– టి. దేవకీదేవి
పూర్వకాలంలో రచ్చబండ ద్వారా ప్రజలు వార్తలను తెలుసుకునేవారు. ముద్రణా సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాక వార్తా పత్రికలు ప్రారంభమయ్యాయి. దాంతో ప్రపంచంలోని నలుమూలల వార్తలన్నీ ప్రజల అందుబాటులోకి వచ్చాయి. తెలుగులో మొదట మత పరంగా అటుపై సాహితీ పరంగా వార్తాపత్రికలు వెలువడ్డాయి. ఆ తర్వాత విభిన్న సమాచార విభాగాలు వార్తాపత్రికల్లోకి ప్రవేశించాయి. అయితే మొదట్లో వార్తలను పిరమిడ్ పద్ధతిలో వ్రాసేవారు. అంటే సాధారణంగా విషయాన్ని ప్రారంభించి ప్రాధాన్యాంశాన్ని చివరకు చెప్పేవారు కానీ ఇటీవలి కాలంలో వార్తలన్నీ ఇన్వర్టెడ్ పిరమిడ్ పద్ధతిలో వుంటున్నాయి. అంటే ప్రధాన అంశంతో వార్త ప్రారంభమై విషయ వివరణతో విశాలమౌతున్నది. ఈ పద్ధతే అసలు సిసలైన వార్తగా ప్రచారంలోకి రావడమే కాక తన స్థానాన్ని అలా పదిలపరచుకుంది. ఈమధ్య కాలంలో వ్యాపారం, లాభార్జన పత్రికల వాళ్ళకు ప్రధాన ధ్యేయమైంది. ఈ క్రమంలో వాళ్ళు తమ సర్క్యులేషన్ పెంచుకునే ఉద్దేశంతో పాఠకులను ఆకర్షించే గిమ్మిక్కులను అధికం చేశారు. నిజానికి సాహిత్య పత్రికలు, స్త్రీల, బాలల, వ్యాపార, రాజకీయ, చిత్రసీమల వంటి విభిన్న పత్రికలు పాఠకులకు అందుబాటులో ఉన్నాయి. కాని నేటి దిన పత్రికలే ఆ విభిన్న పత్రికల సమాహార రూపంగా వెలువడుతున్నాయి. అంటే దిన పత్రికలే ఈ విభిన్న అంశాలకు స్థలాన్ని కేటాయిస్తున్నాయి. ఆ క్రమంలో వచ్చినవే స్త్రీల పేజీలు.స్త్రీలు తెలివితక్కువ వాళ్ళనీ, వాళ్ళకు చాలా విషయాలు తెలియవనీ, వాళ్ళని ఉద్ధరించే బాధ్యత పురుషులదే అని భావించడంతో స్త్రీలకొరకు ఈ పేజీలు మొదలయ్యా యనిపిస్తుంది. వారి మేధస్సు ఏమాత్రం ఎదగనివ్వకుండా, వంటింటికే పరిమితమయ్యే జ్ఞానాన్ని అందిస్తూండే అంతర్గత కుట్రలే వున్నాయి. మనం జాగ్రత్తగా గమనిస్తే స్త్రీలను కించపరిచే,మానవ ప్రకృతిలో ఉన్న దుర్మార్గ స్వభావాన్ని స్త్రీలకు మాత్రమే పరిమితం చేసే ధోరణే అధికం. వాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించక, వక్రీకరించడం, జరిగిన వాటికి స్త్రీలదే బాధ్యతగా నిర్ణయించడం, స్త్రీ పురుషుల సహ జీవన సౌందర్యాన్ని విస్మరించడం ప్రత్యక్ష్యంగా కనబడుతున్న విషయాలు.
ఈ స్త్రీల పేజీ ‘ఈనాడు’ లో ‘వసుంధర’ వార్తలో ‘చెలి’ ‘ఆంధ్రభూమి’లో, ప్రియదర్శిని, ఆంధ్రజ్యోతిలో ‘నవ్య’ , ఆంధ్రప్రభలో ‘నాయిక’గా ప్రచురింపబడుతున్నాయి. ఈ పేజీల్లో స్త్రీల మానసిక ఆరోగ్య పరిరక్షణ, స్త్రీల సామాజిక సమస్యలు – పరిష్కార మార్గాలూ మొదలుకొని వంటా- వార్పులు, వంటింటి చిట్కాలు, స్త్రీలు చేస్తున్న ఇంటి -బయటి చాకిరీల్లో మెలకువలు వంటి మొదలైన అంశాలకు మొదట్లో ప్రాధాన్యం వుండేది. కానీ క్రమంగా ఆ అంశాల స్థానంలో స్త్రీల హక్కులు, వాటి పరిరక్షణ, చట్టాలూ- వాటి వినియోగం, ఏటి కెదురీదుతూ ఉన్నతంగా, వ్యక్తిత్వ వికాసంతో ఎదుగుతున్న స్త్రీలు, పురుషాధిక్య సమాజం అందంగా గీస్తున్న లక్ష్మణ రేఖలనధిగమించే మార్గాలు, వంటి అంశాలు స్థానాన్ని సంపాదించుకున్నాయి. కానీ ఇటీవల చూస్తున్న పత్రికల్లో ఈ స్త్రీల పేజీల రూపురేఖలు చాలా వరకు మారిపోయాయి. పేజీ మొత్తంలో కొన్నిసార్లు 99 శాతం, మరికొన్ని సార్లు 2/3 వంతు, ఇంకొన్ని సార్లు 1/3 వ వంతు అప్పుడపుడూ 1/5,1/6,1/2 వంతు ప్రత్యక్ష వ్యాపార ప్రకటనలు మాత్రమే వుంటున్నాయి. ఈ ప్రకటనలో చాలాసార్లు సినిమా ప్రకటనలుంటున్నాయి. ఇక మిగిలిన స్థలంలో స్త్రీల దుస్తులపై ఎంబ్రాయిడరీ డిజైనర్స్, వాటి రేట్లను ఇస్తారు. అంటే ఈ పేజీని అక్షరాలా పత్రికలు వ్యాపార దృష్టితో వినియోగించుకుంటున్నాయనడంలో విప్రతిపత్తి లేదు. ఆ రేట్లు కూడా ఆకాశాన్నంటుతూ వుంటాయి. ఈ ప్రకటనలు సాధారణ మధ్యతరగతి కుటుంబీకులకన్న ఉన్నత కుటుంబాలకు చెందిన స్త్రీలకే ప్రాధాన్యం ఇస్తున్నాయని చెప్పొచ్చు. ఇలాంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల భార్యాభర్తల మధ్య సమస్యలు తలెత్తే అవకాశం లేకపోలేదు. కొన్ని సార్లు ఇంటి డెకరేషన్కు సంబంధించిన అంశాలను ప్రచురిస్తున్నారు. ఈ అంశాల్లో ఇంటిని చవగ్గా తీర్చిదిద్దుకునే (కొన్నిసార్లు) అంశాలున్నప్పటికీ, అధికంగా ఖర్చుతో కూడుకున్నవే వుంటున్నాయి. ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన ప్రకటనలను తీసుకున్నపుడు, ప్రత్యేకించి స్త్రీల సమస్యలను ఈ పేజీలో ఇస్తే స్త్రీల పేజీకి న్యాయం చేకూర్చినట్టవుతుంది. కానీ ఆరోగ్య పరిరక్షణ సాధారణాంశమైనప్పుడు ఈ పేజికి అన్యాయం చేసినట్టే. అందులోనూ సామాజికులకిచ్చే సలహాలకన్నా డాక్టర్ల ప్రచారం అంతర్లీనంగా కొట్టవచ్చినట్లు కనపడుతూనే వుంది. ఇవి కాకుండా అనేక వ్యవహారాల్లో స్త్రీలు పాటించాల్సిన కిటుకులు ఇల్లు సర్దుకోవడాలు సరేసరి. ఈ కిటుకుల్లో పిల్లల్ని కనడం, పెంచడంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, పిల్లల్ని ఎలా చదివించాలి? వారి అభిరుచుల్ని ఎలా కనిపెట్టాలి, వారి ఆరోగ్యంకై తీసుకోవలసిన జాగ్రత్తలు, ప్రథమ చికిత్స ఎలా చేయాలి? గ్యాస్ స్టవ్ ఉపయోగించడంలో మెలకువలు, బట్టలపై మరకల్ని తొలగించడం ఎలా? చర్మ, దంత, కేశ, నఖ పరిరక్షణలు, శిరోజాలకి సంబంధించిన సమాచారం దాని నుండి రక్షించుకోవడం, కూరగాయల తాజాతనం కాపాడటం, ఇంటిని ఈగలు, దోమలు, బొద్దింకలు, ఎలుకల నుండి రక్షించు కోవడం… వంటి అంశాలను అధికంగా ఇస్తున్నారు. హెచ్.ఐ.వి సమస్య, ఆరోగ్య సమస్య ప్రత్యేకించి స్త్రీలకు సంబంధించినది కాదు. ఇక ప్రథమ చికిత్స అంటారా? అది ప్రత్యేకించి స్త్రీల సమస్య కానే కాదు. ఇవి పోనూ మిగిలిన విషయాలు కూడా ప్రత్యేకించి స్త్రీలకు సంబంధించినవి కాదు. పని విభజనలో స్త్రీలు ఇంటికే పరిమితమైన సందర్భంలో ఈ ‘పనులు – అంశాలు’ అన్నీ స్త్రీలకు సంబంధించినవే. మారుతున్న సమాజంలో స్త్రీకి గల విద్య ఉద్యోగావకాశాల నను సరించి ఆమె అనేక రంగాల్లో ముందుకు దూసుకువెళ్తున్నది. ఆ క్రమంలో స్త్రీలతోపాటు పురుషులూ పనిని పంచుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. అందుచేత ఈ అంశాలను ఈ పేజీల్లో ఇవ్వడం వల్ల ఇప్పటికీ పురుషులు స్త్రీల ఆర్థికతను కుటుంబానికై ఉపయోగించుకున్నంత సులువుగా పని భారాన్ని పంచుకోవడం లేదని అర్థమవుతుంది. అంతేకాదు పురుషులు పనిభారాన్ని పంచుకోవాల్సిందే అనే సందేశాన్నివ్వడంలో శ్రద్ధ చూపడం లేదనేది స్పష్టమవుతుంది. స్త్రీల ఇంటి చాకిరీ విషయంలో వెసులుబాటుగానీ, శ్రమ విభజన చేసుకోవాల్సిన అవసరాన్ని కానీ గమనించనట్లే వుంటాయి వ్యాసాలన్నీ. స్త్రీలూ ఈ కిటుకులు, మెలకువలు, సందేశాలు చూడగానే తమకో పరిష్కారం దొరికినందుకు సంతోషపడిపోతున్నారు. ఈ విషయంగా స్త్రీలు సంతోష పడకూడదని కాదు. కాకపోతే స్త్రీలు ఇంకా ఇంకా ఆ పనులను కేవలం తమ బాధ్యతలోని భాగంగా గుర్తించడాన్ని, స్వీకరించడాన్ని గూర్చి ఆలోచించాల్సి వస్తుంది. ఇవే కాకుండా కొన్ని సార్లు స్త్రీల పేజీల్లో శృంగారంలో మెలకువలను ఇస్తున్నారు. ఈ అంశాన్ని గమనిస్తే శృంగారం బాధ్యత కూడా స్త్రీలదే అని ఆ స్త్రీల పేజీ సూచిస్తుంది. ఈ మెలకువలు పాటించకపోతే మహానుభావులు మరోచోట తమ కోరికను తీర్చుకుంటారు. ఓ పేపర్లో ఓ రోజు కనుమరుగవుతున్న పోస్టు బాక్సుల గురించి ఇచ్చారు. ఇది మరీ విడ్డూరం కాదా? ప్రత్యేకించి స్త్రీల ఆరోగ్య పరిరక్షణకై ఇస్తున్న అంశాలు కూడా బ్యూటీ పార్లర్స్ వ్యాపారం ప్రకటనలుగా ఎక్కువగా కనబడుతున్నాయి. అప్పుడప్పుడు స్త్రీలు తమంతట తాము తమ సహజ సౌందర్యాన్ని కాపాడుకునే సలహాలను ఇస్తున్నారు. ఇలాంటి సలహాల వల్ల స్త్రీల పేజీకే కాదు స్త్రీలకూ న్యాయం చేకూరుతుంది. ఇంకొన్ని సార్లు స్త్రీల పేజీలో 1/3 వంతు భాగాన్ని తమ పత్రికా ప్రకటనకై వినియోగించుకుంటూ ఆ పేజీని అలా నింపేసి తమ పనైపోయిందనుకొని చేతులు దులుపుకుంటున్నారు పాత్రికేయులు. అలా అని అసలే స్త్రీలకు సంబంధించిన వార్తలు లేవని కాదు. అప్పుడప్పుడు స్త్రీల వ్యక్తిత్వాన్ని తెలియజేసే, వారి వ్యక్తిత్వానికి స్ఫూర్తినిచ్చే అంశాలు, నవలా మణుల విజయం, ఆ విజయ రహస్యాలు మొక్కవోని వారి ధైర్య సాహసాలు, ఏటికెదురీదుతూ, గమ్యం చేరే శక్తి స్వరూపిణులు, చట్టపరమైన సలహాలు, మనోధైర్యాన్ని పెంపొందించే అంశాలు ఆయా పత్రికల్లో దర్శనమిస్తున్నాయి. అందులో భాగంగానే అనేక రంగాల్లో ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతున్న స్త్రీలు కనబడుతూ ఉన్నారు. కానీ నిశితంగా పరిశీలించినపుడు ఈ అంశాలకు ఇవ్వాల్సినంత ప్రాధాన్యాన్ని ఇవ్వడం లేదు. అంటే స్త్రీల వ్యక్తిత్వ వికాసాల విషయంలో పత్రికలు హృదయ పూర్వకంగా తమ బాధ్యతను నిర్వర్తించటం లేదు. ఈ మధ్యకాలంలో చదువుకున్న స్త్రీల కారణంగా కాపురంలో సర్దుబాటుతనం లోపించడం వల్ల విడాకుల రేటు పెరుగుతుందనే అపవాదు ప్రాచుర్యంలో వుంది. నిన్నగాక మొన్న అంటే 28 ఆగస్టు 2006న ‘ఆంధ్రజ్యోతి’ పత్రిక ‘ ఉద్యోగస్తురాలు భార్య అయితే కాపురం కష్టాలమయం’ అనే వార్తను న్యూయార్కులో సామాజిక శాస్త్రవేత్తల సర్వేలో వెల్లడైనట్లు ఇచ్చింది. ఉద్యోగినుల్లో కపటం, అహంకారాలు అధిక పాళ్ళలో వుండటమే కాకుండా భర్తను మోసగించడానికి, అవమానించడానికి వెనుకాడరని, పిల్లల్ని కనడానికి అయిష్టాన్ని వ్యక్తం చేస్తారని, భర్తలు తమకంటే తక్కువ హోదాలో వుంటేనే సంతోషిస్తారని, వారిలో సర్దుబాటుతనం తక్కువగా వుండటం వల్ల విడాకులు అధికంగా చోటు చేసుకుంటున్నాయని, పురుషులతో కలిసి పనిచేసే ఈ స్త్రీలకు అక్రమ సంబంధాలు ఏర్పడే అవకాశముందనేది ఈ వార్త సారాంశం.
అక్షరాస్యత లేక ఉద్యోగావకాశాలు లేక ఇంతకాలంగా వంటింటికే పరిమితమైపోయి పురుషాహంకారంలో నలిగిపోతున్న స్త్రీలు, అనేక కారణాలతో, భర్తల ఆకస్మిక మరణాలతో వైధవ్యంతో అలమటిస్తున్న స్త్రీలు ఇటీవల కాలంలో లభిస్తున్న విద్యా ఉద్యోగావకాశాల కారణంగా కొంతమేరకు తమ పరిస్థితులను చక్కదిద్దుకోగలుగు తున్నారు. కాకుండా మరికొందరు స్త్రీలు భర్తతో పాటు సమానంగా కుటుంబ భారాన్ని పంచుకుంటున్నారు. అయినా వెలకట్టలేని ఇంటిచాకిరిలో వెసులుబాటు లేదు. స్త్రీ ఉద్యోగం చేస్తూ కుటుంబ ఆర్థికతకు అండదండగా నిలుస్తున్నప్పుడు ఆమెకు ఇంటిపనిలో చేదోడుగా వుండాలనే వాస్తవాన్ని చాలామంది పురుషులు గమనించడం లేదనే చెప్పాలి. పిల్లల చదువు సంధ్యలు, కూరా నారా తేవడం, బిల్లులు కట్టడం వంటి పనులూ చేసుకుపోతూనే ఉన్నారు.
ఇంటా బయటా ఊపిరి సలుపకుండా పనిచేస్తున్నా స్త్రీకి మనసుందని దానికి ఆలోచన నివ్వాలని, ఆమెకు మెదడుంది, పని కల్పించాలని, కుటుంబ విషయాల్లో ఆమె మనోభావాలను గౌరవించాలనే భావన చాలా చాలా తక్కువగా కనబడుతుంది. అంతేకాదు వాళ్ళు పని చేస్తున్న సంస్థల్లో కూడా స్త్రీని చాలా తక్కువగా అంచనా వేయడం, లేదా అనేక ఇబ్బందులను కల్పించి వారి ఎదుగుదలను అడ్డుకొని అసమర్ధులుగా నిరూపించే యత్నాలు సర్వసాధారణమయ్యాయి. ఇంకోమారు స్త్రీల విజయం వెనుక అక్రమ సంబంధాల కథలల్లడానికి ఏమాత్రం వెనుదీయడం లేదు. ఈ పరిస్థితుల్లో వీటిని ఖండిస్తూ ఆయా పత్రికల్లోని స్త్రీల పేజీల్లో విశ్లేషణాత్మకమైన వ్యాసాలు వ్రాయాల్సిన అవసరం ఎంతైనా వుంది. ప్రతిరోజు స్త్రీలపైనే కాదు బాలికలపైనా అత్యాచారం చేసే సంఘటనలు అనేకంగా కనబడుతూ, వినబడుతూ ఉన్నాయి. ఆ సంఘటనల్లో కంసులైన కన్న తండ్రులు, కీచకులైన గురుదేవులూ (?) కనబడుతున్నారు. ఈ సందర్భంలో లైంగిక వేధింపుల నివారణకై విశ్లేషణాత్మక వ్యాసాలు, ప్రత్యేకించి స్త్రీల మనో వికాసాన్ని పెంచగల వ్యాసాల ఆవశ్యకత ఎంతో వుంది. స్త్రీల వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అంశాలనివ్వడం వల్ల ఆ పేజీకీ, స్త్రీలకూ న్యాయం చేకూరుతుంది కదా ఆకాశంలో సగమైన స్త్రీలకు న్యాయం చేయడం వల్ల సమాజాన్ని చక్కదిద్దినవారవు తారు పాత్రికేయులు.