. మూర్ఖత్వాల, మూఢనమ్మకాల, బానిస భావాలను నిర్మూలించి ప్రతి మహిళ గుండెల్లో స్వతంత్ర ఆలోచనా జ్యోతులను దేదీప్యమానంగా వెలిగించి, మన సమాజాన్ని ఆవరించిన సమస్త అంధకారాన్ని నిర్మూలించాలి. ఈ ‘గమ్యానికి’ అంకితమైన మన ‘‘భూమిక’’ రథసారధి సత్యవతి గారికి, వారి సమర్థవంతమైన టీం సభ్యులందరికీ… గడిచిన కాలానికి ధన్యవాదాలు.
ఆగామి కాలానికి శుభాకాంక్షలు!!
జయహో భూమిక!
సాగిపో ఆగక!! ` రaాన్సీ కె.వి.కుమారి