స్పందన – ఆపర్ణ తోట

‘ఆమె ఈ పని కేటాయించుకుని రాలేదు’
ముప్ఫయ్యేళ్ళు ఒక పత్రిక నడపడం అంటే సాధారణమైన విషయం కాదని మనందరికీ తెలుసు. అసలు పత్రిక నడపడమే ఖర్చుతో కూడిన వ్యవహారం. అందులో లాభాపేక్ష లేకుండా లాభం రాదు, ఆ రావడం కూడా కనాకష్టం మీదే. ఇక అంతర్జాల పత్రికలతో పోటీపడుతూ ప్రింట్‌

పత్రికలు పనిచేయగలగాలి. పైగా ప్రింటింగ్‌ కాస్ట్‌ ఒకటి అదనం. ఇది కాకుండా హక్కుల కోసం పనిచేసే పత్రిక అంటేనే సీరియస్‌ పత్రికగా పరిగణిస్తారు. క్షణక్షణమూ మార్కెట్‌ నియంత్రణలో జీవితాన్ని సాగిస్తున్న చాలామంది పాఠకులను అక్కడే కోల్పోతాము. ఆ పైన స్త్రీవాద పత్రిక అనగానే ఎందరో పురుషులు, అస్తికులు పక్కకి తొలగుతారు ఎందుకనో. ఎందుకనో తెలుసనుకుంటా, అయినా చెప్పకూడదు.
ఇలా ఆగకుండా నిరంతరం నడిపే పత్రిక వలన ఏం లాభం? పైగా భూమిక అచ్చంగా స్త్రీవాదులనుకునే వారికే చేరుతుందాయె. వారి వాదనను బలోపేతం చేసుకోడానికి కాక భూమికతో ఇంకెందరికి ఉపయోగం?
చెప్తాను నా అనుభవం నుండే. కరోనా జబ్బు కాస్త తగ్గుముఖం పట్టింది అనుకున్న సమయంలో పోలీసులకు జెండర్‌ సెన్సిటైజేషన్‌ ట్రైనింగ్‌ చేయడానికి నన్ను రిసోర్స్‌ పర్సన్‌గా ఎంచుకున్నారు. అక్కడ కూడా భూమిక పత్రికను రిసోర్స్‌ మెటీరియల్‌ పక్కన ఉంచేవాళ్ళం. మహిళా హక్కుల చట్టాల పట్ల అపోహలు, అసహనం నిండిన యువ పోలీసులను, అక్కడ మేమిచ్చే సెన్సిటైజేషన్‌ శిక్షణ బాగానే ప్రభావితం చేస్తుందని ఫీడ్‌బ్యాక్‌లో అర్థమయ్యేది. అదిగో అటువంటి సమయంలో శిక్షణ అయ్యాక వచ్చి సంతోషంగా ఆలోచనలు పంచుకునే మనుషులతో పాటు, ఆలోచనలు కాస్త మారుతుండేసరికి తికమకపడి కినుకగా ఉన్నవారు కూడా పత్రికను వారితో తీసుకెళ్ళేవారు. అలా వరుసగా జరిపిన ఈ ట్రైనింగులకు హాజరైన వారు వెయ్యికి పైనే ఉంటారు. అందులో కనీసం సగం మంది తమతో పాటు భూమిక పత్రికను తీసుకెళ్ళినవాళ్ళు ఉంటారు. వీరంతా కనీసం ఒక వ్యాసం చదివినా ఎంత మార్పు వస్తుంది. అతను లేదా ఆమె పనిచేసే పోలీస్‌స్టేషన్‌లో లేక వారి కుటుంబంలో!
సిద్ధిపేటలో ముందడుగు, కరీంనగర్‌లో వెన్నెల ఫెడరేషన్‌లు ప్రతినెలా భూమిక మ్యాగజైన్‌ని అందుకుంటున్నాయి. ఈ ఫెడరేషన్‌లు ప్రాజెక్ట్‌ ఉద్దేశాల ప్రకారం న్యాయ కమిటీలుగా ఏర్పడి మీటింగులు జరుపుతాయి. అందులో భాగంగా సభ్యులంతా గుమిగూడి ఒకరు భూమిక పత్రికను బిగ్గరగా చదువుతుంటే మిగిలినవారు వింటారు. వారికి అందించే శిక్షణ, దానికి అనుసంధానంగా ఈ పత్రిక జెండర్‌ పరంగా ఆడవారిని ఎలా చూస్తున్నారు, వారి స్థానం ఏమిటి అని తెలుసుకుంటున్నారు. ఆధునిక సమాజంలో మహిళలపై జరుగుతున్న హింస, వివక్షను అర్థం చేసుకుంటున్నారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఎలా మాట్లాడాలి అనే విషయాలు న్యాయ కమిటీల సభ్యులు తెలుసుకుంటున్నారు. ‘ఇంతకాలం ఆడవారికి సపోర్టుగానే మాట్లాడాలనే తెలిసేది. కానీ ఇప్పుడు కారణాలు తెలుస్తున్నాయి. ఎవరి వద్దనుండి ఎలాంటి సమాచారం తెలుసుకోవాలి, అసలు సమస్యకు కారణం ఏమిటి అనేది తెలుసుకుంటున్నాము’ అని చెబుతున్నారు.
అలానే అర్బన్‌ స్లమ్‌ (బస్తీ)లోని ప్రోగ్రాంలో కూడా ఇలానే కొన్ని పత్రికలూ పెట్టేవాళ్ళం.
దిగువ మధ్య తరగతి మహిళలు పితృస్వామ్యం, జెండర్‌, జెండర్‌ వివక్ష గురించి తెలుసుకున్నాక, వారి జీవితంలోని సంఘటనలతో వారు నిజాలను బేరీజు వేసుకున్నాక, ఈ కొత్త జ్ఞానంతో వారు డస్సిపోయేవారు. ఆలోచనలో మునిగిపోయేవారు. ట్రైనింగ్‌ హాల్‌ నిశ్శబ్దంగా మారిపోయేది. ‘‘ఏం ఆలోచిస్తున్నారు?’’ అని అడిగితే, ‘‘ఏం చెప్తాము మేడం, మీరివన్నీ చెప్పి మా కళ్ళు తెరిపించి మమ్మల్ని ఆగం చేసినంక, మా బతుకులెంత ఆగమయినయో తెలుసుకున్నంక…’’ అన్నదొకామె.
ఇలా అర్థం చేసుకున్నకొద్దీ, ఒక ఉన్నతమైన ప్రేమ మా మధ్య ప్రకాశించేది. ఆ ప్రకాశాన్ని ఆ ట్రైనింగ్‌ హాల్‌లోని ప్రతి మహిళ అనుభవించేది. ఇటువంటి సెషన్‌లో ఈ శిక్షణ వలన వారి జీవితంలో మార్పులను అడిగినపుడు, ‘‘ఇదివరకు మా పాపకి మాత్రమే ఇంటిపని చెప్పేదాన్ని. మా బాబుని మాత్రమే షాప్‌కి పంపేదాన్ని. ఇప్పుడు అలా కాదు. బాబుని కూడా ఇంటిపనులు చేయమని చెబుతున్నాను. ‘నేనెందుకు చేయాలి, ఆమె చేయవచ్చు కదా’ అని ఒకరోజు నా కొడుకు నాకు ఎదురు తిరిగాడు. ‘ఆమె ఈ పని కేటాయించుకుని రాలేదు’ అని అతనికి చెప్పాను నేను’ అన్నది గౌసియా. నా వెన్ను నిటారుగా నిలబడిరది ఆ మాటతో.
అటువంటి హిజాబ్‌ వేసుకున్న గౌసియా భూమిక పత్రికను తనతో పాటుగా ఇంటికి పట్టుకెళ్ళింది. అలానే భూమిక పనిచేస్తున్న ప్రతి బస్తీలో ఈ మ్యాగజైన్‌ వెళ్తుంది. అక్కడ మీటింగ్‌కు హాజరైన మహిళలు దీన్ని చదువుతున్నారు. మందుగుండు జమ అవుతుంది. ఇదొకరోజు పితృస్వామ్యంపై పేలుతుంది.
విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు, రచయితలు, స్త్రీవాదులు, స్త్రీ హక్కుల కొరకు పోరాడుతున్న యోధులు, విద్యార్థులు వీరంతా కాకుండా క్వీర్‌ వ్యక్తులకు, బస్తీలలో మహిళలకు కూడా భూమిక చేరుతోంది.
కానీ ఇది సరిపోతుందా?
ఈ మూడు పదుల ప్రౌఢకు ఇంకా పోషణ అందవలసి ఉంది. మరిన్ని పరిశోధనా వ్యాసాలు చేరాలి. వ్యక్తిగత అనుభవాలు పంచుకోగలగాలి. ఇంటర్‌సెక్షనల్‌ దృక్కోణం ఇంకా ఇంకా పెంచుకోవాలి. జీవితాల నుండి వచ్చే కథలు పెరగాలి. అంతర్జాలలో చురుకుగా చేయగలగాలి. అందుకు అన్ని దిశల నుండి గొంతులు వినిపించాలి, చేతలు కలవాలి.
` ఆపర్ణ తోట

Share
This entry was posted in స్పందన. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.