అడుగడుగున తిరుగుబాటు – గీతా రామస్వామి

` అనువాదం: ప్రభాకర్‌ మందార

3. తీవ్ర వామపక్షం: నక్సలైట్‌గా నా జీవితం
1973 తొలినాళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా మూడు నక్సలైట్‌ గ్రూపులు చాలా క్రియాశీలంగా వుండేవి. ఇవి కాకుండా చిన్న చిన్న బృందాలు ఇంకా చాలానే వుండేవిగానీ అవేవీ తమను తాము పార్టీలుగా చెప్పుకునేవి కావు. పైగా అన్నింటి చివరా ‘సీపీఐ`ఎంఎల్‌’ అనే వుండేది. దీంతో బయటి వాళ్లకు అసలీ గ్రూపుల్లో ఏవి ఏమిటో, వీటి మధ్య తేడాలేమిటో గుర్తుపట్టటం చాలా కష్టంగా ఉండేది.

దీనికి తోడు వీటిల్లో తరచూ చీలికలు రావటం, ఆ చీలిక వర్గాలు మళ్లీ ముక్కలవుతూ.. పేర్లు మారిపోయి, పరిస్థితి మరింత గందరగోళంగా
ఉండేది. ఉదాహరణకి ఇప్పటికిప్పుడు చూసుకున్నా` ఒక్క ఉస్మానియా క్యాంపస్‌లోనే నాలుగు వేర్వేరు పీడీఎస్‌యూలు, నాలుగు పీఓడబ్ల్యూలూ ఉన్నాయి, అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి కనీసం పదిహేనైనా ముఖ్యమైన ఎంఎల్‌ (మార్క్సిస్ట్‌`లెనినిస్ట్‌) గ్రూపులుంటాయి. ఈ పేర్ల గందరగోళాన్ని నివారించేందుకు స్థానికంగా ప్రతి గ్రూపునూ దాని ముఖ్య నాయకుడి పేరుతో వ్యవహరించడం మొదలైంది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, 1973లో ప్రధానమైన మూడు గ్రూపులు: చండ్ర పుల్లారెడ్డి (సీపీ) గ్రూపు, తరిమెల నాగిరెడ్డి (టీఎన్‌) గ్రూపు, కొండపల్లి సీతారామయ్య (కేఎస్‌) గ్రూపు.
1973 తొలినాళ్లలో నాకు తెలిసిన కొంతమంది యువకులు రహస్యంగా సీపీఐ`ఎంఎల్‌ చండ్ర పుల్లారెడ్డి (సీపీ) గ్రూపు` ‘ఆంధ్రప్రదేశ్‌ రివల్యూషనరీ కమ్యూనిస్ట్‌ పార్టీ’లో చేరారు. (ఇక నుంచీ ఈ గ్రూపుని క్లుప్తంగా ‘పార్టీ’ అనే ప్రస్తావిస్తాను). నేనూ వాళ్లని అనుసరించాను. ఈ మార్పుకు సంకేతంగా నా వస్త్రధారణ వెంటనే మారిపోయింది. ట్రౌజర్లు మానేసి చీరలు కట్టుకోవడం మొదలుపెట్టాను. చెవి రింగులు కూడా అప్పుడే తీసేశాను, ఆనాటి నుంచి ఇక ఎన్నడూ ఆభరణాలు ధరించింది లేదు. నా తర్వాత మా మహిళా బృందాల్లోని చాలామంది వరసగా పార్టీలో చేరిపోయారు. దాంతో పార్టీ లోపలా, బయటా కూడా నా మిత్ర బృందం ఒకటే అయిపోయింది. మేం అంతకు ముందర ఏమేం పనులు చేసేవాళ్లమో పార్టీలో చేరిన తర్వాతా అవే పనులు చేసేవాళ్లం, కాకపోతే వాటినే మరింత ప్రణాళికాబద్ధంగా, వ్యూహాత్మకంగా అమలు చేసేవాళ్లం.
1973 నుంచీ 1975లో దేశంలో ఎమర్జెన్సీ విధించే వరకూ కూడా మా పార్టీ కార్యక్రమాలు ఉద్ధృతంగా సాగాయి. మొదట్లో పదిహేను మంది వున్న మా మహిళా బృందం సంఖ్య.. చూస్తూ చూస్తుండగానే ఐదు వందలకు చేరింది. మేం హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి క్రమేపీ రాష్ట్రం మొత్తానికి విస్తరించాం. నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా 1973 ఆగస్ట్‌లో భారీ ఆందోళనలు నిర్వహించాం. వాటిలో భాగంగా హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని కాలేజీల్లో చిన్నా పెద్దా మీటింగులు పెట్టాం, ర్యాలీలు తీశాం. వీటిలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులూ, వేల సంఖ్యలో పాల్గొన్నారు. క్యాంపస్‌లో మాలో మేం ఇంగ్లిష్‌లో లేదా దక్ఖనిలో మాట్లాడుకునేవాళ్లం. 1970లలో హైదరాబాద్‌లో జనమంతా కూడా బయట దక్ఖనీ హిందీలోనే మాట్లాడే వాళ్లు. అప్పటికింకా తెలుగు మాత్రమే మాట్లాడే కోస్తాంధ్ర ప్రజలు భారీగా హైదరాబాద్‌కు వలస రావటం మొదలవ్వలేదు. గ్రామాల్లో తెలుగు మాట్లాడే విద్యార్థులు కూడా సిటీకి వచ్చి, కాలేజీల్లో చేరిన కొద్ది రోజుల్లోనే దక్ఖనీలో మాట్లాడటం నేర్చేసుకునేవాళ్లు. నేను సెంట్రల్‌ స్కూల్లో చదువుకోవటం, మా బ్రాహ్మణ వాడకట్టులోనే వుండటం, ఎక్కువగా మా క్లాసు పిల్లలతోనే తిరగటం వల్ల నాకు తెలుగులో మాట్లాడటం అంత తేలికగా రాలేదు. అయితే నన్ను పార్టీ ఎప్పుడైతే అనుబంధ గ్రూపులతో పనిచేయటానికి ఇతర జిల్లాలకు పంపించటం మొదలుపెట్టిందో.. అప్పటి నుంచే క్రమేపీ తెలుగులో మాట్లాడటం నేర్చుకున్నాను. మేం రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులనూ కలుసుకునే వాళ్లం, ఒక్కోసారి బయటి రాష్ట్రాల వాళ్లూ వచ్చే వాళ్లు. అప్పట్లో మేం కాలేజీలో గోడపత్రికలను నడిపేవాళ్లం. ఆర్ట్స్‌ కాలేజీలో మేం నడిపిన గోడపత్రిక పేరు ‘ఫోకస్‌’. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలున్న యువకులను గుర్తించాలనీ, పార్టీ నిర్వహించే వివిధ ఆందోళనా కార్యక్రమాల్లో పాల్గొనేలా చూస్తూ వారికి మార్గదర్శకత్వం వహించాలనీ పార్టీ మమ్మల్ని ప్రోత్సహించేది. క్రమేపీ వాళ్లు పార్టీ సభ్యులయ్యే వాళ్లు.
మా గ్రూపు సమావేశాలు చాలా తరచుగా జరుగుతుండేవి. వీటిలో అమ్మాయిలూ, అబ్బాయిలందరం పాల్గొనేవాళ్లం. చర్చలు కొన్నిసార్లు రాత్రి పొద్దుపోయే వరకూ కూడా నడిచేవి. వరసగా ఎన్ని రాత్రుళ్లు జరిగినా కూడా కూర్చునే ఉండేవాళ్లంగానీ ఆ చర్చలను మిస్సవటానికి మాత్రం అస్సలు ఇష్టపడేవాళ్లం కాదు. నేను కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందాను కాబట్టి నన్ను పార్టీ సాంస్కృతిక విభాగమైన ‘అరుణోదయ’ కార్యక్రమాల్లోకి తీసుకున్నారు. దీన్లో పాటలు, వీధిభాగోతాల వంటివన్నీ కూడా తెలుగులో వుండేవి. వీధిభాగోతమైతే పాటలు, డ్యాన్సులతో కొంత సుదీర్ఘంగా కూడా సాగుతుంది. సంప్రదాయంగా అయితే దీనిలో మహాభారత కథలనూ, గాథలనూ స్థానిక భాషల్లో జనరంజకంగా చెబుతుంటారు. కానీ మా వీధిభాగోతంలో ఆ పౌరాణికాలేం ఉండవు. మేం దాని రూపాన్ని మాత్రమే తీసుకుని, మా అవసరాలకు తగ్గట్లుగా వీధినాటకంలా మలుచుకున్నాం. మేం రూపొందించిన రెండు వీధిభాగోతాలు నాకు ఇప్పటికీ బాగా గుర్తే. ఒకటి జార్జిరెడ్డి జీవితం ఆధారంగా తయారైంది. రెండోది మన దేశంలో పెట్టుబడిదారులు ప్రభుత్వ ప్రాపకంతో ప్రజల్ని ఎలా దోచుకుంటున్నారో వివరించేది. తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటంలో చురుగ్గా పాల్గొన్న కానూరి వెంకటేశ్వరరావు మా దర్శకుడు. ఈ వీధిభాగోతాన్ని ఆయనే రాసి, పాటలకు బాణీలు కూర్చారు, తనే హార్మోనియం కూడా వాయించేవారు. ఇందులో డ్యాన్సులుండేవి, నటులంతా పాటలు పాడాలి, లేదా పాటలకు తగ్గట్టుగా పెదాలు కదుపుతూ నటించాలి. పక్కన నిలబడి కథ చెబుతుండే ఇద్దరు వ్యాఖ్యాతల్లో నేనొకదాన్ని. ఇద్దరం చెరో వైపూ నుంచొని, మా పాటలు మేం పాడటంతో పాటు వచ్చిపోయే ఇతర పాత్రలకూ వంత పాడేవాళ్లం. నేపథ్యం నుంచి వచ్చే డైలాగులనూ చెప్పేవాళ్లం. నా పోర్షన్‌ను నేను దేవనాగరి (హిందీ) లిపిలో రాసుకుని కంఠస్తం చేసేదాన్ని. మేం కొన్ని నెలల పాటు ప్రతిరోజూ రిహార్సల్స్‌ చేసేవాళ్లం. ఒకోసారి ప్రదర్శనకు సిద్ధం అనుకున్న తర్వాత వరసగా, ఊరూరా, కొన్నిసార్లు రాత్రంతా కూడా ప్రదర్శనలు ఇస్తూనే ఉండేవాళ్లం.
ఉస్మానియా క్యాంపస్‌లో ఉన్న కొంతమంది మహిళలం కలిసి` పార్టీ మద్దతుతో 1974 ఏప్రిల్‌లో ప్రగతిశీల మహిళా సంఘాన్ని (పీఓడబ్ల్యూ) స్థాపించాం. నందు త్వరలో ఏర్పాటు కానున్న రాడికల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ (ఆర్‌ఎస్‌యు) మహిళా విభాగంలో చేరేందుకని అప్పటికే మా గ్రూపులోంచి వెళ్లిపోయింది. పీఓడబ్ల్యూ తొట్టతొలి సమావేశాన్ని నిజాం కాలేజీలో నిర్వహించాం, అప్పుడే ఓ చిన్న మ్యానిఫెస్టో కూడా విడుదల చేశాం. మా సంఘంలో దాదాపు ఇరవై మంది మహిళలం ఉండేవాళ్లం. దీన్ని స్థాపించటానికి ముందు మేం చాలా శ్రమపడాల్సి వచ్చింది. నాకు గుర్తున్నంత వరకూ మాలో నలుగురం బయల్దేరి` కోఠీ వుమెన్స్‌ కాలేజీ, రామ్‌కోఠీలోని నవజీవన్‌ కాలేజి, ఆంధ్ర మహిళా సభ, సెయింట్‌ ఫ్రాన్సిస్‌, వనితా మహావిద్యాలయ.. ఇలా నగరంలోని ప్రతి ఒక్క మహిళా కాలేజీకీ వెళ్లాం. అంతే కాదు, మేం నిజాం కాలేజీ, ఉస్మానియా`గాంధీ మెడికల్‌ కాలేజీలు, జవహర్‌ లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ), సర్దార్‌ పటేల్‌ కాలేజీ లాంటి కో`ఎడ్యుకేషన్‌ కాలేజీలనూ వదిలిపెట్టలేదు.
ఆడపిల్లల్ని సమీకరించడం (దీన్నే మేం ‘మొబిలైజ్‌’ చేయటమనే వాళ్లం) అంత ఆషామాషీ వ్యవహారమేం కాదు. ఏ కాలేజీకి వెళ్లినా ముందు` ఆడపిల్లలంతా గుంపుగా ఉన్న చోటికి వెళ్లి, వాళ్లతో మాటలు కలిపేవాళ్లం. మెల్లగా మహిళలపై లైంగిక వేధింపులు (దీన్నే మేం ఆ రోజుల్లో చాలా అనాలోచితంగా ‘ఈవ్‌ టీజింగ్‌’ అంటుండేవాళ్లం), వరకట్న దురాచారం, ధరల పెరుగుదల వంటి సమస్యలపై కాస్త లోతుగా, చాలా ఉత్తేజంగా ప్రసంగించే వాళ్లం. వేరే ఏదైనా కాలేజీలో మా పీడీఎస్‌యూ స్నేహితుల అక్కచెల్లెళ్లలో ఎవరన్నా చదువుతున్నారని తెలిస్తే చాలు` వెంటనే రెక్కలు కట్టుకుని అక్కడ వాలిపోయే వాళ్లం. వాళ్లను వెతికి పట్టుకుని, పార్టీ కోసం తమ ఫ్రెండ్స్‌ని సమీకరించాల్సిందిగా ఒత్తిడి చేసేవాళ్లం. ఆ రోజుల్లోనే పిచ్చి నర్సింహా రెడ్డి అనే బీజేపీ కార్యకర్త` ఆర్ట్స్‌ కాలేజీలో మిన్నీని అసభ్యంగా ముట్టుకునేందుకు ప్రయత్నించాడనే సమాచారం వచ్చింది. వెంటనే మేమంతా కోపంతో రగిలిపోయాం. పెద్ద సంఖ్యలో విద్యార్థినులను సమీకరించి ఆర్ట్స్‌ కాలేజీ నుంచి వైస్‌ ఛాన్స్‌లర్‌ లాడ్జి వరకూ భారీ ర్యాలీ నిర్వహించాం. ఉస్మానియా క్యాంపస్‌లో పీఓడబ్ల్యూ చేపట్టిన తొలి భారీ ప్రదర్శన ఇది. 1975 జనవరిలో అశ్లీల వ్యతిరేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాం` రోడ్ల మీదా, సినిమా థియేటర్ల ముందరా ఎక్కడెక్కడ అశ్లీల పోస్టర్లు అంటించారో చూసి, వాటన్నింటి మీదా తారు పూసే పని పెట్టుకున్నాం. వీటిలో కొన్ని పోస్టర్లయితే స్త్రీల రొమ్ములను, తొడలను అతి భారీగా పెంచి చూపిస్తూ చాలా అసహ్యకరంగా కూడా ఉండేవి. మేమీ తారు పూసే పనిలో ఉంటే చుట్టూ జనం గుమిగూడి ఆసక్తిగా చూస్తుండే వాళ్లు, వాళ్లతో మాటలు కలిపి, దీని గురించి అక్కడే చర్చ పెట్టేవాళ్లం. అలాగే బ్లేడుల్లాంటి వస్తువులు అమ్ముకునే ప్రకటనల్లో అందమైన అమ్మాయిల బొమ్మలు వాడటాన్ని కూడా మేం తీవ్రంగా నిరసించాం. ఆ పోస్టర్ల మీదా తారు పులిమేవాళ్లం. అసలు స్త్రీల శరీరాలను ఇలా ఎందుకు ఉపయోగిస్తున్నారన్నది మా ప్రశ్న.
1972, 73ల్లో వరసగా రెండుమూడేళ్ల పాటు వర్షాల్లేక దేశంలోని చాలా ప్రాంతాల్లో కరువు తాండవించింది. ఆహార ధాన్యాలకు తీవ్రమైన కొరత వచ్చి, ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అప్పటికి మన దేశం ఇంకా ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకునే స్థితిలోనే ఉంది. అప్పుడే ముగిసిన బంగ్లాదేశ్‌ యుద్ధం మన విదేశీ మారక నిల్వలన్నింటినీ హరించేసింది. దీంతో ఆహార ధాన్యాల దిగుమతి వ్యయం మరింత భారంగా పరిణమించింది. వర్షాభావంతో వ్యవసాయోత్పత్తి, విద్యుదుత్పత్తి రెండూ పడిపోయాయి. తయారైన వస్తువులకు గిరాకీ లేకుండా పోయింది. పారిశ్రామిక ఉత్పత్తీ పతనమయింది. వీటన్నింటి ఫలితంగా దేశంలో ఉన్నట్టుండి నిరుద్యోగం పెచ్చుమీరిపోయింది. ఇవి చాలదన్నట్టు.. 1973లో కొద్ది రోజుల వ్యవధిలోనే ముడి చమురు ధర 4 రెట్లు పెరిగి, మన విదేశీ మారకాన్ని పూర్తిగా ఊడ్చేసింది. పెట్రోలియం ఉత్పతులు, ఎరువుల ధరలు ఆకాశాన్నంటాయి. ద్రవ్యోల్బణం 1972`73లో 22 శాతం, 1974లో 20 శాతం, 1975లో 25 శాతంగా నమోదైంది. ఈ పరిస్థితుల్లో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, అశాంతి దేశవ్యాప్తంగా ప్రబలిపోయింది. ఈ నేపథ్యంలో 1975 తొలినాళ్లలో మేం ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా పీడీఎస్‌యూతో కలిసి భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహించాం.
దాదాపు ఇదే రోజుల్లో మేం హైదరాబాద్‌లో వరకట్న వ్యతిరేక ప్రచార కార్యక్రమాన్ని కూడా
ఉద్ధృతంగా చేపట్టాం. పీడీఎస్‌యూ కార్యకర్తలు ఆహ్వానించటంతో ఆ కార్యక్రమాన్ని ఇతర జిల్లాలకూ విస్తరింపజేశాం. మా పార్టీ హైదారాబాద్‌ మురికివాడల్లో విద్యార్థుల కోసం చేపట్టిన కార్యక్రమాలకు పీఓడబ్ల్యూ సమన్వయకర్తగా సహకారం అందించింది.
మా కార్యక్రమాలకు మహిళా విద్యార్థుల నుంచి స్పందన కొంత మిశ్రమంగానే వుండేది. బహుశా మేం వాళ్లని ఎక్కువగా భయపెట్టామేమో అనిపిస్తుంది నాకు. ఆ రోజుల్లో కొత్త వాళ్లు ఎవరైన కంటబడ్డారంటే చాలు, మేం వాళ్లను ఎంతగా వెంటాడే వాళ్లమో! తల్చుకుంటే ఇప్పుడు నాకు కాస్త సిగ్గుగా కూడా అనిపిస్తుంది. న్యాయవాది, రచయిత, పౌరహక్కుల నేత కె.బాలగోపాల్‌ చెల్లెలు మాధవి అప్పుడు ఆంధ్ర మహిళా సభలో చదువుకునేది. ఓసారి నేను వాళ్ల కాలేజీకి వెళ్లినప్పుడు పాపం ఆ అమాయకురాలు మా కార్యక్రమాల పట్ల కాస్త ఆసక్తి కనబరిచింది. ఇక అంతే, నేను పదే పదే ఆమె దగ్గరకు వెళ్లి బుర్ర తినేసేదాన్ని. చివరికి పరిస్థితి ఎంతవరకూ వచ్చిందంటే ఆ చుట్టుపక్కల నేను ఎక్కడన్నా వున్నానని తెలిస్తే చాలు, ఆమె చటుక్కున మాయమైపోయేది. చాలామంది అమ్మాయిలు మమ్మల్ని తప్పించుకు తిరిగేవాళ్లు. కేవలం కొద్దిమందే మా చుట్టూ చేరి, మేం చెప్పేది ఆసక్తిగా వినేవాళ్లు. అందులో కూడా అతి కొద్దిమందే మాతో సంబంధాలను కొనసాగించేవాళ్లు!
అప్పుడు పార్టీలో మేం నలుగురమే మహిళలం. కానీ మేం చాలా చెలాకీగా, అందరికీ తల్లో నాలుకలా ఉండేవాళ్లం, అవసరమైతే గట్టిగా గొంతెత్తి, దృఢంగా మాట్లాడేవాళ్లం కూడా. సమావేశాలు జరుగుతున్నప్పుడు అన్నం ముందు మాకే వడ్డించేవాళ్లు, పార్టీలో మా పడక, వసతి సౌకర్యాలకు ఎప్పుడూ ప్రాధాన్యం వుండేది. మొత్తమ్మీద మమ్మల్ని బాగా చూసుకునేవాళ్లు. అది మా ఆత్మగౌరవాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ మరింత పెంచింది. మొదట్లో మేమెవరం గొడ్డు మాంసం తినేవాళ్లం కాదు, కానీ పార్టీ సమావేశాల్లోనే అది నేర్చుకున్నాం. అక్కడ వంట సరిగా రాని మగవాళ్లు చెయ్యటం వల్ల ఆ మాంసం పూర్తిగా ఉడికేది కాదు. ఆ ఉడికీ ఉడకని తునకల్ని నమిలీ నమిలీ చావాల్సి వచ్చేది. రోజంతా ‘సింగిల్‌ చాయ్‌’లు తాగుతూనే ఉండేవాళ్లం. సిగరెట్లు, బీడీలు కాల్చటం, ప్రేమలో పడటాలు`విడిపోవడాలూ.. ఇవన్నీ జరుగుతూనే ఉండేవి. కాస్త డబ్బున్న మిత్రులు బట్టలు తెచ్చిస్తే వాటినే కట్టుకు తిరిగే వాళ్లం. ఒక్కోసారి మా దగ్గర బస్సు చార్జీలకు కూడా డబ్బులుండేవి కాదు కాబట్టి మైళ్లకు మైళ్లు నడిచివెళ్లడం బాగా అలవాటు చేసుకున్నాం.
మేం ప్రజా ఉద్యమంలో భాగమయ్యాం. జనంతో మమేకమై, విస్తృత ప్రజా ఉద్యమాల్లో పాలుపంచుకుంటున్న వారికి ఎవరికైనా అది గొప్ప విముక్త భావననిస్తుంది. మన వైఖరులు మారతాయి, అభిప్రాయాల్లో స్పష్టత వస్తుంది, కొత్త సంబంధాలు ఏర్పడతాయి, ఐక్యత చిగురిస్తుంది, ఇక ధైర్యం, స్థైర్యం అనూహ్యంగా పెరుగుతాయి. ఒక్కసారిగా మన సత్తా ఎంతటిదో, మన శక్తిసామర్థ్యాలేమిటో మనకు తెలిసివస్తాయి. అమ్మాయిలకే కాదు, దీనిలో పాలుపంచుకుంటున్న యువకులకు కూడా ఇదొక గొప్ప మార్పు తెచ్చిన అనుభవమే అయ్యుంటుంది. ఈ సమయాన్ని చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవాలి. పీడీఎస్‌యూలో చేరక ముందు అబ్బాయిల్లో చాలామంది మన సమాజంలోని మిగతా పురుషులందరిలాగే పితృస్వామ్య భావాలతో, దాని ద్వారా తమకు సంక్రమించిన సదుపాయాలన్నింటినీ అనుభవిస్తూ ఉండిన వాళ్లే. కానీ దీనిలో చేరిన తర్వాత వారిలో ఆ భావాలు చాలా వరకూ తుడిచిపెట్టుకు పోయాయనే చెప్పొచ్చు. వాళ్లలో కొంతమందిని కలిసినప్పుడు నేనీ మార్పును స్పష్టంగా గమనించాను. మా గ్రూపులోని పురుషులు మమ్మల్ని చాలా గౌరవంగా చూసే వాళ్లు. పార్టీలో మేం వాళ్లతో చాలా సన్నిహితంగా మెలిగేవాళ్లం. కొన్ని సాన్నిహిత్యాలైతే జీవితాంతం కూడా కొనసాగాయి. అయినా మాలో ఎవ్వరికీ, ఎప్పుడూ వారివల్ల ఒక్క చెడ్డ అనుభవం కూడా ఎదురుకాలేదు. స్త్రీలుగా మేం భిన్నం, ప్రత్యేకమే. కానీ ఆ భేదం మమ్మల్ని ఎన్నడూ కూడా పురుషులకంటే తక్కువ వారిగా చేయలేదు.
నేను సిరిల్‌ని మొట్టమొదటగా 1973లో కలిశాను. పార్టీలో చేరినప్పుడు మా గుర్తింపు బయటపడకుండా, బయట ఎవరూ మమ్మల్ని గుర్తు పట్టకుండా ఉండేందుకు మాకు మారు పేర్లు (అలియాస్‌లు) పెట్టేవారు. అజ్ఞాతంలోకి వెళ్లే వాళ్ల భద్రత కోసం పాటించే పద్ధతి అది. పార్టీలో కూడా ఒకర్నొకరం ఈ అలియాస్‌లతోనే పిలుచుకునేవాళ్లం. పార్టీలో చేరినప్పటి నుంచే సిరిల్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అతణ్ని విజయ్‌ అని పిలిచేవాళ్లు. పార్టీలో తను విద్యార్థి విభాగానికి బాధ్యుడు, మేమందరం తనకే రిపోర్ట్‌ చేసేవాళ్లం. తను జార్జి రెడ్డి తమ్ముడని అప్పుడే నాకు తెలిసింది. ఆ రోజుల్లో నేనెప్పుడూ విప్లవం గురించే ఆలోచిస్తుండేదాన్ని. నేనెప్పుడూ జార్జి రెడ్డిని చూడలేదుగానీ ఆదర్శభావాలు గల, సమున్నత వ్యక్తిగా తన రూపం ఎప్పుడూ నా మనసులో మెదులుతూనే ఉండేది. సిరిల్‌కీ, నేను ఊహించుకునే ఆ ఉదాత్తమైన జార్జి రూపానికీ మధ్య చాలా తేడా వుందనిపించేంది. సిరిల్‌ పెద్దగా మాట్లాడేవాడు కాదు, ఆడవాళ్లతో అయితే మరీ తక్కువ. అందుకే తన గురించి ఒక అంచనాకు రావటానికి నాకు చాలాకాలం పట్టింది. తనతో కలిసి చాలా మీటింగులకు హాజరైన తర్వాతే` తను చాలా సీరియస్‌ వ్యక్తి అనీ, ఎంతో నిశితంగా ఆలోచించి, నిష్పాక్షికమైన, సముచితమైన నిర్ణయాలు తీసుకుంటాడనీ గ్రహించాను. అయితే నాకు అప్పుడు తెలీనిది, అతనిలో మరో గుణం కూడా వుంది. తను ఎవరినన్నా ఏవగించుకున్నా, లేదా తనను ఇబ్బంది పెట్టే సందర్భం ఏదైనా ఎదురైనా.. చాలా కటువుగా స్పందిస్తాడు. చిన్న వివాదాన్ని కూడా చినికిచినికి ప్రత్యక్ష ఘర్షణ స్థాయికి తీసువెళతాడు.
నేను సిరిల్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత అతని వ్యక్తిత్వంలోని మంచినీ, చెడునూ రెంటినీ చవిచూశాను. పాల పొంగులాంటి అతని కోపం వల్ల అప్పుడప్పుడు నేనెంతో క్షోభ అనుభవించినా.. నిజానికి దీర్ఘకాలంలో దానివల్ల నా కంటే తనే ఎక్కువ బాధపడాల్సి వచ్చేది. ఎందుకంటే ఆ లక్షణం వల్ల కొంతమంది మిత్రులు తనను (ఒక్కోసారి నన్ను కూడా) సామాజికంగా దూరం పెట్టేవాళ్లు. మొదట్లో మా ఇద్దరిలో ఎవరమూ కూడా ఒకర్నొకరం భాగస్వాములుగా భావించుకునే వాళ్లం కాదు. మేం పెళ్లి గురించి 1975లో ఒక నిర్ణయానికి వచ్చాంగానీ నిజానికి అప్పటికి మా ఇద్దర్లో ఎవరికీ కూడా ఒకరి మీద ఒకరికి గాఢమైన ప్రేమ ఉందని నేననుకోను. విప్లవ జీవితానికి మా సహచర్యం అనుకూలంగా వుంటుందనే ఇద్దరం ఒక అభిప్రాయానికి వచ్చాం. ఆ ఉద్దేశంతోనే పెళ్లి చేసుకున్నాం.
ఆ రోజుల్లో జరిగిన పెళ్లిళ్ల గురించి ఆలోచిస్తే.. ఇప్పటికి కూడా అవి చాలా భిన్నమైనవనే అనిపిస్తుంది. జంటల మధ్య బంధం బలంగా ఉండేది, అయినా భార్యలు తమ స్వేచ్ఛనేం కోల్పోయే వాళ్లు కాదు, తమ స్వతంత్ర జీవనాన్ని తాము కొనసాగిస్తూనే ఉండేవాళ్లు. ఉద్యమంలో పనిచేసిన మహిళలంతా కూడా తమ కెరీర్‌ను తామే ఎంచుకున్నారు, తాము అనుకున్నట్టు మలుచుకున్నారు కూడా. కొందరు భాగస్వాముల కంటే ముందుగా పార్టీ వీడితే మరికొందరు వారి తర్వాత వెళ్లిపోయారు. ఇంకొందరు తమ భర్తలకు విడాకులూ ఇచ్చారు.
ఈ నిర్ణయాలన్నింటినీ కూడా మా పురుష భాగస్వాములు గౌరవించారు. మగవాళ్లు వంట చేసేవాళ్లు, ఇంటిని శుభ్రం చేసేవాళ్లు, పిల్లల పెంపకంలో సాయం చేసేవాళ్లు. ఆ రోజుల్లో దేశంలో మరెక్కడా, ఆ వయసు మగవాళ్లెవరూ ఇలా చేసినట్లు నేను విన్లేదు.
అయితే పీడీఎస్‌యూలోని అబ్బాయిలు తమ అక్కచెల్లెళ్ల విషయానికి వచ్చే సరికి మాత్రం ఇంతటి స్త్రీవాద భావాలనేం కనబరిచే వారు కాదు. వాళ్లతో సమాన స్థాయి, సమానాధికారం మాకు మాత్రమే ఉంటాయి తప్ప.. మిగతా మహిళలకు, వాళ్ల అక్కచెల్లెళ్లకు కాదన్నట్టు వ్యవహరించేవాళ్లు. మధుసూదన్‌ అని, పీడీఎస్‌యూలోనే ఉండేవాడు. అతని చెల్లెలు ఒకరిని ప్రేమించింది. అది వీళ్లకు నచ్చలేదు. అంతే, తను ఓ ‘పనికి మాలిన’ వ్యక్తిని ప్రేమించిందంటూ ఆమెను బలవంతంగా ఒడిషాలో ఉండే సిరిల్‌ సోదరి జిప్సీ వద్దకు పంపించేశారు. ఆమె ప్రేమించిన వ్యక్తి పెద్ద ఆవారా అనీ, భర్తగా పనికొచ్చేరకం కాదనీ అతని గురించి నానారకాలుగా చెప్పేవాళ్లు. కానీ మా విషయానికి వచ్చేసరికి మాకు స్వేచ్ఛనివ్వటమే కాదు, మమ్మల్ని ఎంతో ప్రోత్సహించేవాళ్లు కూడా. వీరిలో బూర్జువా జీవితాన్ని గడిపేందుకు మళ్లీ వెనక్కి వెళ్లిపోయిన వారిని గమనిస్తే` కొన్నికొన్ని విషయాల్లో వీళ్లు కాస్త బండబారిపోయారా? అనిపిస్తుంటుంది. ఇతరుల మాటెలా ఉన్నా, సిరిల్‌ వరకూ నేనీ విషయం కచ్చితంగా చెప్పగలను. ఆ రోజుల్లో నాకు ఫె˜మినిజానికీ ` కమ్యూనిజానికీ మధ్య పెద్ద వైరుధ్యమేదీ వున్నట్టు అనిపించేది కాదుÑ పడుగుపేకలా ఆ రెంటి ప్రయాణం సాధ్యమే అనుకునేదాన్ని. కాకపోతే వారివారి దృష్టికోణాల్లో, అవగాహనల్లో మాత్రం కచ్చితంగా వ్యత్యాసాలున్నాయని నాకు అనిపించేది. వర్గపరంగా, భౌగోళికంగా కమ్యూనిజానికి చాలా విస్తృతమైన పరిధి ఉండగా.. మాకు తెలిసి, ఫెమినిజం మన సంస్కృతి, కుటుంబం, సంబంధాల చుట్టూ పరుచుకున్న రకరకాల సమస్యలు, వైఖరులకు సంబంధించిన గొప్ప లోచూపును పైకి తీసుకొచ్చింది. పార్టీలో వున్నప్పుడు నేనేం అనుకునేదాన్నంటే` సమాజం తాలూకూ రాజకీయ సమస్యలకు సమాధానాలు కమ్యూనిజం వద్ద వుంటే.. ఫెమినిజంలో సామాజిక, వ్యక్తిగతస్థాయి సమస్యలకు సమాధానాలున్నట్టు భావించేదాన్ని. ఈ రెంటినీ కలిపి, ఇలా జంట కవలల్లా, సమాంతర పాయల్లా చూడగలగటానికి బహుశా, మేము నాటి విస్తృతస్థాయి సీపీఐ`ఎంఎల్‌ పార్టీలో పూర్తి భాగస్వాములం కాకపోవడమే కారణమనిపిస్తుంది. పార్టీలోనే ఉన్నా, మేం అంతర్గతంగా ఒక విధాన బృందం (కాకస్‌)గా వుండిపోయాం. దీనికి తోడు మేం పార్టీలో చేరిన రెండు మూడేళ్ల కల్లా ఈ విధాన బృందంలోని చాలామంది పార్టీ వదిలేసి బయటకు వెళ్లిపోయారు. దీంతో ఆ మేరకు, కమ్యూనిస్టు ఉద్యమం తాలూకూ భారాన్నంతా మోయాల్సిన అవసరం మాకు తప్పింది. అలాగే పార్టీ కొన్నికొన్ని విషయాలను గుర్తించలేకపోతున్నా, ఫెమినిజం వంటి వాటి విషయంలో కాస్త గుడ్డిగా వ్యవహరిస్తున్నా.. ప్రతి విషయంలోనూ బండగా పార్టీని వెనకేసుకురావాల్సిన అగత్యమూ తప్పింది.
వామపక్ష గ్రూపుల్లో బ్రాహ్మలను తరచూ బాగా ఆటపట్టించేవారు. మా ఆహారపుటలవాట్లనూ, మా శ్రమ రహిత జీవన విధానాన్నీ, ఇంకా మా పూర్వీకులు చేసిన సమస్త పాపాలనూ ఎత్తి చూపుతూ భయంకరంగా హేళన చేసేవారు. మా కుటుంబ పద్ధతుల్నీ, కుల వైఖరుల్నీ ఇలా బయటివారు నిర్మొహమాటంగా, తీవ్రంగా విమర్శించటమన్నది నేను చూడటం అప్పుడే మొదటిసారి. ముఖ్యంగా బ్రాహ్మణిజంపై నాకూ చాలా అభ్యంతరాలున్నాయిగానీ వాళ్లు నా కంటే చాలా భిన్నమైన కోణంలో తమ విమర్శలను ఎక్కుపెట్టటాన్ని గమనించాను. అయితే మొత్తమ్మీద ఇలా పైపైన తడుముతూ అలవాట్లు, ఆచారాలను గేలి చేయటం తప్పించి.. మన నిత్యజీవితంలో ప్రత్యక్షంగా, సామాజిక నిర్మాణాల లోలోతుల్లో కులం చూపుతున్న ప్రభావాన్ని వామపక్ష వర్గాలు అప్పటికింకా ప్రశ్నించటం మొదలు పెట్టలేదు. అప్పటి పరిస్థితి ఎలా ఉందంటే` మీరు మీ బ్రాహ్మణత్వాన్ని (లేదా బ్రాహ్మణతనాన్ని) ఏమాత్రం వదులుకోకుండానే వామపక్షాల్లో చేరొచ్చు, వాటిలో సౌకర్యవంతంగా కొనసాగిపోవచ్చు కూడా. ఉదాహరణకి మీరు గొడ్డు మాంసం తినకపోతే తినను అని చెప్పెయ్యచ్చు, కొందరలా చేశారు కూడా. అలాగే తోటి బ్రాహ్మణ వ్యక్తుల్నే పెళ్లి చేసుకోవచ్చు కూడా, దాన్నీ ఎవరూ, ఏ రకంగానూ ప్రశ్నించరు. పార్టీ ధోరణి చూస్తే` మనం కులాన్ని పట్టించుకోకుండా ఉంటే చాలు, కుల సమస్య పోయినట్టే అన్నట్లుగా ఉండేది. నాకూ, నాలాంటి మరెంతో మందికీ 1985లో కారంచేడు ఊచకోత సంఘటన జరిగే వరకూ కూడా ‘కులం’ అనేది పెద్ద సమస్యగా కనిపించలేదు. మా మనసుల నిండా ‘వర్గం’ గురించిన ఆలోచనలే వుండేవి. అప్పటి వరకూ కూడా మేం కులాన్ని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన, ఆయా వ్యక్తుల ప్రైవేటు, ప్రత్యేక వ్యవహారంగానే పరిగణిస్తుండేవాళ్లం. ర్యాడికల్‌ వామపక్షవాదులు కూడా కులాన్ని ఒక సైద్ధాంతిక అంశంగా చూసేవారు కాదు. కుల సమస్య అన్ని చోట్లా వుంది, కానీ దాని గురించిన చర్చ మాత్రం ఎక్కడా జరిగేది కాదు.
కారంచేడు ఘటన ఈ పరిస్థితిని సమూలంగా మార్చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో ఓ చిన్న గ్రామం కారంచేడు. అక్కడ ఆధిపత్య కమ్మ కులస్థులు ఆరుగురు దళితుల్ని ఊచకోత కోశారు, అనేక మంది దళిత మహిళలపై అత్యాచారాలు చేశారు. దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా అప్పుడప్పుడే దళితుల్లో పెరుగుతున్న ప్రతిఘటనను చూసి.. దానికి ప్రతీకారంగానే దళితులపై వాళ్లీ దారుణానికి పాల్పడ్డారు. ఆనాటి భయానక సంఘటనే అనంతర కాలంలో అత్యంత ప్రభావవంతమైన ‘దళిత మహాసభ’ ఉద్యమానికి బీజం వేసింది. తీవ్ర సమస్యలైన కులాన్నీ, బ్రాహ్మణవాదాన్నీ పట్టించుకోకుండా, చాలాకాలం పాటు సౌకర్యవంతంగా ఉండిపోయిన నాలాంటి వాళ్లకు.. ‘అవి మనం కచ్చితంగా దృష్టి సారించి తీరాల్సిన అంశాలే’ అంటూ వాటిని బలంగా ముందుకు తెచ్చిన వాళ్లు అంబేడ్కరిస్టులని చెప్పక తప్పదు. 1989`90లో మండల్‌ కమిషన్‌ నివేదిక వెలువడటం, ఆ వెంటనే దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న ఉద్రిక్త పరిణామాలతో కుల సమస్య మరింత కేంద్రబిందువుగా మారింది.
నక్సలైట్‌ ఉద్యమం తొలినాళ్లలో, 1970లలో కుల సమస్యను చాలా తేలికగా దాటవేసే వాళ్లు. దానికి సంబంధించిన ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వచ్చిన ప్రతిసారీ నాయకత్వం ఎంత తేలికగా, సౌకర్యవంతంగా కప్పదాటుతనాన్ని ప్రదర్శించేదో దళితులకు, బీసీలకు, ఉద్యమంలో పని చేసిన వారికి బాగా తెలుసు. పైగా పార్టీలో అందరూ మారు పేర్లతోనే వ్యవహరించేవాళ్లు, ఒక ముస్లింకి హిందూ పేరు, క్రైస్తవుడికి ముస్లిం పేరు.. ఇలా రకరకాలుగా ఉండేవి కాబట్టి ఎవరు ఏ కులం నుంచి వచ్చారో పవరికీ స్పష్టంగా తెలిసేది కూడా కాదు. హైదరాబాదు గ్రూపులో ఎక్కువ మందికి కోడి మాంసం కంటే గొడ్డు మాంసం ఇష్టంగా వుండేది, ఇది తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకమైన సాంస్కృతిక లక్షణం. ఇక్కడి ప్రగతిశీల వర్గాల్లో బ్రాహ్మణులతో సహా ఎవరికీ గొడ్డు మాంసం తినడం పట్ల పెద్ద పేచీలూ, సంకోచాలేం వుండేవి కాదు. పార్టీలో ఎవరమూ బట్టలు కొనుక్కునే వాళ్లం కాదు, బయటి వాళ్లెవరో ఇచ్చేసిన వాటిపైనే ఆధారపడే వాళ్లం. మాలో దళితులు, దిగువ కుల శూద్రులు వుండేవాళ్లు కానీ వాళ్ల సంఖ్య చాలా తక్కువ, ఉన్న వాళ్లు కూడా కుల సమస్య గురించి తమ అభిప్రాయాల్ని బలంగా చెప్పేవాళ్లు కాదు. 1990లో మండల్‌ కమిషన్‌` విద్య, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లను వెనుకబడిన కులాల వారికి కూడా విస్తరించాలని సిఫార్సు చేయటం వారికి కొత్త ఉత్తేజాన్నీ, ప్రేరణనూ ఇచ్చింది. నేను గమనించినంతలో గ్రామాల్లో పార్టీ ఎక్కువగా వ్యవసాయ పేదలతో కలసి పనిచేసేదిగానీ.. అంబేడ్కరైట్‌ ఉద్యమాల్లో మాదిరిగా కచ్చితంగా దళితులవైపు మొగ్గు చూపటమనేది లేదు. హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి బృందంలో దాదాపు అందరూ ఆధిపత్య కులాల నుంచి వచ్చినవారే` అంటే బ్రాహ్మలు, రెడ్లు, వెలమలు, సంపన్న ముస్లింలే ఎక్కువగా వుండేవాళ్లు. ఇంక మహిళల్లో అయితే చెప్పనవసరం లేదు, అందరూ వాళ్లే!
పార్టీలో కులం సమస్యను ముందుకు తెచ్చిన ఓ సంఘటన నాకు బాగా గుర్తుంది. పార్టీ కార్యక్రమాలన్నీ సాధారణంగా వివిధ కమిటీల ద్వారానే జరుగుతుంటాయి. ఓసారి మా సిటీ కమిటీ సమావేశం జరుగుతున్నప్పుడు` మాలో పూర్తికాలం పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలకు నెలనెలా గౌరవవేతనం ఎంత ఇవ్వాలన్నది చర్చకొచ్చింది. అప్పుడు నెలసరి గౌరవ వేతనాన్ని రూ.150గా నిర్ణయించినట్టు గుర్తు. అయితే రజిరీ అనే దళిత కార్యకర్త మాత్రం ఆ మొత్తం తనకు చాలదనీ, ఎక్కువ అవసరమని వాపోయాడు. ‘మా నాన్న చనిపోయాడు, అమ్మ ఉస్మానియా యునివర్సిటీలో నాలుగో తరగతి ఉద్యోగిగా రిటైరయ్యింది. పని చేసి కుటుంబ పోషణ చూసుకోవాల్సిన నేను వారికి దూరమయ్యాను. కాబట్టి ప్రతి నెలా ఇంటికి పంపటానికి నాక్కొంచెం ఎక్కువ వేతనం కావాలి’ అని అడిగాడు. ఇలాంటి సమస్యలను ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నందుకు నొచ్చుకుంటూ కామ్రేడ్స్‌ అతని వేతనాన్ని పెంచి ఇచ్చారు.
ఆ రోజుల్లో విప్లవ భావావేశాలు చాలా తీవ్రంగా ఉండేవి. తమ కుల సమస్యలను ముందుకు తెచ్చే బలమైన దళిత విద్యార్థి వర్గం లేకపోవటంతో పార్టీలో అసలు కుల సమస్య అన్నది ప్రస్తావనకు, చర్చకు వచ్చేదే కాదు. అలాగని అలాంటి ప్రయత్నాలేం జరగలేదని కాదు. ఈ పుస్తకం రాస్తున్నప్పుడు` పార్టీలో మాతో కలిసి పని చేసిన నా సన్నిహిత మిత్రుడు శశి అప్పట్లో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేశాడు. డాక్టర్‌ జి.చందర్‌ ఆ రోజుల్లోనే దళిత విద్యార్థుల కోసం విడిగా ఒక సంఘం ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రతిపాదించాడనీ, కానీ పార్టీ దాన్ని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చిందనీ శశి జ్ఞాపకం చేసుకున్నాడు. చందర్‌ తొలిరోజుల్లో పీడీఎస్‌యూలో చాలా చురుకుగా పని చేశాడు, ‘ఈ ఊరు మనదిరా… ఈ వాడ మనదిరా..’ వంటి అద్భుత ప్రజా గీతాలను రాసిన కవి గూడ అంజయ్యకు పెద్దన్న అతను. అదిలాబాద్‌కు చెందిన మాలలైన చందర్‌, అంజయ్యలిద్దరూ మంచి గుండె ధైర్యం గల మనుషులు. హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీలో ఓ రూములో ఉండేవాళ్లు. నాకు గుర్తున్నంత వరకూ, సిరిల్‌ వీళ్ల రూములోనే
ఉండటమో, లేక వీళ్ల రూము నుంచి పని చేయటమో చేసేవాడు. అప్పటికే మహిళలకు విడిగా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అనుమతించిన పార్టీ` దళితులకు మాత్రం నిరాకరించడం పట్ల ఆ రోజుల్లో దళిత హాస్టళ్లలో వున్న విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు శశి నాకు చెప్పాడు.
1974 నాటికల్లా మా తల్లిదండ్రులతో నా సంబంధాలు పూర్తిగా క్షీణించిపోయాయి. నేను టైమంతా ఎక్కువగా బయటి కార్యక్రమాలకే వెచ్చిస్తున్నానని నాన్న చాలా ఆందోళనపడే వాడు. అయితే ఆ కార్యక్రమాలు నక్సలైట్‌ భావజాలంతో ముడిపడినవన్న విషయం అప్పటికి ఆయనకు తెలియదు. వాళ్ల ఆందోళన అంతా నేను ఇంట్లో ఉండకుండా ఎక్కువ సమయం బయట గడుపుతున్నాననే. ఇంటికి లేటుగా వచ్చినప్పుడల్లా నాన్న నన్ను గేటు దగ్గరే నిలబెట్టి, గట్టిగా అరిచేవాడు. బండ తిట్లు ఉండేవి కాదుగానీ.. ఆడపిల్లంటే ఇలాగేనా ఉండేది, ఈ పనులేనా చేసేది అని ఇరుగుపొరుగు అంతా వినేలా మందలించేవాడు. నేనెంత విప్లవాన్ని ఒంటబట్టించుకున్నానని అనుకున్నా.. ఇక్కడికి వచ్చే సరికి మాత్రం ‘చుట్టుపక్కల అంతా ఏమనుకుంటారో?’ అని సిగ్గుతో ముడుచుకుపోతుండేదాన్ని. మెల్లగా నాకు ఇంట్లో ఫోన్‌ కూడా బంద్‌ చేసేశారు. నాతో ఎవ్వరూ మాట్లాడటానికి లేదు, ఒక్క మారేడ్‌పల్లి స్నేహితురాలు శాంత తప్పించి. ఆమెతో మాట్లాడేందుకైనా ఎందుకు అనుమతించారంటే ఆమె ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ మామిడిపూడి ఆనందం కుమార్తె అనీ, వాళ్లూ బ్రాహ్మలేననీ నాన్నకు తెలుసు. అయితే అప్పటికే ఆమెకు అజయ్‌ సిన్హాతో పెళ్లయిపోయిందని గానీ, ఆ అజయ్‌ సిన్హా జార్జి రెడ్డి మిత్ర బృందంలో ఒకడని గానీ నాన్నకు తెలీదు. అందుకే ఆమె ఫోన్లను మాత్రం బంద్‌ చేయలేదు. దీంతో ఎవరన్నా మీటింగుల గురించి నాకు చెప్పాలంటే ముందు శాంతతో ఫోను చేయించేవాళ్లు, నేను లైన్‌లోకి వచ్చిన వెంటనే శాంత ఫోన్‌ వాళ్లకు ఇచ్చేది!

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.