నిలువెల్లా గాయం లా ఆమె
ఏమైనా కాలం మారుతుందన్న ఆశ
యుగాలుగా నడిపిస్తుంది
నవనీతం లాంటి సమయం
మలాము పూతతో స్వాంతన
దొరుకుతుందని ఎదురుచూస్తుంది
జారిపోతున్న మాటనుకూడ తీసుకొని ఎలుగెత్తాలన్న ప్రయత్నాన్ని తమకనువుగా మార్చుకొని ఓడిస్తున్న పరిస్థితులు
గాలిపటం వినువీధిలో ఎగురుతున్నా
దారం ఇతరుల చేతుల్లోనే
అవమానపు చూపులతో
అనుమానపు సంకెళ్ళతో కంటి
లోగిళ్లలో మనువాదపు ఆవరణ
నిర్బంధిస్తున్నా దయతలచి
ద్వితీయ పౌరసత్వం ఇచ్చినప్పటికీ
పోగొట్టుకున్న చోటే
సాధించుకొని ఆవరిస్తుంది
స్త్రీలు రాసుకోవటానికి ఏముంటుంది
వాళ్ళ శరీరాల గురించి తప్ప
అనే పుల్లవిరుపులు
కానీ సమయం అంతా
ఆమెతోనే ముడిపడి ఉందని
అసలు సమయమే ఆమె అయినప్పుడు
స్త్రీని మించిన ప్రకృతి ఏముంది
అంతా ఆమె చేతుల్లోనే కదా ఎదిగింది
ఆమెకు ప్రత్యమ్నాయం అన్నదే లేదు కదా!