ఆర్.శశికళ
”అనుభవజ్ఞులు, సమర్థురాలైన, ఉన్నత విద్యావంతురాలైన సోనియా సోటోమేయర్ యునైటెడ్ స్టేట్స్ సుప్రీంకోర్టుఅత్యున్నత న్యాయపీఠం అలంకరించారు. ఆమెకు నేను నమస్కరిస్తున్నాను. మొట్టమొదటి లాటిన్ హిస్పోనిక్ మహిళా న్యాయమూర్తి. స్త్రీల శక్తి, యుక్తులకు ఒక ప్రబల నిదర్శనం ఆమె. కేవలం యు.ఎస్. మహిళలకే కాదు అన్ని దేశాల్లోని స్త్రీల శక్తిసామర్ధ్యాలకు స్ఫూర్తి ఆమె. స్త్రీ, పురుష సమానత్వం వైపుగా, తప్పనిసరిగా గుర్తించాల్సిన శక్తి, అనుభవజ్ఞత ఆమెది. అందుకే ఒబామా ఆమె నామినేషన్ సమర్ధించారు.” అంటూ వి.ఆర్. కృష్ణయ్యర్ గారు ‘ది హిందూ’ దినపత్రిక ఆగస్టు 13, 2009న ”ది సోటోమేయర్ సానా అండ్ జెండర్ జస్టీస్’ వ్యాసంలో ఉదహరించారు.
అత్యంత ప్రజాస్వామ్య దేశంగా పిలువబడుతున్న అమెరికాలో రెండు రాజ కీయపక్షాలు సోటోమేయర్ అభ్యర్థిత్వాన్ని ఆమోదించటంలోనే ఆమె కృషి అర్థమవు తోంది.
పేదరికంనుండి, వెనుకబడిన లాటిన్ అమెరికాగా ప్యుయర్‌ట్‌రికన్ తెగల నుండి, నిత్య సంఘర్షణల నుండి ఒక మహిళ అత్యున్నత విద్యావంతురాలై న్యాయపీఠం అధిరోహించటం సాధారణ విషయం కాదు. ఆసక్తి కలిగించే వివరాలు సంక్షిప్తంగానైనా పరిచయం కావాలి. ఎందరో మహిళలకు స్ఫూర్తినిచ్చే సోనియా మరియా సోటో మేయర్‌ను గురించిన వివరాల్లో ముఖ్యమైన అంశాలలో ఆమె ప్రతిభను, జీవనపోరాటాన్ని అర్థం చేసుకొనే ప్రయత్నమే ఈ వ్యాస పరిధి.
బాల్యం
జుయన్ సోటోమేయర్, సెలీనాబాజ్‌లు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో వివాహం చేసుకున్నారు. వీరు ప్యుయర్‌ట్ రికన్‌లు. దక్షిణ బ్రాంక్స్‌లోని ఫాక్టరీ కార్మికుడు జుయన్. వీరి సంతానం – సోనియా మరియా సోటోమేయర్, తమ్ముడు జుయన్ సోటోమేయర్. వీరు రోమన్ క్యాథలిక్ మతస్థులు. సోనియా జూన్ 25, 1954న జన్మించింది. ఆమె తల్లిని ఆదర్శంగా తీసుకొన్నది. ఎందుకంటే 9 ఏళ్ళ ప్రాయంలోనే ఆమె తండ్రి మరణించారు. తల్లి సెలీనాబాబ్ టెలిఫోన్ ఆపరేటర్‌గా, నర్సుగా పనిచేసింది. సోనియానకు 8 ఏళ్ళ ప్రాయంలో ‘టైప్ 1’ డయాబెటిస్ పేషంట్‌గా గుర్తించారు. రోజూ ఇన్సులిన్ తీసుకోవాల్సిందే.
సెలీనా పిల్లల చదువుకోసం చాలా శ్రద్ధ తీసుకొన్నది. ఆర్థిక ఇబ్బందులు లెక్కచేయలేదు, పిల్లలకోసం మంచి లైబ్రరీ తయారుచేసింది. ఎన్‌సైక్లోపెడియా బ్రిటానికా లాంటి పుస్తకాలు కొనిపెట్టింది.
సోటోమేయర్ కూడా ఆర్థిక ఇబ్బందుల కారణంగా రిటైల్ స్టోర్స్‌లోనూ, హాస్పిటల్లోనూ పనిచేసేది.
విద్యాభ్యాసం
ఎంతో కఠినమైన ప్రవేశపరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన సోనియా పేరు ప్రఖ్యాతులున్న ‘కార్డినల్ స్పెల్‌మాన్ హైస్కూల్’లో సీటు సంపాదించింది. ఇంక ఆమెకు తిరుగులేదు. ప్రిన్స్‌టన్ యూనివర్సిటిలో పూర్తిస్థాయి స్కాలర్‌షిప్ లో చేరింది. ఆ రోజుల్లో అతికొద్దిమంది యువకులు మాత్రమే విద్యనభ్యసించే వారు. లాటిన్‌లు కూడా చాలా తక్కువమంది. ‘పరాయి దేశంలో అడుగు పెట్టినట్లుగా, ఒక సందర్శకురాలిగా ఉండేది మొదట్లో నా పరిస్థితి’ అని ఆమె తన ప్రిన్స్‌టన్ యూనివర్సిటి అనుభవాల గురించి చెప్పారు. పదకోశం, వ్రాసే శక్తియుక్తుల్లో ఆమె చాలా వెనుకబడి ఉండేది. క్లాసిక్స్ అధ్యయనం చేయలేదు. లైబ్రరీలో సుదీర్ఘమైన గంటలు, ప్రతిశెలవుదినాలు క్షణాల్లా గడిపింది. ఆమెలో ఆత్మవిశ్వాసం నిండిపోయింది. ప్యుయర్‌టోరికాన్ లేదా చికాగో లాటిన్ జాతుల సంస్కృతులపై అధ్యయనం లేదు – చెప్పే అధ్యాపకులు లేరు. యూనివర్సిటి ప్రెసిడెంట్ విలియమ్ జి. బోవెన్‌కు ప్రత్యక్షంగా ఈ విషయంలో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు సోనియా. అప్పటినుండి లాటిన్ ఫాకల్టీనీ తాత్కాలిక పద్ధతులపై నియమించటం మొదలయింది. ప్రసిద్ధ చరిత్రకారుడైన పీటర్‌విక్‌తో ప్యుయర్‌ట్‌రికన్‌ల చరిత్ర రాజకీయాలపై సెమినార్ నిర్వహించటంలో ఆమె కృషి చేసింది. స్టూడెంట్ ఫాకల్టీగా క్రమశిక్షణా కమిటీలో, ప్రిన్స్‌టన్ థర్డ్‌వరల్డ్ సెంటర్ పాలనా విభాగంలో విశేషమైన సేవలు అందించింది. చివరి రెండు సంవత్సరాల కాలేజీ విద్యలో ఆమె అన్నీ ‘జు’ గ్రేడ్‌లు సాధించింది. ప్రిన్స్‌టన్‌లో ఆమె ‘లూయిస్ మునోజ్‌మరిన్’ గురించి థీసిస్ వ్రాసింది. ప్యుయర్‌ట్‌రికన్‌ల ప్రాంతంలోని రాజకీయ, ఆర్థిక పోరాటాలను స్వయంప్రతిపత్తి కోసం జరుగుతున్న విషయాలను ఆమె రికార్డు చేసింది. లూయిస్ మునోజ్‌మరిన్ – ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన తొలి ప్యుయర్‌టరికన్‌ల గవర్నర్. 178 పేజీల సిద్ధాంత గ్రంథం అది.
వివాహం
1976, ఆగస్టు 14న ఆమె గ్రాడ్యుయేషన్ ముగిసింది. బాల్యస్నేహితుడైైన ‘కలిన్ ఎడ్వర్డ్ నూనన్’ను వివాహం చేసుకొన్నది. సోనియా సోటోమేయర్ నూనన్‌గా మారింది. అతను ఒక బయాలజిస్ట్ మరియు పేటెంట్ లాయర్. 1976లో సోనియా యేల్ లా స్కూల్‌లో తిరిగి స్కాలర్‌షిప్‌తోనే ప్రవేశించింది. ఆమె హార్డ్‌వర్కర్ అనుకొన్నారు కానీ ఇతర టాప్ విద్యార్థుల్లాగా పరిగణించేవారుకాదు. ఎ. కాబ్రేన్స్ అనే మెంటార్ సహకారంతో యేల్ లా జర్నల్ ఎడిటర్ అయింది. విద్యార్థులు నడుపుతున్న యేల్ స్టడీస్ ఇన్ వరల్డ్ ఆర్దర్ మానేజింగు డైరెక్టరుగా కూడా ఆమె బాధ్యతలు తీసుకొన్నది. యేల్ లా స్కూల్ నుండి 1979లో జె.డి. అవార్డు అయింది. 1980లో న్యూయార్క్ బార్‌లో ప్రవేశం పొందారు.
న్యాయవాదవృత్తి
1979లో కాబ్రోన్స్ రెకమెండేషన్ ద్వారా ఆమె న్కూయార్క్ కౌంటీ డిస్ట్రిక్టు అటార్నీ రాబర్ట్ మోర్ జెంతా వద్ద సహాయక డిస్ట్రిక్ట్ అటార్నీగా చేరారు.
మోర్‌జెంతా సిబ్బంది కేసులతో పనివత్తిడి విపరీతంగా ఉండేది. ఇతర న్యాయవాదుల్లాగే ఆమె మొదట్లో జడ్జీల ముందర వాదించేందుకు జంకేది. ట్రయల్ డివిజన్‌లో హత్యలు, దోపిడీలు, వ్యభిచారం, పోలీసుల అరాచకత్వం లాంటి కేసుల్లో ప్రాసిక్యూట్ చేయటం అలవాటు చేసుకొన్నారు. ‘సాక్షులను క్రాస్ ఎక్జామినేషన్ చేసే సమయంలో ఎంతో నేర్పుగా పనిచేసింది. టార్జాన్ మర్డరర్ కేసు ఆమె వృత్తిలో పెద్ద ప్రొఫైల్. ఆమె చిన్న, చిన్న నేరాలు ప్రధానంగా ఆర్థిక, సాంఘిక వాతావరణ, పేదరికం వలన జరుగుతాయని భావించేవారు.
1983లో ఆమె భర్త నుండి విడిపోయింది. వాళ్ళకు పిల్లలు లేరు. వారి వివాహబంధం విచ్ఛిన్నం కావటానికి పనివత్తిడి కూడా ఒక కారణమై ఉంటుంది అన్నారు ఆమె.
సోనియా 1984లో ప్రయివేటుగా వృత్తిని ప్రారంభించారు. మాన్ హట్టన్‌లోని పాలియా మరియు హర్‌కోర్ట్‌లో సహాయకురాలిగా చేరింది. 1992 వరకూ అనేక లిటిగేషన్స్‌పై పనిచేశారు. ఇంటర్నేషనల్ లా, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఆర్‌బిట్రేషన్‌లలో ప్రత్యేక కృషి చేశారు. బ్రూక్లిన్ అపార్ట్‌మెంటులో ఆమె స్నేహితులకు, కుటుంబ సభ్యులకు లీగల్ కన్సల్‌టెంట్‌గా పనిచేశారు.
మాన్‌హట్టన్‌లో లాభాపేక్షలేని గ్రూపులో చేరి 1985-86లో మెటర్నటీ సెంటర్ అసోసియేషన్ మెంబర్‌గా కూడా తన సేవలు అందించారు.
ఫెడరల్ డిస్ట్రిక్ట్ జడ్జీగా
1991 నవంబరు 27న ప్రెసిడెంట్ జార్జ్ క.ఇ. బుష్, న్యూయార్క్ దక్షిణ జిల్లాకు యు.ఎస్. డిస్ట్రిక్ట్ కోర్టుకు నామినేట్ చేశారు. రిపబ్లికన్ సెనేటర్ వ్యతిరేకతతో కొంతకాలం ఆగిపోయింది. తర్వాత సెనేట్ ఏకగ్రీవంగా ఆమెను నామినేట్ చేసింది. అతిచిన్న వయసులోనే న్యూయార్క్ రాష్ట్రం దక్షిణ జిల్లాకు న్యాయమూర్తిగా ఎంపికయిన హెస్పోనిక్ ప్యుయర్‌టోరికన్ మహిళా జడ్జి ఆమె. ఆమె మొట్టమొదటి జడ్జీ. కరోల్ గార్డెన్స్, బ్రూక్లిన్ నుండి బ్రాంక్స్‌కు మకాం మార్చారు. యు యస్ ఫెడరల్ కోర్టులో 58 జడ్జీల్లో 7 మంది మాత్రమే స్త్రీలు ఉన్నారు. వారిలో ఆమె కూడా ఒకరు. వైట్‌కాలర్ నేరాల్లో ఆమె మిగిలిన వారికంటే మరింత కఠినంగా వ్యవహరించేవారు.
1995, మార్చి 30వ తేదీన సిల్వర్‌మాన్ వర్సెస్ మేజర్ లీన్ బేస్ బాల్ ప్లేయర్ రిలేషన్స్ కమిటి కేసు డోజోన్స్ వర్సెస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టీస్ 1995 కేసు న్యూయార్క్ టైమ్స్ వర్సెస్ తీసిని (1997) కేసుల్లో ఆమె రూలింగు కీర్తిప్రతిష్టలను ఆర్జించిపెట్టాయి. కాసల్‌రాక్ ఎన్‌టర్‌టైన్‌మెంటు వర్సెస్ కరోల్ పబ్లిషింగు గ్రూప్ 1997 కేసులో సోటోమేయర్ రూలింగును పైకోర్టులు సమర్ధించాయి. ఇలా ఎన్నో అసంఖ్యాకమైన కేసుల్లో నిక్కచ్చిగా, సమర్ధనీయంగా వ్యవహరించారు సోటోమేయర్.
జె. డేనియల్ మహాని స్థానంలోకి 1997, జూన్ 25వ తేదీన ప్రెసిడెంట్ బిల్‌క్లింటన్ సోటోమేయర్‌ను నామినేట్ చేశారు. అప్పట్లో వాల్ స్ట్రీట్ జర్నల్ ఆమె పట్ల వ్యతిరేకమైన అభిప్రాయాలు వెలువరించింది. కానీ 1997 సెప్టెంబర్ నాటికి జుడీషియల్ కమిటి ఆమె నామినేషన్‌ను నిర్ధారించింది. కోర్టు ఆఫ్ అపల్స్ జడ్జీగా సర్కూట్ కోర్టులో తన పది సం||ల అనుభవంలో 3000 కేసులు సోటోమేయర్ విచారించారు. 380 అభిప్రాయాలు వెలువరించారు. కేసులకు సంబంధించిన దాదాపు ప్రతి సూక్ష్మమైన అంశాన్ని తన సుదీర్ఘమైన రూలింగ్సులో పొందుపరిచారు.
సెకండ్ సర్కూట్ టాస్క్‌ఫోర్స్‌లో ఆమె సభ్యురాలు. లింగ, జాతి, తెగల వివక్షతలకు వ్యతిరేకంగా, నిష్పక్షపాత దృష్టితో వ్యవహరించేవారు. అక్టోబర్ 2001న యుసి బెర్కిలి స్కూల్ ఆఫ్ లాలో జి. ఓల్‌మస్ స్మారక ఉపన్యాసం ఇచ్చారు. బెర్కిలీ లా జర్నల్‌లో ‘లాటిన్ జడ్జి వాయిస్’ పేరుతో ఆ ఉపన్యాసాన్ని ప్రచురించారు.
2005లో డెమాక్రాట్స్ సోటోమేయర్ నామినేషన్‌ను ప్రెసిడెంట్ జార్జి డబ్ల్యు బుష్ దృష్టికి తీసికెళ్ళాలని ప్రయత్నించారు. రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి సంద్రాడె ఒ కాన్నడ్ స్థానంలోకి తీసుకొన్నారు.
ఆ సమయంలో ఆమె విశిష్టమైన రూలింగులు ఇచ్చారు. అవి అబార్షన్ ఫామిలీ ప్లానింగులో భాగమనే వాదనలు, సివిల్ రైట్స్, ఎత్నిక్ రైట్స్, అమెండ్‌మెంట్ రైట్స్, ప్రాపర్టీ రైట్స్ గురించి అనేకమైన రూలింగ్సు ఇచ్చారు. ఆ రూలింగ్సును న్యాయమూర్తులు, ప్రముఖులు గౌరవించారు.
సోటోమేయర్ 1998 నుండి 2007 వరకు న్యూయార్క్ యూనివర్సిటీలో విజిటింగు ప్రొఫెసర్‌గా కూడా ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు. 180 ఉపన్యాసాలు వివిధ లా జర్నల్స్‌లో అచ్చయ్యాయి. స్త్రీలు, జాతులు, మైనారిటీ తెగల వివక్షలకు సంబంధించిన ఎన్నో న్యాయసంబంధిత అంశాలను ఉపన్యసించారు. నేను అమెరికన్‌ను కానీ నాకు లాటిన్ ఆత్మ, హృదయం ఉన్నాయనేది సోటోమేయర్.
1997 నుండి 2000 సం|| వరకూ న్యూయార్క్ కన్‌స్ట్రక్షన్ కాంట్రాక్టర్ పీటర్ వైట్‌తో కలిసి జీవించారు ఆమె. తర్వాత ఆమె విడిపోయారు.
మే 26, 2009న ఒబామా సోటోమేయర్‌ను జస్టిస్ డేవిడ్ సోటిక్ స్థానంలోకి నామినేట్ చేశారు. ముగ్గురు ప్రెసిడెంట్లు విభిన్నమైన మూడు న్యాయమూర్తుల స్థానాల్లోకి నామినేట్ చేయబడిన రెండవ జూరిస్టుగా సోటోమేయర్‌ను పేర్కొంటారు.
ఆగస్టు 6, 2009న 68-31 ఓట్ల తేడాతో సెనేట్ ఆమె నామినేషన్‌ను నిర్ధారించింది. చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ ఆగస్టు 8న ఆమెతో ప్రమాణస్వీకారం చేయించారు. ఆ విధంగా అమెరికా దేశపు అత్యున్నత న్యాయస్థానంలోకి అడుగుపెట్టిన 111వ న్యాయమూర్తి అమెరికాదేశపు 3వ మహిళా న్యాయమూర్తి. హిస్పానిక్ జాతులనుండి మొదటి మహిళా న్యాయమూర్తిగా కీర్తిపొందారు. అమెరికన్ బార్ అసోసియేషన్ ఆమెను వృత్తిరీత్యా అన్నిరకాల అర్హతలున్న వ్యక్తిగా గుర్తించింది.
అవార్డులు గౌరవ పురస్కారాలు ఎన్నో అందుకొన్నారు. అమెరికన్ ఫిలసాఫికల్ సొసైటీలో 2002లో ఆమె సభ్యురాలైంది. 2006లో లాటిన్ లా స్టూడెంట్స్ అసోసియేషన్ ఆమెకు అవుట్ స్టాండింగు లాటిన్ ప్రొఫెషన్‌లో అవార్డును ఇచ్చి గౌరవించింది. 1999లో లెహమాన్ కాలేజీ నుండి, 2001లో ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ బ్రూక్లిన్ లా స్కూల్ నుండి 2003లో పీస్ యూనివర్సిటీ ‘స్కూల్‌్ ఆఫ్ లా’ నుండి గౌరవ లా డిగ్రీలు పొందారు. హప్పోస్ట్రా యూనివర్సిటి 2006లో నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా 2007 లో గౌరవ లా డిగ్రీలు ఇచ్చి గౌరవించాయి.
అనేక లా జర్నల్స్ ఆమె జుడిషియల్ రూలింగ్సు ఉప న్యాసాలు, ఆర్టికల్స్ ప్రచురించాయి.
సోనియా సోటోమేయర్ జీవితం, అరుదైన వ్యక్తితం అట్టడుగు స్థాయినుండి ఉన్నతమైన సామాజిక గౌరవం సాధించిన ఆమె కృషి స్త్రీల సామాజిక అభివృద్ధిలో ఒక స్ఫూర్తిని చరిత్రలో గతించిన పేజీలుగా కాకుండా ముందు, ముందు ఆమె శక్తివంతమైన కృషిని, న్యాయసేవలను ఈ సమాజం తల్చుకొంటూనే ఉంటుంది.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags