వి. ప్రతిమ
ఆలేఖ్య
వర్షం… వర్షం.
టపటపమంటూ చినుకులుగా రాలుతూ…
ఒక్కోచినుకూ చురుక్కు చురుక్కుమంటూ కాల్చినట్లుగా మంట.
మంట… మంట.
చినుకుచినుకుగా సన్నగా మొదలయిన మంట.
ఒక్కసారిగా కుండపోతగా…
అరవైమైళ్ళ వేగంతో పల్సర్‌బండి పారిపోతోన్న శబ్దం తప్ప అసలేం జరిగిందో, ఏం జరుగుతుందో తెలీనంతగా వర్షం… వర్షం… ఆమ్లవర్షం.
మాడిపోతోంది… ముఖమంతా కుతకుతా వుడికిపోతోంది.
అయ్యోఁ చచ్చిపోతున్నానా?… చచ్చిపోతేబావుణ్ణు…
ఇంకా నొప్పి తెలుస్తోందే… అవును ఇలాగే బాధపడింది హర్షిత.
మగతలోనుండి మెలకువలోకి… వాస్తవంలోనుండి నిద్రలోకి.
నిద్రలోనుండి చలనంలోకి… చలనంలోనుండి అచలనంలోకి.
అచలనంలోనుండి… నుండి… నుండి మరణంలోకి.
మరణం… మరణం… వొద్దుద్దు నాకు బతకాలనుంది.
గబుక్కున లేచి కూర్చున్నాను.
గొంతంతా చుండ్రుకుపోయి నట్లుగా, ఎన్నో ఏళ్ళుగా నీటిచుక్క ఎరగని దానిలా తడారిపోయింది.
కిటికీలోనుండి మే మాసాంతపు వేడి గాలి ఈడ్చి కొడుతోంది.
ఒకటి మీద కౌగలించుకున్న రెండు ముళ్ళూ ఆ వేడికి కాబోలు వెంటనే విడిపోతు న్నాయి… అనిల్ యింకా వచ్చినట్టు లేదు… మంచం మీద లేడు.
అతికష్టం మీద లేచి గొంతు తడుపు కున్నాను.
దీర్ఘంగా వూపిరి పీల్చుకుని దిండు కానుకుని కూర్చుని కళ్ళు మూసుకున్నాను.
కలలెందుకొస్తాయి?
మనకి తెలీకుండానే మన మస్తిష్కపు లోలోపలి పొరల్లో పేరుకుపోయిన ఆలోచన లన్నీ యిలా బయటపడతాయా?
గబుక్కున భయంతో కూడిన దుఃఖం పొంగుకొచ్చింది.
హర్షిత…
”లేఖా… లేఖా” అంటూ నా చుట్టూ తిరుగుతూండే హర్షిత… ప్రియాతి ప్రియమైన చిన్ననాటి నేస్తం… నిద్రపోయే ఎనిమిది గంటలు తప్ప మిగిలిన సమయ మంతా అంటిపెట్టుకుని వుండే హర్షిత… నా కళ్ళెదుటే అసహాయంగా, నిస్సహాయంగా… హర్ష.
ఈ రోజుకి హర్షిత చనిపోయి సరిగ్గా నెలయింది.
కాలేజీలో చాలామంది హర్షితను మర్చిపోయారు.
మహిళాసంఘాల సందడి కూడ సద్దుమణిగింది…
మనుషుల చర్మాలు యిదివరకంత సున్నితంగా లేవనుకుంటాను. చాలా దళసరిగా మొద్దుబారిపోయాయి.
నేను, సెల్వి మాత్రమే హర్షితను మర్చిపోలేకుండా వున్నాం. మేం ముగ్గురం ఒక గ్రూపు… ఆ రోజు కూడ మేం ముగ్గు రం… ముందుగా నేనూ, హర్షిత… మాకు పదడుగుల వెనగ్గా వడివడిగా వస్తూ సెల్వి… కాలేజి గేటు నుండి బయట ికొస్తూండగా పల్సర్ బండి…
వర్షం… వర్షం… భయం… భయం.
ఎటునుండి ఏ మిన్నాగు కాటేస్తుందోనన్న భయం.
సగంపైగా కాలిపోయిన నా ఎడమచేయి వెక్కిరిస్తోంది నన్ను.
అయినా ఆ అశోక్‌గాడికి చేతులెలా వచ్చాయో.
కాస్త బాగ సోషల్‌గా మాట్లాడితే చాలు ప్రేమనేసుకుంటారీ అబ్బాయిలు… రంగురంగుల బట్టలేసుకొచ్చి, విపరీతంగా ఖర్చులు పెడుతూ జలక్‌లిచ్చేవాడు… ప్రేమ ప్రేమంటూ వెంటబడి, రక్తంతో వుత్తరాలు రాసి వేధించేవాడు…
ఫ్రెండ్స్ కూడ అంతే.
”అయ్యోఁ నిన్నెంత గాఢంగా ప్రేమిస్తున్నాడో హర్ష… ఈ లోకంలో మనం ప్రేమించే వాళ్ళకంటే మనని ప్రేమించే వాళ్ళని పొందగలగడం గొప్ప విషయం అంటూ ఎక్కేసేవాళ్ళు… జోక్ చేయడం వేరు. సీరియస్‌నెస్ వేరు.
అసలు వాళ్ళిద్దరి మధ్యా ఏమీ లేక పోయినా సరే పక్కనున్నవాళ్ళలా మాట్లాడడం మూలంగా ఏదో ఎఫైర్ వున్నట్లుగా మొదలవు తుంది.
హర్షిత ఆలోచనని, ప్రేమనీ ఏమాత్రం లెక్కలోకి తీసుకోకుండా, తన అభిప్రాయాన్ని మాత్రమే దానిమీద రుద్దడానికి ప్రయత్నించేవాడు అశోక్…
”హర్షిత నో చెప్పలేదా?” అంటుంది అమ్మ.
హర్షిత నో చెప్పగానే వాడు వెళ్ళిపోయి వుంటే ప్రాబ్లమేముంది?
ఒక విధమైన కోపం, అసూయ, పగ పెరిగాయి… యిలా ప్రేమ పగగా ఎందుకు మారిపోతోంది? అబ్బాయిల వ్యక్తిత్వంలో సమతులనం దెబ్బతినడానికి కారణమేమయి వుంటుంది?… ఫలితంగా హర్షిత… హర్షి
యాసిడ్ పోయడం హత్యకన్నా నేరం.
హింస… క్రూరమైన హింస… దారుణమైన హింస.
వర్షం… వర్షం… ఆమ్లవర్షం…
హఠాత్తుగా మోకాళ్ళలో తలదూర్చి ఏడవసాగాను.
ప్రేమకోసం ఆకాశపు అంచులకెళ్ళి నక్షత్రాలను కోసుకొచ్చి ప్రియురాలి తలలో ముడిచిన వాళ్ళ గురించి విన్నాను… ప్రేమించినవాళ్ళకి రాత్రి పన్నెండు గంటలపుడు వంద కొవ్వొత్తులు వెలిగించి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన వాళ్ళని చూశాను. సరేఁ చరిత్రలో ప్రేమకోసం జీవితాల్నే త్యాగాలు చేసినవాళ్ళ గురించి చదూకున్నాను.
ప్రేమ అనే ప్రియభావనని, అమృతపదార్థాన్ని విషతుల్యం చేస్తోన్న దుర్మార్గుల గురించి యిదిగో యిప్పుడే తెలుసుకుంటున్నాను…
అశోక్‌గాడికి వాళ్ళమ్మ ప్రేమించటం నేర్పలేదా? నేర్పే వుంటుంది.
మా అమ్మ చాలా మంచిది… మనుషుల్ని ప్రేమించాలని, పెద్దలని గౌరవించాలని ఎవరికే కష్టమొచ్చినా వున్నంతలో సాయం చేయాలని… నాది, నేను అనుకోకుండా మనదిగా భావించాలనీ పదేపదే చెప్తుంది.
తల్లిదండ్రులు పిల్లల్ని చాలా ఎక్కువగా ప్రేమిస్తారు… బాధ్యతతో వాళ్ళ జీవితాలను ఒక గాడిలో పడేట్టు చేస్తారు… మా అమ్మ, నాన్న బాధ్యతగల తల్లిదండ్రులు…
అయితే మరి… మరి… ఈ అనీల్ గాడికేమయింది?
చాలా నిర్లక్ష్యంగా వుంటున్నాడు.
ప్రతిదానికీ విసుగే… రాత్రిళ్ళు లేటుగా వస్తాడు. అమ్మకీ, నాన్నకీ తెలీకుండా తలుపు తెరవమని రింగిస్తాడు… వచ్చిన తర్వాత కూడ చాలాసేపు టి.వి చూస్తూ కూర్చుం టాడు… అదీ క్రైంవాచ్, నేరాలు ఘోరాలు యివే వాడి విజువల్స్.
అడిగితే తాను అన్ననన్న అహంభా వాన్ని, పెత్తనాన్ని నామీద చూపిస్తాడు.
ఇప్పుడు మా కాలేజీలో అశోక్ గ్రూప్ అని ఒక పెద్దగుంపు అమ్మాయిల్ని భయ భ్రాంతుల్ని చేస్తూ తిరుగుతోంది… వాళ్ళందరి దృష్టిలో అశోక్ గొప్ప కథానాయకుడు…
ఇవ్వాళ నా బాధంతా కేవలం హర్షిత మాత్రమే కాదు… వెక్కిరిస్తోన్న నా ఎడమచేయి కాదు… మా అన్నయ్య అనీల్ కూడ… అనీల్ యిప్పుడు అశోక్ గ్రూపులో వున్నాడు… వాళ్ళు అమ్మాయిల్ని ఏడిపిస్తూంటే వీడు పక్కనే వుండి చూస్తుంటాడు…
ఇవ్వాళ చూస్తాడు.
రేపు యాసిడ్ పోస్తాడు.
వర్షం… వర్షం… భయం… భయం.
అమ్మాయిల్ని భయపెడుతోన్న ఈ పనికిమాలిన వెధవలంతా భయంతో వణికిపోయే రోజొకటొస్తుందా?… వాళ్ళు హ్యాపీగా కాలరెగరేస్తూ తిరుగుతూంటే అమ్మాయిలు మాత్రమే బాధపడాలా?
హర్షిత ఎలా బాధపడిందో అలాగే అశోక్ కూడ బాధపడాలి?
నా ఎడమచేయి వంక కసిగా చూస్తూ.
”నడిరోడ్లో వాడిని నిలబెట్టి యాసిడ్ పోయాలి” అంటుంది సెల్వి. అప్పుడే వేరేవాళ్ళకి భయముంటుందని దాని వుద్దేశం.
వుంటుందా? భయముంటుందా?
ఎన్‌కౌంటర్ చేసిపారేస్తేనే మళ్ళీ మళ్ళీ దాడులు జరుగుతున్నాయి కదా.
ఆపుతారా? దాడులు ఆపుతారా?
అమ్మాయిలున్నది దాడులు చేయడానికేనా? హింస పెట్టడానికేనా?
వర్షం… వర్షం… వర్షం…
భయం… భయం…
నా వెక్కిళ్ళు నాకే విన్పిస్తున్నాయో?…
ప్రపంచానికంతా విన్పిస్తున్నాయో తెలీడం లేదు.
జ జ జ
సౌదామిని
ఈ సమాజంలో ఆడపిల్లల్ని కనడమేకాదు కనిపెట్టుకుని తిరగాల్సిన బాధ్యత కూడ తల్లిదండ్రులమీద పడింది…
అప్పటికీ లేఖ్యని ప్రతిరోజూ కాలేజీవద్ద దింపి తిరిగి సాయంత్రం తీసుకొచ్చేవాడు వాళ్ళనాన్న… ఒక వారం పదిరోజుల తర్వాత లేఖ్య గారాలుపోతూ ”అమ్మా మా కాలేజీలో అంతా ఆటపట్టిస్తున్నారు… నాన్నని రావొ ద్దని చెప్పమ్మా ప్లీజ్” అంటూ బతిమాలడం మొదలుపెట్టింది.
వాళ్ళ నాన్న కూడ.
”ఇంతింత ఫీజులు తీసుకుంటున్నారు కదా కాలేజీవాళ్ళు… ఆ మాత్రం విద్యార్థుల సేఫ్టీ చూసుకోరా?… పిల్లల్ని కొంత ఫ్రీగా వదలాలి మనం కూడ. రోజూ కాలేజీ వద్ద దింపి మళ్ళీ సాయంత్రం తీసుకురావడం ఎంత పనవుతుందో తెలుసా? అనీల్‌తో కలిసి వెళ్ళమని చెప్పు…” అంటూ విసుక్కు న్నారు.
అందుకే నేను లేఖ్యని ఇంటర్మీడియెట్ శ్రీ చైతన్యలో పెట్టాను దూరంగా… హాస్టల్లో వుంటే సొంత జీవితం కూడ అర్థమవుతుంద నుకున్నాను. అయితే అక్కడ చాల ఎక్కువ అర్థమయిపోయింది జీవితం.
దాని దురదృష్టమో, నా దురదృష్టమో తెలీదుగాని ఆ హాస్టల్లో వుండే లక్ష్మి అనే అమ్మాయి ఆ చదువుల పందెంలో పరిగెట్టలేక ఆత్మహత్య చేసుకుంది… అదీ హాస్టల్ వాటర్ ట్యాంకులో దూకి… అలాగే కూర్చుండి పోయింది… అలా కళ్ళు తెరుచుకుని నిర్భావంగా కూర్చుని వున్న లక్ష్మిరూపం హాస్టల్ అమ్మాయిలందరినీ కదిలించి పారేసింది.
చాలమంది అమ్మాయిలు హాస్టల్‌నుండి వెళ్ళిపోయారు తలిదండ్రుల్ని పిలపించు కుని… అసలే పరీక్షల సమయం… ఇటు ఇంటర్ పరీక్షలు. అటు మెడికలెంట్రన్స్ పోర్షను… పరుగు… పరుగు… ఒత్తిడి… ఒత్తిడి…
మరోవైపు లక్ష్మి మరణం… మానసి కంగా, శారీరకంగా బలహీనపడ ిపోయింది లేఖ్య… పరీక్షలు పూర్తిగా రాయకుండానే తీసుకొచ్చేయాల్సి వచ్చింది… సైన్స్ చదవనని మొరాయిస్తే మళ్ళీ సంవత్సరం హెచ్.ఇ.సిలో చేర్చాం.
అప్పటికే హర్షిత ఆ కాలేజీలో చదువుతోంది.
”ఖర్మ కాకపోతే ప్రపంచంలో యింత మంది అమ్మాయిలుండగా దీని స్నేహితురాలి మీదే యాసిడ్ దాడి జరగాలా? హర్షిత చచ్చి పోయి బతికిపోయింది… లేఖ్య బతికుండి రోజూరోజూ చచ్చిపోతోంది భయంతో, దిగులుతో బాధతో…
యాసిడ్ పడి వుడికిపోయిన చెయ్యి గాయం యింకా ఆరనేలేదు.
ఏ రోజూ ప్రశాంతంగా నిద్రపోవడం లేదు… ఉన్నట్టుండి వులిక్కిపడి లేచి కూర్చుంటుంది… పలకరిస్తే పెద్దగా ఏడ్చే స్తుంది…” నాలో నేనే మదనపడుతూ ఆవేదన తట్టుకోలేక పైకే అన్నట్టున్నాను.
ఈయన కూడ మేలుకునే వున్నట్టు న్నాడు.
”అవునుఁ మహాత్ముడు చెప్పినట్లుగా అర్థరాత్రి కాదు గదా పట్టపగలు అమ్మాయిల్ని కాలేజీకి పంపడానికి భయపడే రోజు లొచ్చాయి. యింకా ఏమేం దారుణాలు జరగబోతున్నాయో?… ప్చీఁ” అన్నాడు దిగులుగా.
అమ్మాయిలు యిప్పుడిప్పుడే స్వేచ్ఛగా బయటికొచ్చి సామాజిక సందర్భాలలోకి నడుస్తోన్న క్రమంలో మళ్ళీ వాళ్ళని కలుగు ల్లోకి నెట్టే కుట్ర ఏదో జరుగుతోన్నట్టుగా అన్పిస్తోంది…
ఆ మధ్య వరంగల్ యాసిడ్ దాడి తర్వాత నా మిత్రుడు సీతారాం ఫోన్ చేశాడు… ఆ క్షణానికి ఆడపిల్లల తల్లిదండ్రు లంతా పూర్తి భయాందోళనలో మునిగిపోయి వున్నారు…
”నాకు లేఖ్యని చదువు మాన్పించి పెళ్ళి చేసేయాలన్పిస్తోంది” అన్నాను అనాలోచితంగా…
”యాసిడ్ దాడి కంటే భయంకరమైన మాటన్నావు సౌదా” అంటూ ఫోను పెట్టేశాడు. ఒక్కక్షణం బాధన్పించినా నిజం మాత్రం అదే… పదేళ్ళ తర్వాత ఆడపిల్లల్ని చదివించాలంటేనే భయపడే రోజులు రాబోతున్నాయి…
”అదేంకాదు ఆడపిల్లలకి చిన్నప్పట్నుండీ చదువుతోపాటుగా కరాటే నేర్పించాలి… అదొక తప్పనిసరి అవసరంగా మనం భావించాలి… స్త్రీలకు స్వీయరక్షణని మించిన మార్గం లేదు… ఎవరో వచ్చేదాకా ఆగడం కుదరదు” అన్నాడాయన వుద్వేగంగా…
”కత్తులో, తుపాకులో, హేండ్‌బ్యాగుల్లో పెట్టుకు తిరగఖ్ఖర్లేదా” అనబోయి ఆగిపోయాను… నిజంగానే అమ్మాయిలకి స్వీయరక్షణ విధానాలు నేర్పాలి…
ప్రేమ… ప్రేమంటే ఏమిటో పిల్లలకి ఎలా తెలియజెప్పాలి?
ప్రేమనే పవిత్రభావనకు కోరలు తొడిగి వికృతంగా మార్చిన కుక్కమూతి పిందెలు, విలువల కొమ్మలకి గుంటపూలు ఎప్పట్నుండీ పూయడం మొదలుపెట్టాయి ఈ సమాజపు చెట్టుకి?
ఒకరా? యిద్దరా?
ఎంతమంది ఆడపిల్లలు ఈ ప్రేమఘాతుకానికి బలయిపోతున్నారు?
మరెంతమంది లేఖ్యలా లోలోపలే కుములుతున్నారో?… ప్చ్‌ఁ
”మనరోజుల్లో ప్రేమంటే ఒక అలౌకికమైన పవిత్రభావన… ఒకరినొకరు ప్రేమించుకోవడమంటే ఎన్నెన్ని అవరోధా లెదురయినా, ఎన్నెన్ని గతుకులేర్పడ్డా జీవితాంతం నిబద్ధతతో దానికి కట్టుబడి వుండడమే ప్రేమ…
ఫలించకపోతే అలా మౌనంగా వుండిపోడమో, మరీ భరించలేకపోతే ఆత్మ హత్య చేసుకోవడమో జరిగేది… యిప్పుడలా కాదు. ప్చ్‌ఁ” దీర్ఘంగా నిట్టూర్చాడు తను…
”అవునవునుఁ యిప్పటి పిల్లలకు ఏమాత్రం సహనం లేదు. అన్నీ యిన్‌స్టెంట్‌గా జరిగిపోవాలి. ఇవ్వాళ చూసి యిష్టపడితే రేపు ఐలవ్యూ అనేస్తారు. ఎల్లుండినుండీ ప్రేమించమని వెంటబడతారు… అమ్మాయి అభిప్రాయానికీ, యిష్టాయిష్టాలకూ ఏమాత్రం తావుండదు… ఆడపిల్లల్ని మనుషుల్లాగ కాకుండా వస్తువులుగా చూడ్డం మొదలయినందువల్లే యిట్ల అమ్మాయిలంటే అలసత్వం వచ్చేసింది… ప్రాణమంటే లెక్కలేకుండా పోయింది… మధ్యలో ఈ సెల్వి ఒకత్తి. అశోక్‌గాడి మీద యాసిడ్ పోసి జీవితమంతా బాధపడేలా చేయాలి అంటుంది… ఏంటి ఈ పిల్లల ధోరణి… మాట్లాడుతున్నానే గానీ నాకూ లోలోపల భయంగానే వుంది…” అన్నాన్నేను లోగొంతుకతో…
”ప్చ్‌ఁ పాప పడుకుందేమొ చూడు… చెయ్యి బాగా నొప్పి చేస్తున్నట్టుండి…” యాసిడ్‌తో మాడిపోయిన కూతురి చేతిని గుర్తు చేసుకుంటూ ఆయన గొంతు బొంగురుపోయింది… మళ్ళీ అంతలోనే ”వీడొచ్చాడా?” అన్నాడు హఠాత్తుగా.
”వచ్చినట్టున్నాడు. టి.వి. శబ్దమవుతోంది. రేపు కాస్త తీరిక చేసుకోండి. అనీల్‌తో మాట్లాడాలి… పిల్లలతో హాయిగా మాట్లాడుకుని ఎన్నాళ్ళో అయిపోయింది… రేపు ఆదివారం నలుగురం కలిసి ఎక్కడ ికయినా వెళ్దాం…” అంటూ నేనూ మరో వైపుకి ఒత్తిగిల్లాను…
ఏ కుర్రాడి తలలో ఏ విషనాగులు బుసకొడ్తున్నాయో, ముందే పసిగొట్టే శక్తి తల్లిదండ్రులకీ, టీచర్లకీ వుంటే ఎంత బావుండును?
నిద్రపోవడానికి ప్రయత్నిస్తూ కళ్ళు మూసుకున్నాన్నేను.
నా నడుం మీద పడిన ఆయన చేతుల్లో నుండి ఒక కొత్త ధైర్యంతో కూడిన ప్రశాంతత, ఒక ఓదార్పు నా హృదయంలోకి ప్రసరించసాగాయి.
జ జ జ
శోభ
సెల్వి నాన్నతో మాట్లాడ్డం మానేసింది.
మూడురోజులుగా యిద్దరూ ఒకరినొకరు తప్పించుకు తిరుగుతున్నారు.
ఆ మాటకొస్తే నాకు, నాన్నకి ఎప్పట్నుండో మాటల్లేవు.
కాస్త వయసొచ్చి చుట్టూ వున్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టినప్పట్నుండీ నేను ప్రతిపక్షంలో వున్నాను.
నాన్న వుంటున్నది పోలీసు వ్యవస్థలో…
వ్యక్తిగా మంచివాడయినప్పటికీ చాలాసార్లు మా యిద్దరి మధ్యా చర్చలూ, వాదనలూ నడిచి, నడిచి ఆయన్ని ఒప్పించ లేక నేను, నన్ను ఒప్పించలేక, ఆయన యిద్దరం మౌనంగా, ముభావంగా వుండి పోయాం…
నా ఉద్యోగంతోనూ, నా ఉద్యమా ల్లోనూ మునిగి ఎక్కువగా నగరంలోనే వుంటాను… ఇప్పుడు సెల్వికీ, నాన్నకీ మధ్య నడుస్తోన్నమౌనయుద్ధాన్ని విరమింపచేయడం కోసం అమ్మ పిలిపించింది.
”నాకిది కావాలని నేనెప్పుడూ అడగ లేదు డాడీ, ప్లీజ్ వాడు చావాలి ఆ దారుణ మైన చావు మిగిలిన వున్మాదులకు చెప్పు దెబ్బ కావాలి… మరెప్పుడూ ఎవరూ ఆడ పిల్లల జోలికి రాకూడదు…” కసితో, ఆవేశంతో, పసితనంతో సెల్వి మాట్లాడు తూంటే ఎలా నచ్చచెప్పాలో అటు నాన్నకీ, యిటు నాకూ అర్థం కావడం లేదు…
అసలీ యువతరం గుండెల్లోకి గంధకీకామ్లాన్ని ఇంజెక్ట్ చేస్తున్నదెవరు?
”జస్టిస్ డిలేడ్ ఈస్ జస్టిస్ డినేయిడ్ అక్కా” అంటోంది సెల్వి నిష్ఠూరంగా… సత్వరన్యాయమంటే ఏమిటి? ఎలా జరగాలి?
ముక్కుపచ్చలారని కుర్రాళ్ళను రాత్రికి రాత్రి కాల్చిపారేయడం సత్వర న్యాయమా?… నాన్న కూడ వున్నాడు ఆ సమయంలో.
కాలేజీ విద్యార్థినులంతా మర్నాడు పొంగిపొర్లుతున్న హర్షాతిరేకంతో గుంపులు గుంపులుగా తరలివచ్చి వీళ్ళనంతా హీరోల్లా అభినందించడం స్వీట్లు పంచడం, బొకేలందించడం… యిదంతా దేనికి సంకేతం.
అప్పుడు యితర రాష్ట్రాలనుండి కూడ అభినందనల వెల్లువ.
”చాలమంచి పనిచేశారు. మీ ముఖ్యమంత్రి టైగర్… టైగర్… భలే న్యాయం చెప్పారు…” అంటూ రకరకాల పొగడ్తలు…
మనుషుల్లో యింతటి క్రూరత్వం ఎప్పుడు ప్రవేశించింది.
మన సహజ సంవేదనలన్నింటినీ ఎప్పుడు ఎక్కడ ధారపోసుకున్నాం?
ఇవన్నీ నేను నాన్నతో లోతుగా చర్చించినపుడు నాన్నలో కూడ కొంత అపరాధభావం ప్రవేశించి… అక్కడ వుండలేక బదిలీ చేయించుకుని వచ్చేశారు.
ఇక్కడికొచ్చి ఆరునెలలు కూడ కాలేదు సెల్వి గుండెలమీద ఆరని దెబ్బ.
ఇరవైరోజులపాటు హర్షిత పడిన నరకయాతనని, ఆ దారుణమైన మరణాన్ని సెల్వి ఎంత ప్రయత్నించినా మరిచిపోలేక పోతోంది.
నడిరోడ్డులో అశోక్‌మీద యాసిడ్ పోసి చంపాలని యితరుల నుండి కూడ రహస్య సంకేతాలందుతున్నాయి.
దోషి అశోక్ మాత్రమేనా?
దోషి మనోహర్ మాత్రమేనా?
దోషి శ్రీనివాస్ మాత్రమేనా?
దీనికి వూతమిచ్చిందెవరు?
పిల్లల పతనానికి మూలాలు పెద్దల్లోనే వుంటాయా?
పిల్లలు కుటుంబంతోనూ, అంత కంటే ఎక్కువకాలం విద్యాలయా ల్లోనూ గడుపుతున్నారు.
”క్షణాలని ఒడిసిపట్టుకుంటూ, వేగవంతమయిపోయిన మార్కెట్ మాయ లో పడి కొట్టుకుపోతూ రియాల్టర్లుగా, ఎల్లైసీ ఏజంట్లుగా, ట్యూషన్ మాస్టర్లుగా యిలా రకరకాల వ్యాపారాల్లో మునిగి తేలుతూ పిల్లలకి విలువలు తెలియజెప్పే తీరిక యిటు తల్లిదండ్రుల్లో గానీ అటు అయ్యవార్లలో గానీ వుండడం లేదు. ఎవరి తాహతుని బట్టి వాళ్ళు పిల్లలకి చదువు కొనిస్తున్నాం కదాని మురిసిపోతున్నారు?”
సెల్విని కూర్చోబెట్టి చెప్పాన్నేను.
”అవునవునుఁ పాఠాలు చెప్పడానికే తీరిక లేకపోతే విలువలెవడిక్కావాలి అన్నట్లుగా వున్నారు మాస్టార్లు… ఒక డ్యూటీలా వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్ళి పోతున్నారు. అశోక్‌కి చదువు కూడ సరిగ్గా వచ్చేది కాదు. ఆడపిల్లల్ని ఏడిపిస్తూ వాడు కాలేజీలో తిరుగుతూంటే యిదేమిటి? అని అడిగిన మాస్టర్లే లేరు…” ఉత్సాహంగా చెప్పింది సెల్వి.
”అవును మేడం… పదోక్లాసుదాకా బాగానే చదివాడు… ఆ తర్వాత వాళ్ళ నాన్న రియాల్టర్లకు పొలం అమ్ముకోడంతో వచ్చిన డబ్బుతో దిక్కు తెలీలేదు వాడికి. చదువుని నిర్లక్ష్యం చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షించడం కోసం డబ్బులు బాగా ఖర్చుపెట్టేవాడు… ఇంట్లో చిన్నచిన్న దొంగతనాలు చేసేవాడు. ఆ తర్వాత బయటి దొంగతనాలక్కూడ అలవాటు పడ్డాడు.”
నాన్న కోసం అప్పుడే వచ్చిన సి.ఐ. సుధాకర్ అన్నాడు నాతో. సుధాకర్ యిక్కడికొచ్చిన తర్వాతే నాన్నకి పరిచయం… చాల నిజాయితీపరుడైన అధికారి… అశోక్‌ని గాలించి పట్టుకుని సెల్‌లో పెట్టడంలో అర్బన్ సి.ఐ. కంటే కూడ చురుగ్గా వ్యవహరించా డని నాన్న అంటూండగా విన్నాన్నేను. అతడి నుండి మరిన్ని వివరాలు రాబట్టాలన్నట్లు అలెర్ట్‌గా కూర్చున్నానేను.
”వాడు ఏది చెప్తే అది చేసి చూపించేవాడు. హర్షిత తనని ప్రేమించేలా చేసుకుంటానని స్నేహితులతో పందెం కాసాడు. తన పంతాన్ని నెరవేర్చుకోవడం కోసం హర్షిత వెంటబడి వేధించేవాడు. తననుకున్నది జరగకపోవడంతో కసి పెంచుకున్నాడు…” దిగులుగా కుర్చీలో వెనక్కానుకొని కూర్చుని వున్న సెల్విని చూసి చెప్తూ చెప్తూ ఆగాడు సుధాకర్.
”మరి హర్షిత కంప్లెయింట్ చేయలేదా?” ప్రశ్నించాన్నేను.
”లేదు మేడం… సాధారణంగా అమ్మాయిలు యిలాంటివాటిని బయటపెట్ట కుండా వుండడానికే చూస్తారు… ఇది నిజానికి అమ్మాయిల వైపు నుండి పెద్దలోపం… అమ్మాయిలు కూడ యిలాటి విషయాల్లో చురుగ్గా వుండి యింట్లో వాళ్ళతోనయినా చెప్పాలి…”
దీర్ఘంగా నిట్టూర్చాన్నేను.
కంప్లెయింటిస్తే వెంటనే తెగ పొడుస్తున్నట్టు. తల్లిదండ్రులూ, టీచర్లే కాకుండా పోలీసుల వైఫల్యం, నిర్లక్ష్యం చాల ఎక్కువగా కన్పిస్తోంది ఈ దాడుల విషయంలో… నిజానికి యిటువంటి విషయాల్లో అమ్మాయిలు ముందుగా రిపోర్టివ్వడానికి భయపడతారు. ఒకవేళ ఎవరయినా ధైర్యం చేసి యిచ్చినా పోలీసులు నిమ్మకునీరెత్తినట్లుగా వుంటున్నారు. స్వప్నిక విషయంలో జరిగిందదే కదా…
”ఏ విషయంలోనయినా అలసత్వం పనికిరాదు… ఎవరి బాధ్యతలు వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తే యిటువంటి దాడులు జరగవు… మన చట్టంలో మహిళలపై జరిగే దాడుల పట్ల కఠినమైన శిక్షలు లేకపోవడం ఒక విషాదం. దానికితోడు యాసిడ్ ఎక్కడ బడితే అక్కడ దొరకడం, హింసను ప్రేరేపిస్తోన్న చుట్టూ సమాజం, సినిమాలు, టి.వి. సీరియల్స్, క్రైంవాచ్, నేరాలు ఘోరాలు… ఏమయినా ఈ మీడియా చూపించే అత్యుత్సాహం శక్తివంచన లేకుండా పనిచేసింది ప్రేమోన్మాదాన్ని వ్యాప్తి చేయడంలో…” ఏదో స్టేటమెంటిచ్చినట్టుగా చెప్పానే కానీ ఈ మొత్తం కాలుష్యాన్ని శుభ్రం చేసే డిటెర్జెంట్లేవి?…
”అయితే సామాన్యులయిన తల్లిదండ్రులకు ఈ విషయాలన్నీ అర్థం కావడం లేదు మేడం… వాళ్ళు అహర్నిశలూ అప్రమత్తంగా వుండి పిల్లల ప్రవర్తనలోని మార్పుల్ని గమనించాలి… కొడుకుల గుండెల్లో యాసిడ్ సీసా వుందేమొ ముందే గుర్తించాలి. కూతుళ్ళని అరిటాకుల్లా కాకుండా కొలిమిలో కాల్చి ఖడ్గాలుగా బయటికి తీయాలి.” ఆవేశంగా అన్నాడు సుధాకర్.
”ఏంకాదు వాడు చావాలి” తారకమంత్రాన్ని జపిస్తున్నట్లుగా వున్నట్టుండి అంది సెల్వి…
నవ్వాడు సుధాకర్.
నేనూ నవ్వాను నిర్లిప్తంగా.
మన సమాజంలో బాధ్యత, ప్రజాస్వామ్యం అనేవి నిజంగా మిగిలి వున్నట్టయితే ఆ ఎన్‌కౌంటర్‌కి అంతటి ఆదరణ, ఆనందం, సంబరం, ప్రోత్సాహం దొరికివుండేవేనా?… ఆ సంఘటన చరిత్రలో రాయబడకుండా, తర్వాతి తరాలకు కంటబడకుండా దాచేస్తే బావుండునని నేననుకుంటూంటే అశోక్‌ని ఎన్‌కౌంటర్ చేయాలని ప్రజల నుండి ఈ ఒత్తిడేమిటి?
తల పట్టుకున్నాన్నేను.
పదిరోజులు సెలవుపెట్టి సెల్విని నాతో తీసుకెళ్తేనో?
”వద్దొద్దు…” సుధాకర్ నాతోనో, వాకిట్లో నిలబడివున్న కానిస్టేబిల్‌తోనో ఏదో అంటున్నాడు.
ఉలిక్కిపడ్డాన్నేను.
నిజమేఁ సర్వనాశనం జరుగుతోన్న దశలో, ముక్కలుముక్కలుగా విడిపోతోన్న క్షణంలో మనిషి వజ్రసంకల్పంతో ఎదురొడ్డి తనను తాను నిలబెట్టుకోవాలి.
”కాలేజీలో అశోక్ గ్రూప్, మనోహర్ గ్రూప్, శ్రీనివాస్ గ్రూప్ అంటూ గుంపులేర్పడుతున్నాయి మేడం… మనం యాక్షన్ తీసుకుని ఎక్కడికక్కడ అణిచేస్తేనే తప్ప ఈ దాడులాగవు… ఏదయినా జరిగినపుడు హడావిడిపడ్డం కన్నా ముందే జాగ్రత్త పడ్డం మంచిది కదా… ప్రివెన్షన్ బెటర్ కదా. ఈ విషయాన్ని గురించే సర్‌తో మాట్లాడదామని యింత ఉదయాన్నే వచ్చాను.” చాలా వుత్సాహంగా వున్నాడు సుధాకర్.
అవును సమాజం, జీవితం కొట్టే దెబ్బలకు తట్టుకోలేక దూరంగా పరిగెత్తి పారిపోవడమో, పతనమవడమో కాకుండా చెక్కుచెదరకుండా నిలబడాలి… అణిచేయాలి… అన్యాయాన్నీ, అవినీతినీ అణిచే సాహసం చేయాలి…
”ప్రతీ కాలేజీలోనూ పోలీస్ ఠాణా ఏర్పాటుచేసి నిజాయితీ పరులయిన పోలీసుల్ని నియమించాలి… డ్యూటీ మైండెడ్ వాళ్ళకి జీతాలు బాగా పెంచాలి మేడం…” నసుగుతున్నట్లుగా అన్నాడు సుధాకర్.
నిజమేఁ.
యుద్ధ ప్రాతిపదికన యివన్నీ అమలుచేయడానికి ప్రయత్నాలు, నిర్ణయాలు జరగాలి… ఇలా అనుకున్న తర్వాత కొంత వూపిరాడినట్టయింది నాకు.
అయిదు నిముషాలు గడిచాక లోపల్నుండి నాన్న రాకని సూచిస్తూ కొంత సందడి మొదలయింది…
సుధాకర్ అటెన్షన్లో నిలబడి సెల్యూట్ చేశాడు.
సెల్వి పట్టనట్టుగా నాలికెగరేసి మౌనంగా వుండిపోయింది.
నాన్న మా ముగ్గురి వంకా ఒక చూపేసి మాట్లాడే అవకాశమివ్వకుండా బయటికి నడిచారు.
జీపు గేట్లో నుండి సాగిపోయిన చాలాసేపటిదాకా ఇనుపబూట్ల శబ్దం చెవుల్లో గింగురుమంటూనే వుంది.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags