ప్రేమజ్యోతి, సేవానిరతి సాయిపద్మ – అనిశెట్టి రజిత

జీవితంలో ఇంకా సగం బతుకు మిగిలి ఉండగానే మానవి, స్నేహనిధి, మేధావి, ఎందరో పిల్లలకు ప్రియమైన అమ్మ, సకల జనులకు బాంధవి సాయిపద్మ రెండు రోజులు జ్వరపడి హఠాత్తుగా కుప్పకూలిపోవడం. మనందరికీ అల్విదా అంటూ వెళ్ళిపోవడం అతిపెద్ద విషాదం.

ఆమె అవసరం బాధిత సమాజానికి ఇంకా ఎంతో ఉంది. ఆమెలా మరొకరు ఉండరు కదా. మానవీయ వ్యక్తిత్వమే ఆమెకు ఆభరణం. నిత్యం బాధించే ఎంతో నొప్పిని సైతం ఓర్చుకుంటూ జీవనోత్సాహంతో ముందుకు సాగిన యోధ సాయిపద్మ.
ఈ వయసులో ఇలాంటి సమయంలోనే మనలాంటి వాళ్ళం, ఒంటరి స్త్రీలు, పెద్దవాళ్ళు ఒకే దగ్గర ఉండటం అవసరం. ఒక హోమ్‌ నిర్మాణం జరిగే దాకా వేచి ఉండటం సబబు కాదు. ఖాళీగా ఉన్న బిల్డింగ్స్‌ ఎన్నో ఉన్నాయి. దానిలో ముందు హోమ్‌ పెట్టుకొని నడపడం ముఖ్యం. ఇంకా ఎదురుచూపు జరిగే లోపల ఎందరో ఒంటరితనపు తిరస్కృతీ, అవమానాలూ భరించలేక వెళ్ళిపోతారు అని 10 సెప్టెంబర్‌ 2023న నాతో, సీతామహాలక్ష్మితో ఎంతో విపులంగా విడమర్చి చెప్పిన పద్మ ఒక ఆరు నెలలు గడవకముందే తాను వెళ్ళిపోయారు.
ఏ సమస్య చెప్పినా విడమర్చి చెప్తూ ప్రొసీడ్‌ కావాల్సిన మార్గం తెలియజెప్పే ఆమె మేధస్సును ఆ రోజు గమనించాను. మీరు వైజాగ్‌ వచ్చేయండి లక్ష్మిగారున్నారు, నేనున్నాను అంటూ నన్ను ఆహ్వానించి తాను అమరత్వం వైపు కనిపించని లోకానికి నిర్ధాక్షిణ్యంగా వెళ్ళిపోయారు. తన చిరునామా మార్చుకున్నారు. కాలం కర్కశత్వానికి మనలాంటి ఎందరో ఆప్తుల్ని వొదిలేసారు. ఆవేదనతో ఇలా అనడమే గానీ ఆమె మన నుండి దూరం అవుతానని అనుకున్నారా!? తానొక ఓదార్పు, తానొక భరోసా, తానొక త్యాగం, తానొక నందనవనం, తానొక ప్రేమగీతం, స్నేహానికి అందమైన దృశ్యం. తన మాటల్లోనే స్నేహితులంటే మన హితులు, మనం బలం బలగం, మనం మనలా జీవించేందుకు దొరికిన వరం. జీవితం మీద తనకున్న భావం జీవితం రాళ్ళిచ్చినా, పూలిచ్చినా స్వీకరించాలని.
నీలోని వాస్తవికతను నీవు నిర్వచించుకో అప్పుడే అన్ని తప్పుడుతనాలు, అనిశ్చితులు వేరయిపోయి నీవు ఎప్పుడూ వెలిగేలా చేస్తాయి అన్నప్పుడు తన జీవన తాత్వికతను ఎంత సున్నితంగా సరళంగా చెప్పారో తెలుస్తుంది.
జీవన ప్రయాణంలో నిన్ను సుడిగాలులు ఎత్తిపడేసినా పడినచోటు నుండి లేచి నిలబడాలి. కొన్నిసార్లు నీ ప్రతి అడుగడుగునా చెమటోడుస్తూ యుద్ధం చేయాల్సి వస్తుంది, అవమానాలు పడాల్సి వస్తుంది. అయినా నీవు నీ జీవన ప్రయాణంలో నడుస్తూనే ఉండాలి అంటారు పద్మ. ఎంత శక్తివంతమైన ప్రేరణ ఇది. నీచమైన ప్రవర్తనతో, శాడిజంతో ప్రతి క్షణం ఎవరి మీదనో నిందలు మోపుతూ, అకారణంగా గేలిచేస్తూ హింసించే వాళ్ళపై ఏదో ఒకరోజున గాయపడిన సమూహాలు పిడుగులు పడి దహించినట్లు నాశనం చేస్తాయి. అందుకు సమయం పడుతుంది అంతే అంటారు విశ్వాసంతో ఆమె. కాలాన్ని విశ్వసించే మనిషి కదా!
విశాలమైన జీవన వేదికపై తమ కలల్ని సాకారం చేసుకోవడానికి నిలబడిన వారిని మూలలకు తోసివేస్తూ వచ్చేవాళ్ళు ఎన్నో అబద్ధాలు నాటకాలు ఆడుతారు? తమ కలల్ని పండిరచుకోవాలన్న వారి విషయం ఏమిటి?
ఈ సమాజంలో ఉన్న సవాలక్ష దొంగ నటనల వ్యక్తుల తప్పుడు వ్యక్తిత్వాల వల్ల కలల్ని చంపేసుకుంటున్న వారి పట్ల ఆర్తితో అల్లాడుతుంది పద్మ మనసు. ఆమెకు ఉన్న ఉదాత్తమైన మనసు. అందరికోసం తపించే గుణం అది.
ట్రోలింగ్‌ అనేది ఒక సైకోశాడిజమ్‌, దురహంకారంతో విరజిమ్మే విషం. మూర్ఖత్వంతో విశృంఖలించే ఉన్మాదం. దాని గురించి పద్మÑ వాళ్ళను వాళ్ళే విక్టిమ్స్‌ అనుకోవడం, తమకు కలిగే కష్టమే కష్టమనుకోవడం.. మనకెందుకు అని తప్పించుకుపోవడం ఇదంతా ట్రోలింగ్‌ విషయంలో తన ప్రశ్నలకు ఇతరుల నుంచి కనుగొన్న సమాధానాలు. నేను కలలుగనే నడక నడవలేకపోయినా నా మిత్రుల సహకారంతో ఇతరులను దృఢంగా నడిపించగలను. ఈ ప్రయాణం కొనసాగించే వనరులు, శక్తులు నాకు సమకూరుతాయనే నేను నమ్ముతాను. మనకు తోడ్పడే సాంకేతికతలు ఒక పనిముట్టుగానే కాకుండా మన జీవితాలకు భద్రతనిచ్చే, శరీరాలను కాపాడే యంత్రాలుగానే భావిద్దాం అంటారు. మనల్ని మనం ఎప్పుడూ కూడగట్టుకొని నిలబెట్టుకోవడానికి స్పష్టంగా, పెద్దగా గతానికి చెందిన బాధలను మూసేయాలి. ఎంత గట్టిగా వాటిని వెనక్కి తోసి మూసివేయాలంటే మళ్ళీ అవి ఏనాటికీ తెరుచుకొని బయటికి రాకుండా, అమూల్యమైన నిన్ను నీవు పొందడానికి నీవు మోస్తున్న బరువులను దించేసి మూసిపెట్టేయాలి.
ఒక మనిషిగా నేను పితృస్వామ్యాన్ని ఎదిరిస్తూ మహిళా దినోత్సవం రోజుని పూర్తిగా మర్చిపోయాను. అయితే ఈ సంవత్సరమూ నన్ను మనిషిగానే ఉండనీయండి. వాలంటైన్స్‌ డే గురించి మాట్లాడుతూ మనల్ని మనం ప్రేమించుకునే సూత్రాలు కొన్ని చెప్పుకొస్తారు. అంతా మనతోనే మొదలవుతుంది. దాన్ని గట్టిపర్చుకో. ప్రతిసారీ ఒకే అడుగు వేస్తూండు.
నీవు నీపట్ల ప్రేమకు జవాబుదారివి కాదు. నీ స్వప్రేమను వివరించాల్సిన అవసరం లేదు. రోజులు చాలా మంచిగా ఉన్నప్పుడు నీ స్వప్రేమకు సంబంధించిన పని ఒకటి ఏదైనా చేయి. అదే రోజులు బాగాలేనప్పుడు నీ స్వప్రేమ పట్ల రెండు పనులేమైనా చేయి. అందరికీ పరిధులంటూ ఉంటాయి. నీకూ ఉంటాయి. వాటిని ఆమోదించు. వాటితో పోరాడకు. నీవు గొప్ప మహిళవనుకోకు.. సహాయం కోసం అడుగు. మనిషిగా ఉండటమే గొప్ప సంతృప్తి. వైకల్యం అనేది ప్రతి ఒక్కరికీ ప్రత్యేకం. దానిని అధిగమించే చిట్కాలను రాసుకో. నీలోని వైకల్యం నీకు కొన్ని నైపుణ్యాలను ఇచ్చింది. అది నీలోని ఉత్సాహాన్ని ఏమీ చేయలేకపోయిందన్న కృతజ్ఞతతో ఉండు.
సాయిపద్మ భావాలు తనపట్లా, మనపట్లా, అందరిపట్లా ఎంతో వాస్తవికమైనవి, ఆలోచించాల్సినవి, ఆచరణలోకి తెచ్చుకోవాల్సి ఉన్నవి. విపరీతంగా ఆలోచనలు చుట్టుముట్టినప్పుడు ఏదైనా పుస్తకం చదవటమో, తోటపని చేసి శారీరక శ్రమకు సంబంధించిన పనుల్లోకి దిగిపోవాలంటారు. ఆమె ప్రేమజీవి. తనను తాను ఎంతగా ప్రేమిస్తారో ప్రపంచం మొత్తాన్నీ అంతగానే ప్రేమిస్తారు. తను గత 16 ఏళ్ళుగా బౌద్ధమార్గ చోదకుడు అయిన ప్రజ్ఞానంద్‌ కరుణానంద్‌ గారితో వివాహమై సహజీవనం చేసిన రోజులు ఆమె జీవితంలో అత్యంత ఆనందకరమైన రోజులు. తనకు పిల్లలు కావాలని ఆరాటం వ్యక్తం చేసినపుడు, ఆనంద్‌ గారు సమాజంలోని పిల్లలందరూ మన పిల్లలుగా భావించుకోలేమా అంటూ 2008 నుండి రెండువేల అయిదు వందల (2500) మంది పిల్లలకు తల్లిదండ్రులయినారు.
తన జీవితకాలంలో 18 సర్జరీలు, 52 షాక్‌ ట్రీట్‌మెంట్‌లు ఎదుర్కొన్నారు. తన శరీరంలో మేకులు లాంటి రాడ్‌లు ఉన్నాయి. నిత్యం కదలికల్లో నొప్పి. వీల్‌ చెయిర్‌లోకి వచ్చాక పెరిగిన బరువు. 2008 నుండి సర్చ్‌ చేస్తూ 2017లో యు.ఎస్‌. నుండి కాళ్ళకు అడ్వాన్స్‌డ్‌ బ్రేసెస్‌ తెచ్చి తొడిగారు. ఆ బ్రేసెస్‌ను ఆమె తన ఒంటిమీద రెండో చర్మం అంటారు. ఉపగ్రహాల్లో వాడే తేలికైన పదార్థంతో తయారు కాబడే బ్రేసెస్‌ని మన దగ్గర కూడా ఉపయోగపడేందుకు దోహదం చేసారు వారిద్దరూ.
పద్మకు చిన్నతనంలోనే పోలియో అటాక్‌ కావడం, అది చాలా తీవ్రమైనది కావడం వల్ల అలాంటి కేసుల్లో సెల్‌ డీజెనరేషన్‌ చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. అందువల్ల ఆమె వైద్యశాస్త్రం ప్రకారం ఎక్కువ కాలం బతికే అవకాశాలు లేవు. కానీ 16 ఏళ్ళుగా ప్రజ్ఞానంద్‌ ఆమెపట్ల ఎంతో శ్రద్ధగా రకరకాల దినుసులతో వంటలు చేస్తూ ఆమెతో తినిపించడం, అనుక్షణం తోడుగా నీడలా ఉంటూ ఆప్యాయంగా చూసుకోవడం వల్ల ఆమె ఈ 53 సంవత్సరాలు జీవించారు.
అయితే ఆ ప్రేమమూర్తి హఠాత్తుగా వెళ్ళిపోవడం మనకెంత వెలితిగా, వేదనగా ఉన్నా కాలం ఆమెను పుట్టించింది, ఆమెతో సంఘజీవిగా కొన్ని పాత్రలు పోషింపజేసింది. తన ముద్రలు వేస్తూ నడిచేలా చేసింది. నలుగురికి మేలు చేసేలా తీర్చిదిద్దింది. నడత! నడక! అంటే ఏమిటో ఒక మనిషికి అనేది లోకానికి ఎరుకపర్చింది.
మళ్ళీ కలుద్దాం అనుకున్నాం, ఆ అవకాశమే లేకుండా పోయింది. నిర్వేదం ఆవరించింది. దాన్ని ఎప్పటికప్పుడు దులుపేసుకోవాలన్న సందేశమిచ్చిన స్నేహిత మాటను కాదనలేము కదా! మచ్చలున్న జాబిల్లి అయినా వెన్నెలలు వర్చించిన నీలిమేఘం.. ఆమె. మళ్ళీ ఎప్పుడొస్తుందని ఎదురుచూడాలా.. ఎన్నో శారీరక బాధలు, మానసిక ఒత్తిడులున్నా ఒక సంపూర్ణ మానవిలా జీవించిన ఆత్మీయ స్నేహిత సాయిపద్మ.. మనకు మనం ఎంతగా సర్దిచెప్పుకున్నా వియ్‌ మిస్‌ యూ అమ్మా.. వియ్‌ ఆల్‌ లవ్‌ యూ రా తల్లీ! నీ శక్తినీ సంకల్పాన్నీ వారసత్వంగా మాకిచ్చి ఇక సెలవంటూ వెళ్ళిపోయావా! అబద్ధం కదూ.. `

Share
This entry was posted in సాయి పద్మ ప్రత్యేకం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.