బోయి విజయభారతిగారు ఇక లేరనే పిడుగు లాంటి వార్త 28/9/2024 ఉదయమే తెలిసింది. చాలా సేపు ఆ షాక్ నుంచి తేరుకోలేక పోయాను. తరువాత కృష్ణకుమారికి ఫోన్ చేసాను. తనూ అదే షాక్‌లో ఉన్నానని చెప్పింది. ఆ మధ్య విజయభారతిగారు నేను, క్రిష్ణ కుమారి తరచుగా ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉన్నాము.
ఒక వారంలో వాళ్ళ ఇంటికి వెళ్లి ఆమెను కలిసే ఆలోచనలో కూడా ఉన్నాము. కారణం ఆమె స్వీయ చరిత్ర రాత ప్రతిని పరిష్కరించే బాధ్యతను మాకు అప్పగించారు. ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడానికి మూడు నాలుగు నెలల ముందు నుంచీ మేము ఆ పనిలోనే ఉన్నాము. ఆ పని ముగించడానికి ఆవిడ మాకు ఒక ఏడాది సమయం ఇచ్చారు. ‘‘మీ సొంత పనులు మానుకొని చేయకండమ్మా! మీకు వీలైనప్పుడే చేయండి. ఒక ఏడాది అయినా ఫర్వాలేదు.’’ అని మొదట్లోనే నాకు ఫోన్ చేసి చెప్పారు. అది ఆవిడ సహృదయత. కానీ నేనూ కృష్ణకుమారి మూడు నెలలలో ముగించాలని పట్టుదలగా పనిచేసాము. తిథి ప్రకారం ఆమె జన్మదినం దీపావళి రోజు. తేదీ ప్రకారం 15 నవంబర్. తరచుగా ఆమె మాతో జరిపిన ఫోను సంభాషణల ద్వారా ఆరోగ్య పరిస్థితిని, వయసును దృష్టిలో పెట్టుకొని, 31/10/2024 దీపావళి నాటికి తన స్వీయచరిత్ర పుస్తకంగా రావడానికి వీలుగా సాప్ట్ కాపీని తయారు చేసాము. ఆమె సూచన మేరకు ముందుమాట రాయవలసిన ఇద్దరికీ, వాళ్ళ అమ్మాయి మహితకు సాఫ్ట్ కాపీలు వెళ్లిపోయాయి. ఆమె చదువుకోవడానికి పెద్ద ఫాంట్‌లో spiral Binding చేయించి, వ్యక్తిగతంగా విజయభారతిగారిని కలిసి ఆమెకు ఇవ్వాలనుకున్నాము. అదే విషయాన్ని ఆమెకు ఫోన్‌లో కూడా చెప్పాను. దానికి ఆమె ‘‘నేను చదువలేను అమ్మా! కంటి చూపు సరిగా లేదు. ఆయినా నేను ఫోన్ చేసి, మార్పులు, చేర్పులు చెపుతూ నిరంతరం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నాను కదా! మళ్లీ నేను చదవడం ఎందుకు? ఆరోగ్యం కాస్తా నలతగా ఉంది. ఆకలి వేయడం లేదు అన్నారు.’’ మీకు చదవడం కష్టంగా ఉంటే నేను చదివి వినిపిస్తానని చెప్పి, మీరు చూసాక ప్రెస్ కు వెళితే బాగుంటుంది మేడం అని చెప్పాను. ఆమె ఆరోగ్యం కాస్తా కుదుట పడ్డాక వెళ్ళాలి అనుకున్నాము. అంతలోనే అలా జరిగిపోయింది.
విజయభారతిగారు తన స్వీయచరిత్రను దాదాపు 80 ఏళ్ళు నిండాక రాసారు. రాత ప్రతిని మేము పరిశీలించినప్పుడు చాలా పునరుక్తులు కనిపించాయి. కొన్ని ముఖ్యమైన (పిల్లలకు సంబంధించినవి) విషయాలు అందులో రాలేదని గుర్తించాము. తనకు గుర్తుకు వచ్చిన విషయాలు మాకు ఫోన్‌లో చెపితే రికార్డు చేసుకొని రాసేవాళ్ళము. ఇలా ఆ మూడు నెలలు మా ఫోన్ సంభాషణలు చాలా తరచుగా జరిగేవి. స్వీయ చరిత్రను ఎడిట్ చేస్తున్న క్రమంలో ఎదురైన సాధక బాధకాలు మీరు మాత్రమే రాయగలరు. అంటూ ఫోన్ చేసినప్పుడు మమ్మల్ని కూడా ముందుమాట రాయమని చెప్పే వారు. కృష్ణ కుమారి ఎందుకో రాయడానికి సుముఖత చూపలేదు. నేను రాస్తానని చెప్పాను. సరిగ్గా తన మరణానికి మూడు రోజుల ముందు కూడా విజయ భారతి గారు ఫోన్ చేసి ముందుమాటల గురించి ప్రస్తావించి, కృతజ్ఞతలు తాను తన మనవరాలి చేత రాయిస్తానని, కవర్ పీజీ డిజైన్ కూడా తన మనమరాలు నీలిమ చేస్తుందని చెప్పారు. అప్పుడూ మధ్యాహ్నం మూడుగంటల టైంలో ఫోన్ చేసారు. తనకు ఆ టైం అనుకూలంగా ఉండేది కాబోలు. ఎప్పుడు ఫోన్ చేసినా మీరు అంటూ మాట్లాడం, సౌమ్యంగా మాట్లాడం, ఆత్మీయంగా మాట్లాడడం విజయభారతిగారి సహృదయతకు నిదర్శనం. ఈ విధంగా మూడు నెలలుగా మా మధ్య పెనవేసుకున్న అనుబంధం ముగిసి పోయింది. బతుకు బాటలో ముందుకు సాగక తప్పదు కదా. తన స్వీయ చరిత్రను కళ్ళతో చూసుకోక పోయినా పుస్తకం ప్రూఫ్‌లు కూడా చూసి ముద్రణకు సిద్ధంగా ఉందని తనకు తెలుసు కదా అని సరి పెట్టుకున్నాము. విజయభారతిగారి స్వీయచరిత్ర పని మొదలు పెట్టే వరకు నాకు ఆమెతో పెద్దగా పరిచయం లేదు. అపుడప్పుడు ఏదైనా సమావేశంలో కలిసినప్పుడు విష్ చేయడం వరకే… పదవ తరగతి పిల్లలకు ఆమె రాసిన అంబేద్కర్ పాఠాన్ని చాలా ఏళ్ళు బోధించాను. ఆ స్ఫూర్తితో ఆమె రాసిన అంబేద్కర్ జీవిత చరిత్రను, జ్యోతిరావు పూలే జీవిత చరిత్రను చదివాను. సావిత్రిబాయి పూలే ఫోటోను అప్పట్లోనే నేను పనిచేసే ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో పెట్టాను. మహిళా టీచర్ల కోసం ఒక ఉపాధ్యాయ సంఘం ఉండాలనే ఉద్దేశంతో TWTF (Telangana Women reader Federation) ఏర్పాటు చేసి, సావిత్రీబాయి పూలే క్యాలెండర్ను విడుదల చేసాము. అంతేకాదు ఆమె విగ్రహాన్ని టాంక్బండ్ మీద పెట్టాలని, సావిత్రిబాయి పూలే జన్మదినం జనవరి మూడో తేదీని ఉపాధ్యాయ దినంగా ప్రకటించాలని డిమాండు చేసాము. దీనికంతటికీ పరోక్షంగా విజయ భారతి గారే స్ఫూర్తి. (అంటే ఆమె రచనలు చదవడం వల్ల )
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక సమావేశంలో కలిసిన విజయభారతిగారు తరువాత నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. అప్పుడు ఆమె హిమాయత్ నగర్లో ఉండేవారు. కాఫీ వగైరాలు అయిపోయాక చాలాసేపు ప్రాచీన సాహిత్యంలో దళిత స్పృహ గురించి మాట్లాడారు. అదే మొదటిసారి నేను ఆమెతో అంత సమయం గడపడం. అంత పాండిత్యం ఉండి, నిరాడంబరంగా, నిగర్విగా ఉండడం చాలా అరుదు. అది ఆమె విశ్లేషణాశక్తిని వినడానికి నాకు దొరికిన అవకాశం. అప్పటి నుంచి అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళం.
ఇంకోసారి కుందన్‌బాగ్‌లో వాళ్ళబ్బాయి రాహుల్ గారి ఇంట్లో ఆమెను కలిసాను. నా స్నేహితురాలు కృష్ణకుమారి తన ఎం.ఫిల్ సిద్ధాంత వ్యాసం మలి ముద్రణ వేసినప్పుడు ఆ పుస్తకాన్ని విజయ భారతి గారికి ఇవ్వడం కొరకు వెళ్ళిన సందర్భం. ముందుగానే అనుమతి తీసుకోవడం వలన వెళ్ళడం ఇబ్బంది కాలేదు. ఆమె మాకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆప్యాయంగా ఆహ్వానించి టిఫిన్లు కాఫీలు అయిన తరువాత వారు ప్రచురించి అందుబాటులో ఉన్న పుస్తకాలు మాకు ఇచ్చారు. ఫోటోల కార్యక్రమం ఉండనే ఉంటుంది. మాటల సందర్భంలో తారకం గారి మరిన్ని పుస్తకాలను ప్రచురించే ఆలోచనలో ఉన్నానని చెప్పారు. మేడమ్, తారకం గారి పుస్తకాల తోపాటు మీ అనుభవాలను కూడా స్వీయ చరిత్రగా తీసుకు వస్తే భావి తరాలకు ముఖ్యంగా మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సూచించాము. ఈ మాట ఆమెతో చాలా మంది చెప్పే ఉంటారు. ‘‘ఈ వయసులో నేను రాయలేనేమో…’’ అనే సందేహం వ్యక్తం చేసారు. మీరు చెపితే నేను రికార్డు చేసుకొని రాస్తాను. అని అభిమానంగా అభ్యర్థించాను. సుమారు ఈ సంఘటన జరిగిన రెండేళ్ల తరువాత ఒకరోజు మూడు గంటల టైంలో ఆవిడ నాకు ఫోన్ చేశారు. తన స్వీయ చరిత్ర రాసానని, దానిని పుస్తకంగా తేవడానికి నా సహకారం కావాలని… ఆశ్చర్యపోయాను. ఆనందించాను. అలా ఆ పని నేను కృష్ణకుమారి కలిసి చేసాము.
బోయి విజయ భారతి గారిది నొప్పింపిక తానొవ్వని తత్వం. అలా అని తప్పించుకునే మనస్తత్వం కాదు. ఎంత కష్టతరమైన పనినైనా నిబ్బరంగా పూర్తి చేసే పట్టుదల. ఏదైనా విషయాన్ని చెప్పవలసి వచ్చినప్పుడు అంతే సూటిగా చెప్పగలిగే ధైర్యం. ప్రతి విషయాన్ని విశ్లేషణాత్మకంగా చూసే నైపుణ్యం. ఒక్క మాటలో చెప్పాలంటే మెత్తని పులి. అగ్రహారం లాంటి తెలుగు అకాడమీ గోడలను సైతం తన మౌనమనే ఆయుధంతో బద్దలు కొట్టిన ధీశాలి. నిస్వార్థ జీవి. అమ్మల ప్రచ్ఛన్న యుద్ధాలు ప్రపంచానికి తెలియవలసిన ఆవశ్యకతను గుర్తించి, తన తల్లి నాగరత్నమ్మ అనుభవాలను పుస్తకంగా తీసుకు వచ్చారు. మేనత్త ద్రౌపది కవిత్వాన్ని సంకలనంగా తీసుక వచ్చారు. పురాణాల దుమ్ము దులపడమే కాదు, ఒక దశలో తన అనుభవాల కోణం నుంచి చలం ను కూడా ఘాటుగానే విమర్శించారు. చెప్పడం కంటే చేసి చూపించడం ఆమె నైజం. అవార్డుల విషయంలో స్త్రీ పురుషుల మధ్య ఉన్న అంతరాన్ని నిరసిస్తూ జాషువా అవార్డు కింద తనకు వచ్చిన 50 వేల రూపాయల చెక్కును ఆ పీఠనాకే విరాళంగా ప్రకటించి తన అసహనాన్ని వ్యక్తం చేసారు. దాని వల్ల మరుసటి ఏడాది నుంచి పురుషులతో సమానంగా స్త్రీలకు కూడా లక్ష రూపాయల నగదు పురస్కారాన్ని ప్రకటించింది జాషువా పీఠం. పట్టుదలగా చేసి చూపించిన ఇలాంటి సంఘటనలు ఎన్నో ఆమె జీవితంలో మనకు కనిపిస్తాయి. అంతర్గతంగా ఉండే స్త్రీ శక్తికి ప్రత్యక్ష సాక్షి. అందుకే అప్పటికే సాహిత్య రంగంలో, సామాజిక రంగంలో పేరు గాంచిన ఇద్దరు పురుషుల మధ్య (తండ్రి బోయి భీమన్న, సహచరుడు బొజ్జా తారకం) తాను మరుగున పడిపోకుండా, వాళ్ళ గొడుగు కిందకు వెళ్ళకుండా తనను తాను ఉన్నతంగా నిలబెట్టుకున్నారు.