నమ్మలేని నిజం

డి. శ్రీనివాసులు
మనది సువిశాల భారతదేశం. భిన్న సంస్కృతుల కలయిక.
మనదేశంలో స్త్రీలను గౌరవిస్తాం. ఈ రోజు అన్ని రంగాల్లో మగవాళ్ళకి సమానంగా మహిళలు అభివృద్ధి చెందుతున్నారు.
చట్టసభల్లో 33% రిజర్వేషన్‌ కోసం పోరాడుతున్నారు. దేశాన్ని పాలిస్తున్నారు కూడా. కాని ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే.
నేటికీ మన రాష్ట్రంలోని అనేక గ్రామాల్లో ఆచారాల పేరుతో తరతరాలుగా ఎందరో అమాయక స్త్రీలను దారుణంగా దోచుకుంటున్నదీ జోగిని వ్యవస్థ. ప్రభుత్వం ఎప్పుడో నిషేధించిన జోగిని దురాచారం నేటికీ కొనసాగుతోంది. స్త్రీని ఆటవస్తువుగా చేసి దేవుని పేరిట పెద్ద మనిషికి అర్పించే వికృతం వెర్రితలలు వేస్తుంది. అధికారులు మత్తులో జోగుతుంటే, జోగిని నడివీధిలో నాట్యమాడుతోంది. పశువుకన్నా హీనం జోగిని వ్యవస్థ. రెండువేల ఏళ్ళనాటి ఫ్యూడల్‌ వ్యవస్థ అవశేషం.
పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రముఖ సామాజిక సంస్కర్తల పోరాటం మేరకు 1988లో స్వర్గీయ నందమూరి తారకరామారావుగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ దురాచారాన్ని మన రాష్ట్రంలో నిషేధించారు. కాని అమలుపర్చడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమయింది. నేటికీ కేవలం మన రాష్ట్రంలోనే సుమారు 24 వేల మంది జోగినిలున్నారని అంచనా. మరి దేశమంతా కలిపితే???
ఈ వ్యవస్థ మనదేశంలో రకరకాల పేర్లతో కొనసాగుతోంది. కేరళ రాష్ట్రంలో వీరిని ”మహారి” అని, అస్సాంలో ”నాటి” అని, మహారాష్ట్రలో ”మురళి” అని, తమిళనాడులో ”తెవర్‌డియార్‌” అని, కర్ణాటక మరియు మన రాష్ట్రంలోని రాయలసీమ జిల్లాల్లో ”బసవి” అని పిలుచుకుంటారు. అంతేకాకుండా మన రాష్ట్రంలోని ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, హైద్రాబాద్‌ జిల్లాల్లో ”జోగిని” అని.
కరీంనగర్‌ జిల్లాలో పార్వతీ అని,  నెల్లూరు, చిత్తూరు జిల్లాలో మత్తామ్మ లేదా తామమ్మ అని కూడా పిలుస్తుంటారు. ఈ వ్యవస్థను గూర్చి తెలుసుకోవడం అంటే ఎందరో అమాయక స్త్రీల నిలువెత్తు కన్నీటి గాథలను తెలుసుకోవడమే.
ఒక ఆడపిల్లను జోగినిగా మార్చాలంటే కేవలం ఒక చిన్న సాకు చాలు. ఆ సాకు పిల్లలు కలగలేదని, పుట్టిన పిల్లలు చనిపోతున్నారని, లేదా ఇంట్లో వారికి ఏదో ఒక జబ్బు వచ్చిందని, ఇలా కారణం ఏదైనా కావచ్చు. సందర్భం ఏమైనా కావచ్చు. ఆ పసిపిల్ల తల్లిదండ్రులు మనసులో ఎల్లమ్మదేవతో, పోచమ్మనో తలచుకొని తమ సంతానాన్ని జోగి ఇడుస్తామని మొక్కుకుంటారు. అలా అనుకొని ఆ దేవత పేరు మీద ముడుపులు కడతారు.
ఇక అప్పటినుండి వారి జీవితాల్లో మార్పు వస్తే అమ్మవారి మహిమని, మార్పు రాకపోతే ఇంకా అమ్మవారికి మనసు కరగలేదని అనుకుంటూ ఆ పసిపిల్లను పూర్తిగా జోగిని వ్యవస్థలోకి దింపటానికి కావలసిన తదుపరి కార్యక్రమాలను అమలుచేస్తారు. జోగినిగా మార్చబడిన స్త్రీకి తాను చనిపోయేవరకు పాటించాల్సిన కొన్ని నియమాలు ఉంటాయి. మరికొన్ని కార్యక్రమాలను కూడా ఆమె నిర్వహించాల్సి ఉంటుంది. ముందుగా తల్లిదండ్రులు, కులపెద్దల సమక్షంలో తొలిఘట్టం ఐదారేళ్ళ వయస్సులో నిర్వహిస్తారు. పోతురాజు మంత్రాలు, డప్పుల మోతల మధ్య ఈ తంతు నిర్వహిస్తారు.
ఆ అమ్మాయి రజస్వల అయిన తర్వాత మైలపట్టం అనే కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. పోతురాజు సారథ్యంలో తోటి జోగిని స్త్రీల నృత్యాలతో, ఎల్లమ్మ గుడి దగ్గర కాని, ఆమె ఇంటి దగ్గర కాని నిర్వహిస్తారు.
పసుపు, కుంకుమ పోసిన పట్టంలో కూర్చుండబెట్టి, మంత్రాలు చదివి, మేకపోతును, గావుపట్టి (గావుపట్టడం అంటే మేకపోతు పీకను పోతురాజు తన పంటితో కొరికి చంపడం) ఆ రక్తతర్పణం, బీభత్స వాతావరణం మధ్య ఆ ఊరి పెద్దమనిషి చేతగాని, పోతురాజు చేతగాని, బావ వరుసైన వ్యక్తి చేతగాని తాళి కట్టించి ఆ మైలపట్టం కార్యక్రమాన్ని పూర్తిచేస్తారు.
అప్పటి నుండి సహజంగా పెత్తందారు అయిన వ్యక్తి ఆమెను తన లైంగిక కోరికలు తీర్చుకోవడానికి వాడుకుంటాడు. (కొన్ని గ్రామాల్లో ఒక్కడే కొంత మంది జోగినీలకు తాళికట్టి అందరితోటి గడపడం జరుగుతుంటుంది.) ఆమె కూడా ఆ పెద్దమనిషి మీద ఆధారపడి, శవంలా జీవితం గడపడం జరుగుతుంది. సహజంగా యవ్వనం అనుభవించిన దాకా వాడుకొని ఆ పెద్దమనిషి ఆమెను వదిలిపెడ్తుంటాడు. ఇక అప్పటి నుండి ఆమెకు దారుణకష్టాలు మొదలవుతాయి.
తిని పడేసిన విస్తరి కోసం కుక్కలు కోట్లాడుకొని ముక్కలు చేసినట్లు ఉంటుంది ఆమె పరిస్థితి. గ్రామంలో ప్రతి ఒక్కడు ఆమెను లైంగికంగా వేధించేవాడే. ఆమె జీవితం ఆమె చేతిలో ఉండదు. ఆమె జోగినిగా తన బాధ్యతలు నెరవేర్చకపోతే కులపంచాయితీలు ఆమె సంగతి చూసుకుంటాయి. ఎటూ తప్పించుకోలేని సాలెగూడు లాంటి పరిస్థితిలో ఆమె చిక్కుకుని ఉంటుంది. కనీసం తనకు పుట్టిన పిల్లలకు తండ్రి ఎవరో చెప్పలేని పరిస్థితిలో దారుణ మానసిక వేదనను అనుభవిస్తూ ఉంటుంది. ఒక్కోసారి తినడానికి తిండిలేక గ్రామంలో ఇంటింటికి తిరిగి అడుక్కొని తినాల్సి ఉంటుంది.దీనికి తోడు గ్రామంలో ఎవరు చనిపోయినా ఆ ఇంటికి వెళ్ళి ఉపవాసంతో కేవలం కల్లు తాగుతూ గడిపి, ఆ శవం ఇంటి దగ్గర నుండి శ్మశానం వరకు నృత్యం చేసుకుంటూ వెళ్ళాలి. మార్గమధ్యంలో జనాలు విసిరే చిల్లర పైసలను నుదురుతోను, కంటిరెప్పలతోనూ తీసుకుంటూ ఉండాలి. కల్లుసీసాను నోటితో లేపాలి. ఎవరు ఎలా చేయమంటే అలా చేయాలి. తన శరీరాన్ని ఎక్కడ తాకినా కిమ్మనకుండా ఉండాలి. కనీస వ్యక్తిత్వ స్పృహ కూడా ఉండని ఒక ప్రత్యేక భయంకర స్థితిలో ఆ జోగిని స్త్రీ ఉంటుంది. అంతేకాకుండా గ్రామంలో ఏ చిన్న జాతర జరిగినా, ఊరి పండుగలు జరిగినా ఆమె నృత్యం చేయాల్సి ఉంటుంది. ఒక వేళ కుదరదు అంటే కుల పంచాయితీలు ఏం చేస్తాయో అప్పటికే ఆమెకు అర్థం అయి ఉంటుంది.
చివరకు అంతులేని సుఖవ్యాధులకు, తీవ్ర అనారోగ్యానికి గురై అవసానదశలో అతిదుర్భరమైన జీవితాన్ని చాలిస్తుంది ఆ జోగిని. ఆమె చనిపోయిన తర్వాత మళ్ళీ ఆమెకు పుట్టిన బిడ్డ పరిస్థితి కూడా అంతే.ఈ ఆధునిక సమాజంలో సైతం ఈ వ్యవస్థ తన ఉనికిని కొనసాగించగల్గుతుందనడానికి ఇటీవలి కాలంలో వార్తల్లో, పేపర్లలో వచ్చిన కథనాలే సాక్ష్యం.
ఇకనైనా మనం మారి ఈ వ్యవస్థను మారుద్దామని ఆశిద్దాం.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.