Partners in crime”.
ఈ మాట చాలాసార్లు విని ఉండవచ్చు మనం.”Partners in PAIN” అని ఎప్పుడైనా విన్నారా?
అందరూ ఆమె చేసిన సేవ గురించి మాట్లాడుతారు. ఆమె ధైర్యం గురించి మాట్లాడుతారు, ఆమె చేసిన ఎన్నో పనులను గురించి మాట్లాడుతారు. నిజానికి ఆందోళన లేకుండా ఎవ్వరూ ఉండరు.
సహించడం, భరించడం తప్ప వేరే మార్గం లేనప్పుడు నొప్పిని, బాధని పళ్ళబిగువున మాత్రమే కాదు శరీరంలోని అన్ని భాగాల బిగువున భరిస్తూ, మెదడును హోరెత్తించే ఆందోళనను భరిస్తూ, పనిని, క్రియాశీలతను ఆల్టర్నేటివ్‌గా ఎంచుకునే మాలాంటి వాళ్ళ అంతరాల్లోకి తొంగి చూడడానికి ఎవరైనా భయపడతారు.
నేను, సాయి పార్టనర్స్ ఇన్ పెయిన్. సంవత్సరంలో ఒక్క రోజైనా నొప్పి, బాధ లేని రోజు ఉందా అని మా డైరీలు ఎన్నిసార్లు వెతికినా వృధా ప్రయాసే! నొప్పి నుండి, అనారోగ్యం కలుగజేసే శారీరక క్షోభ మాత్రమే కాక మానసిక కుంగుబాటు నుండి దూరంగా జరగాలి లేదా అవన్నీ మరపుకు రావాలి అంటే వేరే మార్గం చూడాలి. పడుకోవడమో, జీవితాన్ని తిట్టి పోయడమో, ఇతరులపై ఆధారపడడమో, ప్రభుత్వ సహాయం ఆర్థించడమో లాంటి పనులేవీ చేయలేదామె.
తన శరీరంలో ఏ భాగం వంద శాతం పనిచేస్తుందో ఆమెకు తెలుసు. ఆ భాగానికే పని కల్పించింది. ఆ ఒక్క భాగం ఎంతో మందికి మంచిని చేసింది, సహాయకారిగా పనిచేసింది. మెదడు!! ఆమె మెదడుతో నడిచేది. మెదడుతో పనిచేసేది. ఆమె చేతుల్లో ఏదో చెప్పలేని ఆప్యాయత. అంత బాధలోనూ ఆమె అందరినీ పలకరించేది. నా బ్రెయిన్ సర్జరీ అవుతున్నంతసేపూ ఆమె ఫోన్‌లో రాజు బావతోనే ఉంది. ఆమె టచ్ చేయని నేస్తాలు లేరు.
ఆమెకు జరిగిన సర్జరీల గురించి తెలుసుకుంటే బాధ అనిపిస్తుంది. కానీ, ఆ సర్జరీలకు ఆమె తట్టుకున్న తీరు, బాధను, మానసిక వేదనను జయించేందుకు ఆమె ఎంచుకున్న మార్గాలను బట్టి చూస్తే అబ్బురం కలుగుతుంది.
బాధకు positive side ఇతరుల బాధను తీర్చడానికి ప్రయత్నం చేయడమేనన్నది మా ఇద్దరి ఆలోచన. ఒకరకంగా ఇతరుల బాధలను తీర్చడంలో మా బాధను పూర్తిగా మర్చిపోయేవాళ్ళం.
మనిషి అన్నాక సమస్యలు, బాధలు, నొప్పులు లేకుండా ఉండవు. కానీ వాటికి మన స్పందన ఏమిటి అన్నదే మన వ్యక్తిత్వానికి ప్రతిబింబం అవుతుంది, ఎందరికో స్ఫూర్తి అవుతుంది. సాయి పద్మ స్పందన జగమెరిగిన ప్రతిబింబం. పోలియో బారిన పడిన తనలాంటి వారి కోసం పని చేయడం, ప్రభుత్వ పాఠశాలల పిల్లలను దత్తత తీసుకోవడం, పారా స్పోర్ట్స్ కోసం ఆమె చేసిన కృషి, గ్లోబల్ ఎయిడ్ ద్వారా చేపట్టిన పనులు, ఫ్యామిలీ కౌన్సిలింగ్, అడ్వకసీ, అడ్వొకేట్ సేవలు, మిల్లెట్స్ ఆహార పద్ధతులపై పని, ఒకటేమిటి? అన్నీ ఇతరులకు ప్రయోజనం కలిగించి, వారి జీవితాల్లో కొత్త కాంతిని నింపేవే!
సాయి పద్మ అంటే నాకెందుకు ఇష్టం అంటే, తన బుజ్జి చేతులతో నా చేతులు పట్టుకుని కళ్ళను, పెదాలను ఒకేసారి చిరునవ్వుకు అప్పగించి, నువ్వు, నేను ఒకటే సుమా అంటూ చెప్పకనే చెప్పే లాలన.
ఇతరులకు ఏదో ఒకటి చేయడమే కాదు, తాను వ్యక్తిగతంగా ఒక శక్తిగా ఎదిగింది. అదే నాకు అన్నింటికన్నా ఇష్టం. అసలు మాటే రాదు అని అందరూ అన్న మనిషి సంగీతం నేర్చుకుంది, కచేరీలు చేసింది, కారు నడిపింది, షూటింగ్ నేర్చుకుంది, ఈత నేర్చుకుంది. ఏటికి ఎదురీదడం అంటే మహా ఇష్టమైన నాకు ఇంతకన్నా గొప్ప విషయం ఏమనిపిస్తుంది?
సామాజిక మాధ్యమంలో ప్రతి క్షణం చురుకుగా ఉండడం వల్ల ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది, గ్లోబల్ ఎయిడ్ పనులు సులభతరం చేసింది. ఒకానొక సమయంలో నా ఆరోగ్యం బాగా క్షీణించింది. సమస్య ఏమిటో ఏ డాక్టర్‌కీ అర్థం కాలేదు. ప్రతి అవయవం పాడయిపోయింది. జగధాత్రి, రామతీర్థగారు బాగా టెన్షన్ పడ్డారు, ఇంట్లో అందరికీ ఆందోళన. ఎందరికో ఆరోగ్యం విషయంలో, డాక్టర్స్ విషయంలో సహాయం చేసే నాకు వచ్చిన రోగం ఏమిటో నాకే అర్థం కాలేదు. అప్పుడు సాయి, ఆనంద్ అన్నయ్య వాళ్ళే నేచురోపతి ట్రీట్‌మెంట్ ఇచ్చారు. వారం రోజుల ట్రీట్‌మెంట్ అనంతరం నేను brain tumour diagnose (rare desease-Cushing’s disease) అయ్యేవరకూ ఉద్యోగం చేయగలిగాను. అప్పట్లో నా కేసు తీసుకోవడం వాళ్ళకు ఎంతో రిస్క్, కానీ రిస్క్ చేశారు.
నా స్కూల్ పిల్లలకు కూడా వాళ్ళెప్పుడూ సపోర్ట్‌గా ఉండేవారు. నా తరగతి పిల్లలు రాసిన ‘లేత ఆకాశాలు’ పుస్తకం ముద్రణ కోసం నా సోల్ మేట్ మాధురీ జొన్నలగడ్డ, ఇతర స్నేహితులు ఆర్థిక సహాయం చేశారు. మిగిలిన డబ్బుల కోసం 2015లో తన పుట్టిన రోజున ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ పెట్టి, స్నేహితులు డొనేట్ చేసిన డబ్బు కూడా కలిపి ‘లేత ఆకాశాలు’ ముద్రించగలిగాము.
నాకున్న స్నేహితులందరూ నా కుటుంబానికి కూడా నేస్తాలు, ఆప్తులే. మా అబ్బాయి బడ్డీ, నా సహచరుడు బంగార్రాజు కూడా ఆమె మరణాన్ని ఇంకా జీర్ణించుకోలేదు. ఇంటికి వెళితే రాజు బావకు ఇష్టమైన టీ చేయించి ఇచ్చే ఆప్తులు ఆయన చెల్లెలు పార్వతి, ఆయన అక్క సాయి పద్మ. ఈ మధ్యే కిరణ్‌ప్రభ గారి కార్యక్రమానికి సాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినపుడు, రాజు బావను చూడగానే ‘‘రాజుకు ముందు టీ ఇవ్వండి’’ అని రెండుసార్లు పంపింది, కార్యక్రమాన్ని నడిపిస్తూ కూడా… ఆ ప్రేమ ఇక కరువే మాకు!!
మేము ముగ్గురం ` జగధాత్రి, సాయి పద్మ, విజయభాను (నేను). మాకొక whatsapp group “three musketeers” కూడా ఉంది. ఇపుడు జగధాత్రి లేదు, సాయి లేదు. నేనొక్కదాన్నే!
మరణించే వరకూ నేడే చివరిరోజు అనుకునే బ్రతకాలి అనుకునేవాళ్ళం సాయి, నేను. ఇక మరణించే వరకూ వాళ్ళిద్దరి పనులు కూడా పంచుకుంటూ, నా చిన్న చిన్న గమ్యాలను చేరుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఏనాడూ అధైర్యపడడం తెలియని నాకు వీళ్ళిద్దరి మరణం పెద్ద దెబ్బే. కానీ బ్రతకాలి. ఆ బ్రతుకుకు ఒక అర్థం ఉండాలి. మరణం ఏ రోజు పలకరించినా, ఆ చివరి క్షణం సంతృప్తితో చివరి ఊపిరి వదలాలి!!
(ఉపాధ్యాయిని, హ్యుటగాజీ నిపుణురాలు, రచయిత్రి, ఫ్రీలాన్సర్, ట్రాన్స్‌లేటర్, విశాఖపట్నం)