నీ రాక కోసం యావత్ భూలోకం
ఉద్విగ్నభరితంగా కళ్ళు కాయలు చేసుకునే
ఎదిరి చూస్తోంది తల్లీ..!
గురుత్వాకర్షణ లేని శూన్యంలో
తొమ్మిది నెల్ల నుంచీ
తల్లి గర్భంలోని శిషువులా ఉమ్మనీటిలో ఈదులాడుతున్నవ్..
ఇప్పుడిది నువ్వు మరోసారి జన్మించడమే
లక్షల మైళ్ళ నుంచీ నిన్నూ..
నీ మాటల్ని వింటూ విస్తు పోతున్నాం..
ఎనిమిది రోజుల్లో తిరిగి రావలసిన నువ్వు
వస్తావో రావో తెలియని
శూన్యాకాశంలో చిక్కుబడిపోయావ్
వైజ్ఞానికాభివృద్ధి కోసం
నీ ప్రాణాలనే ఫనంగా పెట్టావు..
ఈ సాహసోపేత ప్రయోగం తెలియక చేసిందేమీ కాదు..
కోరి మరీ స్వీకరించిందేనని మాకు విధితమే
భారరహితంగ..
తేలియాడే నువ్వూ నీ జుట్టూ చూస్తూ ఉంటే
ఎంత అబ్బురమో..
ఇది వైజ్ఞానిక శాస్త్రం ఘనతే కాదు
మనిషి అంది పుచ్చుకున్న మేధకి మచ్చు తునక
నువ్విప్పుడు నాకు తారసపడితే
నిన్ను ఉక్కిరిబిక్కిరి చేసేలా ..
లక్షయక్ష ప్రశ్నలతో అంతుచిక్కని
చిక్కు ముచ్చట్లను రాబట్టి మా పిల్లల ముందు కుప్పపొయ్యనూ ..!
ఇప్పటికీ…
కొందరు మూర? శిఖామణులు
‘‘మేమేమన్నా..
ఆడోళ్ళమా చేతులకు గాజులేసుకున్నామా ‘‘
అంటూ అహంకరిస్తుంటారు..
ఆ తేడాలన్నీ నీ బుద్ధిలోనే తప్పా
పుట్టుకను బట్టీ కాదంటూ నిరూపించావమ్మ
అమ్మా సునీతా..!!
నువ్వు ఎందరి ప్రభుద్దుల బుద్ధుల్ని
శుద్ధి చేశావో నీకే తెలియదు..
మానవుని మించిన మహనీయుడు
లేడని నిరూపించిన
నీకు శిరస్సు వంచి నమస్కరించాలని ఉంది