‘భూమిక’ నడకా నడతా నవ్యత
‘భూమిక’ స్త్రీవాద పత్రికది మూడు దశాబ్ధాల సామాజిక సాహిత్య ప్రయాణం. విరామమెరుగని ఈ నడక స్త్రీల సాహిత్యానికి స్థానాన్నీ స్థాయినీ కల్పించిన భూమికకు జయ జయహోలు!
మహిళలలు తమ రచనలు పత్రికల్లో చూసుకోడానికి ఎన్నో న్యూనతల్నీ ఇబ్బందుల్నీ అవకాశలేములుగా ఎదుర్కొంటూ అలాంటి వాతావరణంలో మనకూ మన ఆలోచనలు వ్యక్తపరిచేందుకు ఒక పత్రిక ఉంది అని ఉత్సాహంతో రచనలు ప్రారంభించిన రచయిత్రులూ, పరిశోధక విద్యార్థులు, క్షేత్ర స్థాయిలో పనిచేసే వారూ ఎందరో ఉన్నారు. భూమికలో తమ రచన అచ్చైతే సంతోషం సంతృప్తి చెందిన వారూ ఉన్నారు. అనేక మజిలీల భూమిక ప్రయాణం నల్లేరు మీది నడక ఎంతమాత్రమూ కాదు. అడుగడుగునా ఎగుడు దిగుడు దారులు ఎదురయ్యాయి. కానీ కొత్త అన్వేషణలూ, ఆవిష్కరణలతో నడతను మెరుగుపరచుకుంటూ వచ్చింది.
‘భూమిక’తో మనకున్న రచనానుబంధాన్ని, ఏర్పడిన స్నేహ వంతెనలను గూర్చి మనమందరం సగర్వంగా ప్రకటించుకునేలా చేసింది ఆ బంధం. ‘భూమిక’ కలెక్టివ్ నిర్వహణలో వివిధ ప్రాంతాల క్షేత్ర పర్యటనలూ ఆ అనుభవాలూ ఎంతో అపూర్వమైనవి, స్ఫూర్తిదాయకమైనవి. అక్షరజ్యోతుల్ని వెలిగిస్తూ జ్ఞానకెంతుల్ని వెదజల్లుతూ, ఆత్మస్థైర్యాన్ని నింపుతూ ఆత్మీయతలను అల్లుకుంటూ చేసిన ఈ ప్రయాణాలన్నీ ఉజ్వలమైనవి.
‘భూమిక స్త్రీ వాద పత్రిక అన్ని లిఖించుకొని వేసిన మొదటి అడుగు సాహసోపేతమైనది. నిబద్ధతతో ఇన్నేళ్ళు అప్రతిహతంగా సాగిన పయనం శిఖరారోహణ అంతటి సాహసం. స్త్రీల పట్ల శ్రామికులపట్ల కరుడకట్టిన ఈ సమాజంలో అందరూ స్త్రీ హృదయంతో స్త్రీవాదులు కావాలన్నదే మనలో ఒక ఆశ, ఆశయం. కారణం స్రీవాదం సిద్ధాంత రాద్దాంతం కాదు నవ్యమానవతావాదం, సామాజిక సమతావాదం. ఆధిపత్యాలనూ, అహంకారాలనూ, పెత్తనాలనూ వ్యతిరేకిస్తూ నూతన సంఘధర్మాల నిర్మాణానికి తమ సర్వశక్తుల్నీ ధారబోసే ‘సర్వేజనాసుఖినోభవంతు’ సూత్రం ‘బహుజనహితాయ : బహుజన సుఖాయ’లకు ఆర్ధ్రతకూర్చే ఆచరణ మార్గం. శాంతిని ప్రపంచానికి వెలుగుల పూలమాలలుగా వేసే కదన గీతం. ‘భూమిక’ చారిత్రకంగా రసాత్మక కావ్యకాహళిగా స్త్రీవాదాన్ని పురోగమింపజేసిన కలం యోధ.
ఈ సమయాన స్త్రీవాదం విజయపథాన దారి చేసుకుంటూ సాగిపోయే ఒక పిడికిలి బిగింపుకు వేదికగా సమాజానికి నిత్య సచేతన ప్రాణశక్తుల్ని ఇచ్చే వనరుల్ని సంఘచేతన ద్వారా క్షేత్ర అక్షర పరిణితే విస్తృతుల ద్వారా నిరంతర ప్రవావాంలా నియమబద్ధంగా ఆమె పదం పదం కూర్చుతూ భూమిక నడిపిస్తూ నడిచిపోతూ ఉండటమే… ముప్పై సంవత్సరాల ఆత్మీయ స్నేహిత ‘భూమిక’ బాధ్యులకూ, మిత్రబృందాలకూ, మేధావులూ, రచయితలూ, స్త్రీవాదులకూ కరచాలనం చేస్తూ హృదయాంజలులు! చెలిమి చెలిమల చిలకరింపులు!
– అనిశెట్టి రజిత
…. ఙ ….