ఉత్తమ సంస్కారానికి ఆలవాలం
నిరాడంబరతకు నిలయం
ఆప్యాయతకు భాండాగారం
సౌజన్యం ఆమె స్వభావం
నిరంతర అధ్యయనం
విశ్లేషణాపూర్వక రచనలు
ఆమె మేధకు నిదర్శనం
ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే అద్భుత మూర్తిమత్వానికి ప్రతీక విజయభారతిగారు. ఆమె మాటల్లోని వాత్సల్యాన్ని ఏళ్ళ తరబడి అనుభవించిన నాకు ఆమె నిష్క్రమణతో మనస్సు ఎడారిలా మారింది. తాను పనిచేసిన తెలుగు అకాడమి అభివృద్ధికి నిరంతరం పాటుపడి దానిని ఆర్థికంగాను, గ్రంథప్రచురణల విషయంలోను ఉన్నత స్థాయికి తీసుకువచ్చి నిలబెట్టిన గొప్పతనం మరువలేనిది. భర్త బొజ్జా తారకంగారు ప్రజల పక్షాన నిలిచిన పేరు పొందిన అడ్వకేట్.
తారకంగారు ప్రముఖ హేతువాది, దళితనాయకుడు. ఆయనతో విజయభారతిగారి వివాహం 1968లో జరిగింది. ఈ దంపతులు తమ ఇద్దరు పిల్లలను ఉన్నతవిద్య చదివే రీతిలో ప్రోత్సహించారు. విజయభారతిగారి తనయుడు రాహుల్ బొజ్జా ఐఎఎస్ అధికారి. ప్రస్తుతం తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదల శాఖ సెక్రటరీగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కూతురు మహిత ఉస్మానియా మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
విజయభారతిగారి తండ్రి ప్రముఖ రచయిత బోయి భీమన్నగారు. తల్లి నాగరత్నమ్మ. చిన్నతనంనుంచే కుసుమ ధర్మన్న వంటి ప్రముఖ దళితోద్యమ నాయకులతో పరిచయమున్న కుటుంబ వాతావరణంలో ఆమె పెరిగారు. ఆ ప్రభావంతో విజయభారతిగారు ఒక స్థాయికి ఎదగడానికి తోడ్పడ్డాయి.
తెలుగు అకాడమిలో విజయభారతిగారు ఒక అధికారి. ఆమె దగ్గరకు వెళ్ళి పని విషయంలో ఏదైనా అడగాలంటే కింది ఉద్యోగినిగా భయంగా ఉండేది. కానీ ఆమె చిరునవ్వుతో ‘కూర్చోండి’ అంటూ సాదరంగా మాట్లాడటం చూసి క్రమంగా బెరుకు తగ్గి ఆమె చూపించే అభిమానంతో ఒక స్నేహపూర్వక వాతావరణం నెలకొని తరచుగా నేను అశోక్‌నగర్‌లోని వారింటికి వెళ్ళడం, మా పిల్లల పుట్టిన రోజులకు ఆవిడ మా ఇంటికి రావడం మామూలైపోయింది. విజయభారతిగారింటికి వెళ్ళినప్పుడు వారి మాతృమూర్తి నాగరత్నమ్మగారు ఆప్యాయంగా పలకరించేవారు. వారి సోదరి విజయలక్ష్మిగారు కూడా సన్నిహితులైనారు.
విజయభారతిగారు వినికిడి సమస్యతో బాధపడేవారు. అన్నీ అధిగమించి ఆపీసులో టేబుల్ మీద ఎన్నో పుస్తకాలు, ఫైళ్ళ మధ్య తన పనిలో లీనమై కనిపించేవారు. పని విషయంలో కింది ఉద్యోగులను ఏనాడూ పరుషంగా మాట్లాడి, మందలించలేదు. తాను చెప్పదలుచుకున్న విషయాన్ని సౌమ్యంగా చెప్పేవారు. పనిని నిర్లక్ష్యం చేస్తే సున్నితంగా చెప్పి తగు సూచనలిచ్చేవారు. విజయభారతిగారితో మాట్లాడేటప్పుడు సాధారణంగా ఆపీసుకు సంబంధించిన విషయాలు, ఇంటర్మీడియట్ పుస్తకాల గురించి, పారిభాషిక పదకోశాల గురించి చర్చిస్తూ ఉండే వాళ్ళం. తెలుగు అకాడమిలో పారిభాషిక పదకోశాలు తయారు చేయడంలో, చేయించడంలో ఆమె చాలా కృషి చేశారు. అన్ని సబ్జెక్టులకు సంబంధించిన పదాలను ఆంగ్లం నుంచి తెలుగులోకి సమానార్థకాలుగా చేసే పని, ఇంటర్మీడియట్ పాఠ్యపుస్తకాలు తెలుగు మాధ్యమం విద్యార్థులకు ఉపకరించే విధంగా ఉండాలి. ఆంగ్ల మాధ్యమంలో చదివే విద్యార్థులకు ఉపకరించే విధంగా ఉండాలి. ఆంగ్ల మాధ్యమంలో చదివే విద్యార్థుల కోసం ఇంటర్మీడియట్ బోర్డు ఇచ్చిన సిలబస్ ఆధారంగా అన్ని సబ్జెక్టులు ఆంగ్లంలో రాయించే ప్రక్రియకు విజయభారతిగారు ఎంతో శ్రమించారు. వివిధ విశ్వవిద్యాలయాలలోని ఆయా సబ్జెక్టుల ఆచార్యులను అకాడమికి పిలిచి సమావేశాలు ఏర్పాటుచేసి అనుభవజ్ఞులైన ఆచార్యులను సంపాదకులుగా ఏర్పాటుచేసి ప్రామాణికమైన పుస్తకాలుగా రూపొందించడంలో అకాడమి ఇన్‌ఛార్జ్ సంచాలకులుగా విజయభారతిగారి పాత్ర గణనీయం. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, కామర్స్, ఇకనామిక్స్… ఇట్లా అన్ని సబ్జెక్టులలో తెలుగు, ఆంగ్ల మాధ్యమాలలో తేడా రాకుండా చూడే బాధ్యత అకాడమి స్వీకరించింది. అందుకుఇతోధికంగా దోహదం చేశారు విజయభారతిగారు. ఇంటర్మీడియట్ తెలుగు మాధ్యమంలో చదివి అధికశాతం మార్కులు సాధించిన విద్యార్థినీ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయిలో నగదు బహుమతులను ప్రోత్సాహకంగా ఇచ్చే ప్రక్రియలో డా॥ ఆకుల మంజులతగారు, డా॥ బి. విజయభారతిగారు తమ శక్తి ధారపోశారు. ఒక ప్రామాణికమైన విద్యాసంస్థగా తెలుగు అకాడమి నిలబడటానికి 1968 నుంచి అనేకమంది సంచాలకులు కృషిచేశారు. 1978లో తెలుగు అకాడమిలో రీసెర్చ్ ఆఫీసరుగా చేరిన విజయభారతిగారు డిప్యూటి డైరెక్టరుగా తదనంతరం ఇన్‌ఛార్జ్ సంచాలకులుగా నిబద్ధతతో పనిచేశారు. ఆర్థికంగా అకాడమి నిలదొక్కుకోవడానికి విజయభారతిగారు, మంజులతగారు సమర్థవంతంగా పనిచేసి కృతకృత్యులైనారు. శాశ్వత ఉద్యోగులు సంచాలకులుగా పనిచేసినవారు ఈ ఇరువురే.
ఒక సాధారణ దళిత కుటుంబం నుంచి వచ్చి ఉన్నత చదువులు చదివి, ఉన్నతోద్యోగం చేయడమే కాక, లోతైన అధ్యయనంతో విశ్లేషణాపూర్వకమైన తెలుగు సాహిత్యం, చరిత్ర, వివిధ సామాజిక అంశాల మీద 20 పుస్తకాలు రాశారు. భారతీయ కులవ్యవస్థ ఆధారంగా పురాణ ఇతిహాసాలపై విశ్లేషణాత్మక వ్యాఖ్యానాలు రాయడం సామాన్య విషయం కాదు. విస్తృతమైన అధ్యయనం వల్ల తప్ప రాయలేని గ్రంథాలు నరమేధం ` నియోగాలు, సత్యహరిశ్చంద్రుడు, షట్చక్రవర్తులు, రామాయణ మునులు వంటివి.
తెలుగు అకాడమి కోసం డా॥ విజయభారతిగారి సంపాదకత్వంలో వెలువడిన గ్రంథాలు ‘ప్రాచీన సాహిత్యకోశం’, ‘ఆధునిక సాహిత్యకోశం’ ` ఈ రెండూ అపూర్వగ్రంథాలుగా నేను భావిస్తాను. ఇవి సాహిత్యాభిమానులకు దిక్సూచిగా చెప్పవచ్చు. ఈ గ్రంథాలలో రచయితలు, వారి రచనలు పేర్కొనడం జరిగింది. అనేక గ్రంథాలయాలకు వెళ్ళి విషయ సేకరణ చేసి, అన్నీ కార్డుల మీద రాసి అక్షం క్రమంలో కూర్చడం, మరింత సమాచారం కోసం అనేక ఇతర ఆధారాలు కూడా వ్యక్తిగతంగా కొంతమందిని కలిసి ఆయా విషయాలను చేర్చడం ఆవిడ నిబద్ధతకు నిదర్శనం. ఆ పుస్తకం తయారీ పని చేసిన విద్యావిషయక సిబ్బంది కూడా చాలా సహకరించారు.
ఆమె రాసిన ‘షట్చక్రవర్తులు అనే పుస్తక సంకలనానికి 2003వ సం.లో కెనడాలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ మిషనరీస్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమి అవార్డులు వచ్చినై. ఆమె దళిత సాహిత్య విమర్శ మీద తన దృష్టిని ఎక్కువగా కేంద్రీకరించారు. ఒక పత్రికలోని తన వ్యాసంలో దళితులను ఇలా నిర్వచించారు. ‘‘సాంఘిక సమానత్వం, ఆర్థికప్రగతి, మానవస్వేచ్ఛ వంటి రంగాలలో సమాజం నుంచి వేరుచేయబడిన వారే దళితులు. వారి కోసం ఆవేదన చెంది వారి సమస్యలు చిత్రించటం వాటిని మెరుగుపరిచే పరిష్కారమార్గాలను సూచించటం దళిత సాహిత్య ముఖ్యలక్షణాలుగా పేర్కొన్నారు ఆమె.
తెలుగు సాహిత్యానికి, సామాజిక ఉద్యమాల బలోపేతానికి తన రచనల ద్వారా గణనీయమైన కృషి చేసిన గొప్ప సాహితీమూర్తి ఆమె. తెలుగు అకాడమీలో వివిధ హోదాలలో బాధ్యతలు నిర్వర్తించి 1999లో ఇన్‌ఛార్జ్ డైరెక్టర్‌గా పదవీ విరమణ పొందారు.
ఆమెతో నాకు గల ఉద్యోగ అనుబంధం 21 సంవత్సరాలు. ఆ అనుబంధం మరువలేనిది. ఎంత వ్రాసినా తరగనిది. 83వ ఏట తనువు చాలించిన ఆమె, మరణానంతరం తన భౌతికకాయాన్ని వైద్యకళాశాలకు అప్పగించమని కోరటం ఆమె సామాజిక చైతన్యానికి నిదర్శనం. తన, పర భేదం లేకుండా అందరితో అభిమానంగా మసలుతూ ఆదరణ చూపే మంచి మనసున్న మహిళ విజయభారతిగారు. సాహితీ క్షేత్రంలో కూడా ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుని కళ్ళు సహకరించకపోయినా కడదాకా తన రచనా వ్యాసంగం సాగించిన వనిత ఆమె. దళిత వర్గ సంక్షేమమే కాక సకల జనుల శ్రేయస్సును ఆకాక్షించిన ప్రేమమూర్తి విజయభారతిగారి గురించి, ఆమె వ్యక్తిత్వాన్ని గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. నా మనసులో మాట రాయగలిగినందుకు కొంతైనా తృప్తి పడుతూ నివాళి అర్పిస్తున్నాను.