నిత్యానంద స్వామి భలే చెప్తాడు. నాలో ఉన్న నేను నీలోను ఉన్నాను, అదే నేను, నీతో నువ్వు అనుకుంటూ భలే గందరగోళ పెట్టి ఇంస్టా రీళ్లలో, యూట్యూబ్‌లలో సాధారణ జనానికి కూడా కనిపించి బానే వినోదాన్ని అందించాడు.
అయితే అటువంటి వినోదాన్ని కాకపోయినా కాస్త పనికొచ్చే విజ్ఞానాన్ని అప్పుడప్పుడు ట్రైనింగ్‌లో మనం కూడా ప్రదర్శించమన్న మాట.
ఎలా అంటే, ఇలానే!
ఒక గవర్నమెంటు ఆఫీసులో ట్రైనింగు. ఇక తెలుసుగా అన్ని వయసుల వారు ఉన్నారు. వీరితో కాస్త జాగ్రత్తగా ఉండాలి. కుర్చీలు, కుర్చీల్లో హోదాలు, హోదాలపై నెలకొన్న వీరు. వీరికి చాలా గట్టి అభి ప్రాయాలు. పైగా ఎంతో కొంత పలుకుబడి ఉన్న కుర్చీలు. కాబట్టి ఏటికి ఎదురేగి సాగే ఈ శిక్షణలలో కాస్త జాగ్రత్తగా, తెలివివిగా చెప్పవలసి వస్తుంది.
సరే శిక్షణ మొదట్లో కాస్త సెక్స్, జెండర్, జెండర్ డైవర్సిటీ, జెండర్ మూసధోరణుల గురించి చెప్పాను. ముందు ఊహించినట్లే కాస్త విసుగు, కాస్త అనాసక్తత, కాస్త ఆసక్తి, కొంచెం ఉత్సాహం ఇలా రకరకాల ముఖాలు. టీ బ్రేక్‌లో అడిగాను. ఎలా ఉంది సెషన్? ఇంకా బాగా చెబితే బావుండు అనిపిస్తుందా? ఏమన్నా అనిపిస్తే చెప్పండి, అని.
ఒకాయన ఉన్నట్టుండి ఎత్తుకున్నాడండి. అసలివన్నీ వెస్ట్రన్ కాన్సెప్ట్స్ అండి. వేరే దేశాలనుండి దిగుమతి చేసుకున్న ఆలోచన ధోరణి. ఈ సేవ్‌ు సెక్స్ మ్యారేజ్ ఏంటండీ. అసలు ఎన్ని సమస్యలు వస్తాయి వీటన్నిటితోటి, అని. ఇంకా అడిగితే అసలు ఇది ప్రకృతికి విరుద్ధం అండి, ఒక ఆడ- మగ ఉండేది ఎందుకండీ సృష్టి ముందుకు సాగడానికేగా? భార్య ఇంటిలో ఉండి కుటుంబాన్ని చూసుకుంటే భర్త బయటకు వెళ్లి కుటుంబం కోసం సంపాదిస్తాడు. అసలైనా ఇది ఆఫీసు మాకు ఇవన్నీ తెలుసుకునే అవసరం ఏముంది? ఇలా సాగింది.
నాలో ఉన్న నేను కాస్త ఆవేశపడబోయినా, నాలో ఉన్న ట్రైనర్ అయిన నేను, ఆవేశపడే నన్ను ఆపుకుని, ఆయనలో ఉన్న నన్ను అంటే ఆయనను కాస్త ఆగమన్నాను.
సెషన్ మొదలైంది. ముందుగా జెండర్ సెన్సిటైజేషన్ ట్రైనింగ్ ఉద్దేశం గురించి మొదలుపెట్టాను. ఒకప్పుడు కంప్యూటర్ అంటే ఏంటో తెలీదు మనకి. కానీ ఇప్పుడు మనం స్మార్ట్ ఫోన్ లేకుండా బతకగలమా? అలాంటిదే ఈ శిక్షణ కూడా. ఈ రోజు మీకు ఇవన్నీ ఎందుకు అనిపించవచ్చు. కానీ ప్రపంచం ముందుకు సాగుతోంది. అందరికి జాగా ఇవ్వాలి, అందరూ ఎదగాలి అనుకుంటోంది. మిగిలిన వారు ముందుకు వెళ్ళిపోయి మీరు ఇక్కడే ఉంటే అది సరికాదు. ఒకప్పుడు సతి’, బాల్య వివాహాలు’
ఉండేవి. అప్పట్లో వారు అవన్నీ నమ్మే ఆచరించారు. ఇప్పుడు అవి చట్ట విరుద్ధమే కాదు. మనం సమర్ధించము కూడా. ఇది కూడా అంతే!
ఇక పితృస్వామ్యం గురించి సెషన్ మొదలైంది. పితృస్వామ్య వ్యవస్థలోని ధోరణుల గురించి, అక్కడ సాగే పద్ధతుల గురించి ఒక చార్ట్ తయారు చేసాము. అక్కడ ఆడవారి పై మగవారి ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. కనుక ముందు పితృస్వామ్యం లో మగవారి పై సాగే హింస గురించి మాట్లాడదామన్నాను.
1. ఇంటి పెద్ద అంటే మగవాడు చనిపోతే ఇంటి బాధ్యతలు ఎవరు మోస్తారు? కొడుకా, కూతురా?
2. ఇంటి పెద్ద అప్పులు చేసి ఉన్నట్టుండి అప్పులు తీర్చలేక చేతులు ఎత్తేసినా లేక చనిపో యినా తీర్చవలసిన బాధ్యత ఎవరిపై ఉంటుంది?
3. తల్లిని, భార్యని పోషించే బాధ్యత ఎవరిది? ఒకవేళ తల్లికి, భార్యకు పడకపోతే భర్తకు ఏ ఒకరితోనే ఉండే అవకాశం ఉంటుందా? అలా ఉంటే అతనిని ఏమంటారు?
4. అంగ స్థంభన వంటి ఇబ్బందులు ఉన్న మగవారిని ఎలా చూస్తారు? ఒకవేళ ఆరోగ్య రీత్యా పిల్లలు పుట్టించే సామర్ధ్యం లేని మగవాడిని ఏమంటారు? ఆరోగ్యకారణాల వలన లైంగిక చర్యలో పాల్గొనే సామర్ధ్యం లేని పురుషుడిని ఏమంటారు?
5. మగవారికి గట్టిగా ఏడ్చే స్వేచ్ఛ ఉందా? మృదువుగా ప్రేమగా లాలించే మగవాడిని ఎంత గౌరవంగా చూస్తారు?
6. పొట్టిగా, ఎక్కువ సంపాదించలేని, చీకటి అన్న, గొడవలన్న భయపడే మగవాడిని ఎలా చూస్తారు?
7. మగవారికి కూడా వంట పనులున్నా, ఇంటి పనులున్నా ఆసక్తి ఉండి ఉద్యోగానికి వెళ్ళడానికి ఇష్ట పడకపొతే ఏమంటారు?
8. మగవారికి భావోద్వేగాలుండవా? వారు వారి భయాలను, ఇబ్బందులను ఆడవారంతా సులువుగా పంచుకునే వెసులుబాటు ఉందా?
9. తండ్రి చనిపోతే తన కన్నా పెద్దవారైనా అక్కలున్నా వారికి పెళ్లి చేయవలసిన బాధ్యత తమ్ముడి పైనే ఎందుకు ఉంటుంది?
10. మేనమామగా అతనిపై ఎన్ని బాధ్యతలు
ఉంటాయి. అతని ప్రణాళిక లేకుండా పుట్టిన పిల్లలకు చేయవలసిన వేడుకలలో అతని పై భారం ఎందుకు పడుతుంది?
11. పండగకు ఆడపడుచులు పుట్టింటికి వచ్చినప్పుడు వారి కుటుంబంలో వారందరికి బట్టలు, కానుకలు పెట్టకపోతే ఏమంటారు?
ఈ ప్రశ్నలకు అలా అలా దిగిపోయారు అందరూ. ఇక అప్పుడు ఆడవారి ఇబ్బందుల గురించి దృష్టి సారించాం. ఇంత గౌరవం పొందే భారతనారి ఆఫీస్ ఫ్లోర్ చివర ఉన్న రెస్ట్ రూవ్‌ుకి వంటరిగా వెళ్తుంది. దాని వెనుక భద్రత లేకపోయే దుస్థితి గురించి మాట్లాడారు ఆడవారు. వ్యవస్థను మొత్తం శారీరకంగా దృఢంగా ఉన్న మగవారికి అనుకూలంగా నిర్మించడం గురించి మాటలు సాగాయి. పితృస్వామ్యాన్ని సంస్కృతి పేరుతో తలకెత్తుకున్న మహిళలు, పురుషులిద్దరిపై సాగే హింస గురించి ఆలోచించమన్నాను.
ఇక మన పురాణాలలోని బృహన్నల, శిఖండి, మోహిని అవతారాల గురించి మాట్లాడాను. పితృస్వామ్యంలో ఆడవారు, మగవారు, అతికొన్ని సందర్భాలలో హిజ్రాలకు కాక ఇంకెవరికన్నా చోటుందా? ఖజురహో, కోణార్క్ నుండి సాధారణ పాత గుడులపై ఉండే బూతు బొమ్మల ప్రస్తావనకు వచ్చాయి. అంటే ఇవన్నీ ఇటీవల వచ్చిన మాటలు కావుకదా? మన వేదాలలో 51 జెండర్‌లు ఉన్నా యట, కానీ కాలానుగుణంగా వీటిని గుర్తించడం మానేశారు అని విన్న విషయం చెప్పాను.
ఇహ తరవాత వచ్చిందండి ప్రకృతి విరుద్ధంపై చర్చ. ఇక్కడ కాస్త కాలరెత్తుకోవాలి మరి.
ఎందుకంటే బిడ్డలు పుట్టడానికి సృష్టి కార్యం అంటారు కదా? ఆడ- మగ అందుకే సృష్టించ బడ్డారు కదా?
మరి ఇద్దరు పిల్లలు పుట్టాక వేసక్టమీ చేయించుకోవడమేంటి? అది ప్రకృతి విరుద్ధం కాదా? దానికి బదులుగా సెక్స్ లో పాల్గొనడం నిలిపివేయొచ్చు కదా? మరి ఇద్దరు పిల్లలు చాలు అనుకున్నాక ఇంకా సెక్స్ అవసరం ఏముంది? అంటే అందులో సుఖం లేదా ఆనందం కోరుకున్నట్లే కదా? ఇక్కడ సెక్స్ అంటే పిల్లలు పుట్టే ప్రక్రియ మాత్రమే కాదని అర్థమవుతుంది కదా?
ఇక్కడ లేని ప్రకృతి విరుద్ధమైన చర్య సమలైంగికులలో ఉందని ఎందుకు నమ్ముతున్నాం. ఎందుకంటే వారు కూడా శారీరక సుఖం కోసమే వేరెవ్వరిని నొప్పించకుండా వారి భాగస్వాములతోనే కలిసి బంధం ఏర్పరచుకుంటున్నారు కదా?
కాబట్టి వారిలో ఉన్న ప్రకృతి వీరిలో కూడా ఉంది కాబట్టి వారు వీరు అని వేరేమీ లేదు. అంతా మనవారే, అన్ని ప్రేమలే, అంతా సంతోషాలే అని ముగించానన్న మాట.
కొసమెరుపు: పరువు పోతుందేమో అన్న భయం ఉన్నా, ఇందాక గర్జించిన పులిని మళ్లీ అడిగాను, ఏం సార్, ఒప్పుకుంటారా?. ఆయన సాలోచనగా తల పంకించారు. నేనివన్నీ ఆలోచించలేదు. నిజమే మేడం అన్నారు.
నేను ఇంక విజయోత్సాహంతో లేచాను.
తీయరా బండి!