వెలకట్టలేని త్యాగాలు,
ఎల్లలు లేని ప్రేమలు,
కొదవ లేని జాలి,
ఎనలేని అనురాగం,
ఇవే అచ్చమైన మగువ సుగుణాలు…
తెగించలేని ఆవేదన,
సంబాళించుకున్న ఆవేశం,
అణచివేసుకున్న అరాచకాలు,
బయటపడనీయని అగ్నిగోళాలు,
నిజంగా ఇదే ప్రతి సబల మది అంతరంగం…
పెంపకం నీడలో పెత్తనాలు,
అధికారుల చెరలో అట్టహాసాలు,
సానుకూల బంధాల్లో సాధింపులు,
పీడిత హస్తాల్లో బందిఖానాలు,
ఇవే తరుణికి సమసమాజం ఇచ్చే రక్షణలు…
చేజారిన చిన్ని చిన్ని సంతోషాలు,
ఆశలు వాస్తవాల మధ్య కొట్టుమిట్టాడే జీవనం,
అనుకున్న గమ్యాన్ని చేరలేని పాదాలు,
మంచుముద్దలా కరిగిపోయే కలలు,
ఇవే ఇవే ఎప్పటికీ ఓ సాధారణ మహిళ సామర్థ్యాలు…
అధిగమిస్తే బరితెగింపు,
పోరాడితే వెలివేత,
నిలదొక్కుకుంటే కఠినత్వం,
సాధిస్తే అభ్యంతరం,
ఇవే మేటి వనిత ధైర్యానికి
సంఘం పెట్టిన మంచి పేర్లు…