నేను ముఖమైనా కడగలేదు, పాచిముఖంతోనే పరమాన్నం వండిపెడితే
చెమట చుక్కల కంపులోనే ఘుమఘుమల వాసనలు పుట్టించిన
నా అలంకరణ గూర్చి నేను పట్టించుకోనేలేదు.
వంటిల్లు మాత్రం కళగా అలంకరించుకున్న
వంటలన్నీ రుచిగా ఉన్నాయనుకుంటా, ఎవ్వరూ గ్లాసులు, గిన్నెలు
ఎత్తేయకుండా తిని మూతి కడిగేసుకున్నారు
వంట బాగుందని నాకు ఇలాగే తెలుస్తుంది
నోటితో తిన్న వారే కానీ నోరారా బాగుందని చెప్పడం నేను విననేలేదు.
వంటగదంతా నాదే వంటంతా నేను చేసిందే
తింటారా అని నేనడగానే గాని, తిన్నావా? అని నన్ను
ఎవరు ఏనాడూ అడగలేదు.
నా సామ్రాజ్యం కాబట్టి అంతా నా సొంతమనుకున్నారేమో
కానీ రాజ్యాలన్నీ రాజు పేరున రాసున్నాయి.
ఒక్కోసారి నా సామ్రాజ్యం మీద నాకే దాడి (యుద్ధం) చేయాలనిపిస్తుంది
చల్లని చెమటలతో నిండిన దేహం మంటలలో చిక్కుకుపోయినట్లు అనిపిస్తుంది నాకు
ఆ మంటల్లోంచి బయటపడటానికి నా పోపు డబ్బాలోని కారంతో
కడిగేసుకోవాలనిపిస్తుంది.
కూరగాయలు కోసే కత్తులతో తాళాలు వేయని వంటగది
తలుపులతో యుద్ధం చేయాలనిపిస్తుంది
ఇంతలోనే ఆ తిని పారేసిన గిన్నెలు, అన్నం, కూర, ఊడ్చేసిన గిన్నెలు
నిండిన సింకును చూస్తాను
అక్వేరియంలో బంధింపబడిన చేపల్లా అనిపిస్తాయి నాకు
బంధింపబడిన నా చేతులతోనే వాటిని విడుదల చేయాలి నేనిప్పుడు.
తినే పదార్థాలు పాడవకుండా దాచడానికి ఫ్రిజ్ ఉంది మా ఇంట్లో
అచ్చం నాలాగే ఇంటి మూలన ఉన్న వంటగదిలో ఉన్నట్లు
తినగా మిగిలిన పదార్ధాలు మర్నాడు నేను
తినడానికి దాచి ఉంచే అల్మరా లాగా
ఒక్కోసారి వంట చేయడానికి పుట్టించిన మంటలు ఎందుకో
నా గుండెల్లో పెరిగి పెద్దవవుతాయి
ఆ మంటలన్ని కన్నీరై చల్లబడుతున్నాయి, మంటలకు మాటలు
నేర్పాలని నేననుకున్నాను కాని అల్మరాలోని అన్నం కూడా
పాచిపోతుందేమోనని నేనాగిపోయా…
నా వంటగది గోడలన్నింటికి నా గోడు వినిపిస్తుంది, కాని
ఆ గోడల అవతలి ‘‘గార్లందరు’’
భోజనం తినేవేళ అయిందని తెలియజేయడానికి గంట కొడుతుందనుకున్నారు
‘తిని మూతి కడిగేసుకున్నారు’
నేను వంట బావుందనుకున్నాను.
ఐదు నక్షత్రాల హోటల్లో అందంగా వడ్డించిన భోజనానికి,
పిలిచి మరీ ప్రశంసలు, అప్పుడప్పుడూ టిప్పులు
భోజనం బాగుందని ఇట్లా కూడా చేస్తారా
నాకెప్పుడూ చెప్పలేదే, నాకెందుకో ఈ విశ్రాంతి
చాలా అలసటనిస్తుంది
చిన్న పని చేసినా, అతడితో సమానంగా పనిచేసినా
అంతా అయ్యాక ఆ గదిలోకి వెళ్ళాల్సిందే
ఇంత కష్టంగా చేస్తున్నావా? నువ్వు ఇష్టపడి చేసిందే లేదా అంటారా?
నాకు ఇష్టంగానే చేయాలనుంది కాని కష్టానికి కాస్త గుర్తింపు,
ఇంకాస్త సాయం కోసం ఎదురుచూపంతే…
కుటుంబమంతా ఖుషీగా బయటకి వెళ్తే ఇంటికొచ్చాక వారందరికీ
అలసట రాసి పెట్టుంటే, నాకెందుకో అన్నం, కూర వండాలని రాసుంది.
ఈ ఆటలన్నీ నాకు చిన్ననాడే నేర్పింది మా అమ్మ
నా బొమ్మలన్నీ వంట సామానులే,
మంటలేని వంటలెన్నో నేను వండాను, వడ్డించాను
అయ్యన్నీ తీపిగురుతులే
ఎందుకో ఈ మంట మొదలయ్యాక నేను చేసే వంటల్లో
తియ్యదనం, కమ్మదనం చేరి, నా గురుతులలో మాయమైపోయింది
గురుతులన్నీ గుండెల్లో, చేతుల్లో, శరీరంపై
వివిధ రూపాలలో నన్ను
అంటుకున్నాయి. అందులో కొన్ని తాత్కాలికమైనవి, కొన్ని శాశ్వతం
నా వేలి ముద్రలన్నీ కత్తి గాట్లతో
సరికొత్తగా రూపాంతరం చెందాయి
చేతి రాతలు మార్చగల శక్తి మనలోనే ఉందంటారుగా
నేను ఇలా మార్చుకున్నానన్నమాట
కానీ ఇది నేను వెలుగుల్లోకి వెళ్ళడానికి కాదు, మరింత
చీకటిలోకి నన్ను నేను నెట్టేసుకోవడానికి
వంటింట్లోంచి నేనొక కూతపెడితే సినిమాల్లో చూపించినట్లు
నాకేదో జరిగిందని నా వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చి పరామర్శిస్తారనుకున్నా.
కానీ కుక్కర్ కూతలు, మిక్సీ రోతలు, గ్రైండర్ చప్పుళ్ళు విని
చిరాకుగా చూసే ఆ చూపే నాకు తగిలింది
ఇది కూడా వంట చేసే సమయంలో పుట్టిన అనవసరమైన ఓ కూత
ఏనాడైనా అక్కడ గ్లాసు తెచ్చి ఇక్కడ పెడితే నాకెంతో సహాయం చేశారని నేను తెగ సంతోషిస్తా
నీలో సగభాగమన్నావు కదా నీ శరీరంలో భాగం నాకు అక్కర్లేదు కానీ నా పనిలో సగభాగం నీకివ్వాలనుంది
ఆ గడప దాటితే, ఇంటి గడప దాటాలంటావేమో మళ్ళ
కొత్త కుందేలును వేటాడే పనిలో ఉంటావేమో
నీ గడప మీద నేను రాసి పోతాలే ‘ఓ స్త్రీ రేపు రా’ అని
అయినా ఈ స్వేచ్ఛ నేనడగాలా! నువ్వు నాకు రాసిచ్చిన గదిలో బోలెడు వస్తువులు
వాటిని వస్తువులుగా చూసినంత కాలమే ఏ కమ్మదనమైనా నా అమ్మతనమైనా,
అవి ఆయుధాలయ్యాయో అమ్మ కాస్తా అమ్మోరవుతుంది…
తరువాతంతా పూనకాలే, అమ్మవారి ఆజ్ఞలన్నీ పాటించాలి
‘బాలక’