ఎస్వీ కవిత్వంలో స్త్రీవాద దృక్పథం`ఓ పరామర్శ – డాక్టర్‌ కొండపల్లి నీహారణి

కవిత్వం ఒక భావ పరంపర. ఒక నిరంతర ధార.అనంత సంగ్రామాలను, అద్భుత సంద్రాలను తనలో ఇముడ్చుకుంటుంది. ఈ జీవిత ప్రవాహంలో కష్టాల రాళ్లను, సుఖాల నీళ్లను తనతో తీసుకొస్తుంది, తోసుకొస్తుంది. కవి అంతా కవిత్వం అయినా, కవిత్వమే కవి అయినా కానలేని కారణాలేవీ ఉండవు.సమాజం సర్వ సమస్యల నిలయం. కంటికి అందకున్నా మనో నేత్రంతో చూసి ఆలోచనలకు, సంక్లిష్టతలకు అక్షర నెలవయ్యేదే కవిత్వం. జీవితాల్లో సుఖ సంతోషాల పాశాలు ఏవైనా అల్లిబిల్లిగా మనస్సును అల్లుకున్నప్పుడు కవిత్వంగా వచ్చి తీరుతుంది.

కవిత్వం ఒక ఆల్కైమి.కవి కవిత్వానికి ఆలంబన. కవిత్వం కవికి ఆలంబన.ఐదు దశాబ్దాలపైగా కవిత్వమే ఊపిరిగా శ్వాసిస్తున్న ఎస్వీ సత్యనారాయణ కవిత్వాన్ని పరామర్శిస్తే, 1978లో ‘‘సరిగమలు’’ కవితా సంపుటి తెచ్చినా, 1985లో ‘‘జీవజ్వాల’’ను చూపించినా కవిత్వంతో ఆయన, ఆయనతో కవిత్వం పెనవేసుకున్నట్లు తెలుస్తుంది. 2005లో ‘‘జీవితం ఒక ఉద్యమం’’ అన్నారు. 2018లో ‘‘ఉద్యమం ఉద్యమమే’’ అని అన్నారు. ఇవన్నీ కవితల కణికలై కవితా సంపుటులై మనకు ఎస్వీని చిర యశస్వీగా చిత్రీక పట్టి చూపిస్తున్నాయి.
‘‘ఎన్ని ఒడిదొడుకుల్నీ/ ఉత్థాన పతనాల్నీ గర్భంలో దాచుకుని గత శతాబ్దం మెల్లిగా వెనక్కి జారిపోయింది
సంక్షోభాల సముదాయం అనుభవాల సంచయం’’ అంటారు. ఇటువంటి తాత్విక కవిత్వాన్ని అందించిన ఎస్వీ ఒక నిబద్ధతతో కవిత్వాన్ని రాస్తారు. ‘‘తెలుగులో ఉద్యమ గీతాలు’’ అనే అంశం పైన పరిశోధన చేసి డాక్టరేట్‌ అందుకున్న ఎస్వీ ఆచార్యునిగా, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ అధ్యక్షులుగా, ఆర్ట్స్‌ ఫ్యాకల్టీ డీన్‌ గా, ఆర్ట్స్‌ కళాశాల ప్రధానాచార్యులుగా పనిచేసి పదవీ విరమణ అయితే తీసుకున్నారు గాని, కవిత్వ రచనలో విరామ మెరుగని కవి. వేదిక మీద ప్రసంగిస్తున్నారంటే ప్రాంగణమంతా ఎస్వీ గంభీరమైన గళంతో ప్రతిధ్వనిస్తుంది అనడానికి ఎన్నో ఏళ్ళు ‘పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ’ ఉపకులపతిగా ఉన్న రోజులు గుర్తుకు వస్తాయి. ఇప్పుడు స్త్రీవాద దృక్పథంతో ఎస్వీ కవిత్వాన్ని పరామర్శించడం ఎందుకు అంటే ఇది ఒక అవసరం అయ్యింది కనుక! ఏం అవసరం? ఎవరికీ అవసరం? ఎందుకు అవసరం? ప్రశ్నలే కొడవళ్ళై జవాబుల పంటలను కోయాల్సిన సందర్భంలోనే ఇంకా ఈ సమాజం ఉన్నది. ఎస్‌!! నేనే గొప్ప అనే పురుóషాదిపత్యాన్ని గురించి చెబుదామా? ఆమెలో అనేక ఆమెలు ఇంకా ఇంకా వాళ్ళ జీవితాల్ని ప్రశ్నార్ధకంగానే దిగులు చూపులతో ‘జీవిస్తున్నారు’ కాబట్టి స్త్రీవాదం గురించి చెబుదామా? చెప్పాలి! ఎలా చెప్పినా, ఏదీ తీసుకున్నా ఎన్ని విధాల ఉద్దేశించినా ఇంకా ఇంకా స్త్రీల పక్షాన నిలబడాల్సి వచ్చే పరిస్థితులే ఉన్నాయి. అందుకే ఆచార్య ఎస్వీ కవిత్వంలోని స్త్రీ వాద కోణం ఎలా ఉంటుందో చూడడం కూడా అనివార్యమైంది. ఎందుకంటే ఎస్వీ కవితల్లో దాగిన నిప్పు రేణువులు స్త్రీల పక్షాన ఎలా మండిస్తున్నాయి? అవి ప్రస్తుత కాలానికి ఎందుకు అవసరమో ఎలా అన్వయిస్తు తెలుసుకోవాలి గనుక ఈ తెలుసుకోవడంలోనే ఓ తెలివిడి ఉంటుంది కనుక.
అమ్మ అనే కవితలో ‘‘అమ్మ సముద్రం’’, అంటారు ‘‘అమ్మ పర్వతం’’ అంటారు.’‘‘అమ్మ జలపాతం’’ అంటారు. ‘‘చిరాకులను చీకట్లను చప్పరించిన కొవ్వొత్తిగా’’ వర్ణిస్తారు ఇది వర్ణననా? ఈ సత్యాన్ని వ్యక్తీకరించడమా? ఇందులో ఉపమానాల గొప్పతనాన్ని లెక్కిద్దామా నిజరూప సందర్శనం చేశారని అందామా ఎందుకంటే అమ్మను గురించి కవితలల్లని కవులున్నారా ఈ లోకంలో జీవన్మరణ సంఘర్షణలో అమ్మ ఓ సమ్యక్‌ చిత్రం! అందుకే ఎస్వీ అంటారు.
‘‘నిప్పు కణికల్ని గుండెలో దాచుకుని పెదాలపై వెన్నెల విరబూయించిన దయామయి
ఒకే ఒక్క పిలుపుతో పులకరించిన మమతల చెట్టు ‘‘అమ్మ’’ అంటారు.
అనేది ఎంత సరైనదో ఈ వాక్యాలను చదివితే తెలుస్తుంది. ఈ కవితలో ఎన్ని ఎలిమెంట్స్‌ దాగున్నాయో పరిశీలిద్దాం. 9 నెలల గర్భం ఆమెను ఆనందంలో పడవేసినా, ప్రాణిగా భూమ్మీద పడేసేందుకు ఎంత యాతనను అనుభవిస్తుందో ఏ జ్ఞానవంతులకైనా ఏ బుద్ధిమంతులకైనా తెలిసి తీరుతుంది. నీళ్ళాట అంటే చచ్చి బ్రతకడం! కనడం ఒకఎత్తు అయితే పెంచడం మరో ఎత్తు. ఆర్థికంగా బలంగా ఉన్నంత మాత్రాన పిల్లలు పెరిగిపోరు అందుకే ఎస్వి,
‘‘మా అలసటని అనారోగ్యాన్ని విసుగుని విషాదాలను దూరం చేసిన
మా బలాన్ని మా బలగాన్ని పెంచిన
వేయి కొమ్మల నీడ తల్లి’’ అంటారు. ఇక్కడే కదా స్త్రీవాదం కనిపించేది. కన్నవాళ్ళు పెంచే బాధ్యత ఉంటుంది కదా ఏముంది అని కొట్టి పారేయకుండా తల్లిగా స్త్రీ పడే కష్టాన్ని గుర్తెరగడమన్నమాట. ‘‘అనుబంధాల యాక్సిడెంట్లను దిగమింగుకోలేక /కుమిలిపోయిన పిచ్చి తల్లి’’ అని వేదనాభరిత వాక్యాన్ని రాస్తారు ఇలా తల్లిని ప్రేమించే వాళ్ళు తప్పకుండా భార్యను ప్రేమిస్తారు. ఈ ప్రేమ ఈ గౌరవాలు సమాజంలోని స్త్రీ జాతిని గౌరవించేందుకు ప్రేరణ కల్పిస్తాయి.’’ఎంత గట్టి పిల్ల’’ అంటూ ప్రారంభించిన ‘‘ఆమె’’ అనే కవిత ఎస్వీ భార్య భారతి గురించి రాసిన కవిత. కుటుంబం కొరకు తన కెరియర్ను వదులుకున్నదని చెబుతూ ‘‘ఆమె సరస్వతికి పర్యాయపదంగా గౌరవించాల్సిందే కదా’’ అన్నప్పుడు భారతి తోపాటు భారతదేశ సంప్రదాయ సిద్ధమైన చదువులమ్మ సరస్వతిదేవి పై గౌరవాన్ని ప్రదర్శిస్తారు. ఇది చాలదూ స్త్రీల పట్ల చిన్నచూపు లేదు అనడానికి ? స్త్రీవాద వృక్షానికి ఓ చక్కని కొమ్మ అనడానికి ఉదాహరణగా
‘‘మా బాధ్యతలన్నీ ఆమె భుజం మీదే మా బరువులు అన్నీ ఆమె తల మీదే
మా అనారోగ్యానికి ఔషధం మా పనులన్నింటికీ ఊత కర్ర
ఆమె కేవలం జీవన సహచరి మాత్రమే కాదు చక్కని స్నేహితురాలు
ఆమె ఇంటికి ఇల్లాలు మాత్రమే కాదు
చల్లని ప్రేమ మూర్తి’’ అనడాన్ని చెప్పవచ్చు. ఇది ఆడవాళ్ళ తత్వ చిత్రణ, వ్యక్తిత్వ చిత్రణ మనస్తత్వ చిత్రణ. ఇన్ని కష్టాలు వచ్చినా కుటుంబ రక్షణ బాధ్యత వీడని వాళ్ళ శాతమే ఎక్కువ. ఈ కోట్ల జనాల్లో ఏ వందల సంఖ్యలోనూ బాధ్యత రాహిత్యంగా ఉండే ఆడవాళ్లు కనిపిస్తారే గాని సహనమూర్తిగా సౌజన్య మూర్తిగా స్త్రీలు అంటే ఇట్లాగే గొప్పగా ఉంటారు. జీవితానికి స్త్రీలు ఎలాగో పోలికలు, పద చిత్రాలు కవిత్వ శిల్ప నిర్మాణానికి ఊత కర్రలు. భావ అంతర్భాగంగా రెండు విషయాల మధ్య ఉపమిస్తూ ‘‘మా అనారోగ్యానికి ఔషధం’’ అనడంలోనే ఔషధం జబ్బుని నయం చేస్తుంది. ఇల్లాలు ఇంటి మానసిక రుగ్మతలని నయం చేస్తుంది అని స్పష్టం చేస్తారు. ఇంటి బాధ్యతలను మోసే ఎప్పుడూ ధైర్యవంతురాలుగా మార్గదర్శిగా చెప్పడం చూస్తాం. Portiachel society అంటే సమాజం పితృస్వామ్య సమాజ ప్రభావంతో నడుస్తున్నదీ సమాజం. Gender inequality అంటే లింగ భేదం తో స్త్రీ పురుష గణనలో పురుషాధిపత్యంతో నడుస్తున్నది. అందుకే నేత్ర చైతన్యం’’ అనే కవితలో’’
‘‘ఆడపిల్లల్ని చూడనివ్వండి తలెత్తి కళ్ళెత్తి సూటిగానే చూడనివ్వండి
తాత.. తండ్రి.. కొడుకు.. కళ్ళతో కాదు తమ కళ్ళతోనే..’’ అంటారు ఎస్వీ. ఈ ఆధిపత్య భావజాలాన్ని ఖండిరచడం గమనిస్తాం.’’ అబద్ధాలు ప్రచారం చేయకండి/అడ్డు గీతాలు గీయకండి/తరతరాల దురహంకారంపై దుర్నీతిపై ఒక దృఢమైన చూపునే చూడనివ్వండి/ ప్రతిఘటన చైతన్యానికి ప్రతీకలై మండనివ్వండి’’ ఇంత స్పష్టంగా ఏ విధమైన భేషజం లేకుండా చెప్పడం గమనిస్తాం. ఎంత కఠిన పాషణ హృదయులో ఉన్నారు ఇండ్లల్లో! తండ్రి రూపంలోనూ, భర్త రూపంలోనూ ఆడవాళ్ళను అడుగడుగునా ఆంక్షలు పెడుతూ వాళ్ళను హాయిగా నవ్వడానికి కూడా హక్కు లేని పరిస్థితులు ఏర్పరుస్తారన్నది చూసి కవి హృదయం ఇలా ఘోషించింది.
ఎస్వీ కవిత్వంలో పురాణేతిహాసాలలోని పాత్రలను తీసుకొని నేటి కాలానికి సమన్వయ పరచడం, స్త్రీవాద భావజాలాన్ని సూటిగా అర్థం చేయిస్తూ రాయడం చూస్తాం ‘‘శబరి స్వగతం’’ కవితలో
‘‘నా ఎంగిలి పండ్లు తిని కదా శ్రీరాముడు దశకంఠుడిని సంహరించాడని సంతోషించేదాన్ని
మహోదృత ప్రకృతి బీభత్సాలు సంభవిస్తే తప్ప నాకేం డోకా లేదని అహంకరించేదాన్ని
యుగాలు మారిన ఆగని ప్రవాహాన్ని పులకించేదాన్ని ఉన్నట్లుండి దశాననుడు పునరుద్ధానం చెందాడు
ఒక్కో శిరస్సు ఒక్క రూపమే విజృంభిస్తున్నాడు రాముడికి రేగుపండ్లు ఎందుకు ఇచ్చావు అని బుస కొడుతున్నాడు
అంటూ పోలవరం ప్రాజెక్టు విషయంపై ఘాటైన కవిత్వాన్ని రాశారు. సామాజిక స్పృహ ఉన్న కవుల కలం తీరే వేరు అనడానికి ఎస్వీ కవిత్వాన్ని చెప్పవచ్చు. ‘‘నదీ రోదన’’ కవితలో
ఒంటరిగా ఒడ్డున నిలబడి చూస్తున్న నా కళ్ళకు నది ఒక విషాదగీతంలా విలాప సంగీతంలా వినబడుతున్నది…..
రసాయన వ్యర్థాలతో మానవ తప్పిదాలతో నీ ఒళ్లంతా విష కాలుష్యం అవుతుంటే
ఎంత సహనశీలివైనా ఏడుపును ఆపుకోవడం కష్టమే మరి.. ఇంత విధ్వంసం నడుమ
ఒకింత విశ్రాంతి కోసం నీ ఒడ్డున నిలబడ్డ నన్ను చూసి విలపిస్తున్నది నదీమతల్లి
నిజంగా నువ్వు ఒక బ్రహ్మపుత్రవి..’’ అనడం ఎస్వీ హృదయ వేదనకు అద్దం పడుతున్నది.
అందుకే ఒక సందర్భంలో ఎస్వీ కవిత్వాన్ని విశ్లేషిస్తూ,’’ అభ్యుదయ కవి భౌతిక వాది కావాలి. ప్రపంచం పట్ల ప్రపంచ చరిత్ర పట్ల శాస్త్రీయ దృక్పథం పట్ల దృష్టి ఉండాలి. మతం మత్తు మందు అని అవగాహన ఉండాలి’’అన్నారు రాచపాలెం చంద్రశేఖర్‌ రెడ్డి.
శబరి కథనాన్ని కవిత్వంలోకి తీసుకురావడం కవి నైపుణ్యం.
సమాజంలో కుటుంబ జీవనానికి ప్రత్యేకమైన స్థానం ఉన్నదని ఎస్వీ స్థిరాభిప్రాయమని వీరి కవిత్వం ద్వారా తెలుస్తుంది. ‘‘ఇంట్లో ఇద్దరే/ ఇల్లంతా నిశ్శబ్దం/ఒకే గొడుగు కింద ఉండటం ముఖ్యం కాదు/ ఒకే చిన్నకై తడుస్తున్నారా…. వాళ్ళిద్దరూ ఒకే గాలే వీస్తున్నారా/ ఒకే నీరై ప్రవహిస్తున్నారా/ ఒకే నిప్పై రగులుతున్నారా/ ఒకే నేలపై పరుచుకున్నారా/ ఒకే నింగై విస్తరిస్తున్నారా ‘‘అంటూ’’ శేష ప్రశ్న’’ వేస్తారు. నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుంటూ ఒకే దగ్గర బ్రతకడాన్ని వ్యంగ్యంగా సంధించారు. ఏవో కొన్ని అభిప్రాయ భేదాలున్నా సర్దుకుపోవాల్సిన అవసరం తప్పని పరిస్థితి అయినా పూడ్చలేని అగాధాలను సృష్టించుకోవడం వల్ల సస్యశ్యామలమైన బ్రతుకు క్షేత్రమవదు ఆ ఇల్లు అనే భావాన్ని వ్యక్తం చేసారు. ప్రపంచీకరణ ప్రభావం ఎంతగా కుటుంబాలపై పడుతుందో చెప్తూ…
‘‘మీరే కదా మమ్మల్ని మర బొమ్మలుగా తీర్చిదిద్దారు డాలర్లు రాల్చే కల్పవృక్షాలుగా కలగన్నారు
గౌరవనీయులైన తల్లిదండ్రులారా! మమ్మల్ని హాయిగా ఆడుకోనిచ్చారా? పాడుకోనిచ్చారా?
మేం పుట్టకముందే మా పేర్లు పబ్లిక్‌ స్కూల్లో నమోదు అయిపోయాక డబ్బా పాల మాతృత్వాన్ని
చైల్డ్‌ కేర్‌ సెంటర్ల సంరక్షణను పొందిన మేం నేరుగా రెసిడెన్షియల్‌ స్కూల్‌లోకి వెళ్ళామే గాని
మీ గుండెలపై పడుకొని సేద తీరామా…. ప్రియమైన జన్మదాతల్లారా!!
బహుళ జాతి కంపెనీలకు బానిసలమైన మేం మిమ్మల్ని ప్రేమించట్లేదని పట్టించుకోవట్లేదని నిందలు వేయకండి..
మొన్ననే కదా మదర్స్‌ డే గ్రీటింగ్‌ కార్డ్‌ పంపాం నిన్ననే కదా ఫాదర్స్‌ డే ఫ్లవర్‌ బొకే కొరియర్‌ చేసాం
మళ్లీ ఇప్పుడు పేరెంట్స్‌ డే అంటున్నారు ఏమిటి?’’ (పుత్రా గ్రహం)
ఏ అయోమయంలేని కవిత్వం ఇది. ఉన్నది ఉన్నట్టు కవి స్వీకరించిన విధానం ఇది. ఇందులో కవిత్వంతో పాటు రంగరించి పోస్తున్న మానవీయ విలువలు హృదయాల్ని తట్టి లేపుతుంటాయి. ఇలా కుండ బద్దలు కొట్టినట్టు తల్లిదండ్రుల పాత్రను చెప్పడంలో కూడా ఎంతో మెలకువ ఉన్నది.
‘‘అందమైన అమ్మాయిని ఎత్తుకుపోయి ఆమె స్వేచ్ఛను హరించి నాట్యకత్యగా మార్చి
ఆమె భవిష్యత్తు స్వప్నాలను నలిపేసి వాడెవడు?
లోఫర్‌!’’అంటూ అమ్మాయిల అందాలను అంగట్లో పెట్టి వాళ్ళ ధన దాహానికి బలి చేసే దుర్మార్గులను ‘‘క్రిమినల్స్‌’’గా చెప్పినా,
‘‘ఎవడు వాడు /తెల్లని మల్లెపూల ఎదలపై నల్లని రాక్షస పాదాలను మోపుతున్న వాడు….
నీ కళ్ళ చుట్టూ నల్లని మరకల కాటుకని దిద్ది రెటీనాలోని కాంతిని దొంగిలిస్తున్న వాడు’’ (గద్దింపు) అంటూ ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకునే మగబుద్ధిని నిరసిస్తున్న ఎస్వీ కవిత్వ శైలి ఆకట్టుకుంటుంది. ఆలోచనలో పడవ వేస్తుంది. అందుకే ఎస్వీ కవిత్వాన్ని ‘‘ఉదాత్త కవితా వాక్యం ఏకాకి కాదు. ఎన్ని వందల గుండెలను తన కూడా తీసుకుపోతుంది. మంచి కవిత చలన సంగీత శృతిలా గుండెలలో సదా మ్రోగుతూనే ఉంటుంది’’ అన్నారు డాక్టర్‌ ఆవంత్స సోమ సుందర్‌. కవిత్వం టెక్నిక్‌ అంటే కవిత్వ శిల్పం ఒడిసిపట్టిన కవి ఎస్వీ. ఆకట్టుకునే వాక్య నిర్మాణం, సున్నితమైన భావ వ్యక్తీకరణ, చక్కని మెథడ్‌ ఆఫ్‌ ఎక్స్ప్రెషన్స్‌తో తాము చెప్పదలుచుకున్న విషయాన్ని పాఠకుల గుండెలకు హద్దుకునేలా చెప్తారు. అందులోనూ సమాజంలోని స్త్రీల పట్ల ఉన్న గౌరవభావంతో స్త్రీలకు ఎక్కడెక్కడ అయితే అన్యాయం జరుగుతుందో పసిగట్టి, పాఠకులు పసిగట్టేలా చేయడంలో సఫలీకృతులైనారు ఎస్వీ. స్త్రీవాద కవిత్వం విశ్లేషణ అన్నప్పుడే వస్తువు స్త్రీ అని అర్థమవుతుంది. విభిన్నమైన వస్తువులతో కవిత్వాన్ని రచించే ఎస్వీ జీవిత అనుభవాన్ని రంగరించి భావితరాలకు ఉన్నతమైన విలువలను అందించారు. అందుకే ఆడపిల్లల్ని హాస పారిజాతాలు అని చెప్పినా, సప్తవర్ణాలు అని చెప్పినా, నదితో పోల్చినా తమదైన శైలితో రచిస్తారు. వేదిక పైన చదివారే అంటే ఆ కవిత ప్రేక్షకుల గుండెల్లోనూ మారు మృగాల్సిందే. ప్రత్యేకంగా ‘‘అమ్మ’’ అనే అంశంపై చాలా కవితలు రాశారు
‘‘ మిత్రులారా! ఆత్మీయ సోదరులారా! ఆమెను అవసానదశలో దేవతగా పూజించనక్కరలేదు కానీ
అంట్లుతోమే ఆయాగా, బూజులు దులిపే పనిమనిషిగా ప్రసవాలు జరిపే నర్సుగా, ఇంటిని కాపలాకాసే
గుర్ఖా? గా మాత్రం దిగజార్చకండి అమ్మగా గౌరవిస్తారో లేదో తెలియదు గాని
ప్రాణం ఉన్న మనిషిగా గుర్తిస్తే చాలు’’ ఎంత హృదయ విదారకంగా తల్లిని చూస్తున్నారు. ఈ లోకంలోని కొందరు దుర్మార్గపు కొడుకులు, కూతుర్లు …. ఈ విషయం ఎస్వీ హృదయాన్ని కలచివేసి కవిత్వమై ఎలుగెత్తారు.
ఆడవాళ్ళ పట్ల మంచిగా స్పందించడమే స్త్రీ వాదం. విషయాన్ని ఓన్‌ చేసుకోవడం, విషయం పట్ల అవగాహన కలిగి ఉండడం, స్త్రీ జాతి లైంగికత, లింగ ప్రదర్శన, మానసిక శారీరక వైకల్యాలు వంటి విషయాలపై నిర్దిష్టమైన భావ ప్రకటన చేయడం స్త్రీవాద కవిత్వం.
ఇక, ‘‘పోరాట పుష్పం’’ అంటూ ఆరుట్ల కమలాదేవి ఉదార స్వభావాన్ని,
ఎనలేని ధైర్యాన్ని వర్ణించారు ఎస్వీ. ‘‘నిండైన మానవతా రూపం
నిజాయితీకి నిలువుటద్దం మా తరానికి తెలిసిన కమలాదేవి…
నిజాం నిరంకుశత్వంపై పిడికిలెత్తిన సబల తుపాకీ చేత బూని శత్రువుపై విరుచుకుబడిన వీరనారి
అరణ్య అజ్ఞాతవాసాలను భరించిన సాహసి జైల్లోనూ హక్కుల కోసం పోరాడిన ధీశాలి
భూస్వాముల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన విప్లవ యోధ తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ పోరాటంలో
వికసించిన అగ్నిపుష్పం’’ అనడం ఎంతో సముచితంగా ఉంది. ఆనాటి నైజాం ఏరియా మొత్తం ఎంతటి దుర్భర పరిస్థితుల్లో ఉండేదో చరిత్ర చదివిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కర్ర, కారం, ఒడిసెలలు ఆయుధాలు చేసి పెత్తందారీ విధానాన్ని అడ్డుకున్న కమ్యూనిస్టు పార్టీ పోరాటాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఆనాటి ఈ పోరాటాలలో స్త్రీలు అబలలు కాదు అని నిరూపిస్తూ కమలాదేవి గారి జీవన చిత్రాన్ని కవిత్వంలో చూపించారు ఎస్వీ. మానవత్వానికి మారుపేరుగానే కాకుండా అరణ్య అజ్ఞాతవాసాలు భరించిన సాహసిగా కమలాదేవిని చదివితే గుండె వేడెక్కుతుంది. ఎంత చక్కని ఉపమానం ప్రయోగించారు కవి! ‘‘అగ్ని పుష్పంగా’’ చెప్పడం అంటే బంగారానికి సువాసనలా అలా అలా ఓ అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. అడవుల్లో తుపాకీ చేతబట్టి తిరిగిన బెబ్బులిగా ….., జైల్లో హక్కుల కోసం పోరాడిన శౌర్య శీలిగా…. ఆరుట్ల కమలాదేవి గారి గుర్తుకు చేసుకోవడం ఎంతో బాగుంది.
కుటుంబాల్లో ఏ కష్టం వచ్చినా ఎలా ముందుండి సమస్యలలో నుంచి బయటపడేస్తారో, అవసరమొస్తే పలుగు పారా పట్టి క్షేత్రంలో వ్యవసాయం ఎలా చేస్తారో, యుద్ధ రంగంలో మొక్కవోని ధైర్యంతో స్త్రీలు ముందుంటారనే నిజాల్ని ఒప్పుకోని పురుషాధిపత్యానికి పెను సవాళ్ళనే విసురుతున్నాయి ఇలాంటి కవితలు. ఈ సత్యాల్ని వ్యక్తీకరిస్తూ స్త్రీల పక్షపాతిగా స్వరాన్నెత్తడమే స్త్రీవాదం.
‘‘ఏమాత్రం పురిటి నొప్పులు పడకుండా డిగ్రీల పురుగుల్ని కంటున్న విశ్వవిద్యాలయమా!
కొంత బాధ అయినా పర్వాలేదు – పడు మెరుపులలాంటి మేధావుల్ని ప్రసవించు (యూనివర్సిటీ) అంటున్న
ఎస్వీ యోగ్యత ఇక్కడే తెలుస్తోంది. ఎంత మానవతావాదో, ఎంత స్త్రీవాద కవో! విశ్వవిద్యాలయాన్ని మాతృ స్థానంలో చెప్పిన కవులు చాలా అరుదు. ఈ ప్రపంచంలో పురిటి నొప్పుల్ని పడి పిల్లల్ని కనగాలి ఏ శక్తి కేవలం స్త్రీ జాతికే ఉంది. ఇంతటి ఉన్నతమైన విషయాన్ని విద్యా విషయంలో కూడా కన్నతల్లి అనే మాటలో అంతర్లీన భావాన్ని కవిత్వీకరించారు ఎస్వీ. తల్లి పిల్లల్ని కంటుంది కానీ వాళ్ళ జీవితాన్ని కనదు. మంచి చెడు వాళ్ళ ప్రవర్తన నియమావళితో కూడుకొనుంటుంది. ఇది అందరికీ తెలిసిందే. అయినా ఎస్‌ వి ఈ పోలిక తేవడానికి కారణం ఉన్నత విద్యాభ్యాసం చేసి మంచి మంచి పరిశోధనలు జరిపే విశ్వవిద్యాలయాల నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డాక్టరేట్‌ డిగ్రీలు చేత పట్టుకొని ప్రొఫెషనల్‌ విద్యావేత్తలుగా బయటికి వస్తారు. పండితుల సంఘాలుగా పిలువబడుతుంటారు. ఉన్నత విద్యను సాధించిన వీళ్ళలో కొద్దిమంది మాత్రమే నిజాయితీగా చదువుకొని బయటికి వస్తున్నారు. చాలామంది అడ్డదారులు తొక్కి,సరైన జ్ఞానార్జన చేయకుండా ఉద్యోగాలలో చేరిపోతున్నారు. తర్వాతి తరం విద్యార్థులకు సరైన బోధన చేయలేకపోతున్నారు. ఇలాంటి వాళ్ళని చూసి హృదయ వేదనతో ఈ కవితను రాయడం చూస్తాం. మేధావులు కావాలి, వృధా జీవులు కాదు. అందుకే, విశ్వవిద్యాలయాల ఔన్నత్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది అనే ప్రశ్న వేసుకునేలా చక్కని కవిత్వాన్ని రాస్తారు. ఒకప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ అందుకుని బయటికి వచ్చిన మేధావులలో గవర్నరు,్ల ప్రధానమంత్రి, శాస్త్రవేత్తలు, విదేశాంగ రాయబారులు, గొప్ప గొప్ప పాత్రికేయులు, ఎమ్మెల్యేలు, ఉపసంచాలకులు, విప్లవకవులు, నాయకులు, న్యాయ మూర్తులు, ఐఏఎస్లు ఐపీఎస్‌లు దేశ సేవలో భాగమయ్యేందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి వచ్చారు. ఇలా ఎంతైనా చెప్పవచ్చు.
సమాజంలోని దాస్టీకాలను చూసి కవిత్వంగా ఉప్పొంగే వాళ్ళే కవులు.
ఆడవాళ్ళని హింసించే వాళ్లను క్రిమినల్సుగా చెప్పినా, నది రోదనలు స్త్రీల బాధలు అని చెప్పడమైనా, విశ్వవిద్యాలయాలను తల్లులతో పోల్చడమైన స్త్రీ సాధికారత కొరకు వాళ్లను చదవనివ్వండి వాళ్ళను నవ్వనివ్వండి
వాళ్ళను స్వేచ్ఛగా బ్రతకనివ్వండి అని చెప్పడమైనా ఎస్వీ స్త్రీ వాద కవిత్వ దృక్పథం తెలియజేస్తుంది.
(ఆగష్టు16న ప్రొఫెసర్‌ ఎస్వీ సత్యనారాయణ గారి సప్తతి సందర్భంగా …)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.