పోతారమా..
నిను మరువతరమా..!
నను కనీ, కళ్ళల్లో పెట్టుకొని
పెంచి పెద్దచేసిన నిన్ను
విడిచిపెట్టి పోతన్న
పోతారమా.!
పైపైకి దరహాసాలని
పులుముకొని
చెమ్మ నిండిన కన్నులతో
వెనుతిరుగకనే
నిను వదిలిపెట్టి పోతన్న
పోతారమా..!
నువ్వంటే..
పొడి పొడి అక్షరాల
నామవాచకానివి కావు..
నిలువెత్తు నా ఆస్థిత్వానికి
ఆలంబనవి
అంతకన్నా మించిన ఆకాశానివి
నా అడుగులకింద అరచేతులు పరిచి
నడిపించిన అవనీ మాతవి..!
నువ్వంటే..
కుప్పపోసిన ఆవాస సమాహారానివే కావు
ప్రేమాన్విత పులకిత పరవశ
గానానివి నా ప్రాణానివి
అలుపెరుగక సాగిపోతున్న
చైతన్యానివి
మెతుకు ముత్యాలను సాగుచేసే
శ్రమైక సౌందర్యానివి
నా పురావారసత్వ చిరునామావి..!
అన్నట్టు..
నేను కన్ను తెరిచీ తెరవంగానే
‘ఆడి’పిల్లననీ
ఆడికేడికో సాగనంప తీర్మానించిన
ఆ కుట్ర దారులెవరో గానీ,
ఓ సారి కసితీరా
కడిగెయ్యాలని ఉంది
మొలిచిన జాగా లోంచి
పెకిలించి పెరికి
ఇంకో కాడికి ఇసిరెయ్యడాన్ని
మీరు వివాహమే అంటారు.!
అయినా..
నా లోని నీరూ నిప్పు గాలీ దూళీ
సకలం నీ వల్లే కదా
ఇక్కడి చిరు చిరు దీపాలని
వెలిగించన్నా..
జన్మ నిచ్చిన తల్లి రుణం
తీర్చుకోవాలని
ఈ తల్లి ఒడిలోనే కొలువు తీరితి..
ఇప్పుడనివార్యంగా
నీకు దూరంగా మరో తోటలోకి బదిలీ కాబడి..
బాధాతప్త హృదయంతో
వదిలిపోతన్న పోతారమా..!!