రాచపాళెం
రెండు మట్టి పెళ్ళలు కరుచుకున్నట్లు
రెండు ప్రాణాలు ఒకదాని కొకటన్నట్లు
శ్రమ మానవరూపమెత్తినట్లు
చెమట ముద్దకట్టినట్లు
బిడ్డ మీద ఎంత ప్రేమో!
అమ్మ మీద ఎంత నమ్మకమో!
అందం అంగడి సరుకవుతున్నచోట
అద్దకాలు లేని అందం
సహజంగా విరిసన మందారం
మురికి సినిమాలకు వెక్కిరింత
నల్లని చందమామ
ఆ కళ్ళల్లో రేపటి మీద నమ్మకం
ఈ సృష్టి మీదున్నంత విశ్వాసం
ఆత్మగౌరవానికే కాదు
ఆత్మస్థైర్యానికే ప్రతీక
అడవుల్నుంచి కొండలలోంచి మొలుచుకొచ్చిన కవిత
ప్రాణవాయువు
ముఖమంతా పారాడినట్లు
కడుపులో పుట్టిన బిడ్డను
నడుముకు బిగించుకొని
ఏ యుద్ధానికో ఆ సన్నద్ధం
(భూమిక 2010 ఏప్రిల్ సంచిక అట్టమీద బొమ్మ చూసి)
లక్స్ ప్రెస్
వార్త కోసం మడత విప్పగానే
పత్రిక తొలిపేజీలోనే వెల్లకిలా
తామరపువ్వులో దిగంబర సుందరి
గోపురం మీద బూతు బొమ్మలా
లక్స్ సబ్బుకు ప్రెస్ క్లబ్‌కు
కురిదిన వ్యాపార సంబంధం
సిగ్గుతో తలదించుకున్న
మనిషి సంస్కారం
చర్మం మొగ్గకన్నా కోమలమే
మానవధర్మమే తాటిమొద్దయిపోయింది.
చర్మం కోమలమే మొగ్గకన్నా నాగరికతా మొగ్గ తునిగిపోయింది ముక్కలుగా
పెట్టుబడి లాభాల ప్రవాహానికి
బల్లకట్టువైపోయిన సుందరీ
ప్రకృతి ఇచ్చిన అందాన్ని
అంగట్లో ఆరబోసుకుంటావా?
నిన్ను కన్న వాళ్ళ ముందు
అలా కనిపించగలవా?
నువ్వు కన్నవాళ్ళ ముందు
అలా నిలుచోగలవా?
(ఇటీవల తెలుగు దినపత్రికల్లో వచ్చిన వ్యాపార ప్రకటన చూసి)
ఎవరికి చెప్పుకోను ??? ఏమని చెప్పుకోను – ఒక తల్లి ఆవేదన
బుచ్చిరెడ్డి
అపుడు
వాడు -కడుపులో
9నెలలు -తన్నిన తన్నులు
ఆడిన ఆటలు-తిరుగుళ్ళు
అన్ని గుర్తుకు వస్తున్నాయి
రోజంతా నిద్ర పోతూ
రాత్రీ మేలుకుని ఉంటూ
నాకు నిద్ర లేకుండా
వాడు ఆడించిన ఆటలు -గుగు ముచ్చట్లు
అన్ని గుర్తుకు వస్తున్నాయి
తుమ్మినా, పాలు కక్కినా-ఏడ్చినా
నేను పడ్డ ఆరాటం-తపన-
ఒక ఏడాది వచ్చే వరకు
20 సార్లు పిల్లల డాక్టర్‌లతో చెక్‌అప్‌లు
మందులు-మాకులు
అన్ని గుర్తుకు వస్తున్నాయి???
ఆ రోజుల్లో
అమ్మ ఆకలి అంటూ
కొంగు పట్టుకొని తిరిగిన వాడు
మొదటి సారి అడుగులు వేస్తున్నపుడు
పడిపోతాడన్న నా గుండె చప్పుడు
పాలు తాగుతూ నా స్థనం వదలక
నిద్ర పోయినపుడు
కదిలితే కయ్యి మని ఏడ్చినోడు
ఉదయం-సాయంత్రం-వాణ్ణి స్నానం
వానికో ఆట-నాకు మినీ ఎక్సర్‌సైజ్
వాడు నా కడుపులో తలపెట్టి
నిద్రపోతున్నపుడు-వాడి వేడి
వాడి కదలికలు
ఎటు జారి పడిపోతాడో అంటూ
చిన్న మెత్తలను అడ్డుగోడలుగా
నిర్మించుకుంటూ…
బయటికి వెళ్ళినా
బడికి వెళ్ళినా
కాలేజ్‌కెళ్ళినా
తిరిగి క్షేమంగా-ఆనందంగా
వచ్చేవరకు
గుమ్మం ముందు ఎదురుచూస్తూ
నిలబడ్డ రోజులు ఎన్నో…
అమ్మ షూస్‌లకు-సినిమాలకు
బట్టలకు-కాలేజీ చదువులకు
కొంగు ముడి విప్పి
వాడి సంతోషం- వాణ్ణి వెలుగు
నా ప్రాణం-అనుకున్న నేను
దాచుకున్న సొమ్ము-అమ్మిన గాజులు
చేసిన అప్పులు
ఏది వానికి తెల్వకుండా
గడిపిన బతుకు
అన్ని గుర్తుకు వస్తున్నాయి
పెళ్ళితో అమెరికా ప్రయాణం
మొదట్లో నెలకొకసారి
ఫోన్‌లలో మాటలు
ఇపుడు ఏడాదికొకసారి అయినా
మాట- మంచి తెలియక
సతమతమవుతూ-నేను
నా కన్నీటి చుక్కలు
వాడి కంట పడటం లేదు
ఒకసారి
మధ్యలో ఇండియా రాక
హోటల్‌లో-మకాం
అత్తమామలతో- వాళ్ళ చుట్టాలతో
షాపింగులు-తిరుగుళ్లు
నన్ను చూడటానికి
స్వంత ఊరికి
కొన్ని గంటలకోసం రాక
కోడలు- మీ కొడుకు
4లక్షల వజ్రాల హారం
అంటూ చూపిస్తూ
మెరిసిపోతూ…
ఇలా వచ్చి అలా
మాయమయిపోయాడు…
మాటలు-లేవు
చేసిన అప్పులు-వాటికి
జవాబు లేదు
ఫోన్ చేయాలన్నా
కాసులు లేని నా స్థితి- నా గతి
ఎవరికి చెప్పుకోను???
అమెరికాకు దత్తత ఇవ్వడానికి
వాణ్ణి కనడం అని
మొదలె తెలిసి ఉంటే
జన్మనివ్వక పోదు
నా ఆరాటం..
నా వేదన
నా–కన్నీళ్ళకు
జవాబు లేదు
నాది ఒక బతుకు???
ఏమని చెప్పుకోను
ఎవరికీ చెప్పుకోను???
(డా. పెళ్ళకూరు జయప్రదగారి గేయం చదివి అదే ప్రేరణతో…)