గమనమే గమ్యం -ఓల్గా

ఎన్నికల రాజకీయాలలో అన్నపూర్ణ వంటి స్త్రీలను ప్రవేశించనిచ్చే ఉద్దేశం కాంగ్రెస్‌ నాయకులకు లేదు. ఎన్నికల రాజకీయాలు కాక మరో రాజకీయ కార్యక్రమమూ లేదు. ఆంధ్ర రాష్ట్రం వచ్చేవరకూ ఏదో ఒక పని కల్పించుకునేది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత శారదా నికేతన్‌కి

వెళ్ళటం, లక్ష్మీబాయమ్మ గారి ఆరోగ్యం చూసుకోవడం, ఖద్దరు అమ్మటం, వినోబా మొదలెడుతున్న సర్వోదయా ఉద్యమం గురించి తెలుసుకోవటం తప్ప పెద్ద పనులేవీ లేవు. అందువల్ల అన్నపూర్ణకు ఇంటి ధ్యాస, కుటుంబం గురించి ఆలోచనలు ఎక్కువయ్యాయి. కానీ స్వరాజ్యం ఆమె చేతికి అందటం లేదు.
‘‘స్వరాజ్యానికి పెళ్ళి చెయ్యొద్దా’’ అని అబ్బయ్య నడిగితే…
‘‘డాక్టర్‌గారి నడిగిరా మంచి సంబంధాలున్నాయేమో’’ అని నవ్వేవాడు.
‘‘ఈ శారద ఇన్నాళ్ళకు నన్ను అశాంతిపాలు చేస్తోంది చూడండి చిత్రం’’ అనేది అన్నపూర్ణ.
‘‘నువ్వూ, నీ కూతురూ చెరో విధంగా మారారు. దానికి డాక్టర్‌ గారిని ఆడిపోసుకోకు’’ అని మందలించేవాడు అబ్బయ్య. మళ్ళీ శారదను కలిసినపుడు ఇద్దరూ అతుక్కుపోయేవారు. రాజకీయ జీవితం లేకుండా బతకటం బాగోలేదని, దాన్నించి బైటపడటం ఎట్లాగనీ చర్చించుకునేవారు.
బెజవాడ, కృష్ణాజిల్లా నుంచి కవులు, కళాకారులు 1950 నుంచే మద్రాసు వెళ్ళటం మొదలైనా 55 నాటికి బాగా పెరిగింది. జనరల్‌గా జరిగే సాహిత్య కార్యక్రమాలు బాగా తగ్గాయి. మొత్తం మీద ఒక ఉత్తేజ రహిత వాతావరణం కమ్ముకుంది. లక్ష్మణరావు మెల్లీ కూడా బెజవాడ నుండి వెళ్ళిపోతున్నారనే వార్త శారదను కలవరపరిచింది. వాళ్ళు మాస్కో వెళ్తున్నారు. సరస్వతి ఒక్కతే బెజవాడలో శారదలా స్థిర నివాసం… గోరాగారి నాస్తికోద్యమం, ఇతర రాజకీయ కార్యక్రమాలు సాగుతూనే ఉన్నాయి. కమ్యూనిస్టులు కొందరు పార్టీని వదిలి కాంగ్రెస్‌లో చేరారు. వారిలో నారాయణరాజు ఒకడు. అతను శారదను కూడా చేరమని చెప్తూ వస్తున్నాడు.
‘‘ఇదేం కొత్తకాదు గదా డాక్టర్‌గారు. గతంలో ఎన్నిసార్లు మనం ప్రచ్ఛన్నంగా కార్రగెస్‌లో పనిచేసి మన తీర్మానాలు అక్కడ నెగ్గించుకోలేదు. మన కార్యక్రమాలకు దేశవ్యాప్త ఆమోదం సంపాదించలేదు. ఆలోచించండి’’ అంటూ చెప్తుండేవాడు.
1956లో ఆంధ్ర రాష్ట్రం కాస్తా ఆంధ్రప్రదేశ్‌ అవటంతో హైకోర్టు హైదరాబాద్‌కు మారుతుందని అందరికీ అర్థమైంది. మూర్తికి ఇంకా త్వరగా అర్థమైంది. హైదరాబాద్‌కు మారితే మంచిదని అతనికి అనిపించింది. బెజవాడ నుంచి తను కదిలేది లేదని శారద తెగేసి చెప్పాక మూర్తి తను హైదరాబాదులో తన న్యాయవాద వృత్తిని కొత్తగా మొదలు పెడతానన్నాడు. మద్రాసు నుంచి తన కుటుంబాన్ని కూడా హైదరాబాద్‌ మార్చాలనుకుంటున్నానంటే శారద అలాగే చెయ్యమంది. దానికి కావలసిన ఏర్పాట్లు చేసింది. మూర్తి కూతురు కళ్యాణి అప్పుడప్పుడు మద్రాసు నుంచి బెజవాడ వచ్చి శారద ప్రేమను పొంది వెళ్తుండేది. శారద ఆ అమ్మాయినంత ఆదరించటం, స్వంత కూతురిలా ప్రేమించటం చుట్టుపక్కల వాళ్ళకు అర్థమయ్యేది కాదు. ఒకరిద్దరు లోపలి ఆరాటం ఆపుకోలేక ఏదో ఒకటి అనేవారు.
శారద నవ్వి వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకు మనుషులెలా ఉండాలి కుటుంబ సంబంధాలు ఎంత సంకుచితంగా ఉన్నాయి, అవి ఎలా మారాలి అని ఓపికగా చెప్పేది.
వాళ్ళలో కమ్యూనిస్టు పార్టీ వాళ్ళో సానుభూతి పరులో ఉంటే వాళ్ళకు మరింత లోతుగా మానవ సంబంధాల గురించి వివరించేది.
కాలం నెమ్మదిగా గడుస్తోంది. సుబ్బమ్మ ఆరోగ్యం మందగించి నీరసంగా ఉంటోంది. ఈ ఒకటి రెండేళ్ళలో జరిగిన సంఘటనలు ఆమెను ఎక్కువగానే కుంగదీశాయి. శారద కూడా నటాషా గురించి, సుబ్బమ్మ గురించి శ్రద్ధ తీసుకుంటోంది. అలాంటి రోజుల్లో శారద మద్రాసు ప్రయాణం తలపెట్టాల్సి వచ్చింది. కోటేశ్వరికి ఆరోగ్యం బొత్తిగా బాగోలేదనీ, శారదను తప్పకుండా రమ్మని పదేపదే అడుగుతోందనీ ఫోన్‌ వచ్చింది. ప్రాక్టీసు బాగా పుంజుకుంటున్న రోజులు. నాలుగు రోజులు ఊళ్ళో లేకపోవటం అంటే అంత తేలిక కాదు. కాన్పు కేసులు వదిలి వెళ్ళలేదు. మొదటినుంచీ శారద దగ్గర చూపించుకున్న వాళ్ళు సమయానికి శారద లేకపోతే భరించలేరు. ఎన్నో సర్దుబాట్లు చేసుకుంటే గాని శారదకు మద్రాసు ప్రయాణం కుదరలేదు. అప్పటికి ఫోన్‌ వచ్చి నెల దాటింది. కోటేశ్వరి జీవించే ఉందనే నమ్మకంతోనే వెళ్ళింది శారద. శారద నమ్మకం నిజమే గానీ కోటేశ్వరిని చూడగానే రోజులలో ఉందని అర్థమైంది శారదకు. తను ఇప్పటికైనా వచ్చి మంచిపని చేశాననుకుంది. కోటేశ్వరి జబ్బు, జరుగుతున్న వైద్యం అన్నీ వివరంగా తెలుసుకుంది. అంతా బాగానే ఉంది గానీ జబ్బు తగ్గేది కాదు.
కోటేశ్వరి పక్కనే కూర్చుని ‘‘విశాలాక్షికి కబురు పంపారా?’’ అని అడిగింది.
ఎవరూ సమాధానం చెప్పలేదు. ‘‘ఏం అమ్మా. విశాలాక్షికి కబురు పంపనా?’’ అనడిగింది. కోటేశ్వరి వద్దన్నట్లు తల అడ్డంగా ఊపింది.
‘‘నన్నూ, నా వృత్తినీ, తన పుట్టుకని చీదరించుకు పోయింది. ఏంటమ్మా దాంతో నాకు సంబంధం. ఇన్నాళ్ళు లేనిది చచ్చేముందు కావలించుకుంటే వస్తుందా? మా బతుకులిట్టా ఎళ్ళమారిపోవాల్సిందే. వద్దు గానీ… నేనప్పుడు చెప్పానే నా డబ్బు మంచి పనులకు పంచిపెట్టాలని… ఆ టైమొచ్చింది. డబ్బు నీ చేతికిస్తాను. నువ్వు నాగరత్నమ్మకీ, దుర్గమ్మకీ ఇచ్చిరా. తల్లీ… ఈ పుణ్యం కట్టుకో. నీ చేతుల మీదుగా ఇప్పించాలనే నిన్ను పిలిపించమని వీళ్ళ ప్రాణాలు తీశాను. బంగారు తల్లివి, వచ్చావు. ఈ పని ఒక్కటీ చెయ్యమ్మా’’ అని శారద చేతులు పట్టుకుంది.
‘‘మంచి పని చెయ్యమంటూ ఇంత బతిమాలతావేంటమ్మా. ఈ పని నా చేతుల మీదుగా జరగటం నా అదృష్టం. వెంటనే ఆ పని చేస్తాను. దుర్గాబాయిదేముంది, ఆంధ్ర మహిళా సభకు వెళ్ళి ఇచ్చి రావటమే. నాగరత్నమ్మ గారి దగ్గరకు వెళ్ళటమే కష్టం. దూరం కదా… రైలు టిక్కెట్టు దొరకాలి…’’
‘‘ఎందుకు రెండు కార్లున్నాయి. దర్జాగా కార్లో వెళ్ళమ్మా’’ అని ఎవరినో పిల్చి ‘‘కారు, డ్రైవరూ సిద్ధంగా ఉన్నారా’’ అని అడిగింది.
మరో గంటలో కారులో దుర్గాబాయి దగ్గరకు వెళ్ళి కోటేశ్వరి ఇచ్చిన డబ్బు ఇచ్చి రసీదు తీసుకుంది.
ఆంధ్ర మహిళా సభ అంతా ఒకసారి కలియదిప్పింది దుర్గాబాయి. దుర్గాబాయికున్న ముందు చూపును, ఆ సంస్థ మీద ఆమెకున్న ప్రేమనూ, ఆ సంస్థ నడుస్తున్న తీరునూ శారద మనస్ఫూర్తిగా ఆనందించింది.
‘‘ఇదుగో… మీ ఏలూరు నుంచే వచ్చిందీ అమ్మాయి. మహా తెలివైనది, చురుకైనది.’’
చురుకుదనంతో మెరిసిపోతున్న ఒక అమ్మాయిని చూపింది దుర్గ.
‘‘మా ఏలూరేంటి?’’
‘‘నువ్వు పోటీ చేశావుగా, ఓడిపోయావనుకో. మాలతీ… శారదాంబ గారు తెలుసా? అప్పటికి నీకు ఓటు లేదేమో…’’ అంది దుర్గ.
‘‘శారదాంబ గారిని చూశానండి, ఎన్నికలప్పుడే. నేనప్పుడు స్కూల్‌ ఫైనల్లో ఉన్నాను. నమస్కారమండి’’ అంది ఆ యువతి.
‘‘చాలా మంచి అమ్మాయి. వీళ్ళాయన నాగేశ్వరరావు అని రచయిత, జర్నలిస్టు. వీళ్ళిద్దరూ భవిష్యత్తులో చరిత్ర సృష్టిస్తారు’’ అంది దుర్గ మాలతి భుజం తడుతూ.
‘‘అదంతా దుర్గాబాయమ్మ గారి అభిమానం. కొన్ని విలువలతో బతకగలిగితే చాలనుకుంటున్నాం’’ అంది మాలతి వినయంగా నవ్వుతూ. ఆ అమ్మాయి భుజం తట్టి ముందుకు నడిచింది శారద.
మర్నాడు తెల్లవారురaామునే శారద తంజావూరు దగ్గర తిరువాయూరుకి ప్రయాణమైంది. సాయంత్రమవుతుండగా ఆ ఊరు చేరింది. ఆ సమయంలో ఆవిడ కావేరీ నది ఒడ్డున ఉన్న త్యాగరాజస్వామి ఆలయంలోనే ఉంటుందని తెలుసుకుని సరాసరి అక్కడికే వెళ్ళింది. ఆ ఊరు చిన్నదే గాని ముచ్చటగా ఉంది. నదికి దగ్గరగా అంత విశాలమైన స్థలంలో చిన్న ఆలయం నిర్మించటానికి ఒంటిచేత్తో పనిచేసిన నాగరత్నమ్మ గారి పట్టుదలకూ, త్యాగరాజస్వామి మీద ఆమెకున్న ప్రేమకూ శారద నిండు మనసుతో చేతులెత్తి నమస్కరించింది.
తనను తాను పరిచయం చేసుకుని వచ్చిన పని చెప్పింది. నాగరత్నమ్మ సంతోషంతో శారదను దీవించింది.
త్యాగరాజస్వామి దగ్గర దీపం వెలిగించి నమస్కారం చేసింది. అక్కడే కూర్చున్నారు కాసేపు ఇద్దరూ.
నాగరత్నమ్మ గారు అప్రయత్నంగా గొంతెత్తి రాగాలాపన అందుకున్నారు.
‘‘ఏ పనికో జన్మించి తినని నన్నెంచవలదు, శ్రీరామ! నే
నే పనికో జన్మించితినని…
శ్రీపతి! శ్రీరామచంద్ర! చిత్తమునకు తెలియదా?
ఏ పనికో జన్మించితినని నన్నెంచవలదు’’
ఆవిడ పాడుతుంటే శారద తన అదృష్టాన్ని నమ్మలేకపోయింది. తన ఒక్కదాని ఎదుట, త్యాగరాజాలయంలో, కావేరీ ఒడ్డున ఆ సంగీత నిధి పాడుతుంటే శారద మనసు పులకించిపోయింది. కళ్ళవెంట నీళ్ళు కారాయి. మనసులో ఆ కీర్తననూ, ఆ వాతావరణాన్ని, ఆ కావేరిని గాఢంగా ముద్రించుకుంది.
శారదాంబ వివరాలన్నీ ఒక్కొక్కటే ఓపికగా అడిగి తెలుసుకుంది నాగరత్నమ్మ. శారదకు కూడా ఎంతో సంతోషంగా తన గురించి ఆమెకు చెబుతుంటే తనేమిటి, ఎవరు, ఏం చేస్తోంది? అనే విషయాలు కొత్తగా తను కూడా తెలుసుకుంటున్నట్లు అనిపించింది. అదొక వింత అనుభూతి అయింది.
‘‘ఈ రాత్రికి మా ఇంట్లో ఉండి రేపు వెళ్దువు గాని రా’’ అని అక్కడి నుంచి శారదను ఇంటికి తీసుకెళ్ళింది.
ఇంటికి వెళ్ళాక శారద స్నానం, భోజనం చేసి కూర్చున్న తర్వాత ‘‘ఈ పుస్తకం చూశావా’’ అంటూ ‘‘రాధికా స్వాంతనము’’ అనే కావ్యాన్ని శారద చేతిలో పెట్టింది. ముద్దు పళని రాసిన కావ్యం అది. పుస్తకం తెరిచి ముందుమాట చదివింది.
చాలా అలజడి. ఆనందం. కలవరం…
ముద్దు పళని వేశ్య కాబట్టి వీరేశలింగం గారు ఆమె రాసిన కావ్యం నిండా పచ్చి శృంగారముందని విమర్శిస్తే… దానికి నాగరత్నమ్మ గారిచ్చిన సమాధానం ఆ ముందుమాటలో ఉంది.
ఆ మాటలలో ఎంతో అర్థముంది. ఆలోచించటానికెంతో ఉంది. అది పక్కన బెడితే నాగరత్నమ్మ ధీరత్వానికి ఆశ్చర్యపోయింది శారద… సాహసవంతురాలని అందరూ చెప్పుకునే శారద.
వీరేశలింగం గారి వంటి పండితుడిని, సంస్కర్తను, ప్రజాభిమానం ఎంతగానో పొందినవాడిని అట్లా పది వాక్యాలలో కడిగివేయటానికి ఎంత సాహసం, ఎంత పాండిత్యం కావాలి? నాగరత్నమ్మ గాయకురాలనే ఇన్నాళ్ళూ అనుకుంది శారద. ఆమె మేధస్సు, విద్య, విమర్శనా శక్తి, సాహసం తెలియదు. స్త్రీలను మేధావులుగా గుర్తించరని బాధపడే తనెంత గుర్తిస్తోంది.
కోటేశ్వరి, విశాలాక్షి గుర్తొచ్చారు. కులం, కుల వృత్తులు, వీటి ఆవిర్భావం వీటి గురించి ఆలోచించటానికి ఎంతో ఉందనిపించింది శారదకు. కులాలు పోవాలనటం తప్ప కుల అస్తిత్వం గురించి ఆలోచించటం లేదు. ఆ దిశగా ఆలోచించటానికెంతో ఉంది. కోటేశ్వరి, విశాలాక్షి నిశ్శబ్ద యుద్ధం చేశారు. నాగరత్నమ్మ, ముత్తు లక్ష్మీ రెడ్డి బహిరంగంగానే ఆ పని చేశారు. అయినా ఇంకా తేలాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. జాతి, కులం మామూలు విషయాలు కాదు. కుల నిర్మూలన అంటున్న అంబేద్కర్‌ రాసిన విషయాల గురించి జరగాల్సిన చర్చ జరగటం లేదు. కమ్యూనిస్టులూ పట్టించుకోవటం లేదు. ఎలా ఎక్కడ నుంచి… ఆర్థికమా, సాంఘికమా, సంస్కృతా, వృత్తులా… శారద మనసు ఆ రాత్రి అనేక విషయాలతో అల్లకల్లోలమయింది. నిద్ర పట్టలేదు. తెల్లవారి ఎర్రని కళ్ళతో నిద్రలేచి స్నానం చేసి తల దువ్వుకుంటుంటే నాగరత్నమ్మ గారి కీర్తన మధురంగా, శాంతంగా వినిపించింది.
శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళ నయన
దాంతునికైన వే ` దాంతునికైన
శాంతము లేక సౌఖ్యము లేదు
దార సుతులు ధన ధాన్యములుండిన
సారెకు జప తప సంపద గల్గిన
శాంతము లేక సౌఖ్యము లేదు
ఆగమ శాస్త్రములన్నియు జదివిన
బాగుగ సకల హృద్భావము దెలిసిన
శాంతము లేక సౌఖ్యము లేదు
శారద నాగరత్నమ్మ గారి పక్కన జేరి తాళం వేస్తూ తనూ మెల్లిగా గొంతు కలిపింది.
యాగాధికర్మము లన్నియు జేసిన
భాగవతులనుచు బాగుగ బేరైన
శాంతము లేక సౌఖ్యము లేదు
రాజాధిరాజ! శ్రీ రాఘవ త్యాగ
రాజ వినుత సాధురక్షక తనకుప
శాంతము లేక సౌఖ్యము లేదు`
కీర్తన పూర్తయ్యేసరికి శారద మనసు ప్రశాంతమయింది. ఆమెకు నమస్కారం చేసి బయల్దేరింది.
దారంతా కోటేశ్వరికి నమస్కారాలు చెప్పుకుంటూనే ఉంది తనకు ఈ అనుభవాన్నిచ్చినందుకు.
కోటేశ్వరికి రెండు రసీదులూ ఇచ్చి ఆ సాయంత్రమే బెజవాడ రైలెక్కింది.
బెజవాడ చేరిన రెండు రోజులకే కోటేశ్వరి చనిపోయిందని ఫోను వచ్చింది.
తను సరైన సమయానికి వెళ్ళగలిగినందుకు సంతృప్తిగా అనిపించింది. విశాలాక్షికి ఫోను చేద్దామా వద్దా అని ఆలోచించి చివరికి రాత్రికి ఫోను చేసి చెప్పింది.
‘‘అలాగా… జబ్బేమిటి’’ పొడిపొడిగా వివరాలడిగి తెలుసుకుంది విశాలాక్షి.
ఆ ఫోన్‌ పెట్టేశాక విశాలాక్షి ఏడ్చిన ఏడుపు శారద ఊహించనిది.
ఎమ్మెస్సీ పూర్తవుతూనే స్వరాజ్యం విశాఖపట్నం ఎ.వి.యన్‌. కాలేజీలో ఉద్యోగం సంపాదించింది. ఉద్యోగంలో చేరటానికి ముందు ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళమని అన్నపూర్ణ ఉత్తరాలు తీవ్రంగా రాసీ రాసీ విసుగెత్తిన తర్వాత ముందు బెజవాడ వచ్చి పెద్దమ్మనూ, పెదనాన్ననూ, నటాషానూ చూసి ఆ తర్వాత గుంటూరు వస్తానని స్వరాజ్యం నుండీ సమాధానం వచ్చింది. అన్నపూర్ణకు ఏదో అనుమానం తోచింది గానీ అది అబ్బయ్యతో కూడా పంచుకోలేదు. ‘‘స్వరాజ్యాన్ని నాలుగు రోజుల్లో పంపు తల్లీ’’ అని నిష్టూరంగా శారదకో ఉత్తరం రాసి ఊరుకుంది.
స్వరాజ్యం వస్తుందంటే ఇంట్లో అందరికీ ఆనందమే. స్వరాజ్యానికి ఎవరితో ఉండే పనులు వారితో ఉంటాయి. వచ్చి ఒకరోజు అలసట తీర్చుకున్న తర్వాత శారద ఒంటరిగా ఉన్నపుడు తన మనసులో మాట బైట పెట్టింది.
‘‘పెద్దమ్మా నేను పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను’’
‘‘ఔనా…మరి రాగానే చెప్పలేదేం. మీ అమ్మానాన్నకు చెప్పావా? ఎవరతను? ఏం చేస్తాడు?’’ స్వరాజ్యం అనుకున్నంత ఆనందమూ ప్రకటించలేదు. హడావిడీ చెయ్యలేదు శారద.
‘‘నాకు సీనియర్‌ యూనివర్శిటీలో. విశాఖ పోర్టు కార్మికుల సంఘంలో పనిచేస్తున్నాడు. కమ్యూనిస్టు. మా కులం కాదు. మా పెళ్ళి నువ్వే చెయ్యాలి.’’
శారద ముఖంలో అప్పుడు ఆనందం నిండిపోయింది. స్వరాజ్యాన్ని దగ్గరకు లాక్కుని ‘‘నీ పెళ్ళి నేనెందుకు చేస్తాను. మీ అమ్మ నన్ను బతకనిస్తుందా? మీ అమ్మా నాన్నలను అంత తక్కువ అంచనా వెయ్యకు. కమ్యూనిస్టనీ, కులాంతరమనీ వాళ్ళేమీ అభ్యంతరం పెట్టరు. ఇవాళ సాయంత్రం మనిద్దరం గుంటూరు వెళ్దాం పద. అసలు నువ్వొక్కదానివే వెళ్ళి చెప్తే మంచిది. నా మీద నా కూతురు నమ్మకం ఉంచిందని మీ అమ్మ సంతోషపడుతుంది. వెళ్ళరాదూ?’’
స్వరాజ్యం ఆలోచనలో పడిరది.
‘‘వెళ్తాను. కానీ రేపు సాయంత్రానికి మీరు రావాలి’’ అంది స్వరాజ్యం.
‘‘అలాగే వస్తా. నువ్వు వెళ్ళి మూట విప్పెయ్‌’’ అని ప్రేమగా నవ్వింది. స్వరాజ్యాన్ని గుంటూరు పంపి తల్లితో ఈ కబురు చెప్పి ఆ తర్వాత సరస్వతికి కబురు పంపి మర్నాడు అందరూ కలిసి గుంటూరు వెళ్ళాలని మనసులో అనుకుంది. ఇంతలో ఆస్పత్రి నుంచి కబురొచ్చింది అర్జంటు కేసని. ఇలా వెళ్తున్నానని ఒక కేకైనా వేయకుండా చెప్పులు వేసుకుని వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంటికి వచ్చేసరికి రాత్రి పదయింది. స్వరాజ్యం వెళ్ళిపోయినట్లుంది. లేకపోతే శారద కోసం ఎదురు చూస్తూ వరండాలో కూచుని ఉండేది. శారద తల్లి నిద్రపోతూ ఉంటుందనుకుంటూనే సుబ్బమ్మ గదిలోకి వెళ్ళింది. ఆమె నిద్ర పోతోంది. నిద్రలో అమాయకంగా, నవ్వు ముఖంతో ప్రశాంతంగా ఉన్న తల్లిని చూస్తే శారదకు గుండెల్లో నుంచి ప్రేమ పొంగుకు వచ్చింది. నెమ్మదిగా ఆమె మీదికి వంగి నుదుటి మీద మెల్లిగా పెదవులాన్చింది. శారద పెదవులు ఒక్క క్షణం ఆ నుదుటి మీదే గట్టిగా అద్దుకున్నాయి. శారద చటుక్కున లేచింది. ఒక్క క్షణం భయ సందేహాలతో అలాగే చూసింది. చేయి పట్టుకునే సరికి అర్థమైపోయింది. తల్లి పక్కనే కూలబడి పోయింది శారద. మనసంతా నిరామయమయింది.
‘‘నాకు చెప్పకుండా ఏ చిన్న పనీ చేసేదానివి కాదు. ఇంత పెద్ద పని చేశావేమిటమ్మా’’ అనుకుంది మనసులో.
కళ్ళవెంట నీళ్ళు కారుతున్నాయి. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. శారదకు ఎవరినీ పిలవాలనిపించలేదు. తల్లి ముఖం చూస్తూ, ఆమె చేతిని తన చేతితో నిమురుతూ అలాగే కూచుండిపోయింది.
తల్లి బోళా మనిషనీ, అంత సమర్థురాలు కాదనీ అందరూ అనుకుంటారు. కానీ చాలా తెలివైనదని తనకొక్కదానికే తెలుసు. సమాజంలో, ఇంట్లో వచ్చే మార్పులను చివరివరకూ అర్థం చేసుకుని ఆనందంగా వాటితో సహజీవనం చేసింది. తన చిన్న చిన్న ఆచార వ్యవహారాలకు కాస్త చోటుంచుకుంది. దేనికీ రొష్టు పడలేదు. కష్టాలు వస్తాయి పోతాయి అనుకుంది. జీవించటంలో అంతకంటే తెలివైన మార్గం ఏముంటుంది? ఎన్నెన్నో జ్ఞాపకాలు శారదకు.
తనమీద తల్లికున్న నమ్మకం ప్రేమ ఎన్ని సందర్భాల్లో అర్థమై గుండె తడయిందో అవన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకొస్తున్నాయి.
రేపటి నుంచీ అమ్మ కనిపించదు. తనివిదీరా తల్లి ముఖం చూస్తూ, అడ్డం పడుతున్న కన్నీళ్ళను తుడుచుకుంటూ అక్కడే కూచుంది.
రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో రోజూ సుబ్బమ్మను దొడ్లోకి తీసుకుపోయే ఆయా వచ్చి శారదనక్కడ చూసి ‘‘అమ్మా… ఏమైంది’’ అంది కంగారుగా.
‘‘అమ్మ వెళ్ళిపోయింది దుర్గా’’ అంటూ లేచి ఆ కబురు చెప్పవలసిన వాళ్ళకు చెప్పే పనిలో పడిరది.
మర్నాడు ఉదయం నుంచీ ఎందరో వచ్చి సుబ్బమ్మను చూసి, నమస్కరించి శారదను పలకరించి వెళ్తున్నారు. సాయంత్రం వరకూ బంధువులు, స్నేహితులు వస్తూనే ఉన్నారు. కానీ ఆపదలో, అవసరంలో వేళ కాని వేళల్లో వచ్చి సుబ్బమ్మ చేతి కింద నడిచే వంటగదిలో నిప్పు ఆరకుండా చేసిన ఎందరో రాలేదు. శారద కొందరు వస్తారని ఎదురు చూసింది. యువకులుగా ఉన్నప్పటి నుంచీ అమ్మా అంటూ పిల్చి ఆమె ఆప్యాయతను పంచుకున్న కొందరు చివరిసారిగా ఆమెను చూడటానికి వస్తారని ఎదురు చూసింది. రాలేదు. అన్నపూర్ణ, సరస్వతి శారదను ఒదలకుండా కూర్చున్నారు. ఆ తల్లీ కూతుళ్ళ అనుబంధం వీరిద్దరికీ బాగా తెలుసు. ఒక వైద్యురాలిగా మృత్యువుని అర్థం చేసుకోగలిగినా కూతురిగా ఆ వాస్తవాన్ని మింగడం శారదకైనా కష్టమేనని చాలామంది అనుకున్నారు.
ఆనాటి సూర్యాస్తమయంలో కలిసిపోయింది సుబ్బమ్మ.
శారద మనసింకా పచ్చిగా ఉన్నా స్వరాజ్యం పెళ్ళి గురించి అన్నపూర్ణతో మాట్లాడాలని తల్లి పోయిన వారం రోజుల్లోనే గుంటూరు వెళ్ళింది.
అన్నపూర్ణకు శారద వచ్చిన పని తెలుసు. కానీ తెలియనట్లే వేరే సంగతులు చెప్తూ పోయింది.
‘‘అవన్నీ ఆపవోయ్‌. స్వరాజ్యం పెళ్ళి సంగతేమిటి? మీరేమనుకుంటున్నారు?’’ అన్నపూర్ణ ముఖం వివర్ణమైంది.
‘‘నాకిష్టంలేదు శారదా. అబ్బయ్య అమ్మాయి ఇష్టం, నాదేం లేదంటున్నారు. నాకు కులం పట్టింపు లేదు. కానీ అలవాట్లలో, ఆచారాల్లో తేడాల వల్ల తర్వాత్తర్వాత సమస్యలొస్తాయని భయంగా ఉంది.’’
‘‘ఏ పెళ్ళిలోనైనా సమస్యలొస్తాయి. ఒస్తే ఎదిరిస్తాం గానీ సమస్యలొస్తాయని చేతులు ముడుచుకు కూచుంటామా?’’
‘‘నాకెలా చెప్పాలో అర్థం కావటం లేదు. హరిజనుల బాగు కోసం నేనూ పనిచేశా. కానీ ఒక హరిజనుడు అల్లుడవుతాడంటే ఒప్పుకోలేకపోతున్నా.’’
‘‘వాళ్ళూ నువ్వూ వేరు వేరనుకుని, వాళ్ళను నీకంటే తక్కువని, వాళ్ళను ఉద్ధరించటం మంచి పని, వాళ్ళకు మేలు చేస్తున్నాననీ నువ్వు హరిజనోద్యమంలో పని చేశావు. వాళ్ళను నీతో సమానమని అనుకోలేదన్న మాట. అదేంటోయ్‌… నువ్విలా ఉండటం ఏమీ బాగోలేదోయ్‌’’ అంది శారద.
అన్నపూర్ణ తలదించుకు కూచుంది.
స్వరాజ్యం తల్లి గురించి అవమానపడుతూ ముఖం ఎర్రగా చేసుకుంది. అబ్బయ్య సమస్య తనది కాదన్నట్లు ఏదో పుస్తకం తిరగేస్తూ కూచున్నాడు. ‘‘సరస్వతి కూతురు మనోరమ పెళ్ళి గుర్తులేదా? గాంధీ గారే చేయాలనుకున్నారు. ఆయన మరణించాక గాని అది కుదరలేదు. గాంధీ ఆశ్రమంలో నెహ్రు చేతుల మీద జరిగింది. వాళ్ళిద్దరూ ఎంతో బాగుంటారు. నాకు తెలిసి వాళ్ళకే సమస్యలూ లేవు. ఇప్పుడు లవణానికి జాషువా గారమ్మాయితో పెళ్ళి. ఎంత ప్రేమగా సంతోషంగా ఉన్నారు వాళ్ళు. అసలు ఎప్పట్నుంచి నువ్వు గాంధీగారి శిష్యురాలివి` నువ్వనాల్సిన మాటలేనా ఇవి?’’
‘‘మనోరమ సంజీవరావుల పెళ్ళికి గాంధీగారు ఎంత ఆలోచించారు. వాళ్ళిద్దరూ గాంధీ ఆశ్రమంలో ఏడాది పైగా కలిసి పనిచేసి ఒకర్నొకరు అర్థం చేసుకున్నారు. హేమలత జాషువా గారి సంస్కారం పంచుకుని పెరిగిన పిల్ల…’’
‘‘అమ్మా… నేనూ సుందర్రావూ రెండేళ్ళ నుంచీ ఒకరినొకరు అర్థం చేసుకున్నాం. సుందర్రావు నీకంటే చాలా సంస్కారవంతుడు’’ ఆవేశంగా అంది స్వరాజ్యం.
‘‘ఔను. నేనే సంస్కారం లేనిదాన్ని. హీనురాల్ని’’ అంటూ ఏడుపు మొదలెట్టింది అన్నపూర్ణ.
‘‘ఈ ఇంట్లో జరగవలసిన మాటలు కావివి. అన్నపూర్ణా! నాకసలు అర్థం కావటం లేదోయ్‌. ఆ అబ్బాయి బాగా చదువుకున్నవాడు. ఆ చదువుతో సంపాదించుకుని తానొక్కడే ఎదిగిపోవాలనుకోకుండా అందరి బాగు కోసం పని చేస్తున్నాడు. కులం కారణంగా నువ్వు… అన్నపూర్ణవి… కూతురి ప్రేమను ఒప్పుకోవటోయ్‌…’’
‘‘ఆదర్శాల కోసం పెళ్ళిళ్ళు చేసుకోకూడదు’’ కఠినంగా అంది అన్నపూర్ణ.
‘‘పెద్దమ్మా…. నేను ఆదర్శాల కోసం చేసుకోవటం లేదు. సుందరం మా దరిద్రపు కమ్మ కులంలో పుట్టినా, బ్రాహ్మణ కులంలో పుట్టినా అతని సంస్కారం ఇదే అయితే నేనతన్ని ప్రేమించేదాన్ని. అతను హరిజనుడనీ, మా పెళ్ళి ఆదర్శమనీ నేను అనుకోవటం లేదు. అమ్మని అది నమ్మమనండి’’. స్వరాజ్యం తీవ్రతకు అందరూ భయపడ్డారు.
‘‘పెద్దమ్మా… ఈ కాంగ్రెస్‌ హరిజనోద్ధరణ ఒట్టి బూటకం. అందులో ఈ కమ్మ, రెడ్డి కాంగ్రెస్‌ వాళ్ళది మరీ బూటకం. నేను అమ్మమ్మగారి ఊరెళ్ళినపుడు చూశానుగా. వీళ్ళు కుర్చీలలో, మంచాల మీదా దర్జాగా కూర్చుంటారు. హరిజనులొచ్చి కింద కూచోవాలి. ఇళ్ళల్లోకి రానివ్వరు. మళ్ళీ బ్రాహ్మలు తమని వంటిళ్ళలోకి రానివ్వరని ఏడుస్తారు. వీళ్ళేమో అంటరానితనం పాటిస్తారు. మీరు కమ్యూనిస్టులు గాబట్టి మీరట్లా ఉండరేమో. కమ్మ బ్రాహ్మలు పెద్దమ్మా ఈ కాంగ్రెస్‌ వాళ్ళంతా…’’
అందరూ కాసేపు నిశ్శబ్దమై పోయారు. స్వరాజ్యం మాటల్లో నిజం అందరికీ తెలుసు.
శారద అంటరానితనం పాటించకూడదనే ప్రత్యేకమైన స్పృహతో ఉంటుంది. మహిళా సంఘంలో మరీ మరీ చెప్పింది, ఆచరింపచేసింది. ఐనా కొందరు కులాన్ని అధిగమించలేదనీ, స్వరాజ్యం చెప్పినవి కమ్యూనిస్టుల ఇళ్ళల్లో కూడా జరుగుతాయని శారదకు తెలుసు. కానీ అన్నపూర్ణ ఇంత సంకుచితంగా ఆలోచిస్తుందని అసలు అనుకోలేదు.
‘‘అన్నపూర్ణా… అంబేద్కర్‌ రైటనిపిస్తోంది. కుల నిర్మూలనే జరగవలసిన మొదటి పని, తర్వాతే మిగిలిన విషయాలు, కులాంతర వివాహాల వల్లనే కులం లేకుండా పోతుందని ఆయన చెప్పిన మాటల్లో ఎంత నిజం ఉందో నాకివాళ అర్థమవుతోంది. నీకే ఇంత వ్యతిరేకత ఉంటే ఇక మామూలు వాళ్ళ సంగతేంటి?’’
‘‘నాకిప్పుడు దేశోద్ధారణ గురించి ఉపన్యాసం ఇవ్వకు శారదా… నా కూతురి భవిష్యత్తు నాకు ముఖ్యం.’’
‘‘నీ కూతురి భవిష్యత్తు, దేశ భవిష్యత్తు వేరని ఎందుకనుకుంటున్నావు?’’ అబ్బయ్య కలగజేసుకున్నాడు.
‘‘ఇది మాటలతో, వాదనలతో పరిష్కారమయ్యే సమస్య కాదు డాక్టర్‌ గారు. ఇవన్నీ అనవసరం. స్వరాజ్యం మేజర్‌. స్వతంత్రురాలు. అది వెళ్ళి దానిష్టం వచ్చిన పెళ్ళి చేసుకోవచ్చు.’’
‘‘థాంక్స్‌ నాన్నా. తేల్చి చెప్పావు. పెద్దమ్మా… నేనూ నీతో వస్తాను ఉండు’’ అని బట్టలు మార్చుకుని వచ్చింది.
అన్నపూర్ణ మాట్లాడకుండా కూర్చుంది. వారించలేదు.
‘‘పద పెద్దమ్మా’’ అని స్వరాజ్యం తొందర చేస్తోంది.
‘‘ఏంటోయ్‌ ఇది. ఈ పిచ్చి, ఈ మూర్ఖత్వం ఏంటి నీకు? స్వరాజ్యాన్ని దగ్గరకు తీసుకో. మీ ఇద్దరూ ఆనందంగా కూతురి పెళ్ళి చెయ్యండి. ఆనందంగా జరగాల్సిన పనిని అశాంతిమయం చేసుకోకండి.’’
ఎంత చెప్పినా అన్నపూర్ణ కరగలేదు.
చివరికి స్వరాజ్యం కట్టుబట్టలతో శారద వెంట ఆమె ఇంటికి వచ్చింది. శారద తన ఇంట్లో ఎన్నో కులాంతర వివాహాలు, దండల పెళ్ళిళ్ళు చేయించింది. కానీ అన్నపూర్ణ కూతురి పెళ్ళి ఇట్లా తన ఇంట్లో జరుగుతుందని అనుకోలేదు. అన్నపూర్ణ, అబ్బయ్య, శారద కుటుంబంలో వారేనని అందరూ అనుకుంటారు. వాళ్ళిద్దరూ రాకుండా వాళ్ళ కూతురి పెళ్ళి శారద ఇంట్లో జరగటం అందరికీ ఆశ్చర్యమే. తల్లి రాని లోటు తెలియకుండా స్వరాజ్యానికి తనే తల్లయింది శారద. సరస్వతి, గోరా, మెల్లీ, లక్ష్మణరావుల సహాయం ఉంది. సుందర్రావు కుటుంబం కూడా శారద ఇంట్లోనే దిగారు. సుందర్రావు తల్లిదండ్రులు సంకోచంతో దూరదూరంగా ఉంటే శారద వాళ్ళకు బెజవాడంతా తిప్పి చూపి, అందరి ఇళ్ళకూ తీసుకెళ్ళి, వాళ్ళందరి వద్దా వీళ్ళను గౌరవించి మొత్తానికి వాళ్ళ బెరుకు పోగొట్టింది.
సుందర్రావు బంధువులు పాతికమంది దాకా వచ్చారు. మరో పాతికమంది బెజవాడ మిత్రులు. గోరా గారి అధ్యక్షతన, శారద నిర్వహణలో ఆనందంగా జరిగిపోయింది.
పెళ్ళయిన మర్నాడే స్వరాజ్యం, సుందర్రావులు విశాఖపట్నం వెళ్ళిపోయారు. అన్నపూర్ణ గురించి ఆలోచిస్తుంటే శారదకు కులం ఎంత పెద్ద సమస్యో అర్థమయింది.
‘‘ఇన్నాళ్ళూ ఆడవాళ్ళే అన్నిటిలో అథమస్థానంలో ఉన్నారనుకున్నాను. మాల మాదిగలు, వృత్తి కులాల వాళ్ళు, అక్కడ స్త్రీలూ… అసలు జరగవలసిన పనంతా అక్కడే ఉంది. కులాలు లేనట్టు నటించటమే స్వతంత్రోద్యమం, కమ్యూనిస్టు ఉద్యమాలు నేర్పాయా? అంబేద్కర్‌ని మళ్ళీ చదవాలి’’ అనుకుంది శారద.
… … …
విశాఖపట్నం వెళ్ళి స్వరాజ్యాన్ని చూడాలి అనుకుంటూనే అయిదు నెలలు గడిచిపోయాయి. వెళ్ళి వాళ్ళకు కావలసిన సామాను కొనిచ్చి రావాలనేది శారద ఆరాటం. శారద రేపా మాపా అని ఆలోచిస్తుండగానే స్వరాజ్యం వచ్చేసింది.
ఉత్తరమన్నా రాయకుండా దిగిన ఆ పిల్లను చూస్తే శారదకు విషయం అర్థమయింది. ఐనా పైకేమీ మాట్లాడకుండా ‘‘ఎప్పటికప్పుడు విశాఖపట్నం రావాలనుకుంటూనే ఆలస్యమైంది’’ అంది శారద.
స్వరాజ్యం నవ్వి ‘‘పర్లేదులే పెద్దమ్మా. మేం బాగానే ఉన్నాం. ఏ అవసరం వచ్చినా నీకు ఉత్తరం రాయనా?’’ అంది.
శారద హాస్పిటల్‌కి బయలు దేరుతుంటే ‘‘నేనూ వస్తాను పెద్దమ్మా’’ అంది తప్పు చేసినట్లు.
ఇద్దరూ హాస్పిటల్‌కి వెళ్ళారు. శారద ఇన్‌పేషెంట్స్‌ని చూసి వస్తానని వెళ్ళింది. ఓ గంటలో కన్సల్టింగ్‌ రూమ్‌కి వచ్చేసరికి స్వరాజ్యం దిగులుగా కూర్చుని ఉంది.
‘‘ఎన్నో నెల?’’ శారద కుర్చీలో కూర్చుంటూ అడిగింది.
‘‘మూడో నెల అనుకుంటా’’
‘‘అనుకుంటా… బుద్ధిలేదూ? ఎమ్‌.ఎస్‌.సి. చదివావు. కాస్త జాగ్రత్త పడలేకపోయావా?’’
‘‘అబార్షన్‌ కుదరదా పెద్దమ్మా’’
‘‘మీరిద్దరూ కలిసే ఆ నిర్ణయానికొచ్చారా?’’
‘‘ఊ…’’ అంది స్వరాజ్యం.
‘‘నేను అబార్షన్‌కి వ్యతిరేకమూ కాదు, చెయ్యటం కష్టమూ కాదు. కానీ ఒక ఆలోచన వచ్చింది. నువ్వు కొడుకునో, కూతురినో కంటే మీ అమ్మా నాన్నల మనసు మారుతుందేమో. అట్లా జరిగిన కేసులు చాలా చూశాను’’ శారద స్వరాజ్యాన్ని పరిశీలనగా చూస్తూ చెప్పింది.
‘‘ఒద్దు పెద్దమ్మా. నేను పిల్లల్ని కనటం నా కోసం, నా ఇష్టంతో జరగాలి. మా అమ్మానాన్నల కోసం కాదు. అసలు నా కోసమో, నాకు పుట్టేవాళ్ళ కోసమో కాదు మా అమ్మ కులాంతర వివాహాన్ని ఒప్పుకోవాల్సింది. కుల విభజన తప్పనీ, మనుషులంతా సమానమనే నమ్మకం ఉండాలి మా అమ్మకు. ఆ నమ్మకం లేకుండా ఏదో కూతురనో, మనవడనో మమ్మల్ని దగ్గరకు తీస్తే అది మాకు ఏం గౌరవం? ముఖ్యంగా సుందర్రావుకి ఎంత అవమానం?’’
శారదకు స్వరాజ్యం మనసు అర్థమైంది. ఆ పిల్ల మీద ప్రేమ, అన్నపూర్ణ మీద కోపం, జాలి వీటితో కాసేపు ఏం మాట్లాడకుండా కూర్చుంది. స్వరాజ్యాన్ని పరీక్షగా చూసి…
‘‘నాలుగో నెల సగం పడినట్లుంది. అబార్షన్‌ అంత మంచిది కాదు. అజ్ఞానంగా ఉన్నందుకు కనాల్సిందే తప్పదు. నాదీ తప్పేలే… నీ పెళ్ళి అవగానే ఒక క్లాసు తీసుకోవాల్సింది. ఇద్దరూ చదువుకున్నారు గదా అని నిర్లక్ష్యం చేశాను. ఏమంటావు?’’
‘‘అనేందుకేముంది, నువ్వు చెప్పాక. ఈ ఒక్కర్నీ కని చెంపలేసుకుని ఆపరేషన్‌ చేయించుకుంటా’’ అంది స్వరాజ్యం చీరె సరి చేసుకుంటూ.
‘‘గుడ్‌’’ అని రక్తపరీక్ష చేయించుకోమని పంపింది. ఈ సంగతి అన్నపూర్ణకు చెబుదామని మనసు కొట్టుకుంటోంది. కానీ స్వరాజ్యం మాటలూ తీసివేయవలసినవి కావు.
అన్నపూర్ణ విషయంలో తనకింత ధర్మసంకటం రావాలా? జాతీయ, అంతర్జాతీయ రాజకీయ భేదాలున్న స్నేహానికి అడ్డం రానిది వ్యక్తిగత విషయంలో ఇంత గొడవ అయింది. మాటలు లేక ముఖాలు చూసుకోలేని పరిస్థితి వచ్చిందేంటి. వ్యక్తిగతం అనుకుంటున్నాం గానీ ఇది పెద్ద సామాజిక విషయం. కులం అన్నింటికంటే ముఖ్యమైన రాజకీయ విషయమేమో. స్వరాజ్యం మాటలు రాజకీయ పరిణితి ఉంటే తప్ప మాట్లాడలేనివి…
కాంపౌండర్‌ వచ్చి పేషెంట్లు చాలామంది ఉన్నారని చెప్పాక ఆ ఆలోచనలు పక్కన బెట్టి పనిలో పడిరది.
స్వరాజ్యం నాలుగు రోజులుండి విశాఖపట్నం వెళ్ళింది. ఆ తర్వాత వారం లోపలే అన్నపూర్ణ, అబ్బయ్య వచ్చారు. ఇద్దరూ పెద్ద జబ్బు చేసిన వాళ్ళలా ఉన్నారు.
శారదను చూడగానే అన్నపూర్ణ ఏడుపు మొదలెట్టింది. శారద ఆమెను సముదాయించి వివరం కనుక్కుంటే… అన్నపూర్ణ తన మూర్ఖత్వానికి పశ్చాత్తాప పడుతోంది. కూతురి దగ్గరకు వెళ్ళాలనుకుంటోంది. స్వరాజ్యం రానిస్తుందా? శారద సలహా కోసం వచ్చారు.
శారద మనసులోంచి పెద్ద భారం దిగింది.
‘‘తప్పకుండా విశాఖ వెళ్ళండి. ఐతే సరాసరి వెళ్ళి స్వరాజ్యాన్ని కావలించుకోవాలనుకోకుండా ముందు ఎక్కడైనా దిగి సుందర్రావుని కలిసి మీ మూర్ఖత్వానికి క్షమాపణ అడిగి అతను పెద్ద మనసుతో మిమ్మల్ని క్షమిస్తే అప్పుడు అతని వెంట వెళ్ళండి. ఘర్షణ జరిగింది నీకూ, నీ కూతురికీ గాని అందులో మీరు అవమానించింది సుందర్రావుని. అతని కుటుంబాన్నీ, వాళ్ళని కావలించుకునే సంస్కారమనూ, మరొకటనూ… అది మీకుందనుకుంటేనే వెళ్ళండి. అలా కాకుండా అయితే స్వరాజ్యం మిమ్మల్ని తన ఇంటికి రానివ్వదు.’’
కూతుర్ని విడిచి ఉండలేక రాజీపడుతున్నారా? కులం గురించి మీ అభిప్రాయాలు మారాయా? తేల్చుకుని వెళ్ళాల్సిన అవసరం గురించి శారద పదే పదే చెప్పాక వాళ్ళిద్దరికీ అసలు సమస్య ఎక్కడుందో అర్థమైంది.
సుందర్రావుని క్షమాపణ అడుగుతామన్నారు. విశాఖపట్నం వెళ్ళారు. అన్నపూర్ణతో స్నేహం కొనసాగే పరిస్థితి వచ్చినందుకు శారదకు చాలా తెరిపిగా ఉంది. విశాఖపట్నంలో అంతా సవ్యంగా జరగాలని మనసారా కోరుకుంది. శారద కోరుకున్నట్లే జరిగింది. సుందర్రావు పెద్ద మనసుతో అన్నపూర్ణను, అబ్బయ్యను ఇంటికి తీసుకెళ్ళాడు.

Share
This entry was posted in ధారావాహికలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.