గత సంవత్సరం 28 సెప్టెంబర్‌న తెలుగు సాహితీ సామాజిక సమూహాల ముందు చీకటి సంతకం చేసి సెలవంటూ వెళ్ళిపోయారు పరిశోధక సాహిత్య మేరునగధీర బోయి (బొజ్జ) విజయభారతి. ఆమెది మహోన్నతమైన విజయగాథ. కవి, రచయిత బోయి భీమన్న నాగరత్నమ్మల కూతురైన ఆమె తండ్రి భీమన్న రచనా వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు.
తెలుగులో ప్రాచీన సాహిత్య పరిశోధనలు, చరిత్ర, కుల`వర్గ, వర్ణ, జండర్ అంశాలపై ఇరవైకి పైగా గ్రంథాలు రచించారు. సామాజికంగా దళిత మహాసభ వ్యవస్థాపకుడు కవి, మానవహక్కులవాది, విప్లవకారుడైన సహచరుడు బొజ్జా తారకం గారితో కలిసి పయనించారు. తన బాల్యం నుండి కుసుమ ధర్మన్న లాంటి మరికొందరు దళిత నాయకులతో సంబంధాలు కలిగి ఉన్న కుటుంబ వాతావరణంలో పెరిగారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు భాషా శాఖ నుండి డాక్టరేట్ పొందిన రెండవ మహిళ, తొలి దళిత మహిళ విజయభారతిగారు. సౌమ్యత, సంయమనంతో జీవన పర్యంతం ఆమె వ్యక్తిత్వం ఎందరో ఆత్మీయులను సంపాదించి పెట్టింది. ఆమె లేరంటే పెద్ద లోటు, వెలితి నిత్యం వెక్కిరిస్తుంది. ఆమె ఎంతో శ్రమతో ఆశతో సాహిత్యపరంగా వెలువరించిన గ్రంథాంశాలలోని ప్రతి పదం, వాక్యం నేనున్నానని చెరగని భరోసా ప్రకటిస్తుంది. వారికున్న అనుబంధాలు ఎన్నో, వారు పూయించిన స్నేహాల ఉద్యానవనాలు మరెన్నో. ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక (ప్రరవే)తో ప్రత్యేక అనుబంధం. ‘ప్రరవే’ గ్రామీణ మహిళల కోసం చేయాల్సిన పనులపట్ల నిండైన ఆశాభావం. ప్రరవే పని తీరు పట్ల ఆనందాశ్చర్యాలు వ్యక్తం చేసిన సందర్భాలు.
సామాజిక విప్లవకారుడు మహాత్మా జోతీరావు పూలే జీవిత చరిత్రను తెలుగులోకి అనువదించిన ఘనత వీరిది. పుట్టి పెరిగింది గోదావరి జిల్లాలో అయినా ఉన్నత చదువులు, పెళ్ళి, ఉద్యోగం, స్థిర నివాసం అంతా తెలంగాణలోనే. తన పార్థివ శరీరాన్ని వైద్య విద్యార్థుల పరిశోధనార్ధం వైద్య కళాశాలకు డొనేట్ చేసారు. ఇక్కడ లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ మరణించినప్పుడు ప్రజాకవి కళోజీ అన్నట్లుగా తారకం, విజయభారతిగార్లు జీవించిన విధానం తెలిసినప్పుడు ‘‘చావు నీది, పుటక నీది, బ్రతుకంతా దేశానిది’’ గుర్తుకొస్తుంది. ఇద్దరూ కారణజన్ములు! సదా స్మరణీయులు!
… … …
స్త్రీవాద దృక్కోణంలో జెండర్`కులం (Gendering, Caste through a Feminist Lens) అనే గ్రంథాన్ని ఉమా చక్రవర్తి ఎంతో నిబద్ధతతో రచించారు. దీనిని కాత్యాయని తెలుగులోకి అనువదించారు. 2017లో ముద్రితమైన ఈ గ్రంథానికి ముందుమాట విజయభారతి గారిది. ఆ ముందు మాట ఒక మినీ థీసిస్ అనిపిస్తుంది.
ఈనాటి మన సమాజానికి ముఖ్యంగా కుల`వర్గ`జెండర్ చీలికల పునాదులపై నిలబడి ఉండి అటూ ఇటూ అయోమయం, అలజడితో ఊగుతున్న భారతదేశ వ్యవస్థకు కులం గురించి, జెండర్ గురించి చర్చించే రచనలు చాలా అవసరమైనవి. సామాజిక స్పృహ ఉన్నవారు ఆ అంశాలపై రచనల్ని చదువుతారు అని అంటారు. ఈ పుస్తకం మండల్ వ్యతిక ఉద్యమ నేపథ్యంలో విశ్లేషించబడిరది. ఇది కూడా ఒక గొప్ప సంఘటన అని విజయభారతి అంటారు.
అప్రతిమానమైన జెండర్, అతి లోతైన కులం ఈ రెండూ బలంగా అల్లుకున్న సమాజం జనారణ్యం కాదు అది భయమోత్పాతాలను కలిగించే కీకరాణ్యం. ‘‘కులం ఒక అవగాహన’’ ‘‘భారతదేశంలో జెండర్ వర్గీకరణ’’ దాని లక్ష్యం అనే అధ్యాయాల్లోని అంశాలను ప్రస్తావిస్తూ ‘‘బ్రాహ్మణీయ పితృస్వామ్యం’’ అర్థం చేసుకోవడానికి జెండర్ వర్గీకరణ అనే కొత్త విషయం ద్వారా స్వజాతి వివాహ విధానం, స్త్రీలు వినిమయ వస్తువులుగా మారటంలాంటి విషయాలు చర్చించబడ్డాయి. కులవ్యవస్థలో, హిందూత్వంలో ఉన్న ప్రత్యేక నిర్మాణమే ‘బ్రాహ్మణీయ పితృస్వామ్యం’ అని విశదపరిచారు.
పుట్టుకతో అమలయ్యే వివక్షలు సంస్కృతి పేరున ఏ విధంగా బిగించబడుతాయో, కర్మతో అల్లుకున్న సూత్రం ఏ విధంగా శాసిస్తున్నదో లాంటి సమస్యలను వివరంగా చెబుతుంది ‘కులం`జెండర్’ పుస్తకం. కులానికీ ` జెండర్ ఉన్న దృఢ నిబంధనలు, సంబంధం స్త్రీల ద్వారా కులాన్ని పవిత్రీకరిస్తూ రాజ్యాధికారం పరిధిలోకి రావడం గురించిన అన్వేషణ, విశ్లేషణ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కులం ` జెండర్ గ్రంథంలో ఉమా చక్రవర్తి ఈ విషయాలను చర్చించారు.
రాజ్యాంగాన్ని ఖాతరు చేయకుండా స్త్రీల పట్ల జెండర్`కుల అసమానతలు కొనసాగుతుండటం. మన న్యాయస్థానాలు దాన్ని తప్పుపట్టకుండా అనుమతించడం మన యథాతథ వ్యవస్థలోని అతి పెద్ద వైరుధ్యం. అందుకే గ్రంథ రచయిత్రి హిందూ సమాజాన్ని కేంద్రంగా చేసుకొని తన పరిశోధనా విశ్లేషణ చేసారు. శతాబ్థాలుగా మన జనాలు తమలో జీర్ణించుకున్న ఈ శృంఖరాలు అతిపవిత్రమైనవనీ, రక్షణనిచ్చేవనీ, మోక్ష మార్గం చూపేవి అనీ నమ్మడం నమ్మించబడటం పైన ఆధారపడి నడుస్తున్నది. బ్రాహ్మణీయ చారిత్రక మూలాలను పరిశోధన చేస్తూ మన పూర్వ పండితులు ‘సూత్రాలను’, పాశ్చాత్య మేధావుల భావనలను అధ్యయనంలోకి తీసుకొని సామాజిక వాస్తవికత దృష్టికోణం నుండి విశ్లేషణా పద్ధతిని రూపొందించుకుంటూ భవిష్యత్ పరిశోధలకు మార్గం వేసారు అని వివరిస్తారు ఉమాచక్రవర్తి.
‘స్త్రీల అప్రధానీకరణ ` పితృస్వామ్యం’ అవతరణ గురించి స్త్రీ లైంగత్వంపై నియమాలు, పురుషుల గౌరవాలను నిలబెట్టి, రక్షిస్తూ భద్రపర్చాల్సిన కుల స్త్రీల బాధ్యతను కఠినంగా నిర్దేశించి ధర్మమని నమ్మించడం. స్త్రీల పునరుత్పత్తి శక్తిని మార్మిక శక్తిగా పూజించడం అనే మాతృదేవత ఆరాధన మొదలైన క్రమం ` పురుష దేవుళ్లు వెలియడం ప్రారంభంతో స్త్రీ దేవతల, శక్తుల ప్రాధాన్యత తగ్గడం ` ఇక్కడ ఒక విచిత్రమైన అధికారికమైన మెలికపెట్టడం, అది స్త్రీ దేవతలను పురుష దేవతలకు భార్యలను చేసెయడంతో మొత్తం వ్యవస్థలో పితృస్వామ్య అధిపత్య భావజాలానికి తిరుగులేని పట్టం కట్టడం జరిగిపోయింది. ఈ విషయంలో అంబేద్కర్ అధ్యయనాలు పరిగణలోకి తీసుకోదగినవి అంటారు విజయభారతి.
గృహ సూత్రాలననుసరించి కర్మకాండలు, పాపపుణ్యాలు ప్రాతిపదికలుగా కులమూ` జెండర్‌ను ఉపయోగించడం, పవిత్ర కర్మలూ, తంతులూ, హోమాలు, క్రతువులూ అగ్ర కులాల వారికీ, క్షుద్రకార్యాలు దిగువ కుల స్త్రీలకు అంటగట్టారు. శ్రమశక్తిని అమ్ముకునే కింది కుల`స్త్రీలను పాపకర్ములుగా, దుష్టశీలురుగా ప్రచారం ప్రారంభించారు. అందుకు పురాణేతిహాసాలైన రామాయణ, మహాభారత ఉదంతాలను భావజాలంగా వ్యాప్తి చేసారు. స్త్రీల రుతు ధర్మాన్ని పాపానికీి అపవిత్రతకూ ఆపాదించడం, జండరూ కులాన్నీ అమలినం అని శాసించడమూ చేసారు. ఆచార న్యాయాన్ని ప్రవేశపెట్టినవి ‘స్మృతులు’ కులధర్మాలను ప్రవేశపెట్టింది ‘వాజ్మయం’. అత్యంత ప్రమాదకరమైన ఆచారాలు మతం పేరున పరస్పర విరుద్ధమైన భావజాలంతో సమాజాన్ని శాసించడం జరిగింది. అంధవిశ్వాసాలు, మూఢభక్తి, పతివ్రతాధర్మాలు ఆ దశలో బలంగా వేళ్లూనుకున్నాయి. ఆచార న్యాయాలు శాసనాలై దుష్టుల చేతిలో కొరడాలై సమాజ వికాసాన్ని అడ్డుకుంటూ ఆనాటి న్యాయ వ్యవస్థకు నిదర్శనంగా నిలిచిపోయాయి.
నాడు నేరాలకు శిక్షలను ఏకాదశీ వ్రత నియమాలు చెప్పే ‘‘రుక్మాంగద చరిత్ర’’ అనే కావ్యాన్ని అనుసరించి కులాన్నీ జెండర్‌ని బట్టే ఉండేవని తెలుసుకోవచ్చు. ‘సహగమనం’ గురించి, ‘వితంతు’ స్త్రీలంటూ వివిధ క్రూర ఆంక్షల గురించి ఆ సాహిత్యం స్పష్టం చేస్తుంది. 10వ శతాబ్ధం నుండి ఈ అంతరాల చరిత్ర సాహిత్య పరంగా నమోదయ్యింది. స్త్రీలను లైంగికపరంగా అణిచివేయడం, వారికి సమాజ జీవితం లేకుండా చేయడం, వారిని ఆంక్షల సంకెళ్ళలో బంధించి లైంగిక, శ్రమ దోపిడీలు చేయడం ధర్మబద్ధం అంటూ ఒంటికాలు మీద నిలబడి హద్దుల్లేని అధిపత్యాన్ని చెలాయిస్తున్నది. ప్రధానంగా లైంగిక హింస స్త్రీ అస్తత్వాన్నీ, సంపూర్ణత్వాన్నీ గాయపరుస్తూ ‘మతం’ గుదిబండను నెత్తినెత్తి సామాజిక చట్టాలను ఉల్లంఘిస్తున్నది ఈ వ్యవస్థ.
విజయభారతి గారు ‘‘కింది కులాలకు కులం ఒక వాస్తవం. పై వర్గాలకు కులం ఒక ఆయుధం, రక్షణ స్త్రీలకు జెండర్ ఒక వాస్తవం, పురుషులకు జెండర్ ఒక ఆయుధం ` రక్షణ కూడా’’ అంటారు. ఈ గ్రంథంలోని అంశాలు ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతాయి అని చెబుతూ పవిత్రతా ` అపవిత్రతా అనే భావాలను తిరిగి నిర్వచించుకోవాల్సి అవసరం ఉందంటూ యువతరంలో తార్కిక ధృక్కోణం రావాల్సి ఉందని అంటారు. స్త్రీల అప్రాధానికరణే కాకుండా సామాజిక ఆర్థిక హోదాలు, కుల అంతరాల పరంగా తేడాలను వ్యవస్థ ఎప్పుడు ఎక్కడ స్థిరపర్చిందో తెలుసుకోవాలని అంటారు.
‘‘సృష్టిలో తల్లి వాస్తవం తండ్రి ఒక విశ్వాసం అయినా వ్యవస్థ విశ్వాసం మీదనే నడుస్తున్నది, వాస్తవాల మీద కాదు.’’ మాతృస్వామ్యం వాస్తవంగా ఏర్పడిరది. పితృస్వామ్యం విశ్వాసం మీద ఆధారపడిరది కానీ మాతృస్వామ్యాన్ని పితృస్వామ్యం వెనకకు నెట్టి తన ఉక్కు కాళ్ళ కింద అణిచిపెట్టింది. ఎందుకంటే అధికారం పితృస్వామ్యానికి తోడుగా నిలబడిరది. హింసతో బతుకుతూ మాతృస్వామ్యం మీద గెలుస్తూ వస్తున్నది. కాలాలు కదిలిపోతున్నా ఆకాశమెత్తున నిలబడి అహంకరిస్తున్నది పితృస్వామ్యం.
పూర్వ వ్యవస్థలు మానవీయంగా ఉండేవి. అవి ఇప్పుడు అమానవీయతతో కునారిల్లిపోవడం అనూహ్యమైనది. మహాభారత కాలంలో అధికంగా వర్ణాంతర సంబంధాలే పరిఢవిల్లిన సందర్భాలు చూస్తున్నాం. వర్ణ, జాతి, తెగల, ప్రాంతాల బేధాలు లేకుండా జతకట్టడం, సంబంధాలు కలుపుకొని వివాహాలు చేసుకోవడం నాడు ఎంతో సహజం. పురాణాలను, ప్రణయ గాథలను ఎంతో అభిరుచితో చదివి ఆనందించే ఈ ఆధునిక యుగంలో కులాంతర వివాహం పెద్ద నేరంగా, ప్రేమల పెళ్ళిళ్లు పాపంగా అవి సామాజిక పరువు ప్రతిష్టలకు వ్యతిరేకంగా తూలనాడబడుతూ పరువు కోసం హత్యలు, అఘాయిత్యాలు చేస్తున్నారు. మానవీయ విలువల్నీ, సనాతన సంస్కృతినీ అర్థం చేసుకోవడంలో ఎక్కడ పొరపాటు జరిగిందన్న ఆవేదనతో ప్రశ్నించుకుంటారు విజయభారతి.
ఈ రోజున ఒక స్త్రీ వాద దృష్టికోణం నుండే కాకుండా శాస్త్రీయంగా, చారిత్రకంగా, పౌరాణిక నేపథ్యాల నుండి దారి చేసుకుంటూ, ప్రశ్నలను పరిష్కరించుకుంటూ గమ్యాన్ని నిర్ధేశనం కావించాల్సి అవసరం ఏర్పడిరది. శాస్త్రీయతను నిరాకరిస్తూ మూఢత్వాలను ఎంచుకొని నిజమని నమ్ముతున్న సమాజం అసత్యాలను ధర్మం, మోక్షమంటూ నమ్ముతున్న పౌర సమూహాలు, మన దేశంలో అనేక జాతుల తెగల సమాఖ్య అంటూనే అపసవ్యంగా ప్రవరిస్తూ అస్తవ్యస్తంగా జీవించేలా చేస్తున్న మత రాజకీయాలు డబాయింపూ దౌర్జన్యాలతో విచ్ఛిన్నకరమైన సంఘాన్ని ప్రోత్సహిస్తున్నవి.
విజయభారతి అన్నట్లుగా ‘‘స్వధర్మే నిధనం శ్రేయం`పరధర్మం భయావహం’’ అనేది ప్రజల మెదళ్ళను పరిపాలిస్తున్నది. ఏది ధర్మం? ఏది అధర్మం? అనేది రాజ్యమేనా నిర్ణయించేది? అని ప్రశ్నిస్తూ రాజ్యం తన పర అన్ని దోషాలనూ ఎల్లవేళలా ప్రజల పైనే కదా రుద్దేది అంటారు. ‘‘జగత్తు మిథ్య, బ్రహ్మ సత్యం’’ లాంటి సూక్తులూ, వేదాంతులుగా ప్రజలు ఉండాలనుకోవడం, ధర్మ సుస్థాపన కోసం దమననీతిని అమలు చేయటం, రాజ్యం పాత్రగా ఉంటున్నది. ధర్మం అతిసూక్ష్మమైనదని, సారపు ధర్మమూ విమల సత్యమూ అంతు చిక్కనివని చెప్పుకొస్తారు.
శాస్త్ర విజ్ఞానాల వెలుగులో సమ్యక్ దృష్టితో సమాజాన్ని అర్థం చేసుకునే ఉత్సుకత, న్యాయబద్దతా, సహనం మనకుండాలి. కుల వ్యవస్థను జెండర్ సమస్యతోనే అధ్యయనం చేయాలని ఈ తరానికి రచయిత్రి పిలుపునిస్తారు. ఇదంతా సుదీర్ఘ సమయ సహనాలతో సత్యాన్ని నిగ్గుదేల్చి ఆచరణలోకి తెచ్చుకునే ప్రక్రియ అని గ్రంథ రచయిత్రి భావించినట్లుగా విజయభారతి గారికి కులం ` జెండర్ పుస్తకం చదవడం గొప్ప అనుభూతిని కలిగించిందని తన ముందు మాటలో పేర్కొన్నారు.
(మన కాలపు మహోజ్జ్వల వ్యక్తి, చరిత్ర పరిశోధకులూ, అనువాదకులూ, రచయిత్రీ, సామాజికవేత్తా విజయభారతికి నీరాజనాలు పడ్తూ తన వ్యాసంలోంచి తను ప్రస్తావించిన కొన్ని అంశాలు)