తక్కువ జీవితకాలం వున్నవాళ్లు ఎక్కువ పనిచేస్తారని, ఆ అవుట్‌పుట్‌కి చాలా వాల్యూ వుంటుందని స్టీఫెన్ హాకింగ్స్ అంటాడు. అంగవైకల్యం మనిషిని మరింత దృఢపరుస్తుందని, అందుకు తానే సజీవ ఉదాహరణ అని కూడా చెప్తాడాయన. సాయిపద్మకీ ఈ సూత్రం వర్తిస్తుంది. పోలియోని ఒక అంగవైకల్యంగా చూడకుండా, దానిని ఒక ‘ఎసెట్’ లాగా మార్చుకుందామె.
ఆ కారణమే … ఈరోజు మనం ఆమెకు ఇంత ఘనంగా నివాళి అర్పించేలా చేసింది. తనను తాను ఎప్పటికీ ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా వుండేలా తన జీవితాన్ని మలచుకున్న ధీర ఆమె.
సాయిపద్మ నిజంగానే ఒక ఫైటర్. ‘నువ్వు చెయ్యలేవు’ అన్న ప్రతి పనినీ చేసి చూపించిందామె. 40 ఏళ్లు దాటిన వయసులో ఎల్‌ఎల్‌బి చదివి, కోర్టు కేసులు చూసింది. పీడితుల పక్షాన న్యాయపరంగా తను చేయగలిగిందంతా చేసి చూపించిన గట్టిపిండం. అండ లేని నిరుపేద పిల్లల సంరక్షణ కోసం సాయిపద్మ నడుపుతున్న హోమ్ చాలా ఏళ్లుగా నిరంతరాయంగా పనిచేస్తోందిబీ మంచి ఫలితాలనిస్తోంది. ఇలా ఏ కోణం నుంచి చూసినా సాయిపద్మ జీవితం అందరూ ఆదర్శంగా తీసుకోవాల్సినదే. అంగవైకల్యం వుందని నిరాశపడేవాళ్లు ఆమె నుంచి ప్రేరణ పొందాలి. ఎంతకాలం జీవించాం అన్నదానికన్నా, ఎంత పని చేసిచూపించాం అన్నది ఆమె స్ఫూర్తితో నేర్చుకోవచ్చు.
సాయిపద్మతో నా పరిచయం సుమారు 40 ఏళ్లనాటిది. కానీ మధ్యలో దాదాపు పదిహేనేళ్లు దాటి గ్యాప్ వచ్చినా, తిరిగి ఫేస్‌బుక్ మాధ్యమం ద్వారా కలుసుకోగలిగాం. మంచి చదువరి. ఏటా జరిగే హైదరాబాద్ బుక్‌ఫెయిర్ నుంచి ఓ పదీ ఏళ్లపాటు నాతో పుస్తకాలు తెప్పించుకుంది. 2022 దాకా నేను ఆమెకు పుస్తకాలు పంపాను. ‘మా తమ్మీ ఎంత పెద్ద బస్తా పంపాడో చూడండి’ అని ఎఫ్‌బీలో ఆ తెల్లగోతం ఫొటో పెట్టి మరీ ప్రస్తావన తీసుకువచ్చేది. అలాగే, విజయవాడ బుక్‌ఫెయిర్ నుంచి కూడా మిత్రులతో పుస్తకాలు తెప్పించుకునేది. గమ్మత్తేమిటంటే ఇవన్నీ తెలుగు పుస్తకాలే. ఇంగ్లీష్ పుస్తకాలు కూడా చాలా చూశాను వారింట్లో. తనకు నచ్చిన పుస్తకాలను పరిచయం చేస్తూ ఎఫ్‌బిలో చాలామందికి సాహిత్యం మీద ప్రేమను పంచింది.
ఒకవైపు తన జీవితం ఎప్పుడు ఎటువైపు ఎలా మలుపు తిరుగుతుందో అనే విషయం తెలిసి కూడా మొండిగా ముందుకే నడిచిన సాహసి సాయిపద్మ. ఆమె మరణానికి మూడు వారాల ముందు తనతో ఫోన్లో మాట్లాడాను. 2018లో ఆఖరిసారి ఆమెను కలిశాను. అదే ఆఖరు తనను చూడడం. కానీ, ఫోన్లలో, సోషల్ మీడియా ద్వారా ఆమె అందించిన సారం మాత్రం చిన్నది కాదు. కానీ, తన జీవితకాలమే చిన్నదిగా మిగిలిపోయింది. అయినా, సాయిపద్మ అనే మనిషి, ఆమె రూపం మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆమెకు చిన్న నివాళి అర్పించడం సాధ్యంకాదు. ఎందుకంటే, ఆమె చేసిన పనులు అంత పెద్దవి కాబట్టి. నేను ఆమెకు ఎలాంటి నివాళినీ అర్పించలేను … భౌతికంగా లేకున్నా, మానసికంగా మనతోనే వున్నదనే భావన వుందికాబట్టి.