సత్యవతి
ఆ రోజు ఉదయం ఎనిమిదింటికి గిరిజ దగ్గర నుండి ఫోన్ వచ్చింది. ఆక్స్‌ఫామ్ ప్రోగ్రామ్ ఆఫీసరు గిరిజ గొంతులో సుడులు తిరుగుతున్న దు:ఖ సవ్వడి స్పష్టంగా విన్పిస్తోంది. ”ఏమైంది గిరిజా! మీ గొంతు అలా వుందేమిటి అని అడగ్గానే ”నాగమణి గారు చనిపోయారండి. నేను ఎ.పి వుమెన్స్ నెట్‌వర్క్ దగ్గరున్నాను” అన్నారు. నేను ఆశ్చర్య పోయాను. వారం క్రితం నాగమణిని ఒక మీటింగులో కలిసాను. ఆవిడ ఇంత హఠాత్తుగా చనిపోవడమేమిటి? చిన్న వయస్సే. కేవలం 42 సంవత్సరాలు. నేను వెంటనే బయలు దేరి తార్నాకాలో వున్న ఎపి వుమెన్స్ నెట్‌వర్క్ ఆఫీసు కెళ్ళాను. నాగమణి నిద్రపోతున్నట్టుగా వుంది గానీ చనిపోయినట్టునిపించలేదు. స్నానం చేసి బాత్‌రూం నుండి బయటికి వచ్చి పడిపోయిందని, ఆస్త్మా ఎటాక్ వచ్చిందని చెప్పారు.
నెట్ వర్క్ సభ్యులు చాలామంది వున్నారక్కడ. కుమిలి కుమిలి ఏడు స్తున్నారు. కొంతమంది బిగ్గరగా ఏడుస్తూ ”మా బతుకులు కూడా ఇంతే. నాగమణికి పట్టిన గతే మాకూ పడుతుంది. ఏదో మీటింగుకి వచ్చి, ఎవరూ లేకుండానే చస్తాం. ఈ పని వొత్తిళ్ళు, డెడ్‌లైన్లు మమ్మల్ని కూడా చంపేస్తాయి. అసలు మేమెందుకు సంఘాలు నడపాలి? వొత్తిళ్ళతో చావడానికా?” ఈ మాటలు నాకు సూటీగా తాకాయి. నాగమణి మరణం కల్గించిన దు:ఖం ఒక వైపు ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే నెట్‌వర్క్ సభ్యుల్లో కొందరి హృదయవిదారక దు:ఖ వ్యాఖ్యలు. ఆశ్చర్యంతో కూడిన బాధ నన్ను చుట్టు ముట్టింది. ‘వుమెన్ హెడెడ్ ఎన్‌జిఓలు’ గా వున్న వీళ్ళంతా ఎన్నెన్నో పనుల్లో, ప్రోగ్రాంల్లో మునిగితేలుతూ వుంటారు. ఉదయం లేచిన దగ్గరనుండి మీటింగుల్లో ,ట్రయినింగుల్లో బిజీగా వుంటారు. వీళ్ళేమిటి ఇంత బేలగా, నిస్సహాయంగా రోదిస్తున్నారు అనుకుంటూ చాలా ఆశ్చర్యపోయాను. నాగమణి పనివొత్తిడి వల్లే చనిపోయిందా? ఇంత స్త్రెస్‌తో వీళ్ళు పనిచేస్తుంటారా? అసలు వీళ్ళంతా రిలాక్స్ అవుతారా? ఎప్పడూ ప్రాజెక్టుల్లో కొట్టుకుపోతుంటారా? ఎన్నో ఆలోచనలు నన్ను చుట్టు ముట్టాయి. మనం చేసే పనే మన మరణానికి దారి వేసేదైతే ఆ పనిని అలా కాకుండా ఇంకో విధంగా చెయ్యలేమా? ఆ పని నుండి కొంత విరామం తీసుకుని, రీచార్జ్ అయితే ఇంకా బాగా చెయ్యగలుగతాం కదా. ఎన్నో పనులు చేసే వీళ్ళు రిలాక్స్‌షన్, కెపాసిటీ బిల్డింగు మీద దృష్టిి పెట్టడం లేదు అన్పించింది.
నా బుర్రను తొలుస్తున్న ఆలోచనల్ని గిరిజతో పంచుకున్నాను. ”దీని గురించి ఏదైనా చెయ్యాలన్పిస్తోంది. ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో స్పష్టత రావడం లేదు. రచయిత్రుల క్యాంప్‌లాగా, వీళ్ళందరికి రిలాక్స్‌షన్ క్యాంప్ పెడితే ఎలా వుంటుంది.” ”చాలా బావుంటుంది. ప్లాన్ చెయ్యండి” అంది గిరిజ. అదేమాట సిడబ్లుఎస్ సుచరితతో అన్నపుడు ”బావుంటుంది. మీరొక ప్రపోజల్ ఇవ్వండి” అన్నారు. ఇంకేముంది. ప్రపోజల్ ఇవ్వడం, ఒప్పుకోవడం అన్నీ చాలా వేగంగా జరిగిపోయాయి. రెండు వర్క్‌షాప్‌లు ప్లాన్ చెయ్యమన్నారు.
ఈ వర్క్‌షాప్ ప్లాన్ చెయ్యడం అంత తేలికైన విషయం కాదు. ఎపి వుమెన్స్ నెట్ వర్క్ సభ్యులేమీ చిన్నస్థాయి వాళ్ళు కాదు. తమ తమ రంగాల్లో అద్భుతంగా పని చేస్తున్నవాళ్ళు. కొందరు హింసకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ట్రాఫికింగుమీద పిల్లలతో, స్త్రీలతో హెచ్‌ఐవి/ఎయిడ్స్ బాధితులతో పనిచేస్తున్నవాళ్లు వున్నారు. నిత్యం బాధితులను వింటునో, బాధితుల పక్షాన మాట్లాడుతూనో, బాధితుల కోసం ఉద్యమాలు చేస్తూ విపరీతమైన ఎక్స్‌పోజర్ వుండే సభ్యులకోసం నేను వర్క్‌షాప్ పెడితే అది ఎలా వుండాలి? అసలు నేను పిలిస్తే వీళ్ళు వస్తారా? అనే శంకతోనే సభ్యులందరికీ ఒక సుదీర్ఘమైన ఉత్తరం రాసాను. వారు నిర్వహించుకునే సమావేశానికి వెళ్ళి నేను ఎందుకు ఈ వర్క్‌షాప్ నిర్వహించాలనుకుంటున్నానేె చెప్పాను. నాగమణి మరణం నాటి రోజు నాకు ఎదురైన అనుభవం గురించి చెప్పాను. ఆశ్చర్యంగా అందరూ ముక్త కంఠంతో నా నిర్ణయాన్ని స్వాగతించారు, నేను రాసిన ఉత్తరం తమని కదిలించిందని తమ జీవితాల గురించి తామే ఆలోచించడం మర్చిపోయిన సందర్భంలో మా గురించి మీరింత బాధపడటం, శ్రద్ధగా వర్క్‌షాప్ నిర్వహించాలని నిర్ణయించుకోవడం మమ్మల్ని కదిలించింది. కన్నీళ్ళు పెట్టించింది. మేము తప్పక వర్క్‌షాప్‌కి వస్తాం, అంటూ వాగ్దానం చేసారు. నాకు చాలా సంతోషమేసింది. వర్క్‌షాప్ పనులు మొదలు పెట్టేసాను.
ఇదేమీ రోటీన్‌గా నిర్వహించే వర్క్‌షాప్ కాదు. పేపర్ ప్రజెంటేషన్‌లు, చర్చోపచర్చలు, వాదోపవాదాలు, సమయపాలనలు లాంటివేమీ వుండని భిన్నమైన వర్క్‌షాప్. పాల్గొనే సభ్యుల మన:శరీరాలను మొత్తంగా రిలాక్స్ చెయ్యగలిగేరీతిలో దీన్ని ప్లాన్ చెయ్యాలనుకున్నాను. నగర కాలుష్యానికి దూరంగా ప్రకృతికి దగ్గరగా, నీళ్ళకి అతి సమీపంగా వుండే స్థలం కోసం వేట మొదలుపెట్టాను. తలకోన, హార్సీలీ హిల్స్, మామండూరు, అరకు ఇంకా ఎన్నో పేర్లు గుర్తొచ్చాయి. అయితే అంతకు కొంతకాలం ముందు నేను వెళ్ళొచ్చిన దిండి గుర్తొచ్చింది. అద్భుతమైన ప్లేస్. చుట్టూ పచ్చటి కొబ్బరి తోటలు, మధ్య గోదావరిగట్టు మీద టూరిజమ్ వాళ్ళు కట్టిన ‘దిండి’ గెస్ట్‌హౌస్ ఈ వర్క్‌షాప్‌కి కరెక్టుగా సరిపోతుందనిపించింది. చకాచకా బుకింగులయిపోయాయి. నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో రిజర్వేషన్‌లు, మిగిలిన ఏర్పాట్లు వేగంగానే జరిగిపోయాయి.
సెప్టెంబరు 21 నుండి 23 వరకు మూడు రోజులు దిండిలోనే వుండేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. సెప్టెంబరు 20న నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో మా ప్రయాణం మొదలైంది. డా. యు. వింధ్య, డా. అర్వింద్ (నాసిక్)లు రిసోర్స్ పర్సన్‌గా మాతోనే బయలుదేరారు. మొత్తం ఇరవై మందిమి ఇక్కడి నుండి బయలు దేరితే మరి కొందరు డైరెక్టుగా దిండికి వచ్చేలా ప్లాన్ చేసుకున్నారు. జ్వరాల కారణంగా కొంతమంది చివరి నిమిషంలో ఆగిపోయారు. నర్సాపూర్‌లో ట్రయిన్‌దిగి బస్సులో ‘దిండి’ గ్రామం చేరాం. చించినాడ గ్రామం దగ్గర కట్టిన బ్రిడ్జి మీదకి బస్సు రాగానే గోదారమ్మ దర్శనమై అందరూ కేరింతలు కొట్టారు. ఆ తర్వాత గోదావరి ఒడిలో వున్న భ్రమ కల్గించే దిండి గెస్ట్‌హౌస్‌ని చూడగానే అందరి ముఖాలు వికసించాయి. గెస్ట్‌హౌస్‌కి ఎదురుగా వున్న కొలనులో పూసిన రంగు రంగుల కలువ పూలు కనువిందు చేస్తుంటే అందరం రూమ్‌ల్లో సర్దుకున్నాం.
మొదటి రోజు పదకొండు గంటలకి మొదటి సెషన్ మొదలైంది. నిజానికి ఈ వర్క్‌షాప్‌ని నేను గంటలుగా విభజించలేదు. ఇదీ అంశమని నిర్ణయించలేదు. మొదటి రోజును రిసోర్స పర్సన్‌గా వచ్చిన వింధ్యకే వదిలేసాను. పరస్పర పరిచయాలనే నా పేరు… అంటూ కాకుండా చాలా భిన్నంగా వాళ్ళు ఇష్టపడే ఆహార పదార్ధం పేరు చెప్పి మొదలు పెట్టేలా తను ప్రోత్సహించింది. తన కిష్టమైన తిను బండారం గురించి చెబుతూ, తనకి ముందు చెప్పిన వారందరికి ఇష్టమైనవి కూడా చెప్పాలి. దీనిద్వారా ఏకాగ్రతగా ఎదుటివాళ్ళు చెప్పేది వినాల్సి వుంటుంది. ఉదా.సత్యవతికి చేపలకూర, శివకుమారికి రొయ్యల వేపుడు, మేరికి బెండకాయ, భానుజకి గుత్తి వంకాయ నాకేమో మైసూర్‌పాక్ ఇష్టం నా పేరేమో అంటూ ఇలా సరదాగా పరిచయాల కార్యక్రమం నవ్వుల మధ్య జరిగింది. ఎవరికేది ఇష్టమో గుర్తు పెట్టుకుంటూ, ఆ విషయం చెబుతూ తన గురించి చెప్పుకోవడమనే ఈ ప్రక్రియ వల్ల పరిచయాలు రొటీన్‌గా కాక సరదాగా, గలగల నవ్వుల మధ్య జరగడంతో వర్క్‌షాప్ ఉల్లాసంగా మొదలైంది.
వింధ్య రకరకాల ఆటలు, పాటలు, ఎక్స్‌ర్‌సైజులద్వారా పార్టిసిపెంట్స్ ఈ వర్క్‌షాప్‌ద్వారా ఏమి ఆశిస్తున్నారు? వాళ్ళ ఆశలు, భయాలు, ఆశయాలు, సంకోచాలు ఏమిటనేవి రాబట్టారు. వాళ్ళ ఆశలు, ఆకాంక్షలు ఒక పేపర్ మీద రాయించి, వాటన్నింటినీ చార్టులమీద కెక్కించి విశ్లేషిస్తూ కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. ఒక సంస్థ నిర్వాహకులుగా ఉంటూ, నిత్యం బాధితుల మధ్య, బాధితుల్ని వింటూ, వారికి సహాయం చేస్తూ, కౌన్సిలింగు చేస్తూ వుండడంవల్ల, ఎక్కువ సమయాన్ని దానికే కేటాయించడంవల్ల ”నేనేమిటి? నా జీవితం ఏమిటి? నాకేం కావాలి?” అని ఆలోచించ డానికి సమయం లేకుండాను తమ తమ సామర్ధ్యాలను మించి ప్రాజెక్టులు తీసుకుంటే, అవి పెంచే వొత్తిడిని తట్టుకోవడం కష్టమౌతుందని చెబుతూ ఇంటిని, ఆఫీసుని అంతా కలగాపులగం చేసుకోవడంవల్ల జరిగే అనర్ధాల గురించి చిన్న చిన్న ఎక్సర్‌సైజుల ద్వారా చక్కగా తెలియచెప్పింది. కుటుంబానికి, కార్యాలయానికి మధ్య శాఖని గీయకుండా ఆఫీసుని ఇంటికి, ఇంటిని ఆఫీసుకి మోసుకురావడంవల్ల కుటుంబ సభ్యుల్లో ఎలాంటి అసంతృప్తి మొదలవుతుందో వివరించారు. ఇరవై నాలుగు గంటలూ వీటిల్లో మునిగితేలితే ”మనకోసం” అంటూ ఏమైనా మిగులుతుందా? మనకోసం సమయాన్ని కేటాయించుకోవడం నేరంగా, అపరాధభావం మనలో కల్గించే పరిస్థితుల మధ్య మనం ఘర్షణ పడుతుంటాం. మనం చేెయదల్చుకున్న పనులు చెయ్యాలిగాని, మన కోసం కూడా మనం ఆలోచించుకోవాలి. మనం చేసే పనిలో నైపుణ్యాల్ని పెంచుకోవాలి. మన ఇష్టాఇష్టాలు, మనం మర్చిపోయిన ఆకాంక్షలు, చిన్న చిన్న కోరికలు వీటికి కూడా ప్రాధాన్యమివ్వాలి. మనల్ని మనం ప్రేమించుకోవాలి. పరిపోషించుకోవడం చాలా అవసరం అనే ఫెమినిస్ట్ కాన్సెప్ట్‌ని గాఢంగా మన జీవితంల్లోకి అనువదించుకోవాలి అనే విధంగా వింధ్య సెషన్ నడిచింది.
మన మనస్సు ఎక్కడ సేద తీరుతుందో, మనలోకి మానసిక వొత్తిడి ఎక్కడ కరుగుతుందో అలాంటి చోట్లని మనం కనిపెట్టాలి. ఉదా. ప్రియనేస్తంతో కాసేపు కబుర్లాడితే కొందరు సేదతీరొచ్చు. మంచి పుస్తకం చదివితేనో, పండు వెన్నెల్లో నడిస్తేనో, పసిపిిల్లల్తో ఆడుతూనో, పాటపాడితేనో ఇలా ఎన్నో పనుల్లో మనసు సేదతీరుతుంది. టైమ్ లేదని అవన్నీ వొదిలేసి, అభిరుచుల్ని చంపేసుకుని పొద్దస్తమానం ఇంటి పనుల్లోనో, ఆఫీసు పనుల్లోనో మునిగి తేలితే మిగిలేది గానుగెద్దులాంటి యాంత్రిక జీవితమే. ‘పర్సనల్ నర్చరింగు ఆవశ్యకతని, అవసరాన్ని చక్కగా అర్ధం చేయించింది వింధ్య మొదటి రోజు సెషన్‌లో.
సూర్యాస్తమయమౌతున్నప్పుడు, నారింజ రంగు కిరణాలు పడి గోదావరి మిల మిల మెరుస్తున్నవేళ బోటుమీద షికారెళ్ళాం. నవ్వుల్తో, పాటల్తో హోరెత్తి పోయింది. చీకటి పడుతున్నపుడు బోటు దిగి అక్కడ పిల్లల కోసం అమర్చిన ఉయ్యాలలు తదితరాల మీద ఎక్కి కూర్చుని ఇంత పెద్ద ఎన్జీవో నాయకురాళ్ళు పిల్లల్లా గెంతుతూ, కేరింతలు కొట్టారు. జోకులూ, నాటకాలు ఆడుతూ తుళ్ళి తుళ్ళి పడుతూ, విరగబడి నవ్వుతూ సర్వం మర్చిపోయినట్టు కనిపించారు.
మర్నాడు అరవింద్ రిసోర్స్‌పర్సన్‌గా వ్యవహరించాడు. లెక్కలేనన్ని ఆటలు ఆడించాడు. ముఖ్యంగా టైమ్‌మేనేజ్‌మెంట్, పరస్పర సహకారం, సపోర్ట్, బాల్యాన్ని గుర్తు చేసుకోవడం, నడిచి వచ్చిన జీవితం గురించి పంచుకోవడం మొదలైన అంశాలతో ఎక్స్‌ర్‌సైజుల్ని మిళితం చేసి క్లాసు నడిపించాడు. మోకాళ్ళ మీద కింద కూర్చుని ఒకరి వీపునకు ఇంకొకరి వీపు ఆనించి చేతులు కింద ఆన్చకుండా ఒకరిని ఇంకొకరు సపోర్ట్ చేసుకుంటూ పైకి లేవాల్సిన ఆటని ప్రతినిధులంతా ఎంతో ఉత్సాహంగా ఆడారు. ఒకరు పైకి లేవాలంటే ఇంకొకరి సహకారం తప్పని సరిగా వుండాలి. లేకుంటే పడిపోతారు. పైకి లేవలేరు అని చెప్పే ఈ ఆట ద్వారా మన మధ్య పరస్పర సహకారం ఎలా వుండాలో చక్కగా వివరించాడు అరవింద్. కొన్ని పాత ఫోటోలు చెల్లా చెదరుగా కింద చల్లేసి అందుల్లోంచి వాళ్ళ కిష్టమైన, తమని తాము పోల్చుకునే ఫోటోలను ఎంపిక చేసుకుని వాటి గురించి చెప్పమని ప్రోత్సహించే ఒక గేమ్ కూడా ఆడించాడు. తలొక ఫోటో తీసుకుని తమ బాల్యాన్ని, తాము పొందలేకపోయిన వాటిని, తాము ఆశించిన వాటిని, తమ సొంత ఊరుని గుర్తు చేసుకుంటూ చెప్పమని అడిగినపుడు అందరూ చాలా ఉత్సాహంగా తమ గురించి చెప్పుకొచ్చారు.
టైమ్ మానేజ్‌మెంటు మీద చక్కటి వివరణలతో అతను వివరించాడు. సమయాన్ని ఎలా కేటాయించుకోవాలి? ప్రపంచంలో ఎవ్వరికీ 25గం.లు దొరకవు. అందరికీ 24 గం. మాత్రమే వుంటాయి. ప్రాధాన్యతలు మనమే నిర్ణయించుకోవాలి. మనం చేసే ప్రాజెక్టుల్ని బట్టి సమయం పాలన, సమయం నిర్దేశం నిర్దారించుకోవాలి. ఏవి ముఖ్యమైనవి, ఏవి అప్రధానమైనవో వర్గీకరించుకుంటూ వాటికి అనుగుణమైన సమయ నిర్దేేశం ఎలా చేసుకోవాలో ఉదాహరణలతో సహ అరవింద్ వివరించాడు. అలాగే పర్సనల్ విషయాలల్లోకి ఆఫీస్ వ్యవహారాలు రాకుండా చూసుకోవాలని దాని కోసం ఆపీసుకి, వ్యక్తిగతానికి మధ్య విభజన రేఖని గియ్యాలని లేకుంటే జీవితం యంత్రంలా తయారై వొత్తిళ్ళతో అనారోగ్యాల పాలవుతామని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత పర్సనల్ షేరింగులో కొంతమంది ప్రతినిధులు తమ జీవితానుభవాలను పంచుకున్నారు. వింటున్నవాళ్ళ కళ్ళు చెమర్చి, హృదయాలు భారమైన సన్నివేశమది. తమ సహచరుల వ్యక్తిగత జీవితం లోని వేదన, ఘర్షణ, కలలు, కన్నీళ్ళు, ఆశలు, ఆశయాలు గురించి సహానుభూతిలో విన్నపుడు, అర్ధంచేసుకున్నప్పుడు వారి మధ్య ఒక గాఢమైన బంధం అల్లుకునే అవకాశం వుంటుంది. వ్యక్తులుగా వేరు వేరు అయినప్పటికీ వారొక సమూహంగా, ఒక నెట్‌వర్క్‌గా కలిసి మెలిసి పనిచెయ్యడానికి ఈ సహానుభూతితో వినడం అనేది చాలా చక్కగా ఉపయోగపబుతుంది. సానుభూతి వేరు సహానుభూతి వేరు. సానుభూతి నాలుక చివరి నుండి వస్తే సహానుభూతి గుండెలోతుల్లోంచి ఉబికి వస్తుంది. పర్సనల్ షేరింగు తర్వాత ఆ రోజు సెషన్ ముగిసింది.
సంధ్యవేళ మా గుంపంతా స్విమ్మింగు ఫూల్ మీద దాడి చేసింది. నేను స్విమింగు సూట్ తీసుకెళ్ళాను కాబట్టి హాయిగా దూకి స్విమ్ చేసాను. కొంతమంది హోటల్ నుంచి అద్దెకు తీసుకుని పూల్‌లో దిగారు. అల్లరి, నీళ్ళల్లో కేరింతలు, ఫోటోలు, స్మిమ్మింగు రానివాళ్ళు సైతం ట్యూబులు తగిలించుకుని చేతులు కాళ్ళు టప టపా కొడుతూ చిన్న పిల్లలై పోయారు. నీళ్ళల్లో చిందులేసారు. చీకటి చిక్కపడేవరకు నీళ్ళల్లో చేపల్లా కొట్టుకుని బయటకొచ్చాం. డిన్నర్ వరకూ మీ ఇష్టం అంటూ అందరిని వదిలేసి, నేనూ గీత ఉదయం ఏరుకొచ్చిన తాటిపండును కాల్చే పనిలో పడ్డాం. హరిశ్చంద్ర ప్రసాద్ అనే రూమ్ బాయ్‌ని పట్టుకుని, కొబ్బరాకుల్తో మంటేసి తాటి పండుని కాల్చేసాం. మా రూమ్‌లోకి తీసుకెళ్ళి అందరిని పిల్చాం గానీ అరవింద్ ఒక్కడే వచ్చాడు. ముగ్గురూ మూడు టెంకలు తీసుకుని ఉడతల్లా తిన్నాం. కమ్మగా, తియ్యగా, భలే వుంది తాటి పండు. డిన్నర్‌లో అందరికి రుచి చూపించాం కూడా.
మూడో రోజు సెషన్స్ ఏమి పెట్టలేదు. రోజంతా బయట తిరిగే ప్రోగ్రాం పెట్టాం. ఆ..అన్నట్టు రెండో రోజు, మూడో రోజు ఉదయం యోగా, ప్రాణాయాయం క్లాసు నేనే తీసుకున్నాను. అందరూ శ్రద్ధగా ప్రాణాయాయం నేర్చుకున్నాను. ప్రతి రోజు తప్పక చేస్తామని ప్రామిస్ చేసారు. తొమ్మిదింటికల్లా తయారై బ్రేక్‌పాస్ట్ చేసేసి బస్సులో అంతర్వేదికి బయలు దేరాం. బయలు దేరే ముందు ఫోటో సెషన్ నడిచింది. కొలనును, కలువల్ని, కొలను పక్క ఇంటిని ఫోటోల్లో బంధించాం. అంతర్వేదిలో గుడికెళ్ళే వాళ్ళు వెళ్ళారు. తర్వాత ప్రత్యేకంగా లాంచి మాట్లాడుకుని అఖండ గోదారి, బంగాళా ఖాతంలో కలిసే ”అన్నాచెల్లెలు” గట్టుకు ప్రయాణమయ్యాం. గోదావరి మీద లాంచి ఊగుతోంది. దూరంగా సముద్రపు అలలు నురగల్లా కన్పిస్తున్నాయి దగ్గరకెళ్లే కొద్దీ లాంచి చిన్న బోటులా ఎగిసి పడసాగింది. సముద్రపు ఆలలు ఊపేస్తున్నాయి. పాటలు పాడుతూ, పడవ ఊగినప్పుడల్లా కెవ్వుమని కేరింతలు కొడుతూ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆ అనుభూతిని గుండెల్లో దాచుకున్నాం. అన్నాచెల్లెలు గట్టుకి అతి సమీపంగా, గోదావరి లోంచి సముద్రంలోకి వెళ్ళినపుడు మా గుండెల్లోనే గోదారి ఉరకలేసినట్టునిపించింది. గోదావరి పుట్టుక స్థలం నుంచి వచ్చిన అరవింద్ తమ ఊళ్ళో పుట్టిన గోదావరి అక్కడ సముద్రంలో లీనమౌతున్న దృశ్యాన్ని తన్మయంగా చూడడం నేను గమనించాను. గొప్ప సంతోషాన్ని మూట గట్టుకుని, ఆ ముటని తలమీద మోస్తూ తన్మయమవుతూ మేం వెనుతిరిగాం.
అంతర్వేదిలో వశిష్టాశ్రమం నిర్వహిస్తున్న ప్రసాదరాజు గారు ఎంతో అప్యాయంగా, ఆత్మీయంగా తామే స్వయంగా కొసరి కొసరి వడ్డిస్తూ మాకు లంచ్ ఏర్పాటు చేసారు. గోదావరి ఒడ్డున వున్న ఆ అశ్రమం గురించి తమ కార్యకలాపాల గురించి వివరించారు. ప్రతి పున్నమికి అనేక మంది జంటలుగా ఇక్కడికొస్తారని పౌర్షమి స్నానం చేస్తారని, ఒకరికొకరు మనసువిప్పి మాట్లాడుకునే ఏర్పాటు వుంటుందని వచ్చే పున్నమికి మీరు కూడా రండి అని మమ్మల్ని ఆదరంగా ఆహ్వానించారు. ఆయనకి ధన్యవాదాలు చెప్పి నర్సాపూర్ వేపు సాగిపోయాం. మా ఊరు సీతారమపురంలో వున్న లేస్ పార్క్‌కి తీసుకెళ్ళినపుడూ అందరూ బోలెడన్ని లేస్ వస్తువులు కొనుక్కున్నారు. అక్కడి నుండే స్టేషన్‌కెళ్ళి 6.30కి రైలెక్కేసాం. దీనితో మూడు రోజుల యాత్ర ముగింపుకొచ్చింది. ప్రతినిధులందరూ చాలా రిలాక్స్ అయ్యామని, మూడు రోజులు మా కోసమే గడపడం అనేది చాలా అపూర్వమని, ఈ పచ్చటి పరిసరాలు, గోదావరి తీరం చాలా ఆనందాన్నిచ్చాయని పేర్కొన్నారు. ఇంకో వర్క్ షాప్‌కోసం ఎదురు చూస్తామని, మా కోసం మేము ఆలోచించుకోవడం మానేసిన వేళ, మీరు మా కోసం ఇంత చక్కటి వర్క్‌షాప్‌ని ప్లాన్ చెయ్యడం బావుందని అందరూ చెప్పారు.
ఆ తర్వాత వచ్చిన ఉత్తరాలు, ఫోన్ సంభాషణలుపై అభిప్రాయాన్నే బలపరిచేవిగా వున్నాయి. నేను అనుకున్న విధంగానే మొదటి వర్క్‌షాప్ జరగడం నాకు చాలా తృప్తినిచ్చింది.పచ్చటి చెట్లు, గోదావరిగట్లు, సముద్రకెరటాలు, చందమామకిరణాలు, సూర్యోదయాలు, చల్లటి పిల్లగాలులూ, వెరశి ప్రకృతితో మమేకం ప్రకృతికి దగ్గరవ్వడం వీటిని మించిన స్ట్రెస్ రిలీఫ్ వేరే ఏమైనా వుందా? మనుష్యులతో కలిసి పనిచెయ్యడం, ప్రకృతిలో సేద తీరడం – దీన్ని మించిన మందు మరేదైనా వుందా? పని చేసేటపుడు గాడిదలాగా పనిచెయ్యాలి. సేద తీరేటపుడు చిన్న పిల్లలమైపోవాలి. గాఢస్నేహమెంత గుండె నిబ్బరాన్నిస్తుందో అనుభవించి చూడా ల్సిందే! ప్రియనేస్తం కరస్పర్శ కన్నీటి సముద్రాల్ని సైతం జయిస్తుంది. ఇది నా అనుభవం.నా ఆచరణ.
మన చుట్టూ జీవితం సంక్షోభమయం, విషాదమయం, సమస్యలమయం. మనం నిత్యం మసిలేది బాధితులలోనే అయినపుడు మన గుండె ఎప్పుడూ రాచపుండే. ఆ పుండుకి మనమే మందేసు కోవాలి. మాన్పుకోవాలి. అపుడు కదా మనం బాధితుల పక్షాన నిలబడగలం. మనమే కుప్పకూలుతుంటే… మనమే జావగారు తుంటే…
ఈ వర్క్‌షాప్ నిర్వహణలో ఎందరో మాకు సహకరించారు. ముఖ్యంగా ఆర్ధిక వనరులు అందించిన సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీకి కృతజ్ఞతలు. ఆక్స్‌ఫామ్ గిరిజకి ధన్యవాదాలు. భూమిక టీమ్ అపార కృషిి వల్లే ఇది సాధ్యమైంది. డా. వింధ్యకి, నాసిక్ నుండి వచ్చి మూడు రోజులు మాతోనే వున్న అరవింద్‌కి ధాంక్స్. అన్ని ఏర్పాట్లులో సహకరించి భీమవరంలో వేడి వేడి డిన్నర్ అందించిన నా కజిన్ బాబు, కడప నుంచి వచ్చి జ్వరం పాల్పడ్డ సుగుణని ఆసుపత్రికి తీసుకెళ్ళి, ఆ రాత్రికి తమతోనే తమింట్లో వుంచుకున్న, నా తమ్ముడు అబ్బులు, బుజ్జిలకు ధాంక్స్ చెప్పి తీరాలి. అంతర్వేదిలో భోజన ఏర్పాటు చేసిన ప్రసాదరాజుగారికి, ఈ ఏర్పా టుకి కారకులైన డా. చినిమిల్లి సత్యనారాయణగార్కి ధన్యవాదాలు. వాహన సహకారం అందించిన కె.ఎస్. (కాశబ్బు)కి ధాంక్స్.
చివరగా, నా ప్రియనేస్తం , భూమిక జాయింట్ సెక్రటరీ గీత తోడు లేకుండా వుంటే నేనీ వర్క్‌షాప్‌ని ఇంత అపూర్వంగా నిర్వహించ గలిగివుండేదాన్ని కాదు. తనకి మరింత స్నేహాన్ని తప్ప ఇంకేమి ఇవ్వగలను?
నాకు కాస్త ఆశ్చర్యమనిపించింది . స్త్రీల కోసము చేసే పనులు ఎంతొ సంతొషాన్ని, త్రుప్తిని ఇవ్వాలి కదా. అవి కుడా ఒత్తడిని కలిగిస్తే మొక్కుబడి కార్యక్రమాలు అనిపించుకుంటాయి కదా.