హేమ
రాజ్యాంగం నిర్వచించిన పరిధిలో ప్రజల కొరకు ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలను పొందుపర్చి ఆమోదించినప్పటికి వారి హక్కులు పథకం ప్రకారం ఉల్లంఘనకు గురవుతూనే వున్నాయి. యిపుడు జరుగుతున్న భారీస్థాయి ఉల్లంఘనలు ప్రపంచంలో మరెక్కడా ప్రస్తుతం గానీ, గతంలో గానీ కన్పించవు. అయినప్పటికి ప్రభుత్వం, కోర్టులు, జాతీయ అంతర్జాతీయ సంస్థలు, మానవహక్కుల కమీషన్లు పట్టించుకున్న దాఖలాల్లేవు.
అన్ని మానవ హక్కులు అందరికి అనే నినాదంతో కులం, మతం, జాతి, జండర్, తెగ వంటి వాటితో నిమిత్తం లేకుండా ఒక అవిభాజ్యమైన, మానవత్వానికి సంబంధించిన అంశంగా మానవహక్కుల్ని ప్రపంచం గుర్తించింది. అయితే ప్రశ్నల్లా అన్ని మానవహక్కులు విశ్వజనీనమైనవి, అవిభాజ్యమైనపుడు అవి పౌరులందరికి సమాన గుర్తింపు, ప్రతిపత్తిని యిస్తున్నాయా…అన్నదే?
ప్రపంచీకరణ నేపథ్యంలో అనేక రూపాలలో పౌర, రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక హక్కులకు తూట్లు పడ్డాయి, పడుతున్నాయి కూడా. పాలకవర్గాలు పెట్టుబడిదారి వర్గంతో కుమ్మక్కై, అంతర్జాతీయ ఒప్పందాలకు లోబడి వుంటామని ఒప్పుకొని కూడా దేశంలో ప్రజాస్వామ్యం సాక్షిగా జీవించే హక్కు, సమానత్వం, సౌభ్రాతృత్వానికి తిలోదకాలు యిచ్చి తమకున్న మెజార్టీ బలంతో ప్రజావ్యతిరేక చట్టాలు చేసి జాతీయ వనరులను బహుళజాతి కంపెనీలకు అప్పగిస్తున్నారు. సెజ్ చట్టం, పి.సి.పి.ఐ. పాలసీలు కొన్ని ఉదాహరణలు మాత్రమే. దేశంలో పేదరికం, నిరుద్యోగం తొలగించటానికి అభివృద్ధి అవసరమంటూ, ఈ అభివృద్ధి ప్రైవేటు సంస్థలు, బహుళజాతి కంపెనీలు మాత్రమే సాధించగలవని ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. అభివృద్ధికి నిదర్శనం పరిశ్రమలే అని పారిశ్రామికీకరణ ముసుగులో సామాజిక వనరులన్నీ పెట్టుబడిదారి వర్గానికి అప్పగించడాన్కి ప్రభుత్వం చేయని తప్పిదాలు అంటూ లేవు. ఈ వైకుంఠపాళిలో రెవెన్యూ, పోలీసు, చివరకు న్యాయవ్యవస్థ పావులు మాత్రమే. ఈ ఆటలో మానవ హక్కులు, విధివిధానాలు, చట్టాలు,అ అన్ని పెట్టుబడిదారివర్గాలు మింగేస్త్తాయి. కాకరాపల్లి యిందుకు ఒక ఉదాహరణ మాత్రమే.
రాష్ట్రానికి ఉపయోగపడని ప్రైవేటు థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు సముద్రతీరంలో 20,000 మెగావాట్లకు అనుమతి ఇచ్చింది. అందులో శ్రీకాకుళం జిల్లాలో 8000 మెగావాట్లకు అనుమతి మంజూరయ్యింది. యివన్నీ మర్చంట్ పవర్ ప్లాంటులే. యిందులో భాగంగానే 2640 మెగావాట్ల భావనాపాడు థర్మల్ విద్యుత్ కేంద్ర నిర్మాణం. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలంలో ఆకాశలక్కవరం, వడ్డివాడ, కాకరాపల్లి, మేఘవరం, జొన్నలపాడు, కొల్లిపాడు, మరువాడ, నందిపేట, వడ్డితాండ్ర, అంట్లవరం, పోతునాయుడుపేట, హనుమంతునాయుడుపేట, కొత్తూరు, కోటపాడు, డిజిపురం, లింగూరు, మూలపేట, రెయ్యిపేట, నగిరి పెంట గ్రామాలకు మధ్యభాగంలో ‘కాకరాపల్లి తంపర (స్పాంజ్)’ 7000 ఎకరములలో వుంది. అసలు విషయానికొస్తే 1974లో 3470.90 ఎకరాలు తంపరభూమి, కాకరాపల్లి, వడ్డితాండ్ర, కొట్టుపాడు, అంట్లవరం, హనుమంతునాయుడుపేట, ఆకాశలక్కవరంలో వున్నట్టుగా ప్రభుత్వం గుర్తించి జీ.వో. ఎమ్మెస్ నం.844 (రెవెన్యూ) (సి) తేది 3-08-1974న ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌కు 99 సంవత్సరములకు మాంగనీసు తయారుచేయటానికి యిచ్చింది. మరల యిదే సంస్థ అభ్యర్ధనతో మెమో నం.68/75 తేది 6-09-1976న ఈస్ట్‌కోస్ట్ సాల్ట్ & కెమికల్స్ ప్రయివేటు లిమిటెడ్‌తో ఉప్పు తయారీ పరిశ్రమకు అనుమతినిచ్చింది. ఆ సంస్థ లీజు డబ్బు చెల్లించకపోవడంతో 774 తేది 10-08-93 ఆ ఉత్తర్వులను రద్దు చేసింది. తరువాత క్రమంలో ఈ భూమి వ్యవసాయానికి పనికిరాదని వాణిజ్యపరమైన మొక్కల పెంపకానికి ఫారెస్టు డిపార్టుమెంటు అప్పగిస్తే దాన్ని తిరిగి వాపసు చేయడం జరిగింది. యిదే భూమిని జీ.వో.నెం.1108(రెవెన్యూ) 15-09-2008న ఏ.పి.ఐ.ఐ.సికు రూ.85,000లకు ఎకరం చొప్పున బదలాయించారు.
అయితే 1948 నుంచి మత్స్యకారులు పూరీజగన్నాథ ఫిషర్‌మెన్ కో-ఆపరేటివ్ సొసైటీని రిజిష్టర్ చేసుకుని ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని తంపరలో చేపలవేట చేసుకొని బ్రతుకుతున్నారు. భావనాపాడు థర్మల్ విద్యుత్ కేంద్ర నిర్మాణానికి అనుకూలంగా మత్స్యకారులకు లీజు రద్దు చేశారు. కంపెనీ సుమారు 2000 ఎకరాల చుట్టూ కందకం త్రవ్వి వారి స్థలానికి ‘మట్టిగడ్డ’ను వేసుకోగా చుట్టుప్రక్కల ఎకరాల ముంపుకు గురయ్యాయి. మున్ముందు భారీ తుఫానులు, వర్షాలు, సునామీలు వస్తే ఈ గట్టు వలన పంటపొలాలతో పాటు ప్రజల ప్రాణానికి, పశుపక్ష్యాదులకు తీవ్ర నష్టం కల్గుతుంది. 2002వ సంవత్సరంలో వచ్చిన ఎ.పి. వాల్టా చట్టం ప్రకారం సర్ఫేస్ వాటర్‌కు ఎటువంటి అడ్డంకులు చేయకూడదని చెబుతుంది. థర్మల్ విద్యుత్ కర్మాగారం ఈ గట్టు ఏర్పాటు వలన గరీబులగెడ్డ, దేసిగడ్డ, టెక్కలి క్రింద నుండి వచ్చే వరద నీరు కాకరాపల్లి తంపర చుట్టూ ఉన్న పొలాలను ముంపుకు గురిచేసి సముద్రంలో ముఖద్వారం వద్ద కలుస్తుంది. ఈ ప్లాంట్ నిర్మాణం వలన వచ్చే మురుగు, వ్యర్థ పదార్థములు బూడిద వలన సముద్రం నీరు కలుషితమై మత్స్య సంపదకు నష్టం కలుగుతుంది. ఇంతేనా తుంపరలో మొలిచే తుంగలాంటి గడ్డిని, జనుముని పూరిళ్ళ పైకప్పుకు ఉపయోగిస్తారు. ఎన్నో కుటుంబాలకు ఇదొక ఉపాధి. ప్రాజెక్టు యాజమాన్యం ఈ తుంగ చావటానికి మందులు చల్లారు. తుంగతో పాటు చేపలు చచ్చిపోయాయి. ఈ విధమైన చర్యలు స్త్రీలు, దళితులు, మత్స్యకారుల హక్కులకు తీరనిదెబ్బ.
ఈ ప్రాజెక్టు వలన మానవ హక్కుల ఉల్లంఘననేనా! పశుపక్ష్యాదుల హక్కుల ఉల్లంఘన కూడా జరిగింది. ఈ ప్రాంతానికి చెందిన తేలినీలాపురానికి దేశవిదేశాలనుంచి 122 రకాల అరుదైన పక్షులు వలస వస్తాయి. ప్రభుత్వం 3400 ఎకరాలు వాటికి ఆవాస కేంద్రంగా గుర్తించింది కూడా. నేవాడ పర్యావరణ కేంద్రంలో సముద్రం నుంచి ఒక కాలువ వుంటుంది. దాని ద్వారా ఉప్పునీరు చేరి వర్షాకాలంలో వచ్చే మంచినీటిలో కలుస్తుండటంతో అరుదైన మత్స్యసంపదకు కారణమవుతుంది. ఈ ప్రాజెక్టు వలన ఈ జీవరాశులు అన్ని చనిపోతాయి. అంతర్జాతీయ ఒప్పందాలు, జాతీయ విధివిధానాలు నియమ నిబంధనలు ఉన్నా అన్ని ప్రాజెక్టు కోసం గాలికి వదలేసారు. మానవ హక్కులకే చేటు వాటిల్లుతున్న ప్రజాస్వామ్యంలో యిక పశుపక్ష్యాదుల హక్కుల గురించి ప్రశ్నించడం కాదు మాట్లాడటం కూడా దురాశే అవుతుందేమో?
చీఫ్ కమీషనర్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ప్రొసీడింగ్స్ డి.2/2225/2003 తేది: 20-07-2003 ప్రకారం నీటి వనరుల్ని, వాటి ద్వారా నీరు అందుతున్న భూమి వివరాలను ప్రొహిబిటరీ ఆర్డర్ బుక్‌లో జిల్లా అధికారి నమోదు చేసి రక్షణ చేయాలి. రాష్ట్ర యంత్రాంగం వీటిని వ్యవసాయ యోగ్యం కాని మెట్ట భూములుగా నిర్ధారించి ప్రాజెక్టులకు యిచ్చేసింది. ప్లాంటులో ఆవిరయిన నీటిని కూలింగ్ టవర్లలో చల్లబరచి ధ్రువీకరణ చేసి వాడుకున్న, సముద్రంలోకి పంపినా దాని ఉష్ణోగ్రత వలన నీరు వాతావరణ వేడెక్కిపోతుందని ప్రాజెక్టు కడుతున్న యాజమాన్యానికి తెలుసు. ఒక్కసారి ఈ నేలను ధ్వంసం చేసి కాంక్రీటు వేస్తే భూమిలో ఉన్న కార్బన్-డై-ఆక్సైడ్‌ను తమలో ఇముడ్చుకుంటాయి. కర్బన వ్యర్ధాలు, గ్లోబల్ వార్మింగ్ గురించి ప్రపంచానికి తెలియజేసిన రామసర్ ఒప్పందాలలో భారత ప్రభుత్వం కూడా భాగమే. ఈ ద్వంద్వ నీతిలో ఎంత అవినీతి పాలు ఉన్నాయో ప్రశ్నించేవారు లేరని పాలకవర్గాలు భ్రమపడ్డాయి.
భోపాల్ విషవాయు దుర్ఘటన తర్వాత రూపొందించిన పర్యావరణ చట్ట ప్రకారం నిపుణుల పరిశీలన లేకుండా ఏ పరిశ్రమ ప్రతిపాదనలు ఆమోదించకూడదు. రాష్ట్రప్రభుత్వం తప్పుడు సమాచారంతో పర్యావరణ మంత్రిత్వశాఖ 2009 ఏప్రిల్ తొమ్మిదిన అందుకు అనుమతిచ్చినా కొన్ని షరతులు (ప్రమాణాలు) పాటించాలని ఆదేశించింది. ఈ షరతులు పాటించలేదని చిత్తడి నేలల్లో ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ అనేక అభ్యంతరాలు వచ్చాయి. ఆగష్టు 30, 2010న జాతీయ పర్యావరణ అప్పిలేటు అథారిటీ నుంచి ఆదేశం జారీ చేసింది. అయినా కంపెనీ ఖాతరు చేయలేదు.
ఇంకో విషయమేమంటే పరిశ్రమల ప్రతిపాదనలను ప్రజల ముందుంచి బహిరంగ విచారణ జరపాలి. అందుకు పరిశ్రమ తాలూకు లాభనష్టాల్ని ప్రజల ముందుంచాలి. అయితే 23-04-2008న జరిపిన పబ్లిక్ హియరింగ్‌లో ప్రాజెక్టు సంబంధిత డబ్బు లెక్కలు ప్రజల ముందుంచింది గానీ ప్రాజెక్టు మంచి చెడులను వాటి పర్యవసానాలను దాచిపెట్టింది. ఇతర ప్రాజెక్టులను సందర్శించిన స్థానిక నాయకులు కరపత్రాలు వీడియోల ద్వారా జరగబోయే దుష్పరిణామాలను ప్రజలకు తెలియజేసాయి. తీర ప్రాంత నియంత్రణ మండలి (సి.ఆర్.జెడ్) నిబంధనల ప్రకారం సముద్రం నుండి 500 మీటర్ల దూరం రక్షిత ప్రాంతంగా జీవావరణంలో సున్నితమైన ప్రాంతంగా ప్రకటించడం, అలానే తీరంలో ఉన్న ఉప్పునీటి కయ్యలు, ఆయా ప్రాంతాల జలాశయాలు పర్యావరణ పరిరక్షణకు ఆయా ప్రాంతా హెచ్.టి.ఎల్. నుండి వంద మీటర్ల వరకు రక్షిత ప్రాంతంగా ప్రకటించిన విషయాలపై ప్రజల్ని చైతన్యపరచారు.
కాకరాపల్లిలో చైతన్యవంతమైన ప్రజలు స్థానిక నాయకత్వంలో వివిధ కోర్టులను, మానవ హక్కుల కమీషన్‌ను న్యాయం కొరకు ఆశ్రయించారు. వీరికి న్యాయం అందచేయడంలో న్యాయస్థానాలు, కమీషన్‌లు తాత్సారం చేసినప్పటికి, పోలీసు శాఖ మాత్రం తాత్సారం చేయలేదు. ఉద్యమకారులపై కక్ష్య సాధింపు దిశగా అక్రమ కేసులు బనాయించడంతో పాటు రౌడీషీట్లు తెరిచాయి. అందులో న్యాయవాదులు, ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. ప్రాజెక్టుపై నిరసన తెలిపిన ప్రతిసారి ఐ.పి.సి. నాల్గు, ఐదు సెక్షన్‌లతో కేసులు బనాయించడం పోలీసులకు పరిపాటి అయ్యింది. దళిత పేద వర్గాలకు ఆశలు చూపించి నాయకులపై వ్యతిరేక స్టేట్‌మెంట్లు ఇప్పించారు. ఈ విషయమై నాయకులు మానవ హక్కుల కమీషన్‌లో పిటిషన్ వేసుకొని తమ వేదనను మొర పెట్టుకున్నారు. ఒకవైపు వివిధ కోర్టులను, అధికార యంత్రాంగాన్ని అభ్యర్ధిస్తూనే ఆగష్టు 15, 2010న రిలే నిరాహారదీక్షతో తమ సామూహిక నిరసనలను తెలియచేయడం మొదలుపెట్టారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోగా, కాకరాపల్లి నుండి ఈస్టుకోస్టు పవర్ ప్లాంటుకు వెళ్ళే దారిలో తంపర నుండి సముద్రంలోకి ఉన్న వాగు మీద రోడ్డు వేశారు. దాన్ని ప్రజలు ప్రతిఘటించి రోడ్డు తవ్వేశారు. 17-02-11న విచారణకు వచ్చిన ఆర్.డి.ఓపై పథకం ప్రకారం కంపెనీ గుండాలు దాచి వేేసారు. దానిని గ్రామస్థులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మత్స్యకార నాయకుడు ఖత్రో, దువ్వాడ శ్రీనివాస్‌లకు దెబ్బలు తగిలాయి కూడా. ఈ సహాయ నిరాకరణ బాటలో ఆర్.డి.వో. పాత్ర ప్రజా ప్రతికూలమే. ఇదే అవకాశంగా కంపెనీ ఒత్తిడిపై పోలీసు యంత్రాంగం డి.ఐ.జి. విశాఖపట్నం ఆధ్వర్యంలో గ్రామంలో కవాతు నిర్వహించి మోహరించారు. ముందు జాగ్రత్త చర్యల పేరిట 144 సెక్షన్ విధించి ప్రజలను కట్టుదిట్టం చేశారు. అఖిలపక్షంతో సహా నాయకులందరూ అధికార యంత్రాంగాన్కి, ప్రభుత్వాన్కి విన్నవించుకున్నా లాభం లేకపోయింది.
25 ఫిబ్రవరి 2011న వడ్డితాండ్రలో జరిగిన పోలీసుల భీభత్సం గురించి మీడియానే సాక్షి. వడ్డితాండ్ర గ్రామస్థులు ఇతర ప్రాంత ప్రజలు ఏర్పాటు చేసుకున్న నిరసన శిబిరాన్ని కూల్చేశారు. బాష్పవాయువు ప్రయోగాలు లాఠీచార్జీలతో వడ్డితాండ్ర మారుమ్రోగింది. లక్షల రూపాయలు ఖరీదు చేసే వరికుప్పలు కొన్ని దుకాణాలను, ఇళ్ళను బూడిదపాలు చేశారు. ప్రజలు భయంతో తలుపులు వేసుకొని దాక్కుంటే పొగబాంబులు తలుపు సందుల్లో పెట్టి భయభ్రాంతులను చేసి బయటకు లాగారు. ఒక మహిళా నాయకురాలి మాటల్లో అయితే అనేక బూతుమాటలు తిట్టి పొలాల్లోకి తరిమేశారు. పొలాల్లో వున్న పోలీసులు ప్రజల్ని తిరిగి గ్రామంలోకి తరిమేశారు. యిలా ప్రజలతో వారి హక్కులతో కబడ్డి ఆడుకున్నారు. స్త్రీలతో అసభ్యంగా ప్రవర్తించరాదనే ప్రత్యేక చట్టాలు వున్నా అవి పోలీసులకు జ్ఞాపకం రాలేదో వచ్చినా వద్దనుకున్నారో పిచ్చెక్కిన పశువుల్లా ఆడా మగా తేడా లేకుండా ప్రజలపై పడ్డారు. తాగారు, అందిన కాడికి దోచుకున్నారు. రోడ్డుమీద పోతున్న వారిని బజారులో నిలబడ్డవారిని ఒక్కరనేమిటి దొరికిన వారిని దొరికినట్టుగా స్త్రీలు, పిల్లలు, వృద్ధులు అనే తేడా లేకుండా పోలీసుస్టేషన్లను నింపేసారు. ఒక జైలు సరిపోకపోతే రెండు మూడు జైళ్ళలో నింపేసారు.
అదే రోజు పోలీసుల దాష్టీకానికి తట్టుకోలేక మానవహక్కులను కాపాడటానికి ఏర్పడ్డ మానవ హక్కుల కమీషన్లలోనైనా హక్కులు కాపాడబడతాయని ఆశించి తమ నాయకుల ద్వారా ప్రజా ఉద్యమాల సంఘీభావ కమిటి, మత్స్యకార సంఘాల ద్వారా తేది:28-02-2011 నాడు కమీషన్‌ను ఆశ్రయించారు. కమీషన్ ఎంత వేడుకున్నా, న్యాయవాది వాదనలు వినటానికి కూడా తిరస్కరించింది. కమీషన్ టైమ్ ముగిసేంత వరకు కూడా అభ్యర్ధిస్తున్నా ఫలితం లేకపోయింది. ఒక దుర్మార్గమైన, మానవత్వం లేని సమాధానం కమీషన్ నుంచి ఏమిటంటే ప్రజలు మొరలు కంటే నిజానిజాలు పోలీసుల దగ్గర్నుంచి వచ్చేంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోమని నిర్ద్వందంగా తోసిపుచ్చి మార్చి 7 తేది నాటికి వాయిదా వేశారు. మానవత్వం ఫిబ్రవరి 26, 27వ తారీఖులలో కాకరాపల్లి ప్రాజెక్టు చుట్టుప్రక్కల ప్రజలు ప్రాణాల్ని గుప్పెట్లో పెట్టుకొని బ్రతికితే యిక్కడ కొన్ని ప్రజాసంఘాల న్యాయవాదుల సమన్వయంతో మానవ హక్కుల కమీషన్‌తో ప్రచ్ఛన్నయుద్ధానికే తయారయ్యాం.
మరొక అనుబంధ పిటిషన్‌ను తయారుచేసి వేయటానికి 28-02-11 తేదిన ఈ కమీషన్ గుమ్మం ఎక్కక ముందే తెలిసిన విషయమేమంటే పోలీసులు గ్రామాలలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఏ క్షణాన ఏమైనా జరగవచ్చని కమీషన్లో అదే పద్ధతి… అదే నిర్లక్ష్యం. ప్రతి రోజు చావులు చూసే కాటికాపరి ధోరణి, మళ్ళీ బ్రతిమాలటం…వేడుకొనటం మరిన్ని సెకన్లు తిరిగే లోపల పోలీసుల కాల్పుల్లో ఒకరు మరణించారని వార్తతో మళ్ళీ పిటిషన్ కరెక్షన్‌తో ఈసారి కమీషన్ కోర్టు హాలులోని ప్రజాసంఘాల నాయకులతో బైటాయించాం. ప్రతి కేసును రిపోర్టులకోసమో, కోట్టివేయబడుతూనో విచారణ సాగుతుంది. యుద్ధానికి ముందు ప్రశాంతత మాలో నెలకొని ఉంది. అన్ని కేసులు ముగిసిన తర్వాత బలవంతంగా మేమే న్యాయాధిపతి ముందుకెళుతుంటే… మరో వార్త, కాల్పుల్లో యింకొకరు చనిపోయారని, కొన్ని ప్రొసీజర్లు కారణాలవలన కేసు లంచ్ తర్వాత వాయిదా. మనుష్యుల బ్రతుకులకంటే వారి జీవించే హక్కు కంటే ఈ ప్రొసీజరు ఎంత ముఖ్యమైనవి ఎంత దుర్మార్గమైనవి! క్షణం క్షణం ఏమవుతుందోనని ఆందోళనలో వున్న మాకు ఈ న్యాయవ్యవస్థని శాసించే శక్తి ఎందుకు లేకుండా పోయింది కదా అన్న వాదోపవాదాల మధ్య లంచ్ టైమ్ కూడా గడిచిపోయింది. మా వాదనలలో ముఖ్యంగా గ్రామాలలో మోహరించి అత్యంత కిరాతకంగా జలియన్‌వాలాబాగ్‌ను మరిపిస్తూ రెండు ప్రాణాలు బలిగొని ఎందర్నో క్షతగాత్రులను చేసిన పోలీసు బలగాల్ని వెనక్కి పంపాలని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని కాల్పులు జరిపిన పోలీసులపై హత్యా, దౌర్జన్యం, లూఠీ, స్త్రీలపై అసభ్య ప్రవర్తనపై కేసులు పెట్టాలని, తక్షణమే కమీషన్ వేయాలని, ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేసి, జైళ్ళలో వున్నవారిని విడుదల చేయాలని వాణిని విన్పించాం. దానికి కమీషన్ స్పందించిన తీరు, అధికారిక ప్రభుత్వ ప్రతినిధి స్పందనకు తేడా లేదు. ఎన్నో వాదోపవాదాలు సోంపేట తీర్పు పరిశీలించి చూసిన తరువాత రెండు విషయాలపై కమీషన్ మధ్యంతర తీర్పునిచ్చారు. పోలీసు బలగాలు ప్రజల్ని హింసించకూడదని, తక్షణమే క్షతగాత్రులకు ఉచిత వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. కమీషన్‌ను వేయలేని పరిస్థితులలో మేమే ప్రజల వద్దకు వెళ్ళి నిజనిర్ధారణ చేసి రిపోర్టు చేస్తామన్నందుకు మౌఖికంగా ఒప్పుకున్నారు. ఆ తర్వాత రోజు మరిన్ని బలగాలు పెరిగాయి కూడా.
ప్రజల నుంచి సమాచారాన్ని సేకరించటానికి కలిసి కాకరాపల్లి ప్రాజెక్టు ప్రాంతానికి వెళ్ళినప్పుడు మరిన్ని సత్యాలు విస్మయపరచాయి. వడ్డితాండ్ర గ్రామానికి వెళ్ళినపుడు అప్పుడే వచ్చిన వైద్యబృందాన్ని చూసి ఆశ్చర్యపోయాం. ఆరోజు వరకు అంటే 04-03-2011 వరకు వారికి కమీషన్ ఆదేశాలు అందలేదని విని ప్రభుత్వం యొక్క నిబద్ధత గురించి యిక ప్రశ్నించదల్చుకోలేదు. స్త్రీలు పురుషులు తమపై జరిగిన లూఠీ, దౌర్జన్యం, దెబ్బలు గురించి చెబుతుంటే ప్రజాస్వామ్య దేశంలో ప్రాథమిక హక్కుల గురించి మరింత వివరణ యిచ్చి వారిని జాగృతపరచా లన్పించింది. కమీషనరుకు చూపించటానికి రబ్బరు బుల్లెట్లను, పొగబాంబులను పోలీసులు వాడిన బ్రాందీ సీసాలను యిచ్చారు. కమీషన్‌లో న్యాయం చెయ్యాలని ప్రజలు చేతులెత్తి నమస్కరించినప్పుడు ఈ చట్టాలు కోర్టులు కమీషన్లు ఒక వర్గానికి సంబంధించినవే అని ఎలుగెత్తి చెప్పాలనిపించింది.
ఆ తరువాత ఆకాశలక్కవరంలో అమరుల సభలో ముఖ్యంగా కుటుంబ సభ్యులను కోల్పోయిన జి. నాగేశ్వరరావు, ఎర్రన్నల కుటుంబంలోని వారి వేదన, వారి నినాదాలు ప్రతిధ్వని ఈ వ్యవస్థలో ప్రకంపనలు పుట్టిస్తాయని నమ్మకం కలిగింది. నర్సన్నపేట జైలుకు వెళ్ళినపుడు 80 ఏళ్ళ మత్స్యకార మహిళను కూడా ఎంతటి తీవ్రవాదిగా ప్రభుత్వం గుర్తిస్తుందో అర్థమయ్యింది. 17-02-11న ఆర్.డి.ఓను గూండాలనుంచి కాపాడినందుకు బహుమతిగా మత్స్యకార నాయకుడు ఖత్రో డి. శ్రీనివాస్‌లను జైలుపాలు చేశారు. జైలుకు వెళ్ళే ప్రతి ఒక్కరి ఆరోగ్యం సరిగ్గా వుందని నిర్ధారణ చేయాలి కాని దానికి భిన్నంగా యిక్కడ జరిగింది. యికపోతే గాయపడినవారికి దెబ్బల తీవ్రతను బట్టి విశాఖ సెవెన్ హిల్స్ కార్పోరేట్ హాస్పిటల్‌లో, కింగ్ జార్జి హాస్పిటల్‌లో వేశారు. గణపతిరెడ్డి అనే క్షతగాత్రునికి ప్రకటెముకలలో దెబ్బ తగిలింది. అయినా ఆ హాస్పిటల్ నుండి వెళ్ళిపొమ్మని ఒత్తిడి. మరో వ్యక్తి శరీరంలోకి దూసుకుపోయిన బుల్లెట్‌ను తీసివేస్తే అది డి.జి.పి. గారు చెప్పినట్టుగా రబ్బరు బుల్లెట్‌గా కాక నిజమైన బుల్లెట్ అని వైద్యులు చెప్పారని తెలిపారు. మందు మాకు వారు తెచ్చుకోవాల్సిందే. ఇకపోతే కార్పోరేటు హాస్పిటల్‌లో చేరినవారి పరిస్థితి మరింత దారుణం. అత్యంత ఆధునిక ఆధిపత్య వర్గాలు వుండవలసిన చోట గతిలేని, అట్టడుగువర్గం చేరటం, వారి యాజమాన్యానికి లాభాలరీత్యా అవసరమైనా, వారిని ఆదరించటం వారి సంస్కారంలో భాగం కాలేకపోయింది. యిక పోలీసులకు భయపడి కొంతమంది ప్రైవేటు హాస్పిటలుకు వెళితే మరికొంతమంది 5 ఫిబ్రవరిన కూడా కింగ్ జార్జి హాస్పిటల్‌కు వచ్చారు. గ్రామాల్లోని ఎంతోమంది ప్రజలు కనపడకుండా పోయారు. గ్రామస్థుల లెక్క ప్రకారం 315 మందిలో కేవలం 181 మంది ఆచూకి తెలిసింది. మిగతావారు గల్లంతే. వారికోసం సంబంధితులు తిరగని చోటంటూ లేదు. పెట్టని అర్జీలు లేవు. అలాగే చనిపోయిన వారి పోస్టుమార్టంను వీడియో రికార్డు చెయ్యమని కోరినపుడు హైకోర్టును ఆశ్రయించమని సలహా కూడా యిచ్చారు.
పై విషయాలన్నీ 07 మార్చి 2011న మానవ హక్కుల కమీషన్‌కు విన్నవించి తక్షణమే హాస్పిటల్ అధికారులు, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, ఆచూకి లేనివాని గురించి పోలీసులు కమీషన్‌కు తెలియచేయాలని, ఆ సంబంధిత శాఖల నుండి పోస్టుమార్టం రిపోర్టులు, తదితర రికార్డులు తెప్పించాలని కోరాం. కంటితుడుపు చర్యగా జిల్లా వైద్యాధికారిని ఆస్పత్రులు సందర్శించి రిపోర్టులు పంపమనటం జరిగింది. ఆ రోజు అంటే 07-03-11న కేసు వేసిన పిటిషనర్లు ఆ ఉదయం నుంచే కమీషన్ హాలులో వేచిచూస్తే సాయంకాలం 4 గంటల వరకు పోలీసు రిపోర్టులు మానవ హక్కుల కమీషన్‌కే అందలేదు. పోలీసుశాఖ వారికి కమీషన్ మీద అంతటి గౌరవ ప్రతిపత్తులు. వారి జవాబులో అన్ని వాస్తవాల్ని కప్పిపుచ్చే ధోరణులే.
కమీషన్‌కున్న పరిధులు, పనితీరు, అది ఆధారపడే అధికార యంత్రాంగం పనితీరు, వర్గ ప్రయోజనాలు యివన్నీ కూడా సామాన్య ప్రజల్ని కలవరపరుస్తున్న మాట వాస్తవం. సాధారణ కోర్టులలోని ప్రొసీజర్లు కమీషన్‌లోనూ చూడొచ్చు.
అసమానతల సమాజంలో ఒయాసిస్సులాంటి మానవహక్కులను చూపిస్తూ మభ్యపెట్టే ఉదంతాన్ని మనం కళ్ళారా చూస్తాం. ప్రతీది క్రిమినల్, సివిల్ అనే పరిధి పేరున కొట్టేస్తుంటే అన్నింటికి మూలమైన జీవించే హక్కును ఎవరు కాపాడుతారు. అలాగే కమీషన్ అధికారులు హైకోర్టు స్థాయితో సమానంగా ఉన్నప్పుడు మాత్రమే న్యాయం జరగటానికి అవకాశం వుంది. అందులో నియమితులైన (వారు ప్రభుత్వం చేత నియమించబడ్డా) న్యాయాధిపతులకు మానవ హక్కుల పట్ల విస్తృతమైన అవగాహనతో పాటు అవసరమైతే ప్రభుత్వ హక్కుల ఉల్లంఘన పట్ల కఠినచర్య తీసుకునే శక్తి, ధైర్యం ఉండాలి. సాధారణంగా పోలీసుల వలన హింసించబడినవారు, రక్షణలేనివారు, జీవించేహక్కును ప్రత్యక్షంగా పరోక్షంగా కోల్పోతున్నవారే మానవహక్కుల కమీషన్‌కు వస్తున్నారు. అయితే న్యాయం పక్షాన రిపోర్టులను యివ్వవలసిన శాఖల ప్రతివాదనలు/జవాబులు వింటే ప్రజల ప్రాథమిక హక్కులు కాపాడటం కంటే కూడా స్థానికంగా వున్న అధికార ఆధిపత్య వర్గాలకు వత్తాసు పలుకుతున్నట్టుంటుంది. పోలీసు రిపోర్టులు ఎంత కుట్రపూరితమైనవో, కోర్టులలో ప్రజలు దాఖలు పరచిన అఫిడవిట్లు చూస్తే తెలుస్తుంది. లాఠీలు, రబ్బరు తూటాలు, బాష్పవాయువులు, పొగబాంబులు, ఆఖరుకు అనేక రకాల తుపాకులు, అధికారం వున్న పోలీసుల కంటే ప్రజలే ప్రమాదకారులా…అన్నది ప్రతి ఒక్కరు ప్రశ్నించవలసిన అంశం. ప్రజల ప్రజాస్వామిక హక్కుల పట్ల బాధ్యతలేని రాష్ట్ర యంత్రాంగం కంపెనీ పట్ల ప్రాథమిక బాధ్యత వహిస్తుంది. రాష్ట్ర యంత్రాంగమే హక్కుల ఉల్లంఘనలకు పాల్పడినపుడు ఓయులో జరిగిన సంఘటనలకు కమీషన్ స్పందించి పరిశీలనా బృందాన్ని పంపినట్టు కాకరాపల్లి లాంటి సంఘటనల నేపథ్యంలో కూడా కమీషన్ వేసి విచారణ జరిపించాలి.
ప్రజలు తమ ప్రాథమిక హక్కులైన వనరుల సంరక్షణ, జీవించే హక్కు కోసం చేసే పోరాటానికి పాలకవర్గాలు స్పందించకపోతే ప్రజలు తమ బాటను తామే ఎంచుకుంటారు. అది తెలంగాణ పోరాటం కావచ్చు, కోస్తాంధ్ర అణువిద్యుత్, సెట్ వ్యతిరేక పోరాటాలే కావచ్చు. తమ హక్కులను తాము కాపాడుకునే ప్రాథమిక హక్కు ప్రజలకు వుంది. అది గుర్తించడం ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదు, నిబద్దతతో మెలగవలసిన ఆవశ్యకత మానవహక్కుల కమీషన్లకు, కోర్టులకు ఉంది. ప్రజాస్వామ్యం ముసుగులో జరుగుతున్న దోపిడిలో పాలకవర్గాలు, భాగస్వాములు అవుతూ చట్టాలు తమ పని తాము చేసుకుపోతాయని తాఖీదులు ఇస్తుంటే కోర్టులు, కమీషన్లు ప్రభుత్వ భావజాలంలో కొట్టుకుపోతే, వారికి కొమ్ముకాస్తూ నిమ్మకునీరెత్తినట్లుగా వుంటే ప్రజలు తమ పని తాము చేసుకుపోవటానికి వెనకాడరని చరిత్ర చెబుతున్న సత్యం!!!
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags