మన భూమిక ప్రామాణికమైన పత్రిక
గత 20సం॥లు పైగా ‘భూమిక’తో నాకు అనుబంధమున్నది అని చెప్పకోవడానికి సంతోషించే సందర్భమిది అని నేను భావిస్తున్నాను. అనేక ఆలోచనల, అనుభవాల మాలికగా వివిధ శీర్షికల రూపంలో పలకరించే ‘స్త్రీవాద పత్రిక భూమిక’ నాకెంతో సన్నిహితంగా
అనిపిస్తుంది. ముఖ్యంగా సంపాదకురాలు కొండవీటి సత్యవతి గారి సంపాదకీయం భూమికకు ప్రాణంగా అనిపిస్తుంది. సంపాదకీయాలన్నీ ఎప్పటికప్పుడు ప్రశ్నలను రేకెత్తింపజేసేవే. చైతన్యాన్ని కలిగించేవే. అలాగే కథలు, వ్యాసాలు, కవిత్వం, జీవితానుభవాలు, పుస్తక సమీక్షలు, పుస్తక పరిచయాలు, ఇంటర్వ్యూలు మొదలైనవన్నీ దేనికదే ఆయా విషయాలపట్ల ఆసక్తిని, అవగాహనను కలిగించే విధంగా ఉంటాయి. వీటన్నింటినీ ఎంపిక చేసి ఏర్చి కూర్చడంలో రచయిత్రులు, రచయిత్రులను కలుపుకుంటూ కలిసి సమన్వయంతో పనిచేయడంలో భూమిక టీమ్ నిరంతరం మమేకం అవడం వల్లనే మొదటి నుండీ భూమిక ఒక ప్రామాణికమైన పత్రికగా మనగలిగింది. ప్రత్యేక సంచికల సందర్భాల్లో ఆయా అంశాలపట్ల మరింత శ్రద్ధ తీసుకొని రూపొందించే తీరులో పరిశోధనాత్మక, పరిశీలనాత్మక దృష్టికోణం కనిపిస్తుంది. ప్రతి మాసం లోపలి శీర్షికలే కాదు కవర్ పేజీలను కూడా అర్థవంతంగా (చిత్రించడంలో) రూపాందించడంలో భూమికదొక ప్రత్యేకత. ఫీల్డ్‌టీమ్స్ అనుభవాలను అక్షరీకరించే విధానం కూడా ప్రత్యేకమైందే. శీర్షిక ఏదైనా స్త్రీల సమస్యలతో పాటు పరిష్కార మార్గాలను చూపించేవిగానే కాక ప్రగతి శీలకంగా ఆలోచింపజేసే ఆకాంక్షతో పనిచేయడంలో భూమిక టీమ్ సఫలీకృతమవుతున్నది.
భూమిక ఆధ్వర్యంలో నిర్వహించబడే హెల్ప్‌లైన్‌తోపాటు వివిధ అంశాలపై ఏర్పాటు చేసే శిక్షణా కార్యక్రమాలు, అవగాహనా తరగతులు సమస్యల్లో ఉన్న మహిళలకు భద్రతను, భరోసాను కల్పించగలుగుతున్నాయి. ఆవైపు మన భూమిక మరింతగా కృషి చేస్తే బాగుంటుంది. పత్రిక కేవలం రచయిత్రులు, రచయితలకే కాక కళాశాల విద్యార్థినీ విద్యార్థులలోకి వెళ్ళేలా చెయ్యడంలో మరింత కృషి చెయ్యడం అవసరం. ఫీల్డ్‌వర్క్‌కు మరింత ప్రాధాన్యత ఇవ్వడం కూడా అవసరమే మన పత్రిక గ్రామీణ ప్రాంత మహిళలకు చేరువ అయ్యే విధంగా కూడా కృషి చెయ్యాలేమో అనిపిస్తుంది ఉదా : వ్యవసాయం, మహిళా రైతుల అంశాలు, రాజ్యాంగం, రాజ్యాంగ రక్షణపట్ల అవగాహన గ్రాస్‌రూట్ స్థాయిలో కూడా కావాలి. దానివల్ల వాళ్ళు తెలుసుకోవడంతో పాటు అన్ని రంగాల మహిళల విజయగాథలు, వ్యధాభరిత కథలు, అనుభవాలతో కూడిన స్త్రీవాదం వెలుగులోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని నేను భావిస్తున్నాను.
భూమిక 30 ఏళ్ళ ప్రస్థ్రానంలో భాగంగా అన్ని వర్గాల స్త్రీలు అన్ని రంగాల్లో రాణించాలనే బలమైన సంకల్పంతో ఎన్నో వ్యయ ప్రయాసలను తట్టుకుంటూ స్త్రీవాద దీక్షతో ముందుకెళ్తున్న భూమిక బృందం మొత్తానికి, పత్రిక తమదిగా భావిస్తూ ఆలోచనాత్మమైన, సందేశాత్మకమైన రచనలనందిస్తున్న రైటర్స్ అందరికీ ఈ సందర్భంగా ఆత్మీయ అభినందనలు, భూమిక నిరంతర ప్రయాణం ఇదే నిబద్ధతతో మరింత
ఉత్పాహంతో కొనసాగుతుందని ఆకాంక్షిస్తూ … ` డా. కొమర్రాజు రామలక్ష్మి