అనువాదం: సుధామయి సత్తెనపల్లి
దళిత విద్యార్థులు తమ చదువులో, క్రీడల్లో, చివరకు ప్రేమలో విజయం సాధించడానికి కూడా నిత్యం క్రూరమైన దురాగతాలను ఎదుర్కొంటుంటారు. తమిళనాడులోని విద్యా సంస్థల్లో ఇప్పటికీ ప్రతీకార కులాధిపత్యం కొనసాగుతోంది.
ఆగస్టు 9, 2023. నాంగునెరి: ఒక ప్రభుత్వ పాఠశాలలో ఆధిపత్య కులానికి చెందిన పాఠశాల సహవిద్యార్థులు చేస్తోన్న కుల అణచివేతను బహిరంగంగా ప్రశ్నించినందుకు వారు 11వ తరగతి చదువుతోన్న దళిత విద్యార్థి చిన్నదురైపై దాడి చేసి, గాయపరిచారు.
ఫిబ్రవరి 12, 2025. శివగంగై: “మా కళ్ళ ముందే మీ కులపోడు వాహనం నడిపించడానికి ఎంత ధైర్యం?” బైక్ నడిపినందుకు గాను శివగంగై ప్రభుత్వ కళాశాలలో మÖడవ సంవత్సరం బిఎస్సీ చదువుతోన్న అయ్యసామి తీవ్రమైన దాడికి గురై ప్రాణభయంతో అక్కడి నుండి పారిపోయాడు.
మార్చి 10, 2025: ఆరియనాయగిపురం: దళిత వర్గానికి చెందిన దేవేంద్రరాజ్ జట్టు తమ జట్టుపై విజయం సాధించటాన్ని వ్య భరించలేని ఆధిపత్య కులానికి చెందినవారు, వర్ధమాన కబడ్డీ ఛాంపియన్ అయిన అతనిపై దారుణంగా దాడి చేశారు.
జూలై 31, 2025: ఆరుముగమంగళం: వేరే కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించినందుకు కవిన్ సెల్వగణేశ్‌ను దారుణంగా హత్య చేశారు. తమిళనాడు అంతటా బడుల్లోనూ కళాశాలల్లోనూ కులాధారిత వివక్ష తన రూపాన్ని మార్చుకుందే తప్ప మాయమైపోలేదు. కొన్ని ప్రాంతాల్లో అది మెరుగైన రూపాన్ని తీసుకోగా, కొన్నిటిలో అది ఇంకా స్పష్టంగా కనిపిస్తోంది.
అనేక గ్రామాల్లో జీవితంలోని ప్రతి అంశంలోనూ కుల గుర్తింపు కనిపిస్తుంది, ఆ కనిపించటంతో పాటే విభజన కూడా వస్తుంది. దళిత, అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థులను ఇప్పటికీ వేరుగా ఉంచుతున్నారు, వారిని దూషిస్తున్నారు, ఉపాధ్యాయులు వారితో బలవంతంగా మరుగుదొడ్లను శుభ్రం చేయిస్తున్నారు..
పాఠశాలల నుండి ప్రభుత్వ కార్యాలయాల వరకు, దేవాలయాల నుండి మీడియా సంస్థల వరకు, కుల ఆధిపత్యం లోతుగా విస్తరించి ఉంది. ప్రజాస్వామ్యం “స్వతంత్ర” స్తంభాలుగా పిలిచే పార్లమెంట్, న్యాయవ్యవస్థ, మీడియా, బ్యూరోక్రసీలు కులాన్ని నిర్మూలించడానికి బదులుగా, తరచుగా దాన్ని బలోపేతం చేస్తాయి. “ఈ రోజుల్లో కులాన్నెవరు చూస్తున్నారు?” అని జనం అడుగుతుంటారు. కానీ నిజం ఏమిటంటే కుల హత్యలు, దళితులపై దారుణాలు, అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థులపై అణచివేత ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్నదాన్ని మనం నమోదు చేయాలి. ఎందుకంటే మనమలా చేయకపోతే, గతంలో అణగారిన వర్గాల వారి ప్రేమను, జీవితాలను, పోరాటాలను, ప్రతిఘటనలను ఎలా తుడిచిపెట్టేశారో, అదేవిధంగా ఈ చరిత్రను కూడా తుడిచిపెట్టేస్తారు. బౌద్ధ యుగాన్ని “చీకటి యుగం” అని పిలిచినట్టుగా, లేదా చోళుల కాలం నాటి కుల వ్యవస్థను ప్రశ్నించడానికి బదులుగా కీర్తించినట్టుగా అణగారిన వారి చరిత్ర ఎల్లప్పుడూ సమాధి చేయబడుతూనే ఉంది.
నేటికీ చాలా చోట్ల అణగారిన వర్గాల ప్రజలకు చెప్పులు వేసుకోవటానికి, దేవాలయాలలోకి ప్రవేశించడానికి, శ్మశానానికి వెళ్ళేందుకు మామÖలుగా ప్రజలు నడిచే దారుల్లో నడవడానికి అనుమతి లేదు. పీడిత కులాలకు చెందిన పిల్లలను ఆధిపత్య కులాలకు చెందిన విద్యార్థులు అవమానిస్తున్నారు. బడులలో వంట చేసే హక్కును నిరాకరిస్తున్నారు, వారు చక్కగా రాణించినప్పటికీ వారిని ఉద్దేశ పూర్వకంగా పరీక్ష తప్పిస్తున్నారు. వారు ప్రేమలో పడితే, అది వారి కులానికి మరో రూపమైన ‘లవ్ జిహాద’గా ‘బూటకం’, “నాటకం” అంటూ ముద్ర వేస్తారు. నా చిన్ననాటి నుంచీ నేను కులవివక్షను ఎదుర్కొంటూనే ఉన్నాను. కానీ నా కెమెరా ద్వారా పనిచేయడం, అంబేడ్కర్, పెరియార్‌ల రచనలను చదవడం ప్రారంభించేంత వరకు నాకు కుల స్పృహ అన్నది కలగలేదు. అప్పుడు మాత్రమే నేను ఈ సమాజాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను, నా ప్రజలతో కలిసి నడవటం ప్రారంభించాను.
నేను కళాశాలలో చదివే రోజుల్లో, ఫుట్‌బాల్ జట్టులో భాగమయ్యాను. కానీ నా జట్టు సభ్యులు నన్నెప్పుడూ మైదానంలో ఆడటానికి అనుమతించలేదు. నన్ను ఎప్పుడూ బయట కూర్చోబెట్టి, ఇతరులు ఆడటాన్ని చూస్తూ సమయం గడిపేలా చేశారు. నా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశం నాకెప్పుడూ రాలేదు – ఆడటానికే అవకాశం రాకపోతే, ఇక నేనెలా నేర్చుకోగలను?
వివక్ష రకరకాలుగా పనిచేస్తుంది. మొదట అది నాకు అవకాశాన్నివ్వటానికి నిరాకరించింది, ఆపై నేను ఆడటానికి తగినంత సమర్థుడిని కానని చెప్పడానికి ఆ విషయాన్నే వాడుకుంది. భారతదేశంలో ప్రేమ కూడా ఒక రాజకీయమే. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతోన్న ఎవిడెన్స్ (జుఙఱdవఅcవ) అనే సంస్థ వ్యవస్థాపకుడు విన్సెంట్ రాజ్ తెలిపిన వివరాల ప్రకారం, గత ఎనిమిదేళ్ళలో తమిళనాడులో 65 కుల ఆధారిత ‘పరువు’ హత్యలు జరిగాయి; అయినప్పటికీ, కేవలం ఎనిమిది కేసుల్లో మాత్రమే బాధితులకు అనుకూలమైన తీర్పులు వెలువడ్డాయి.
ఇతర మానవులను సమానులుగా చూడటమే అత్యంత ప్రాథమికమైన మానవీయ విలువ. అయినప్పటికీ, మన సమాజం ఆ స్థాయికి ఎప్పుడు ఎదుగుతుందో నాకైతే తెలియటంలేదు. అణగారిన వర్గాలకు చెందిన ఎవరైనా కొద్ది సందర్భాల్లో పురోగతి సాధించినప్పుడు, వారి ఆత్మగౌరవంపై దాడి జరుగుతుంది, వారి హోదాను అణచివేస్తారు, వారి ఇళ్ళను బుల్‌డోజర్లతో కూల్చివేస్తారు.
డిసెంబర్ 2022లో, పుదుక్కోట్టై జిల్లాలోని వేంగైవాయల్ గ్రామంలో దళితుల నివాస ప్రాంతంలోని నీటి ట్యాంకులో ఆధిపత్య కులాలకు చెందిన పురుషులు మానవ మలాన్ని వేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన ఆ ప్రాంతంలో ప్రబలంగా ఉన్న ఇతర కుల వివక్షాపద్ధతులను వెలుగులోకి తెచ్చింది. వీటిలో స్థానిక టీ దుకాణాల్లో అమలయ్యే “రెండు గ్లాసుల పద్ధతి” (దళితులకు, ఇతర కులాలవారికి వేర్వేరు గ్లాసులు), స్థానిక అయ్యనార్ ఆలయంలోకి దళితులను ప్రవేశించకుండా అడ్డుకోవడం వంటివి ఉన్నాయి.
అక్కడ కేవలం 12 దళిత కుటుంబాలు మాత్రమే నివసిస్తున్నాయి. ఆ సంఘటనకు బాధ్యులెవరో నిర్ధారించలేకపోవడంతో, ఇప్పుడు వారు నానా కష్టాలు పడుతున్నారు. వేంగైవాయల్ చేరుకోవడానికి 12 పోలీసు చెక్‌పోస్టులు దాటాలి, జర్నలిస్టులకు ఇప్పటికీ అక్కడికి వెళ్ళేందుకు అనుమతి లేదు. ఎప్పుడూ కూడా అణగారిన వర్గాలకు న్యాయమనేది ఎడతెరిపిలేని పోరాటం చేస్తే తప్ప రాదు. డిసెంబర్ 2025లో నేను దీనిని రాసి పూర్తి చేస్తుండగా, తిరుచ్చీలో భూగర్భ మురుగు కాలువలను శుభ్రం చేస్తూ ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు మరణించారు. ఈ వలయం ఇలా కొనసాగుతూనే ఉంటుంది.
… … …
జూలై 31, 2025న జరిగిన ఒక ‘పరువు’ హత్యలో కవిన్ సెల్వగణేశ్ దారుణంగా హత్యకు గురయ్యాడు. అతని వయసు కేవలం 27 ఏళ్ళు మాత్రమే. ఇంజనీరింగ్ పట్టభద్రుడైన అతను చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసేవాడు. అతని తల్లిదండ్రులైన ఎస్. తమిళసెల్వి, చంద్రశేఖర్‌లు తూత్తుకుడి జిల్లాలోని ఎరళ్ మండలం, ఆరుముగమంగళంలో గల తేర్కు మాడా వీధిలో నివసిస్తున్నారు.
కవిన్, సుభాషిణిలు బడిలో చదువుకుంటున్నప్పటి నుండి స్నేహితులు; ఆ తర్వాత వారు ప్రేమలో పడ్డారు. ఒక రోజు, తన తాతగారి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి కవిన్ ఆమెను కలిశాడు – సుభాషిణి అదే ఆసుపత్రిలో సిద్ధ వైద్యురాలిగా పనిచేస్తోంది.
కాసేపటికే ఆమె సోదరుడు సుజిత్ అక్కడికి వచ్చి, తమ తల్లిదండ్రులు కవిన్‌ను కలవాలనుకుంటున్నారని అతనికి చెప్పాడు. సుజిత్ అతన్ని తనతో పాటు తన బైక్ మీద రమ్మని కోరాడు. రెండు వీధులు దాటిన తర్వాత సుజిత్ ఆగి, ఒక కత్తిని బయటకు తీసి కవిన్‌ను అత్యంత దారుణంగా హత్య చేశాడు. కవిన్, సుభాషిణి, సుజిత్‌లు కొన్నేళ్ళుగా అత్యంత సన్నిహిత స్నేహితులనే విషయాన్ని ఇక్కడ ముఖ్యంగా గమనించాలి. అయినప్పటికీ, సుజిత్ అతనిపై దాడి చేస్తూ ఇలా అన్నాడు: “ఒక పలార్ (షెడ్యూల్డ్ కులం) కుర్రాడు మా కుటుంబానికి చెందిన అమ్మాయిని కోరుకోవటమా? ఇప్పుడే నా తల్లిదండ్రులు శాంతిగా ఉండగలరు.”
కవిన్‌ను చంపడానికి ముందు అతను ఖచ్చితంగా పలికిన మాటలు అవేనని ఆరోపణలు ఉన్నాయి. సుజిత్ తల్లిదండ్రులిద్దరూ పోలీసు అధికారులే. కవిన్ ఒక ఇంజినీరింగ్ పట్టభద్రుడు. విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థిరత్వం వంటివన్నీ కులాన్ని రద్దుచేస్తాయనే ప్రమాదకరమైన భ్రాంతిలో నేటి సమాజం జీవిస్తోంది. కవిన్ విషయంలో అవేవీ పనిచేయలేదు. కవిన్ మరణించినప్పటి నుండి, నేనొక ప్రాణమున్న శవాన్ని అని నాకనిపించేది. ఒక కుల హత్యను కళ్ళారా చూడటం మన అంతరంగంలో ఏదో ఒక మార్పును తీసుకువస్తుంది. అది మీ భద్రతా భావాన్ని, స్పష్టతను, చివరకు మీ అస్తిత్వాన్ని కూడా హరించివేస్తుంది. ఈ రకమైన హింసతో సంబంధం ఏర్పడక ముందు నేనెలా ఉండేవాడినో మళ్ళీ ఆ స్థితికి చేరుకోవడానికి, నన్ను నేను తిరిగి కనుక్కోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఇది చాలా కష్టమైనదే కాక ఎంతో బాధాకరమైనది కూడా.
ఈ దుఃఖం కేవలం కవిన్ లేదా అతని కుటుంబం కోసం మాత్రమే కాదు. శాశ్వతంగా మారిపోయినట్లనిపిస్తోన్న నాలోపలి భాగానికి కూడా ఇది బాధను కలిగిస్తోంది. కవిన్ కేవలం ఒక బాధితుడు మాత్రమే కాదు; అతను ఒక వెలుగు, ఒక అరుదైన వెచ్చదనం, తమకు గుర్తింపు ఉందని, తాము సురక్షితంగా ఉన్నామని, తాము విలువైనవారమని ఇతరులు భావించేలా చేసేవాడు. నిజంగా ఒక మంచి మనిషి. అందుకే ఈ నష్టం భరించరానిదిగా తయారైంది. ప్రపంచం కేవలం ఒక ప్రాణాన్ని కోల్పోలేదు; ఇతరుల జీవితాలను మెరుగుపరిచిన ఒక వ్యక్తిని కోల్పోయింది.
నేను స్వయంగా చూసిన మÖడవ ‘పరువు’ హత్య ఇది. దాదాపు ఏడాది క్రితం పల్లికరణైలో జరిగిన ప్రవీణ్ హత్య వార్తను నేను కవర్ చేశాను. కవిన్ మరణం ఆ భయానక ఘటననే తలపిస్తోంది. వీరిద్దరిపై ఎంత భయానకమైన దాడి జరిగిందంటే, వారి తల్లులు కూడా వారిని గుర్తుపట్టలేకపోయారు. ఇవి కేవలం హత్యలు మాత్రమే కాదు; ఇవి ఒక వ్యక్తి ఉనికినే తుడిచిపెట్టేసే చర్యలు.
నాకు అన్నిటికన్నా ఎక్కువగా గుర్తుండిపోయేది కవిన్ తల్లి ధైర్యమే. ఊహాతీతమైన బాధ మధ్యలో కూడా, ఆమె మాటల్లో వర్ణించలేనంత ప్రశాంతమైన స్థైర్యంతో నిలిచింది. బహుశా ఉపాధ్యాయురాలిగా ఆమెకున్న అనుభవమే ఆమెకు ఆ బాధను తట్టుకునే మానసిక బలాన్ని ఇచ్చి ఉండవచ్చు. కవిన్ అంత్యక్రియలు ముగిసిన తర్వాత నేను ఆమెను కలిసినప్పుడు, దుఃఖపు బరువుతో నిండి వున్న ఆమె ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. ఆమె కుంగిపోయిందన్నది నిజమే, కానీ న్యాయం కోసం, తన కొడుకు కోసం, సత్యం కోసం పోరాడాలని ఆమె నిశ్చయించుకుంది.
కుల అణచివేత గురించి చాలా కాలంగా రాస్తోన్న సీనియర్ జర్నలిస్ట్ కామ్రేడ్ జయరాణి నాతో ఇలా అన్నారు, “కామ్రేడ్, మన సమాజం అస్సలు మారలేదు. ఇప్పుడున్న ఒకే ఒక తేడా ఏమిటంటే సోషల్ మీడియా, సిసిటీవీల వల్ల కొన్ని నిజాలు బయటకు కనిపిస్తున్నాయి.” ఉడుమలై శంకర్ కేసులాగే, కవిన్ కేసు కూడా వీడియో సాక్ష్యం ఉండటం వల్లనే అందరి దృష్టిని ఆకర్షించిందని ఆమె అన్నారు. మరెన్నో కేసులు ఎవరి దృష్టికీ రాకుండా పోతున్నాయి. “ఇప్పుడు పరువు హత్య ఒక సంస్కృతిగా మారిపోయింది,” అన్నారామె. “పండుగలు, ఆచారాల లాగా ఇది కూడా చాలా మామÖలైపోయింది.” కులాంతర ప్రేమకు లేదా ధిక్కారానికి విధించే ఈ “శిక్ష” అని పిలిచేదాన్ని ఇప్పుడొక సాంస్కృతిక చర్యగా పరిగణిస్తున్నారు. షెడ్యూల్డ్ కులాలు / షెడ్యూల్డ్ తెగల చట్టంలోని వాస్తవాలు గానీ, చట్టపరమైన పరిణామాలు గానీ వారి ఆలోచనలను ఎన్నడూ ప్రభావితం చేయవు; వారి మనస్తత్వాలు మారవు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత, ఈ కులతత్వ భావజాలం బయటకు కనిపించటం మొదలైంది. ఇంకా ఎదిగీ ఎదగని వయసులో ఉన్న అబ్బాయిలు సైతం, తమ అక్కల ప్రేమికులను చంపడం గురించి ఎంతో నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. ఇలాంటి భయానక వాస్తవంలో మనం జీవిస్తున్నాం.
… … …
తిరునల్వేలి ప్రభుత్వ ఆసుపత్రిలోని కాజువాలిటీ వార్డు ఎప్పుడూ గందరగోళంగానే ఉంటుంది. తమిళనాడు దక్షిణాది జిల్లాలలో, ప్రత్యేకించి తిరునల్వేలిలో కుల ఆధారిత హింసకు గురయ్యే దళిత విద్యార్థుల గురించీ, యువత గురించీ వార్తలు ఎప్పటికీ ఆగేలా కనిపించటంలేదు. ఐసియు ఎప్పుడూ కిటకిటలాడుతుండటం పరిస్థితిలోని తీవ్రతను తెలియచేస్తోంది.
దేవేంద్రరాజ్‌ను కలిసేందుకు నేను వెళ్ళినప్పుడు మామÖలుగానే నన్ను పోలీసులు ఆపేశారు. వామపక్ష పార్టీలకు చెందిన కామ్రేడ్స్ సహకారంతోనే నేను లోపలికి వెళ్ళి ఫోటోలు తీయగలిగాను. పోలీసులు నాపై ప్రశ్నల వర్షం కురిపించినప్పటికీ, దానంతటి నుంచీ బయటపడేందుకు నాకు కమÖ్యనిస్టు కేడర్ సహాయంచేసింది. ఆరోజు ఆసుపత్రిలో ఉన్న ఉద్రిక్త వాతావరణం వలన నాకు దేవేంద్రరాజ్ తండ్రితో మాట్లాడటం సాధ్యం కాలేదు. దాంతో నేను మదురై వెళ్ళిపోయి, అయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయటానికి మరుసటి రోజు తిరిగివచ్చాను.
బాధితుడి తండ్రి తంగ గణేశ్ తూత్తుకుడి జిల్లా, కరుంగుళం తాలూకా ఆరియనాయగిపురంలోని వల్లకులం గ్రామానికి చెందినవారు. “నా కొడుకుని బస్ ఎక్కించి ఇంకా ఇంటికి చేరకముందే, సమీప గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అతనిపై డాడిచేశారనే వార్త నాకు చేరింది. నేను వెంటనే ఆ చోటుకు వెళ్ళి నా కొడుకును ఆసుపత్రికి తీసుకువెళ్ళాను. నేనా రోజు పనికి వెళ్ళిపోయి ఉంటే, పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. నా కొడుకు బతికేవాడు కాదు.” ఆయన 2025, మార్చి 10న తన కొడుకుపై జరిగిన దాడి గురించి చెప్తున్నారు. ఈ దాడికి మÖలాలు పొరుగునే ఉన్న గ్రామంలో జరిగిన ఒక కబడ్డీ ఆటలో ఉన్నాయి. ఆ ఆటలో రెండు కేటగిరీలలోనూ దళిత జట్టు విజయం సాధించింది.
కుల హింసను ప్రేరేపించటానికి ఆటలో ఒక దళిత జట్టు విజయం సాధించటం సరిపోతుంది. పరీక్షలు రాసేందుకు బస్సులో ప్రయాణిస్తోన్న దేవేంద్రరాజ్‌ను బస్ నుంచి బయటకు లాగి రోడ్డు మీద అతనిని నరికేశారు. అతని తండ్రి నాకీ విషయాన్ని చెప్పినప్పుడు, నా ఒళ్ళంతా ఒక వణుకు పుట్టింది. ఈ హింసంతా ఒక ఆట గురించి కాదు, అది ఒక ఆధికారం గురించి. ఈ క్రూరమైన దాడి వెనుక ఉన్నది, ఒక దళిత విద్యార్థి ఆధిపత్య కులాలకు చెందినవారిపై గెలవకూడదనే ఆలోచనే. విచిత్రమేమిటంటే, దేవేంద్రరాజ్ తన ప్రాంతంలో అత్యుత్తమ కబడ్డీ క్రీడాకారులలో ఒకరిగా ప్రసిద్ధి చెందాడు.
అతని తల మీద, చేతుల మీదా లోతుగా నరికిన గాయాలున్నాయనీ, అందులో ఒకటి చాలా తీవ్రమైనదనీ డాక్టర్ నాతో చెప్పారు. పాక్షికంగా తెగిపోయిన అతని వేళ్ళ గాయాలు నయం కావటానికి రెండుమÖడు నెలలు పడుతుంది. “ప్లాస్టిక్ సర్జరీ చేయటానికి ముందు అతని వేళ్ళు సరిగా అతుక్కోవాలి,” డాక్టర్ చెప్పారు. దేవేంద్రరాజ్ అతని తల్లిదండ్రులకు పెద్ద కొడుకు. “నేను ఒక ఇటుక బట్టీలో పనిచేస్తాను. నాకు ఇద్దరు పిల్లలు. పెద్ద కొడుకైన దేవేంద్రరాజ్ పాళయంకొట్టైలోని ఒక బడిలో చదువుతున్నాడు. నా కూతురు నా రెండవ సంతానం. నేనూ నా భార్యా రోజూ ఇటుక బట్టీకి వెళ్తాం,” అన్నారు తంగ గణేశ్.
తన సొంత జీవితం గురించి ఆయన నింపాదిగా చెప్పుకుపోయారు: “నా చిన్నతనంలో నాకు కులం గురించి ఎరుక లేదు. మా టీచర్లెవరూ అంబేద్కర్ గురించి గానీ పెరియార్ గురించి గానీ చెప్పేవాళ్ళు కాదు. పదో తరగతి పరీక్షలు రాసిన తర్వాత, మాకున్న ఆర్థిక ఇబ్బందుల వలన, మోటార్ మెకానిక్స్ నేర్చుకోవటం కోసం నేను ఐటిఐ (వొకేషనల్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్)కి దరఖాస్తు చేశాను. అందులో చేరటానికి రూ. 650 కట్టాలి, అది ఏర్పాటు చేసుకోవటం కూడా కష్టమే. మా అమ్మ వేరేవాళ్ళ నుంచి అప్పు తీసుకుంది.
“ఆ డబ్బు పట్టుకొని నేను బాగా నేర్చుకోవాలనే ఆతృతతో, ఎన్నో కలలతో అక్కడికి వెళ్ళాను. కానీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి అధికారులు ఇద్దరి ముగ్గురి పేర్లను పిలిచి, ఇక్కడ సీట్లు లేవని చెప్పారు. అందులో నేనూ ఒకడిని. వాళ్ళు మమ్మల్ని బయటకు తోసి, గేట్లకు తాళం వేసుకున్నారు. ఇదంతా ఎందుకో నాకు అర్థంకాలేదు. నేను ఆ గేటు ముందే ఏడ్చేశాను. నాకు మార్కులు తక్కువ వచ్చినందుకే ఇలా జరిగిందని వాళ్ళు చెప్పారు. అదే నిజమైతే, నాకు ముందుగా అడ్మిషన్ కార్డ్ ఎలా వచ్చింది? ఆ ప్రశ్న నన్ను కొన్నేళ్ళ పాటు వెంటాడింది.”
… … …
మేం వచ్చేసరికి తిరునల్వేలి, నాంగునెరిలోని ఆ వీధి నిర్మానుష్యంగా ఉంది. చిన్నదురై ఇంటికి తాళంపెట్టి ఉంది. వరండా అంతటా చిందిన రక్తం ఎండిపోయి ఉంది, దానిమీద రక్తపు చేతిముద్రలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మేం అక్కడికి వెళ్ళిన సమయానికి కూడా గాలిలో రక్తపు దుర్వాసన అలముకొని ఉంది. ప్రతిచోటా చిన్నదురై రక్తమే ఉన్నట్లనిపించింది, ఆ ఘాటైన దుర్వాసన ఇంకా స్పష్టంగా తెలుస్తోంది. అతని బడి సంచిలో మాకు నూటికి నూరు మార్కులు వచ్చిన కొన్ని పరీక్షా పత్రాలు, ప్రిన్సిపాల్‌కు రాసిన ఒక పూర్తిచేయని ఉత్తరం కనిపించాయి. చిన్నదురై ఒక ప్రభుత్వ పాఠశాలలో 11వ తరగతి చదువుతున్నాడు; అతను నిరంతరం మంచి ప్రతిభను కనబరిచే శ్రద్ధగా చదివే విద్యార్థి. చదువు పట్ల అతనికున్న అంకితభావం ఉపాధ్యాయుల నుండి, ప్రిన్సిపాల్ నుండి కూడా అతనికి ప్రశంసలను సంపాదించిపెట్టింది. ప్రిన్సిపాల్ ఒకసారి బడి ప్రవేశ ద్వారం వద్దకు విద్యార్థులందరినీ పిలిచి, చిన్నదురై కృషిని అభినందించి, ఇతరులు అతడిని ఆదర్శంగా తీసుకోవాలని ప్రోత్సహించారు.
అయితే, చిన్నదురై అణగారిన సముదాయానికి చెందినవాడు కావటంతో, ఆధిపత్య కులానికి చెందిన అతని సహావిద్యార్థులకు ఇది రుచించలేదు. అతనిపై దాడి జరగటానికి ఇదే ప్రధాన కారణం.
తోటి విద్యార్థుల నుండి ఎడతెరిపిలేని వేధింపులకు గురైన చిన్నదురై తరచుగా బడికి వెళ్ళకుండా ఇంటిలోనే ఉండటానికి ఇష్టపడేవాడు. చివరకు ప్రిన్సిపాల్ జోక్యం చేసుకుని, అతని ఆందోళనలను విని, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఒక రాతపూర్వక లేఖను పొందారు. ఆ రోజు ముగ్గురు ఆధిపత్య కులాలకు చెందిన విద్యార్థులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు.
అదేరోజు రాత్రి, ఏడుగురు ఆధిపత్యకులాలకు చెందిన విద్యార్థులు – అందులో ముగ్గురు మైనర్లు, మిగతా నలుగురు మేజర్లు – చిన్నదురై ఇంటికి వెళ్ళారు. వారిలో ముగ్గురు ఒక్క కొడవలితో అతనిపై దాడిచేసి, పదే పదే దానితో అతన్ని నరికారు. చిన్నదురైకి సాయం చేయటానికి వెళ్ళిన అతని సోదరి కూడా గాయపడింది. ఆ దాడిలోని క్రూరత్వం ఊహించరానిది. ఈ విషాదం పాఠశాలల్లో కుల విద్వేషం, అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థులు ఎదుర్కొంటోన్న హింస ఏ స్థాయిలో ఉన్నాయో వెల్లడిస్తోంది.
చిన్నదురైనీ, అతని సోదరినీ భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య తిరునల్వేలి ప్రభుత్వ ఆసుపత్రి ఐసియులో ఉంచారు. మొదట నన్ను అక్కడికి వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారు. కానీ నేను అతనెలా ఉన్నాడో చూడటానికి వచ్చిన రాజకీయపార్టీ సభ్యులతోనూ, అంటారనితనం నిర్మూలనా సంఘటన సభ్యులతోనూ కలిసి లోనికి వెళ్ళాను. నేనతన్ని చూసినప్పుడు, అతని చేతుల మీద, కాళ్ళ మీద, తలమీద తెగిన గాయాలున్నాయి. తాజాగా జరిగిన సర్జరీ వలన అతని ఒళ్ళంతా పిండికట్టుతో ఉంది. అతను ఎప్పటికి కోలుకుంటాడోనని నాకు భయమేసింది, అయినా ఎంత నొప్పిగా ఉన్నప్పటికీ సౌమ్యమైన అతని చిరునవ్వు నాకు ఆశను కలిగించింది.
బాధతో ఉన్నప్పటికీ మాట్లాడాలనే నిశ్చయంతో ఉన్న చిన్నదురై, తాను పూర్తి చేయని ఉత్తరాన్ని ప్రిన్సిపాల్‌కు అందజేసిన రోజునే ఆ దాడి జరిగిందని చెప్పాడు. నేను కొన్ని ఓదార్పు మాటలు చెప్పి, కొన్ని ఫోటోలు తీసుకొని, బరువైన మనసుతో అక్కడి నుంచి వచ్చేశాను. అతని తల్లితో మాట్లాడటం నాకు ఇంకా కష్టంగా తోచింది. చిన్నుదురైపై దాడిచేసిన కొంతమంది విద్యార్థుల ఇళ్ళల్లో పనులు చేస్తూనే ఆమె తన పిల్లలను ఒక్కచేతి మీద పెంచి పెద్దచేసి వారికి చదువు చెప్పించింది. ఆ విద్యార్థులే ఇంతటి హింసకు పాల్పడతారని ఆమె నమ్మలేకపోతోంది. పూర్తిగా అలసిపోయిన ఆమె మౌనంగా ఉండిపోయింది. ఆ తర్వాత కొంతసేపటికి నేను వచ్చేశాను.
పాఠశాలల్లో కులతత్వం ఎంత లోతుగా పాతుకుపోయి ఉందో ఈ దాడి కటువుగా గుర్తుచేస్తోంది.
… … …
నేను అంబేద్కర్, పెరియార్‌లను చదవటం మొదలుపెట్టిన తర్వాత మాత్రమే నన్ను తిరస్కరించింది నా మార్కుల వలన కాదు, నా కులం వలన అని నాకు అర్థమయింది. ఈ రోజున కూడా పాఠశాల, కళాశాల విద్యార్థుల కోసం నేను నిర్వహించే ఫోటోగ్రఫీ కార్యశాలల ద్వారా నేను ఎంతోమంది యువజనాన్ని కలుస్తూ వారితో పనిచేస్తుంటాను. ఈ విద్యార్థులలో కులం గురించిన అవగాహన ఇప్పటికీ చాలా చాలా తక్కువగా ఉండటాన్ని గమనించాను.
మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, రిజర్వేషన్ల పట్ల వారి దృక్పథం. వారిలో చాలామంది దానిని ప్రతికూల దృష్టితో చూస్తారు. రిజర్వేషన్లు దళిత, ఆదివాసీ విద్యార్థులకు ‘ప్రత్యేక హక్కు’ను కల్పిస్తాయని నమ్మేలా సమాజం వారి ఆలోచనా విధానాన్ని రూపుదిద్దింది. నేటి మన యువత పరిస్థితి ఇదే. ఇటువంటి విషయాల గురించి అర్థవంతమైన పాఠ్యాంశాలను చేర్చటంలో మన విద్యా వ్యవస్థ విఫలమయింది. చివరకు ప్రభుత్వ న్యాయ కళాశాలలలో కూడా అంబేద్కర్‌ను బోధించటం చాలా అరుదైపోయింది, ఆయన ఆలోచనా విధానం గురించి మాట్లాడటం వివాదాస్పదమయింది. అనేకమంది న్యాయశాస్త్ర విద్యార్థులతో మాట్లాడిన తర్వాత నేను దీన్ని తెలుసుకున్నాను. బాధ్యతాయుత పౌరులను తయారు చేయాల్సిన పాఠశాలలు, కళాశాలలు కూడా కుల వివక్షలో మునిగిపోయి ఉన్నాయి. పాఠ్యపుస్తకాలు ‘అంటరానితనం పాపం’ అని ప్రకటించి ఉండవచ్చు గాక, అయినా ఏ టీచర్ కూడా నిజజీవితంలో దాని అర్థమేమిటని గానీ, సరైన సామాజిక, రాజకీయ సందర్భంలో దాన్ని వివరించటాన్ని గానీ నేను ఒక్కసారి కూడా చూడలేదు.
గత ఎనిమిదేళ్ళలో నేను కుల ఆధారిత అణచివేతను గురించి ఫోటోగ్రఫీ ద్వారా డాక్యుమెంట్ చేశాను. ఫోటోగ్రఫీ వర్క్‌షాప్‌లలో ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థులతో కలిసి పనిచేయడం వలన, వారి అనుభవాల ద్వారా, నిరంతర సంభాషణల ద్వారా, పాఠశాలల్లో కళాశాలల్లో వారు ఎదుర్కొనే అణచివేతను అర్థం చేసుకోవడం నాకు సాధ్యమైంది.
విద్యార్థులతో కలిసి చేస్తోన్న ఈ ప్రయాణంలో, కుల వివక్షను ఎదుర్కొన్న ప్రతి విద్యార్థి తమ నిర్ణయాలను తాము తీసుకోలేకపోవడం వల్ల నిరంతర మానసిక వ్యధకు, మానసిక క్షోభకు గురవుతారని నేను గమనించాను. నేను దీన్ని స్వయంగా అనుభవించాను కూడా. నేను 11వ తరగతిలో ఉన్నప్పుడు, నా తోటి విద్యార్థులు నేను చేయని తప్పుకు నాపై తప్పుడు ఆరోపణలు చేశారు. అలా ఎందుకు చేశారో నాకు అర్థం కాక కన్నీళ్ళు పెట్టుకున్నాను. ఆ సంఘటన నన్ను తీవ్రంగా గాయపరిచింది, దాంతో నేను బడి ఎగ్గొట్టడం మొదలుపెట్టాను. తిరిగి బడికి వెళ్లాలనే ఆలోచన కూడా నాకు భయాన్ని కలిగించేది. మా అమ్మ జోక్యం చేసుకుని, నా పక్షాన నిలబడి ఆ సమస్యను పరిష్కరించింది. ఆ తర్వాత, కళాశాలలో ఉండగా అక్కడి పాలనా యంత్రాంగం, నా విద్యార్థి వేతనమైన రూ. 72,000ను నాకు కేటాయించేందుకు నిరాకరించింది. నేను వాకబు చేసినప్పుడు, ‘మా పన్ను డబ్బుతో నీ ఖర్చులనెందుకు భరించాలి?’ అంటూ నన్ను పంపించేశారు. ఆ విద్యార్థి వేతనం నా హక్కు అనేది కూడా నాకు తెలియదు. ఫోటోగ్రఫీ ద్వారా ప్రజలతో కలిసి పనిచేసి, ఆ అనుభవాల నుండి రాజకీయ చైతన్యం పొంది, అంబేద్కర్, పెరియార్ రచనలు చదివిన తర్వాతే సమాజంలోని కుల ప్రాధాన్య స్వభావాన్ని అర్థం చేసుకుని, నా హక్కులను గుర్తించాను.
అణగారిన సముదాయాల గురించి అధ్యయనం చేయడం ద్వారా, రాజకీయ చైతన్యాన్ని పెంపొందించుకోవడం ద్వారా, నేను షెడ్యూల్డ్ కులానికి చెందిన వాడినవ్వటం వల్లనే పాఠశాలలో నాపై తప్పుడు ఆరోపణలు చేశారనీ, నా విద్యార్థి వేతనాన్ని నిరాకరించారనీ నేను గ్రహించగలిగాను. విద్యాసంస్థలలో ఏదైనా వస్తువు పోయినప్పుడు, తరచుగా అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థులనే మొదట అనుమానిస్తారు. తప్పుడు ఆరోపణల కారణంగా చాలామంది నిరంతర మానసిక క్షోభతో జీవిస్తున్నారు. ఈరోజున కూడా ఉపాధ్యాయులు పారిశుద్ధ్య శ్రామికుల పిల్లలతోటే మరుగుదొడ్లను శుభ్రం చేయిస్తున్నట్లు నివేదికలు వెలుగులోకి వస్తున్నాయి.
పాఠశాలల్లోనూ కళాశాలల్లోనూ కుల ఆధారిత వివక్ష కొనసాగుతూ ఉన్నప్పటికీ మన విద్యా వ్యవస్థ మాత్రం దాన్ని సరిదిద్దటంలో విఫలమవుతోంది. భారతదేశంలో మనకెప్పుడూ ఒక ‘కుల నిర్మూలన’ కార్యక్రమమంటూ లేదు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ళ తర్వాత కూడా కుల వ్యవస్థను కూలదోయడానికి మారుగా, మనం దాన్ని పరిరక్షించుకుంటూ వచ్చాం. జర్మనీ విషయమే చూడండి. నాజీల పరిపాలన ముగిసిన తర్వాత, వారు తమ నేరాలను దాచలేదు; వాటిని ఎదుర్కొన్నారు. విద్యా సంస్కరణలు, ‘డినాజీఫికేషన’ (నాజీ భావజాల నిర్మూలన) ద్వేషాన్ని వదిలించుకోవటంలో ఒక తరం మొత్తానికి సహాయపడ్డాయి. తమ పూర్వీకులు చేసిన నేరాలకు క్షమాపణ చెప్పేలా పిల్లలకు బోధించారు. సమాజాలు ఈ విధంగానే కోలుకుంటాయి.
ఈ అన్యాయాలను అధిగమించడానికి అపారమైన మానసిక బలం అవసరం. పదేపదే జరిగే కుల హింసకు భయపడిన అనేకమంది విద్యార్థులు ముందుకు సాగే ప్రయత్నంలో తమ బాధను దిగమింగుకుంటూ మౌనంగా ఉండిపోతారు. తనపై జరిగిన ప్రాణాంతకమైన దాడి నుంచి చిన్నదురై బతికి బయటపడ్డాడు. ఆ తర్వాత అతన్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు, “నన్ను గాయపరచినవాళ్ళు కూడా బాగా చదివి మంచి స్థితిలోకి రావాలి,” అన్నాడతను. అతని క్షమాగుణం, అతని అమాయకత్వాన్ని చాటిచెబుతోంది. అతని క్షమాగుణాన్ని పొందే అర్హత ఈ హింసాత్మక సమాజానికి ఏమాత్రం లేదు.
… … …
శివగంగై జిల్లా, మనమదురై తాలూకా, మేలప్పడవూర్ గ్రామానికి చెందిన ఒక దళిత యువకుడు 2025, ఫిబ్రవరి 12న క్రూరమైన దాడికి గురయ్యాడు. వాళ్ళు అతన్ని అడ్డగించి, కులంపేరుతో దూషించి, “మా కళ్ళ ముందే బండి నడిపడానికి మీ కులం వాళ్ళకు ఎంత ధైర్యం?” అంటూ అతనిపై ఆయుధాలతో దాడి చేశారు.
శివగంగై ప్రభుత్వ కళాశాలలో బిఎస్సీ మÖడవ సంవత్సరం చదువుతోన్న ఆ బాధితుడు అయ్యసామిని మదురైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఇది జరిగిన రెండు రోజుల తర్వాత నేను అతని వద్దకు వెళ్ళాను. “వాళ్ళు నన్ను, ‘ఒక పరైయార్ వాడికి బుల్లెట్ (మోటార్ బైక్) కావాల్సొచ్చిందా? అది కూడా మా వీధుల్లో నడిపిస్తాడా? నీకంత ధైర్యమా?’ అని అడిగారు. ఆ తర్వాత వాళ్ళు నాపై దాడి చేశారు. వాళ్ళు తమ కొడవలిని నా మెడకు గురిపెట్టారు, కానీ రక్షణ కోసం నేను నా చేతుల్ని పైకెత్తటంతో అవి తెగిపోయాయి. నేను నా బైక్‌ని అక్కడే వదిలేసి పరుగెత్తినప్పుడు వాళ్ళు నా పైకి ఒక కత్తి విసిరారు. అదృష్టవశాత్తూ ఆ వేటును నా ఫోన్ అడ్డుకుంది; లేకుంటే, నా కాలు తెగిపోయేది, నేను తప్పించుకోలేకపోయేవాడిని,” అంటూ అయ్యసామి ఆ సంఘటనను గుర్తుచేసుకున్నాడు. దాడి చేసినవారు ఆ తర్వాత తమ ఇంటిని కూడా ధ్వంసం చేశారని అతని అన్న పొన్‌ముత్తు నాతో చెప్పారు. “మేం వృద్ధిలోకి రావటం చాలాకాలంగా వారికి కంటగింపుగా ఉంది,” అన్నారాయన. మా సంభాషణలో, తాను మరింత కష్టపడి చదివి, అధికార స్థానాన్ని చేరుకోవాలని దృఢంగా నిశ్చయించుకున్నట్లు అయ్యసామి చెప్పాడు. అనేక జిల్లాల్లో అణగారిన వర్గాలు ఆర్థికంగా లేదా సామాజికంగా పురోగతిని సాధించినప్పుడల్లా, వాళ్ళు తరచుగా హింసాత్మక ప్రతిక్రియను ఎదుర్కొంటున్నారు.
… … …
పాత్రికేయ రంగంలో వార్తా సంస్థలలోకి దళితుల గొంతులు చాలా అరుదుగా ప్రవేశిస్తాయి, అలాగే అణగారిన సముదాయాల నుంచి వచ్చిన కథనాలు కూడా అరుదుగానే ముఖ్యాంశాలుగా నిలుస్తాయి. గణాంకాల ప్రకారం, మీడియా నిర్ణయ ప్రక్రియలో దళితుల శాతం సున్నా. ఈ విషయంపై పి. సాయినాథ్ చాలా విస్తృతంగా రాశారు. ఆయన ఇలా అంటారు, “భారత ప్రజాస్వామ్యంలో అత్యంత వివక్షాపూరితమైన సంస్థలు మీడియానే అనడంలో నా మనసులో నాకు ఎలాంటి సందేహం లేదు. మీరు ఏ ఇతర రంగాన్ని చూసినా – అది శాసనసభ, న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వర్గం లేదా విద్యా రంగం – ఏదైనా సరే; అక్కడ దళితులకు కనీసం నామమాత్రపు ప్రాతినిధ్యం అయినా ఉంటుంది. కానీ మీడియాలో మాత్రం అది మరింత అధ్వాన్నంగా, దాదాపు లేనే లేదు. ఇప్పటివరకు భారతదేశంలో ఇద్దరు దళితులు రాష్ట్రపతులుగా పనిచేశారు. ఎంత కొద్ది సంఖ్యలో అయినా, దళితులు కేంద్ర మంత్రులుగా పనిచేయడాన్ని మనం చూశాం. విశ్వవిద్యాలయాలలో చాలా మంది దళిత ఛాన్సలర్లు ఉన్నారు. కొంతమంది దళితులు ముఖ్యమంత్రులుగా కూడా ఉన్నారు. భారత సుప్రీంకోర్టులో ఇద్దరు దళితులు ప్రధాన న్యాయమÖర్తులుగా ఉన్నారు (వారు ఎలాంటి రిజర్వేషన్ లేకుండా ఈ ఉన్నత పదవికి చేరుకున్నారు, కాబట్టి ఇక్కడ యోగ్యత అనే ప్రశ్నే తలెత్తదు). “ఏదేమైనా, వార్తాపత్రికల ప్రపంచంలో, ఏదైనా జాతీయ దినపత్రికలో దళిత వర్గానికి చెందిన ఒక్క చీఫ్ సబ్-ఎడిటర్‌ను వెతికే ప్రయత్నం చేయండి. లేదంటే, కనీసం ఒక దళిత యాంకర్‌నైనా. మీరు అందుకోసం చాలా కాలం వెతకాల్సి ఉంటుంది. వారికి ప్రాతినిధ్యం కల్పించడం పట్ల మాటల్లో చెప్పలేని దుర్మార్గం, ప్రతిఘటన ఉన్నాయి. ఇక్కడ ఎలాంటి కోటా గానీ, రిజర్వేషన్ గానీ ఉండవు. మీడియా సామాజిక సున్నితత్వం అంతా ఒక కపటత్వం నిండిన గందరగోళం.”
మా వంటి వారు ఇటువంటి వాస్తవాలను నమోదు చేసినప్పుడు, మేం ఆ అత్యంత కొద్దిమందిలో, ఆ అత్యంత అరుదైనవారిలో ఒకరిగా నిలుస్తాం. అప్పుడు మాపై ఒక గొప్ప బాధ్యతా భారం కూడా ఉంటుంది.
