– శివలక్ష్మి
స్నేహ సౌరభాలు వెదజల్లే
కలయికలు కాంతిపేటికలు
వెలుగులు చిమ్ముతూ జీవిత పరీవాహకాన్ని సేదదీర్చేవాటికలు
మనిషిని మనిషి కలవడం
రక్తనాళాలలో జీవశక్తిని నింపుకోవడం
చెట్లు పచ్చని సౌందర్యంతో మెరిసినట్లు
మనుషులు స్నేహపరిమళాలతో ప్రకాశిస్తారు.
ప్రతిసారీ ప్రతి కలయికా
ఉల్కలా మెరుస్తూ రాలిపోతున్న అనుభవం
కలవాలి
కలిసినప్పుడల్లా సరికొత్తగా జీవితాన్ని మొదలుపెట్టాలి
ప్రాణవాయువుతో తనువంతా మిసమిసలాడాలి
కనుకొలకుల్లో ఆనందం కాంతిపుంజమైపోవాలి
చిన్నప్పటి నేస్తాల్తో హాయిగా ఆర్తిగా
చేతులు కలుపుకున్నప్పుడల్లా వెలుగుపూలమై పోయేవాళ్ళం
బతుకు బరువంతా పోయి
దూదిపింజలమై పోయేవాళ్ళం
ఉరుకుల్లో పరుగుల్లో జీవనభారమంతా
మోస్తూ మనకు మనమే భారమైపోతున్నాం
ఎప్పుడైనా ఎవరైనా కలిస్తే, మనసువిప్పి మాట్లాడితే
మనకే మనం మళ్ళీ పరిచితులమైనట్లు మారిపోతాం
హుస్సేన్ సాగర్తీరంలో
బుద్ధుని శాంతి సమీర పవనాల్లో
ఆరుగురం ఆనందంగా, ఈ మధ్య కలిశాం
కలిశాక, కలిసి కరిగాక
ఆత్మ సంభాషణల మధ్య చిన్నపిల్లల్లా తేలిపోయాం
స్వచ్ఛత నిండిన మనసుల్తో
ఆప్త పవనాల కేరింతల్లో
సేదదీరి, జ్ఞాన స్నానాలు చేశాం
కలవాలి! కలవాలి!!
కలిసిన పత్రిసారీ జీవితం
జీవించడానికే అన్నట్లు మెరుస్తూ మురిసిపోవాలి