డా. శ్రీదేవి మురళీధర్
(భూమిక నిర్వహించిన కథ/వ్యాస రచన పోటీల్లో సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథ)
పిల్లల్లో మంచీ, చెడ్డా అంటూ రెండు తెగలుండవు. వారు ఎన్నుకునే దారుల్లో మంచిదారీ, ముళ్లదారీ ఉంటా యి దారిని బట్టి నడిచే పథి కుడికి పేరొస్తుంది. గొప్పవారి పిల్లలు చదివే స్కూళ్ళ నిండా చెడిపోయిన పిల్లలుంటా రనేది ఒక అపప్రధ. అన్ని సామాజిక వర్గాలలోనూ, అన్ని చోట్ల మంచీ, చెడూ కలగలిసి ఉంటాయి. ఇది వాస్తవం.
విద్యుత్ హైదరాబాదు వచ్చి నెల దాటింది. కొత్త ఊరు, కొత్త స్కూలు, కొత్త ప్రపంచం. చిన్నప్పటి నుంచి నైనితాల్‌లో పెరిగినవాడు అకస్మాత్తుగా హైదరాబాదు రావలసి వచ్చింది. విద్యుత్‌కి పదిహేనేళ్ళు. పదో క్లాసు చదువుతున్నాడు. ఒక్కడే కొడుకవటం చేత గారాబంగా పెరుగుతున్నాడు. తండ్రి హైదరాబాదులో కొత్త పరిశ్రమ మొదలుపెట్టాడు. అందుచేత హైదరాబాదు వచ్చి స్థిరపడ్డారు.
విద్యుత్‌ని నగరంలో పేరెన్నికగన్న స్కూల్‌లో చేర్చారు. అత్యంత ధనవంతులు, సినీతారలు, మంత్రుల పిల్లలూ చాలామంది అక్కడే చదువుతారు.
నైనితాల్‌లో విద్యుత్ చదివే స్కూలు కేంద్రీయ విద్యాలయం. ఒక్కసారిగా ‘ఊరు మారి ఉనికి మారె’నన్నట్లు జీవన వాతావరణంలో పూర్తి మార్పు వచ్చింది. సెక్షన్‌లో నలభైమంది పిల్లలు. వాళ్ళలో చాలామంది మొదటినుంచీ అక్కడే చదువుతున్నారు. కొందరు ఒకటీ రెండేళ్ళుగా చేరినవాళ్ళు. విద్యుత్ ఒక్కడే కొత్త విద్యార్థి. సిగ్గరి కాదు గానీ కొత్తగా ఫీలౌతున్నాడు.
ఒకళ్ళిద్దరు మొహమాటంగా నవ్వుతూ హాయ్ అని పలకరించారు. క్లాసు టీచర్ ‘నీకేం కావాలన్నా క్లాస్ కెప్టెన్ చేతన్‌ని అడుగు’ అని సూచించింది. చేతన్ ఈడుకు మించిన పొడుగరి. పదిహేనేళ్ళవాడైనా పదిహేడేళ్ళ కుర్రాడిలా కనిపిస్తాడు. దబ్బపండులా మెరిసిపోతూ చలాకీగా తిరుగుతుంటాడు. బాస్కెట్‌బాల్ టీమ్ లీడర్. చేతన్ గ్రూపు చాలా పెద్దది. వారంతా చాలా స్నేహంగా, ఒక్కమాట మీద ఉంటారు. కారణం అందరూ ఒకటో క్లాసు నుండి అక్కడే చదువుకుంటున్నారు, ఒక గుంపుగా కూర్చుంటారు. భోజనం స్కూలు వాళ్ళే పెడతారు కాబట్టి డైనింగ్ హాల్లో కలిసే తింటారు. ‘ఒక గూటి గువ్వలు’ అంటారే, సరిగ్గా అలా!
క్లాసులలో కాస్త వెలుగు తక్కువ ఉన్న తార మృణాళ్. ఈ అబ్బాయి ఫస్టు రాంకర్. ఎప్పుడు రాంక్ చేజారనివ్వడట. వక్తృత్వ పోటీలూ, క్విజ్‌లు మొదలైనవాటిలో మొట్టమొదట ఉంటాడు. ఇతడి గుంపులో నలుగురైదుగురుంటారు. వీళ్ళు ఎక్కువసేపు లైబ్రరీలో లేదా టీచర్ల దగ్గర మాట్లాడుతూ ఉంటారు.
పెద్దగా ఆశలూ, ఆశయాలూ లేనివాళ్ళొక పదిమంది పిల్లలున్నారు. వాళ్ళు ఏ గ్రూపుకీ చెందరు. చుట్టూ పరికిస్తూంటారు. ఎవరేం చేస్తున్నారా అని! వాళ్ళని ‘అబ్జర్వర్స్’ అని నవ్వుతూ ఎగతాళిగా పిలుస్తూంటారు. ప్రస్తుతం విద్యుత్ కూడా ఈ కోవలోనే ఉన్నాడు.
చూస్తూండగానే మూడునెలల పరీక్షలు ముగిశాయి. విద్యుత్ చూపు ఎప్పుడూ చేతన్ గుంపుపైనే. వాళ్ళ నవ్వులూ, మాటలూ, అల్లరీ ఎంతో ఆకర్షణీయంగా కనబడతాయి. టీచర్లకు వాళ్ళు పెట్టే ముద్దుపేర్లు, తమాషాగా ఆటపట్టించే తీరు విద్యుత్‌కి ఎంతో నచ్చుతాయి. చేతన్ స్నేహితుడు కావాలంటే మాటలు కాదు అసలు ఆ గుంపులో ఒకడుగా చేరడమే చాలా కష్టంట, ‘అబ్జర్వర్లు’ చెప్పారు. ఎలాగైనా సరే చేతన్‌తో జట్టుకట్టాలని ఉంది విద్యుత్‌కి.
ఒకరోజు పార్కింగ్ లాట్ దగ్గర మృణాళ్ పలకరించాడు. ‘ఏవైనా డౌట్లుంటే అడుగు, చెబుతాను’ అన్నాడు భుజం తడుతూ. నవ్వుతూ తలూపాడు విద్యుత్. అంతకు మించి మాటలేం జరగలేదు.
ఆ రోజు క్లబ్‌లో పార్టీకి తల్లిదండ్రులతో వెళ్లాడు విద్యుత్. తండ్రి కొత్త కంపెనీ మిత్రులంతా వచ్చారు. భార్యనీ, కొడుకునీ అందరికీ పరిచయం చేశాడు విద్యుత్ తండ్రి. ‘నీకు చేతన్ తెలుసా?’ అనడిగాడు తండ్రి పార్ట్‌నర్. ‘చేతన్ మా క్లాస్‌మేట్’ అన్నాడు విద్యుత్. ఆ పెద్దమనిషి జేబులో నుంచి సెల్‌ఫోన్ తీసి నొక్కాడు. ‘హలో చేతన్ నీ స్నేహితుడితో మాట్లాడు’ అంటూ విద్యుత్‌కి అందించాడు. నోటమాట రాలేదు విద్యుత్‌కి. సంతోషం, కొద్దిగా బెరుకు, నెమ్మదిగా ‘హలో చేతన్’ అన్నాడు ‘ఎవరు?’ ‘నేను విద్యుత్’ని. ‘ఓ కొత్తబ్బాయి నువ్వా? అక్కడ ముసలివాళ్ళ కంపెనీలో నువ్వేం చేస్తున్నావ్?’ నవ్వుతూ అడిగాడు చేతన్. ఫక్కున నవ్వాడు విద్యుత్. స్నేహం కలిసింది. అక్కడి నుండి విద్యుత్‌కి రోజులు క్షణాలలా గడవటం మొదలైనాయి.
చేతన్ జట్టులో చిన్నపాటి చోటు లభించినందుకు మురిసిపోయాడు. ఇతర పిల్లలంతా ‘కొత్తబ్బాయి’ కేసి ఈర్ష్యగా చూడసాగారు. ‘లంచ్’లో తనకు దగ్గరగా సీటు కేటాయిస్తే చేతన్, అదొక గొప్ప గౌరవంగా ఫీలయ్యాడు విద్యుత్.
ఆడుతూ, పాడుతూ ఆరునెలల పరీక్షలు ముగిశాయి. సెలవులిచ్చారు. ఒక రోజు విద్యుత్ తండ్రికి ఫోనొచ్చింది. క్లబ్‌లో చేతన్ పుట్టినరోజు పార్టీ ఏర్పాటు చేశారట. ‘పెద్దలకు ప్రవేశం లేదోయ్’ అన్నాడు చేతన్ తండ్రి నవ్వుతూ. కేవలం పిల్లల పార్టీట. విద్యుత్ చాలా ఉత్సాహపడ్డాడు. మంచి గిఫ్ట్ కొని అందులో సందేశం, శుభాకాంక్షలు జతచేసి చక్కగా పాక్ చేశాడు. ‘నాకు చాలా సంతోషంగా ఉంది విద్యుత్ మన హోదాకు తగిన వారితో స్నేహం చేస్తున్నాడు’ అన్నాడు తండ్రి గర్వంగా తల్లితో. వాళ్ళు బయటికి వెళ్తూ విద్యుత్‌ని పార్టీలో దింపటానికి క్లబ్‌కి చేరుకుంటున్నారు. ‘బాగా ఎంజాయ్ చెయ్యరా’ అంటూ వెళ్ళిపోయారు తల్లిదండ్రులు.
చీకటి పడుతోంది. క్లబ్ మరో ప్రపంచంలా రంగు దీపాల కాంతిలో మెరిసిపోతోంది. డెనిమ్ జాకెట్ భుజాల దగ్గరగా లాక్కుని లోపలికి అడుగు పెట్టాడు విద్యుత్. స్నేహితులు కొందరు కనబడి చెయ్యి ఊపగానే విప్పారిన ముఖంతో అటుగా నడిచాడు. క్లబ్‌కి ఒంటరిగా రావటం విద్యుత్‌కి మొదటిసారి. ఒక పెద్ద హాల్లో ఏర్పాటుచేశారు. చేతన్ పుట్టినరోజు పార్టీ చాలా ఆకర్షణీయంగా, టీనేజర్స్‌కి నచ్చే విధంగా ఉంది అక్కడి వాతావరణం. చేతన్‌ని అభినందించి చేతికి బహుమతి పాకెట్టు అందించాడు. ‘ఎందుకురా ఇవన్నీ… థాంక్స్’ తీసుకుని టేబిల్‌పై ఉంచి విద్యుత్ చెవిలో రహస్యంగా ‘ఇవాళ నీకొక స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను, కాదనకూడదు, తెలిసిందా?’ అన్నాడు చేతన్.
పిల్లలంతా చిన్న చిన్న గుంపులుగా విడిపోయి కబుర్లు చెప్పుకుంటున్నారు. అందరి చేతుల్లో కూల్‌డ్రింక్స్. లైట్లు డిమ్ అయినాయి. మ్యూజిక్ హోరు పెరిగింది. మధ్య హాల్లో డాన్సు మొదలైంది. అందరి ముఖాలలో స్నేహితుల మధ్య గడుపుతున్నామనే ఆనందం. చేతన్ అందరితోనూ కొద్ది క్షణాలు గడుపుతున్నాడు. విద్యుత్ దగ్గరకి వచ్చి చెయ్యి పట్టుకుని ఒక పక్కకు తీసుకుపోయాడు.
ఎంతో గర్వంగా అనిపించింది విద్యుత్‌కి. తనపై తన ‘హీరో’ ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నందుకు.
‘ఏరా విద్యుత్. ఇవాళ నా పుట్టినరోజు కదా. నేనేది చెప్పినా నువ్వు కాదనకూడదు’.
‘ఏమిట్రా?’ నవ్వుతూ అడిగాడు విద్యుత్.
జేబులో చెయ్యిపెట్టి ఏదో తీశాడు చేతన్. ఒక చిన్నసైజు సిగరెట్. ”ఇది చాలా విలువైందిరా మామూలు సిగరెట్ కాదు. ఖరీదు కూడా చాలా ఎక్కువ. నేను కూడా రోజూ తాగను. వన్స్ ఇన్ ఎ వే… ఎప్పుడైనా మజా చెయ్యాలనిపిస్తేనే….”
అప్రయత్నంగా ఒకడుగు వెనక్కివేసి ‘ఏ…ఏమిట్రా అది?’ అన్నాడు విద్యుత్.
‘జాయింట్ రా. చాలా ఎంజాయిబుల్ ఎక్స్‌పీరియన్స్… టెన్షన్, చికాకు అన్నీ దెబ్బకి మాయమౌతాయి. మనసంతా చాలా హేపీగా ఉంటుంది. మనవాళ్ళు అందరి దగ్గరా ఉంది. ఇవాళ అందరికీ ఎరేంజ్ చేశాను. రోజూ కాదు.. ఒన్స్ ఇన్ ఎ వే.. ఏమీ కాదు. ఊ…. కమాన్..’
‘అబ్బ, ఒద్దురా, నాకు అలవాటు లేదు…’
‘ఇక్కడ ఎవరికీ అలవాటు లేదురా బాబూ! ఎప్పుడైనా ఒక్కోసారి మాత్రం ఎంజాయ్ చేస్తాము… ఎవ్వరికీ తెలియాల్సిన అవసరం లేదు.’
విద్యుత్ చుట్టూ చూస్తున్నాడు. ఏదో అభ్యంతరం ఆ అబ్బాయిని ఆపుతోందని గ్రహించాడు చేతన్. ‘చూడరా విద్యుత్.. నిన్ను నా గ్రూప్‌లో కలుపుకున్నానా లేదా? సాధారణంగా కొత్తవాళ్ళని అసలు దగ్గరకు రానివ్వను. అంటే ఏమిటి అర్థం? నువ్వంటే నాకు ఇష్టం అని కదా! నా పుట్టినరోజు నా మాట వినవా? నా గ్రూప్‌లో ఎవ్వరూ నన్ను కాదనరు” కొద్దిగా కోపంగా, అలకగా అన్నాడు చేతన్. నిజమే, తాను కోరుకున్నట్లు తనను ఎంతో దగ్గరవాడిగా చూస్తున్నాడు.
”ఏమౌతుందిరా ఒక్కసారి.. నేను అడిగినందుకైనా… ఇంకెప్పుడూ…నెవ్వర్…అడగనే అడగను… ఈ ఒక్కసారి” సిగరెట్‌ని విద్యుత్ అరచేతిలో ఉంచి గుప్పిడి మూసి అన్నాడు చేతన్ బతిమాలుతున్నట్లు.
”పోనీ ఏం జరుగుతుంది ఒక్కసారి స్మోక్ చేస్తే… ఇంతలోనే కొంప మునిగే అలవాటుగా మారదు కదా.. నచ్చకపోతే మానెయ్యచ్చు.. ఇంకోసారి బలవంతపెట్టనంటున్నాడు కదా… కాదంటే నొచ్చు కుంటాడు. మంచి స్నేహితుడు దూరమౌతాడేమో.. ఒక్కసారేగా…” విద్యుత్ ఆలోచనలో ఉండగానే చేతన్ వేరే పిల్లల వైపు నడిచాడు. అంతా నవ్వుతున్నారు. విద్యుత్‌ని చూపిస్తూ ఏదో చెబుతున్నాడు చేతన్.
”అందరూ నన్ను చూచి నవ్వుతారేమో. నా గురించి ఏమనుకుంటారు. వఠ్ఠి సిస్సీ ఫెలో. వీడికి భయం ఎక్కువ. మనలాగా డేరింగ్, డాషింగ్ కాదు అనుకుంటారు కాబోలు. ఒక్కసారి స్మోక్ చేస్తేనేం?”…
అలా తనలో తాను ఘర్షణ పడుతూ పావుగంట గడిపాడు విద్యుత్.. చేతన్ మళ్ళీ అటుకేసి రానేలేదు. స్నేహాన్ని శాశ్వతంగా పోగొట్టుకుంటున్నానని అనిపించసాగింది. చెమటతో తడిసిన అరచేతిలో తెల్లగా అమాయకంగా కనిపిస్తున్న జాయింట్‌కేసి చూచాడు…
పార్టీ సంబరం ఆకాశాన్నంటింది.
జ జ జ జ
తలుపు పూర్తిగా తియ్యకముందే తోసుకుని లోపలికి వచ్చాడు వర్మ. అతడి ముఖంలో భయాందోళనలు.
‘ఏమిటండీ? ఏమైంది’ భుజాలు పట్టుకు కుదుపుతూ అడిగింది నీరజ.
‘మైగాడ్… ఇలా జరుగుతుందనుకోలేదు. ఎందుకొచ్చాము ఈ ఊరు?’. సోఫాలో కూలబడి తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడతడు బాధగా. దగ్గర వెళ్ళి కూర్చుందామె.
”విద్యుత్‌ని పార్టీలో దింపాము కదా. నిన్ను మీ తమ్ముడింట్లో దింపి బోర్డు మీటింగుకి వెళ్ళాను. తరువాత డిన్నర్ ముగించాము. ఇంతలో ఫోనొచ్చింది. పిల్లల పార్టీలో విరివిగా డ్రగ్స్ ఉపయోగి స్తున్నారని… ఏదో టీవీ ఛానెల్, పోలీసులు అక్కడికి చేరారట. పైగా పిల్లలంతా మైనర్లు… పరుగుపరుగున అక్కడికి చేరుకున్నాము. మనవాడు లేడక్కడ. ఏమైనట్టు? అక్కడే దించాం కదా! నాకు చాలా భయంగా ఉంది నీరజా! పిల్లల్ని సక్రమంగా పెంచగలమా అని నా మీద నాకే అపనమ్మకంగా ఉంది.”
చల్లగా నవ్వింది నీరజ.
”విద్యుత్ పార్టీలో ఎక్కువసేపు ఉండలేదండీ.. మా తమ్ముడింటికి వచ్చాడు. ఇద్దరం భోంచేసి గంటక్రితమే ఇంటికి వచ్చేశాము.”
‘థాంక్ గాడ్’ గొప్ప ప్రమాదం తప్పిన రిలీఫ్‌తో చేతులు జోడించాడు వర్మ. అతడి కళ్ళనిండా నీళ్ళు…
జ జ జ జ
మర్నాడే ఫైనల్ ఎగ్జామ్స్ మొదలు. ఏకాగ్రతతో చదువుతున్నాడు విద్యుత్. ఎలాగైనా డిస్టింక్షన్ తెచ్చుకోవాలి.
రాత్రి భోజనాలైనాయి. కాలింగ్‌బెల్ మోగితే వెళ్ళి తలుపు తీసాడు. ఎదురుగా చేతన్! ఒక్క క్షణం మాటలు రానట్లు నిలబడిపోయారిద్దరూ.
‘హలో చేతన్… రా లోపలికి’ తేరుకుని ఆహ్వానించాడు. పుట్టినరోజు తరువాత ఇదే కలవటం. చేతన్ స్కూల్‌కి రావటం లేదు బాగా చిక్కిపోయి ముఖం కళావిహీనంగా ఉంది.
‘లోపలికి వద్దులేరా. నీతో మాట్లాడదామని వచ్చాను’ గేటువైపు దారితీశారిద్దరూ. ఇబ్బందిగా కొన్ని నిమిషాలు గడిచాయి. ఏమని మాట్లాడాలో తెలియటం లేదు ఇద్దరికీ.
‘చేతన్… జరిగింది మర్చిపో’ జరిగిన దానికి బాధపడుతూ ఉండవచ్చునుకుని అన్నాడు విద్యుత్.
‘అయాం సారీరా విద్యుత్ ఆ రోజు నిన్ను.. నిన్ను.. చాలా బలవంతం చేశాను.’
ఆ రోజును తలుచుకుని నిట్టూర్చి ‘పోనీలేరా, ఇప్పుడెందుకు అవన్నీ’ ఇబ్బందిగా అన్నాడు.
”అది కాదురా, నువ్వు ఆ రోజు మొహమాటానికి పోయి నేనిచ్చిన జాయింట్ స్మోక్ చెయ్యలేదు. చాలా మంచిపని చేశావురా.. నేను చేసిన తప్పు నువ్వు చెయ్యలేదు.”
చేతన్ మాటలు అర్థంకాక అయోమయంగా చూశాడు.
”ఏడాది క్రితం నా బెస్ట్ ఫ్రెండ్, నా సీనియర్ ఒకబ్బాయి నన్ను అచ్చం అలాగే బలవంతపెట్టాడు. వాడిని ఇంప్రెస్ చెయ్యటానికీ, మిగిలిన గ్రూప్ పిల్లల ముందు గొప్ప అనిపించుకోవటానికీ నేను జాయింట్ మొదటిసారి పీల్చాను, ఒక్కసారే కదా ఏమౌతుంది అనే ధీమాతో అది ఒక తప్పనిసరి అలవాటైపోవటానికి ఎంతో సమయం పట్టలేదు. వారానికి ఒకసారైనా కావాలనిపించసాగింది. అది ఎంత ప్రమాదకరమైన వ్యసనమో తెలియటానికి ఒక పోలీస్ రెయిడ్, ఒక టీవీ ఎక్స్‌పోజర్ జరగాల్సి రావటం నా జీవితంలో ఒక మలుపు” చెప్పటం ఆపి కళ్ళు తుడుచుకున్నాడు.
విద్యుత్ మనసు బాధగా మూల్గింది. అనునయంగా చేతన్ చేతిని నొక్కాడు.
”పోలీస్ కమీషనర్ గారు డ్రగ్స్ బానిసలను ఆ వ్యసనం ఎలా పీడిస్తుందో వివరించి చెప్పి, మెంటల్ హాస్పిటల్‌లో ఉన్న ఎడిక్ట్స్‌ని చూపించారు. వాళ్ళంతా మన వయసులో ఉన్నప్పుడు ఆటగా, సరదాగా, అమాయకంగా ‘ఒక్కసారికే ఏమౌతుందిలే’ అని మొదలుపెట్టి చివరి దశకు చేరుకున్నవాళ్ళుట!
నా కళ్ళు తెరుచుకున్నాయిరా విద్యుత్ ఒంటరిగా గదిలో అవమానంతో, బాధతో అలమటించిన నాకు నువ్విచ్చిన పుట్టినరోజు బహుమతి ఒక మంచి స్నేహితుడిలా అండగా నిలిచింది.
ఆశ్చర్యంగా, సంతోషంగా చూశాడు విద్యుత్. చేతన్ మునుపటిలా లేడు. నిండుగా, గంభీరంగా ఉన్నట్లుండి పెరిగి పెద్దవాడిలా కనిపించాడు. ‘పాపులర్ టీనేజ్ హీరో’ ఆరునెలల్లో పూర్తిగా మారిపోయాడు.
దుర్వ్యసనాల బారినపడి అధోగతికి చేరుకుని, తిరిగి తిప్పుకుని మంచి మార్గంలోకి వచ్చిన కుర్రాడి జీవితకథ ఆ పుస్తకం. ఒక ఇంగ్లీషు బెస్ట్ సెల్లర్. చాలామంది ‘స్టేటస్’ చిహ్నంగా డ్రాయింగ్‌రూంలో ప్రదర్శనకు పెట్టే పుస్తకం. అదే విద్యుత్ ఇచ్చిన పుట్టినరోజు బహుమతి.
‘రేపు పరీక్ష రాస్తున్నావా లేదా?’ అడిగాడు చేతన్‌ని ‘రాస్తానురా… నిన్నొకటి అడుగుదామని వచ్చాను. నన్ను నీ జట్టులో కలుపుకోరా. నన్ను వదలకు, ప్లీజ్!’ అర్థిస్తున్న స్నేహితుడి వంక ఆప్యాయంగా చూశాడు విద్యుత్.
‘అదేమిట్రా? మనం ఎప్పుడూ స్నేహితులమే. రా లోపలికి, అమ్మానాన్నల్ని కలుద్దువుగాని’ ఆప్యాయంగా స్నేహితుడి చేతిని అందుకున్నాడు విద్యుత్.
చేతన్ ముఖం నిండా సంతోషం. పిల్లలిద్దరూ చెట్టాపట్టాలు వేసుకుని తెరిచివున్న తలుపుల వైపు నడిచారు.
చివరిమాట
‘నీ స్నేహితుడెవరో చెప్పు. నీవెవరో నేను చెబుతాను’ అన్నాడొక మహాశయుడు సాంగత్యం విలువ గురించి చెబుతూ. జీవితం ఆకర్షణల వలయం. ప్రత్యేకించి, ఎదుగుతున్న పిల్లల ఎదుట ఎన్నో ఆకర్షణీయమైన ఎరలు. మంచి, చెడుల విచక్షణ సరిగ్గా తెలియని లేతవయసు. ప్రమాదకరమైన ఆకర్షణల నుంచి ‘తప్పించుకోవటం’ మాత్రమే కాదు మనం కోరవలసింది. అటువంటి ఎరలను ఎదిరించి నిలబడగల్గటం. సరైన బాటను ఎన్నుకోగల్గటం. ముళ్ళబాటను గుర్తించి ముఖం తిప్పుకోగల్గటం.
నేటి ప్రపంచంలో పిల్లల ఆరోగ్యమైన ఎదుగుదల, తద్వారా వారి యోగక్షేమాలు వాంఛించే పెద్దలు మాదకద్రవ్యాల వంటి విధ్వంసక వ్యసనాల గురించి పూర్తి అవగాహన తాము పొంది, తమ పిల్లలకు అర్థమయ్యే విధంగా ఉపయుక్తమైన విషయాలను వారికి తెలియబరచటం వల్ల వారికి ‘అవగాహన’ అనే రక్షణకవచాన్ని ఏర్పరచిన వారౌతారు.
తల్లిదండ్రులూ జాగరూకులు కండి. పిల్లల్ని సావధానుల్ని చెయ్యండి.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags