పి. సత్యవతి
”కృష్ణాబారేజ్ మునిగిపోతుందిట పైన నిలబడితే నీళ్లు చేతికందున్నాయిట వెళ్లి చూసొద్దామా?”
”పిచ్చి వేషాలెయ్యక బజారుకెళ్లి క్యాండిల్సూ, పాలపొడి, టార్చిసెల్సూ, మినరల్ వాటర్ సీసాలూ పట్రా.. కిందకెళ్ళి వాచ్‌మన్‌ని జెనరేటర్‌లోకి డీజిల్ వుందోలేదో కనుక్కో.. లేకపోతే మహాఘనత వహించిన కార్యదర్శిగార్నడిగి డబ్బుల్తీసుకుని కొనుక్కొచ్చి పొయ్యమను.. అన్నీ నేనే చెప్పాలి.. నీ వయస్సుకి నాకు నీతో సహా ముగ్గురు పిల్లలు.. ముందు నీ బండిలో పెట్రోలు కొట్టించుకో.. పో తొందరగా..”
”కర్నూలు మునిగిపోయిందట చూడు ఎంత భయంకరంగా వుందో” రెండో కాఫీ తాగేసి సిగరెట్ ముట్టించుకుంటూ నాన్న.
హాల్లో భారత్ సంచార్ నిగమ్ నిరవధిక పిలుపు.. సముద్రాల అవతల్నించి మా అన్న..
”మీకు వోనేజ్ ఫొన్ పెట్టిందెందుకు? ఆఫ్ చేసుక్కూచో డానికా? వెళ్ళి వైర్లెస్ ఆన్ చెయ్..”
”వాడితో నే మాట్లాడతాలే నువ్వు తొందరగా సూపర్ మార్కెట్కి వెళ్ళిరా.. ముందు బండిలో ఆయిల్ కొట్టించు.. వరదొస్తే పెట్రోల్ దొరకదని అంతా అక్కడె వుంటారు పో ముందు..”
”అమ్మపేరు అరుంధతి మార్చి భవిష్యదర్శని అని పెడితే బావుంటుంది”
”త్యాగమయి అని పెట్టు.. పట్టుచీరె కొనుక్కుందామని దాచిన డబ్బుతో పదికిలోల కందిపప్పు తెచ్చా నిన్ననే!! వరదలొస్తే వందపెట్టినా దొరకదుట మీకు బఠానీలు వండిపెట్టలేక.. సర్లే.. అక్క తమ్ముళ్ళకేం పని లేదు. పాపం వాడు మనమెలా వున్నామో అని ఆదుర్దా పడుతున్నాడు అక్కడ అమెరికాలో”
”ఏం పడట్లా మీకేం ప్రమాదం లేదు ఊర్కే కంగారు పడొద్దంటున్నాడు”
”అదేదో ఛానెల్లో కనకదుర్గ అమ్మవారి ముక్కు పుడక దాకా నీళ్ళొస్తే విజయవాడ మునుగుతుందని చెప్తున్నారే.. చూడు..”
”దుర్గమ్మ ముక్కుపుడకేమో గానీ మన కాంపౌండ్ ముణగడం ఖాయం.. అప్పుడు జెనరేటర్ పనిచెయ్యదు కిందకి దిగలేం బయటికి పోలేం..”
”వి.టి.పి.ఎస్ లోకి నీళ్ళు వెడుతున్నాయిట. ఇహ ఎన్నాళ్ళు కరెంటు ఉండదో ఏమిటో ముందు ఇన్వర్టర్కి ఫుల్‌గా చార్జ్ పెట్టండి.. ఎమర్జన్సీ లైట్లు కూడా బాగా చార్జ్ పెట్టండి.. నువ్వు ముట్టించినట్లు మూడు క్యాండిల్స్ తేకు.. ఒక డజను పెట్టెలు పట్రా.. పాల పొడి కూడా రెండు కిలోలు తీసుకురా. నా డెబిట్ కార్డు పట్టు కెళ్ళు.. పళ్ళుకూడా తీసుకురా.. కూరలు మర్చిపోకు.. పోనీ బండిలో కొన్ని తెచ్చిపెట్టి మళ్ళీ ఆటోలోఫో. మినరల్ వాటర్ ఇరవై లీటర్ల క్యాన్లు ఓ అయిదు తీసుకురా.. హెడ్ వాటర్ వర్క్స్ కూడా మునిగి పోతొందిట….”
బండితీసుకు బయటకొస్తే. ఏ కొట్లో చూసినా కొనేవాళ్లె…. కొన్నాం కొన్నాం కొన్నాం నింపాం. నింపాం… చానెళ్ళు అత్యంత విషాదాన్ని కళ్ళముందు పరుస్తూనేవున్నాయి… అన్నంతింటూ, ఉపాహారాలు, ఫలహారాలు చేస్తూ చూస్తూనే వున్నాం. కృష్ణలంకలో మా తమ్ముడి స్నేహితుడి కటుంబాన్ని, ఇంకో లంకలో మాచుట్టాల్ని ఎవర్నీ పిలవలేదుమేం.. ఆ సాయంత్రం మా అమ్మ మురుకులు వండింది. వరదల్లో విద్యుత్సరఫరా ఆగిపోయి వండడానికి కష్టం అయితే తినడానికేం వుండవని. రాత్రి పన్నెండుదాకా టీవీ చూశాం. అయ్యో అయ్యో అని చాలా సార్లు అనకున్నాం.
”కరెంట్ వుండకపోతే టీవీ వుండదు… బయటేంజరుగుతోందో తెలీదు..” నాన్న బాధ…. కరెంట్ పోలేదు. పొద్దున్నే పాలొచ్చాయి. కార్పొరేషన్ వారినీళ్ళొచ్చాయి. అమ్మ పైనించీ బిందెలు దించి పట్టి ఇంటినిండా పెట్టింది. ఒక వేళ నగరంలోకి నీళ్ళొచ్చి పదిరోజుల దాకా బయటికెళ్లకపోతే, కరెంట్ పోయి మా మోటర్ పనిచెయ్యకపోతే నీళ్ళుండద్దా?
తెల్లవారేసరికి మా కాంపౌండ్ నిండా జనం. వాళ్ళంతా వాచ్‌మన్ చుట్టాలు. వాచ్‌మన్ భార్య లక్ష్మి కట్టెలపొయ్యిమీద వాళ్ళకి కాఫీలు వంటలు.. కాంపౌండ్ వాల్ నిండా ఆరేసిన బట్టలు… లోపలంతా ఆరబెట్టిన వస్తువులు.. ఇతనున్నాడని ఆదుకుంటాడని భరోసాతో వాళ్ళంతా రాత్రికి రాత్రి నడిచొచ్చారట..
కరెంట్ పోలేదు. పాలాగిపోలేదు. మా యింటిని మాత్రం ముందు జాగ్రత్త వస్తువుల వరద ముంచెత్తింది. మన వస్తువులు మనమే వాడుకోవాలి కనుక ఆ తరవాత పాల పొడి గులాబ్ జామ్లు, మినరల్ వాటర్‌తో స్నానం.. కానీ కొన్ని క్యాండిల్ ప్యాకెట్లు కొన్ని పళ్లు, కూరలు కొంత కందిపప్పు. మాయమైనట్టు మా అమ్మ కనిపెట్టేసింది. ఆ దొంగెలవరో ఆసొమ్ముతో వాళ్ళేంచేశారోకూడా కనిపెట్టింది… దొంగల్ని నిలదీస్తే వాళ్లు తనకి బజారుపన్లు చేసిపెట్టక పోగా పెద్ద పెద్ద ఉపన్యాసాలిస్తారని గమ్మునుండిపోయింది.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
చాలా బాగ రాసారు.