యాసిడ్‌ ఆయుధంగా మారిన వేళ మన కర్తవ్యమేంటి?

డిశంబరు 13 దగ్గరకొస్తోంది. ఆ రోజును జ్ఞాపకం చేసుకుంటే ఇప్పటికీ గుండెల్లో అలజడి.. వెన్నులోంచి జరజరాపాకి మెదడును కంపింపచేసిన ఉద్వేగం. వరంగల్‌లో స్వప్నిక, ప్రణీతల మీద యాసిడ్‌ దాడి జరిగిన రోజు. యావత్తు ఆంధ్రరాష్ట్రం నివ్వెరపోయిన రోజు.  ఎన్నో స్వప్నాలతో ఇంజనీరింగు వరకు ఎదిగి, యాసిడ్‌కి బలైన స్వప్నిక గుర్తొస్తే ఇప్పటికీ కళ్ళు చెమ్మగిల్లని నయనం ఆంధ్రదేశంలో లేదంటే అతిశయోక్తి కానే కాదు. ఒక సామూహిక దు:ఖం అందర్ని కమ్ముకున్న సందర్భం. ఆనాటి అరాచక, అమానుష దాడికి సాక్షిగా తన రూపాన్ని కోల్పోయి, గుండె నిబ్బరంతో అనూషలాంటి తనలాంటి బాధితులకు ఆత్మవిశ్వాసం కల్గిస్తున్న ప్రణీత మన కళ్ళెదుట తిరుగుతూ మనకి కర్తవ్యబోధ చేస్తూనే వుంది. సభ్య సమాజం, పౌర సమాజం ఈ విషయమై ఏం చెయ్యాలో చెప్పక చెబుతూనే వుంది. ఈ సంవత్సర కాలంలో ఏం జరిగింది? యాసిడ్‌ దాడులు తగ్గాయా? స్వప్నిక మీద దాడి చేసిన ముగ్గురు యువకుల్ని ఎన్‌కౌంటర్‌ చేసేసి చేతులు దులిపేసుకున్న పోలీసులు మరిన్ని యాసిడ్‌ దాడులు జరక్కుండా చర్యలేమైనా తీసుకున్నారా? ఎన్‌కౌంటర్‌లో నిందితుల్ని చంపేయడంవల్ల ఈ దాడులేమైనా తగ్గిపోయాయా? లేదు. తగ్గలేదు. మరింత పెరిగాయి. ఈ రోజు యాసిడ్‌  ప్రేమోన్మాదులకే కాదు స్త్రీల మీద దాడి చెయ్యడానికి ఆయుధంగా మారిన వైనం మనం గమనించొచ్చు.
నిన్నటికి నిన్న ఒక పోలీస్‌ కానిస్టేబుల్‌ (నిజమాబాద్‌లో) తన భార్య మీద యాసిడ్‌తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. రెండో పెళ్ళి చేసుకుని మొదటి భార్య మనోవర్తి అడిగినందుకు అతను ఈ దాడికి తెగబడ్డాడు. ‘రక్షకభటులే’ యాసిడ్‌ను ఆయుధంగా వాడ్డం మొదలుపెడితే స్త్రీలు రక్షణ కోసం ఎవరిని ఆశ్రయించాలి? వరంగల్‌ ఘటన తర్వాత మన రాష్ట్రంలో వరుసగా ఎన్నో దాడులు జరిగాయి. ఒక్క గుంటూరులోనే ఏడు యాసిడ్‌ దాడులు జరిగాయి. నిజానికి ఈ దాడులు ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక వర్గానికో పరిమితమవ్వలేదు. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 13 యాసిడ్‌ దాడుల కేసులు, ఒక్క ఆంధ్రరాష్ట్రంలోనే నమోదయ్యాయి. ఇవి రోజు రోజుకూ పెరిగే దిశలోనే వున్నాయిగాని తగ్గడం లేదు.
యాసిడ్‌ దాడి జరిగిన తర్వాత ఆ స్త్రీల పరిస్థితి గురించి, వారి మానసిక వేదన, శారీరక వైకల్యం గురించి ఎవరూ ఆలోచిస్తున్న దాఖలాలు కనపడ్డం లేదు. ఒక్కసారిగా జీవితం తల్లకిందులైపోయి, ఉన్నరూపం కోల్పోయి, కాలిన గాయాల మచ్చలే తోడుగా మిగిలిపోతున్న బాధితుల బాధాతృప్త హృదయాలకు ఊరటనందించే లేపనాలేమీ మనమివ్వడం లేదు. వారి మానసిక ఘర్షణ, షాక్‌, తీవ్రమైన వత్తిడిని గురించి పట్టించుకోవడం లేదు. ఘటన జరిగిన వెంటనే పెను సంచలనం సృష్టించి, హడావుడి చేసే ఎలక్ట్రానిక్‌ మీడియా కూడా ఆ తర్వాత మహామౌనంలోకి జారిపోతోంది.ఘటనానంతరం బాధితురాలికి అన్ని విధాలా అండగా వుండాల్సిన ప్రభుత్వం నియమాల, నిర్లక్ష్యాల చట్రంలో ఇరుక్కు పోతుంది. ‘చట్టం తన పని’ తాను చేసుకుంటూ పోతుంది’ లాంటి చవకబారు ప్రకటనలతో కాలం గడుపుతుంది. అందువల్లనే కదా ప్రణీత దాతల దయాదాక్షిణ్యాల మీద తన వైద్యం చేయించుకోవలసి వస్తోంది. బాధితులను నూటికి నూరు శాతం ఆర్ధికంగా, సామాజికంగా, వైద్యపరంగా ఆదుకోవలసిన బాధ్యత నిర్ద్వంద్వంగా ప్రభుత్వానిదే. ప్రభుత్వం ఆ పని చెయ్యనపుడు సభ్య సమాజం ప్రభుత్వం మీద వత్తిడి తేవాల్సిన అవసరం వుంది. రాజమండ్రిలో అనూష ప్రేమ పేరిట జరిగిన దాడిలో తల్లిదండ్రుల్ని కోల్పోయి, మెడ మీది నరాల్ని కోల్పోయి నిస్సహాయంగా పరాయివాళ్ళ పంచన బతుకుతున్న వైనాన్ని ఒక ఛానల్‌ ఇరవై నాలుగు గంటలపాటు చూపించినా బండబారిన మన చర్మాలు, ఘనత వహించిన ప్రభుత్వం వారి చర్మాలు ఒకింత కూడా చలించలేదు. ఇదెంత బాధాకరం? ఇదెంత దు:ఖ కారకం?
యాసిడ్‌ దాడుల నివారణ కోసం ప్రభుత్వం ఒక ముసాయిదా తయారు చేసిందని, నేడో రేపో ఆర్డినెన్స్‌ రాబోతుందని వార్తలొస్తున్నాయి. మంచిదే. స్త్రీల మీద హింసల్ని నిరోధించడానికి ఒక దాని తర్వాత ఒకటి చట్టాలు చేసుకుంటూ పోదాం. మరింత కఠినమైన శిక్షలు ప్రవేశపెట్టుకుందాం. ఎన్‌కౌంటర్లు చేసి చంపేయ్యాలని, మరణశిక్షలు వేసి వీళ్ళని ఏరెయ్యాలని  కూడా చాలామంది సెలవిస్తున్నారు. కొత్త చట్టాలు తేవడం ద్వారాను, కఠినమైన శిక్షల్ని అమలు పరచడం ద్వారాను స్త్రీలపై దాడుల్ని, హింసల్ని అరికట్టలేమని చరిత్ర చెబుతూనే వుంది. కొత్త చట్టాన్ని చేసేసి చేతులు దులిపేసుకుంటే సరిపోతుందా? అమలులో ప్రదర్శించే నిర్లక్ష్యం సంగతేంటి? గృహహింస నిరోధక చట్టం 2005, వచ్చి మూడేళ్ళయిపోయింది. ఈ చట్టం వల్ల గృహహింస తగ్గిపోయిందా? తగ్గలేదు సరి కదా ఎక్కువైంది. దీనిక్కారణం చట్టం గురించిన ప్రచారలోపం, అమలులో నిర్లక్ష్యం, జుడీషియరీ నిరాసక్తత. అమలులో చిత్తశుద్ధి లోపిస్తే ఎన్ని కొత్త చట్టాలొచ్చి లాభామేంటి??
అలాగని చట్టాలే వొద్దని అనడం లేదు. కఠినంగా శిక్షించే చట్టంతో పాటు, స్త్రీల పరంగా శిలాసదృశ్యంగా, మహాకఠినంగా మారిపోతున్న మానసిక స్థితి, దృక్పధాల మాటేంటి? కత్తులతో కుత్తుకలు కోయడం, యాసిడ్‌తో శరీరాన్ని దహించేయడం, కిరోసిన్‌ మంటల్లో కాల్చేయడంలాంటి శారీరక హింసలు, ఈటెల్లాంటి మాటలు, చర్యలతో మనసును మెలిపెట్టే, మానసికంగా కుంగదీసే మానసిక హింసల్ని అంతంచేసే చర్యలేవీ మనం చేపట్టడం లేదు. హింస స్త్రీల మనశ్శరీరాలను ఎలా ఛిద్రం చేస్తుందో  తెలియచెప్పే పాఠాలని మనం తరగతి గదుల్లోగానీ, తల్లిదండ్రుల మాటల్లోగానీ వినడం లేదు. కత్తులదాడిలో మెడలు తెగి రక్తం స్రవిస్తున్న దుర్మార్గవార్తని ఓ ఛానల్‌ ”కోతల సీజన్‌” అని వ్యాఖ్యానించగలిగిందంటే మీడియా ఈ అంశమై ఎంత మొద్దుబారిపోయిందో అర్ధమౌతోంది కదా! మరి మనమేం చెయ్యాలి?
సంస్కారవంతమైన చదువులు, విలువలతో కూడిన సాహిత్యం, మానవీయ కోణాలని ఆవిష్కరించగలిగిన మీడియా, తక్షణం స్పందించే పరిపాలన, సత్వర న్యాయమివ్వగలిగిన న్యాయవ్యవస్థ ఈనాటి తక్షణావసరం. వీటన్నింటి గురించి గొంతు విప్పే సివిల్‌ సొసైటీ కావాలిప్పుడు. అన్నింటిని మించి అహరహమూ స్త్రీని అణిచివేసి, ఆమె మానవ హక్కుల్ని కాలరాస్తున్న పితృస్వామ్య భావజాలం మీద మనమందరం మన బాణాలనెక్కుపెట్టాలి. అది మాట ద్వారానా, పాట ద్వారానా, సాహిత్యం ద్వారానా, చదువు ద్వారానా, ఉద్యమం ద్వారానా, ఉక్కు లాగా చెక్కు చెదరని ఐక్య ఆచరణ ద్వారానా అన్నది ఎవరి సంస్కారాన్ని బట్టి, ఎవరి దృక్పధాల్ని బట్టి వాళ్ళు నిర్ణయించుకోవాల్సిన సమయమిది.

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

One Response to యాసిడ్‌ ఆయుధంగా మారిన వేళ మన కర్తవ్యమేంటి?

  1. raki says:

    ప్రియ నేస్తం!
    నా బ్లాగ్స్ వీక్షించడానికి ఇదే నా ఆహ్వానం!!
    http://www.raki9-4u.blogspot.com. . naa sweeya geethaalakai..(lyrics)
    http://www.rakigita9-4u.blogspot.com naa sweeya naanaalakai…
    http://www.raki-4u. blogspot.com naa sweeya vachana kavithalakai..
    సదా మీ
    స్నేహాభిలాషి
    రాఖీ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.