డాక్టర్ బోయి విజయభారతి ప్రముఖ విదుషీమని. ప్రముఖ సాహిత్య వేత్త బోయి భీమన్న గారి పెద్ద కుమార్తె. లెక్చరర్‌గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ డైరెక్టర్‌గా పనిచేశారు. ఏమైనా ఆమె విజ్ఞానం, విజ్ఞత, సంస్కారం ముందు ఆమె చేపట్టిన పదవులు అంత లెక్కలోనివి కాదు. తెలుగు సాహిత్యం మీద ఆమెకు మంచి పట్టు.
మరీ ముఖ్యంగా మన పురాణాలను, ఇతిహాసాలను అధ్యయనం చేసి సాధారణ ప్రజల దృక్పథంలో నుంచి పరిశీలించి చేసిన రచనలు అందరం తప్పకుండా చదవాలి. మనుధర్మశాస్త్రం కారణంగా ఈ దేశంలో శూద్రులు, మహిళలు బానిసలుగా బ్రతికారు, బ్రతుకుతున్నారు. పురాణాల బరువు శూద్రుల మీద, స్త్రీల మీద ఎంత ఎక్కువగా ఉన్నదని అంటే వారి బానిసత్వాన్ని వారే ఆమోదించేంతగా. అటువంటి పురాణాలను స్త్రీలు, శూద్రుల విముక్తి దృక్పథంతో పరిశీలించి ఆమె చేసిన రచనలు మనకు, మన భావితరాలకు కూడా బాగా ఉపయోగపడతాయి. ప్రతి ఒక్కళ్ళు చదివి అర్థం చేసుకునే విధంగా ఉంటాయి ఆమె రచనలు, అనువాదాలు కూడా.
ఆమె గురించి నేను మొదటగా విన్నది జస్టిస్ పున్నయ్యగారి ఇంటి దగ్గర. నేను, అప్పటి ఐద్వా రాష్ట్ర కార్యదర్శి పావని కలిసి జస్టిస్ పున్నయ్యగారి ఇంటికి వెళ్ళాం. అప్పుడు దళిత మహిళల సదస్సు నిర్వహించాలని అనుకున్నాం. పున్నయ్యగారిని ఆ సదస్సుకు ఆహ్వానించాలని, ఆమోదించమని అడగడానికి వెళ్ళాం. ఆ సందర్భంగా ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు మాట్లాడుకుంటుంటే అప్పుడు తెలిసింది విజయభారతి గారి గురించి. వెంటనే నేను, పావని, మరి కొంతమందితో సంప్రదించుకొని తెలుగు అకాడమీకి వెళ్లి ఆమెను ఆహ్వానించాం. ఆమె ఎంత నమ్రతగా చెప్పారంటే,’ నేను పెద్దగా ఉపన్యాసాలు ఇవ్వగలిగే దానిని కాదు. నేను పుట్టింది దళిత కుటుంబంలో అయినా గ్రామీణ ప్రాంతాల్లో దళిత స్త్రీలు ఎదుర్కొనే సమస్యలు నాకు అంతగా తెలియదు. మీరు ఆశించిన పద్ధతిలో నేను మాట్లాడగలనో లేదో అని అన్నారు. కానీ సదస్సుకు వచ్చిన తర్వాత ఎంత చక్కగా సౌమ్యంగా విషయాలు వివరించారంటే నాకు ఎప్పటికీ ఆమె మాట్లాడిన విషయాలు గుర్తుండిపోయాయి. ఆ తర్వాత మరికొన్ని సభలకు ఆమెను ఉపన్యాసం ఇవ్వమని అడిగితే వచ్చేవారు.
అలా మానవికి కొన్ని వ్యాసాలు రాసి ఇవ్వమని అడిగాం. వాటిలో నాకు బాగా నచ్చింది ‘అభిమానవతి సీత’. సీతను మనం మహాసాద్విగాను, ఒక శోక మూర్తిగానే చూస్తాం. కానీ సీతలో ఉన్న ధీరోదాత్తత, ఆమె వ్యక్తిత్వంలో ఉన్న గొప్పతనం చాలా చక్కగా వివరించారు. అప్పటి నుండి ఆమె నిరంతరం మానవి పత్రికకు వ్యాసాలు అందిస్తూనే వచ్చారు. ‘నేను మీకు ఎంతవరకు ఉపయోగపడగలను’ అని సంశయిస్తూనే వెంటనే మానవి అడ్వైజరీ బోర్డులో ఉండటానికి అంగీకరించారు.
సరిగ్గా రెండేళ్ల కిందట ఆమెను ఆమె ఇంటి దగ్గర కలిసి పరామర్శించాను. అప్పుడు ఆమె కుమారుడు రాహుల్ సంరక్షణలో ఉన్నారు. చాలాసేపు మాట్లాడుకున్నాం. ఆరోగ్యం సహకరించట్లేదు అని ఆమె అన్నారు. ‘మీకు ఎంత సహకరిస్తే అంత మీ రచనలు మాత్రం కొనసాగించండి. రచనలు ఆపవద్దు. మీ రచనలే మిమ్మల్ని ప్రజల్లో సజీవంగా నిలుపుతాయి’ అని నా మాటగా చెప్పాను. ఆమె గది పరిశీలిస్తే టేబుల్ నిండా, బీరువాల నిండా పుస్తకాలు, కాయితాలే. ఆ వయసులో కూడా ఆమెకు ఇంకా ఏదో చెయ్యాలి, తను అధ్యయనం చేసిన విషయాలను ప్రజలకు తెలియజేయాలి అనే తపన ఆమెలో కనిపించింది. ఆమెకు, నాకు వయసులో 20 ఏళ్లు తేడా. అయినా ఎందుకో ఆమె వయసును మరిపించి చాలా స్నేహపూర్వకంగా ఉండేవారు. కించిత్తు గర్వం, అహం ఉండేది కాదు. విడదీయరాని ఆత్మీయ బంధం ఏదో మా మధ్య ఉండేది. చాలాసార్లు ఆమెను కలవాలనుకున్న. కలవలేకపోయాను. ఆమె చనిపోయారు అనే వార్త విన్నప్పుడు చాలా బాధనిపించింది. మన తెలుగు రాష్ట్రాలు, ఈ దేశం, సాధారణ ప్రజలు, స్త్రీలు తమకు మద్దతుగా నిలిచిన ఒక గొప్ప విజ్ఞాన ఖనిని కోల్పోయాయి.
ఆమె మాటల్లో, స్వభావంలో సౌమ్యత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కానీ ఆలోచనలో, ఆచరణలో నిక్కచ్చితనం, స్థితప్రజ్ఞత, రాజీలేనితనం కనిపిస్తుంది. ఆమె ఒక నిశ్శబ్ద విప్లవకారిణి. తన జీవిత సహచరుడు, సైదాంతికంగా కూడా తనకు వెన్నుదన్నుగా ఉన్న తారకంగారి అనారోగ్యం, మరణం తట్టుకొని నిలబడ్డారు. ఆమె లేరు అన్న వాస్తవం జీర్ణం కావట్లేదు. జనం కోణంలో చరిత్రను, సాహిత్యాన్ని అధ్యయనం చేసే వారిని ప్రోత్సహించడమే ఆమెకు మనం అందించే నివాళి.