గిరిజనులపై దోపిడిని చిత్రించిన కథలు – సారిపల్లి నాగరాజు

నాగరిక సమాజం ఏర్పడిన నాటి నుండి ఆదివాసుల భూములను నాగరికులు దోచుకుంటూనే ఉన్నారు. ఆదివాసిలు ఈ దోపిడిని ప్రతిఘటిస్తూనే వస్తున్నారు. గిరిజనాభివృద్ధి పథకాల పేరుతో జరుగుతున్న కార్యక్రమాల వల్ల గిరిజనుల కంటే ప్రభుత్వ అధికారులు, ఫారెస్ట్‌ ఆఫీసర్లు, పల్లం ప్రజలే ఎక్కువగా లాభం పొందుతున్నారు.

ఇవే కాక గిరిజన కార్పోరేషన్ల విధులు కూడా అంతంత మాత్రమే. గిరిజనేతరుల చేతిలో తరాలుగా మోసపోతూ దోపిడికి, అరాచకాలకు బలైపోతున్నవారు గిరిజనులే. ఈ నేపథ్యంలో గిరిజనులు భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాటాలు, ఉద్యమాలు చేపట్టారు. ఆ పోరాటాలకు, ఉద్యమాలకు ప్రధాన భూమిక పోషించినది శ్రీకాకుళ గిరిజన రైతాంగ సాయుధ పోరాటమే. ఆ ఉద్యమ ఫలితంగా గిరిజనుల జీవితాన్ని, ఆశయాలను, ఆకాంక్షలను, ఆరాటాలను, సంస్కృతి సాంప్రదాయాలను, నమ్మకాలను, విశ్వాసాలను ప్రతిబింబించే సాహిత్యం నేడు తెలుగులో వెలువడుతూనే ఉంది.
తెలుగు సాహిత్యంలో ఉత్తరాంధ్ర సాహిత్యానికి ఒక విశిష్ట స్థానం ఉంది. ఆ ప్రాంతం నుండి వెలువడిన గిరిజన కథలలో ముఖ్యంగా దోపిడి, మోసంకి సంబంధించి కథలను జాగ్రత్తగా పరిశీలించి వేరు పరిచి చూస్తే వాటిలో మళ్ళీ రెండు విధాలుగా కనిపిస్తాయి.
ఈ వ్యాసం ప్రధానోద్దేశ్యం ఉత్తరాంధ్ర నుండి వెలువడిన గిరిజన కథల్లో గిరిజనేతరుల మాయ మాటల అరులకు చిక్కి మోసపోయిన, దోపిడికి గురైన ఆదివాసులు దీనస్థితిని పోరాటాన్ని చిత్రిస్తూ వెలువడిన కథలను పరిచయం చేయడం. అందులో భాగంగా గిరిజనేతరులు గిరిజనుల్ని దోపిడి, మోసం చేసిన కథలను మాత్రమే ఈ వ్యాసంలో చెప్పే ప్రయత్నం చేస్తాను.
గిరిజనుల్ని, గిరిజనేతరులు దోపిడి, మోసం చిత్రించే కథలు
ఆదివాసుల అమాయకత్వం, అజ్ఞానం, నిరక్షరాస్యత వల్ల నాటి నుంచి నేటి వరకు మైదాన ప్రాంత ప్రజల చేతిలో మోసపోతున్నారు. 1970 దశకంలో నిరక్షరాస్యత, అమాయకత్వం వల్ల దోపిడికి గురైన గిరిజనులు, 2020 దశకంలో విద్యావంతులు అయినప్పటికీ దోపిడికి గురవుతున్నారు. 1970 నుంచి 2020 వరకు గిరిజనులపై ఏదో ఒక రూపంలో దోపిడి జరుగుతూనే ఉంది. ఈ అర్ధశతాబ్ది కాలంలో దోపిడిలో రూపం మారింది కానీ గిరిజనులపై దోపిడి మాత్రం మారలేదు. ఆ దోపిడిని చిత్రిస్తూ ఉత్తరాంధ్ర కథకులు కొన్ని కథలు రాశారు. ఆ కథలను పరిచయం చేస్తాను.
అడివంటుకుంది: ఈ కథ ‘అడివంటుకుంది’ కథల సంపుటిలోనిది. ఈ సంపుటిని శ్రీకాకుళం ప్రచురణలు 1973వ సంవత్సరం ప్రచురింది. ఆ తర్వాత ఈ కథ ‘కొండగాలి కొన్ని కథలు’ సంపుటిలో భూషణం చేర్చారు. అమాయకులైన సవరల గూడకి వ్యాపారం కోసం వచ్చి, సవరులను మోసంచేసి, వారి శ్రమను దోచుకుంటున్న షావుకారి సత్తియ్యపై సవరులు తిరుగుబాటు చెయ్యడమే భూషణం ‘అడివంటుకుంది’. వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయి, కుటుంబ సభ్యులైన కూతురు, భార్య చేసిన అవమానకర పరిస్థితులు భరించలేక, పల్లం ప్రాంతంలో బతకలేక చనిపోదామని నిర్ణయించుకొని బయలుదేరిన షావుకారి సత్తియ్యకి అడవంతా పచ్చగా పరిపూర్ణంగా కనిపిచింది. చనిపోదామని వచ్చిన సత్తియ్యకు రెండు వరసల్లో ఉన్న పది ఇళ్ళ సవరగూడ కనిపించింది. ఆ గూడకి వచ్చేసరికి వీరాసామి గూడ నుంచి మేక పిల్లను తీసుపోతుంటాడు.
మైదాన ప్రాంతంలో బతకలేక, చేసిన అప్పులు తీర్చలేక పోలీసు జవానులాగా కాకీ బట్టలు ధరించి అమాయకులైన, నిరక్షరాస్యులైన సవరులను బెదిరిస్తూ, భయపెడుతూ, కొడుతూ వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులను దోచుకుంటున్న నకిలీ పోలీసు వీరాసామి. సవరగూడలో ఒకామె గొట్టాలమ్మ దేవతకు మొక్కుకున్న మేకపిల్లని వీరాసామి తీసుకుపోతుంటాడు. ఆమె ఎంత బతిమిలాడిన కనికరము చూపకపోగా, తిరిగి విసిగిస్తుందని ఆమె గుండెల మీద తంతాడు. ఆ దెబ్బకి ఆమె తలకి గాయం అయ్యి రక్తం చిమ్ముతుంది. ఇంత జరుగుతున్నా ఒక్క మగవాడు ముందుకురారు. వీరాసామి చేసిన అన్యాయాన్ని కళ్లారా చూస్తాడు సత్తియ్య. వీరాసామి సత్తియ్య దగ్గర ఖాతాను చెల్లించని వాళ్ళలో ఒకడు. సత్తియ్య వీరాసామి నకిలీ పోలీసని నిజం చెప్పాలని అనుకొని చెప్పకుండా వీరాసామి వెంబడిరచి వెళ్తాడు. అప్పుడు వీరాసామి, సత్తియ్యకి పల్లంలో జీవించలేని వాళ్ళు సవర గూడెంలో బతకవచ్చు అనే జీవిత సత్యాన్ని చెప్పి వెళ్ళిపోతాడు.
సత్తియ్య సవరగూడ నాయకుడు అయిన సారికి సిద్ధంని అడిగి అంగడి పెట్టుకొని జీవిస్తానంటాడు. నెమ్మదిగా వారి కష్టార్జితాన్ని అప్పుల పేరుతో దోపిడి చేస్తాడు. ‘‘తల మీద గంపతో ఉప్పూ పొగాకూ బెల్లం మోసి అమ్ముకు తిరిగిన సత్తియ్య షావుకారి ఇంతవాడు అంతవాడై అంతవాడు ఆకాశాన్నంటినంతవాడై అడివంతా తానే అయిపోయేడు’’ (భూషణం, కొండగాలి కొన్ని కథలు, పుట: 43). అడవి సరుకంతా పట్నంలో అమ్మి ఆస్తిని గడిరచేసరికి కరణంతో వెళ్ళిపోయిన భార్య, మునసపు కొడుకుతో లేచిపోయిన కూతురు తిరిగి వచ్చేస్తారు.
అడివిలో పండిన పంటని మైదాన ప్రాంతానికి తీసుకుపోతున్న బండ్లను సారికి సిద్ధం కొడుకు మంగడు అడ్డుకుంటాడు. ఎక్కడ పండిన పంట ఆ ఊర్లోనే అమ్మాలని ఎదిరించి, నిలదీస్తాడు. దాంతో సత్తియ్య గూండాలని పెట్టి కొట్టించాలనుకుని, సారికి సిద్దం సవరుల చైతన్యం తేవడానికి ఏర్పాటు చేసిన మీటింగుకు వస్తున్న ఆదివాసిలపై దాడి చేయిస్తాడు. సత్తియ్య ఏర్పాటు చేసిన గూండాలు ఆదివాసి స్త్రీని వివస్త్రని చేసి నానాబీభత్సం చేస్తారు. మంగడు గుండాలని ఎదురిస్తాడు. గుండాలకి, మంగడికి జరిగిన పెనుగులాటలో మంగడు దారుణంగా చనిపోతాడు. మంగడి చావుతో సవర గూడెం అంతా చైతన్య జ్వలలు రగిలి అడివి అడివంతా షావుకారి మీద తిరుగుబాటుకు బయలుదేరుతారు.
అన్నలొస్తున్నారు: ఈ కథ రాడికల్‌ మార్చ్‌ మాసపత్రికలో డిసెంబర్‌ – జనవరి, 1989 – 90వ సంవత్సరం ప్రచురితమైంది. శ్రీకాకుళ గిరిజన ప్రాంతాల్లో నివసించే ఆదివాసిలపై మైదాన గ్రామాల నుంచి వచ్చిన వ్యాపారులు దోపిడిలు, దౌర్జన్యాలు చేసారు. అటువంటి సమయంలో అన్నలు (గిరిజన ప్రాంతాలలో నివసించుచు వారి శ్రేయస్సు కొఱకు పనిచేయు విప్లవకారులు, నక్సలైట్లు) రాకతో వ్యాపారులు కొండని ఖాళీ చేసి వెళ్లారు. అలాంటి అన్నల రాకకోసం చూసే గిరిజనుల ఎదురుచూపులను సువర్ణముఖి ‘అన్నలొస్తున్నారు’ కథలో కనిపిస్తాయి. ఆదయ్య కుటుంబం పోడు (కొండమీద అడవికొట్టి కాల్చుట) చేసుకుంటూ జీవిస్తారు. ఆదయ్య తన కుటుంబ అవసరాల నిమిత్తం షావుకారి చంద్రయ్య దగ్గర అప్పు తీసుకుంటాడు. చంద్రయ్య అప్పు తీర్చాలని ఆదయ్య కుటుంబమంతా కష్టపడి చింతపండు ఏరుతారు. చింతపండు అమ్మి యాభై రూపాయిలు సంపాదిస్తారు. రాత్రివేళ పడుకున్న ఆదయ్య కొడుకు సత్తెం మీద ఎలుగుబంటి దాడి చేస్తుంది. సత్తెంని కాపాడే క్రమంలో ఎలుగుబంటిని ఆదయ్య కొడతాడు. గాయపడిన సత్తెంని కురుపాం ఆసుపత్రిలో డాక్టర్‌కి చూపించి చికిత్స చేపిస్తారు. చంద్రయ్య అప్పు తీర్చడానికి దాచిన డబ్బులు వైద్యం కోసం ఆదయ్య ఖర్చు పెట్టేస్తాడు. అప్పు తీర్చలేదనే కోపంతో చంద్రయ్య ఆదయ్య ఇంటిలో ఉన్న కందులు, కోడి పట్టుకెళ్తాడు. అప్పుడు గూడెం పెద్ద సొయందొర అడ్డం వచ్చి ఆదయ్య బాధల్లో ఉన్నాడని నాలుగురోజులు గడువు ఇవ్వమని అంటాడు. దానికి చంద్రయ్య ఒప్పుకోడు అప్పుడు సొయందొర ఆదయ్య అప్పుకి భరోసా నేనుంటానని అంటాడు. చంద్రయ్య వాటిని వదిలిపెట్టి గూడెం నుంచి వెళ్ళిపోతాడు.
ఎలుగుబంటికి గాయాలయ్యాయని ఫారెస్ట్‌ అధికారులు గూడెంవాసుల్ని ప్రశ్నిస్తారు. సొయందొర గతరాత్రి జరిగిన ఘటనలో ఆదయ్య కొడుకుని కాపాడే క్రమంలోనే కొట్టాము కానీ కావాలని కొట్టలేదని చెపుతాడు. సొయందొర ఇకముందు ఇలాంటివి జరగవని ఫారెస్ట్‌ వాళ్ళకి చెప్పి షావుకారి చేతిలో కాపాడిన ఆదయ్య కోడి ఫారెస్ట్‌ వాళ్ళకి లంచంగా ఇస్తాడు. గతంలో అన్నలు వచ్చేటప్పుడు ఇలాంటి దాడులు ఉండేవి కావని ఆదయ్య తన కూతురికి చెపుతాడు. అన్నల నుంచి పొందిన స్ఫూర్తితోనే ఆదయ్య కూతురికి నిర్మల అని కొడుక్కి సత్తెం అని పేర్లు పెట్టుకుంటాడు. మరుసటిరోజు పొద్దున్నే పత్రికలో ఉద్దానంలో అన్నల చేతిలో భూస్వామి మరణం అనే వార్త చూసి అన్నలొస్తున్నారని గూడెంవాసులంతా ఎదురుచూస్తారు.
ఉద్ధరింపు: ఈ కథ ప్రజాసాహితిలో డిసెంబర్‌ మాసం, 1991వ సంవత్సరం ప్రచురితమైంది. గిరిజనుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన గిరిజన కార్పోరేషన్‌ సంస్థలే వారిని దోచుకుంటున్నాయనే వాస్తవ నిజాన్ని భూషణం ‘ఉద్ధరింపు’ కథలో ప్రకటించారు. కొండకోనల్లో నివసించే గిరిజనులు అటవీ ఉత్పత్తులపై ఆధారపడి తమ జీవనం సాగిస్తున్నారు. వారిని దళారి వ్యాపారస్తుల నుంచి కాపాడే లక్ష్యంగా ఏర్పాటైన రాజ్యాంగబద్ద సంస్థ గిరిజన సహకార సంస్థ (Gఱతీఱjaఅ జశీ-శీజూవతీa్‌ఱఙవ జశీతీజూశీతీa్‌ఱశీఅ). ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గిరిజన సహకార సంస్థను 1956వ సంవత్సరంలో ఏర్పాటుచేసింది. ఈ సంస్థ గిరిజనులు స్థానిక వ్యాపారుల దోపిడికి గురి కాకుండా వారి అటవీ ఉత్పత్తులకు తగుధరలను నిర్ణయించి, వాటిని సేకరిస్తుంది.
నిమ్మక సంగమ్మ ఆదివాసి మహిళ. ఇప్పపప్పు చాలా ఎక్కువ మొత్తం కూడబెట్టి ఒక్కసారి అమ్మి, వచ్చిన డబ్బులతో మంచి చీర కొనుక్కోవాలని ఆశ పడుతుంది. ఇంతలోపు సంగమ్మ తల్లి చెంచమ్మకి జ్వరం వచ్చి బాగాలేకపోతే సూదిమందు కొనడానికి డబ్బులు లేక ఇప్పపప్పు షావుకారికి అమ్మాలని నిర్ణయించుకుంటుంది. షావుకారి ఇప్పపప్పు చూసి ఆరు కేజీలుందని కేజీకి ఎనభై పైసలు (0.80/-) చొప్పున పది రూపాయలా ఎనభై పైసలు (10.80/-) ఇవ్వబోతాడు. ఇంతలోపు కార్పోరేషన్‌ ఉద్యోగి అక్కడికి వచ్చి షావుకారి కొన్న సరుకును అడ్డుకొని, అడవి పంటల్ని కొనుగోలు చెయ్యడానికి గిరిజన కార్పోరేషన్‌ ఉందని చెప్పి, సంగమ్మని తీసుకువెళ్తాడు. ఇప్పపప్పు తుయ్యగా మూడు కేజీలు వస్తుంది. కేజీకి రూపాయి ఇరవై పైసల (1.20/-) లెక్కన మూడు కేజీలకి మూడు రూపాయల అరవై పైసలు (3.60/-) సంగమ్మ చేతిలో పెడతారు. ఆరు కేజీల పప్పు మూడు కేజీలు ఉండమేంటని సంగమ్మ తీవ్రంగా వ్యతిరేకించి, తన పప్పు తనకి ఇచ్చేయమని అడుగుతుంది. అధికారులు కోపంతో సంగమ్మను బయటకు గెంటేస్తారు.
షావుకార్లే నమ్మించి అమాయకపు గిరిజనలను మోసం చేస్తుంటే, అంతకంటే ఎక్కువ దోపిడి గిరిజన కార్పోరేషన్‌ చేసింది. మూడు రూపాయలు తెచ్చి డాక్టర్‌ చేతిలో పెట్టగా డాక్టర్‌ కూడా మోసం చేసి చెంచమ్మకి డిస్టిల్‌ వాటర్‌ శరీరానికి ఎక్కించి వెళ్ళిపోతాడు. చివరికి కార్పోరేషన్‌ వాళ్ళ చేతిలో సంగమ్మ మోసపోతే, డాక్టర్‌ చేతిలో చెంచమ్మ మోసపోతుంది.
ఊరి మీద కధ: ఈ కథ విశాలాంధ్రలో జూన్‌ మాసం, 1999వ సంవత్సరం ప్రచురితమైంది. గిరిజనేతరుల దోపిడికి బలైపోయిన గిరిజనులు పేదరికంలోనే మగ్గిపోతున్న వాస్తవ సంఘటనని భూషణం ‘ఊరు మీద కధ’ చూపిస్తుంది.
ఉత్తరాంధ్ర కొండకోనల్లో నివసించే గిరిజన తెగల్లో ప్రధానమైనవి సవర, జాతాబు, గదబ. కొండల మీద ఉన్న సంపద అంతా పల్లపు ప్రజల సొత్తు అయ్యి, వాళ్ళు ధనవంతులవుతున్నారు. కానీ ఆదివాసిలు ఇంకా పేదరికంలోనే ఉండిపోతున్నారు. గిరిజనాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన గిరిజన కార్పోరేషన్‌ పేరుకే ఉంది. కానీ గిరిజనులకు విత్తనాల పంపిణీలో మాత్రం వాటి పాత్ర శూన్యం. గిరిజనులు పండిరచిన పంటని అమ్మడానికి మైదాన ప్రాంతంలో ఉన్న సంతకి తీసుకువస్తే పల్లపు ప్రజలు వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని మోసం చేసి సరుకునంతా దోపిడి చేస్తారు. గిరిజనులు డబ్బు అవసరమై వ్యాపారి వద్ద బంగారాన్ని తాకట్టు పెట్టినప్పుడు వ్యాపారి బంగారం పొడవు దారంతో కొలచి, ఆ దారాన్ని గిరిజనుడికి ఇస్తాడు. బంగారాన్ని విడిపించుకునేటప్పుడు ఆ దారాన్ని తెమ్మని చెపుతాడు. బంగారాన్ని కరిగించి కొంత బంగారం వ్యాపారి కాజేసి, అదే పొడవులో కనిపించేటట్లు చేసి గిరిజనులను నమ్మించి మోసం చేస్తారు. గిరిజనుడు కొండమీద నుంచి పల్లపు ప్రాంతంలో ధనవంతుడు చేస్తున్న వివాహ కార్యక్రమానికి కట్టెలు కొట్టడానికి వస్తాడు. కట్టెలు కొడుతున్న గిరిజనుడి కాలుకి గొడ్డలి తగులుతుంది. గొడ్డలి తగిలి రక్తం కారుతున్న గిరిజనుడు ధర్మాసుపత్రికి వెళ్తే గాయానికి కట్టు కట్టడానికి దూది కూడా ఉండదు. ఆసుపత్రికి వచ్చే మందులు అంతా ధనవంతుల ఇంట్లో వస్తువుల రూపంలోకి మారిపోతుంటాయి. దెబ్బతగిలిన గిరిజనుడికి సరైన వైద్యం అందక ధనుర్వాతం (వాతరోగం) వచ్చి చనిపోతాడు.
ఆదివాసి స్త్రీ కొండమీద పండిన పండ్లను అమ్ముకోవడానికి వస్తే ఆకతాయిలైన గిరిజనేతరులు ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తారు. కష్టపడి గిరిజనులు పనిచేస్తే, వారికి రావాల్సిన ఫలాలను గిరిజనేతరులు నమ్మించి మోసం చేసి లాక్కుంటూన్నారు.
ఎలక రాకలు: ఈ కథ ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో జనవరి, 1979వ సంవత్సరం ప్రచురించబడిరది. గిరిజనేతరులైన బుగతలు (ఎక్కువ పొలమున్న రైతు) గిరిజనుల కష్టాన్ని దోచేయడమే కాకుండా వారిని శిక్షించి అదుపాజ్ఞల్లో ఉంచుకొన్న సంగతిని వంగపండు ప్రసాదరావు ‘ఎలక రాకలు’ కథలో వస్తువు.
‘గదబవలస’కి చెందిన గదబలు బుగతల పొలాల్లో పనిచేస్తూ జీవిస్తుంటారు. వాళ్ళ పొలాల గట్లు తవ్వుకొని ఎలకలు దాచిపెట్టిన ధాన్యం గింజలు ఏరుకొని జీవనం గడుపుతారు. అలా పొలాల గట్లు తవ్వినందుకు గాను వాళ్ళు ఉడుపుల (నాట్లు) సమయంలో వెట్టికి పనిచేసి కొత్తగట్టులు వేస్తుంటారు. ఎప్పటిలాగే గట్టు తవ్వుతున్న గదబ సిన్నోడు దగ్గరకు రామ్మూర్తి బుగత కొడుకు రాంబాబు వచ్చి గట్టులు తవ్వొద్దు అంటాడు. తవ్వితే పోలీసు స్టేషన్‌లో పెట్టిస్తా అంటాడు. ఇక మీదట మీ అవసరం లేదు ట్రాక్టర్‌ కొన్నామని చెబుతాడు రాంబాబు బుగత. రాంబాబును సిన్నోడు ఎదురిస్తాడు. రామ్మూర్తి బుగత దుర్మార్గమైన మనిషి. తన కొబ్బరి తోటలో వెళ్తున్న పిల్లాడికి చెట్టుపై నుంచి పడిన కాయని తింటాడు. ఫలితంగా రామ్మూర్తి బుగత పిల్లాడి చేతివేళ్ళు కాల్చేస్తాడు.
గదబ సిన్నోడు రాంబాబు బుగతని ఎదురించాడనే విషయం రామ్మూర్తి బుగతకు తెలిసి గదబ సిన్నోడిని పంచాయితీకి పిలిపిస్తాడు. పంచాయితీకి సిన్నోడు భార్య కంజిరమ్మ వస్తుంది. కంజిరమ్మ పంచాయితీకి రావడం అవమానంగా భావిస్తారు పంచాయితీ పెద్దలు. ఈవిడని చూసి ఇక మీదట పంచాయితీకి మగవాళ్ళు మానేసి ఆడవాళ్లు వస్తారని, కంజిరమ్మ పంచాయితీకి వచ్చినందుకు శిక్ష విధించాలని రామ్మూర్తి అనుకుంటాడు. ఇంతలోపు మరో పెద్ద మనిషి కంజిరమ్మ బట్టలు ఊడదీయాలి అని అంటాడు. ఆ మాటతో కంజిరమ్మకి, పంచాయితీ పెద్దలకి మధ్య రగడ జరిగి చివరికి కంజిరమ్మని వివస్త్రని చేస్తారు. దాంతో రామ్మూర్తి మనసు కుదుటపడుతుంది. గదబ సిన్నోడు మీద రామ్మూర్తి కోపంతో రగిలిపోతాడు. మరుసటిరోజు సిన్నోడు ఇంటికి వెళ్ళి నా మాట అడగకుండా గట్టుతవ్వుతావా, పంచాయితీకి రమ్మంటే నీ పెళ్ళాన్ని పంపిస్తావా నా పరువు తీసావు కదా అని కోపంతో సిన్నోడు గుండె మీద తుపాకీ పెడతాడు. ఆ తుపాకీని సిన్నోడు లాక్కుంటాడు. రామ్మూర్తి మరింత కోపంతో సిన్నోడు గుండెలోకి తూటా దింపుతాడు. సిన్నోడు నేలకొరిగిపోతాడు. గదబవలస ప్రజలంతా చూస్తుంటారు. సిన్నోడు కుక్కలు తన యజమానిని చంపిన వాడిని చంపాలని చూస్తుంటాయి. కుక్కలు ఉన్న పౌరుషం గదబవలస ప్రజలకు లేదు.
ఒక పొట్టివాడూ – కొందరు పొడవువాళ్ల కథ: ఈ కథ ప్రజాసాహితి మాసపత్రికలో డిసెంబర్‌, 2004వ సంవత్సరం ప్రచురించబడిరది. శ్రీకాకుళం గిరిజనోద్యమం ముగిసిన తర్వాత కోస్తా జిల్లాల నుంచి అగ్రవర్ణాలవారు వచ్చి స్థానిక భూస్వాములుగా రూపమెత్తుతారు. గిరిజనుల శ్రమను, భూముల్ని దోపిడి చేసుకుంటారు. అన్నల సహాయంతో గిరిజనులు పెత్తందార్ల మీద ప్రకటించే తిరుగుబాటును అట్టాడ అప్పల్నాయుడు ‘ఒక పొట్టివాడూ – కొందరు పొడవువాళ్ల కథ’ వెల్లడిస్తుంది.
‘కాసొలస’లో గిరిజనులు ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా పేదరికంలో జీవనం సాగిస్తుంటారు. శ్రీకాకుళ గిరిజనోద్యమం ముగిసిన తర్వాత కోస్తా జిల్లాల నుంచి కమ్మ, చౌదరి కులస్తులు ‘కాసొలస’ వచ్చి చుట్టుపక్కల భూములను కొని, భూస్వాములుగా మారుతారు. ‘కాసొలస’ గిరిజనులను పశువుల కాపరులగాను, కంబారి (పొలములలోను, ఇంటిలోను పనిచేయువాడు)లగాను నియమించుకుంటారు. ట్టిపా (పొట్టివాడు) అనే గిరిజనుడు కమ్మదొరల ఇంట్లో పశువుల కాపరిగా పనిచేస్తుంటాడు. ట్టిపాకి అన్నలతో పరిచయం ఉంటుంది. కమ్మదొర భార్య రుక్మిణమ్మ పశులకాపరులకు, కంబారులకు పాచిపట్టిన అన్నం పెడుతుంది. అందుకు ట్టిపా కమ్మదొర ఇంటిమీద తిరుగుబాటు ప్రకటిస్తాడు. పనులకు రాకుండా నిరసన చేస్తారు. మంచి అన్నం పెట్టాలని, ప్రతి సంవత్సరం జీతం పెంచాలని, ప్రతి ఏడాది రెండు జతల కొత్త బట్టలు ఇవ్వాలని ఒప్పందం మీద మళ్ళీ పనులకు వాళ్ళంతా వస్తారు.
జన్నిపొలం విషయంలో అగ్రకులాల వాళ్ళకు, గిరిజనులకు మధ్య గొడవ జరుగుతుంది. ఆ తగాదాలో ఒక గిరిజనుడు చనిపోతాడు. ఆ కేసు నిమిత్తం అటు కమ్మదొరలు, ఇటు గిరిజనులు కోర్టుకు వాయిదాలకు తిరుగుతారు. కాసొలస సంఘ నాయకుడు ఆదెయ్య నాయకత్వంలో గిరిజనులు ఉద్యమం చేస్తారు. గిరిజనులకు చంద్రన్న దిశానిర్దేశం చేస్తుంటాడు. కమ్మదొర భార్య రుక్మిణమ్మ చంద్రన్నను ఎలాగైనా లొంగదీసుకోవాలని వ్యూహాలు వేస్తుంది. ట్టిపాని చంద్రన్న గురించి ఎన్నోసార్లు ఆచూకీలు అడుగుతుంది. రుక్మిణమ్మ ఎన్నిసార్లు చంద్రన్న గురించిన వివరాలు అడిగినా ట్టిపా చెప్పడు. పైపెచ్చు చంద్రన్న గురించి ఎందుకు రుక్మిణమ్మ శోధిస్తుందని ఆలోచిస్తాడు.
ఆదెయ్య నాయకత్వంలో గిరిజనులంతా కూలీరెట్లు పెంచాలని ఐ.టి.డి.ఏ పి.ఓ ఆఫీసు ఎదుట ధర్నా చేస్తారు. ఆదివాసిలు చేసే ఉద్యమాలు, ధర్నాలు ఆపేయడానికి అగ్రకులాల వాళ్ళు ఆఫీసర్లతో చేతులు కలుపుతారు. రోజురోజుకు పెరిగిపోతున్న పోటీ ప్రపంచంలో ఇంకా డబ్బులు సంపాదించాలని కమ్మదొర భార్య రుక్మిణమ్మ కంపెనీ ఒకటి పెట్టాలని ఆలోచిస్తుంది. కంపెనీ మీద బాగా లాభాలు సంపాదించి, ప్రమాదం ఏదైనా వస్తే కొంగ నీటిలో చేపను లాక్కెళ్ళి పోయినట్లు వెళ్ళిపోవాలని పథకం వేస్తుంది. గిరిజనులు మాత్రం తమ జీవనం సాగించడానికి పెత్తందార్ల మీద నిరంతరం ఉద్యమాలు, ధర్నాలు చేస్తూనే ఉంటారు.
కొండపందికొక్కు: ఈ కథ అరుణతార మాసపత్రిక గిరిజన ప్రత్యేక సంచికలో ఏప్రిల్‌-మే, 1989వ సంవత్సరం ప్రచురించబడిరది. నిరక్షరాస్యులైన గిరిజనుల్ని షావుకార్లు దోపిడి చేసి అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్న తరుణంలో రైతుకుాలీ సంఘ సభ్యుల అండతో గిరిజనుడు తిరిగి తన కష్టార్జితాన్ని దక్కించుకున్న వృత్తాంతాన్ని వంగపండు ప్రసాదరావు ‘కొండపందికొక్కు’ కథలో చూడవచ్చు.
గిరిజన తెగకు చెందిన అన్నిగాడు తన భార్యపిల్లలతో పోడు వ్యవసాయం చేసుకొని జీవనం సాగిస్తాడు. అన్నిగాడు ఇంట్లో ఉన్న వంద కేజీల చింతపండు కోటేశంకి అమ్మి వంద రూపాయిలు (100/-) తెచ్చుకొని తన కావలసిన నిత్యావసర సరుకులు కొనాలనుకుంటాడు. అన్నిగాడు, తన తమ్ముడు ఇద్దరూ కలసి కోటేశం ఇంటికి చింతపండు తీసుకువెళ్తారు. గిరిజనుల అమాయకత్వం, నిరక్షరాస్యతను అడ్డం పెట్టుకొని వంద కేజీల చింతపండుని తన కాటా ద్వారా మోసం చేసి యాభై కేజీలు చేసి అన్నిగాడిని అప్పుల పాలు చేసి చివరికి మోసం చేసి కోడెదూడల్ని కూడా అప్పు కింద జమ కట్టేస్తాడు. అప్పటికీ అప్పు తీరదు. అన్నిగాడు షావుకారి బుద్ధిని గ్రహిస్తాడు. ఆఖరికి అన్నిగాడు రైతుకులీ సంఘాన్ని ఆశ్రయిస్తాడు. సంఘ సభ్యులు షావుకారి దోచుకున్న డబ్బును అన్నిగాడికి ఇప్పిస్తారు.
ఖండగుత్త: ఈ కథ 1988వ సంవత్సరం రాయబడిరది. కొండల్లోకి, అడవుల్లోకి వ్యాపారం పేరుతో ప్రవేశించిన గిరిజనేతరులు ఆదివాసి కష్టాన్ని, పంటని దోపిడి చేస్తూ గిరిజనులను కష్టాల కొలిమిలోకి నెట్టేసిన తీరును, సంఘనాయకుల సహాయంతో షావుకార్ల దౌర్జన్యాన్ని ఎదురించి పోరాడిన ఉదంతాన్ని అట్టాడ అప్పల్నాయుడు ‘ఖండగుత్త’ కథలో తెలియజేస్తాడు.
‘బట్టొలస’లో ఉయ్యికి భీముడు జీవనం సాగిస్తుంటాడు. మేత మేస్తున్న భీముడు ఎద్దుపై పులి దాడి చేసి చంపేస్తుంది. ఒంటెద్దుతో వ్యవసాయం చెయ్యలేక పంటను అమ్మి ఎద్దును కొందామని అనుకుంటాడు. ఇంతలోనే భీముడికి తిరుపతయ్య షావుకారి దగ్గర చేసిన అప్పు గుర్తు వస్తుంది. షావుకారికి వచ్చే ఏడాది అప్పు చెల్లిస్తానని చెప్పి ఎద్దును కొనుక్కుంటాను అని నిర్ణయించుకొని షావుకారి దగ్గరకు వెళ్ళి విషయం చెబుతాడు. షావుకారికి భీముడు గతంలో సంఘనాయకులతో చేసిన ఉద్యమాన్ని గుర్తు పెట్టుకొని అప్పు ఇప్పుడే తీర్చాలి లేకపోతే ఇంట్లో ఏవి ఉంటే అవి తీసుకుపోతానని చెబుతాడు. మరుసటిరోజు ఉదయాన్నే తిరుపతయ్య షావుకారి భీముడు ఇంటికి వచ్చి బూతులు తిడుతూ ఇంట్లో ఉన్న సామాన్లు తీసుకెళ్ళాలని ఇంట్లోకి చొరబడతాడు. భీముడు భార్య షావుకారిని ఇంట్లో పెట్టి తలుపు వేసేస్తుంది. భీముడు సంఘనాయకులకు జరిగిన విషయాన్ని చెబుతాడు. సంఘనాయకుని సూచన మేరకు షావుకారిని అరెస్టు చేసి నాయకుని దగ్గరకు తీసుకువెళ్తారు. నాయకుడు ప్రశ్నించగా షావుకారి తన చిట్టా తీసి చెబుతాడు. దానికి సంఘనాయకుడు నువ్వే తిరిగి ఈ గిరిజనులకు ఋణపడి ఉన్నావు వాళ్ళ కష్టాన్ని, పంటని దోపిడి చేసుకున్నావు అని చెప్పి గిరిజనుల కోరిక మేరకు షావుకారిని రావిచెట్టుకు కట్టేసి శిక్షను విధిస్తాడు.
తల్లీకూతుళ్లు : ఈ కథ ఆహ్వానం పత్రికలో మార్చి, 1997వ సంవత్సరం ప్రచురించబడిరది. ఆదివాసిల భూమిని గిరిజనేతరులైన పెత్తందార్లు ఆక్రమించుకోవాలని చూస్తారు. ఈ ఆక్రమణలో అగ్రవర్ణాలవారికి దళితులు తోడ్పాటు లభిస్తుంది. పెత్తందార్ల మీద, మద్దతు తెలిపే దళితులపైన గిరిజనులు చేసే తిరుగుబాటును అట్టాడ అప్పల్నాయుడు ‘తల్లీకూతుళ్లు’ కథలో చూపించారు.
చినజమ్మడు మంచి బలశాలి. గవిరి తన కుటుంబ సభ్యులను ఎదురించి చినజమ్మడుని ప్రేమ వివాహం చేసుకుంటుంది. వీళ్ళకి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు పుడతారు. కొడుకు చనిపోతాడు. చినజమ్మడు మాలపల్లెకు పెద్దగా వ్యవహరిస్తాడు. పెద్ద కూతుర్ని దాసు పెళ్ళి చేసుకుంటాడు. వాళ్ళకి ఇద్దరు పిల్లలు. కొన్నాళ్ళకి దాసు భార్య చనిపోతుంది. చిన్న కూతురు సరస్వతి నాయుడు కులానికి చెందిన జగదీశ్‌ని ప్రేమ వివాహం చేసుకుంటుంది. వీళ్ళకి ఒక్క కొడుకు. జగదీశ్‌ కట్టెల బండి తోలుకు వస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు రైలు గుద్ది చనిపోతాడు. చినజమ్మడు చనిపోవడంతో గవిరి ఒంటరిగా ఉంటూ గిరిజన గ్రామాల్లో బొట్టు బిల్లలు, దువ్వెనలు, ఫ్యాన్సీ వస్తువులు మొదలైన అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటుంది. గవిరిని అల్లుడు దాసు చిన్నకూతురు సరస్వతిని తనకిచ్చి పెళ్ళి చెయ్యమని అడుగుతాడు. తన పిల్లలకి తోడుగా ఉంటుంది అని బతిమిలడుతాడు. కానీ గవిరి నిరాకరిస్తుంది.
దాసు, మధునాయుడు అనుచరుడిగా ఉంటాడు. మధునాయుడు చెప్పిన మాట ప్రకారం నడుచుకుంటాడు. ఈసారి గ్రామపంచాయితీ సర్పంచ్‌ సీటు దళిత మహిళకు రిజర్వ్‌ అయ్యింది. నువ్వు సరస్వతిని పెళ్ళి చేసుకొని ఆమె చేత నామినేషన్‌ వేయించని మధునాయుడు దాసుకి చెబుతాడు. మధునాయుడు తరతరాలుగా సాగుచేసుకుంటున్న ఆదివాసిల భూమిని ఆక్రమించుకుంటాడు. ఈ ఆక్రమణలో దాసు మధునాయుడుకి తోడ్పాటుగా నిలుస్తాడు. దాసు తన అత్త గవిరి దగ్గరకు వెళ్ళి సరస్వతిని తనకిచ్చి పెళ్ళి చెయ్యమని బెదిరిస్తాడు. కానీ గవిరి దాసు బెదిరింపులకు లొంగదు. ఈ క్రమంలో ఆదివాసిల అన్నల సహాయంతో మధునాయుడు, దాసులను ఎదురించి తమ భూములు తాము దక్కించుకుంటారు.
మందు: ఈ కథ ఈనాడు ఆదివారం అనుబంధ సంచికలో నవంబర్‌, 1993వ సంవత్సరం ప్రచురించబడిరది. గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని గిరిజనేతరులు మోసం చేసిన ఉదంతాన్ని వేదప్రభాస్‌ ‘మందు’ కథలోని ప్రకటించారు.
సవర కులానికి చెందిన సొన్నాయి తన కొడుక్కి బొరిగి (కర్రకి చివర తవ్వుకోడానికి ఇనప ముక్క ఉండే సాధనం) తగిలి గాయం అవుతుంది. ఆ గాయానికి రకరకాల పసరు మందులు వాడినప్పటికీ తగ్గకపోయేసరికి మెరుగైన వైద్యం కోసం షావుకారి ఇంటికి తీసుకుపోతాడు. షావుకారి పిలిచిన చాలాసేపటికి విసుక్కుంటూ వచ్చి ఇప్పడు కుదరదు రేపు తీసుకురా అంటాడు. సొన్నాయి షావుకారిని బతిమిలాడగా గాయాన్ని చూసి గాయం బాగా ముదిరిపోయింది. డబ్బులు బాగా ఖర్చు అవుతాయి అంటాడు. వైద్యం చేసినందుకు నాకు తెల్లమేకపోతు ఇవ్వాలంటాడు షావుకారి. ప్రతిరోజు ఇంజెక్షన్‌ వెయ్యాలంటాడు. ఇప్పుడు ఏమి తీసుకు వచ్చావు అంటే కోడి పుంజు ఉందంటాడు సొన్నాయి. డిస్టల్‌ వాటర్‌ ఎక్కించేసి, సగం వాడిన టూత్‌ పేస్టుని సంజీవని మందు అని చెప్పి ఇస్తాడు. రేపు సూది మందు వేయించుకోవడానికి వచ్చినప్పుడు తేనె తీసుకురమ్మంటాడు షావుకారి. కొన్నాళ్ళకి సొన్నాయి కొడుక్కి గాయం తగ్గిపోతుంది.
షావుకారి వైజాగ్‌ వెళ్ళడంతో కొడుకు ఆడుకోవడానికి బయటకు వస్తాడు. సొన్నాయి కొడుకు మిన్నడు, బుధడు అంతా ఆడుకుంటున్న దగ్గరకు షావుకారి కొడుకు లక్ష్మీరాజ్యం వస్తాడు. లక్ష్మీరాజ్యం షావుకారికి చాలా కాలానికి పుట్టాడు. వాడంటే షావుకారికి పంచప్రాణాలు. లక్ష్మీరాజ్యం ఆడుకొని ఇంటికి వెళ్తుండగా షరాబు శాలమందు తుప్పు పట్టిన మేకు కాలకి గుచ్చుకుంటుంది. అది చూసి వెంటనే సొన్నాయి కొడుకు మిన్నడు షావుకారి ఇచ్చిన టూత్‌ పేస్ట్‌ రాస్తాడు. అలా ఆ పేస్ట్‌ రెండురోజులు రాస్తారు. షావుకారి ఊరులో బస్‌ దిగగానే సొన్నాయి కనిపిస్తాడు. తెల్లమేకపోతు ఇవ్వకుండా ఎన్నాళ్ళు తప్పించుకు తిరుగుతావురా అని అడుగుతాడు. ఇంటికి వెళ్లేసరికి లక్ష్మీరాజ్యం పరిస్థితి చూసి పట్నం తీసుకువెళ్ళాలని సొన్నాయిని లక్ష్మీరాజ్యంని ఎత్తుకోమన్నాడు. అప్పుడు మిన్నడు తన స్నేహితుడు నీలకంఠంతో ‘‘నీలకంటా! షావుకారిచ్చిన మందుతోనే గదా, నాకు తగిల్న బొరిగి దెబ్బ మానిపోనాది. మరిది నేను లచ్మీగాడికిచ్చినాను కదా, ఆడు రోజూ తగ్గనేదేట్రా!’’ (జె.వి.బి. నాగేశ్వరరావు, వేదప్రభాస్‌ కథలు, పుట: 19) అన్న మాటలు విన్న షావుకారికి వెన్నులో బాకు గుచ్చినట్లుగా నిలబడిపోతాడు.
బుగతోడు-గూడబండి: ఈ కథ 1988వ సంవత్సరం ప్రచురించబడిరది. వ్యాపారం పేరుతో గిరిజనేతరులు గూడెంలోకి ప్రవేశించి, గిరిజన ప్రజల కష్టాన్ని, భూముల్ని ఎలా దోచుకున్నారో అట్టాడ అప్పల్నాయుడు ‘బుగతోడు – గూడబండి’ కథ తెలియజేస్తుంది.
సవర కుటుంబాలతో ప్రశాంతంగా ఉన్న ‘గెడ్డొలస’కి పెద్ద బూగన్న. గెడ్డొలసలో ఉన్న ఇళ్ళన్నీ బూగన్న అన్నా, అతని మాట అన్నా గౌరవం. మైదాన గ్రామాల్లో జరిగే సంతల్లో చిన్న దుకాణం పెట్టుకొని వ్యాపారం చేసుకొనే షావుకారి గురవయ్య. గురవయ్య, బూగన్నతో పరిచయం పెంచుకుంటాడు. ఫలితంగా ఇద్దరూ స్నేహితులవుతారు. గురవయ్య గెడ్డొలసలో వ్యాపారం చేస్తాను నాకు నీ సహాయం కావాలని నేస్తం అని బూగన్నని అడుగుతాడు. బూగన్న గెడ్డొలస ప్రజలందర్నీ పిలిచి షావుకారికి సహాయం చెయ్యాలని చెపుతాడు. ఆ మాటకి గూడెం వాసులంతా ఒప్పుకుంటారు. నిత్యావసర సరుకులతో ప్రారంభించిన వ్యాపారం గురవయ్య నెమ్మదిగా గూడెం ప్రజల అవసరాలని అవకాశాలుగా తీసుకొని అప్పులిచ్చేవాడు. ఆ అప్పులకు అధిక వడ్డీలు వేసి గురవయ్య గిరిజనుల పంటల్ని, భూముల్ని దోచుకునేవాడు. అలా గురవయ్య వడ్డీలకు గూడెం వాసులంతా బలైపోతారు. కట్రకోడు, ఉయ్యికోడు, చివరికి బూగన్న వడ్డీల్లో చిక్కుకొని వాళ్ళ ఆస్తిని గురవయ్యకి అప్పజెప్పిన వాళ్ళే. గూడెం సొమ్మును కాజేసిన గురవయ్య పెద్ద కాంట్రాక్టరుగా ఎదిపోతాడు.
బూగన్న పెద్దకొడుకు కందుల పంటని నాశనం చేస్తున్న పందుల్ని బాంబులు పెట్టి చంపాలని వెళ్తాడు. పందుల్ని చంపే క్రమంలో చేతిలోనే బాంబులు పేలి చనిపోతాడు. బూగన్న పరిస్థితిని అవకాశంగా మలచుకొని గురవయ్య దహన కార్యక్రమాలకు బూగన్నకు వంద రూపాయిలు అప్పు కింద ఇస్తాడు. కొడుకు పోయి ఏడుస్తున్న బూగన్న ఇంటికి ఇద్దరు పోలీసులు వస్తారు. కొడుకును చంపింది నువ్వే అని చెప్పి బూగన్నకు సంకెళ్ళు వేస్తారు. గూడెంపెద్దకి జరిగిన అన్యాయానికి గూడెం వాసులంతా విలపిస్తారు. అప్పుడు గురవయ్య వచ్చి పోలీసులను దూరంగా తీసుకువెళ్ళి మాట్లాడుతాడు. తిరిగి బూగన్న దగ్గరకు వచ్చి పోలీసులు వెయ్యి రూపాయిలు అడుగుతున్నారని చెబుతాడు. డబ్బు గురించి బెంగపడకు నేను ఇస్తాను నేస్తం అని ధైర్య వచనాలు చెబుతాడు.
బూగన్న చేసిన అప్పుకి ఎద్దులను, గూడబండిని షావుకారి వశపరచుకొంటాడు. బూగన్న చిన్నకొడుకుకి పెళ్ళి చేసినప్పుడు చేసిన అప్పుకి రెండెకరాల పల్లపు భూమిని గురవయ్య స్వాధీనం చేసుకుంటాడు. చివరికి బూగన్న అసహాయుడై ఉంటాడు. కందులు పంటని ఖండన కింద బాకీలు వసూలు చెయ్యాలని గురవయ్య పోడు భూముల దగ్గరకు వెళ్తాడు. గురవయ్యను గిరిజనులు వ్యతిరేకిస్తారు. డబ్బుకు డబ్బు మాత్రమే ఇస్తాము కానీ పంటని ఇవ్వమని ఎదురిస్తారు. దాంతో గురవయ్య గుండాలతో గిరిజనులపై దాడికి దిగుతాడు. గిరిజనులంతా ఒక్కటై గుండాల్ని చావకొడతారు. దాంతో గురవయ్య తన ఆగడాలు ఇక చెల్లవని భావించి గెడ్డొలస ఖాళీ చేసేసి పట్నంలోకి వెళ్ళిపోవాలని ఇల్లు ఖాళీ చేస్తాడు. అప్పుడే బూగన్న వస్తాడు. షావుకారి నిజస్వరూపాన్ని తెలుసుకొని బూగన్న తిరగబడతాడు. గురవయ్య వెంట వచ్చిన రౌడీలు బూగన్నను కొట్టిపడేస్తారు. బూగన్నపై నుంచి షావుకారి సంపద బళ్ళు వెళ్ళిపోతాయి. మరుసటిరోజు
ఉదయం షావుకారిపై నక్సలైట్ల దాడి, కొంతమంది అరెస్టు, ఒక నక్సలైట్‌ మృతి అని వార్త వస్తుంది.
బెడ్డ శిస్తు: ఈ కథ ‘ఖండన’ పేరుతో సృజన మాసపత్రికలో సెప్టెంబర్‌, 1992వ సంవత్సరం ప్రచురించబడిరది. గిరిజనుల భూమిని గిరిజనేతరులు ఆక్రమంచి, అదే భూమిని మళ్ళీ గిరిజనులకు పన్నులకిచ్చిన భూస్వామి మీద గిరిజనులు ప్రకటించిన తిరుగుబాటే సువర్ణముఖి ‘బెడ్డ శిస్తు’ కథలో చూపించారు.
గిరిజనుల భూమిని ఆక్రమించుకున్న శ్రీరామరాజు పోరాట సమయంలో అన్నల భయంతో భూమంతటనీ వదిలేసి పల్లానికి పారిపోతాడు. ఉద్యమం ముగిసిన తర్వాత మళ్ళీ శ్రీరామరాజు వచ్చి గిరిజన భూముల్ని ఆక్రమించుకుంటాడు. శ్రీరామరాజు తెలివిగా గిరిజనుల భూమిని తిరిగి వాళ్ళకే సంవత్సరానికి నాలుగు వందల (400/-) రూపాయలకి బెడ్డ శిస్తుకి ఇస్తాడు. మొఖలింగం కావిడితో చింతపండు పట్టుకొని పల్లానికి ఎవరి కంటా పడకుండా వెళ్తాడు. చింతపండు అమ్మిన డబ్బులతో కూతురికి లంగా కొనాలని ఆశపడతాడు. బస్సుకోసం మొఖలింగం చూస్తుంటాడు. ఇంతలోపు గిరిజన కార్పోరేషన్‌ ఆఫీసరు వచ్చి చింతపండు పట్టుకొని వెళ్ళిపోతాడు. ఏమీ చేయలేని స్థితిలో మొఖలింగం గూడెంకి వెళ్తాడు.
నిస్సహాయ స్థితిలో వెళ్తున్న మొఖలింగానికి ఒక దళసభ్యుడు ఎదురై గూడెంలో మీటింగ్‌ జరుగుతుందని చెప్తాడు. మొఖలింగం గూడెంలోకి వెళ్లేసరికి మీటింగ్‌ జరుగుతుంటుంది. మొఖలింగాన్ని చూసిన కూతురు మీటింగ్‌ నుంచి లేచి తండ్రి సంచి ఆశగా చూసింది. సంచిలో ఏమీ ఉండవు. మీటింగ్‌ ముమ్మరంగా జరుగుతుంది. దళనాయకుడు గూడెంవాసుల గుండెల్లో ధైర్యం నింపే మాటలు చెబుతున్నాడు. భూస్వామైన శ్రీరామరాజుని ఎదురించాలని, మనమంతా సంఘంగా ఏర్పడి నియమాలకు కట్టుబడి ఉండాలని పేర్కొంటాడు. మరుసటిరోజు ఉదయాన్నే భయంభయంగా శ్రీరామరాజు గూడెంకి వచ్చి శిస్తు కట్టమని గూడెం వాసుల్ని బెదిరిస్తాడు. మొఖలింగం మేము శిస్తు కట్టమని ఎదురించి చెప్తాడు. మొఖలింగంతో పాటు గూడెం వాళ్ళంతా శ్రీరామరాజుపై నిరసన ప్రకటిస్తారు. గుడెంకి వస్తే చంపేస్తామని గిరిజనులంతా బెదిరిస్తారు. ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకొని శ్రీరామరాజు గూడెంనుండి వెళ్ళిపోతాడు.
సికాకొలం: ఈ కథ 1992వ సంవత్సరంలో రాయబడిరది. శ్రీకాకుళం గిరిజనోద్యమం ముగిసిన తర్వాత ఆదివాసిలు అనుభవించిన ఆర్థిక సమస్యలనీ ఒకవైపు, మళ్ళీ పోరాటానికి సిద్ధం కావాలని గిరిజనుల్ని జాగృతం చేయు సంఘటనలను నమోదు చేసే సువర్ణముఖి ‘సికాకొలం’ కథ. సవరజాతికి చెందిన జిజారుకి ఆరుమంది పిల్లలు. అందులో ఒకే ఒక్కడు కొడుకు యెంకటి. జిజారు తన భార్య అచ్చెమ్మ కలసి పోడు చేసి ముగ్గురు ఆడపిల్లలకి పెళ్ళి చేస్తాడు. ఒక అమ్మాయిని పాలకొండ పక్క, మరొక్క అమ్మాయిని జియ్యమ్మ వలస పక్క ఇచ్చాడు. మూడో అమ్మాయిని మేనరికం ఇచ్చాడు. పాలకొండ ఇచ్చిన కూతురు భర్తను వదిలేసి చెల్లెలు భర్తైన మేనమామతో కాపురం చేస్తానని పుట్టింటికి వచ్చేస్తుంది. మేనమామకి కూడా ఇష్టమే. అయితే మంచం తప్పు కింద కులపోల్లందరికి భోజనం, కళ్ళు పెట్టాలి. దీనంతటికి ఐదువందలు (500/-) వరకు అవుతుంది. కానీ జిజారు దగ్గర డబ్బులేక కూతురిని ఇంటి దగ్గరే ఉంచేస్తాడు. జిజారు కొడుకు యెంకటి ఆ గూడానికంతా చదువుకున్నోడు. ఉద్యోగం వెతుకులాటలో తెల్లారకముందే లేచి వెళ్ళి బస్సు ఎక్కి దిగే క్రమంలో డ్రైవరు దూకుడు వల్ల గాయాలపాలై ఆసుపత్రిలో ఉంటాడు.
జిజారు కొడుకును ఎలాగైనా బతికించుకోవాలని ప్రాకులడుతాడు. కానీ చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండదు. అప్పటికే జిజారు తన కుటుంబ ఖర్చుల నిమిత్తం కృష్ణమూర్తి, హర్నాదు షావుకార్ల దగ్గర అప్పు పడి ఉంటాడు. యెంకటిని ఎలాగైనా కాపాడుకోవాలని ధైర్యం చేసి కృష్ణమూర్తి షావుకారి దగ్గరకు వెళ్తాడు. గిరిజనులంతా చింతపండు గిట్టుబాటు ధర కోసం నిరసన ప్రకటిస్తుంటారు. ఆ విషయాన్ని కృష్ణమూర్తి దృష్టిలో పెటుకొని జిజారు రెండెకరాల భూమి మూడు సంవత్సరాల పంట మొత్తం తనకే అనే ఒప్పందంతో రెండువేలు (2000/-) అప్పు ఇస్తాడు. డబ్బు పట్టుకొని ఆసుపత్రికి వెళ్లేసరికి యెంకటి చనిపోతాడు. జిజారుకి ఒకేసారి కొడుకు, భూమి చేయి జారిపోతాయి.
యెంకటి దినం చేయడానికి గూడెం వారంతా ఇంటికి యాభై (50/-) రూపాయలు చొప్పున ఆర్థికంగానూ, శారీరకంగానూ సాయం చేస్తారు. యెంకటి దినానికి చుట్టూపక్కల గూడెంల నుంచి చుట్టాలు వస్తారు. అదే సమయంలో పోలీసులు వచ్చి మీటింగ్‌లు పెట్టి అన్నలకు ఆశ్రయమిస్తున్నారని దాడిచేసి ఆరు మందిని అరెస్ట్‌ చేస్తారు. యెంకటిని పెళ్ళి చేసుకోవాలని సుబ్బి అనుకుంటుంది. కానీ యెంకటి చచ్చిపోవడంతో తురకయ్యను వివాహం చేసుకొని ఇద్దరూ కలసి కమ్యూనిస్టు పార్టీ సంఘంలో చేరిపోతారు.
ఈ విధంగా గిరిజనుల్ని, గిరిజనేతరులు దోపిడిని చిత్రిస్తూ వచ్చిన కథలు మాదిరిగానే గిరిజనుల్ని, స్వయంగా గిరిజనులే దోచుకున్న సంఘటనలను చిత్రిస్తూ వెలువడిన కథలు కూడా ఉత్తరాంధ్ర నుండి వెలువడ్డాయి.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.