పురి బిగించి వదిలిన బొంగరం ఆమె
తిరుగుతున్న భూగోళం
చుట్టూ వున్న పన్నెండు ఇళ్ళలో పని
ఏ చీకట్ల మేలు కొలుపులో…
దర్గాలో ప్రార్ధన ‘అల్లా’’ అను లోపే
తనింటి పనులకు ముగింపు పలుకుతుంది ..
పరుగు వంటి నడక ఇంటింటికీ …..
నాలుగిల్ల వాకిల్లు చల్లి… పరుగున మరో ఇల్లు
‘‘బాసండ్లు’’ కడిగి తళ తళ వెండి వెలుగుల నందిస్తుంది.
పని నాణ్యతకు అనునయంగా ముచ్చట గొలుపు ముఖ కదలికలు ….
మరో ఇల్లు… మరోఇల్లు… తిరుగుల పరుగు
పవనుడితో పదములు కలుపుతూ ..
ఎవరు ఏది చెప్పినా చేస్తుంది
ఏది పెట్టినా పిల్లలకు దాచి పెడుతుంది
పేరు కోమలి… చూపుకు సుకోమలి
చేయుచున్న పని బండచాకిరి
బడి బాటలో పెద్దవాడు
మధ్యవాడికి గుండెలో రంధ్రం
పసివాడిది అంగ వైకల్యం
సత్తు పడిన కాళ్ళు
పనిచేయని మెదడు
చంకలో వేసుకుని తిరుగుతుంది.
ఇంటింటికి పాలు పడుతూ… ఉగ్గుపెడుతూ
పెద్దదిక్కు అత్త పిల్లలను చేరదీస్తుంది.
భర్త ఒక్కనాడు పనికి వెళ్తే
పది రోజులు తాగి పడుకుంటాడు.
వదిలెయ్యమంటారు సాటి సోపతి రాండ్రు
బిడ్డలకు తండ్రి వుండాలంటుంది మహాసాధ్యి.
ఆమె గుండెను తడి- చేయదు
నవరత్నాలు చిందిస్తుంది. గలగలా పారే సెలయేరులా కష్టాన్ని ఇష్టంగా… నవ్వుతూ…..
డబ్బు కావాలి.
చాలీ చాలని జీతంలో ఆదా చేయాలి
అరకొర పొదుపు
కన్న కడుపుల బ్రతుకు కొరకు
చంటి వాడి పాల కొరకు
రాయవేలూర్ చికిత్స కొరకు
‘‘కొద్దిగా ఊపిరి తీసుకోవే’’ అంటారు అమ్మలు
తను శ్వాస తీసుకుంటే బిడ్డ శ్వాస
ఆగి పోతుంది అంటుంది.
ఆ తల్లి… ఆపదు… ఆపదు పనిని
పరుగుల తిరుగుల వడివడి నడకల పనిని
చేసే కాయ కష్టాన్ని నిద్రపుచ్చదు
ఆమెది మమకారం నిండిన
లక్ష్యంతో కూడిన నాట్య విలాసం
తిరుగుతున్న రంగులరాట్నం
పనిమనిషిగా పలుచనైన ‘‘పనుల తల్లి’’
